నారద మహా పురాణము
వేద చతుష్టయ స్వర వర్ణ వ్యవస్థా వర్ణనము
సూత మహర్షి పలికెను: నారద మహర్షి ఇట్లు సనందనమహర్షి మాటలను విని సంతృప్తి పొందని వానివలె భ్రాతయగు సనందనుని ఇట్లు పలికెను.
నారద మహర్షి పలికెను: ఓ మహానుభావా! నేనడిగిన విషయములన్నిటిని మీరు చెప్పితిరి. అయిననూ హరికథలను ఎన్నిమార్లు వినిననూ, ఆత్మకు సంతృప్తి కలుగుట లేదు. వ్యాస పుత్రుడగు శుకుడు పరమ ధర్మములను తెలుసుకొని అంతరంగమున బహిరంగమున తృప్తిని మహాసిద్ధిని పొందెనని వినియుంటిని. జీవునికి మహానుభావుల సేవ చేయనిదే విజ్ఞానము కలుగదు కదా? వ్యాసపుత్రుడు శైశవములోనే జ్ఞానమునెట్లు పొందెను? శుక మహర్షి జన్మ రహస్యమును, కర్మలను వినగోరు నాకు తెలుపుము. మీరు మోక్షశాస్త్రార్ధములను తెలిసిన మహానుభావులు.
సనందన మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా? సంగ్రహముగా శుకోత్పత్తిని చెప్పెదను వినుము. ఈ శుకోత్తత్తిని వినిన మానవుడు బ్రహ్మజ్ఞానమును పొందును. సంవత్సరములచే, ఫలితములచే, ధనముచే, బంధువులచే, ఋషులు ధర్మమును ఆచరించలేదు. అనూచానమునే ఆచరించిరి. అనూచానమే ఉత్తమము.
నారద మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా మానవుడు అనూచానుడెట్లగును? అనూచానమనగానేమి? ఆ కర్మను చెప్పుము. వినవలయునని నాకు కోరికయున్నది.
సనందన మహర్షి పలికెను: ఓ నారదా? అనూచాన లక్షణమును చెప్పెదను. వినుము. అనూచాన లక్షణమును తెలియువాడు సాంగవేదములను తెలియగలడు. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు అను ఈ ఆరు వేదాంగములను పండితులు తెలియుదురు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అను నీ నాలుగు వేదములని ధర్మ నిరూపణమున చెప్పబడినవి. గురువు వలన సాంగవేదములను అధ్యయనముచేయు మానవోత్తముడు అనూచానుడనబడును. స్వయముగా కోటి గ్రంథములను చదివిననూ అనూచానుడు కాజాలడు.
నారద మహర్షి పలికెను: వేదాంగముల లక్షణమును, వేదముల లక్షణమును విస్తరముగా తెలుపుము. ఓ మహానుభావా! నీవు సాంగవేదములందు విజ్ఞుడవు.
సనందన మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! నీవు చాలా కష్టతరమగు ప్రశ్నను అడిగితివి. వేదవేదాంగముల సారమును సంక్షేపముగా నిశ్చితముగా చెప్పెదను. మునులు ద్విజులు శిక్షలో స్వరము ప్రధానమని చెప్పియున్నారు. వేదవిదులు వేదములలో చెప్పిన వాటిని తెలిపెదను వినుము. ఆర్చికము, గాధికము, సామికము అని సర్వశాస్త్ర సిద్ధాంతముగా విశేషించి ప్రయోగించవలయును. ఏకమాత్రవ్యవధానము కల స్వరము ఋక్కులలో, గాధలలో మాత్రాద్వయ వ్యవధానముకల స్వరము, సామమున త్రిమాత్రవ్యవధానముగా ఉండును. ఇదియే సామాన్యముగా స్వర లక్షణము. యజ్ఞములలో ప్రయోగించబడు ఋక్సామ యజురంగములలో శిక్షా జ్ఞానము లేనిచో అపస్వరము కలుగును. స్వరహీనము వర్ణహీనమగు మంత్రమును అపరిశుద్ధముగా పలికినచో అభిప్రేతమగు అర్ధమును చెప్పజాలదు. అట్లు దుష్టమగు వాగ్వజ్రము యజమానికి హాని కలిగించును. ఇంద్రశత్రు పదము అపస్వరముగా పలికినందున ఇంద్రుని శమించేయువాడు అను అర్ధమును కాక ఇంద్రునిచే శమింప చేయబడువాడు అను అర్ధమును బోధించునటులు. వాఙ్మయమున వక్షస్థ్సలము, కంఠము, శిరము అని మూడు స్థానములు ఉండును. ఈ మూడింటినే సవనములు అందురు. అర్థమాత్రాంతరమున్నచో సామ అనికూడా అందురు. వక్షస్థ్సలము, కంఠము, శిరము, సప్తవివరములు కలిగి ఉండును. వివరములేనిచో స్వరము బయలుపరచ శక్యముకాదు. ఇదియే ప్రవచన విధి. కఠకాలాప వృత్తములలో తైత్తిర ఆహ్మరకములలో, ఋగ్వేదము ద్వితీయ తృతీయ స్వరములతో కూడా ఉండును. ఉచ్చ మధ్యమ సంఘాతమే స్వరము అనబడును. ఆహ్వరకములందు తృతీయ, ప్రథమ స్వరమును చెప్పవలయును. ద్వితీయమునుండి మంద్రము వరకు తైత్తిరీయ స్వరములందురు. సామగానము చేయు మునీశ్వరులు ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్ధ మంద్ర క్రుష్ట స్వరములను ప్రయోగింతురు. ద్వితీయ ప్రథమ స్వరములు నాండిబాల్లవులనబడును. ఇవియే వాజసనేయులకు శాతపధస్వరములు. వైదికులందరూ ఈ స్వరములను విశేషించి చెప్పియున్నారు. ఇదియే సర్వవేదముల స్వరముల సంగ్రహ చరిత్ర.
