నారద మహా పురాణము
దుర్గామంత్ర చతుష్టయ వర్ణనము
సనత్కుమార మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా? నీకు లక్ష్మీదేవి యొక్క అవతార త్రయమును చెప్పితిని. ఇక ఇపుడు సర్వలోకోపకారకములగు దుర్గావతారములను చెప్పెదను. “ఓం శ్రీ శివా శివా వాణీ వైరోచనీ” పదముల తరువాత వజ్రాద్యము క్షుధితా సూక్ష్మా మృతా స్వాగ్నీందు సంయుతా శివాఫట్ లను కూడా ప్రతిష్ఠింపచేసి స్వాహాంతముగా అత్యష్టి వర్ణములుగల మంత్రమిది. ఈ మంత్రమునకు భైరవముని సమ్రాట్ఛందస్సు. ఛిన్నమస్తా దేవతా. రమా బీజము. స్వాహా శక్తి. ‘అంఖడ్గాయ’ అని హృదయము. ‘ఈం ఖడ్గాయ’ అనునది శిరస్సు. ‘ఊం వజ్రాయ’ అనునది శిఖ. ‘ఐం పాశాయ’ అనునది కవచము. “ఔం అంకు శాయ” అనునది నేత్రము. విసర్గము వసురక్షయుక్కు మాయా యుగ్మము అస్త్రము. ప్రణవాదికములు మంత్రములు, స్వాహాంతము వరకు. ఇట్లు అంగకల్పనచేసి అంబికను భానుమండల మధ్యస్థనుగా, ప్రవికీర్ణాలకగా, స్వమస్తకము ఛిన్నముకాగా స్ఫారముఖురాలై కారుచు పడుచున్న స్వరక్తమును త్రాగుచున్నదానినిగా, రతియందు ఆసక్తులగు రతీ మన్మధులపైన ఉన్న దానినిగా, తన చెలికత్తెలగు దాకినీ వర్ణినులను చూచి ఆనందించు దానినిగా ధ్యానించి నాలుగు లక్షలు జపమును చేయవలెను. దశాంశమును మోదుగు మారేడు పూలచే పండ్లచే హోమమును చేయవలెను. ఆధార శక్తి ఉండి పర తత్త్వాంతము వరకు పూజించబడిన పీఠమునందు జయ, విజయ, జిత, పరాజిత, నిత్యా, విలాసినీ, దోగ్ద్రీ అఘోరా, మంగళా అను నవ పీఠ శక్తులను దిక్కులందు, మధ్య భాగమున పూజించవలయును. సర్వబుద్ధి ప్రదముగా వర్ణించి సర్వ భృగువు సదృక సిద్ధి ప్రదము ఢాకినీ సంబంధము తారము సభౌతికమగు వజ్రము ‘ఖడ్గీశరోచనీమే భగందేహి నమః’ ఇది తారాది పీఠ మంత్రము. వేదరామాక్షరము. ఈ మంత్రముచే ఆసనమును సమర్పించి అచట శివను పూజించవలెను. త్రికోణ మధ్య షట్కోణ పద్మ భూపుర మధ్యమున బాహ్యావరణము మొదలుకొని ప్రతిలోమ విధానముగా పూజించవలెను. భూపురమున బాహ్య భాగములందు వజ్రాదులను పూజించవలెను. దానిలోపల ఇంద్రాదులను పూజించవలెను. భూపురము యొక్క నాలుగు ద్వారములందు ద్వారపాలకులను పూజించవలెను. కరాలుడు, వికరాలుడు, అతికాలుడు, మహాకాలుడు అనువారు నలుగురు ద్వారపాలకులు. ఆ తరువాత పద్మము నందు అష్టశక్తులను పూజించవలెను. ఏకలింగ యోగిని, ఢాకినీ, భైరవీ, మహాభైరవీ, కేంద్రాక్షి అసితాంగి, సంహరిణీ అను వారీలు షట్కోణములందు అంగమూర్తులు. త్రికోణగా, ఛిన్నమస్తా అను వారలు పార్శ్వమునందు, సఖీద్వయమగు డాకినీవర్ణిని అనువారలను తారా వాక్కులచే పూజించవలెను. ఇట్లు పూజాదులచే మంత్రము సిద్ధించిన పిదప