నారద మహా పురాణము
జగదుత్పత్తి వర్ణనము
శ్రీ నారదమహర్షి పలికెను: “ఓ బ్రాహ్మణోత్తమా! స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తు ఎవరి వలన సృష్టించబడినది. ప్రళకాలయమున ఎవరిలో లీనమగును. దానినంతటిని నాకు తెలుపుము. సాగరాకాశ శైలమేఘ భూమ్యగ్ని వాయువులతో కూడిన ఈ లోకమును ఎవరు నిర్మించిరి? భూతములను, వర్ణవిభాగమును ఆచార అనాచారములను ధర్మాధర్మ విధానములను ఎట్లు సృజించిరి. జీవించు వారిలో జీవుడు ఎట్టివాడు? మరణించినవారు ఎచటికి వెళ్ళెదరు? ఇహలోకము నుండి పర లోకము వరకు అంతటిని నాకు చెప్పుము”
సనందన మహర్షి పలికెను: “ఓ నారదమహర్షి! పూర్వము తనను ప్రశ్నించిన భరద్వాజమహర్షికి, భృగుమహర్షి చెప్పిన పురాతన శాస్త్రమును ఇతిహాసమును చెప్పెదను వినుము” కైలాస శిఖరమున గొప్ప తేజస్సుచే ప్రకాశించుచు కూర్చొనియున్న భృగుమహర్షిని సమీపించి భరద్వాజ మహర్షి ఇట్లు ప్రశ్నించెను.
భరద్వాజ మహర్షి పలికెను: “ఓ మహర్షీ! జీవుడెప్పుడూ నానాయోనులందు ఎట్లు తిరుగుచుండును? జీవునికి సంసారము నుండి ఎట్లు ముక్తి లభించును? శ్రీమన్నారాయణుడే బ్రహ్మరూపముచే సృష్టించును. ఆ బ్రహ్మ, నారాయణుడు సేవకసేవ్య రూపముతో ఏల ఉందురు? ప్రళయకాలమున చరాచరములన్నియు ఎవనిలో లీనమగును? లోకనాథుడగు ఆ ప్రభువు నిర్గుణుడు నిరంజనుడు అనిర్దేశ్యుడు అప్రతర్కుడని ఎట్లు ఎవరిచే తెలియబడును? పరమాత్మ కాలశక్తి, దురన్వయుడు అతర్క్యచరితుడగు పరబ్రహ్మను వేదములెట్లు ఆదరముతో స్తుతించును? జీవుడు జీవత్వమును లంఘించి ఎట్లు బ్రహ్మత్వమును పొందును? ఈ విషయమును తెలియగోరుచున్నాను. ఓ కృపానిధీ! నాకు తెలుపుము” అని ఇట్లు భరద్వాజ మహర్షి అడుగగా బ్రహ్మ సంకాశుడగు భృగు మహర్షి దానిని అంతటిని చెప్పెను.
