మంత్ర విధాన నిరూపణము

సనత్కుమార మహర్షి పలికెను: ఇప్పుడు వేదమూర్తియగు సూర్య భగవానుని మంత్ర విధానమును చెప్పెదను. సూర్య మంత్రములను ఆరాధించినవారు భూ మండలమున సర్వాభీష్టములను పొందెదరు. రోచనతోకూడిన తారము మేధా నేత్రయుతమగు రతి, సంసర్గలు వామకర్ణాఢ్యుడగు భృగువు, వఢ్యాసనుడగు మరుత్ శేషము దిత్యుడని, అష్టాక్షర మంత్రము భుక్తి ముక్తులను ప్రసాదించును. ఈ మంత్రమునకు ముని దేవభాగుడు, గాయత్రీ ఛందస్సు. రవి దేవత, మాయ బీజము, రమాశక్తి, దృష్టా దృష్ట ఫలమునకు వినియోగము. సత్యమునకు హృదయము, బ్రహ్మకు శిరము విష్ణువునకు శిఖ, రుద్రునకు కవచము. అగ్నికి నేత్రము. శర్వునకు అస్త్రము, నేత్రము జ్వాలా మనస్సు హుం ఫట్ స్వాహా అనునది మంత్రము. గణములు షడక్షరములతో హ్రీం అనునది. లక్ష్మీకి అంతస్ధములతో షడంగ న్యాసము. శిష్టారములు జఠరమున పృష్ఠమున జ్ఞేన్తముతో న్యాసము చేయవలెను. ఆదిత్యుని, రవిని, భానువును, భాస్కరుని, సూర్యుని శిరసున వదనమున, హృదయమున, గుహ్యమున, పాదములలో ఉంచవలెను. సద్యాదులగు అయిదు హ్రస్వాదులను జేయందు ఉంచవలెను. హృదయము అంతిమముల నుంచవలెను. రమామధ్యలో నున్న హ్రీం అనుదానిని ఎనిమిది వర్ణములను తారాదికములను వ్యాసము చేయవలెను. మూర్ధ, అస్య కంఠ, హృత్, కుక్షి, నాభి, లింగ, గుదములందు, చంద్ర స్వర పూర్వముగా ఙేన్తము చంద్ర మండలము. మూర్ధాది కంఠపర్యంతము ఇంద్రుని స్మరించుచు న్యాసము చేయవలెను. సేందువులగు స్పర్శలను ఉచ్చరించి ఙేన్తమగు సూర్య మండలమును కంఠాదినాభ్యంతముగా వ్యాసము చేయవలెను. సూర్యుని హృదయమున ధ్యానము చేయుచుండవలెను. సచంద్రములకు ఆకారాదులను ఉచ్చరించి ఙేన్తముగా వహ్నిమండలమును నాభ్యాది పాద పర్యంతము అగ్నిని స్మరించుచు న్యాసము చేయవలెను. దీనిని మహాతేజో విధాయకమగు మండలన్యాస మందురు. ఆదిశాంత వర్ణ పూర్వము ఙే నమోంతము చంద్రమండలమును మూర్ధాది హృదయాంతముగా న్యాసము చేయవలెను. డకారాది క్షకారాం తర్ణాద్యము అగ్నిమండలమును ఙేన్తముగా హృదయాది పాద పర్యంతము సావధానముగా న్యాసము చేయవలెను. అగ్నీష్టోమాతమకమగు న్యాసము సర్వసిద్దిప్రదముగా చెప్పబడినది. చంద్రసహితముగా మాతృకా వర్ణములను జయంత పురుషాత్మునము న్యాసము చేయవలెను. నమోంతముగా వ్యాపకమును చేయవలెను. దీనిని హంసన్యాసమందురు. మిగిలిన యెనిమిది