సాధకుడు దుర్లభములగు ఇష్టమనోరథములను ఆ దేవీ అనుగ్రహముచే వెంటనే పొంద వచ్చును. మారేడు పూలచే సంపద, మారేడు పండ్లచే ఇష్టము సిద్ధించును. మాలతీ పుష్పములచే హోమమును చేసిన వాక్సిద్ధి, చంపక పుష్పహోమముచే సుఖము లభించును. నేతితో కలిపిన మేక మాంసము ప్రతి దినము నూరు చొప్పున ఒకనెల హోమము గావించినచో రాజులందరు వశమగుదురు. లక్ష తెల్ల గన్నేరుపుష్పములచే హోమమును గావించిన అన్ని రోగములను పారద్రోలి సుఖముగా నూరు వత్సరములు జీవించును. లక్ష ఎఱ్ఱ గన్నేరు పూలచే హోమము గావించిన మంత్రులను రాజులను వశపరచుకొనును. మేడి మోదుగు పండ్లచే హోమమును గావించిన సంపదను పొందును. గోమాయు (నక్క) మాంసముచేకాని, పాలచేకాని, అన్నము చేకాని హోమమును చేసిన కవిత్వమును పొందును. బంధూక (మంకెన) పుష్ప హోమముచే భాగ్యము, కర్ణికార పుష్ప హోమముచే మనోరథమును పొందును. తిలతండుల హోమముచే జనులందరు వశులగుదురు. ఆ కృష్ణములగు నారీ రజములచే కాని మృగ మాంసముచే కాని హోమమును చేసిన ఇష్టసిద్ధి కలుగును. మహిష మాంస హోమముచే, స ఘృత పంకజ హోమముచే స్తంభనము సిద్ధించును. శత్రు మృత్యువుకొఱకు చితాగ్నియందు కోకిల రెక్కలచే హోమమును చేయవలెను. ఉమ్మెంత సమిధలచే ప్రజ్వరిల్లిన అగ్నిలో కాకి రెక్కలచే చేసిననూ అదే ఫలము కలుగును. ద్యూతమున, అరణ్యమున, రాజద్వారమున, సమరమున, శత్రు సంకటమున దేవిని ధ్యానించుచు మంత్రమును జపించినచో విజయమును పొందును. భుక్తి ముక్తుల కొఱుకు శ్వేత వర్ణను, ఉచ్చాటనకు నీల వర్ణను ధ్యానించవలెను. వశమునకు రక్తవర్ణను, మృతికి ధూమ్రవర్ణను, స్తంభకమున కనకప్రభను ధ్యానించవలెను. సిద్ధి కొఱకు రాత్రి యందు మదిరాదులచే బలిని ఈయవలెను. ఇపుడు సర్వసిద్ధిప్రదమగు ఒక ప్రయోగమును చెప్పెదను. దీనిని అతి ప్రయత్నముచే రహస్యముగా నుంచవలెను. కృష్ణ పక్ష భూతాహమున కారుచీకటి నిండిన మధ్యరాత్రమున స్నానము చేసి రక్తవస్త్రములను ధరించి రక్త మాల్యాను లేపనుడై ఛిన్న మస్తస్వరూపిణి, సుందరి, యౌవనవతి నర పంచక గామిని, సుస్మిత, ముక్తకబరి, భూషాదాన ప్రతోషిణియగు నారిని తీసుకొని వచ్చి వివస్త్రగా పూజించవలెను. మంత్రమును పదివేలు జపించ వలెను. బలినిచ్చి, రాత్రి గడిపి ధనముచే ఆ యువతిని ప్రీతురాలిని చేసి పంపించి పలువిధాన్నములచే బ్రాహ్మణు లకు భోజనము పెట్టినచో పుత్రులను పౌత్రులను ధనమును కీర్తిని స్త్రీలను, ఆయుష్యమును, సుఖమును, ధర్మమును, ఇష్టమును పొందును. విద్యను కోరువాడు ఆ రాత్రి యందు వ్రతము ఆచరించవలయును. ఇతర కోరికలున్నచో ఆ మంత్రమును జపించుచు దానిని పొందవలెను. ప్రాతఃకాలమున లేచి పడకమీద కూర్చొని జపించవలెను. ఆరు నెలలలో సాధకుడు కవిత్వముతో కవిని జయించును. శివునిచే కీలితమగుచో ఈ విద్య ఉత్కీలనము అగును. తారా పుటముగు మాయను అష్టోత్తర శతము మంత్రాదిలో అంతమున జపించినచో ఈ విద్య సిద్ధి ప్రదమగును.