ఇక ఇపుడు సామవేదస్వరముల చరితమును చెప్పెదను వినుము. సామవేదాంగము అల్ప గ్రంథము విస్తరార్ధముగా ఉండును. ఈ సామవేదములో తాన రాగ స్వర గ్రామ మూర్ఛనా లక్షణములను తెలియుట పవిత్రము, పావనము, పుణ్యము. కావుననే నీకు చెప్పుచున్నారు. ద్విజులు అధ్యయనము చేయు ఋగ్యజుస్సామ లక్షణమునే శిక్ష అందురు. ఏడుస్వరములు, మూడు గ్రామములు, ఇరువది ఒకటి మూర్ఛనలు, నలుబది తొమ్మిది తానములు. ఇది అంతయు కలిసి స్వరమండలము అనబడును. షడ్జ, ఋషభి, గాంధార, మధ్యమ, పంచమ, ధైవత నిషాదములు అను ఏడు స్వరములు. షడ్జ మధ్యమ గాంధారములు అను మూడు గ్రామములు అనబడును. షడ్జము భూలోకమునుండి పుట్టును. భువర్లోకము నుండి మధ్యమము పుట్టును. సువర్లోకము నుండి గాంధారము పుట్టును. ఈ మూడు గ్రామ స్థానములు. స్వరములకు విశేషముగా గ్రామ రాగములకు పేరు. మధ్యమ గ్రామమున ఇరువది, పడ్జగ్రామమును పదునాలుగు రాగములుండును. సామ గానమును చేయువారు గాంధారమును పంచదశ తానములను చెప్పెదరు. నదీ, విశాలా, సుముఖీ, చిత్రా, చిత్రవతీ, ముఖా, బలా అను ఈ ఏడు దేవ మూర్ఛనలు. అప్యాయినీ, విశ్వభృతా, చంద్రా, హేమా, కపర్దినీ, మైత్రీ, బార్హతీ అను ఏడు మూర్ఛనలు పితృదేవతలవి. షడ్జమున ఉత్తరమంద్రము, ఋషభమున ఆరోహణము, గాంధారమున అశ్వక్రాంతము అను మూడవ మూర్ఛన ఉండును. మధ్యమమున సౌవీర, పంచమ స్వరమున హృషీకా, ధైవతమున ఉత్తరామూర్ఛన ఉండును. నిషాదమున రజనీ, ఇట్లు ఋషులకు ఏడు మూర్ఛనలు ఉండును. దేవతల సప్త మూర్చనలనే గాంధర్వులు గానము చేయుదురు. పితృదేవతల మూర్ఛనలను యక్షులు గానము చేయుదురు. ఋషుల సప్తమూర్ఛనలే లౌకికములు అనబడు చున్నవి. పడ్జస్వరము దేవతలకు ప్రీతి కలిగించును. ఋషభ స్వరము ఋషులను ప్రీతులను చేయును. గాంధారము పితృదేవతలను ప్రీతులను చేయును. మధ్యమ స్వరము గంధర్వులను ప్రీతులను చేయును. పంచమ స్వరము దేవతలను పితృదేవతలను ఋషులను ప్రీతులను చేయును. యక్షులను నిషాదము, ప్రాణి సమూహమును దైవతము సంతోషపరచును. గానమునకు దశ విధములుగా గుణవృత్తులు ఉండును. వినుము.
రక్తము, పూర్ణము, అలంకృతము, ప్రసన్నము, వ్యక్తము, వికృష్టము, శ్రక్ణము, సమము సుకుమారము, మధురము అని గానమున పదిగుణములుండును. వేణువీణా స్వరముల ఏకీభావము రక్తము అనబడును. స్వరశ్రుతి పూరణము వలన ఛందఃపాదాక్షర సంయోగము పూర్ణమగును. ఉరోభాగమున శిరోభాగమున, కంఠయుక్తమగుచో అలంకృతము అనబడును. గద్గదాది శంకలు లేని దానిని ప్రసన్నము అందురు. పదపదార్థ ప్రకృతివికార ఆగమ ఆదేశ కృత్తద్ధిత సమాస ధాతు నిపాత ఉపసర్గ స్వరలింగ వృత్తివారిక విభక్త్యర్ధవచనములను చక్కగా ఉపపాదించుట వ్యక్తము అనబడును. పెద్దగా ఉచ్చరించబడి, స్పష్టమగు అక్షరములు పదములు కలిగియుండుట విక్రుష్టము అనబడును. ద్రుతము, అవిలంబితము ఉచ్చనీచ ప్లుత సమాహార హేలతాల ఉపసయాదులగు ఉపపాదనలచే కూడియున్నది శ్లక్ణము అనబడును. ఆవాస నిర్వాప ప్రదేశములందు ప్రత్యంతర స్థాన సమాగమము సమమనబడును. మృదు పద వర్ణ స్వరనాద యుక్తము సకుమారము అనబడును. సమభావముచే కూర్చబడిన లలితపద అక్షర గుణసమృద్ధము మధురము అనబడును. ఇట్లు ఈపదిగుణములచే కూడియున్న దానిని గానమందురు. ఈ విషయమున కొన్ని శ్లోకములు కలవు.
శంకితము, భీషణము, భీతము, ఉద్ఘుష్టము, అనునాసికము, కాకస్వరము, మూర్ధగతము, స్ధానవివర్జితము, విస్వరము, విరసము, విశ్లిష్టము, విషమాహతము, వ్యాకులము, తాలహీనము అని గీతమునకు పదునాలుగు దోషములు ఉండును. ఆచార్యులు సమముగా ఉండవలయునని భావింతురు. పండితులు పదచ్ఛేదమును కోరెదరు. స్త్రీలు మధురగుణమును అభిలషింతురు. ఇతరజనులు విక్రుష్టమును కోరెదరు. (స్పష్టాక్షర పదవత్త్వము) షడ్జముయొక్క వర్ణము పద్మ పత్రము వలె ఉండును. ఋషభము చిలుక పచ్చన, గాంధారము కనక వర్ణము. మధ్యమము మల్లె పూవురంగు కలిగి ఉండును. పంచమము కృష్ణవర్ణము. ధైవతము పీతవర్ణము, నిషాదము సర్వవర్ణసంయుతము. ఇవి స్వరముల వర్ణములు. పంచమ మధ్యమ షడ్జస్వరములు బ్రాహ్మణజాతివి. ఋషభ దైవత స్వరములు క్షత్రియములు. గాంధార నిషాదములు వైశ్యజాతివి. గాంధార నిషాదములు అర్ధ పతితములైనచో శూద్రజాతికి చెందును. మూర్ఛనావర్జితమై దైవత సహితముగా ఋషభ పంచమములు ఉన్నపుడు మధ్యమరాగమున నిపలుంచినచో అదిషడ్జము వలన కలిగిన నిషాదమనబడును. పంచమ స్వరవిరామముతో గాంధారము అంతస్వరముగా ఉండి నిషాదసహితమగు ఋషభమును పంచమమని