స్వరములను మరల పంచమితములుగా పంచస్వరములను ఆదిత్య ముఖములుగా చెప్పడిన నవగ్రహములను న్యాసము చేయవలెను. ఆధారలింగము లందు, నాభియందు, హృదయమున, కంఠమున, ముఖాంతరమున, భ్రూమధ్యభాగమున, ఫాలమున, బ్రహ్మరంధ్రమున న్యాసము చేయవలెను. హంసన్యాసము అగ్నీష్టోమన్యాసము, మండలన్యాసము అను మూడు న్యాసములచే మరల మూడు న్యాసములను చేసి వ్యాపకమును ఆచరించవలెను. ఇట్లు న్యాసవిధిని ఆచరించి హృదయమున సూర్యుని ధ్యానించవలెను. దానాభయ పద్మ ద్వయమును చేతులలో ధరించి ఉన్న, కుండలాంగద కేయూరహారధారి, వేద స్వరూపుడు అగు సూర్యుని ధ్యానించి సూర్య మంత్రమును 8 లక్షలు జపించవలెను. దశాంశమును రక్తాంభోజములతో కాని తిలలతో కాని విధిననుసరించి హోమము గావించవలెను. మొదట పీఠపూజలో ధర్మాది స్ధలమున న్యాసము కావించవలెను. పరిశుద్ధము విశాలమైన శారమును చక్కగా ఆరాధించి, మధ్య భాగమున పరమాది ముఖముగా రవి బింబాంతముగా పూజించవలెను. సోమాగ్ని మండలములను పూజించి సూర్య మండలమును పూజించవలెను. దీప్త, సూక్ష్మ, జయ, భద్ర, విభూతి, విమల, అమోఘా, విద్యుతా, సర్వతోముఖా అనునవి పీఠశక్తులు. హ్రస్వ త్రయోక్తుల వలన పుట్టిన, క్లీబ రహితములు వహ్నీందు సంయుతములు అగు స్వరములు శక్తి బీజములగును. అటువంటివాటిని పూజించవలెను. ఈ శక్తులు బ్రహ్మ విష్ణు శివాత్మకములు. శేషాన్వితములు కూడా ఇట్లు అంతమున “యోగ పీఠాత్మనే హృదయమ్” అని పలుకవలెను. ఈ పీఠ మంత్రము తారాద్యము. ఈ మంత్రముచే ఆసనమును సమర్పించ వలెను. ధ్రువము, ఆకాశము బిందుయుతము, ఆకాశమునకు ఉల్కకు హృదయము అను అర్ధముగల మంత్రము హృదయ మంత్రము. నవాక్షర మంత్రమునకు మూర్తిని సంకల్పించవలెను. ఆ మూర్తియందు జగత్సాక్షియగు సూర్య భగవానుని అవహించి విధిననుసరించి పూజించవలెను. తరువాత షడంగమును ఆరాధించి దిక్కులయందు అష్టాంగమును పూజించవలెను. మధ్యలో ఆదిత్యుని, రవిని, భాస్కరుని, సూర్యుని పూజించి దిక్కులయందు సద్యాదిపంచకమును, హ్రస్వాదికమును స్వస్వనామాది వర్ణములను శక్తులను విదిక్కులలో పూజించవలెను. ఉషను, ప్రజను, ప్రభను, సంధ్యను పూజించి తరువాత బ్రహ్మాదులను పూజించవలెను. మొదట అరుణుని పూజించి తరువాత చంద్రుని బుధుని, గురువును, శుక్రుని పూజించి, దిక్కులలో అర్యమాదులను పూజించి కుజుని, శనిని, రాహువును కేతువును కోణములయందు