నారద మహా పురాణము
బృహదుపాఖ్యానము
సూతమహర్షి పలికెను: పంచశిఖమహర్షి జనకమహారాజునకు చెప్పిన అధ్యాత్మజ్ఞానమును వినిన నారదమహర్షి ఉదారబుద్ధితో ప్రీతితో మరల ఇట్లు పలికెను.
నారదమహర్షి పలికెను: ఓ దయానిధీ! నిన్నాశ్రయించిన నాకు ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతికమను తాపత్రయమును అనుభవించని మార్గమును బోధించుము.
సనందన మహర్షి పలికెను: ఓ పండితా! ఆధ్యాత్మికాది త్రివిధ దుఃఖములు గర్భవాసము, పుట్టుక, జరాదులతో కలుగును. ఈ త్రివిధ దుఃఖములను తొలగించుకొనుటకు, అతిశయము, ఆహ్లాదము, సుఖభావము మొదలగు వాటిని అధిగమించిన అత్యంతికమైన భగవత్ప్రప్తి ఒక్కటే సరియైన ఔషధము. కావున పండితులైన మానవులు ఆ భగవత్ప్రప్తికి ప్రయత్నించవలయును. భగవత్ప్రప్తికి జ్ఞానము, కర్మ అనునవి కారణములు. శాస్త్రముల వలన వివేకము జ్ఞానము కలుగును. శబ్దబ్రహ్మశాస్త్ర స్వరూపుడు. పరబ్రహ్మ వివేకము వలన తెలియును. ఈ విషయమున మనువు కూడా వేదార్ధమును స్మరించి ఈ విషయమునే చెప్పెను. ఆ విషయమునే సులభముగా బోధ పడునట్లు చెప్పెదను వినుము. శబ్ద బ్రహ్మ, పరబ్రహ్మ అని బ్రహ్మ రెండు విధములని తెలియుము. శబ్దబ్రహ్మను చక్కగా తెలిసినవాడు పరబ్రహ్మను తెలియగలడు. ఆధర్వణశ్రుతి కూడా రెండు విద్యలను తెలియవలయునని చెప్పినది. ఋగ్వేదాది స్వరూపమైన అక్షరప్రాప్తి ఉత్తమమైనది. అవ్యక్తము, అజరము, కోరికలులేనిది, పుట్టుకలు లేనిది, తరగనిది, నిర్దేశించరానిది, రూపరహితము, పాణిపాదాది సంయుతము, విభువు, సర్వగతము, నిత్యము, సర్వ భూతకారణము, అకారణము, వ్యావ్యము, వ్యాప్తము, సర్వకారణము అయిన పరబ్రహ్మను జ్ఞానులు చూడగలరు. అదియే పరబ్రహ్మ, పరంధామము, మోక్షమును కోరు వారిచే ధ్యానించతగినది, శ్రుతివాక్యములచే చెప్పబడినది, సూక్ష్మము, విష్ణువు యొక్క పరమపదము. అదియే భగవచ్ఛబ్ద వాచ్యము. అదియే పరమాత్మ స్వరూపము. పరమాత్మను చెప్పునది భగవత్ శబ్దము. అక్షయాత్మ అగు పరబ్రహ్మను ఉద్దేశించి చెప్పినది భగవచ్ఛబ్దము. ఇట్లు చెప్పిన అర్థముచే పరబ్రహ్మతత్త్వము స్వరూపముచక్కగా తెలియును. ఈ జ్ఞానమే వేదస్వరూపమగు పరబ్రహ్మస్వ రూపమును చేర్చును. ఓ బ్రహ్మణోత్తమా! శబ్దగోచరుడు కాని పరబ్రహ్మ గౌరవార్ధములో భగవచ్ఛబ్దము ఉపవాచముగా చెప్పబడినది. భగవచ్ఛబ్దము శుద్ధుడు, మహావిభూతి అనబడు వాడు, సర్వకారణ కారణుడు అగు పరబ్రహ్మయందు ఉండును. ‘భగ’ అను పదములోని ‘భ’ కారమునకు జ్ఞేయము, జ్ఞాత అను రెండర్థములు. శాస్త్రకారణత్వము స్రష్టృత్వము ‘గ’ కారమునకు అర్థము. సమగ్రమైన