ద్వాదశమాసస్థిత ఏకాదశీ వ్రత కథనము

సనాతన మహర్షి పలికెను: మాసములలోని రెండు పక్షములలోని ఏకాదశి యందు నిరాహారుడై, సావధానముతో బహువిధ పుష్పములతో విచిత్రమగు మండపమును చేయవలెను. స్నానముచేసి యథావిధముగా ఉపవాసముతో జితేంద్రియుడై శ్రద్ధతో సావధానముగా యధావిధిగా బహు విధోపచారములతో శ్రీమహావిష్ణువును పూజించి జపహోమ ప్రదక్షిణములతో స్తోత్ర పాఠములతో, బహువిధ గీతములతో, మనోహరములగు వాద్యములతో, దండవత్ప్రణామములతో, మనోహరమగు జయశబ్దములతో ఆరాధించి, రాత్రియందు జాగరణమును చేసిన శ్రీమహావిష్ణువుయొక్క పరమపదమునుచేరును. చైత్ర శుక్ల ఏకాదశినాడు ఉపవసించి మూడు దినములందు చెప్పబోవు నియమములు అన్నింటిని ఆచరించి, ద్వాదశినాడు సనాతనుడగు వాసుదేవుని భక్తితో పూజించవలెను. షోడశోపచార పూజకావించి బంధువులను భుజింపచేసి వారికి దక్షిణనిచ్చి విడిచి తాను భుజింప వలెను. ఈ ఏకాదశి కామదా అనబడును. ఇది సర్వపాతక నాశిని. భుక్తి ముక్తి ప్రదాయిని. కావున భక్తితో చక్కగా ఉపవసించవలెను. వైశాఖ కృష్ణకాదశిని వరూధిని అందురు. ఈ రోజు యథావిధిగా ఉపవసించి, మరునాడు మధుసూదనుని పూజించవలెను. స్వర్ణమును అన్నమును నానాధేనువులను ఈ రోజు దానముచేసిన చాలా విశేషఫలము కలుగును. మానవుడు నియమతత్పరుడై వరూధినీ వ్రతము ఆచరించి సర్వపాపవినిర్ముక్తుడై విష్ణు పదమును పొందును. వైశాఖ శుక్ల ఏకాదశి మోహిని అనబడును. ఈనాడు చక్కగా ఉపవసించి మరునాడు స్నానముచేసి చక్కగా గంధాదులతో పురుషోత్తముని పూజించి బ్రాహ్మణులను భుజింపచేసిన పాతకములనుండి విముక్తుడగును. జ్యైష్ఠ శుక్ల ఏకాదశి పరా అనబడును. ఈ దినమున చక్కగా ఉపవసించి, ద్వాదశినాడు నిత్య కృత్యములను ఆచరించి త్రివిక్రముని చక్కగా పూజించి, బ్రాహ్మణోత్తములను భుజింపచేసి వారికి దక్షిణను ఇచ్చి సర్వపాపవినిర్ముక్తుడై విష్ణులోకమును చేరును. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నిర్మలా అనబడును. సూర్యోదయమునుండి మరల సూర్యోదయము వరకు ఉండును. ద్వాదశినాడు ప్రభాతకాలమున నిత్యకృతములను ఆచరించి, షోడశోపచారములచే హృషీకేశుని చక్కగా పూజించి, బ్రాహ్మణులను భుజింపచేసి, భక్తితో దక్షిణలనిచ్చి ఇరువది నాలుగు ఏకాదశీ వ్రత ఫలమును పొందును. ఆషాఢ బహుళ ఏకాదశినాడు యోగినీ అనిపేరు. ఆరోజు చక్కగా ఉపవసించి శ్రీమన్నారాయణుని చక్కగా ఆరాధించి, ద్వాదశినాడు నిత్య కృత్యములను ఆచరించి, శ్రీహరిని పూజించి, బ్రాహ్మణులను భుజింపచేసి, దక్షిణను ఇచ్చి సర్వదాన ఫలమును పొంది శ్రీవిష్ణులోకమున ఆనందించును. ఆషాఢశుక్ల ఏకాదశినాడు ఉపవసించి యథావిధిగా శుభప్రదమగు మండపమున శంఖ చక్ర గదా పద్మములను ధరించి నాలుగు భుజములతో నున్న శ్రీమహావిష్ణువు యొక్క బంగారు లేదా వెండి ప్రతిమను పీతాంబరధరునిగా నిర్మించి శుభ్రమగు చక్కగా పరిచిన పర్యంకమున నుంచి మన్త్రముతో పంచామృతములతో శుద్ధజలముతో పురుష సూక్తముతో స్నానము చేయించి పాద్యము నుండి నీరాజనము వరకుగల ఉపచారములను చేసి శ్రీహరిని ప్రార్థించవలెను. ఓ జగన్నాథా! నీవు నిదురించినచో ఈ జగమంతయు నిదురించును. నీవు మేలుకొనిన జగత్తు చరాచరము మేలుకొనును అని ఇట్లు ప్రార్థించి స్వామిముందు చాతుర్మాస్యవిధి కొఱకు చెప్పబడిన నియమములను యధాశక్తిగా భక్తిచే స్వీకరించవలెను. మరునాడు అనగా ద్వాదశిన ప్రాతఃకాలమున శేషశాయిని షోడశోపచారములచే చక్కగా పూజించి బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలతో సంతోషింపచేసి తాను మౌనముగా భుజింపవలెను. అప్పటి నుండి ప్రతిదినము గంధాదులతో పూజింపవలెను. ఇట్లు యధావిధిగా శ్రీహరి శయన వ్రతము ఆచరించి శ్రీహరి అనుగ్రహమువలన భుక్తిని ముక్తిని పొందును.