భృగుమహర్షి పలికెను: పూర్వము మహర్షులచే మానసుడు అని చెప్పబడిన వాడు ఆద్యంతములు లేనివాడు. అతని నుండి అజరామరము, శాశ్వతము అక్షయము అవ్యయము అగు అవ్యక్తము ప్రభవించెను. అవ్యక్తము నుండియే సర్వభూతములు పుట్టుచున్నవి, మరణించుచున్నవి. అవ్యక్తము మొదట మహత్తత్వమును సృజించెను. ఈ మహత్తత్త్వమునకే సర్వ భూతధరుడు ప్రభువగు ఆకాశమనుపేరు. ఆకాశమునుండి జలము, జలము నుండి అగ్ని వాయువులు పుట్టెను. అగ్ని వాయువుల సంయోగమువలన భూమి పుట్టెను. అంతట పరబ్రహ్మ తేజోమయమగు పద్మమును సృష్టించెను. ఆ పద్మమునుండి వేద స్వరూపుడు విధి అను బ్రహ్మ పుట్టెను. అతనికే సర్వభూతాత్మ, భూతములనుచేయు అహంకారము అని ప్రసిద్ధి. ఆ మహాతేజస్కునకే బ్రహ్మ అని పేరు. పంచభూతములు పంచధాతువులు, పర్వతములు అస్థిసంఘములు, భూమి మేదో మాంసములు, సముద్రములు రుధిరము. ఆకాశము ఉదరము, వాయువు నిశ్శ్వాసము. తేజోమయమగు అగ్ని క్రింది శిరస్సు, అగ్నీష్టోములు, చంద్ర సూర్యులు. బ్రహ్మకు నేత్రములు. ఆకాశము ఊర్ధ్వశిరము, క్షితి పాదములు, దిక్కులు భూజములు. ఆ బ్రహ్మ సిద్ధులచే తెలియ శక్యము కానివాడు, చింతించ శక్యమైనవాడు కాడు. ఆ బ్రహ్మయే భగవంతుడగు విష్ణువు అనంతుడని ప్రసిద్ధుడు. సర్వ భూతాం తర్యామి అజ్ఞానులకు తెలియరానివాడు అహంకారమును సృజించినవాడే సర్వప్రాణులను సృజించెను. ఆ విష్ణువునుండే ఈ విశ్వమంతయు పుట్టినది. ఇట్లు నీవడిగిన దానిని చెప్పితిని.
భరద్వాజ మహర్షి పలికెను: ఆకాశమునకు, దిక్కులకు, భూమికి, వాయువునకు ఏయే పరిణామము లేర్పడినవో నాకు తెలుపుము.
భృగుమహర్షి పలికెను: సిద్ధదైవతములచే సేవించబడు ఈ ఆకాశము అనంతము, సుందరము, నానాఆశ్రయము. దీని అంతము తెలియ శక్యము కానిది. ఆకాశము యొక్క ఊర్ధ్వ పరిమాణమును క్రిందుగా ఉన్న సూర్యచంద్రులు చూడజాలరు. సూర్యాగ్ని సమతేజస్కులు స్వయంప్రకాశులగు దేవతలు కూడా ప్రసిద్ధమైన కాంతిగల ఆకాశాంతమును చూడజాలరు. ఆకాశము దుర్గమము అనంతమగుటయే దీనికి కారణము. పైపై భాగములు కూడా స్వయంప్రకాశములగు తేజో రాశులచే ఈ ఆకాశము నిరుద్దమై యున్నది. కావుననే దేవతలు కూడా దీనిని కొలువజాలరు. పృథివి చివర సముద్రము, సముద్రముల చివర తమస్సు, తమస్సు చివర జలము, జలము చివర అగ్ని యుండును. రసాతలము చివర జలము. జలము చివర పన్నగాధిపులు, వారి తరువాత మరల ఆకాశము, ఆకాశము చివర మరల జలము. ఇట్లు భగవంతునికి జలమునకు అగ్ని మారుతములకు అంతమును దేవతలు. కూడా తెలియజాలరు. అగ్నిమారుత జలముల భూమియొక్క వర్ణములు ఆకాశ సదృశములుగా కనపడును. కాని తత్త్వదర్శనము వలన భేదము కనపడును. వివిధ శాస్త్రములలో మునులు దర్శించిన విధముగా త్రైలోక్యములలో సాగరమునందు విధించబడిన ప్రమాణము అదృశ్యము అగమ్యము. కావున ఆ ప్రమాణమును ఎవ్వరు చెప్పలేరు? సిద్ధుల, దేవతల పరిమాణ మును నిర్ణయించు ఆకాశము అగణ్యము, అంతము లేనిది కావున అనంతమని ప్రసిద్ధిచెందినది. ఈ నామధేయము మానవుని స్వరూపమునకు అనురూపము. అనంతము యొక్క దివ్య రూపము పెరుగుచుండును, తరుగుచుండును. అనంతుని వంటివాడు మరొకడున్నపుడు మాత్రమే అనంత స్వరూపము తెలియనగును. అంతట పద్మము నుండి సర్వజ్ఞుడు మూర్తిమంతుడగు ప్రభువు సృజించ బడెను. ఇతడే ధర్మస్వరూపుడగు మొదటి ప్రజాపతి అగు బ్రహ్మ. ఇతనికి సాటి మరియొకడు లేడు”.