ఓ మునిసత్తమా!! దేవి యొక్క మరియొక అవతారమును చెప్పెదను. జ్ఞానామృతారుణా, శ్వేతా, క్రోధినీ, ఇందుసమన్వితా, అట్టి శాంతి నీచసర్గాన్విత. కామరాజాఖ్యమగు వాగ్భవము శక్తి బీజము. మూడు బీజములచే పంచకూటాత్మికా త్రిపురభైరవి. దక్షిణా మూర్తి ఋషి పంక్తి ఛందస్సు. త్రిపుర భైరవి దేవత. వాగ్భవ బీజమును నాభి నుండి పాద పర్యంతము న్యాసము చేయవలెను. కామ బీజమును హృదయము నుండి నాభి వరకు న్యాసము చేయవలెను. తృతీయ బీజమును శిరసునుండి హృదయము వరకు ఉంచవలెను. ఆద్యమును ద్వితీయమును కరములందు, తృతీయమును ఉభయమును మూలాధారమున హృదయమున ఉంచి మరల బీజత్రయ న్యాసమును చేయవలెను. నవయోన్యాత్మక వ్యాసమును బీజ త్రయముచే చేయవలెను. బాలా త్రిపురకు చెప్పినట్లు మూర్తి న్యాసమును చేయవలెను. స్వన్వ బీజాదికమును పూర్వక మును, శిరస్సున ఈశానుని, వక్త్రమున మనోభవుని, తత్పురుషుని మకరధ్వజుని, హృదయమున అఘోరకుమారుని కందర్పుని న్యాసము చేయవలెను. వామదేవాది మన్మధాంతము గుహ్య దేశమున నుంచవలెను. పాదములందు సద్యోజాతుని వామదేవుని న్యాసము చేయవలెను. ఊర్ధ్వ ప్రార్ధక్షిణోదీచ్య పశ్చిమ ముఖములందు వారివారిని న్యాసము చేయవలెను. సద్యాది పంచహ్రస్వాద్యములు వీటికి బీజముగా చెప్పబడినది. షడ్డీర్ఘ యుక్తమగు నాద బీజముచే అంగకల్పన చేయవలెను. తరువాత త్రైలోక్య మోహనములగు పంచబాణములను వ్యాసము గావించవలెను. ద్రాం అను దానిని ద్రావిణీ బీజమును శిరస్సున, ద్రాం అను క్షోభిణీ బీజమును పదమున, వశీకరణమగు క్లీం బీజమును వక్త్రమున, బ్లూం అను దానిని బీజపూర్వకమును గుహ్యమున న్యాసమును చేయవలెను. సర్వాంత భృగు సంస్థితమగు ఆకర్షణ బీజమును హృదయమున, సంమోహన బీజమున క్రమముగా న్యాసము చేయవలెను. దీనిని బాణన్యాసమందురు. ఫాల భ్రూమధ్య వదనములందు, ఘంటికా కంఠ హృదయములందు, నాభ్యధిష్ఠానములందు, తారాదులగు అయిదు సుభాగాదికములను, నాభినుండి మస్తకము వరకు ఉంచవలెను. సుభగా, భగా, భగసర్పిణీ, పరా, భగమాలిని, అనంగా, అనంగ, కుసుమ, అనంగమేఖలా, అనంగ మదనా అనువారలందరు మద విభ్రమన మంధరలు ప్రధాన దేవతలు, వర్ణ భూషణాదులచే అలంకరించబడిన వారిని, అక్షస్రక్పుస్తక అభయ వరదాఢ్య కరాంబుజలను పూజించవలెను. వాక్కామ బీజమగు ‘బ్లూ’ అను దానిని సరాంతమున నుంచవలెను. ఇవియే పంచతారలును అనబడును. తరువాత భూషణ వ్యాసమును చేయవలెను. ఇట్లు వ్యస్త శరీరుడై