మొదటివలె పూజించవలెను. ఇంద్రాదులను వజ్రాదులను పూర్వమువలె పూజించవలెను. ఇట్లు యథావిధిగా భక్తవత్సలుడుగు భాస్కరుని పూజించి సావధానుడై సూర్యునికి అర్ఘ్యమును ప్రతిదినము ఈయవలెను. పరిశుద్ధమగు భూమియందు ప్రాణాయామమును ఆచరించి, మొదట చెప్పిన న్యాసములను ఆచరించి భాను మండలమును ఏర్పరిచి పీఠమును పూర్వమువలె పూజించవలెను. సూర్యుని ధ్యానముచేసి దివ్యములు మానసికములైన ఉపచారములచే పూజించవలెను. ప్రస్ధతోయమును గ్రహించునది, శోభనము అగు తామ్ర పాత్రము రక్త చందనాదులచే నిర్మించబడిన మండలమునందు ఉంచి, విలోమ మాతృకా మూలముగా ఉచ్చరించుచు జలములచే నింపవలెను. సూర్య మండలమునుండి బయలు వెడలు సుధాంబుధి విభావితములగు వాటిచే కుయమను రోచనమును, రాజిని, చందనమును, రక్తచందనమును, కరవీరమును, జపాశాలకుశశ్యామా కతండులములను తిలవేణు యవలను శుభజలమునందు ఉంచవలెను. అచట సాంగుడు సావరణుడగు సూర్యుని ఆవాహించి మొదటివలె పూజించవలెను. విధానమును అనుసరించి గంధ పుష్ప ధూప దీప నైవేద్యాదులచే పూజించి, మూడు ప్రాణాయామములను చేసి పూర్వమువలె అంగన్యాసము గావించి దక్షిణ కరతలమున చందనముచే సుధా బీజమును లిఖించవలెను. ఆ హస్తముచే అర్ఘ్య పాత్రము కప్పి, నిశ్చలమనస్కుడై మంత్రమును అష్టోత్తర శతావృత్తిగా జపించి, మరల భాస్కరుని పూజించి, హస్తములతో పాత్రను తీసుకొని మోకాళ్ళచే భూమిమీద నిలిచి శిరస్సువరకు పాత్రనులేపి శుభ వస్త్రముచే రవిని చూచి, మనసుచే మరల సూర్యుని పూజించి స్వకైక్యముగా ఆ సాధకుడు బుద్ధిచే మూల మంత్రమును జపించుచు, సూర్యుని ధ్యానించుచు అర్ఘ్యమును ఈయవలెను. రక్త చందనమండలమున పుష్పాంజలినిచ్చి మరల అష్టోత్తర శతము జపించవలెను. ప్రతి నిత్యముకాని ఈ విధముగా సూర్యునికి అర్ఘ్య ప్రదానమును గావించవలెను. అర్ఘ్య ప్రదానముచే సంతుష్టి చెందిన సూర్యుడు సంపదను, కీర్తిని, సుఖమును ప్రసాదించును. అట్లే పుత్ర పౌత్రులను సకలాభీష్టములను ప్రసాదించును. ఈ అర్ఘ్య ప్రదానము ఆయురారోగ్య వర్థకముగా చెప్పబడి ఉన్నది. అంతేకాక ధనధాన్య పశు క్షేత్ర మిత్ర కళత్రప్రదము. తేజో వీర్య యశః కీర్తి విద్యావిభవ భోగప్రదముగా మునులు చెప్పి ఉన్నారు. గాయత్రీ దేవి ఆరాధన అందు ఆసక్తుడై సంధ్యావందన తత్పరుడై మంత్రమును జపించు బ్రాహ్మణుడు ఎప్పుడూ దుఃఖమును పొందజాలడు.

