ధర్మశాంతి నిర్దేశము

ధర్మరాజు పలికెను: వర్ణాశ్రమములకు క్రమముగా శ్రుతులలో, స్మృతులలో చెప్పిన ధర్మములను వివరించెదను. సావధానముగా వినుము. భోజనము చేయుచు అపవిత్రుని కాని, చండాలుని కాని కోపముతో, అజ్ఞానముతో స్పృశించినచో వరుసగా మూడు దినములు, అరుదినములు, మూడువేళల్లో స్నానము చేసి పంచగవ్యముతో శుద్ధిపొందును. (పంచగవ్యమనగా గోమూత్రము, గోమయము, గోక్షీరము, గోదధి, గోఘృతము). బ్రాహ్మణుడు భోజనము చేయుచుండగా మలము స్రవించినచో ఏర్పడిన అపవిత్రత తొలగుటకు పాదప్రక్షాళనము చేసుకొని ఆచమనము చేసి ఒక దినము ఉపవాసముండి పంచగవ్యమును సేవించవలయును. భోజనము చేయుచున్నపుడు మూత్ర స్రావము జరిగినచో ఒకదినము ఉపవాసము చేసి నేతితో హోమమును చేయవలయును. భోజనము చేయుచుండగా బ్రాహ్మణుడు అపవిత్రుడైనచో చేతిలోని ఆహారమును భూమిపైనుంచి స్నానము చేసినచో శుద్ధిని పొందును. ఒకవేళ ఆ ఆహారమును భుజించినచో ఉపవాసము చేసినచో శుద్ధిని పొందును. మొత్తము ఆహారమును తీసుకొనినచో మూడు దినములు ఉపవసించవలయును. భోజనము చేయుచుండగా వాంతిచేసుకొనినచో అనారోగ్యముగా ఉన్నవాడు మూడువందలు, ఆరోగ్యముగా ఉన్నవాడు మూడువేలు గాయత్రీ జపమును చేయవలయును. మలమూత్రోత్సర్జనము చేయుచున్నపుడు చండాలుడు కాని, శ్వపచుడు కాని స్పృశించినచో మూడురోజులు ఉపవసించవలయును. భోజనము చేసిన తరువాత అశుచిగా ఉన్నపుడు ప్పృశించినచో ఆరు దినములు ఉపవసించవలయును. రజస్వల అయిన స్త్రీని కాని, ప్రసవించిన స్త్రీని కాని చండాలుడు స్పృశించినచో మూడు దినముల తరువాత శుద్ధి పొందును అని శాతాతపమహర్షి చెప్పెను. రజస్వల అయిన స్త్రీని కుక్కలు, కాకులు, కిరాతులు స్పృశించినచో నిరాహారముగా ఉండి యథా సమయమున స్నానము చేయవలయును. రజస్వలలైన ఇరువురు స్త్రీలు ఒకరినొకరు తాకినచో బ్రహ్మకూర్చము అను వ్రతముతో శుద్ధి పొందెదరు. అపవిత్రుడు స్పృశించినపుడు స్నానము చేయనివాడు కూడా బ్రహ్మకూర్చము అను వ్రతముచే శుద్ధిని పొందును. ఋతుకాలమున గర్భవతి అని శంకించి సంభోగము చేసినవానికి స్నానముతో శుద్ధి కలుగును. ఋతుకాలము కానపుడు స్త్రీ సంగమమును జరిపినచో మూత్ర పురీషోత్సర్జనము చేసినప్పటివలె పాదప్రక్షాళనము ఆచమనము చేయవలయును. సంభోగ సమయమున స్త్రీ పురుషులిరువురూ అపవిత్రులగుదురు. శయ్య మీది నుండి లేచినచో స్త్రీ శుద్ధురాలగును. పురుషుడు మాత్రము అశుచిగానే ఉండును. దుష్టత్వముతో భర్తృ శరీరమును సేవించని స్త్రీని ధనమేమీ ఇవ్వకుండా పన్నెండు సంవత్సరములు త్యాగము చేయవలయును. పతితులుకాని, బంధువులను త్యజించినవారిని ఉత్తమ సాహస దండముచే శిక్షించవలెను. పతితుడైతే కావచ్చును కాని తల్లి ఎన్నడూ పతితురాలు (పుత్రుని దృష్టిలో) కాదు. తాడుచే ఉరిపోసుకొనుట మొదలగు విధానములతో ఆత్మహత్యకు పాల్పడినచో, మరణించినచో మృత దేహమును పవిత్ర పదార్థములతో పూయవలయును. ఒకవేళ జీవించెనేని రెండువందల నాణెములను అపరాధమును విధించవలయును. ఆత్మహత్య చేసుకొనినవాని పుత్ర మిత్రాదులకు కూడా ఒకొక్క నాణెము అపరాధముగా విధించి దండించ వలయును. తరువాత శాస్త్రమును అనుసరించి ప్రాయశ్చిత్తమును ఆచరించవలయును.