సహస్ర భాను సంకాశ అరుణ క్షామ వస్త్ర, శిరోమాల, అసృప్తస్తని, జపకటిని, విద్యను, అభయముద్రను, కరమును ధరించు నది, త్రినేత్ర యగు త్రిపుర భైరవిని ధ్యానించవలెను. ఇట్లు దీక్షను పొంది పన్నెండు లక్షలు జపించవలెను. బ్రహ్మవృక్ష సమిధములగు గన్నేరు పూవులచే కాని హోమము చేయవలెను. ఇట్లు దీక్షను పొంది పన్నెండు లక్షలు జపించవలెను. బ్రహ్మ వృక్ష సమిధములగు గన్నేరు పూవులచే కాని హోమమును చేయవలెను. అష్టదళములు కల నవయోని అష్టకర్ణిక, ఇచ్ఛాది శక్తియుతమగు భైరవీ పీఠ పద్మమును అర్చించవలెను. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా, కామినీ, కామదాయినీ, రతిప్రియా మదానన్దా, నవమి, మనోన్మనీయను నవపీఠశక్తులు వరదాభయ ధారిణులుగా చెప్పబడిరి. వాగ్భవము లోహితుడు శ్రీబీజమునకు, శ్రీకంఠుడు, లోహితుడు, అనలుడు, దీర్ఘవానికి పరా, తరువాత, అపరాయములు హసయుతములు, ‘సదాశివాయ, మహాప్రేతాయ పద్మాసనాయ నమఃఅను మంత్రముచే ఆసనము నర్పించవలయును. శ్రీ గురు క్రమముగా చేయ వలెను. పాఙ్మధ్యయాన్యంతరాలమున పూజించి పంచ ప్రణవములచే మూర్తిని కల్పించి, ఆ మూర్తి అందు దేవతను ఆవహించి, సావధాన మనస్కుడై ఆగమోక్త విధానముచే పూజించవలెను. తారావాక్ఛక్తి కమలలు హసఖూ ఫ్రేంహనలుగా చెప్పబడినవి. దేవియొక్క వామకోణమున ఇందు సమప్రభయగు రతిని పూజించవలెను. ఈ రతిని సృణి పాశధర, సౌమ్య మద విభ్రమ విహ్వలగా పూజించవలెను. దక్షిణ కోణమున తప్త కాంచన సన్నిభ, అంకుశ ప్రణతములను ధరించు ప్రీతిని అర్చించవలెను. అగ్ర భాగమున రక్తవర్ణా, రక్త పుష్పాద్యలంకృత, ఇక్షకార్ముక పుష్టేషు ధారిణి సస్మితానన అగునో మనోభవను అర్చించవలెను. దిక్కులలో అగ్రభాగమున ఆయా మంత్రములచే ప్రాణ దేవతలను అర్చించవలెను. హస్తముల అందు పుష్పేషు ప్రణామామృత ప్రభలను ధరించియున్న అష్ట శక్తులను సుభగాదులను అష్టయోనులను పూజించవలెను. భైరవాం కస్థలు మదవిభ్రమ విహ్వలులగు మాతలను అష్టపత్రములందు యధావిధిగా పుష్పాదులచే పూజించవలెను. దిక్కులందు లోకపాలకులను, దాని వెలుపల వారి అస్త్రములను పూజించవలెను. పూర్వజన్మ కృత పుణ్యము చే పరదేవతను తెలిసి ఉక్తమార్గముచే సేవించువాడు సంపదలకాలవాలమగును. ఇట్లు మంత్రసిద్ధిని పొందిన సాధకుడు స్వాభీష్ట మును సాధించుకొనవచ్చును. మధుర మిశ్రితములు దోష రహితములగు రక్తాం భోజ ములచే లక్షకాని యాబదివేలు కాని హోమముచేసి ప్రతిదినము బ్రాహ్మణులకు భోజనమును పెట్టవలయును. సౌందర్యము యౌవనముగల స్త్రీలను దేవతా బుద్ధిచే పూజించవలెను. హోమ సమాప్తిలో తన గురువును ధన ధాన్యాదులచే సంతోషింప చేయవలెను. ఇట్లు చేసిన జగత్తు