భరద్వాజ మహర్షి పలికెను: “మొదట పుష్కరము పుట్టినది కావున పుష్కరమే జేష్టము కావలయును. కాని తాము బ్రహ్మ పూర్వజుడని చెప్పితిరి. కావున నాకు మరల సందేహమే కలుగుచున్నది.
భృగుమహర్షి పలికెను: మానవుని స్వరూపమే బ్రహ్మత్వమును పొందినది. ఆ బ్రహ్మకు ఆసనము కొఱకు ఏర్పరచిన పృథివియే పద్మమనబడుచున్నది. పద్మము మధ్యనున్న నాళమే అకాశము వైపు పెరిగిన మేరుపర్వతము. ఆ మేరు మధ్యనుండి ఈ బ్రహ్మ జగత్తును సృష్టించును.
భరద్వాజ మహర్షి పలికెను: “మేరు మధ్యన ఉన్న బ్రహ్మ మేరువునకు వెలుపల పలు విధములగు ప్రజాసృష్టి నెట్లు చేసెను?”
భృగుమహర్షి పలికెను: మానసబ్రహ్మ మనసుచే ప్రజాసర్గమును చేసెను. ప్రాణుల రక్షణ కొఱకు మొదట జలమును సృజించెను. అన్ని ప్రాణులకు ప్రాణ భూతములు, ప్రాణులను పెంచునది. జలమే. జలము లేనిచో ప్రాణులన్నియూ నశించును. ఈ ప్రపంచ మంతయూ జలముచే ఆవరిం చబడి ఉన్నది. పృథివి, పర్వతములు, మేఘములు, మూర్తి మంతములగు పదార్థములు అన్నియూ వారుణములే, జలస్తంభనచే ఏర్పడినవి.
భరద్వాజ మహర్షి పలికెను: జలము అగ్ని మారుతములు పృథివి ఎట్లు సృష్టించబడినవి?
భృగుమహర్షి పలికెను: పూర్వ కాలమున బ్రహ్మకల్పమున బ్రహ్మర్షుల సమాగమము వారికి లోకముల సృష్టి ఎట్లు జరిగెను అనెడు సందేహము కలిగెను. బ్రహ్మర్షులందరు నిశ్చలులై మౌనముగా ధ్యానమును అవలంబించిరి. ఆహారమును స్వీకరించక పట్టుదలతో దివ్యములగు నూరు సంవత్సర ములు నిలిచిరి. అప్పుడు వారికందరికి బ్రాహ్మీవాక్కు చెవులపడెను. ఆకాశము నుండి సరస్వతీదేవి అవిర్భవించెను. నిశ్చలము అనంతమయమైన ఆకాశము మొదట ఉండెను. సూర్యచంద్ర వాయ్వాది శూన్యమై నిద్రించిన దానివలె ఉండెను. తమస్సున ఉత్కృష్టమైన తమస్సువలె, ఆకాశము నుండి జలము పుట్టెను. సలిల పీడనము వలన వాయువు కలిగెను. ఛిద్ర రహితమైన భవనము నిశ్శబ్దముగా ఉండును. అదే భవనము నీటితో నిండునపుడు వాయువు శబ్దమును కలిగించును. అట్లే సలిల సంరోధము వలన నిరంతరమైన ఆకాశము నుండి చివర నున్న సముద్రములను భేదించుకొని ధ్వనించు వాయువు సముత్పన్నము అగును. సముద్ర సంఘర్షణ వలన కలిగిన వాయువు అన్నిటిలో సంచరించును. కాని ఆకాశ స్థానమును పొంది శాంతించదు. ఆ వాయువు జలసంఘర్షము వలన ఉజ్జ్వలమైన ప్రకాశముకల మహాబలమగు ఊర్ధ్వశిఖలుగల అగ్ని ఉత్పన్న మాయెను. అగ్నిచే తిమిరము నశించును. వాయువులో కలిసిన అగ్ని ఆకాశము నుండి జలమును ఆవిర్భవింపచేయును. ఆ జలము అగ్ని వాయు సంపర్కమువలన ఘనత్వమును పొందును. ఆ ఘనపదార్థాము ఆకాశము నుండి పతనమై అంతరాళముగ స్నేహము వలన నిలుచును. ఆ ఘనీభూత పదార్థము సంఘాత రూపమునుపొంది భూమిత్వమును పొందును. సర్వగంధములకు సర్వరసములకు స్నేహ ములకు ప్రాణులకు ముఖ్యకారణము ఈ భూమియే అని తెలియును. భూమినుండియే అన్నియూ పుట్టును.”