ఇట్లు సూర్యుని పూజించి వికర్తనునికి నిర్మాల్యమును ఇప్పించవలయును. మార్తాండ భైరవమను పేరుగల బీజము త్రైలోక్యమోహనము. బింబబీజముచే పుటము పెట్టబడి సర్వకామఫల ప్రదమగును. ఈ విషయమున అంతయూ పూర్వము వలెనే తెలియవలసి ఉన్నది. బిలేందుమన్వాధ్యుడగు భృగువు చంద్రుని కొఱకు హృదయాంతిమము. ఈ చంద్ర మంత్ర రాజము షడక్షరములు కలది. ఈ మంత్రమునకు ముని భృగువు. పంక్తి ఛందస్సు. సోముడు దేవత. బీజము అద్యము. నమః అనునది శక్తి. అఖిల ప్రాప్తి కొరకు వినియోగము. పడ్దీర్ఘమగు స్వబీజముతో షడంగన్యాసము చేయవలెను. పూర్ణ చంద్రముఖుడు, స్ఫటికవర్ణుడు నీలాలకలచే శోభించు ముఖము కలవాడు. ఇష్టమగు కలువను ధరించువాడు, ముత్యముల హారమును ధరించిన చంద్రుని ధ్యానించవలయును. చంద్ర మంత్రమును ఆరు లక్షలు జపించవలెను. నేతితో కలిపిన పాయసముచే దశాంవము హోమమును ఆచరించవలెను. సోమాంత పూజితమగు పీఠమున మూర్తి మూలముచే సంకల్పించి విధిననుసరించి చంద్రుని పూజించవలెను. కేసరములందు అంగ పూజను పత్రములందు శక్తులను పూజించవలెను. రోహిణి, కృత్తిక, రేవతీ, భరణి, రాత్రి, ఆర్ద్ర, జ్యోత్స్నాకలా, హార సమప్రభా. ఆ శక్తులను శుక్ల మాల్యాంబర ధరలనుగా, ముక్తాహార విభూషితులను స్తనభరాక్రాంతలై అంజలిని ధరించిన, శుభులను, తమ ప్రియులందు ఆసక్తమనస్కులను, మద విభ్రమమంధరలను, సరోజాక్షులు అను, పూర్ణేందు సదృశాననులను పూజించవలెను. దళాగ్రములందు సూర్యాదులగు సూర్య కుజ శని బృహస్పతి రాహు కేతు శుక్రులను ఎనిమిది గ్రహములను పత్రాగ్ర గతులను పూజించవలెను. ఈ గ్రహములు రక్త అరుణశ్వేత నీల పీత ధూమ్ర సిత అసిత వర్ణులను, తన హస్తమును వామోరువున ఉంచి, మరియొక హస్తమున అభయ ముద్రను ధరించిన వారిని పూజించవలెను. పత్రములకు బాహ్యమున లోకపాలురను, వారి అస్త్రములను పూజించవలెను. ఇట్లు సాధింపబడిన మంత్రము స్వాభీష్టమును ఒసంగును. పూర్ణిమనాడు ఆహారమును మాని చంద్రోదయ కాలమున అర్ఘ్యమునీయ వలయును. భూమిపై తూర్పు పడమరలు వైశాల్యముగా మూడు మండలముల నేర్పరచవలెను. పశ్చిమ మండలమున తానుండి, మధ్యమ మండలమున పూజా ద్రవ్యముల నుంచి అబ్జ సమన్వితమగు తృతీయ మండలమున చంద్రుని పీఠాపూజా పూర్వకముగా విధి విధానమున పూజించి ముందు భాగమున రజత పాత్ర నుంచవలెను. సుగంధ జలముచే ఆ పాత్రను నింపి పాత్రను స్నృశించుచు మంత్రమును జపించవలెను. తరువాత విద్యా మంత్రముచే అష్టోత్తర శతమును జపించవలెను. విద్యామాలినియందు విద్యాచంద్రునిలో అంతమును చెప్పవలెను. ఈ మంత్రము ద్విఠాంతముగా తెలియవలెను. సర్వాభీష్టార్థసిద్ధికి చంద్రునికి అర్ఘ్యమును ఈయవలెను. ఈ విధానముచే ప్రతిమాసము వ్రతము నాచరించవలెను. ఇట్లు ఒక సంవత్సరము ఆచరించినచో మరియొక సంవత్సరమున సర్వేష్టములను పొందును. ఇట్లు చంద్ర మంత్రమును జపించువాడు ధనధాన్య పుత్ర పౌత్ర సౌభాగ్యములను త్వరలో పొందును.

