నారద మహా పురాణము
బదరికాశ్రమ మాహాత్యము
మోహిని పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! గంగాద్వార మాహాత్మ్యమును చెప్పితిరి. ఇక ఇపుడు పాపనాశకము అగు బదరీ మాహాత్మ్యమును తెలుపుము.
వసువు పలికెను: భద్రురాలా! ఇపుడు బదరీ మాహాత్మ్యమును చెప్పెదను వినుము ఈ మాహాత్మ్యమును వినినచో మానవుడు జన్మసంసార బంధమునుండి విముక్తుడగును. బదరి అను శ్రీహరి క్షేత్రము సర్వపాతక నాశనము. సంసార భీతులకు కలి దోషహరము. మోక్ష ప్రదము. ధర్ముని నుండి మూర్తియందు జన్మించిన నరనారాయణులు గంధ మాదనమునకు వెళ్ళిరి. ఇచటనే బహుగంధ ఫలాన్వితమగు బదరీ వృక్షముగల స్థానమున కల్పాది నుండి తపస్సు చేయుచుండిరి. ఇచట వీరు గ్రామవాసులగు నారదాది మునివరులచే, సిద్ధసంఘములచే పరివృతులై లోకస్థితి కొరకు తపమును చేయుచుండిరి. ఇచటనే సర్వసిద్ధి ప్రదమగు అగ్ని తీర్థము కలదు. మహాపాతకులు కూడా ఇచ్చట స్నానమాడి పాతకముల నుండి విముక్తులు అగుదురు. కలుషితమైన బంగారము, అగ్నిలో దహించబడిన బంగారము శుద్ధి పొందినట్లు అగ్ని తీర్థమున స్నానమాడిన నరుడు పాప విముక్తుడగును. వేల చాంద్రాయణ వ్రతములచే కోటికృచ్ఛ వ్రతములచే పొందబడు ఫలము అగ్ని తీర్థ స్నానము వలన లభించును. ఇచట అయిదు శిలలు కలవు. ఈ శిలల మధ్యలో అగ్ని తీర్థము కలదు. అగ్ని తీర్థ దర్శన మాత్రముననే సర్వ పాతకములు నశించును. నారద మహర్షి ఘోర తపమును ఆచరించిన శిల నారదీ శిల అనబడును. నారదీ శిలా సందర్శనముననే ముక్తిని ప్రసాదించును. ఇచటనే నారద కుండము కలదు. ఇచటనే స్నానమాడిన నరుడు పరిశుద్ధుడగును. భుక్తిని ముక్తిని శ్రీహరి భక్తిని సకలాభీష్టములను పొందును. ఈ కుండము నందు చేయబడు స్నానము దానము సురార్చనము హోమము, జపము, ఇతర పుణ్య కార్యములు అక్షయమగును. ఈ క్షేత్రముననే మరొయొకటి శుభావహమగు వైనతేయ శిలకలదు. ఇచటనే గరుడుడు మహాతప మును శ్రీహరి దర్శనము కొరకు ముప్పది వేల సంవత్సరములు చేసెను. అంతట ప్రసన్నుడగు శ్రీహరి దైత్య నాగులను అజేయునిగా, భయంకరునిగా వరమునిచ్చి తనకు వాహనముగా చేసుకొనెను. ఈశీలకూడా నా పేరుతోనే ప్రసిద్ధి పొందును. దర్శన మాత్రముననే నరులకు పుణ్య మును కలిగించును. ఇచట నా ప్రీతి కొరకు గంగాతీర్థము ఆవిర్భవించెను. స్నానము చేయువారికి పుణ్యము నిచ్చును. పంచగంగలో స్నానమాడి దేవాదులకు తర్పణముల నిచ్చిన వారు సనాతనమగు బ్రహ్మలోకము నుండి మరల తిరిగిరారు. ఇట్లు వరమునిచ్చి శ్రీహరి అంతర్ధానమును పొందెను. గరుడుడుకూడా శ్రీహరి ఆజ్ఞచే శ్రీహరి వాహనమాయెను. అప్పటి నుండి ఈ తీర్థము పాపనాశన మాయెను. స్మరణ మాత్రముననే పుణ్యప్రదము. వైనతేయగతి ప్రదము. ఇచటనే మరియొక శిలవారాహి అని కలదు. ఇచటనే శ్రీహరి గంగా జలమున స్నానమాడెను. భక్తితో ఈ శిలను పూజించినవారు దుర్గతిని పొందజాలరు.