భరద్వాజ మహర్షి పలికెను: “మానసుడు పంచ ధాతువులను సృజించెను. ఈ పంచధాతువులకే మహాభూతములను నామ మేర్పడెను. తరువాత లోకములను అవరించెను. మహామతియైన మానస బ్రహ్మవేల భూతములను సృజించెను కదా! సృజించిన తరువాత వాటియందు భూతత్వమెట్లు సంభవించును?
భృగుమహర్షి పలికెను: అమితములు మహా ఇష్టములగు భూతములు సంభవించును. కావుననే వాటికి మహా భూతశబ్దముచే వ్యవహారము కలిగినది. చేష్ట వాయువు, శబ్దము ఆకాశము, వేడి అగ్ని, ద్రవము సలిలము, సంఘాత రూపము పృథివి. కావున ఈ శరీరము పాంచభౌతికము. కావుననే స్థావరజంగమాత్మకమగు ఈ విశ్వమంతయు పంచ భూతములతో కూడినదే. శ్రోత్రము, ఘ్రాణము, రసము, స్పర్శము, దృష్టి అను అయిదు ఇంద్రియములనబడును.
భరద్వాజ మహర్షి పలికెను: స్థావరజంగమములన్నియూ పాంచభౌతికములని చెప్పుచున్నారు కదా! కాని స్థావరముల శరీరమున పంచ ధాతువులు కనపడుట లేదు కదా! ఊష్మ రహితములకు, చేష్టారహితములకు, ఘన పదార్థములకు వాస్తవముగా వృక్షముల శరీరమున పంచధాతువులు కనపడుటలేదు కదా! వృక్షములు వినలేవు, చూడలేవు, గంధమును, రసమును తెలియజాలవు. స్పర్శను కూడా తెలియవు. కావున వృక్షములు పాంచ భౌతికములెట్లగును? వృక్షములు ద్రవములు కావు, అగ్నిమయములు కావు, భూమికావు, వాయు రూపములు కావు. అప్రమేయాకాశ రూపములు కావు. కావున వృక్షములకు పాంచ భౌతికత్వము లేదు.
భృగు మహర్షి పలికెను: “ఘన స్వరూపములైన వృక్షములలో కూడా ఆకాశమున్నది. సంశయము లేదు. వృక్షములకు పూవులు పూయుట, పండ్లుకాయుట నిత్యము కనపడుచునే ఉన్నది. వేడివల్లనే ఆకులు, చర్మ, పండు, పూవు వాడిపోవును వాడుచున్నది రాలుచున్నది కావున వృక్షములకు స్పర్శ ఉన్నది. వాయువుచే అగ్నిచే, పిడుగుచే ఏర్పడిన ధ్వనులే పండ్లు పూవులు రాలిపడుచున్నవి. ధ్వనిని శ్రోత్రములచే మాత్రమే గ్రహించవలయును. ధ్వనిచే రాలుచున్నవి కావున చెట్లు శబ్దమును వినుచున్నవి. తీగలు చెట్టును చుట్టుకొని అంతటా పాకును, ముందుకు సాగవలయునన్న దృష్టి కూడా కావలయును కదా. తీగలు పాకుచున్నవి కావున చెట్లు చూచుచున్నవి. పవిత్రములైన, అపవిత్రములైన గంధములచే, ధూపములచే వృక్షములు రోగరహితములుగా, పుష్పితములుగా మనగలుగుచున్నవి కావున వృక్షములు వాసన చూచుచున్నవి. సుఖమును దుఃఖమును వాడుటచేతను, విప్పారుటచేతను అనుభవించుచున్నవి. నరికిన మరల చిగుర్చుచున్నవి. కావున వృక్షములకు ప్రాణమున్నది. అచైతన్యము లేదు. ప్రాణమున్నది కావున