ఇపుడు ధనమును పుత్రులను ప్రసాదించు అంగారక మంత్రమును చెప్పెదను. తారము దీర్ఘేందు సహితము. ఆకాశము, ఇదియే మరల ఇందుయుతము, శాంతము, విసర్గలు కలది. సర్గిచండీశులు క్రమముగా బిందు విసర్గలు కలవి. ఈ మహామంత్రము ఆరు అక్షరములు కలది. అఖిలాభీష్ట ప్రదము. ఈ మంత్రమునకు ముని విరూపాక్షుడు గాయత్రీ ఛందస్సు. కుజుడు దేవత. షణ్మంత్రాక్షరములచే షడంగ న్యాసము చేయుచు భూపుత్రుని ధ్యానించవలెను. మేషము మీదున్న వాడు, రక్తాంగుడు, రక్తవస్త్రుడు, శూలశక్తి గదాధరుడు శంకరుని స్వేదము వలన పుట్టినవాడు, భూసుతుడగు అంగారకుని స్మరించవలెను. అంగారక మంత్రమును తొమ్మిది లక్షల జపమును చేయవలెను. దానిలో దశాంశమును అనగా తొంబదివేలు మేడి సమిధలచే అగ్నియందు హోమమును చేయవలెను. శైవ పీఠమున కుజుని పూజించవలెను. ఇరువది యొకటి కోష్టములు కలదానిలో ప్రాణాంగములను ఆరాధించి, మంగళుడు, భూమి పుత్రుడు, ఋణహర్త, ధనప్రదుడు, స్థిరాసనుడు, మహాకాయుడు. సర్వకర్మ విరోధకుడు, లోహితుడు, లోహితాక్షుడు, సామగానము చేయువారిని అనుగ్రహించువాడు, ధర్మాత్మజుడు, కుజుడు, భూమిదుడు, భూమినందనుడు. అంగారకుడు, మహీసూనుడు, సర్వరోగాపహారకుడు, వృష్టికర్త, వృష్టిహర్త, సర్వకార్యార్థసిద్ధిదుడు అని అంగారకుని మూర్తులు ఇరువది యొకటి చెప్పబడినవి. తమ తమ స్థానములలో ఉన్న మంగళాది మూర్తులను క్రమముగా పూజించవలెను. అట్లే ఇంద్రాదులను, వజ్రాదులను పూజించవలెను. ఇట్లు పూజించినచో మంత్రము సిద్ధించును. పుత్రులను కోరు స్త్రీ అంగారక వ్రతమును ఆచరించవలెను. మార్గశీర్ష మాసమున కాని వైశాఖ మాసమున కాని వ్రతారంభము చేయుట ప్రశస్తము. అరుణోదయ వేళలో లేచి అవశ్యకృత్యములను నిర్వర్తించి ఉత్తరేణి కాష్ఠముతో దంతధావనము గావించి, వాఙ్నియమము కలదై, స్నానమాచరించి, రక్తవస్త్రములను రక్త మాల్యములను, రక్తచందనమును ధరించి రక్తవర్ణములు కల నైవేద్యములను సిద్ధము చేయవలెను. యోగ్యుడగు బ్రాహ్మణుని ఆహ్వానించి, అతని అనుమతిని పొంది అంగారకునికి అర్పించవలెను. రక్తగోవుయొక్క పేడతో అలికిన భూమి యందు రక్తాసనమున కూర్చుండవలెను. ఆచమనము గావించి, దేశకాలములను కీర్తించి కోరికను చెప్పుచు మంగళాది నామములను స్వాంగములయందు వ్యాసము గావించవలెను. ముఖమున సామగ కృపాకరుని, నాసికలయందు