వశమగును. లక్ష్మీనిలయమగును. త్రిమధు మిశ్రితము లగు రక్తోత్పలముచే కాని, అరుణ వర్ణములుగల హయాదిజములచేకాని, పుష్పములచే కాని, క్షీరాన్నములచే కాని హోమము చేసినచో జగత్తు వశమగును. మోదుగు పూవులచే హోమము కావించిన దివ్యజ్ఞానమును పొంది కవి అగును. పాలతో తడిపిన అమృత ఖండములచే హోమమును గావించిన అపమృత్యువును జయిం చును. పాలతో తడిపిన గరికతో మూడు దినములు హోమమును గావించిన ఆయుర్వృద్ధి కలుగును. గిరికర్ణికాభవ పుష్పహోమము బ్రాహ్మణులను వశముచేయును. కలువలచే హోమము గావించిన రాజులు వశులగుదురు. పుష్పహోమము రాజపత్నులను వశము చేయును. మల్లికా పుష్పహోమము రాజపుత్రులను వశము చేయును. పాటలోద్భవములగు కోరంట పుష్ప హోమము శూద్రులను వశము చేయును. విలోమాంతమున నున్న సాధ్యనామాన్వితముగా అనులోమమును మంత్రము ఉచ్చరించి మధుర మిశ్రితములగు ఆవాలచే హోమమును గావించినచో ఆ క్షణమునే రాజులను వశములో ఉంచును. ఇదే విధానముచే రాజపత్నులను రాజపుత్రులను వశములో ఉంచుకొన వచ్చును. మధుర త్రయ మిశ్రితములగు జాతి బిల్వ పుష్పములచే హోమమును గావించిన నరనారీ నరపతులను వశులను చేయవచ్చును. చందన లోలితములకు మాలతీవకులు పుష్పములచే హోమమును గావించినచో ఒకవత్సరములో సత్కవిత్వమును పొందును. మధురత్రయ మిశ్రితము లగు బిల్వ ఫలములచే హోమమును గావించిన లోకము వశమగును. ఉత్తమ సంపదను పొందును. నేయి కలిపిన అన్నముచే హోమము గావించిన అన్న సమృద్ధి కలుగును. కస్తూరీమయ, పేతమగు కర్పూర హోమము కావించినచో మన్మథుని మించిన సౌందర్యము కలుగును. దధిక్షీర మధుప్లుత ములగు లాజహోమమును గావించిన అన్ని రోగములను జయించి నూరు వత్సరములు జీవించును. రెండు భాగములు మలయ చందనము ఒక భాగము కుంకుమకేసరి, ఒక భాగము గోరోజనము ఈ మూడింటిని చల్లనినీటిచే చక్కగా మర్దనము గావించి ఫాలమున తిలకమున ధరించి ఎవరిని చూచినను, ఎవరిచే చూడబడిననూ, ఎవరిని తాకిననూ ఎవరిచే తాకబడిననూ వారందరూ వశమగుదురు. కర్పూర కపిచోరములను సమభాగములుగా ఏర్పరిచి నాలుగవ భాగమున జటా మాంసమును, అంతయే గోరోచన మును, అంతయే కుంకుమను, ఎనిమిదవ భాగమును చందనమును, తొమ్మిదవ భాగమును అగురును కలిసి చల్లటినీటితో కన్య చక్కగా మర్దన గావించి ఫాల మున తిలకమును ధరించినచో రాజులను, నరులను మదగర్వితులగు యువతులను, మదించిన యేనుగు లను, సింహ వ్యాఘ్ర మహాసర్పములను, భూతభేతాళ రాక్షసులను చూచిన తోడనే వశు లగుదురు. ఇట్లు మహాభైరవీ మంత్రమును చెప్పితిని. ఇక ఇప్పుడు అవతారాంతరమును చెప్పెదను వినుము.