తెలియవలయును. గాంధారస్వరాధి పత్యమున్నచో నిషాద స్వర గమనాగమనములచే ధైవత దౌర్బల్యము వలన ఉండునది మధ్యమ గ్రామము అనబడును. కొంచెము నిషాద స్పర్శ కలిగి, గాంధారము అధికముగా ఉండి, దైవత కంపమున్నచో షడ్జగ్రామమగును. అంతర స్వరములతో కాకలి కనబడినచో అది పంచమస్ధమగు కైశికమను సాధారణ గ్రామమగును. అంతట అన్ని స్వరములచే కైశికమును భావించి మధ్యమమున నుంచినచో నది కైశిక మధ్యవమము అనబడును. కాకలి స్వరముండి కూడా పంచమ ప్రాధాన్యము కలిగి ఉన్నచో మధ్యమ గ్రామ సంభవమగు కైశికమని కశ్యపుడు చెప్పెను. గంధర్వ శబ్దములో గకారము గేయమును, ధకారము కారువాదనమును, వకారము వాద్యమును చెప్పును. సామగానము చేయువారికి ప్రథమ స్వరము వేణువునకు మధ్యమస్వరమగును. రెండవది గాంధారము, మూడవది ఋషభము, నాలుగవది షడ్జము, అయిదవది ధైవతము, ఆరవది నిషాదము, ఏడవది పంచమ స్వరము. మయూరము షడ్జమును పలుకును. గోవులు ఋషభమును, మేకలు గొఱ్ఱెలు గాంధారమును, క్రౌంచము మధ్యమమును, పూవులు పూయు కాలమున కోకిల పంచమ స్వరమును పలుకును. అశ్వము ధైవతమును, ఏనుగు నిషాదమును పలుకును. షడ్జము కంఠమునుండి వెడలును, శిరస్సు నుండి ఋషభము, గాంధారము అనునాసికము నుండి, ఉరోభాగము నుండి మధ్యమ స్వరము, ఉరోభాగము నుండి, శిరస్సు నుండి కంఠము నుండి పంచమ స్వరము వెలువడును. లలాటమునుండి ధైవతము, సర్వసంధుల నుండి నిషాదము వెలువడును. నాసిక, కంఠము, వక్షస్థ్సలము, తాలువు, జిహ్వా, దంతములు అను ఈ ఆరింటినుండి వెలువడును. కావున షడ్జస్వర మందురు. నాభి నుండి పుట్టిన వాయువు కంఠ శీర్షములచే కొట్టబడి ఋషభమువలె నినదించును కావున ఋషభ మందురు. నాభి నుండి పుట్టిన వాయువు కంఠశీర్షములచే కొట్టబడి పవిత్ర వాయువును వదులును కావున గాంధారమందురు. నాభినుండి పుట్టిన వాయువు వక్షస్థ్సలమున హృదయమున కొట్టబడి మరల నాభిదేశమున చేరి మధ్యవర్తి అగును కావున మధ్యమమనబడును. నాభి నుండి బయలు వెడలిన వాయువు ఉరోహృత్కంఠములచే కొట్టబడి పంచస్థానములనుండి వచ్చును కావున పంచమము అనబడును. ధైవత నిషాదములను వదిలి మిగిలిన అయిదు స్వరములు పంచస్థానములనుండి పుట్టినవే అని తెలియుము. పంచస్థానములలో నుండియే అన్ని స్థానములను ధరించును. షడ్జము అగ్నిచే గానము చేయబడునది. ఋషభమును బ్రహ్మ, గాంధారమును చంద్రుడు, మధ్యమమును విష్ణువు, పంచమమును నీవు (నారదుడు) ధైవత నిషాదములను తుంబురుడు గానము చేయును. షడ్జమునకు అధిదేవత బ్రహ్మ, ఋషభమునకు అగ్ని, గాంధారమున గోవులు, పంచమమునకు చంద్రుడు, ధైవతమునకు బ్రహ్మ అధిదేవతలు. గ్రామమును చేరి చంద్రునివలె హ్రాసవృద్ధులు కలది కావున తనకంటే ముందున్నస్వరములచే సంధానము చేయబడుచున్నది కావున ఈ స్వరమును ధైవతమందురు. అన్ని స్వరములు చేరియుండును కావున నిషాదమని పేరు. ఈ నిషాదస్వరము అన్ని స్వరములను కప్పివేయును. కావున నిషాదమునకు సూర్యుడు దేవత.
గానజాతులలో దారవీ గాత్రవీణ అని రెండు వీణలుండును. సామగానమును చేయునది గాత్రవీణ అందురు. ఆ గాత్రవీణలక్షణమును చెప్పెదను వినుము. సామగానము చేయువారు దేనియందు గానము చేతురో, దానిని గాత్రవీణ అందురు. స్వరవంజనములతో కూడినదై అంగుళులచే అంగుష్ఠముచే రంజితమై జానువులపై హస్తములను కలిపి ఉంచవలయును. గురువును అనుకరించవలయును. లేనిచో భిన్నమతి యగును. మొదట ప్రణవమును ప్రయోగించవలయును. తరువాత భూః, భువః, సువః అను వ్యాహృతులను ప్రయోగించవలయును. తరువాత సావిత్రీ మంత్రమును ప్రయోగించవలయును. అపుడు గానమును ఆరంభించవలయును. అన్ని అంగుళులను చాచి స్వరమందలమును ఆరోపించవలయును. ఇతరాంగుళులతో అంగుష్ఠమును, అంగుష్ఠముతో ఇతరాంగుళులను స్పృశించరాదు. అంగుళులను ఎక్కువ వ్యవధానము ఉంచరాదు. అంగుళుల మూలమును స్పృశించరాదు. అంగుష్టాగ్రముతో మధ్యమ పర్వను (రేఖను) సృశించవలయును. విభాగమును చక్కగా తెలిసిన వారు ఏకమాత్ర ద్విమాత్రావిభాగమును తెలుపుటకు అట్లు మధ్యమ పర్వను స్పృశించవలయును. వామహస్తముయొక్క అంగుళులతో ద్విమాత్రాస్థితిని తెలుపవలయును. మూడు రేఖలున్న ప్రదేశమున స్వరసిద్ధిని చూపవలయును. ఆత్రి రేఖలున్న ప్రదేశమునే పర్వ అందురు. మిగిలిన భాగము మధ్య భాగము అందురు. సామ వేదమున పర్యాంతరమును ఋగ్వేదమున తిలాంతరము ఆచరించవలయును. మధ్యమ పర్వంయందు స్వరములను చక్కగా నివేశించ వలయును. ఈ విషయము ఏ శరీరావయవమును కొంచెము కూడా కదిలించరాదు. క్రింద మృత్తు