నారద మహా పురాణము
సంధ్యావళీ కథనము
వసిష్ఠ మహర్షి పలికెను: బ్రహ్మ పుత్రిక యగు మోహిని సంధ్యావళీ దేవి మాటలను విని మోహ పరవశురాలై స్వకార్య తత్పరురాలై ఇట్లు పలికెను. ఓ శుభకరురాలా? నీవిట్లు ధర్మాధర్మ స్వరూప మును తెలిసి భర్త కొరకు ధన జీవితమును ఈయదలచినచో నేను జీవితమున కంటే అధికమగు విత్తమును యాచించెదను. నీకు చాలా ఇష్టమగునది హృదయము కంటె అధికమగు నీ పుత్రుని శిరమును నాకిమ్ము. నీ భర్త ఏకాదశినాడు భోజనము చేయనిచో నీ భర్తయే స్వయముగా తన హస్తమున ఖడ్గమును తీసుకొని, చంద్రబింబము వంటి శుభకరమగు, మీసములు మొలవని, కుండల విభూషితము అగు పుత్రుని శిరమును ఛేదనము గావించి నావడిలో పడవేయవలయును. ఏకాదశిన భుజించనిచో ఈ పనిని చేయమని చెప్పుము. మోహినీదేవి పలికిన పరుషపదజాలమును వినిన సంధ్యావళీ దేవి శీతార్తయగు కదలీ వృక్షమువలె క్షణకాలము వణకెను. తరువాత ధైర్యమును కూడగట్టుకొని మోహిని ఎదురుగా నవ్వుచు మోహినితో ఇట్లు పలికెను. ఓ సుందరీ! పురాణములో ద్వాదశిని గురించి స్వర్గమోక్ష ప్రదములగు చాలా కథలు వినబడుచున్నవి. ధనమును, భార్యను, జీవితమును, గృహమును, దేశమును, రాజును, స్వర్గమును, మిత్రుని, గురువును, తీర్ధమును, ధర్మమును అత్యంత ప్రియమును కూడా ఏకాదశీ వ్రతము కొఱకు విడువవలెను. యోగమును, దానమును, జ్ఞానమును, పుణ్యక్రియలను కూడా విడువవలెను. తపస్సును, విద్యను, సిద్ధిని మోక్షమును కూడా విడువవలెను. కాని శుక్ల కృష్ణ పక్షములలోని ద్వాదశిని మాత్రము విడువరాదు. బంధువులు, పుత్రులు, సోదరులు, మిత్రులు, ప్రియులు ఈ లోకమున సంబంధము కలవారు. కాని ద్వాదశి మాత్రము ఇహపరములను సాధించగలది. ద్వాదశీ ప్రభావముచే సర్వము క్షేమప్రదము కాగలదు. కావున ఓ సుందరీ! నీ సంతోషము కొఱకు ధర్మాంగదుని శిరమును ఇప్పించ గలను. నా మాటయందు విశ్వాసముంచి సంతోషించుము. ఓ మంగళప్రదురాలా! ఈ విషయముననే పురాతనమగు ఇతిహాసమొకటి కలదు. దానిని నీకు చెప్పెదను. సావధానముగా వినుము.
పూర్వకాలమున ధర్మపరాయణుడగు విరోచనుడను దైత్యుడుండెను. అతని భార్య విశాలాక్షి. బ్రాహ్మణ పూజాపరురాలు. ప్రతిదినము ప్రాతఃకాలము ఒక ఋషిని యథావిధిగా పూజించి అతని పాదోదకమును భక్తితో సంతోషముతో పానము చేసెడిది. హిరణ్యకశ్యపుడు మరణించిన తరువాత ఉగ్రతేజస్సుగల ప్రహ్లాద పుత్రుడగు విరోచనుడు రాజ్యపాలన చేయుచుండగా భూమండలవాసులు నిశ్చింతులైరి. ఒకపుడు ఇంద్రాది దేవతలు గురువును చేరి శత్రు తాపితులమగు మేము ఏమి చేయవలయును అని అడిగిరి. వారి మాటలను వినిన బృహస్పతి దుఃఖితులగు దేవతలు విష్ణువునకు మొరపెట్టుకొన వలయునని చెప్పెను. అమిత తేజోవంతుడగు గురు వాక్యమును వినిన దేవతలు విరోచన వధ కొరకు వైకుంఠమునకు వెళ్ళి దేవశ్రేష్టుడగు శ్రీహరిని ఈ విధముగా స్తుతించిరి.