నీటిచే అగ్నిచే బంధనముచే ఆత్మహత్య చేసుకొనవలయునని ప్రయత్నించి విఫలమైనవారు, సన్యాస వ్రతమును భంగముచేసి పతితులైనవారు, విషపానము చేసినవారు, పైనుండి క్రిందపడిన వారు, శస్త్రప్రహారముచే ఆత్మహత్యకు ప్రయత్నించినవారు ప్రాయశ్చిత్తార్హులుకారు. సమాజమున వ్యవహారమునకు యోగ్యులు కారు. అందరిచే బహిష్కరించ దగినవారు. చాంద్రాయణవ్రతముచే కాని, తప్తకృచ్ఛ్రవ్రతమును రెండుమార్లు ఆచరించికాని శుద్ధులు అగుదురు. మహాపాతకములను ఉపపాతకములను ఆచరించి భ్రష్టులైన వారు, నల్లని పశువును వినియోగించే యజ్ఞము చేయుటకు అనర్హులు. వీరు రెండు చాంద్రాయణ వ్రతములచే శుద్ధులగుదురు లేదా గోవును, వృషభమును దానము ఇచ్చుటచే కాని శుద్ధులగుదురు. కావలెనని కాక అచింతితముగా శునక జంబుక వాన రాదులు, పతిత పురుషులు, పగలు, సంధ్యా సమయమున, రాత్రి పూట స్పృశించినచో వెంటనే స్నానము చేసినచో శుద్ధికలుగును. తెలయక చండాలాన్నమును భుజించినవారు పదిహేను రోజులు గోమూత్రములో వండిన ఆహారమును భుజించినచో శుద్ధులు అగుదురు. బ్రాహ్మణ గృహమును, గోనివాసమును దానము చేసినవాడు, ఉరిపోసుకొని మరణించలయునని ప్రయత్నించినవారు, ఉరితాడును ఛేదించి ఒక కృచ్ఛ్రవ్రతమును ఆచరించినచో శుద్ధులు అగుదురు. తెలియక చండాల పుల్కసుల భోజనము చేసినవారు, స్త్రీని వధించినవారు రెండు చాంద్రాయణ వ్రతములను ఆచరించ వలయును. తెలిసి చేసినచో అర్థకృచ్ఛవ్రతము నాచరించవలయును. గోపాలకులు అన్నమును భుజించినవారు, వారి స్త్రీలతో రమించిన వారు, పొందరాని స్త్రీలను పొందినవారు, మద్యపానుము చేసిన బ్రాహ్మణులు, గో మాంస భక్షణము చేసిన విప్రులు తప్తకృచ్ఛ వ్రతముచే కాని, నూనెలో తడిపిన దారములతో హోమమును చేసిన కాని శుద్ధులగుదురు. నాలుగు మహా పాతకములను ఆచరించినవారు అగ్ని ప్రవేశముతో కాని, మహాక్రతు ప్రవేశముతో కాని శుద్ధులు అగుదురు. రహస్యముగా పాపముల నాచరించినవారు ఒకనెల నీటిలో నిలిచి అఘమర్షణ సూక్తమును జపించినచో శుద్ధులగుదురు. రజకులు, చర్మకారులు, నటులు, బురుడులు, కైవర్తులు, మేదులు భిల్లులు అను ఏడుగురు అన్త్యజులు, తెలిసి వీరి అన్నమును తినిననూ, స్త్రీలతో రమించిననూ, నీరు త్రాగినను, దానము పరిగ్రహించినను అర్థకృచ్ఛ్ర వ్రతమును ఆచరించవలయును. తెలియక చేసినచో రెండు చాంద్రాయణ వ్రతములను