నుంచి హస్తమాత్రమున యథా క్రమముగా మేఘముల మధ్యన మణి సూత్రమువలె ఉండు మెరుపువలె పృషచ్ఛేద వివృత్తులకు బాలులలో కర్తరివలె, తాబేలు తన అవయవములను తనలో దాచుకొనినట్లు అన్ని వ్యాపారములను మాని మనసును నిలుపవలయును. స్వస్థుడై ప్రశాంతుడై భయము లేనివాడై జ్ఞాని వర్ణములను చర్చించవలయును. నాసికయొక్క పూర్వభాగమున గోకర్ణమువలె హస్తమును ఉంచవలయును. హస్తాగ్రమున దృష్టినుంచి శాస్త్రార్ధమును చింతన చేయవలయును. హస్తముతో నోటితో చక్కగా వాక్యమును పలుకవలయును. వర్ణములను ఉచ్చరించుట సమాప్తిగావించుట ఒకే విధముగా చేయవలయును. ఎక్కువగా తక్కువగా రాగ ప్రస్తారము చేయరాదు. ఎక్కువగా ఉచ్ఛస్వరముతో గానము చేయరాదు. శరీరావయవములను స్వరములను కంపన చేయరాదు. ఆకాశమున వాయుస్థితివలె సామమును సమముగా గానము చేయవలయును. జలములో చక్కగా సంచరించుచున్ననూ, మీనముల అడుగులజాడ కనపడదో, ఆకాశమున విహరించుచున్ననూ పక్షుల పాద చిహ్నములు స్పష్టముగా తెలియవో అట్లె స్వరములో శ్రుతి ఉండి లేనట్లుండవలయును. పెరుగులోని నేతిని, కాష్ఠములోని అగ్నిని ప్రయత్నముచే పొందునట్లు స్వరములోని శ్రుతిని ప్రయత్నముచే తెలియవలయును. ఒక స్వరము నుండి మరొక స్వర సంక్రమమును స్వర సంధిని ఎదుటి వారిని క్షోభింపచేయక, విచ్ఛిత్తి కలుగనీయక కొద్దినీడతో కూడిన ఎండవలె సమముగా చేయవలయును. అనాగతము, అతిక్రాంతము, విచ్ఛిన్నము, విషమాహతము, సూక్షాంతము, అంతము లేకుండుటను కర్షణమును పండితుడు వర్జించవలయును. స్థానము నుండి చ్యుతమైన స్వరము తన స్థానమును అతిక్రమించినచో సామగానమును చేయువారు విస్వరమందురు. వీణాగానము చేయువారు విరక్తమందురు. అభ్యాసము కొఱకు ద్రుత వృత్తిని, ప్రయోగము కొఱకు మధ్యమావృత్తిని శిష్యోపదేశము కొఱకు విలంబిత వృత్తి ఆశ్రయించవలయును. గ్రంథమును గ్రహించి, గ్రంథమును ఉచ్చరించుట నేర్చుకొనువారికి శిక్షావిధిని అనుసరించి హస్తముతో అధ్యాపనమును చేయవలయును. క్రుష్టస్వరమునకు స్థానము మూర్ధ, ప్రథమ స్థానము లలాటము ద్వితీయమునకు స్థానము భ్రూమధ్యము. తృతీయమునకు స్థానము కర్ణములు. చతుర్ధ స్థానము కంఠము, మంద్రమునకు స్థానము రసన (నాలుక) అతిస్వరము నీచ స్వరమునకు హృదయము స్థానము. అంగుష్ఠోత్తమ భాగమున క్రుష్టస్వరమును, అంగుష్ఠమున ప్రథమ స్వరమును, ప్రదేశనియందు గాంధారమును, దాని తరువాత ఋషభమును, అనామికయందు షడ్జమును, కనిష్టయందు ధైవతమును కనిష్ఠము క్రింది భాగమున నిషాదమును చూపవలయును. పర్వలు లేకుండుటచే, మధ్యము లేకుండుటచే, వ్యయములేకుండుటచే ఎప్పుడూ మందీ భూతముగానుండు మంద్రము పరిస్వారము అనబడును. క్రుష్టస్వరముచే దేవతలు, ప్రథమముచే మనుష్యులు, ద్వితీయముచే పశువులు, తృతీయముచే గంధర్వాప్సరసలు, పక్షులు పితృదేవతలు నాలుగవ స్వరముచే, పిశాచ అసుర రాక్షసులు మంద్రస్వరముచే, అతిస్వరముచే, నీచముచే స్థావర జంగ మాత్మకమగు ప్రపంచము జీవించుచున్నది. సామిక స్వరముతో అన్ని ప్రాణులు తమ ప్రాణములను నిలుపు కొనుచున్నవి. దీప్తాయత కరుణము, మృదుమధ్యమములను శ్రుతుల విశేషములను తెలియనివాడు ఆచార్యుడన బడడు. దీప్త శ్రుతిని మంద్రమున ద్వితీయమున చతుర్ధమున, అతి స్వరమున, తృతీయమున ప్రయోగించవలయును. క్రుష్టస్వరమున కరుణశ్రుతిని ప్రయోగించవలయును. ద్వితీయమునకు మృదుమధ్య ఆయత శ్రుతులను ప్రయోగించ వలయును. ఆ శ్రుతుల లక్షణములను కూడా విడివిడిగా చెప్పెదను వినుము. నీచమున ఆయత శ్రుతి, ఉచ్చలో మృదుశ్రుతి స్వీయస్వరమున మధ్యమ శ్రుతిని చక్కగా విచారించి ప్రయోగించవలయును. ద్వితీయమున విరతమైనది, పరమున క్రుష్టమైగును. మొదట మృదువుగా ఉండి విరతమై చతుర్ధస్వరమున ప్రవర్తించునది, మంద్రమున ప్రయోగించునది, సామ సమాప్తిలో ఉపయోగించునది దీప శ్రుతి అని తెలియవలయును. స్వరములు మధ్యన తార శ్రుతిని ప్రయోగించరాదు. ఊషులతో (శషసహ) పదాంత స్థిత సంధికి రెండు గతులుండును. ఈ అయిదు స్థానములను ఘుటి అని అందురు. స్వరాంతరా విరతములు హ్రస్వదీర్ఘ ఘటికలు అను శ్రుతి స్థానములలో శ్రుతులవలెను స్వరములను చెప్పవలయును. ఉదాత్త స్వరిత స్వరములలో దీప్తాశ్రుతిని, అనుదాత్తమున మృదుశ్రుతిని ప్రయోగించవలయును. శ్రుతి సంపదలో గంధర్వులు నిష్ణాతులు. ఉదాత్తము అనుదాత్తము, స్వరితము, ప్రచితము నిఘాతము అని స్వర భేదములు అయిదు విధములు. ఇక నిప్పుడు ఆచిక స్వర త్రయమును చెప్పెదను వినుము.