జలమును గ్రహించుచున్నది, గ్రహించిన జలమును జీర్ణించుకొనుచున్నది. జీర్ణమగుచున్నది కావున వాయువును గ్రహించుచున్నది, తీసుకొనిన ఆహారమును జీర్ణము చేసుకొనుచున్నది. కావుననే ఆహారము మారినపుడు తరుగుట పెరుగుట సంభవించుచున్నది. అన్ని జంగమములు శరీరములలో ప్రత్యేకించి పంచధాతువులు భిన్నములుగా ఉండును. పంచధాతువులచే శరీరము చేష్టలను కలిగియుండును. చర్మము, మాంసము, అస్థులు, మజ్జ (కొవ్వు) స్నాయువు అను అయిదింటి సమూహము పృథివీమయమగు శరీరమున ఉండును. తేజస్సు, అగ్ని, క్రోధము, నేత్రములు, ఊష్మము అను అయిదింటిని శరీరమున అగ్ని కలిగించును. శ్రోత్రము, ఘ్రాణము, ఆస్యము, హృదయము, కోష్ఠము అను అయిదు ధాతువులు ఆకాశము వలన శరీరమున సంభవించును. శ్లేష్మము, పిత్తము, స్వేదము, వసా, రక్తము అని జలము అయిదు విధములుగా శరీరమున ఉండును. ప్రాణి ప్రాణముచే తృప్తి పొందును. వ్యాసముచే తృప్తిని బయలుపరుచును. అపానము అథోదేశమునుండి వెడలును. సమానము హృదయమున ఉండును. ఉదానముతో గాలి పీల్చుకొనును. ఇట్లు అయిదు వాయువులు శరీరమున వ్యాపించి ఉండును. దేహి భూమి నుండి గంధగుణములను, జలమును రసములను గ్రహించును. ఇపుడు గంధ గుణములను విస్తరముగా చెప్పెదను వినుము. ఇష్టము, అనిష్టము, మధురము, కటువు, నిర్ధారి, సంహతము, స్నిగ్ధము, రూక్షము, విశదము అని పార్థివ గంధములు తొమ్మిది విధములు. నేత్రములచే వెలుగును చూచును, వాయువుచే స్పర్శను తెలియును. శబ్ద స్పర్శ రూప రసములు గుణములు అనబడును. ఇక ఇపుడు రస జ్ఞానమును చెప్పుచున్నాను వినుము. జ్ఞానులగు ఋషులు బహువిధ రసములను చెప్పియున్నారు. మధురము, లవణము, కారము, వగరు, పులుపు, ఎఱుపు, నీలము, పసుపుపచ్చ, అరుణము, కఠినము, ముదురు, లేత, నునుపు, మెత్తన, భయమును కలిగించునది అని జ్యోతియొక్క రూపగుణములు పదునారు విధములు. ఆకాశమునకు ఒకటే గుణము. అదియే శబ్దము. ఇప్పుడు శబ్దములయొక్క వివిధ స్వరూపములను విస్తరముగా చెప్పెదను, షడ్జ, ఋషథ, గాంధార, మధ్యమ, దైవత, పంచమ నిషాదములని ఏడు విధములగు శబ్ధగుణములు ఆకాశ సంభవములు. ఈశ్వర రూపముగా అంతట శబ్దము ఉన్నను, పటహ, మృదంగ, భేరి, శంఖ, మేఘ రథాదులయందు కలుగు ధ్వని ఆకాశసంభవమే, వాయుగుణము స్పర్శ. స్పర్శ పలువిధములుగా ఉండును. ఉష్ణ, శీత, సుఖ, దుఃఖ, స్నిగ్ధ, విశద, కఠిన, మృదు, శక్ష, లఘు, గురువులు అనునవి శబ్దస్పర్శములు రెండింతలు వాయుస్పర్శలు. ఇట్లు