ఆచరించవలయును. తల్లిని, గురుపత్నిని, పుత్రికను, చెల్లెలను, కోడలును సంగమించినచో అగ్నిప్రవేశము తప్ప మరొక ప్రాయశ్చిత్తములేదు. మహారాణిని, సన్యాసినిని, పెంపుడు తల్లిని, ఉత్తమవర్ణ సంజాతను సంగమించినచో రెండు కృచ్ఛ వ్రతములను ఆచరించవలయును. సమానా గోత్రముకల స్త్రీని పొందినను రెండు కృచ్ఛవ్రతములను ఆచరించ వలయును. మాతృ గోత్రముకల స్త్రీలను, పితృగోత్రము కల స్త్రీలను, పరదారలను సంగమించినచో అర్ధకృచ్ఛ్రవ్రతమును ఆచరించవలయును. వేశ్యాగమనము చేసిన బ్రాహ్మణులకు కూడా అర్ధకృచ్ఛ్రవ్రతముచే శుద్ధి కలుగును. గురుపత్నీ సంగమము చేసిన బ్రాహ్మణుడు బాగుగా వేడిగా ఉన్న నీటిని ఒకసారి త్రాగి దర్భ జలమును అయిదుమార్లు త్రాగి, యథావిధిగా వ్రతమును ఆచరించ వలయును. గో హత్య చేసిన వానికి, మహాపాతకములను ఆచరించిన వారికి కూడా ఇదే ప్రాయశ్చిత్తము నిర్ణయించబడినది. దండముతో ప్రహరించి ఆవును క్రిందపడవేసిన వానికి రెట్టింపు గోవ్రతము (గోదండము) ప్రాయశ్చిత్తముగా విధించబడినది. అంగుష్ఠమంత లావు, బాహువంత పొడవుగానున్న పచ్చి మోదుగు దండము గోదండమనబడును. ఆ దండముతో ప్రహారమే గోవ్రతము, గోవును దండముతో ప్రహరించినపుడు గర్భపాతము సంభవించినచో ఒక్కొక్కదానికి ఒక్కొక్క కృచ్ఛ్రవ్రతమును ఆచరించవలయును. ఆవును బంధించినపుడు అడ్డగించినపుడు, పోషించినపుడు గోవుకు పీడ కలిగినచో లేదా మరణము సంభవించినచో, దండప్రహారము చేయవలయును. ప్రహారముచే మూర్ఛపోయి లేచిన తరువాత అయిదారేడు పది అడుగులునడిచి వెళ్ళవలయును. గడ్డితిని, నీరు త్రాగి వ్యాధి నశించినచో ప్రాయశ్చిత్తము లేదు. అనగా వ్యాధిగ్రస్తమైన గోవునకు దండముతో వ్యాధి నశించినచో ప్రాయశ్చిత్తముతో పనిలేదు. వ్యాధి లేని గోవును దండన చేసినచో అతనిని ఇట్లు శిక్షించవలయును. ఇదే ప్రాయశ్చిత్తము. దండముతో మట్టిగడ్డలతో రాళ్ళతో ఆయుధములతో గోవును ప్రహరించినచో ఒక్కొక్క ప్రహారమునకు విడిగా ప్రాయశ్చిత్తములు చెప్పబడినవి. దండప్రహారముతో మరణించినచో సాంతపనవ్రతమును, మట్టిగడ్డతో మరిణించినచో ప్రాజాపత్యవ్రతమును, పాషాణ ఘాతమునకు తప్త కృచ్ఛ్రవ్రతమును, శస్త్రఘాతమునకు అతికృచ్ఛ్ర వ్రతమును ఆచరించి గో బ్రాహ్మణులకు ఔషధమును, ఆహారమును తైలమును దానము చేయ వలయును. ఒకవేళ దానము చేసిన ఔషధాదులు సేవించుట వలన మరణము సంభవించినచో ప్రాయశ్చిత్తముతో పనిలేదు.