ఐశ్వర్యమునకు, వీర్యమునకు, కీర్తికి, శ్రీకి, జ్ఞానమునకు వైరాగ్యమునకు ఈ అరింటికి భగము అను పేరు. భూతాత్మ అఖిలాత్మయగు పరబ్రహ్మ యందు అన్ని ప్రాణులు నివసించును. సమస్త భూతములయందు పరబ్రహ్మ ఉండును అని ‘వ’కారము చెప్పుచున్నది. ఇట్లు భగవాన్ అనునది మహాశబ్దము. ఈ శబ్దము మాత్రమే పరబ్రహ్మయగు వాసుదేవునకు వాచకము. ఇతరమునకు కాదు. ఇతరమును చెప్పజాలదు. భగవాన్ అను శబ్దమునకు పూజ్యార్థము చెప్పుటకూడా పరబ్రహ్మకు స్వరూపకథనమే కాని ఔపచారికముకాదు. పరబ్రహ్మకంటే భిన్నమైన వాటియందు మాత్రమే ఉపచారముగా చెప్పబడుచున్నది. ఉత్పత్తిని, ప్రళయమును, ప్రాణుల ఆగమనమును, గమనమును, విద్యను, అవిద్యను తెలియువాడు భగవానుడు. భగవచ్ఛబ్దవాచ్యుడు. హేయగుణములు లేక జ్ఞాన శక్తిబలైశ్వర్యవీర్య తేజస్సులు అను ఆరుగుణములు కలవాడు భగవచ్ఛబ్దవాచ్యుడు. ఆ పరమాత్మ యందు అన్ని ప్రాణులు వసించును. అన్ని ప్రాణులలో పరమాత్మ యుండుటచే వాసుదేవుడు అనబడుచున్నాడు. ఖాండిక్యుడగు జనకుడు అడుగగా కేశిధ్వజుడు ఈ విషయమునే చెప్పెను. అనంతుడగు వాసుదేవనామమునకు తత్త్వమును తెలుపు వ్యాఖ్యానమును బోధించెను. అన్ని ప్రాణు లలో ఉండును, అన్ని ప్రాణులు అతనిలో ఉండును. జగత్తునకు ధాత, (ధరించువాడు) విధాత జగత్తు నందు తానుండును. కావుననే వాసుదేవుడు అనబడును అని. ఆ పరమాత్మ సర్వభూత “ప్రకృతిని, వికారమును, గుణాదులను, దోషములను అధిగమించిన వాడు. అన్ని ఆవరణమలను అధిగమించిన వాడు అఖిలాత్మ, భువనాంతరాళమున అంతటిని వ్యాపించి ఉన్నవాడు, సమకళ్యాణ గుణగణములు కలవాడు, దుఃఖము లేనివాడు, ప్రాణి సృష్టి చేయువాడు, సంకల్పముచే కోరిన దేహమును స్వీకరించువాడు, జగద్దితమును సాధించువాడు. తేజోబలైశ్వర విశేష జ్ఞానము కలవాడు, వీర్యశక్త్యాది గుణములకు మూలస్థానము, పరములన్నిటికంటే పరుడు, పరులకు అపరులకు ఈశుడు, ఏ క్లేశములు లేనివాడు, అతనే ఈశ్వరుడు వ్యష్టిరూపుడు, సమష్టిరూపుడు, అవ్యక్తరూపుడు, ప్రకట స్వరూపుడు, సర్వేశ్వరుడు, సర్వసృష్టి తెలియువాడు, సర్వశక్తి కలవాడు, పరమేశ్వరుడు దోషములను తొలగించువాడు, శుద్ధుడు, నిర్మలుడు, పరుడు అగు పరమాత్మను తెలుపునది, చూపునదే జ్ఞానము. ఇతరము అజ్ఞానము. స్వాధ్యాయనంయమములచే పురుషోతముడు తెలియ బడును. పరబ్రహ్మను పొందించునది వేదమే. స్వాధ్యాయముచే యోగమును అభ్యసించవలయును. యోగముచే స్వాధ్యాయమును మననము చేయవలయును. స్వాధ్యాయ యోగములచే పరమాత్మ తెలియును. పరమాత్మను చూచుటకు స్వాధ్యాయము యోగము అనునవి రెండు కన్నులు. పర బ్రహ్మను చర్మచక్షువులచే చూడజాలము.”