వాయుగుణమగు స్పర్శ పదకొండు విధములు. ఈ వాయుగుణములతో కలిసిన శబ్దము ఆకాశమువలన జనించును. సంఘర్షము వలన, సంఘర్షము లేక కూడా కలుగుట శబ్దముయొక్క విషమగతి. ఇట్లు పంచ ధాతువులచే ధాతువులు వృద్ధి చెందించబడును. శరీరధారులయందు నీరు నిప్పు గాలి ఎప్పుడూ జాగరూకతతో ఉండును, శరీరమునకు ఇవియే మూలములు. ప్రాణములను వ్యాపించి యుండును. పార్థివధాతువును పొందుటచే బలముగలవాడై చేష్టలు చేయును, శిరోస్థానమున ఉన్న అగ్ని శరీరమును పరిపాలించుచుండును. ప్రాణము శిరమున కాని అగ్నిలోకాని నివసించుచు తిరుగుచుండును. ఆ ప్రాణమే ఆత్మరూపముగా సనాతన పురుషునిగా ఉండును. మనస్సు బుద్ధి అహంకారము భూతములు విషయములు అన్నియూ అతనే. ఇట్లు శరీరం అంతట ప్రాణములచే పరిపాలించ బడుచుండును. ఉపస్థమూలమును, గుదమున ఉన్న అగ్నిని ఆశ్రయించు అపానము మూత్ర పురీషములను గ్రహించును, విసర్జించును. ప్రయత్నమునందు, కర్మలయందు, నియమములందు మూడింటియందు ఒకటిగా ఉండునది ఉదానమనబడును. మనుష్య శరీరములలోని అన్ని సంధు లలో ఉండు దానిని వ్యానమందురు. బాహువులలో విస్తరించియున్న అగ్ని సమాన వాయువుచే ప్రేరేపించబడి రస అన్నాది దోషములను నివారించుచుండును. అపాన ప్రాణముల మధ్యమున, ప్రాణాపానములచే చక్కగా కలిసి అధిష్ఠానమును చక్కగా పాకము చేయును. ఆస్యము నుండి పాయువు వరకూ చివరి గుదము వరకు వ్యాపించియున్న అగ్ని వాయువుల సంయోగమువలన రేతస్సు జనించును. దాని నుండి దేహి ద్వారములు ఏర్పడును. ప్రాణముల సన్నిపాతముచే సన్ని పాత వ్యాధి ఏర్పడును. ఊష్మమే అగ్ని. ఈ అగ్నియే అన్నమును జీర్ణము చేయును. అగ్నివేగముతో తిరుగుచున్న ప్రాణము గుదాంతమున త్రిప్పిపంపబడును. అట్లు ఊర్ధ్వభాగమునకు వచ్చి అగ్నిని ప్రజ్జ్వలింపచేయును. నాభికి క్రింది భాగమున పక్వాశయముండును. నాభికి పైభాగమున ఆమాశయ ముండును. శరీరము యొక్క ప్రాణములన్నియు నాభిమూలమున నిలిచియుండును. హృదయము నుండి పైకి, క్రిందికి అడ్డముగా ప్రసరించియున్న నాడులు అన్నరసములను దశ ప్రాణముల బల ముచే వహించుచుండును. ఈ నాడీ మార్గముననే యోగులు పరమపదమును చేరెదరు. వీరు శ్రమను బాధను జయించి సమవర్తులై ధీరులై శిరోభాగమున ప్రాణములను నిలిపి పరమధామమును చేరెదరు. ఇట్లు అన్నిప్రాణులలో నియమముగా ఉండు అగ్ని ప్రాణ అపానాదులలో స్థాలిలో ఉంచిన పదార్థమువలె చక్కగా నిలిచి ప్రవహించుచు పెరుగుచు దేహిని చేద్దామయుని చేయును. (2/42)