ఉదాత్తము అనుదాత్తము స్వరితము అని మూడు స్వరములు ఉదాత్తము అనునదే స్వరితము కంటే పరముగా ఉండును. స్వరితము కంటే పరముగా ఉన్న ఉదాత్తమును ప్రచయము అందురు. ఇచట ఇంకొక స్వరముండదు. వర్ణస్వరము, అతీతస్వరము అని స్వరితము రెండు విధములు. మాత్రాస్వరము, దీర్ఘము అతీత స్వరము అనబడును. ఈ స్వరము ప్రత్యయమును అనుసరించి ఏడు విధములు అగును. ఎచ్చట ఏ స్వరముండునో పదమును అనుసరించి తెలియవలయును. సమర్ధుడగు శ్రోతకు ఏడు స్వరములను ప్రయోగించవలయును. పుత్రుల శిష్యుల హితమును కోరిన ఆచార్యులు శాస్త్రమునేర్పరచిరి. ఉచ్ఛమునకంటే ఉచ్చతరము, నీచముకంటే నీచతరము లేదు. వైస్వర్యమున స్వారమున ఏస్థానమును స్వరముగా పలుకవలయునో తెలియుము. ఉచ్చ నీచముల మధ్యమున నున్న దానిని సాధారణమందురు. గానశాస్త్ర శిక్షకులు స్వార సంజ్ఞలో ఈ సాధారణమునే స్వారమని అందురు. ఉదాత్తస్వరము నిషాదగాంధారములను, అనుదాత్తస్వరమున ఋషభదైవతములను ప్రయోగించవలయును. షడ్జమధ్యమ దైవతములు స్వరితము నుండి పుట్టినవి. జిహ్వామూల ప్రయోజనములుగాగల ‘కఖ’లు పరముగానున్న శషసహలను కూడా మాత్రా ప్రకృతి చేతనే ప్రయోగించవలయును. దానినే కల అందురు. జాత్యము, క్షైప్రము, అభినిహితము, అవ్యంజనము, తిరోవిరామము, ప్రశ్లిష్టము, అపాదవృత్తము అని మరియొక ఏడు స్వరములు గలవు. ఈ స్వరముల లక్షణములను విడిగా చెప్పెదను. ఈ స్వరములను ప్రయోగించు ఉద్దేశ్యములను ఉదాహరణములను కూడా చెప్పెదను. సకారముతో కాని వకారముతో కాని కూడియున్న అక్షరము స్వరితమగును. ముందు ఉదాత్తము లేనిచో జాత్యస్వారమందురు. ఇకార ఉకారములు ఉదాత్తములుగా ఉన్నను కొన్నిచోట్ల ప్రకార వకారములు అనుదాత్త స్వరముకల ప్రత్యయము పరముగా ఉన్ననూ క్షైప్రస్వరమని తెలియ వలయును. ఉదాత్తములైన ఏకార ఓకారములచే ఆకారము ఉదాత్తమగుచో, అకారము లోపించినపుడు అభినిహిత స్వరమందురు. ఉదాత్తపూర్వమగు ఏదో ఒక ఛందస్సున స్వరిత మొచ్చినచో, సర్వస్వరితములు కలది కూడా అవ్యంజన స్వరము అనబడును. అవగ్రహము తరువాత స్వరితమున్నచో ఉదాత్తము అవగ్రహమైనచో తిరోవిరామమగును. ఇకారముచే ఇకారము కలిసియున్నచో ఉదాత్తము అనుదాత్తముచే కూడిన ప్రశ్లిష్టమగును, స్వరిత స్వరమున సంహిత వివృతమైనచో పాదాత వృత్తముగా తెలియవలయును. తానస్వరము జాత్యముచే శ్రుత్యగ్రమున కలిసియున్నచో క్షైప్రము అనబడును. అవియే అభినిహితమైనచో అవ్యంజనమనబడును. విషుషితమున తిరోవిరామము అగును. ‘హీ’ ‘ఈ’ ‘గో’ వర్ణములు ప్రశిష్టము లనబడును. పాద వృత్తమున ఈ ఏడు స్వరములను తెలియవలయును. ఉచ్చమగు ఒక అక్షరమున కంటే పూర్వమున స్వరము కలిగి ఉండుట జాత్యవర్జితములగు స్వరములకిట్లుండుట స్వభావము. మొదట నాలుగు స్వారములుండును. ‘కం’, ‘షం’, ‘పుం’, ‘స్సు’ అనునవి. ఉదాత్తమున ఒక నీచ స్వరమున అగ్ని హోమము దృష్టాంతము. మొదట ఇకారాంతమగు పదముండి పరమున ఉకారమున్నచో దానిని హ్రస్వకంపమని తెలియవలయును. ఇకారాంత పదమున పరమున ఉకార ద్వయమున్నచో దీర్ఘ కంపమని తెలియవలయును. సంధ్యక్షరములలో మూడు దీర్ఘములుండును. మిగిలినవి హ్రస్వము లుండును. ‘న ఇంద్రభ్యాం’ అనునపుడు మూడు దీర్ఘములున్నవి. మిగిలినవి హ్రస్వములు. అనేకోదాత్తములగు అనుదాత్త ప్రత్యయమున్నచో శివకంపమని తెలియవలయును. రెండుకంటే ఎక్కువ ఉదాత్తక్షరములకు నీచముకాని ఉచ్చముకాని పరమగునపుడు అచట ఉదాత్తముచే చెప్పుకొన వలయును. రేఫయందు హకారమునందు ఎప్పుడూ ద్విత్వము రాదు. వర్గ ద్వితీయ వర్ణములందు వర్గ, చతుర్ధ వర్ణములందు కూడా ద్విత్వమురాదు. చతుర్థమును తృతీయముతో, ద్వితీయమును ప్రథమముతో కలిసియున్నపుడు ఆదిమధ్య అంత్య వర్ణములను స్వరాక్షరముచే పీడించ వలయును. అనన్యము పూర్వమున అంత్యము పరముననున్నచో ఆ రెంటి మధ్యన ఉన్న దానిని యమము అందురు. ఈ యమము పూర్వ వర్ణముతో సవర్ణమగును. ‘శష’శలతో కాని ‘యరలవ’లతో కాని వర్గాంత్యములచే కలిసి ఉన్నచో పరదేశమును బాటసారులు విడుచునట్లు యమములు నివర్తించును. తృతీయ వర్ణము చతుర్ధ వర్ణము చతుర్ధాది వర్ణములు పరముగా గలదిగా ఉన్నచో పదమగును. రెండు తృతీయ వర్ణములు హకారము హకార పరముగా ఉన్నచో పదమగును. ఈ పదములు అనుస్వారోపధా మూలములుగా క్రమముగా పరములగును. పూర్వము రేఫహకారములతో సంయుతమైనచో, క్రమముగా