నారద మహా పురాణము
సదాచారములు
సూతమహర్షి పలికెను: ఇట్లు సనకమహర్షి చెప్పగా పవిత్రము, ఇంత అని తులతూచలేనిది, అన్నిటిలో ఉత్తమము, పాపరాశి ప్రశమనము, సర్వవ్రతసారము అయిన ఏకాదశీవ్రతమును విని నారద మహర్షి మరల ఇట్లు పలికెను.
నారదమహర్షి పలికెను: “తత్త్వార్థకోవిదుడైన ఓ మహర్షీ! హరిభక్తిని ప్రసాదించునది, పరమ పవిత్రమైనది అగు ఏకాదశీవ్రతమును చెప్పితిరి. ఇప్పుడు వర్ణాశ్రమాచార విధిని ప్రాయశ్చిత్త విధిని వినగోరుచున్నాను. సర్వతత్తార్దములు తెలిసిన మహానుభావుడవు కావున నా మీద దయతలచి దీనినంతటిని యథావిధిగా వివరించుడు”
సనకమహర్షి పలికెను: “ఓ మునిశ్రేష్ఠా! భక్తులకు ప్రియమును కలిగించు శ్రీమహావిష్ణువు వర్ణాశ్రమాచారాపరులచే ఎట్లు పూజించబడునో వినుము. నీవు శ్రీమన్నారాయణునికి భక్తుడవు కావున మనువు మొదలగు వారు చెప్పిన వర్ణాశ్రమ ధర్మములను యథావిధిగా చెప్పెదను. బ్రాహణ క్షత్రియ వైశ్య శూద్రుఅఉ అనునవి నాలుగు వర్ణములు సుప్రసిద్ధములు. ఈ నలుగురిలో బ్రాహ్మణులు అధికులు. ఈ నలుగురిలో బ్రాహ్మణులు, క్షత్రియ వైశ్యులు ద్విజులు అనబడుదురు. మొదట జన్మ తల్లివలన రెండవ జన్మ ఉపనయనము వలన కలుగును. ఈ వర్ణములవారు తమ వర్ణానుగుణముగా సర్వధర్మములను ఆచరించ వలయును. స్వవర్ణ ధర్మత్యాగము చేసినవారు పాషండులు అనబడుదురు. తమతమ గృహ్య కల్పములలో చెప్పిన విధముగా ఆచరించు బ్రాహ్మణులు కృతార్ధులు అగుదురు. అట్లు ఆచరించనివాడు అన్ని ధర్మములనుండి బహిష్కరించబడి పతితుడగును. ఈ నాలుగు వర్ణముల వారు యథోచితముగా యుగధర్మమును స్వీకరించవలయును. స్మృతిధర్మమునకు విరోధము రాని దేశాచారమును స్వీకరించవలయును. వాఙ్మనః కర్మలచే ప్రయత్న పూర్వకముగా ధర్మమును ఆచరించవలయును. లోకముచే ద్వేషించబడునది అస్వర్గ్యమైనది ధర్మమైన ఆచరించరాదు. సముద్రయాత్ర, కమండలమును ధరించుట, బ్రాహ్మణులు అసవర్ణలగు కన్యలను వివాహమాడుట, భర్తతమ్ముని వలన సంతానోత్పత్తి, మధుపర్కమునందు పశువధ, శ్రాద్ధమున మాంసభక్షణము, వానప్రస్థాశ్రమము, అక్షతయోనియైన (అనగా వివాహమైనను భర్తృ సమాగముచేయకనే భర్త మరణించిన కన్యను) కన్యను మరల మరియొక వరునికిచ్చి వివాహము చేయుట, నైష్ఠిక బ్రహ్మ చర్యము, నరమేధాశ్వమేధ గోమేధ యాగములు, మహాప్రస్థానము అను ఈ ధర్మములను కలి యుగమున ఆచరించరాదని జ్ఞానులు చెప్పియున్నారు.
ఆయా దేశవాసులు ఆయా దేశ ఆచారములను స్వీకరించవలయును. అట్లు కానిచో సర్వధర్మ బహిష్కృతుడై పతితుడు అగును. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు సామాన్య కర్మలను చెప్పెదను. సావధాన మనస్కుడవై వినుము. బ్రాహ్మణులకు దానమును చేయవలయును. యజ్ఞములచే దేవ తలను పూజించవలయును. జీవనము కొరకు యాచన చేయవలయును. ఇతరులకు అధ్యాపనము చేయవలయును. యోగ్యులచే యాగములను చేయించవలయును. బ్రాహ్మణుడు సర్వదా జలసం బంధము కలిగియుండవలయును. వేదమును అగ్నిని స్వీకరించవలయును. తాను పరిగ్రహించదగిన ధనమునందు, ఇతరులు గ్రహించదగిన ధనమునందు సమబుద్ధిని చూపవలయును. సర్వలోక హితమును చేయుచు మృదువాక్యములను ఉపయోగించవలయును. బ్రాహ్మణుడు ఋతుకాలమున భార్యాగమనము చేయవలయును. ఎవరితోనూ అహితమును మాట్లాడరాదు. విష్ణుపూజాపరుడు కావలయును. క్షత్రియుడు కూడా బ్రాహ్మణులకు దానమును చేయవలయును. వేదములను అధ్యయనము చేయవలయును. యజ్ఞములతో దేవతలను పూజించవలయును. శస్త్రజీవిగా ఉండవలయును. ధర్మబద్ధముగా రాజ్యపాలన చేయవలయును. దుష్టశిక్షణ శిష్టరక్షణ కావించ వలయును. పశుపాలన, వాణిజ్యము వ్యవసాయము వేదాధ్యయనము వైశ్య కర్మలు. వివాహము చేసికొని క్రయవిక్రయమువలన శిల్పాది కర్మలవలన వచ్చిన ధనముతో ధర్మాచరణమును చేయ వలయును. శూద్రులు దానము చేయవలయును. శూద్రులు పాక యజ్ఞమును చేయరాదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల శుశ్రూషను చేయవలయును. ఋతుకాలమున స్వదారాగమనమును చేయ వలయును. సర్వలోకహితాకాంక్షిత, శుభకరత్వము, ప్రియవాదిత, అనాయాసము, మనోహర్షము, తితిక్ష, నిగర్విత ఇవి అన్ని వర్ణములకు సామాన్యధర్మములు. స్వాశ్రమోచిత కర్మలను ఆచరించు వారందరూ మునులే, ఆపదలో బ్రాహ్మణుడు క్షత్రియ ఆచారమును ఆశ్రయించవచ్చును. అత్యాపదలో క్షత్రియుడు వైశ్యాచారమును ఆశ్రయించవచ్చును. బ్రాహ్మణుడు ఎంతటి అపదలోనైనను శూద్రవృత్తిని ఆశ్రయించరాదు. బ్రాహ్మణుడు శూద్రవృత్తిని ఆశ్రయించినచో చండాలత్వమును పొందును. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు బ్రహ్మచర్యము గార్హస్థ్యము వానప్రస్థము భిక్షుతాలను నాలుగు ఆశ్రమమలు విధించబడినవి. అయిదవ ఆశ్రమము చెప్పబడియుండలేదు. ఈ నాలుగు ఆశ్రమములతో ఉత్తమ ధర్మము సాధించబడును. కర్మయోగమును ఆశ్రయించువారి విషయమున శ్రీహరి ప్రీతిచెందును. ఆశను వదిలివేసి శాంతచిత్తుడై కర్మయోగరతులైన వారు తిరిగిరాని పరమ పదమును చేరెదరు.