ఇచ్చిన ఔషధమును కాని, తైలమును కాని పానము చేసినపుడు మరణము సంభవించినచో ఇచ్చిన వారికి ప్రాయశ్చిత్తముతో పనిలేదు. దూడలకు మందు త్రాగించుటకు, కంఠమున త్రాడు కట్టునపుడు, సాయంకాలము రక్షణ కొఱకు బంధించినపుడు దోషము లేదు. పాదప్రాయశ్చిత్తమునకు కేశములను కర్తనము (కత్తిరించుట) చేయవలయును. రెండు పాదములు ప్రాయశ్చిత్తమునకు మీసములు తీయవలయును. మూడు పాదముల ప్రాయశ్చిత్తమునకు శిఖను, పూర్తిప్రాయశ్చిత్తమునకు సంపూర్ణముగా క్షౌరము చేయవలయును. స్త్రీకి ప్రాయశ్చిత్తము చేయవలసివచ్చినపుడు మొత్తము కేశములను పట్టుకొని రెండు అంగుళములను మాత్రము కర్తనము చేయవలయును, స్త్రీలకు ఇదియే శిరోముండనము. స్త్రీలకు పూర్తిగా వపనము కాని, వీరాసనము కాని విధించబడి ఉండలేదు. స్త్రీలకు గోశాలలో నివాసము కాని, నడుచుచున్న ఆవు వెంటవెళ్ళుట కాని విధించబడలేదు. రాజు కాని, రాజపుత్రుడు కాని, విద్వాంసుడైన బ్రాహ్మణుడు కాని పాపమును ఆచరించినచో శిరో ముండనము కాక ఇతర ప్రాయశ్చిత్తమును ఆచరించవలయును. కేశరక్షణ కొఱకు రెట్టింపు వ్రతములను ఆచరించవలయును. రెట్టింపు వ్రతము ఆచరించి రెట్టింపు దక్షిణలను ఈయవలయును. శ్రుతి స్మృతులలో విధించబడని ప్రాయశ్చిత్తమును చెప్పినచో హంతకునికి పాపము నశించదు. చెప్పినవాడు నరకమునకు వెళ్ళును. అట్లు ధర్మమునకు విఘ్నములను కల్పించువారిని రాజు దండించ వలయును. ఇట్లు ధర్మవిఘాతకులను రాజు కామమోహితుడై దండించినచో అతని పాపము నూరురెట్లు పెరిగి రాజును పీడించును. ప్రాయశ్చిత్తము జరిపిన తరువాత బ్రాహ్మణ భోజనమును జరిపించవలయును. ఇరువది ఆవులను ఒక వృషభమును బ్రాహ్మణులకు దక్షిణగా ఇవ్వవలయును. గోవును దండాదులచే ప్రహారము చేసినపుడు, గాయమేర్పడి గడ్డిలో పుట్టిన పురుగులచే మక్షికాదులచే గాయము పెరిగినపుడు అర్థకృచ్ఛ్రవ్రతము ఆచరించవలయును. శక్తిననుసరించి దక్షిణను ఈయవలయును. ప్రాయశ్చిత్తము ఆచరించి బ్రాహ్మణులకు భోజనము కొంచెము బంగారమును దానము చేసి శుద్ధిని పొందును. రాత్రిపూట చండాల శ్వపచుల స్పర్శ ఏర్పడినపుడు, రాత్రిలేనిచో వెంటనే స్నానముచే శుద్ధి కలుగును. ఒకవేళ స్పర్శ కలిగినచో ప్రాతఃకాలమున స్నానముచే శుద్ధి ఏర్పడును. తెలియక రాత్రి అంతయు చండాలాదులతో కలిసి