శ్రావణ బహుళ ఏకాదశి కామిక అనబడును. ఈ దినమున నియమముతో ఉపవసించి ద్వాదశినాడు నిత్యకృత్యములను ఆచరించి శ్రీధరుని షోడశోపచారములతో పూజించి బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణను ఇచ్చి, విడిచి, తాను బంధువులతో కలసి భుజించవలెను. ఇట్లు కామికావ్రతమును ఆచరించినవాడు ఇహలోకమున అన్ని కామనలను పొంది అంతమున శ్రీహరి లోకమును చేరును. శ్రావణ శుద్ధ ఏకాదశి పవిత్ర అనబడును. ఈనాడు ఉపవసించి, ద్వాదశినాడు నియమముగా జనార్దనుని షోడశ ఉపచారములతో పూజించి బ్రాహ్మణులను భుజింపచేసి వారికి దక్షిణలనిచ్చి, సద్గుణవంతుడగు పుత్రుని ఇహలోకమున పొంది, అంతమున సర్వదేవ నమస్కృతుడై పరమపదమును చేరును. భాద్రపద బహుళ ఏకాదశి ఆజా అనబడును. ఈనాడు చక్కగా ఉపవసించి, ద్వాదశినాడు బహువిధోపచారములతో ఉపేంద్రుని అర్చించి, మృష్టాన్నములతో బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలను ఇచ్చి విడువవలెను. ఇట్లు సావధానముతో భక్తితో అజావ్రతము ఆచరించినవాడు ఇహలోకమున సకల భోగములను అనుభవించి అంతమున శ్రీవిష్ణులోకమును పొందును. భాద్రపద శుద్ధ ఏకాదశి పద్మా అనబడును. ఈనాడు ఉపవసించి నిత్యార్చనమును గావించి కటిదానమును చేయవలెను. మొదట స్థాపించ బడియున్న ప్రతిమను ఉత్సవ విధానముతో జలాశయమునకు గొనిపోయి జలస్పర్శ గావించి, యథావిధిగా పూజించి, మండపమునకు గొనివచ్చి వామపార్శ్వమున పరుండబెట్టవలెను. మరునాడు ద్వాదశీ ప్రభాత కాలమున వామనుని గంధాదులతో చక్కగా పూజించి, బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలను ఇచ్చి విసర్జించవలెను. ఇట్లు పరమోత్తమమగు పద్మా వ్రతమును ఆచరించినవాడు ఇహమున భుక్తిని పొంది పరమున ముక్తిని పొందును. అశ్వయుజ బహుళ ఏకాదశి ఇందిరా అనబడును. ఆ రోజు ఉపవసించి, మధ్యాహ్న కాలమున శాలగ్రామ శిలాగ్రమున శ్రీమహావిష్ణువునకు ప్రీతికరమగు శ్రాద్ధము ఆచరించవలెను. మరునాడు ఉదయము పద్మనాభుని పూజించి, బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలనిచ్చి విడిచి తాను భుజించవలెను. ఈ వ్రతమును ఆచరించినవాడు ఇహమున అభీష్ట భోగములను అనుభవించి, పితృకోటి నుద్ధరించి అంతమున విష్ణులోకమును చేరును. ఆశ్వయుజ శుక్ల ఏకాదశి పాశా అనబడును. ఈనాడు చక్కగా ఉపవసించి ద్వాదశినాడు విష్ణువును పూజించి బ్రాహ్మణులను భుజింప చేసి దక్షిణల నిచ్చి భక్తితో నమస్కరించి విడిచి తాను భుజించవలెను. ఈ వ్రతమును భక్తితో ఆచరించిన వాడు ఇహలోకమున సకల భోగములను అనుభవించి అంతమున శ్రీమహా విష్ణులోకమును చేరును.