నారదమహర్షి పలికెను: “పూజ్యుడా! నేనా యోగుమును తెలియగోరుచున్నాను. నాకా యోగమును చెప్పుము. యోగము తెలిసినచో అఖిలాధారుడగు పరమేశ్వరుని దర్శించగలను.”
సనందన మహర్షి పలికెను: “మహానుభావుడగు ఖాండిక్యుడను జనకునకు పూర్వము కేశిధ్వజుడు చెప్పిన యోగమును అదేవిధముగా నేను నీకు తెలిపెదను.”
నారద మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! ఖాండిక్యుడెవరు? కేశిధ్వజుడెవరు? వారిద్దరికి యోగసంబంధమున సంవాదమెట్లు జరిగెను?
సనందన మహర్షి పలికెను: జనకవంశమున ధర్మధ్వజుడను మహరాజు కలదు. ధర్మ ధ్వజుని పుత్రుడు అమితధ్వజుడు. అమితధ్వజుని సోదరుడు కృతధ్వజుడు. ఎప్పుడూ అధ్యాత్మ జ్ఞానమునందు ఆసక్తి కలవాడు. కృతధ్వజుని పుత్రుడు కేశిధ్వజుడు. ఇతను ధన్యుడు. అమితధ్వజుని పుత్రుడు ఖాండిక్యనాముడు. కర్మమార్గమున ఉన్న ఖాండిక్యుని రాజ్యము నుండి కేశిధ్వజుడు వెడలగొట్టెను. పురోహితునితో మంత్రులతో కూడి కొద్ది సైన్యముతో రాజ్యభ్రష్టుడగు ఖాండిక్యుడు దుర్గమ అరణ్యమున నివసించసాగెను. కేశిధ్వజుడు కూడా చాలా యజ్ఞములను ఆచరించెను. సంసారమును తరించుటకు బ్రహ్మ విద్యను అభ్యసించ సాగెను. ఒకప్పుడు కేశిధ్వజుడు యాగమును చేయుచుండగా, కేశిధ్వజుని గోవును ఒక భయంకరమగు పెద్దపులి చంపెను. అపుడు కేశిధ్వజ మహారాజు ఆవును పులి చంపినదని తెలుసుకొని దీనికేమి ప్రాయశ్చిత్తమును ఆచరించవలయునో తెలుపుడని ఋత్వి జులను అడిగెను. అపుడా ఋత్విజులు మాకు తెలియదు. కశేరుమహర్షిని అడుగవలయునని తెలిపిరి. కశేరుమహర్షి నడుగగా నాకు తెలియదు. శునక మహర్షి అడుగమని చెప్పెను. కేశిధ్వజుడు శునకమహర్షి వద్దకు వెళ్ళి అడుగగా కశేరునకు తెలియదు. నాకు తెలియదు. ఇప్పుడీ భూలోకమున ఈ విషయమును తెలిసినవాడు నీ శత్రువగు ఖాండిక్యుడు ఒక్కడు మాత్రమే అని తెలిపెను. ఆ మాటలను వినిన కేశిధ్వజుడు ఖాండిక్యునే అడిగెదను. “నేను వెళ్ళినపుడు అతను నన్ను వధించునా? లేక నేను అడిగినపుడు ప్రాయశ్చిత్తమును తెలుపునా చూచెదను. ప్రాయశ్చిత్తమును తెలిపినచో నా యోగము సిద్ధించును” అని పలికి రథమును అధిరోహించి కృష్ణాజినధరుడై ఖాండిక్యుడున్న వనమునకు వెళ్ళెను. తన శత్రువగు కేశిధ్వజుడు వచ్చుట చూచి ఖాండిక్యుడు కోపముచే కనులు ఎఱ్ఱబారగా ధనువున బాణమును సంధించి ఇట్లు పలికెను.