ధరాత్మజుని, నేత్రములయందు కుజుని, లలాటమునందు భౌముని, భ్రూమధ్యమున భూమిజుని. మస్తకమున భూనందనుని, శిఖయందు అంగారకుని, సర్వాంగములందు మహీసుతుని. బాహుద్వయమునందు సర్వరోగాపహారుని శిరస్సునుండి పాదాంతము వరకు వృష్టికర్తను, పాదాది నుండి మూర్థాంతము వరకు వృష్టిహర్తను, అన్ని దిక్కులయందు సర్వకార్యార్థ సిద్ధిదుని, నాభియందు, హృదయము నందు, శిరస్సునందు, ఆరుని, వక్త్రమునందు భూమిజుని వ్యాసముచేసి మొదటివలె అంగారకుని ధ్యానము చేయవలయును. మానసోపచారములచే చక్కగా పూజించి అర్ఘ్యమును ఈయవలెను. ఏకవింశతి కోష్టములుగల త్రికోణమును తామ్రపత్రమున లిఖించి, దానియందు అంగారకుని ఆవహించి రక్తపుష్పాదులతో పూజించవలెను. మొదట అంగములను పూజించి మంగళాదులను తరువాత పూజించవలెను. ఏకవింశతి కోష్ఠములందు చక్రుని, ఆరుని, భూమిజుని త్రికోణము లందు కూడా పూజించి, బాహ్యభాగమున అష్టమాతృకలను, ఇంద్రాదులను, వజ్రాదులను మరల పూజించవలెను. ధూప దీపములను సమర్పించి గోధూమాన్నమును నివేదన చేయవలెను. శుద్ధజల పూరితమగు తామ్రపాత్ర యందు రక్త చందనమును రక్త పుష్పాక్షత ఫలములను ఉంచి అర్ఘ్యమును సమర్పించవలెను. తరువాత మంత్రజ్ఞుడు మంగళుని కొఱకు ఈ క్రింది అర్థముగల మంత్రద్వయమును పఠించ వలయును.

“మహాతేజోవంతుడవు శంకరుని స్వేదము నుండి పుట్టిన భూమిపుత్రుడా? పుత్రుని కోరి నిన్ను శరణు వేడితిని. ఈ అర్ఘ్యమును స్వీకరించుము. నీకు నమస్కారము. రక్తప్రవాళసంకాశా! జపాకుసుమసన్నిభా! మహానుభావా! ఓ మహీపుత్రా! ఈ అర్ఘ్యమును స్వీకరించుము. నీకు నమస్కారము” అని పై మంత్రములకు అర్థము. మొదట చెప్పిన ఇరువది యొకటి నామములతో ఙే, నమః అను వాటిని చేర్చి తారాదులచే నమస్కరించవలయును. తరువాత అన్నియే (21) ప్రదక్షిణములను చేయవలెను. ధరణీగర్బ సంభూతుడు విద్యుత్తు వంటి తేజస్సు కలవాడు, శక్తిహస్తుడు, కుమారుడగు అంగారకునికి నేను నమస్కరించుచున్నాను. తరువాత మేడికట్టెతో ఏర్పడిన బొగ్గుచే రేఖాత్రయమును లిఖించవలయును. సావధాన మనస్కురాలై రెండు మంత్రములను పఠించుచు వామపాదముచే ఆ రేఖలను తుడిచివేయవలయును.

దుఃఖదౌర్భాగ్యనాశాయ పుత్రసంతానహేతేవే

కృతరేఖాత్రయం వామపాదేనైతత్ప్రమార్జ్మ్యహమ్

ఋణదుఃఖవినాశాయ మనోభీష్టార్థ సిద్ధయే

మార్జయామ్యసితా రేఖాస్త్రిస్రో జన్మత్రయోద్భవా.