ఉత్తరాక్షరములుగా ఉండును. పదాంతమున సంయోగమున్నచో అంత్యమున వ్యంజనముండును. మొదట ఆగమాదులను చేయవలయును. పరాంగమునందు ఆగమమును నివేశించవలయును. సంయోగమున స్వరితమున్నచోట ఉద్ఘాతము గాని ప్రతనము కాని ఉన్నచో దానిని పూర్వాంగమని తెలియవలయును. ఆరంభించునది పరమగును. సంయోగమునకు పరముగానున్న దానిని సంయోగనాయకము అందురు. సంయుక్త వర్ణమును పరమున పూర్వమున నున్న అక్షరము పదాంతరమగు అనుస్వరము స్వప్రత్యయమున క్రమజమందురు. స్వరభక్తి రేఫ పూర్వాంగము అగును. పాదాది యందు ఆపాదాదియందు సంయోగమునందు అవగ్రహమునందు యశబద్దముగా తెలియుము. ఇతరము సయమగును. పాదాదిలో విచ్చిత్తి కలుగనిచో సంయోగంతమున ఉన్న రేఫ హకార పకారములను వదిలి ఉపదేశము కనపడును. సంయుక్తమైన వర్ణము అనుస్వర యుక్తమగు వర్ణము గురువగును. దీనినే స్ఫుటమందురు. హ్రస్వశేషము ‘హ్రీగో’ వర్ణములు యుగళాదులు అవిస్ఫోటమందురు. ఆ పదముననున్న ఉదాత్తము, స్వరితము, ఉదాత్తముగా స్వరితముగానే ఉండును. నీచము నీచముగానే ఉండును. ప్రచయస్ధము కూడా నీచమే ఉగును. ‘అగ్ని’, ‘సుత’, ‘మిత్ర’ శబ్దములు ‘ప్రియ’, ‘దూత’, ‘ఘృత’ ‘చిత్త’ ‘మతి’ శబ్దములలో నీచ స్వరము ఉండును. అక్వసుత యజ్ఞ కలశ, శత పవిత్ర శబ్దములలో నీచ స్వరము నుండి ఉచ్చారణ ప్రారంభించవలయును. ‘హారివరుణ’ ‘వరేణ్య’ ‘ధారా’ ‘పురుష’ శబ్దములలోని రేఫ స్వరితమగును. విశ్వానర శబ్దమున నకారము, ఇతర శబ్దములలో నకార రేఖలు స్వరితములగును. వరుణ శబ్దమున వకారము నుండి రెండు వర్ణములు స్వరితములు ఉండును. ‘వరుణ’ ‘ధారా’శబ్దము ఉదాత్తమగును. ఇట్లే ‘ఉరుధార’ ‘ఓరుధారా’ శబ్దములలో తెలియవలయును. ఈ శబ్దములలో ఏకమాత్రికము, ద్విమాత్రికము స్వరితమగుచో మొదటి సగము ఉదాత్తమగును. మిగిలినది అనుదాత్తమగును. రెండు స్వరములు ప్రయోగించ బడినచో దీర్ఘము కాని దానిని కూడా దీర్ఘముగా చేయవలయును. స్వరితమును కంపము చేయవలయును. హ్రస్వమును కర్షణము చేయవలయును. మాత్రయనగా నిమేషకాలము లేదా విద్యుత్కాలము అని తెలియవలయును. ఋక్స్వరములు కూడా ఇట్లే యుండునని కొందరు చెప్పెదరు. సమాసమున అవగ్రహమును (సంధి - విచ్ఛేదమును) చేయవలయును. పదమును అనుసంహితముగా పలుకవలయును. మిత్రపుత్ర సఖి శబ్దములు, అహి శత క్రతుశబ్దములు అవగ్రహములుకలవి. ఆదిత్య, విప్ర, జాత వేద, సత్పతి, గోపతి వృత్రహసముద్ర శబ్దములు స్వరయుతములు, చికితములు, ధకారము అవగ్రహ ములుకావు. ఇచట నాలుగు వివృతలు ఉండునని నా అభిప్రాయము. ఈ వివృతులు అక్షర నియోగముచే ఏర్పడును. ఈ వివృతుల పేర్లను చెప్పెదను వినుము.
హ్రస్వదివత్తు, సానుసృతా, ముందు వత్సానుసారిణీ, ఉభయత్రపాకవతి అని నాలుగు వివృతులు. ఈ నాలుగింటికి హస్వా, దీర్ఘా, వృద్ధా, పిపీలికా అని పేర్లు. నాలుగు వివృతులకు వ్యవధానము ఒక మాత్ర ఉండును. ఇతరములకు అర్ధమాత్రము, మిగిలిన వాటికి అణుమాత్రము వ్యవధానము ఉండును. రేఫలో శషసహలలో మకారము ఉండి ప్రత్యయమున అనుస్వారము, పర్వములలో పరసవర్ణము, స్పర్శలలో (క నుండి మ వరకు) ఉత్తమాపతిని, పూర్వము నకారాంత పదముండి పరమున స్వరమున్నచో తకారముతో కూడియున్న కారమును ‘రక్తము’ అని అందురు. పూర్వము నందు నకారాంత పదముండి యవహ మొదలగునవి వ్యంజనములచే కూడి ఉన్నపుడు, పూర్వమున అర్ధమాత్ర. అణుమాత్రముతో రక్తమగును. నకార స్వరసంయుక్తము నాలుగింటిచే యుక్తమై విధించబడినపుడు రేఫరంగము లోపము కొన్నిచోట్ల సానుస్వారముగా ఉండును. రంగము హృదయము నుండి వెలువడును. కాంస్యముతో కూడి ఉండును. మృదుస్వరముగా ద్వి మాత్రముగా ఉండును. దీనికి ఉదాహరణము ‘దధన్వాం’ అనునది. సౌరాష్ట్రికనారి ‘అరాం’ అని పలుకునట్లు రంగమును ప్రయోగించవలయును. ఇది నా అభిప్రాయము. శషసహలతో కూడిన గ,డ, ద, బ లు ఙ, ణ నమలు స్వరములు (అచ్చులు) నాలుగు పదజాతులను పది పదాంతములు చెప్పబడినవి. ఉచ్ఛస్వరము, నీచస్వరము, స్వరిత స్వరము అని. ఈ స్వరమున్న ప్రదేశమున వ్యంజనములు ఉండవు. ఈ మూడు స్వరములు స్వరప్రధానములుగా ఆచార్యులు ప్రతిజ్ఞ చేసిరి. స్వరములు సూత్రమువంటివి. వ్యంజనము మణివంటిదని తెలియుము. దుర్బలుడగు రాజు యొక్క రాజ్యమును బలవంతుడగు రాజు హరించునటుల, దుర్భలమైన వ్యంజనమును బలవత్తైన స్వరము హరించును. ఉభావము, వివృత్తి