దేవతలు పలికిరి: దేవాధిదేవుడు అమిత తేజోవంతుడగు శ్రీ మహావిష్ణువునకు నమస్కారము. భక్త విఘ్న వినాశకునకు, వైకుంఠునకు నమస్కారము. శ్రీహరికి, అద్భుత సింహునకు, వామనునకు, మహాత్మునకు, వరాహరూపునకు, మత్స్యరూపునకు, ప్రళయాబ్ధ నివాసికి నమస్కారము, కూర్మ రూపునకు, మంధరాచలధారికి, భార్గవరామునకు, అబ్ధిశాయికి, శ్రీరామునకు, అఖిలలోకనాథునకు, విశ్వేశునకు, సాక్షికి నమస్కారము. దత్తాత్రేయునకు, శుద్ధునకు, కపిలునకు, ఆర్తిహారికి, యజ్ఞ రూపునకు, ధర్మధారకునకు, సనకాది స్వరూపునకు, ధ్రువవర ప్రదాతకు, పృధునకు, భూరికర్మునకు, ఋషభునకు, విశుద్ధునకు, హయశీర్షధర రూపునకు, హంసునకు, ఆగమరూపునకు, అమృత కుంభధారికి నమస్కారము. శ్రీకృష్ణునకు వాసుదేవునకు సంకర్షణ దేహధారికి, ప్రద్యుమ్నునకు, అనిరుద్ధునకు, బ్రహ్మకు, శంకరునకు, కుమారస్వామికి, గణేశునకు, నందికి, భృంగికి నమస్కారము. గంధమాదన నివానికి, నరనారాయణ స్వరూపునకు, జగన్నాథునకు, నాథునకు, రామేశ్వరునకు నమస్కారము. ద్వారకా నివాసికి, తులసీవనవాసికి, కమలనాభునకు, పద్మపాదునకు నమస్కారము. కమలహస్తునకు, కమలాక్షునకు, కమలాపాలకునకు, కేశవునకు నమస్కారము, భాస్కరరూపునకు, చంద్ర రూపధరునకు, లోకపాల స్వరూపునకు, ప్రజాపతి రూపునకు, భూత గ్రామ స్వరూపునకు, జీవరూపునకు తేజోమూర్తికి, జయమునకు, జయికి, నేతకు, నియమమునకు, క్రియా రూపునకు, నిర్గుణునకు, నిరీహునకు, నీతిజ్ఞునకు, క్రియారహితునకు, బుద్ధునకు, కల్కి రూపునకు, క్షేత్రజ్ఞునకు, అక్షరునకు, గోవిందునకు, జగద్భర్తకు, అనన్తునకు, ఆద్యునకు, శార్జికి నమస్కారము. శంఖధారికి, గదాధారికి, చక్రధరునకు నమస్కారము. ఖడ్గశూలాది సర్వశస్త్రాస్తధారికి, శరణ్యునకు, వరేణ్యునకు, పరునకు, పరమాత్మకు, హృషీకేశునకు, విశ్వునకు, విశ్వరూపునకు నమస్కారము. కాలనాభునకు, కాలునకు, చంద్ర సూర్యనేత్రునకు, పూర్ణునకు, పరిసేవ్యునకు, పరాత్పరతరునకు, జగత్కర్తకు, జగద్భర్తకు, జగద్ధాతకు అంతకునకు, మోహికి, క్షోబికి, కామరూపికి, అజునకు, సూరికి నమస్కారము. ఓ భగవన్! మేము దైత్యతాపితులమై, నిన్ను శరణువేడుచున్నాము. కావున ఓ యఖిలాధారా! మేము ఆనందముగా ఉండునట్లు చేయుము. మేము పుత్ర మిత్ర కళత్రాది సహితులమై ఆనందముగా విహరించునట్లు చేయుము. ఇట్లు దేవతలు చేసిన స్తోత్రమును వినిన శ్రీహరి సంతోషించి దైత్య పీడితులగు దేవతలకు దర్శనము నిచ్చెను. వారు స్నిగ్ధ మానసుడగు వైకుంఠుని చూచి ఆదరముతో విరోచనవధ కొరకు ప్రార్థించిరి. ఇంద్రాదుల కార్యమును విని కార్యజ్ఞులలో శ్రేష్ఠుడు వృద్ధ బ్రాహ్మణ రూపమును ధరించి విరోచనుని ఇంటికి వెళ్ళెను. బ్రాహ్మణ పూజాకాలమున కార్యసాధకుడు వచ్చెను. ఆ బ్రాహ్మణుని చూచి విశాలాక్షి సంతుష్టాంతరంగయై అపూర్వ భక్తి భావముతో సత్కరించి ఆసనము నొసంగెను. ఆ బ్రాహ్మణుడు ఆమె ఇచ్చిన ఆసనము నంగీకరించక ఆమెతో ఇట్లు పలికెను: ఓ దేవీ! నేను నీవు ఇచ్చు అసనమును స్వీకరించను. నేనొచ్చిన కార్యమును వినుము. నా మనసున ఉన్న పనిని తెలుసుకొని అంగీకరించు. వారి పూజనే నేనుస్వీకరించెదను. బ్రాహ్మణ వృద్ధుని వాక్యమును విని వాక్య విశారదురాలగు విశాలాక్షి విష్ణుమాయా మోహితురాలై స్త్రీత్వము వలన మిక్కిలి సంతోషించి ఇట్లు పలికెను.
