ద్వాదశమాసస్థిత దశమీ వ్రత కథనము

సనాతన మహర్షి పలికెను: ఇపుడు నీకు దశమీ వ్రతములను చెప్పెదను. ఈ వ్రతములను చేయు మానవుడు ధర్మరాజునకు ఇష్టుడగును. చైత్రశుక్ల దశమినాడు ఆ సమయము లభించు ఫలపుష్పాదులచే గంధాదులచే ధర్మరాజును పూజించవలెను. ఉపవసించి కాని ఏక భుక్తముతో కాని పూజించి పదునాలుగు మంది బ్రాహ్మణులను భుజింపచేసి శక్తి కొలది దక్షిణను ఈయ వలెయును. ఇట్లు ధర్మరాజును పూజించువాడు ధర్మరాజాజ్ఞచే దేవతలతో సమానుడగును. వైశాఖ శుద్ధ దశమినాడు శ్రీమహావిష్ణువును గంధాద్యుపచారములతో, సువాసనగల తెల్లని పూవులచే పూజించి, నూరు ప్రదక్షిణలను ఆచరించి, ప్రయత్నముతో బ్రాహ్మణులను భుజింపచేసినచో శ్రీ విష్ణు లోకమును పొందును. జ్యేష్ఠశుద్ధ దశమినాడు గంగానది స్వర్గము నుండి భూలోకమున కొచ్చెను కావున ఈ దశమి పరమ పవిత్రమైనది. జ్యేష్టమాస శుక్ల పక్షము, బుధగ్రహము, దశమీ తిధి, గర, ఆనంద వ్యతీపాతములు, కన్యేందువు, వృషభ, సూర్యుడు ఈ దశయోగము మహా పుణ్యతమము. ఈ యోగము పది పాపములను హరించును కావున దీనిని దశహర అందురు. ఈ దినమున గంగానదికి వెళ్ళి, ప్రీతితో యథావిధిగా గంగా జలమున స్నానము చేసినవాడు శ్రీహరి లోకమును చేరును. ఆషాఢ శుక్లదశమి పవిత్రమైనదని మన్వాదులు చెప్పిరి. ఈ దినమున స్నానము, జపము, దానము హోమములు స్వర్గమును ప్రసాదించును. శ్రావణ శుక్ల దశమి సర్వాశాపూరకము. ఈ రోజు శివుని గంధాద్యుపచారములచే పూజించవలయును. ఉపవాసము కాని ఏకభుక్తము కాని చేయుచు, బ్రాహ్మణులను భుజింపచేసి, జపము, హోమము, గోవులకు అన్నదానము సర్వ పాపనాశకము. భాద్రపద శుక్లదశమినాడు దశావతార వ్రతము చెప్పబడినది. ఈ దినమున జలాశయమున స్నానముచేసి సంధ్యావందనమాచరించి, దేవర్షి పితృ తర్పణము చేసి, సావధానముతో దశావతారములను పూజించ వలెను. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, శ్రీరామ, పరశురామ, కృష్ణ, బుద్ద కల్కులు దశావతారములు. బంగారముతో దశావతార మూర్తులను చేయించి, యధావిధిగా పూజించి పదిమంది బ్రాహ్మణులను పూజించి దానము చేయవలెను. ఉపవాసమును కాని ఏక భుక్తమును కాని చేసి బ్రహ్మచారులకు భోజనము పెట్టి విడిచి తాను భుజించవలెను. ఈ వ్రతమును భక్తిచేచేసి ఇహలోకమున సకల భోగములను అను భవించి అంతమున విమానమును అధిరోహించి విష్ణులోకమును చేరును.