అను మంత్రములు రెంటిని పఠించవలెను. దుఃఖదౌర్భాగ్య నాశము కొఱకు పుత్ర సంతానము కలుగుటకు నేను లిఖించిన మూడు రేఖలను వామపాదముచే తుడుచుచున్నాను. ఋణదుఃఖ నాశమునకు మనోఽభీష్టార్ధసిద్ధికి మూడు జన్మలనుండి పుట్టుచున్న మూడు నల్లనిరేఖలను తుడుచుచున్నాను. అని పై మంత్రములకు అర్ధము. తరువాత దోసిట పుష్పములను ధరించి అంగారకుని స్తుతించవలయును. పూజ సాంగోపాంగముగా సిద్ధించుటకు అంగారకుని పాదములను ధ్యానము చేయవలెను. ఋణమును హరించు వానికి దుఃఖ దారిద్య్రములను నశింపచేయు నీకు నమస్కారము. ఓ అంగారకా నాకు ఎప్పుడూ! సౌభాగ్యమును, సుఖమును ప్రసాదించుము. తప్త కాంచనసంకాశ! తరుణాదిత్య సమతేజా! సుఖసౌభాగ్య ప్రద! ఋణదారిద్య్ర నాశక! సర్వ కళ్యాణ కారకా! ఓ గ్రహరాజా నీకు నమస్కారము. సర్వకళ్యాణ నిలయుడవగు ఓ దేవేశా. నన్ను అనుగ్రహించుము. దేవదానవ గంధర్వ యక్ష రాక్షస పన్నగులు నిన్ను పూజించి పూర్ణమనోరధులై శుభములను పొందుచున్నారు. నిన్ను ఆరాధించిన జనులు త్వరలో సుఖమును పొందుచున్నారు. అట్టి నీకు నమస్కారము. నీవు వక్రగతుడవై మానవులకు దుఃఖమును కలిగించుచున్నావు. పూజించినచో సుఖ సౌభాగ్యములను ప్రసాదించుచున్నావు. అట్టి నీకు నమస్కారము. ఆకాశమున ప్రకాశించువాడు సర్వకళ్యాణ కారణుడవు, ధన సంతాన హేతుభూతుడవైన కుజునికి నమస్కారము. ఓ మంగళ ప్రదుడవగు మంగళా నన్ననుగ్రహించుము. ఓ రుద్ర స్వరూపా! మేషవాహనా! నాకు పుత్రులను, ధనమును, కీర్తిని ప్రసాదించుము. ఇట్లు స్తోత్రముచేసి నమస్కరించి అంగారకుని విసర్జించవలెను. శక్తిననుసరించి బ్రాహ్మణులకు ధనమునిచ్చి, వారి ఆశీర్వాదములను గ్రహించవలెను. గురువునకు దక్షిణనిచ్చి, నివేదించిన పదార్థమును భుజించవలెను. ఇట్లు ఒక సంవత్సరము ప్రతిమంగళవారమున చేయవలెను. నువ్వులచే హోమముచేసి ఏబదిమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. బంగారముతో చేసిన అంగారకమూర్తిని ఆచార్యునకు సమర్పించవలెను. సుతసౌభాగ్య సిద్ధికొఱకు మండలమున నున్న ఘటమున అర్చన గావించవలెను. ఇట్లు వ్రతమును ఆచరించిన అందమైన పుత్రులను పొందును. ఋణనాశనమునకు, ధన ప్రాప్తికి పురుషుడు కూడా ఈ వ్రతమును ఆచరించ వచ్చును. బ్రాహ్మణుడు “అగ్నిర్మూర్ధా” అను వైదిక మంత్రమును పఠించవలెను. ఇక ఇప్పుడు పూజా సిద్ధికొఱకు అంగారక గాయత్రిని చెప్పెదను. “అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్” అనునది అంగారక గాయత్రీ మంత్రము. ఈ అంగారక గాయత్రీ మంత్రము మానవులకు సర్వాభీష్టములను ప్రసాదించును. ఇది అంగారక పూజా విధానము. ఇక బుధ మంత్రమును చెప్పెదను వినుము.