ఖాండిక్యుడు పలికెను: కృష్ణాజినమును కవచముగా ధరించి మమ్ములను చంపదలచితివా? కృష్ణాజినమును ధరించినందున నిన్ను వధించనని తలచితివా? మూఢుడా లేళ్ళ శరీరము పైన కృష్ణాజినముండదా? ఆ లేళ్ళను నిష్కారణముగా క్రూరులై బాణములతో వధించుట లేదా? కావున ఓ దుష్టబుద్ధీ! నీవు నాకు జ్ఞాతివి, రాజ్యమును హరించిన శత్రువువు కావున నిన్ను వధించెను. నా నుండి బ్రతికి వెళ్ళలేవు.” అని పల్కుగా అందుకు
కేశిధ్వజుడు ఇట్లు పలికెను: ఓ ఖాండిక్యా! సంశయమడుగుటకు నీ వద్దకు వచ్చితిని. నిన్ను చంపుటకు రాలేదు. కావున ఆలోచించి కోపమునో, బాణమునో వదులుము. అంతట ఖాండిక్యుడు మంత్రులతో, పురోహితులతో కలిసి ఆలోచించసాగెను. అపుడు మంత్రులందరు కలిసి ఇపుడు నీవు నీ శత్రువు కేశధ్వజుని చంపుము. ఇతనిని చంపినచో రాజ్యము నీ వశమగును. మంత్రి మాటలను విని ఖాండిక్యుడిట్లు పలికెను. మీరు చెప్పినది నిజమే. సంశయము లేదు. ఇతనిని చంపినచో భూమి నా వశమగును. కాని కేశిధ్వజుడు పరలోకమును జయించును. నా భూమి నాకు లభించును. చంపనిచో నాకు పరలోక జయము ఇతనికి భూమి లభించును. భూమి స్వల్పకాలికము, పరలోక జయము అనంతకాలికము. కావున నేనితనిని చంపను. అతనదగిన దానిని చెప్పను” అని ఇట్లు పలికి కేశిధ్వజుని సమీపించి నీవు అడుగదలచిన దానిని అడుగుము చెప్పెదను అనెను. అంతట కేశిధ్వజుడు హోమధేనువును వ్యాఘ్రము చంపినది. దానికి చేయవలసిన ప్రాయశ్చిత్తమును చెప్పుమని అడిగెను. అంతట ఖాండిక్యుడు అచట చేయవలసిన ప్రాయశ్చిత్తమును చెప్పెను. ఇట్లు ఖాండిక్యుని వలన ప్రాయశ్చిత్తమును తెలసుకొనిన కేశిధ్వజుడు ఖాండిక్యుని అనుమతిని పొంది యాగభూమిని చేరి ప్రాయశ్చిత్తము నాచరించెను. ఇట్లు ప్రాయశ్చిత్తము ఆచరించి యాగమును సమాప్తి గావించి అవబృధ స్నానమును ఆచరించి ఇట్లు ఆలోచించసాగెను. ఋత్విజుల