ఆశ్వయుజ శుద్ధ దశమిని విజయదశమి అందురు. ప్రాతః కాలమున గృహాంగణమున (వాకిట) నాలుగు గోమయ పిండములను చక్రవాళ రూపమున ఉంచి వాటిమధ్య భాగమున రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను పూజించవలెను. మూత ఉన్న నాలుగు గోమయ పాత్రలలో క్లిన్నమగు (తడిసిన) ధాన్యమును వెండితో నుంచి ధౌత వస్త్రముతో కప్పి పితృమాతృ భ్రాతృపుత్ర జాయా భృత్య సమన్వితముగా యధావిధిగా గంధపుష్ప నైవేద్యాదులతో పూజించి నమస్కరించి, బ్రాహ్మణులను భుజింపచేసి, పూజించి, దక్షిణనిచ్చి, తాను భుజించవలెను. ఇట్లు వ్రతమును ఆచరించినవాడు ఆ సంవత్సరము ధనధాన్య సమృద్ధి కలవాడై సుఖముగా ఉండును. ఇక అపరాహ్ణ సమయమున దశమినాడు చక్కగా పూజించిన తూర్పుదిక్కుననున్న శమీవృక్ష ప్రాంతమునకు వెళ్ళి దాని మూలమున ఉన్న మట్టిని తీసుకొని స్వగృహము నకు వచ్చి, గీతవాద్య ధ్వనులతో అ మట్టిని యధావిధిగా పూజించి సిద్ధముచేసి, తన పరివార బలముతో పూర్వ ద్వారమునుండి బయలు వెడలి స్వస్ధ చిత్తముతో గ్రామమునకు బయటవెళ్ళి, పత్రకాదులచే చేయబడిన శత్రు ప్రతికృతిని కాని, మనసుతో కల్పించిన ప్రతికృతిని కాని బాణముతో బాగుగాకొట్టి సంతోషముతో తన ఇంటిని చేరవలెను. ఇట్లుచేసిన తరువాత శత్రువును ఓడించుటకు యుద్ధమునకు కూడా వెళ్ళవచ్చును. ఇట్లు విజయదశమిని యధావిధిగా ఆచరించినవారు ధనమును, జయమును, పుత్రులను, గోవులను, గజములను, అశ్వములను, మేకలను, గొఱ్ఱెలను ఇహలోకమున పొంది అంతమున స్వర్గమును చేరును.

ఇక కార్తీక శుక్ల దశమినాడు సార్వభౌమ వ్రతము నాచరించవలెను. ఏక భుక్తముతోకాని ఉపవాసముతోకాని, నిశీథ కాలమున అపూపాదులతో పదిదిక్కులందు ఇంటి వెలుపలకాని గ్రామమునకు వెలుపల కాని బలిని అర్పించవలెను. గోమముచే అలికిన భూమి మీద అష్టదళ పద్మమును లిఖించి, గణేశాదులను ఈ మంత్రములచే అర్పించవలెను. నేను చేసిన పాపకర్మచే పూర్వ దిక్కున ఉన్న పాపమును దేవరాజగు ఇంద్రుడు ఇప్పుడు నశింపచేయు గాక. నేను చేసిన పాపకర్మలచే ఆగ్నేయ దిక్కున ఉన్న నా పాపరాశిని అఖిలేష్ట ప్రదుడు తేజోరాజగు అగ్ని నశింపచేయు గాక. నా పాపకర్మల వలన దక్షిణ దిక్కుననున్న నా పాపరాశిని అఖిలేష్ట ప్రదుడు ప్రేత రాజగు యముడు నశింపజేయుగాక. నా పాపకర్మల వలన నైఋతి దిశలో ఉన్న పాపరాశిని అఖిలేష్ట ప్రదుడు రారాజగు నిఋతి నశింపచేయు గాక. నా పాపకర్మల పశ్చిమ దిక్కునను నా పాపరాశిని అఖిలేష్ట ప్రదుడు యాదః పతియగు వరుణుడు నశింపచేయుగాక! నా పాపకర్మల వలన వాయవ్య దిక్కున నున్న పాపరాశిని అఖిలేష్టప్రదుడు మరుత్తుల రాజగు వాయువు నశింపచేయుగావుత. నా పాపకర్మల వలన ఉత్తర దిక్కున నున్న నా పాపరాశి అఖిలేష్ట ప్రదుడు ఋక్షయక్ష అధిపతియగు సోముడు నశింపచేయుగాక. నా పాపకర్మల వలన ఈశాన్య దిక్కున నున్న నా పాపరాశిని అఖిలేష్టప్రదుడు భూతనాధుడగు ఈశానుడు నశింపజేయుగాక. నా పాప కర్మల వలన ఊర్థ్వ దిక్కున ఉన్న నా పాపరాశిని అఖిలేష్టప్రదుడు ప్రజాపతియగు బ్రహ్మ నశింపచేయు గాక. నా పాపకర్మ వలన అధో భాగమున నున్న నా పాపరాశిని అఖిలేష్ట ప్రదుడు నాగరాజగు అనంతుడు నశింపచేయు గాత! అని ఇట్లు సావధానముతో పది దిక్కులందు బలిని ఇచ్చి దాని వెలుపల క్షేత్ర పాలునకు బలినీయవలెను. ఇట్లు ఆచరించి మిగిలిన రాత్రిని మంగళ గీతములచే స్తుతి పాఠములచే, జపాదులచే గడుపవలెను. ప్రాతః కాలమునలేచి స్నానముచేసి లోకపాలులను బ్రాహ్మణులను పూజించి, పన్నెండు మందిని భుజింపచేసి శక్తికొలది దక్షిణను ఈయవలెను. ఇట్లు వ్రతము ఆచరించి ఇహలోకమున భోగములను అనుభవించి ఒక యుగకాలము స్వర్గ సుఖమును అనుభవించి సార్వభౌముడు అగును.