కార్తిక కృష్ణ ఏకాదశి రమా అనబడును. ఈనాడు ఉపవసించి ద్వాదశినాడు ప్రాతఃకాలమున కేశిహంత దేవదేవుడు సనాతనుడగు కేశవుని పూజించి బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణ నొసంగి విసర్జించవలయును. ఇట్లు వ్రతమును ఆచరించినవాడు ఇహమున అఖిల భోగములను అనుభవించి అంతమున విమానముతో శ్రీపతి సాన్నిధ్యమును చేరును. కార్తిక శుక్ల ఏకాదశి ప్రబోధిని అనబడును. ఈనాడు ఉపవసించి పరుండి ఉన్న కేశవుని గీతాది మంగళములచే, ఋగ్యజుస్సామ మంత్రములచే, నానావిధ వాద్యములచే మేల్కొలిపి, ద్రాక్ష ఇక్షు దాడిమ రంభా శృంగాటకాది సమర్పణము గావించి, రాత్రి గడిచిన తరువాత మరునాడు స్నానముచేసి నిత్యకృత్యములను నెరవేర్చి గదాదామోదరుని పూజించవలయును. పురుషసూక్తముతో షోడశోపచారములతో పూజించి బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలతో సంతోషింపచేసి, సువర్ణప్రతిమను ధేను సహితముగా గురువునకు అర్పించవలయును. ఇట్లు భక్తితో ఆదరముతో ఈ వ్రతమును ఆచరించిన వాడు ఇహమున సకల భోగములను అనుభవించి అంతమున విష్ణు పదమును చేరును. మార్గశిర కృష్ణ ఏకాదశి ఉత్పన్న అనబడును. ఈనాడు ఉపవసించి, ద్వాదశినాడు కృష్ణ భగవానుని గంధాద్యుప చారములచే పూజించి, బ్రాహ్మణోత్తములను భుజింపచేసి దక్షిణలను ఇచ్చి వారిని పంపి ఇష్టబంధు జనముతో సావధానుడై తాను భుజింపవలను. ఇట్లు భక్తి భావముతో ఉత్పన్నవ్రతమును ఆచరించినవాడు అంత కాలమున విమానమును అధిరోహించి శ్రీమహావిష్ణు పదమును చేరును. మార్గ శీర్ష శుక్ల ఏకాదశి మోక్షదా అనబడును. ఈనాడు ఉపవసించి ద్వాశినాడు విశ్వరూపుడగు అనన్తుని సర్వోపచారములచే పూజించి బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలను ఒసగి వారిని విడిచి తాను బంధువులతో కలిసి భుజింపవలెను. ఇట్లు మోక్షదావ్రతమును ఆచరించినవాడు ఇహమున సకలాభీష్ట భోగములను అనుభవించి మొదటి పదితరములను, తరువాతి పదితరములను తరింపచేసి తాను శ్రీహరి లోకమును చేరును. పుష్యబహుళ ఏకాదశి సఫలా అనబడును. ఈనాడు ఉపవశించి, ద్వాదశినాడు సర్వోపచారములచే అచ్యుతుని పూజించి, మధురాన్నములతో బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలను ఇచ్చి విడువవలెను. ఇట్లు యథావిధిగా సఫలా వ్రతమును ఆచరించినవారు ఇహలోకమున సకల భోగములను అనుభవించి అంతమున విష్ణుపదమును చేరును. పుష్యశుక్ల ఏకాదశి పుత్రదా అనబడును. ఈనాడు ఉపవసించి ద్వాదశినాడు గంధాద్యుపచారములచే చక్రిని పూజించి, బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలనిచ్చి, విడిచి, తాను శిష్టాన్నమును ఇష్టబాంధవులతో కలిసి భుజించవలెను. ఇట్లు పుత్రదా వ్రతమును ఆచరించినవారు ఇహలోకమున సకలాభీష్ట భోగములను అనుభవించి అంతమున శ్రీహరి మందిరమును చేరుకొనును.