ఉన్నచో ఆ పాపము నూరు రెట్లు పెరుగును. గ్రహములు కాని, నక్షత్రములు పైనుండి వెళ్ళుచున్నపుడు కిరణస్పర్శ కలిగినచో జలస్నానముచే శుద్ధి యేర్పడును. నీటిలోపల ఉన్న మట్టిని, పుట్టలోని మట్టిని, మూషిక బిలములోని మట్టిని, చౌడు భూమిలోని మట్టిని, మార్గములోని మట్టిని, శ్మశానము లోని మట్టిని, శౌచశేషములోని మట్టిని ఈ సప్త మృత్తికలను గ్రహించరాదు. బ్రాహ్మణుడు గట్టి ప్రయత్నముతో అయినను ఇష్టాపూర్తమును ఆచరించవలయును. ఇష్టముచే స్వర్గము, పూర్తముచే మోక్షము లభించును. ద్రవ్యమును విరివిగా దానము చేయుట ఇష్టమనబడును. తటాకాదులను నిర్మించుట పూర్తమనబడును.

జీర్ణములైన ఆరామములను, దేవాలయములను, వాపీ కూప తటాకములను ఉద్ధరించినవారికి కూడ పూర్తి ఫలము లభించును. శుక్లగోవునుండి మూత్రమును, కృష్ణ గోవు నుండి పేడను, తామ్రవర్ణపు గోవు నుండి పాలను, శ్వేతగోవు నుండి పెరుగును, కపిలగోవు నుండి నేతిని తీసుకొని పంచగవ్యమును సిద్ధము చేసుకొనవలయును. ఇట్లు సిద్ధముచేసిన పంచగవ్యము మహాపాతకములను నశింపచేయును. దర్భలచే తీర్థ నదీ జలముచే పంచగవ్యములోని ప్రతిద్రవ్యమును విడివిడిగా ప్రణవముతో కలుపవలయును. ప్రణవముతో పైకి తీసుకొనవలయును. ప్రణవముతో చక్కగా ఆలోడనము (ఒకదానితో ఒకటి కలియునట్లు చేయుట) చేసి ప్రణవముతో పానముచేయవలయును. మోదుగు ఆకులో కాని, రాగి కలశములో కాని, తామరాకులో కాని, మట్టిపాత్రలో కాని దర్భలతో ఉంచి పానము చేయవలయును. సూతకము (అశౌచము) ఒకటి వచ్చిన అది పూర్తి కాకమునుపే మరియొక సూతకము వచ్చినచో తరువాత వచ్చిన సూతక దోషము మొదటి దానితో పోవును. జాతశౌచముతో జాతాశౌచము, మృతాశౌచముతో మృతాశౌచము తొలగిపోవును. గర్భస్రావము జరిగినచో మూడుదినములు అశౌచముండును. ఎన్ని మాసముల గర్భస్రావమైనచో అన్ని దినములు ఆశౌచముండును. రజస్వల అయిన స్త్రీ రజోదర్శనము ముగిసినపుడు స్నానముచే శుద్ధి పొందును. వివాహమున ఏడడుగులు నడచుటచే స్త్రీ తన గోత్రమునుండి విడిపోవును. ఆ స్త్రీకి పిండోదకకర్మలు భర్తగోత్రముచే చేయవలయును. పిండదానమునకు ప్రతి పిండమును రెండు పేర్లతో ఇచ్చుట ఉద్దేశ్యము. కావుననే ఆరుగురికి మూడు పిండములు ఉంచవలయును. ఇట్లు చేసినచో దాత మోహమును చెందడు. మాత తన భర్తతో వేయి సంవత్సరములు