విశాలాక్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! నీ మనసున ఉన్న దానిని ఇచ్చెదను. కావున నేనిచ్చు ఆసనమును స్వీకరించుము, వాంచితార్ధ ప్రదమగు పాదోదకమును ఇమ్ము. విశాలాక్షి ఇట్లు పలుకగా ఆ బ్రాహ్మణ వృద్ధుడు నేను స్త్రీ పలుకులను విశ్వసించను. నీ భర్త ఈ మాట చెప్పినచో విశ్వసించెదనని పలికెను. వృద్ధ బ్రాహ్మణుని మాటలను విని విరోచుని గృహిణి అపుడే భర్తను పిలిపించెను. దూత వాక్యముతో ప్రహ్లాద పుత్రుడగు విరోచనుడు సంతోషముతో అచటికి వచ్చెను. విశాలాక్షి ఉన్న అంతః పురమును చేరెను. వచ్చిన భర్తను చూచి ధర్మపరాయణురాలగు విశాలాక్షి లేచి నమస్కరించి బ్రాహ్మణునకు మరల ఆసనమును అర్పించెను. వృద్ధ బ్రాహ్మణుడు ఆసనమును స్వీకరించకపోవుటచే, తన భర్తరాక్షస రాజగు విరోచనునితో జరిగిన వృత్తాంతమును వివరించెను. భార్యయందుగల ప్రీతిచే విరోచనుడు విశాలాక్షి మాట నంగీకరించెను. విరోచనుడు అంగీకరించగనే అతని మనసును తెలుసుకొని వృద్ధ బ్రాహ్మణుడు సంతోషముతో మీ ఆయుష్యమును నాకు అర్పించుడని పలికెను. అపుడు ఆ దంపతులు తమ ఆచారముతో మోహితులై ఒక ముహూర్త కాలము ధ్యానములో ఉండి చేతులు జోడించి బ్రాహ్మణునితో ఇట్లు పలికిరి. ఓ బ్రాహ్మణోత్తమా! మా జీవితమును స్వీకరించుము. నాకు పాదోదకమును ఇమ్ము. నీవు చెప్పిన మాటను నిజము చేతుము. సంతోషించుము. అంతట బ్రాహ్మణుడు ప్రీతికలవాడై విశాలాక్షి సమర్పించిన ఆసనమును స్వీకరించి భక్తి ప్రీతుడగు జనార్దనుడు విశాలాక్షికి పాదోదకము నిచ్చెను. అంతట విశాలాక్షి సంతోషముతో భర్తతో కలిసి బ్రాహ్మణుని పాదములను కడిగి ఆ పాదజలమును శిరస్సుపై ధరించిరి. అంతట వెంటనే ఆ దంపతులు దివ్య రూపమును ధరించి ఉత్తమ విమానమును అధిరోహించి విష్ణుపదమునకు వెళ్ళిరి. అంతట ప్రసన్ను డగు శ్రీహరి దేవతల వ్యసనమును తొలగించి, దేవగణములచే స్తుతించబడుచు వైకుంఠ భవనమునకు వెళ్ళెను. ఇట్లే నీకు చేసిన ప్రతిజ్ఞననుసరించి నేను కూడా ఈయవలయును. రుక్మాంగదుడను నా భర్తను సత్యమునుండి తప్పించజాలను. మానవులకు సత్యమే సద్గతిని ఇచ్చును. సత్యమునుండి తప్పిన మానవుడు చండాలున కంటే అధముడగును. ఇట్లు సంధ్యావలీదేవి బ్రహ్మపుత్రి యగు మోహినితో పలికి కోమలారుణాంగుళులుకల చేతులతో ఎఱ్ఱనైన భర్త పాదములను పట్టుకొనెను. (11/32)