మాఘ కృష్ణ ఏకాదశి షట్తిలా అనబడును. షట్తిలనాడు ఉపవసించి ద్వాదశి నాడు ప్రాతఃకాలమున తిలలతోనే స్నానముచేసి, దానముచేసి, తర్పణము చేసి, హోమము చేసి, భుజించి, సమర్పించి, శ్రీవైకుంఠుని చక్కగా సర్వోపచారములచే పూజించి, యధావిధిగా బ్రాహ్మణులను భుజింపచేసి, వారికి దక్షిణను ఇచ్చి ఇట్లు విధిగా వ్రతమును సావధానముతో ఆచరించినవాడు ఇహలోకమున సకల భోగములను అనుభవించి అంతమున విష్ణుపదమును పొందును. మాఘశుక్ల ఏకాదశి జయ అనబడును. ఈనాడు ఉపవసించి ద్వాదశినాడు ప్రాతః కాలమున శ్రీపతిని చక్కగా పూజించి, బ్రాహ్మణులను భుజింపచేసి దక్షణిలను ఇచ్చ విడిచి శిష్టాన్నమును సావధానముతో బంధువులతో కలిసి భుజించవలెను. ఇట్లు కేశవతోషణ వ్రతము ఆచరించువారు ఇహలోకమున సకల భోగములను అనుభవించి అంతమున విష్ణు పదమును చేరెదరు. ఫాల్గుణ బహుళ ఏకాదశి విజయా అనబడును. ఈనాడు ఉపవసించి ద్వాదశినాడు ప్రాతఃకాలమున యోగీశ్వరుని గంధ పుష్పాదులతో పూజించి, బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలతో సంతోషింపచేసి విడిచి, మౌనముగా బంధువులతో కలిసి తాను భుజించవలెను. ఇట్లు వ్రతమును ఆచరించినవారు ఇహలోకమున సకల భోగములను అనుభవించి అంతమున దేవతలచే సత్కరించబడుచు విష్ణులోకమును చేరెదరు. ఫాల్గుణ శుక్ల ఏకాదశి ఆమలకి యనబడును. ఈనాడు ఉపవసించి, ద్వాదశినాడు సకలోపచారములచే పుండరీ కాక్షుని పూజించి, బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలనిచ్చి తాను భుజించవలెను. ఇట్లు ఆమలకీ వ్రతము నాచరించినవారు అంతకాలమున శ్రీమహావిష్ణువుయొక్క పరమపదమును చేరెదరు. చైత్ర బహుళ ఏకాదశి పాపమోచనికా యనబడును. ఈనాడు ఉపవసించి ద్వాదశినాడు ప్రాతఃకాలమున షోడశోపచారములచే గోవిందుని పూజించి బ్రాహ్మణులను భుజింపచేసి, దక్షిణలనిచ్చి విడిచిపుచ్చి తాను బంధువులతో కలిసి భుజించవలెను. ఇట్లు పాపమోచనికా వ్రతమును ఆచరించువారు తేజోవంతమగు విమానముతో విష్ణు లోకమును చేరెదరు. ఇట్లు శుక్ల కృష్ణపక్షముల లోని ఏకాదశులలో చేయు వ్రతములు మోక్షమును ప్రసాదించునని చెప్పబడినది. ఈ విషయమున ఎట్టి సంశయములేదు. ఈ వ్రతము మూడు దినములలో సాధించగల వ్రతము పాపనాశనము. అన్ని వ్రతములలో ఉత్తమ వ్రతము. మహాఫలప్రదము. ఈ మూడు దినములలో నాలుగు పూటలు భుజించవలెయును. దశమినాడు ఒకపూట, ఏకాదశి నాడు రెండు పూటలు, ద్వాదశినాడు ఒకపూట భుజించరాదు. ఈ దినత్రయ వ్రతమున ఆచరించవలసిన నియమములను ఇపుడు చెప్పెదను. దశమినాడు కాంస్యమును, మాంసమును, పప్పును, అన్నమును, శనగలను, ద్రవ పదార్థమును, శాకమును, మధురాన్నమును రెండవసారి భోజనమును, మైధునమును, ఈపదింటిని విడిచిపెట్ట వలెను. ద్యూతమాడుటను, నిద్రను, తాంబూలమును, దంత ధావనమును, పరాపవాదమును, కొండెములను చెప్పుటను, చౌర్యమును, హింసను, రతిని, కోపమును, అసత్య భాషణమును ఏకాదశినాడు విడిచిపెట్టవలెను. కాంస్యమును, మాంసమును, మద్యమును, కారమును, తైలమును, మ్లేచ్ఛులతో వేశ్యలతో సంభాషణమును, వ్యాయామమును, ప్రయాణమును, రాత్రి భోజనమును, మైధునమును, స్పృశించరానివారిని స్పృశించుటను, ద్వాదశినాడు విడువవలెను. ఈ నియమములను పాటించుచు ఉపవాసమును ఆచరించవలెను. శక్తిలేనివాడు ఒకపూట భుజించ వచ్చును. కాని రాత్రి భోజనము నిషిద్ధము. ఆయాచితమును కూడా ఆచరించవచ్చును. కాని ఈ వ్రతమును త్యజించరాదు. అనగా తప్పక ఆచరించవలయును అని భావము. (4/120)