ఫాంతము, కర్ణేందు సంయుక్తము, బుధుడు, జేస్తము, హృదంతిమము. ఈ బుధ మంత్రము తొమ్మిది వర్ణములు కలది. పంక్తి ఛందస్సు బుధుడు దేవత అద్యబీజము నమశ్శక్తి అఖిలాప్తికి వినియోగము. పీతాంబర విభూషితుడగు బుధునికి భక్తిచే సమస్కరించుచున్నాను. వామహస్తమును జానువు మీద నుంచి దక్షిణకరమున భయ ముద్రను ధరించియున్న బుధుని ధ్యానించి ఇంద్రియ నిగ్రహముచే ఒక వేయి మంత్రమును జపించవలయును. ఆజ్యముచే దశాంశమును అర్పించవలయును. అంగములను, మాతృకలను, దిక్పాలకులను ఆయుధములతో కూడియున్న బుధుని అర్చించవలెను. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత తమ మనోరధములను సాధించుకొనవలెను. పది దినములు ప్రతి నిత్యము వేయిమార్లు మంత్రమును జపించవలెను. ఇట్లు చేసినచో త్వరలో అతనికి గ్రహపీడ తొలగును. ఇట్లు బుధారాధన చెప్పబడినది. ఇక గుర్వారాధనను వినుము. బృహస్పతి పదము ఙేన్తము. ఇంద్వద్యాద్యర్ణాఘ మండితము. నమోంతము ఎనిమిది అక్షరములు గలది. బ్రహ్మ ముని, అనుష్టుప్ఛందస్సు. బృహస్పతి దేవత అదిబీజము హృదయము శక్తి దీర్ఘవహ్నీందు యుగళముతో అంగకల్పన చేయవలెను. రాశియందు వామకరము నుంచి దక్షిణ కరమునుండి రత్నములను వెదజల్లుచున్న, పీత పుష్పాలంకార శోభితుని సర్వ విద్యానిధి, స్వర్ణకాంతి గల దేవ గురువును స్మరించవలెను. ఒక లక్ష జపముచేసి దశాంశము నేతితో కాని అన్నముతోకాని హోమమును చేయవలెను. ధర్మాధి పీఠమున అంగ దిక్పాల ఆయుధములను పూజించవలెను. ఇట్లు మంత్రసిద్ధిని పొంది స్వేష్టమును సాధించుకొనవలెను. విషరోగాది పీడలందు, స్వజన కలహమున రాగి సమిధలచే హోమమును గావించిన ఆ బాధలు తొలగిపోవును. నేతితో తడిపిన నిశాపుష్పములచే మూడు దినములు హోమము రెండు వేలు కావించినచో వస్త్రములను భూమిని పొందగలడు. ఇట్లు గుర్వారాధన చెప్పబడినది. ఇక శుక్రా రాధనను వినుము. శుక్ర మంత్రము ‘ఠ’ ద్వయాంతము ధ్రువాదికము. ఏకాదశ అక్షరములు గలది. బ్రహ్మముని విరాట్ఛందస్సు. శుక్రుడు దేవత. ధ్రువ బీజము. వసుప్రియ శక్తి. భూనేత్ర చంద్ర నేత్రాది నేత్రాక్షరములచే షడంగన్యాసము చేయవలెను. శుక్లాంబరాలేపభూషితుని, ధనమును ధరించి ఉన్నవానిని, వ్యాఖ్యా సముద్రను ధరించియున్న శుక్రుని స్మరించవలెను. పది వేల మంత్రమును జపించవలెను. దశాంశము నేతితో హోమమును గావించవలెను. ధర్మాది పీఠమున అందంద్రా యుధాదికమును పూజించవలెను. శుక్ర వారమున తెల్లని పూవులచే గంధములచే హోమమును చేయవలెను. ఇట్లు ఇరువది యొకమార్లు చేసినచో వస్త్రములను మణులను పొందును. ఈ మంత్రములను రహస్యముగా ఉంచవలెను. అందరికీ ఉపదేశించరాదు. భక్తియుక్తుడగు శిష్యునికి కాని తన పుత్రునికి కాని ఈయవలెను. (3/69)