ఇచటనే మరియొక శిల నారసింహశిల కలదు. ఇచటనే నరసింహస్వామి హిరణ్య కశ్యపుని సంహరించి నిలిచెను. దేవర్షులందరూ కలిసి స్వామి కోపమును నివారించిరి. ఈ విశాల శిలయందు ఉండుటకు ప్రార్ధించిరి. అప్పుడు అచట చతుర్భుజునిగా శిలారూపముగా నిలిచెను. నిత్యము జలక్రీడాపరుడై నీటి మధ్యలో ఉండును. ఇచట స్నానమాడి నారసింహశిలను భక్తిచే పూజించువాడు పునరావృత్తిరహితమగు శ్రీహరి లోకమును పొందును. ఇక ఇపుడు అయిదవదగు నరనారాయ ణాఖ్యమగు శిలను గూర్చి చెప్పెదను. కృతయుగమున ఈ శిలయందు నరనారాయణ రూపుడగు శ్రీహరి ప్రత్యక్షముగా ఉండెను. త్రేతాయుగమున మునులను దేవతలకు యోగులకు మాత్రము కనపడుచుండెను. యోగమును లోకస్థితి కొరకు వహించి ఇతరులకు కనబడెడివాడు కాడు. ద్వాపరయుగమున ఒక జ్ఞాన యోగమున మాత్రమే కనబడెడివాడు. కలియుగమున అదృశ్యుడా యెను. అపుడు బ్రహ్మాది దేవతలు ఋషులు శ్రీహరిని ప్రార్థించిరి. అపుడు అశరీరవాణి బ్రహ్మాదులతో సర్వధర్మ వివర్జితమగు కలియుగమున దృశ్యుడనుకాను. మీరు దర్శించ వలెనన్న కోరిక కలదేని నారద కుండమునగల మండపమున నున్న నా మూర్తిని స్వీకరించుడు. అతట బ్రహ్మాదులా మాటలనువిని సంతుష్ట మనస్కులై అటనుండి బయలుదేరి నారదకుండమున ఉన్న ఆ శిలను పూజించి స్థాపించిరి. తరువాత తమ తమ నివాసముల కరిగిరి. వైశాఖ మాసమున ఆ దేవతలు తమ గృహములకు వెళ్ళెదరు. కార్తికమున వచ్చి మరల అర్చింతురు. వైశాఖ మాసమునుండి మంచు తగ్గును కావున పవిత్రులగు మానవులు మూర్తి దర్శనమును పొందెదరు. పాప విముక్తులగుదురు. ఇట్లు ఇచట మూర్తిని ఆరు మాసములు దేవతలు పూజింతురు. ఆరు మాసములు మానవులు పూజింతురు. అప్పటి నుండి ఈ వ్యవస్థతో అచట నరనారాయణమూర్తి ఆవిర్భవించెను. ఇచట శ్రీమహావిష్ణు శిలా ప్రతిమను భక్తి భావముచే పూజించువారు, నైవేద్యమును భుజించువారు తప్పక ముక్తిని పొందెదరు. ఈ పవిత్రములగు అయిదు శిలలు విశాలయందు కలవు. ఈ శిలామధ్యమున శ్రీహరి నైవేద్యము దేవతలకు కూడా దుర్లభము. ఇక మనుషుల విషయము ఏమి చెప్పవలయును. భుజించినవారు మోక్షమును పొందెదరు. బదరియందు ఒక చిటికెడు విష్ణు నైవేద్యమును భుజించినచో అగ్ని బంగారమును శుద్ధి పరచునట్లు దేహగత పాపములను శుద్ధి పరచును. ఇచటనే కపాలమోచనమను తీర్థము సర్వపాప విశోధనము. ఇచటనే