మార్గశీర్ష శుద్ధ దశమినాడు ఆరోగ్య వ్రతమును ఆచరించవలెయును. పదిమంది బ్రాహ్మణులను గంధాదులతో పూజించి, వారి పాదోదకమును పానముచేసి దక్షిణను ఇచ్చి విడిచి ఏక భుక్తముగా ఉండవలెను. ఈ వ్రతమును చేసినవారు భూలోకమున ఆరోగ్యమును పొంది, ధర్మరాజానుగ్రహముచే స్వర్గమున దేవతవలె ఆనందింతురు. పుష్య శుక్ల దశమినాడు విశ్వేదేవతలను పూజించవలెను. క్రతువును, దక్షుని, వసువులను, సత్యుని, కాలుని, కాముని, మునిని, గురువును, విప్రుని, రాముని ఈ పదిమందిలో పదిరూపులుగా కేశువుడు ఉన్నాడు. ఈ పదిమందిని దర్భల రూపముగా ఆసనములపై స్థాపించి గంధధూప దీప నైవేద్యములచే పూజించి ఒక్కొక్కరికి దక్షిణలను ఇచ్చి విడువవలెను. ఆ దక్షిణలను బ్రాహ్మణులకు కాని గురువుకు కాని సమర్పించవలెను. ఇట్లు ఏకభుక్తముతో ఈ వ్రతము అనాచరించినవాడు ఇహపరములలో భోగములను అనుభవించును. మాఘశుక్ల దశమినాడు ఉపవసించి జితేంద్రుయుడై అంగిరసులను పేరుగల పదిమంది దేవతలను బంగారుమూర్తులను చేసి గంధాద్యుపచారములచే చక్కగా పూజించవలెను. ఆత్మా, ఆయువు, మనసు, దక్షుడు, మద, ప్రాణ, బర్హిష్మాన్, గనిష్ఠుడు, దత్తుడు, సత్యుడు అనువారలు దశాంగిరసులు. పదిమంది బ్రాహ్మణులకు మధురాన్నము లతో భోజనము పెట్టి, దశస్వర్ణమూర్తులను క్రమముగా దానము చేయవలెను. ఫాల్గుణ దశమినాడు పదునాలుగు మంది యములను పూజించవలెను. యముడు, ధర్మరాజు, మృత్యువు, అంతకుడు, వైవస్వతుడు, కాలుడు, సర్వ భూతక్షయుడు, జౌదుమ్బరుడు, దధ్నుడు, నీలుడు, పరమేష్ఠి, వృకోదరుడు, చిత్రగుప్తుడు అనువారలు పదునాలుగు మంది యములు. గంధాద్యుపచారములతో చక్కగా పూజించి తిల అంబు మిశ్రాంబులతో దర్భలతో ఒక్కొక్కరికి మూడుమార్లు తర్పణము చేయవలెను. తరువాత తామ్ర పాత్రతో రక్తచన్దన సమంమిశ్రితి లాక్షతయ వాంబువులతో సూర్యునకు అర్ఘ్యమీయవలెయును. ఓ సూర్యా! సహశ్రాంశూ? తేజోరాశీ! జగత్పతీ రమ్ము. నేను భక్తితో నిచ్చు అర్ఘ్యమును స్వీకరించి నన్ను దయచూడుము అను మంత్రముతో అర్ఘ్యమును ఇచ్చి పదునాలుగు మంది బ్రాహ్మణులను భుజింపచేసి, వెండిని దక్షిణగా నిచ్చి విడిచి, తాను భుజించవలెను. ఇట్లుయధావిధిగా వ్రతమును ఆచరించినవాడు ధర్మరాజాను గ్రహము వలన ఇహలోకమున పుత్రాది సకల భోగములను అనుభవించి, ఉత్తమ విమానమును అధిరోహించి దేహాంతమున విష్ణులోకమును చేరును. (4/119)