నందరిని పూజించితిని. సదస్యులను గౌరవించితిని. యాచకులకు అభిమతార్థములనిచ్చి సంతుష్టుల గావించితిని. ఈ లోకమున చేయతగిన వాటిని అన్నింటిని చేసితిని. అయిననూ నా కర్తవ్యము ముగియలేదు అనిపించుచున్నది. ఇట్లు ఆలోచించుచుండగా ఖాండిక్యునికి గురుదక్షిణ ఈయలేదని జ్ఞప్తికొచ్చెను. వెంటనే కేశిధ్వజుడు రథము నారోహించి ఖాండిక్యుడు నివసించు దుర్గమారణ్యమునకు వెళ్ళెను. ఖాండిక్యుడట్లు వచ్చు కేశిధ్వజుని చూచి ఆయుధమును ధరించి వధించ సంకల్పించెను. అపుడు కేశిధ్వజుడు నేను నీకు అపకారమును చేయుటకు రాలేదు. గురుదక్షిణను ఇచ్చుటకు వచ్చితిని. నీవు ఉపదేశించినట్లు యాగమును పూర్తిగావించితిని. కావున నీకు గురుదక్షిణను ఈయ సంకల్పించితిని. ఏమి కావలయునో కోరుకొనుము అని పలికెను. కేశిధ్వజుని మాటలను వినిన ఖాండిక్యుడు మంత్రులతో ఆలోచించసాగెను. కేశిధ్వజుడు గురుదక్షిణను ఈయదలచినాడు. ఏమడుగ వలయును? అని మంత్రుల నడిగెను. సంపూర్ణ రాజ్యమును అడుగుము. అట్లు కోరినచో సైన్యము శ్రమలేకనే రాజ్యము లభించును అని మంత్రులు పలికిరి. ఆ మాటలను వినిన ఖాండిక్యుడు నవ్వి వారితో నిట్లనెను. అశాశ్వతమగు రాజ్యమును నాలాంటి వారెట్లడిగెదరు? మీరు మంత్రులు కావున స్వార్థపరులుగా మాటలాడుచున్నారు. పరమార్థమును తెలియజాలకున్నారు.” అని ఇట్లు పలికి ఖాండిక్యుడు కేశిధ్వజుని సమీపించి నీవు తప్పక గురుదక్షిణను ఇచ్చెదవా? అని అడిగెను. తప్పక ఇచ్చెదనని కేశిధ్వజుడు పలుకగా ఖాండిక్యుడు ఇట్లడిగెను. నీవు ఆధ్యాత్మ విజ్ఞాన పరమార్థమును బాగుగా తెలిసినవాడవు. నీవు గురుదక్షిణను ఈయ దలచినచో, క్లేశములను పరిహరింపచేయు కర్మను నాకు బోధించుము.
కేశిధ్వజుడు పలికెను: క్షత్రియులకు రాజ్యలాభమునకంటే ప్రియమైనది మరియొకటి లేదు గదా? నీవు నా రాజ్యమును ఏల అడుగలేదు?
