నారద మహా పురాణము
మోహినీ దర్శనము
వసిష్ఠ మహర్షి పలికెను: రుక్మాంగద మహారాజు మాటలను విని మహాజ్ఞానియగు మునీశ్వరుడు క్షణ కాలము ఆలోచించి కారణమును తెలుసుకొని ఆ కారణమును ఇట్లు చెప్పెను.
వామదేవ మహర్షి పలికెను: ఓ రాజా! నీవు పూర్వజన్మలో శూద్రజాతిలో పుట్టితివి. దారిద్ర్యముతో దుష్టురాలగు భార్యతో బాధలను అనుభవించితివి. పరుల సేవించుటవలన వచ్చిన వేతనముతో భోజనము లభించెడిది. ఇట్లు చాలా సంవత్సరములు దుఃఖములను అనుభవించుచుండి, ఒకప్పుడు బ్రాహ్మణుల వెంట తీర్ధయాత్రలకు వెళ్ళితివి. వారితో అన్ని తీర్థములందు పర్యటించి, బ్రాహ్మణ సేవాపరుడవైతివి. వారి వెంట మధురకు వెళ్ళి వారితో యమునా జలమున స్నానమాడితివి. సర్వతీర్ధోత్తమమగు విశ్రాంతియను తీర్థమున వరాహ మందిరమున పురాణోక్తమగు ఆ శూన్యశయన వ్రత కథను వింటివి. నలుగురి పారణతో ఈ వ్రతము సిద్ధించును. ఈవ్రతమును ఆచరించినచో లక్ష్మీ భర్త, జగన్నాథుడు సకల పాప నాశకుడు నీలమేఘ శ్యాముడగు శ్రీహరి ప్రసన్నుడగును. ఆ కథను వినిన నీవు మరల వరాహమందిరమునకు వచ్చి గృహవలయమును వృద్ధి పరచగల పవిత్రమగు ఆ శూన్యశయన వ్రతమును ఆచరించితివి. గృహస్థాశ్రమమున ఉండువాడు ఈ వ్రతము నాచరించక చేయు గృహస్థ ధర్మములన్నియూ గొడ్రాలివలె వ్యర్ధములగును. ఈ వ్రతము వలన లభించు సుఖము ఈ భూమండలమున దుర్లభము. శ్రావణమాస ద్వితీయనాడు పరమ పవిత్రము. జన్మమృత్యురాపహమగు ఈ వ్రతమును స్వీకరించవలెను. ఈ వ్రతమున లక్ష్మీ సహితుడగు జగన్నాథుని పూజించవలును. పుష్పములనుఫలములను, ధూపదీప చందనాద్యను లేపనములను సమర్పించవలెను. బ్రాహ్మణులకు శయ్యాదానములను వస్త్ర దానములను, భోజనములను సమర్పించవలెను. ఇట్టి కష్టసాధ్యమగు నీ వ్రతమును యధావిధిగా ఆచరించితివి. ఇప్పుడు నీవు చెప్పిన భోగములన్నియు ఆ అశూన్య వ్రతమువలన లభించినవే. ఇంకను విస్తరముగా వినుము. జగన్నాధుడు ప్రసన్నుడు కానిచో ఇన్ని భోగములు లభించవు. ఇది నిజము. నీ పూర్వజన్మలో అశూన్య శయన వ్రతముతో లక్ష్మీనాధుని పూజించితివి. ఇక ఈ జన్మలో ద్వాదశీ వ్రతముచే శ్రీహరిని పూజించుచున్నావు. కావున నీవు తప్పక శ్రీహరి సాయుజ్యమును పొందగలవు. ఓ రాజా! నీవడిగిన ప్రశ్నను వివరించితిని. దీనివలననే నీవు సర్వ సంపదలను పొందితివి. బంధువులకు హితమును కూర్చుచున్నావు. ఓ రాజా నీకు ఇంకను ఏమి చేయవలెను? దేనిని ఈయవలెయును. నీవు శ్రీహరికి భక్తుడవు కావున అన్నిటికి యోగ్యుడవు.