శషసలు, రేఫ, జిహ్వా మూలములు, ఉపధ్మానీయములు అను ఎనిమిది ఊష్మల స్వరూపము, సంహితలో కలుగు స్వర ప్రత్యయ వివృతి ప్రదేశమున విసర్గలను చెప్పకొనవలయును. ఇచట తాలవ్యవర్ణములుండును. సంధ్యక్షరము పరముగా ఉన్నపుడు సంధిలో యకార వకారములు లోపించినచో అచట వ్యంజన వివృత్తి స్వరసంహిత ఉండునని తెలియుము. ఊష్మాంతముచే పదము ముగియునపుడు సంభావమగుచో స్వరవివృతి అని తెలియవలయును. ‘ఉ’భావముచే కలిసిన ఋకారము ఆదియందున్న పదము పరముననున్నచో స్వరాంతవివృతి అనబడును. మిగిలిని ఊష్మలకు వ్యక్తి వివృతి కలుగును. పదాంతములందు ప్రథమాక్షరములు, చివరి అక్షరములు (వర్గలలో) ఉన్నచో శషస ప్రత్యయములు ద్వితీయ స్థానమును పొందినచో ఊష్మ యుక్తములగు ప్రథమ వర్ణములను ద్వితీయ వర్ణములవలె చూపవలయును. కాని వీటిని ద్వితీయములుగా నియమించరాదు. మత్స్య, క్షుర, అప్సర అనునవి దృష్టాంతములు. ఛందస్సునకు మానము వృత్తము. పాదస్థానమునకు కారణత్రయము ఉండును. ఋక్కులు స్వచ్ఛంద వృత్తములుగా ఉండును. అక్షరముల మానమును అనుసరించి పాదములుండును. ఋక్కులను స్వరభక్తిని ఛందోమానముచే చూపవలయును. స్వరభక్తితో రేఫలేని దానిని గుర్తించవలయును. ‘ఋ’ వర్ణములో విడిగా ఉండు రేఫజ్ఞానము నిష్ప్రయోజనమే అగును. ఊష్మలచేకూడిన ఋకారమును లఘువుగా తెలియవలయును. ఊష్మలతో కూడిన ఋకారము పీడించ బడినచో గురువుగా తెలియవలయును. ఇచట తృచ్ అనునది ఉదాహరణము. ఋషభ, బృహస్పతి, గృహీత, పృథివి, నిరృతి శబ్దములలో ఉన్న అయిదు ఋకారములు గురువులే యగును. ఈ విషయమున సంశయము లేదు. శషసహరలు ఆది యందుగల పదములలో నున్న రేఫద్విపద సంధిలో ఉన్న రేఫ స్వరభక్తి అగును. ఇ ఉ వర్ణ రహితమైనది, క్రమ రహితమైన ఏకపదములోని ఋకారము కూడా స్వరభక్తి అగును. స్వరభక్తి రెండు విధములు, ఋకారమునందు రేఫయందు ఉండును. నియమించబడిన అక్షరములను చింతించు వారు ఈ స్వరభక్తిని స్వరోద వ్యంజనోదయని అందురు. శషసలలో నున్న స్వరభక్తిని స్వరోదయ అందురు. హకారము నున్న స్వరభక్తిని వ్యంజనోదయ మందురు. శషసలలోని ఋకారమును విషృతముగా హకారములోని ఋకారమును సంవృతముగా తెలియుదురు. స్వరభక్తిని ప్రయోగించు వారు మూడు దోషములను వర్ణించవలయును, ఇకారమును, ఉకారమును, గ్రస్త దోషమును, సంయోగపరమైన ఛకారమును, విసర్గలను, ద్విమాత్రక వర్ణమును, అంతమున నున్న చ, న, జ్, మ, సకారములను, అనుస్వారమును, ఘుటితమును విడువలయును. ఏ వృత్తములో ప్రథమపాదము తృతీయ పాదము ద్వాదశ మాత్రలు కలదిగా, ద్వితీయపాదము అష్టాదశ మాత్రలు కలదిగా, చతుర్ధపాదము పంచదశ మాత్రలు కలదిగా నుండునో దానిని విపుల వృత్తమందురు. సంయోగము పరమునందు లేని హ్రస్వాక్షరములు లఘువులని, సంయోగము పరమందున్న హ్రస్వాక్షరములు, దీర్ఘాక్షరములు గురువులని తెలియవలయును. స్వరమున కంటే ముందు వివృతి ఉన్నచో అది గురుస్వరముగా తెలియబడును. అచక క్షైప్ర స్వరముండదు. పదములలోని స్వరములు అష్టవిధములని తెలియుము.
అంతోదాత్తము, ఆద్యుదాత్తము, ఉదాత్తము, అనుదాత్తము, నీచస్వరితము, మధ్యోదాత్తము, స్వరితము, ద్విరుదాత్తము అని ఎనిమిది పదస్వరముల పేర్లు. అగ్ని, సోమ, ప్రవ, వీర్యం, హవిషా, స్వ, వనస్పతి అను శబ్దముల లోపల మధ్యమున నున్న స్వరములు అనునిపాతము చేయబడి మొదటి దానికంటే పరమున ఉన్నది స్వరితమని, ఉపసర్గలో ద్విరుదాత్తమని, ఆఖ్యాతమున నీచ స్వరితమని, స్వరితము కంటే పరమందున్న వాటిని నిపాతములుగా తెలియవలయును. ప్రచయమున ఉన్న అన్ని స్వరములలో ఉదాత్త సమీపవర్తి అనుదాత్తమగును. ప్రచయమున్న ప్రదేశమున స్వరమును అనుదాత్తముగా పలుకవలయును. కేవల స్వరితమున్నచో మృదు స్వరమును ఉపయోగించ వలయును. ఆచార్యులు చెప్పుట అయిదు విధములు. ‘సుఖము’, ‘న్యాసము’, ‘కరణము’, ‘ప్రతిజ్ఞ’, ‘ఉచ్చారణము’ అని ఈ విషయమున శ్రేయోదాయకమగు పద్ధతిని చెప్పెదను. వైశ్యులు ప్రతిజ్ఞచే ఉచ్చరించుట యుక్తము. ఏ వర్ణమునకైనను కరణము లభించదు. ప్రతిజ్ఞ మాత్రమే స్వీకరించ వలయును. కరణము కూడా ప్రతిజ్ఞాత్మకముగా ఉండును. తుంబురుడు, నారదుడు, విశ్వావసువు మొదలగు గంధర్వులు సామములో నిక్షిప్తమగు కరణమును స్వర సూక్ష్మత వలన తెలియరు. జఠరాగ్నిని ఎప్పుడూ తగిన ఆహారపానీయము లచే రక్షించవలయును. జీర్ణమగు ఆహారమునే