ఖాండిక్యుడు పలికెను: ఓ కేశిధ్వజా! పండితులైనవారు రాజ్యమునందు ఆశపడరు. కావున నేను రాజ్యమును కోరలేదు. క్షత్రియులకు ప్రజాపరిపాలనము, ధర్మయుద్ధమున శత్రువధ స్వధర్మము. ఆ రెంటిలో ఆశక్తుడను అగుట నా దోషము. నీవు చేసిన అపకారము ఏమియును లేదు. అక్రమ మార్గమున శత్రువధ చేయట అజ్ఞానమే అగును. మరల పుట్టుకను పాపానుభవమునకే నాకు రాజ్యలాభమునందు ఆశ అగును. దోషముల వలన చేయు ధర్మములనే అనుసరింతురు. క్షత్రియులు యాచనచే రాజ్యమును పొందుట ధర్మము కానేరదు. కావున అవిద్యలో అంతర్భవించిన రాజ్యమును నేను అర్థించలేదు. మమకారముచే ఆకర్షించబడిన చిత్తము కలవారు, అహంకార మదమత్తులు మాత్రమే రాజ్యమును ఆశించెదరు. నా వంటి వారు రాజ్యమును ఆశించజాలరు”
కేశిధ్వజుడు పలికెను: “నేను జ్ఞానముచే సంసారమును తరించుటకే రాజ్యమును యజ్ఞములను చేయుచున్నాను. పుణ్యక్షయము కొఱకు పలు భోగములను అనుభవించు చున్నాను. దైవేచ్చచే నేటికి నీ మనసు వివేకవృద్ధిని చెందుచున్నది. ఓ కులనందనా! అవిద్యా స్వరూపమును చెప్పెదను వినుము. ఆత్మకాని దానియందు ఆత్మబుద్ధి, తనది కానిదానియందు తనదనుబుద్ధి ఈ రెండు విధములగు బీజములు అవిద్యా వృక్షములనుండి పుట్టినవి. పంచభూతాత్మకమగు దేహమునందు జీవుడు మోహమను చీకటిచే అవరించబడి దుష్టబుద్ధి కలవాడై, ఈ దేహమే నేనని భావనచేయును. ఆకాశ వాయ్వగ్ని జల పృథ్వలను పంచ భూతములు విడివిడిగా ఉండగా శరీరమును ఆత్మయని భావించువాడెవ్వడు? శరీరముచే అనుభవించదగిన గృహక్షేత్ర కళత్రాదులు దేహమున కంటే భిన్నమగు ఆత్మలో నావి ఇవి అని ప్రజ్ఞుడు భావించును. ఇట్లే దేహమువలన ఉత్పన్నములైన పుత్ర పౌత్రాదులందు ఆత్మకాని శరీరమునందు పండితుడు కూడా తనది అను భావన కలిగియుండును. సమగ్ర శరీరానుభవము కొఱకు మానవుడు కర్మను చేయును. కాని అత్మకంటే భిన్నమగు ఈ దేహము ఎపుడూ దేహిని బంధించుటకే ప్రయత్నించుచుండును. మట్టిచే నిర్మించిన గృహమును మట్టినీటిచే అలుకునట్లు ఈ పార్థివ దేహమునుకూడా మట్టి, నీరులచే పూయబడి యుండును. పంచభోగాత్మకములగు భోగములచే పంచ భూతాత్మకమగు శరీరమును తృప్తిపరిచినచో పురుషుని గర్వము విజృంభించుచుండును. అనేక వేలజన్మలలో సంసారమును పొందుచు వాసనా ధూళి ధూసరితుడై మోహముచే శ్రమను పొందును. జ్ఞానము అను ఉష్ణజలముచే వాసనాధూళిని ప్రక్షా ళనము చేసినచో, సంసారము అను బాటలో పయనించు బాటసారికి మోహశ్రమము శమించును. మోహము అను శ్రమ శాంతించినపుడు పవిత్రమైన అంతఃకరణము గల పురుషుడు ఇతరములను అధికముగా ఆశ్రయించక పరమానందమును పొందును. ఇట్లు ఈ ఆత్మ పరమానందమయుడు, జ్ఞానమయుడు, దుఃఖమును కలిగించు ధర్మములు ప్రకృతివి కాని ఆత్మవి కావు. నీరు అగ్నితో సంగము ఉండజాలదు. స్థాలీసంగము ఉండును. జీవుడు శబ్దాద్రేకాది ధర్మములను ఆచరించినపుడు ఆత్మకు ప్రకృతి సంబంధమేర్పడుటచే అహంకార దూషితము అగును. అపుడు అవ్యయుడగు ఆత్మ నిశ్చేష్టతను విడిచి ప్రాకృతధర్మమును ఆచరించును. ఇట్లు నీకు అవిద్యాబీజమును తెలిపితిని. క్లేశములను నశింప చేయు సాధనము ఒక్క యోగము మాత్రమే.” (2/46)