‘ఓమ్ నమో భగవతి! శ్రీ మాతంగేశ్వరి! సర్వజనమనోహారి! సర్వసుఖరాజ్య సర్వసుఖరంజని! సర్వరాజవశంకరి! సర్వస్త్రీ పురుషవశం కరి! సర్వదుష్ట మృగవశంకరి! సర్వసర్వ సత్త్వవశంకరి! సర్వలోకం అముకం మే వశం ఆనయ స్వాహా” అనునది ఎనుబది ఎనిమిది అక్షరముల మంత్రము. భైరవీ మంత్రము న్యాసాదులే ఈ మంత్రమునకు కూడా చెప్పుకొనవలెను. చెప్పబోవు వ్యాసములను యథాక్రమముగా శరీరమున చేయవలెను. శిరోలలాట భ్రూమధ్యములందు తాలు కంఠగలోళ ఉరస్ఘృములందు అనాహతమున భుజద్వంద్వమున, జఠరమున నాభిమండలమున, స్వాధిష్ఠానమున గుప్తదేశమున, పాదములందు మూలాధారమున, గుదమున, పదునెనిమిది పదములను క్రమముగా వ్యాసము చేయవలయును. 6, 1, 2, 4, 6, 8, 3, 9, 8, 3, 7, 8, 4, 3, 1, 2, 6 సంఖ్యలచే ఇది యదు క్లుప్తి అని మంత్ర వర్ణములచే న్యాసము చేయవలెను. మూల హృదయ భ్రూ మధ్యము లందు రత్యాద్యములు వాక్శక్తి లక్ష్మీ బీజాద్యములను మాతంగ్యంతము న్యాసము చేయవలెను. శిరోవదన హృద్గుహ్య పావనములందు విధానముచే న్యాసము చేయవలెను. హృల్లేఖను, గగనను, రక్తను, కరాలికను, మహోచ్ఛుష్మను స్వనామాదివర్ణ బీజపురస్సరముగా మాతంగ్యంతముగా షడంగ కల్పన చేయవలయును. ఇరువది నాలుగు అక్షరములచే హృదయమును, పదమూడు అక్షరములచే నేత్రమును, పదునెనిమిది అక్షరములచే శిఖను కవచమును, పదమూడు అక్షరములచే నేత్రమును, రెంటిచే అస్త్రమును ఏర్పరచవలెను భైరవీ మంత్రప్రోక్త విధిచే బాణ వ్యాసమును చేయవలెను. మాతంగీ పదములయందు మరియొక న్యాసమును చేయవలెను. వదాంశము అందు మన్మధుల నుంచవలెను. పార్శ్వనటులందు, నాభిదేశమున కటి పార్శ్వాంసమునందు బీజత్రయాదిక వ్యాసమును చేయవలెను. మన్మధుని, మకర ధ్వజుని, మదనుని, పుష్పధన్వుని, కుసుమాయుధుని, కందర్పుని, మనోభవుని, రతి ప్రియుని, న్యాసము చేయవలెను. కుసుమ మేఖల, మదన మదనాతురా మదనవేగా, సంభవా భువనపాల, ఇందురేఖి, అనంగ పూర్వ మాతంగి అని చెప్పబడినది. తరువాత అధిష్ఠానమగు మణిపూరకమున న్యాసము చేయవలెను. హృత్కంఠాస్యములందు, భ్రూ మధ్యమున, మస్తకము నందు, వ్యాసము చేయవలెను. ఆద్యమున లక్ష్మీ సరస్వతు లను, రతి, ప్రీతి, కృత్తిక, శాంతి, పుష్టి, తుష్టి, మాతంగి మూలమంత్ర న్యాసమును గావించవలెను. ఆధారదేశమున, అధిష్ఠానమున, నాభియందు, నిరోధికయందు, తీర్ధేందునాదమున, శివమున, మాతంగి పరమ న్యాసమును గావించవలెను. తరువాత వామను జ్యేష్ఠను, రౌద్రిని, ప్రశాంతను, శ్రద్ధను, మాహేశ్వరిని, ప్రియా శక్తిని, సులక్ష్మిని, మృష్టిని, సంజ్ఞను, మోహినిని ప్రమథ శ్వాసినిని, విద్యుల్లతను, చిచ్ఛక్తిని, సుందరిని, నిన్దను, నందబుద్దిని క్రమముగా శిరోపాలహృదా ధారములందు బీజయ త్రాధికలుగా మాతంగాదులను యతావిధిగా న్యాసమును గావించవలెను. మాతంగి