రుక్మాంగద మహారాజు పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా? నేను మందర పర్వతమునకు వెళ్ళదలచితిని. అచటనున్న చాలా ఆశ్చర్యములను చూడకోరుచున్నాను. మీ ఆజ్ఞను అభిలషించుచున్నాను. పుత్రునిపై రాజ్యశాసన భారమును వదిలి తేలికపడి, స్వేచ్ఛాసంచారినై బయలు దేరితిని. నా పనులను నా పుత్రుడు ఆచరించును. అని ఇట్లు పలికిన రాజు మాటలను విని వామదేవుడిట్లు పలికెను. ఇది పుత్రునికి పరమ కర్తవ్యము. ఎల్లపుడు ప్రేమచే తండ్రిని క్లేశముల నుండి విడిపించవలెను. మనోవాక్కాయములచే శక్తి కొలది పితృవాక్య పరిపాలన గావించవలెను. ఇట్లు చేసిన పుత్రుడు ప్రతిదినము గంగాస్నాన ఫలమును పొందును. పితృ వాక్యమును ఉల్లంఘించి గంగాస్నానమునకు వెళ్ళిన పుత్రునికి శుద్ధి కలుగదని శ్రుతి చెప్పుచున్నది. కావున నీవు కృతకృత్యుడవు కావున యధేచ్ఛగా వెళ్ళుము. శ్రీహరి అనుగ్రహము వలన నీకు పుణ్యకార్యములు ఆచరించు పుత్రుడు కలిగెను. ఇట్లు వామదేవుని అనుమతిని బడసి, అశ్వమును అధిరోహించి వాయువువలె శీఘ్రముగా వెళ్ళెను. అన్ని పర్వతములను, వనములను, నదులను, బహ్యశర్చర్యములను, సరస్సులను ఉప మనములను చూచుచు అతి త్వరలో మందరాచలమును చేరెను. శ్వేత పర్వతమును, మందరాచలమును చుట్టి, మహా మేరువును దాటి, ఉత్తర కురుదేశములను చూచి, నూరుమంది సూర్యులతో సమానముగా వెలుగొండు చున్న, అంతటా బంగారముతో ఆవరించబడియున్న శ్రీహరి బాహువులచే అడుమబడిన, కాంచన రసమును స్రవించుచున్న, బహుపర్వత సమాకీర్ణ భూభాగము కలది. బహుధాతు విభూషితము, బహు నిర్థర సంయుక్తము, బహుకందర భూషితము, బహునదీ సంయుతము, శుభములగు గంగాజలములచే ధౌతము, ప్రియులకు సుఖములనందించు, యువతులకు విశ్వాసపాత్రము, యువతులు కుచములబోలిన, ఘట ప్రమాణములు, పరిపక్వములు, సుగంధులు అగు ఫలములతో నిండి ఉన్న వృక్షములు కలది భ్రమరధ్వని సంయుతము, కోకిల స్వరనాదితము, అనేక ప్రాణి రావములచే నాదిత సమస్త ప్రాంతము అగు పర్వతమును చూచుచు మందర పర్వతమును చేరెను. కుతూహలముచే ఆ పర్వతము నధిరోహించుటకు రుక్మాంగద మహారాజు మార్గమును వెతుకుచుండగా, అంతలో అచట ఉన్న ద్రుమపక్షి సంఘమంతయూ మోహినీ ముఖము నుండివచ్చు మధురధ్వనిచే స్తంభితమాయెను. మహారాజు కూడా ఔత్సుక్యముచే ఆ ధ్వని వచ్చు మార్గమును అనుసరించియే బయలుదేరెను. రుక్మాంగదుని చెవిలోకూడా మోహినీ ముఖమునుండి వచ్చు ధ్వని పడెను. ఆ గానమునకు మోహితుడై త్రివిక్రమునివలె లంఘించుచున్న అశ్వమును వదిలి మోహినీ గానముచే మోహితమగు మార్గమున వెళ్ళి క్షణ కాలములో ఆశ్చర్యముతో పర్వతము మీద చక్కగా అగ్నిలో కాల్చి వన్నెపెట్టబడిన బంగారము కాంతిగల, మన్మధ యష్టివలె నిర్మించబడిన, ఆకాశముననున్న ఇంద్ర ధ్వజమును లోకహితము కొఱకు పూజించుచున్న భూమిరూపు దాల్చినట్లుగా, పార్వతివలే రూపరాశి అయిన రూపమును దాల్చిన సముద్రపు చెలియలి కట్టవలెనున్న, రతి మందిరముగా నున్న శరీరము కలది. లింగముగా నాశ్రయించి యున్న త్రినేత్రుని దేవ వినోదము కొరకు ఆకర్షించుచున్న, బ్రహ్మ మనసులోని అభిలాషయే మూర్తీభవించి ఉన్నటుల ఉన్న మోహినిని చూచెను. మోహినీ రూపమును దర్శించి మోహినీ కామ శరములచే కొట్టబడి మూర్ఛనంది అచటనే పడిపోయెను. శరీరమును కామ జ్వరము ఆక్రమించగా మోహిని సమీపమునకు చేరెను. తనను సమీపించుచున్న రుక్మాంగద మహారాజును మోహిని కటాక్షములతో పరికించెను. వీణను వదిలి గానమును ఆపివేసెను. తానొచ్చినపని ఆసన్నమైనదని తలచెను. తన వస్త్రముచే మృగపక్షి సంఘములను తిరస్కరించుచు, గండ భుజములను శ్వాస సుగంధమునకు మోహించి అనుసరించి యున్న తుమ్మెదలను వారించుచు రాజు సమీపమునకు వెళ్ళెను శివలింగమును విడిచి రుక్మాంగద మహారాజు ప్రక్కనచేరి ఉదారచేష్టలుకల, పద్మపత్ర నేత్రయగు మోహినీ దేవి మధురముగా మనోజ్ఞముగా ఇట్లు పలికెను. కామ శరాభితప్తుడగు రుక్మాంగద మహా రాజును గూర్చి ఓ రాజా! లెమ్ము నేను నీ వశములో నుండుదానను. మూర్చచే ఈ దేహమును ఏల క్షీణింప చేయుచున్నావు? ఇంత గొప్ప భూభారమును తృణముగా భావించిన నీవు మనసును హరించు నా రూపమును చూచి సహించజాలవా? నా రూపమును చూచి ఏల మూర్ఛిల్లుచున్నావు? నీవు దృఢముగా నుండుము. ధీరుడవు. వీరుడవు. ఉదార చేష్ఠుడవు అగు నిన్ను నీవేల చులకన చేసుకొనుచున్నావు? ఒకవేళ నీకు నా సమాగమము నందు కోరికయున్నచో ధర్మయుక్తముగా నేనడిగిన దానిని దానము చేసి రతిజ్ఞురాలనగు నన్ను దాసిని అనుభవించునట్లు యధేచ్ఛముగా అనుభవించుము. (II/11)