పిండములను భుజించును. అట్లే పితామహికూడా తన భర్తతో వేయి సంవత్సరములు భుజించును. ఇట్లే ప్రపితామహి కూడా అని తెలియవలయును. తల్లిదండ్రులకు ప్రతి సంవత్సరము శ్రాద్ధమును జరుపవలయును. విశ్వే దేవతా రహితముగా శ్రాద్ధము జరుపవలయును. ఒక పిండమును అర్పించవలయును. నిత్యము నైమిత్తికము, కామ్యము, వృద్దిశ్రాద్ధము, పార్వణము అని శ్రాద్ధము అయిదు విధములు, గ్రహణ సమయమున, సూర్య సంక్రమణమున, పర్వదినములలో, ఉత్సవ దినములలో మూడు పిండములను ఉంచవలయును. అబ్దికమున ఒక పిండమును ఉంచవలయును. వివాహము కాని కన్యకు పిండదానమున సూతకమున విడిగా గోత్రము ఉండదు. వివాహమైన తరువాత వేరు గోత్ర ముండును. ఏ వర్ణముతో కన్యా వివాహము జరుగునో, ఆ వర్ణముతోనే సూతకము పిండోదకములు జరుగును. వివాహము జరిగిన తరువాత నాలుగవ దినము రాత్రినుండి కన్య భర్త గోత్రముతో ఏకత్వమును పొందును. మరణించిన దినమున కాని, రెండు మూడు నాలుగవ దినములలో హితబుద్ధులైన బంధువులు అస్తి సంచయన మును చేయవలయును. వర్ణానుక్రమముగా నాలుగు అయిదు ఏడు తొమ్మిది దినములలో అస్తి సంచయనము చేయవలయునని చెప్పబడినది. చనిపోయిన తరువాత పదకొండవ దినమున వృషభమును వదిలినచో మృతుడు ప్రేతలోకమునుండి విడివడి స్వర్గలోకమును చేరును. నాభిమాత్రజలమున నిలిచి హృదయమున ధ్యానము చేయవలయును. ఓ పితృదేవతలారా! మీరొచ్చి ఈ జలాంజలులను స్వీకరించుడు. రెండు చేతులను దగ్గరికి చేర్చి నీటితో నింపి గోశృంగ పర్యంతము పైకి హస్తములు తెచ్చి నీటి మధ్యలో విడువవలయును. నీటిలో దక్షిణ ముఖముగా నిలిచి జలమును అకాశమున చల్లవలయును. ఆకాశము పితృస్థానము. పితరుల దిక్కు దక్షిణము. జలములు దేవగణములు. జలములే పితృ గణములు. కావున పితరుల హితమును కోరువారు పితరులకు జలతర్పణము చేయవలయును. పగలు సూర్య కిరణములచే తప్తములై, రాత్రి నక్షత్రములచే వాయువుచే, మధ్య కాలమున రెంటిచే జలములు పవిత్రములు అగుచున్నవి. సహజముగా జలము కలశములో ఉన్నను, భూమిపై నున్నను సర్వదా పవిత్రమే. దేవతలకు, పితరులకు జలాంజలి ఈయవలయును. సంస్కార రహితులై మరణించినవారికి స్థలమున జలతర్పణము చేయవలయును. శ్రాద్ధమున హోమ సమయమున ఒక చేతితో ఈయవలయును. తర్పణమున రెండు చేతులతో ఈయవలయును అని ధర్మము వ్యవస్థీకరించబడినది. (1/14)