నారద మహా పురాణము
మందర పర్వత వర్ణనము
సౌతి పలికెను: కమలలోచన అగు ఆ దేవి బ్రహ్మవాక్యమును విని నాకు పేరు పెట్టుము. దానితో నేను మందర పర్వతమునకు వెళ్ళెదను. ఓ జగత్పతీ! సంతానమునకు తండ్రియే పేరు పెట్టవలెను. పేరు సర్వ పాపహరము. కావున నాకు పేరు పెట్టుము అని పలికెను.
బ్రహ్మ పలికెను: ఓ సుందరీ నీవు జగత్తునంతటిని నీ రూపముచే మోహింపచేసితివి. కావున నీకు మోహిని అను పేరు సార్థకమగును. నీ దర్శనమువలన పురుషుడు దశమన్మథావస్థలను పొందును. ఒకవేళ నీ సంపర్కమును పొందగలిగినచో అత్యంత సుఖభాజనుడు కాగలడు. బ్రహ్మ ఇట్లు పలుకగా మోహిని బ్రహ్మకు నమస్కరించి మార్గమున దేవతలచే చూడబడుచు, మందరా చలమునకు బయలుదేరెను. మూడవ ముహూర్తమున మందర పర్వత శిఖరమును చేరుకొనెను. ఈ మందర పర్వతమును చుట్టుటకు వాసుకికి కూడా శక్యము కాదు. ఈ పర్వతమునే పూర్వ కాలమున శ్రీహరి తనమూపున ధరించెను. దేవ దానవులు ఈ పర్వతముతోనే సాగరమును మధించిరి. ఆరు లక్షల యోజనములుగల సముద్రము ఈ పర్వతమునకు గుహ్వరమాయెను. కూర్మ శరీరముచే చక్కగా ధరించబడినది. అంతగా మధించిననూ భిన్నము కాలేదు. ఈ పర్వతము సముద్రమున పడుటచే సముద్ర రహస్యము బయటపడినది. ఈ పర్వతమునుండియే జలము బ్రహ్మాండ మార్గమున బయలుదేరినది. ఈ పర్వత ఘర్షణముచే మహాగ్ని పుట్టెను. ఈ పర్వతమునందే దిగంబరుడగు శంకరుడు భూతములతో కలసి నివసించును. ఈ పర్వతము దేవతలచే దానవులచే చూడశక్యము కాదు. పదివేల సంవత్సరములు శ్రీహరి కేదారమును వరిపిడిపెట్టినది ఈ పర్వతమే. ఈ పర్వతము అనంత రత్న నిలయము. బహుధాతు సమన్వితము. ఇదియే దేవతలకు క్రీడా విహారస్థలము. ఋషుల తపస్సులకు మూలము. దేవతాస్త్రీ రతి వర్ధనము. రత్నములకు ఓషధులకు పుట్టిలు. ఈ పర్వతము మూలమున పదివేల యోజనములచే విస్తరించినది. పదివేల యోజనముల పొడవుగలది మూడు లోకములకు ఆధార దండమువలె ఉండును. బంగారు, రత్నమయములగు శిఖరములచే భూమిని ఆకాశమును ప్రకాశింపచేయును. ఈ పర్వతము పైకి వచ్చిన సూర్య భగవానుడు తేజస్సు నశించి రశ్మి శూన్యుడగును. ఈ పర్వత మంతయు బంగారు స్వరూపముకలది. బంగారుకాంతులు కలది. తన తేజస్సుచే సూర్యతేజస్సును హరించును. అట్టి పర్వత శిఖర శిలా ప్రాంతమున రాజు కోరికను పెంచుటకు మోహిని కూర్చుని ఉండెను. ఈ శిల నీలకాంతిమము. సప్తయోజన విస్తృతము. ఈ శిలయందే కులిశ లింగము. దశహస్త ప్రమాణము కలదిగా ఉన్నది. దీనినే వృషలింగమందురు. ప్రాసాదాభ్రసమముగా ఉండును. ఈ శిలయందు మోహిని ఉత్తమ సంగీతమును గానము చేయుచుండెను. ఈ సంగీతము తంత్రీలయ సమన్వితము. వినువారి శ్రమను తొలగించును. ఆ మోహిని శివలింగమునకు సమీపమున ఉంటూ మూర్ఛనాతాళ సహి తముగా, గాంధార ధ్వని సంయుతముగా గానము చేయసాగెను. అట్లు మన్మధుని పెంచు గానము సాగుచుండగా స్థావరములకు కూడా ఆ గానమునందు స్పృహకలిగెను. అచట దైవము అదైవము అనుభేదము లేకపోయెను. మోహినీ ముఖమునుండి వెడలిన గానము సర్వప్రాణి విమోహన మాయెను. ఆమోహినీ గీతమును వినిన శంకరుడు కూడా అదేస్థితిలో కామాతురుడై అనుభవించు కోరికచే కదిలెను. పార్వతీదేవి చూపుచే సిగ్గుపడెను. (II/8)