మహదాద్యను, మహాలక్ష్మిని, సిద్ధలక్ష్మిని మూలాధార మండలమును న్యాసముచేసి, ఈశాన్యముచేతనే వ్యాపకమును ఆచరించ వలెను. ఇట్లు శరీరమున వ్యాసము గావించి మంత్ర దేవతను ధ్యానించవలెను. శ్యామ, చిలుక పలుకులను వినుచున్నది. న్యస్తైకాగ్ని శిరోరుహ, శశిఖండ ధర, వీణావాదనమును చేయుచున్నది, మధూన్మాద, రక్తాంశుక, కహ్లారమాలా శోభితచూలిక, శంఖపుత్ర, చిత్రకోద్ధాసి మస్తకయగు మాతంగిని ధ్యానించి పదివేలు జపించవలెను. దశాంశమును ఇప్పపూలను త్రిమధు మిశ్రితములుగా మంత్రసిద్ధి కొఱకు హోమమును గావించవలెను. త్రికోణ కర్ణికము అష్టపత్రము కల్పించవలెను. బాహ్య భాగమున అష్టపత్రావృతము, షోడశ దలావృతము, చతురస్రీ కృతము, కాంతిచే దృష్టి మనోహరమగు పీఠమున క్రమముగా నవశక్తులను పూజించవలెను. ఈ నవ శక్తులు విభూతి పూర్వులు మాతంగీ పదపశ్చిమలను పూజించవలెను. “సర్వ శక్తి కమలాస నాయ నమః” అనునది బీజాద్యమగు వాక్సత్వలక్ష్మీ బీజాద్యము. పీఠాపూజన మంత్రము మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆ మూర్తియందు దేవతను ఆవహించి, వక్ష్యమాణ విధిచే పూజించవలెను. పూర్వము వలె కోణత్రయములందు రత్యాదులను పూజించవలెయును. దిక్కులందు బాణములను, అగ్ర భాగమున పంచమమును పూజించవలెను. దళ మధ్యమున అనంగ కుసుమాదికలను పూజించ వలెను. పాశాంకుశా భయాభీష్ట ధారిణ దిఙ్మధ్యమున హృత్ హృల్లేఖలను పూజించవలెను. పత్రాగ్రము లందు వల్లకీకరులను లక్ష్యాదులను పూజించవలెను. అష్టదళములందు బహిర్భాగమున మదోద్ధతు లగు మన్మధాదులను పూజించవలెను. వీరందరు అపరాంగులు నిషంగా దులు పుష్పాస్త్రేషు ధనుర్థరులుగా ఉందురు. పైన చెప్పబడిన లక్షణములుగల బ్రాహ్మ్యాది మాతలను పత్రస్థలను పూజించవలెను. తదగ్ర భాగమున అసితాంగాది భైరవులను పూజించవలెను. మరల షోడశ పత్రములందు షోడశ శక్తులను పూజించవలెను. ఈ షోడశ శక్తులు వామాద్యలుకల వీణలచే గానముచేయువారు శ్యామవిగ్రహలు, నాలుగు దిక్కులందు చతురస్ర పీఠమున నలుగురిని పూజించ వలెను. ఈ నలుగురు మాతంగ్యాదులు మదోన్మత్తలు వీణోల్లసితపాణులుగా ఉందురు. ఆగ్నేయ కోణమున విఘ్నేశుని దుర్గను పూజించవలెను. వాయవ్యకోణమున బటుకలను, ఈశాన్యమున క్షేత్రపాలుని పూజించవలెను. బహిర్భాగమున వజ్రాద్యాయుధములతో పాటు లోకపాలురను పూజించవలెను. ఇట్లు సాధకుడు మంత్రసిద్ధిని పొందిన తరువాత స్వేష్టమును సాధించుకొనవలెను. మల్లికా జాతి పుష్పములచే హోమమును గావించిన ధనాధిపతి అగును. బిల్వఫలములచే కాని పత్రములచే కాని హోమమును గావించిన రాజపుత్రులకు రాజ్యము లభించును పద్మ హోమముచే సంపద కలుగును. ఉత్పల హోమముచే