పాప విమోచనము లగు అయిదు శిలలు కలవు. ఇచటనే మరియొక మహాతీర్థము కలదు. ఇచట స్నానము చేసినవారు వేద పారంగతులు అగుదురు. నిదురించిన బ్రహ్మ వక్త్రమునుండి బయలువెడలిన వేదములను దేవ భయంకరుడగు హయగ్రీవుడు రాక్షసుడు అపహరించెను. అంతట బ్రహ్మ శ్రీహరిని ప్రార్థించెను. శ్రీహరి ప్రత్యక్షమై మత్స్యరూపముతో హయగ్రీవుని సంహరించి తిరిగి వేదములను అర్పించెను. ఇచట వెలసిన తీర్థము మహాపుణ్యము. సర్వ విద్యా ప్రకాశకము. ఇదియే తైమింగిలము అను తీర్థము. దర్శనమాత్రముననే పాపనాశనము. మరల ఒకసారి అవ్యయుడగు శ్రీహరి హయగ్రీవ రూపముతో మదించి వేదములను అపహరించిన మధుకైటభులను రాక్షసులను చంపి వేదములను బ్రహ్మ కర్పించెను. ఈ హయగ్రీవ తీర్థము స్నానమాత్రముననే సర్వపాపహరము, మాత్స్య తీర్థమున, హయగ్రీవ తీర్థమున వేదములు ద్రవరూపముగా ఉండును. కావున ఈ జలము పాపనాశకము.
ఇచటనే ఆగ్నేయ కోణమున ఇంద్ర పదమను తీర్థము సుప్రసిద్ధము. ఇచట స్నానమాడిన వాడు ఇంద్రలోకమును పొందును. ఇచటనే మనోహరమగు మానసోద్భేదకమను తీర్థముకలదు. హృదయ గ్రంధిని భేదించును. అకిల సంశయములను భేదించును. సకల పాపములను హరించును. అందువలననే ఇది మానసోద్భేదము. ఇచటనే మరియొకటి కామకామతీర్థము కలదు. కోరికలు కలవారికి కోరికలను తీర్చును. కోరికలు లేనివారికి మోక్షమును ప్రసాదించును. ఇచటికి పశ్చిమ మున వసుధారా తీర్థము కలదు. ఇచట భక్తితో స్నానమాడినవారు వాంఛిత ఫలమును పొందెదరు. ఇచట పుణ్యాత్ములు మాత్రమే జలమధ్య గతమును చూడగలుగుదురు. ఈ దర్శనముతో ప్రాణి మరల గర్భవాసదుఃఖమును పొందజాలరు. ఇటకు నైఋతి దిగ్భ్ర్భాగమున క్రింద అయిదు ధారలు పడుచుండును. ప్రభాస, పుష్కర, గయా నైమిశారణ్య సంజ్ఞలు కలవి, విడివిడిగా ఈ తీర్థములలో స్నానమాడినవారు ఆయా తీర్థముల ఫలములను పొందెదరు. తరువాత సోమకుండమని మరియొక పేరుకల విమల తీర్థము కలదు. ఇచట తీవ్రమగు తపమును ఆచరించి చంద్రుడు నక్షత్రాధిపతి అయ్యెను. ఇచట స్నానముచేసిన వారు దోషరహితులు అగుదురు. ఇచటనే మరియొకటి పాప హరమగు ద్వాదశాదిత్య తీర్థము కలదు. ఇచట స్నానమాడినవారు సూర్యసన్నిభ తేజస్కులు అగుదురు. ఇచటనేగల చతుస్స్రోత తీర్థమున స్నానమాడినవారు ధర్మార్థ కామ మోక్షములలో కోరిన వాటిని పొందగలరు. ఇచటనే యున్న