భుజించవలయును. ఉషఃకాలమున లేచి బ్రహ్మను ధ్యానము చేయవలయును. వేదమును వల్లె వేయవలయును. శరదృతువు హేమంతర్తువునందు మధ్య కాలమున మామిడి, మోదుగు మారేడు, ఉత్తరేణి శిరీష కాష్ఠములతో వాక్కును నియమించి, ప్రాతఃకాలమునలేచి దంతధావనమును చేయవలయును. మేడి, కదంబము, కరవీరము, కరంజము, కంటకములు గల వృక్షముల కాష్ఠములు, పాలుకారు వృక్షములు కాష్టములు దంతధావనమునకు ఉపయోగించినచో పావనత్వమేర్పడుటే కాక స్వరములో సూక్ష్మత మాధుర్యము కలుగును. తూర్పుదిక్కున ఉండు మేఘము పలువర్ణములను చూపునట్లు కంఠము అన్నివర్ణములను చక్కగా పలుక గలుగును. శిష్యుడు త్రిఫల చూర్ణమును లవణములతో కలిసి సేవించవలయును. ఈ త్రిఫల జఠరాగ్నిని మేధస్సును కలిగించును. నిత్య కృత్యములను నెరవేర్చి నిత్య ధర్మములను ఆచరించి జఠరాగ్నిని తృప్తిపరిచి, తేనెను నెయ్యిని త్రాగి, పవిత్రుడై వేదాధ్యయనమును చేయవలయును. మొదట మంద్రస్వరముతో ప్రారంభించవలయును. అన్ని వేదశాఖలలోను ఈ విధినే అనుసరించవలయును. సప్తస్వరములను అతిక్రమించి యథేష్ఠముగా పలుకుటను విసర్జించవలయును. యథేష్ఠముగా పలుకరాదు. ఊపిరిని బిగబట్టరాదు. ఊపిరిని బిగబట్టుటచే వైస్వర్యముకలుగును. స్వర వ్యంజనములలో మాధుర్యము లోపించును. చెడు తీర్ధముల పాపులకువలె పరిమోక్షము లేదు. మంచి తీర్థములనుండి వచ్చినవాటిని భక్షించిన వారు చక్కగా వేదాధ్యయనమును చేయగలరు. వారివద్ద వేదము సుప్రతిష్ఠతమగును. మంచి స్వరముతో, మంచినోటితో ప్రయోగించిన వేదము శోభించును. పెద్దనోరు కలవాడు, వ్రేలాడు పెదవులుకలవాడు, అన్ని వర్ణములను ముక్కుతో పలుకువాడు, బొంగరుగొంతు కలవాడు, నాలుక కదల్చనివాడు, వేదాధ్యయనమును చేయరాదు. ఏకాగ్రచిత్తము గలవాడు, ఉద్వేగము లేనివాడు, స్నానముచేసి గానమును విడిచి, మంచి దంతోష్ఠములు కలవాడు వేదవర్ణములను ఉపయోగించ వలయును. చండులు, స్తబ్ధులు, అలసులు, రోగముగలవారు, పలువిషయములందు మనసు ఉంచువారు ఈ అయిదుగురు వేదాధ్యయనమును చేయరాదు. విద్యను మెల్లగా అభ్యసించవలయును. ధనమును మెల్లగా సంపాదించ వలయును. పర్వతమును మెల్లగా కదల్చుచు చీమలు కొన్నివేల యోజనముల దూరమును చేరును. ఒక్క అడుగు కూడా ముందుకు వేయనిచో గరుడుడు అయినను ఒక్క అడుగు దూరమునుకూడా చేరలేడు. పాపములను పలుకు వాక్కుచే వేదములను పలుకరాదు. చెవిటివానితో వదురుబోతుతో నెరజాణ పలుకులవలె యుండును. ఉపాంశు చరితమును భయ పడుచు పలుకువాడు ఎన్నివేలమార్లు చదివిననూ సందేహముతోనే ఉండును. గురువు సన్నిధిలో చదువక, పుస్తకమును చూచి చదువబడినది జారుని వలన గర్భమును ధరించిన స్త్రీ వలె సమాజమున గౌరమును పొందజాలదు. ఎన్నిమార్లు పెట్టిననూ కరిగిపోవు కాటుకను, చీమలు ప్రయత్నముచే నేర్పరుచు పుట్టను చూచి దానాధ్యయన కర్మలయందు నిత్యము యత్నశీలుడై ఉండవలయును. పురుగులు ధూళికణములతో మెత్తనిమట్టితో పెద్ద పుట్టను సిద్ధము చేయును. ఆ పురుగులకు బలము కాని సామర్ధ్యము కాని లేదు. ప్రయత్న శీలతే కార్యసిద్ధికి కారణము. నూరుమార్లు అధ్యయనము చేసి వేయిమార్లు వల్లె వేసినచో విద్య పల్లమునకు ప్రవహించునదివలె వచ్చును. జాత్యశ్వములు అర్థరాత్రి సగము నిద్రపోవు నట్లు చాలాకాలము విద్యార్థుల కనులకు నిద్ర ఉండరాదు. చాలాకాలము భోజనము చేయరాదు. నారీ నిర్బంధము ఉండరాదు. సముద్రమును గరుడ పక్షులు, హంసలు దాటునట్లు విద్యార్ధులు వేదసాగరమును దాటవలయును. పామువలె జనసమూహమునకు భయపడుచు, నగరమునువలె సాహిత్యమును చూచి భయపడుచు రాక్షసులకువలె స్త్రీజనమునకు భయపడువిద్యార్థి విద్యను పొందగలడు. శఠులు, దీనులు, వృధాభిమానులు, లోకముతో ఎక్కువగా మాటాడువారు, నపుంసకులు, తమను తాము చూచుకొనువారు అర్థములను పొందజాలరు. గడ్డ పారతో త్రవ్వుచు భూమిలో నీరును పొందినట్లు గురువులో ఉన్న విద్యను శుశ్రూషతో పొందగలరు. గురువును సేవించుటచే, పుష్కల ధనముచే కాని ఒక విద్య నిచ్చుటచే గాని విద్యను పొందవచ్చును. నాలుగవ మార్గము లేదు. గురువును సేవించక, మేధాసంపత్తిచే విద్యను పొందిననూ గొడ్డురాలి యౌవనమువలె సఫలముకాజాలదు. ఇట్లు సంగ్రహముగా శిక్షనునీకు తెలిపితిని. వేదమునకు మొదటి అంగమగు శిక్షను చక్కగా తెలుసుకొని చక్కగా వేదమును అభ్యసించ వచ్చును. (2/50)