జగత్తు వశమగును. మధుమిశ్రిత క్షారములచే మగును. వంజుల సమిద్ధోమము వర్షమును కురిపించును. క్షీరమిశ్రిత అమృతఖండములచే హోమ మునుగావించిన జ్వరము నశించును. దూర్వాహోమ ముచే ఆయుష్యము, తండులములచే సర్వము వశమగును. నద్యావర్త సంజాత పుష్ప హోమముచే వాక్సిద్ధి కలుగును. అభీష్ట సంపత్సమృద్ధికి నింబపుష్ప హోమమును చేయవలెను. పలాశ కుసుమ హోమముచే తేజస్వి అగును. చందనాగరు కస్తూరీ చంద్ర కుంకుమలచే హోమమును కావించిననూ తిలకముగా ధరించిననూ సర్వవశ్యత సర్వప్రియత్వము సంభవించును. నిగుడీ మూల హోమముచే నిగడ విముక్తుడు అగును. నింబతైల మిశ్రిత లోణహోమముచే శత్రునాశము అగును. హరిద్రా చూర్ణ మిశ్రితములగు లవణములచే జగత్సంభనము సిద్ధించును. ఓ బ్రాహ్మణోత్తమా! ఇట్లు నీకు మాతంగీ సిద్ధవిద్యను చెప్పితిని. ఇక ఇపుడు మరొక అవతారమును చెప్పెదను వినుము.
ప్రీతి చంద్రాఢ్య దీపిక ద్విధా రంజితమై స్వాహాంతమగు మంత్రము ధూమావతీ మంత్రము అష్టాక్షరి. పిప్పలాద మహర్షి నివృచ్ఛందస్సు. ధూమావతీశ్వరి దేవత. షడ్డీర్ఘ జాతి యుక్తముచే అంగకల్పన చేయవలెను. తరువాత శత్రు నిగ్రహ కారిణి, వివర్ణ, చంచల, దుష్ట, దీర్ఘ, మలినాంబర, విముక్త కుంతల, సూక్ష్మ, విధవ, వీరలద్విజ, కంకధ్వజ రధారూఢ, ప్రలంబిత పయోధర, సూర్యహస్త, నిరుక్షాంక ధృతహస్తాంబరాన్విత, ప్రవృద్ధ లోమ, కుటిల, కుటిలేక్షణ, క్షుత్పిపాసార్దిత, నిత్య భయద, కలహప్రియ అగు ధూమావతీశ్వరిని చింతించి, నమస్స్వాహా ఫడంత బీజమును సాధ్యోపరిభాగమున ఉంచి, దానిపై శవమును స్థాపించి జపించవలెను. శవమును శత్రు నామముచే అవష్టంభనమును గావించి మంత్రమును జపించవలెను. ఉష్ణష కంచుకములును ధరించి కృష్ణ పక్షమున రాత్రింబవళ్లు ఉపవసించి, శ్మశానమునకాని, అరణ్యమునకాని, శూన్యమందిరమున కాని మంత్రసిద్ధికొరకు, వాక్కును నియమించి దేవిని ధ్యానించుచు, వేయికంటే ఎక్కువ జపించినచో శత్రువు జ్వరపీడితుడు అగును. పంచగవ్యముచేకాని, పాలచేకాని జ్వరశాంతి జరుగును. మంత్రాద్యక్షరమును లిఖించి తరువాత శత్రునామము లిఖించి, మరల మంత్ర ద్వితీయాక్షరమును శత్రునామమును లిఖించవలెను. 98 వేల జపముచే శత్రుమృతి సంభవించును. శ్మశానాగ్నియందు కంకమును దహించి, ఆ భస్మమును తీసుకొని శత్రునామముచే ఎనిమిది వందలు జపమును గావించినచో శత్రూచ్చాటనము జరుగును. శ్మశాన భస్మముపై శవమును ఉంచి కృష్ణపక్షమున శత్రునామమును ఉచ్చరించి మహిషీ క్షీర ధూపమును ఇచ్చినచో శత్రువులకు విపత్తును కలిగించును. ఇట్లు సంక్షేపముగా జగదంబికయగు దుర్గాదేవి యొక్క అవతార చతుష్టయమును చెప్పితిని. ఇంకనూ ఏమి అడుగదలచితివి? (3/87)