సప్తపదమను మనోహర తీర్థమును దర్శించుటతోడనే మహాపాతక ములు కూడా నశించుననగా ఇక స్నానము చేసిన ఏమి చెప్పవలయును? ఇచటనే లోకత్రయ ప్రసిద్ధ మగు బ్రహ్మ విష్ణు మహేశ్వర కుండము కలదు. ఇచట మరణించిన వారు సత్యపదమును పొందెదరు. నర నారాయణ క్షేత్రమున ఊర్వశీకుండమను మరియొక తీర్థముకలదు. ఇచట స్నానమాడిన వారు రూపవంతులు అగుదురు. నారాయణ ప్రియులు విశ్వవశంకరులు అయ్యెదరు. ఇచటికి దక్షిణ దిగ్భాగమున అస్త్ర తీర్థము కలదు. ఇచటనే నర నారాయణులు శస్త్రములనుంచి తపస్సును చేయుచుండిరి. ఇచట దివ్యములగు శంఖ చక్ర గదాధ్యాయుధములు ఆకారమును ధరించి పుణ్యాత్ములకు కనపడును. ఇచట స్నానమాడిన వారికి శత్రుభయము కలుగదు. మేరు తీర్థముకలదు. ఇచట స్నానమాడి ధనుర్థరుని చూచి సకలా భీష్టములను పొందును. ఇచటనే లోకపాల తీర్థము కలదు. ఇచటనే లోకపాలకులు తపము ఆచరించిరి. ఇచట స్నానమాడినవారు సర్వతీర్థ స్నాన ఫలమును పొందెదరు. ఇచట శ్రీహరి దండముతో కొట్టి తీర్థమును నిర్మించెను. కావున దండ పుష్కరిణియని పేరుపొంది లోకపాలులకు ఆనందమును ఇచ్చును. అలకనందతో భాగీరధి సంగమ మును పొందినది. బదరిక ఆశ్రమమున ఈ తీర్థము సర్వతీర్థ శ్రేష్ఠము. ఇచట స్నానమాడి పితరులను దేవతలను ఋషులను చక్కగా పూజించి తర్పణములిడి సర్వదేవ నమస్కృతుడై విష్ణు లోకమును పొందును. ఈ సంగమమునకు దక్షిణ భాగమున ధర్మక్షేత్రము కలదు. ఈ తీర్థము పరమపావనము సర్వతీర్ణోత్తమోత్తమము. ఇచట స్నానమాడినవాడు సాధ్య సన్నిధిని చేరును. ఇచటనే సర్వ పాపహర మగు ఉర్వశీ సంగమ తీర్థము కలదు. హరి భక్తిని చక్కగా కలిగించు కర్మోద్దర తీర్థము కూడా కలదు. బ్రహ్మలోకమును పొందించు బ్రహ్మావర్ధ తీర్ధము కలదు. ఈ తీర్థములన్నియు గంగను ఆశ్రయించిన తీర్థములు. ఇచటనున్న అన్ని తీర్థములను బ్రహ్మకూడా చెప్పజాలడు. ఈ బదరికాశ్రమ మాహాత్మ్యమును వినినవారు వినిపించినవారు సర్వపాప వినిర్ముక్తులై విష్ణులోకమును చేరెదరు. ఇచట వ్రతమును స్వీకరించి ఒక మాసము నివసించినవాడు ప్రత్యక్షముగా నరనారాయణ రూపుడగు హరిని చూడగలుగును. ఈ బదరీ మాహాత్మ్యమును వ్రాసినవారికి అకాల మృత్యువు కలుగదు. ఆధివ్యాధి సర్పభయములు కలుగవు. శ్రీహరి అనుగ్రహము వలన సకల శుభములు సమకూరును. సకల సంపదలు వృద్ధి చెందును. (II/67)