మోహినీ సంమోహనము

వసిష్ఠ మహర్షి పలికెను: మోహినీదేవి రాజును లేపి ఇటుల పలికెను. ఓ రాజేంద్ర! సందేహించకుము. నేను పరిశుద్ధ అగుకన్యకనని తెలుసుకొనుము. నన్ను గృహ్యవిధిచే వివాహమాడుము. కన్య వివాహములేకనే గర్భధారణ చేసినచో అందరిచే నిందించబడును. పురాణమున ముగ్గురు చండాల స్త్రీలని పండితులు చెప్పిరి. కన్యకు పుట్టిన స్త్రీశిశువు, సగోత్రజాత, శూద్రునివలన బ్రాహ్మణ స్త్రీయందు పుట్టినది. కావున కన్యనగు నన్ను వివాహమాడుము అని ఇట్లు మోహిని పలుకగా రుక్మాంగద మహారాజు చపలేక్షణ అగు మోహినిని యధోక్తవిధిగా వివాహమాడి మిక్కిలి సంతోషించెను.

రుక్మాంగద మహారాజు పలికెను: “దేవీ! ఈ మందరపర్వతమున నిన్ను పొందుటవలన కలుగు సంతోషము స్వర్గ ప్రాప్తితో కూడా కలుగదు. ఈ భూమండలమున నేను ఇంద్రునికంటే అధికుడని భావించుచున్నాను. ఇంద్రునికి నీవంటి త్రైలోక్య సుందరియగు భార్య లేదు కదా. కావున నీకేది సమ్మతమో దానినే చేతును. నన్ను ఆజ్ఞాపింపుము. నీవిచటనే ఆనందింతువా? లేక నా భవనమున ఉందువా? మలయ పర్వతమున కాని, మేరుశిఖరమున కాని, నందన వనమున కాని నివసింతువా తెలుపుము” అని పలికిన రాజు మాటలను వినిన మోహిని మధుర వచనములతో రాజును అనందింపచేయుచు ఇట్లు పలికెను. ఓ రాజా? సవతుల వాడిచూపుల గాయములు నా శరీరమును కూడా గాయపరచును, ఏ స్త్రీ అయిననూ జీవితాంతము సవతి దుఃఖమును సహించజాలదు. అయిననూ నేను నా మనసుతో నీవశమైతిని. నాకు సవతిపోరు తప్పదని తెలిసికూడా నిన్ను భర్తను చేసుకొంటిని. చాలా ఆశ్చర్యములుకల ఈ పర్వతమునందే ఉండవలెనని నా కోరిక. కాని నీవు నీ పట్టపు రాణియగు సంధ్యావళిని విడిచి ఉండజాలవు కదా? పుత్రవతి అగు సంధ్యావళి విరహము నిన్నెక్కువగా దుఃఖింపచేయును. నీకు దుఃఖము కలిగినచో నాకు మరింత దుఃఖము కలుగును. కావున నీకెక్కడ ఆనందముగా నుండునో నేనచటనే యుండగలను. ఇష్టము లేకున్ననూ భార్య భర్తృ స్థానముననే ఉండవలెను. సమీపమున నున్న పతియే బంగారు మేరు పర్వతమని చెప్పెదరు. నీవు ఎక్కడ ఆనందింతువో అదియే నా కోరికల మేరుపర్వతము కాగలదు. భర్తృస్థానము కానిచో పితృ స్థానమును కూడా విడువవలెను. భర్తృ స్థానమును వదిలి పితృ స్థానమును ఆశ్రయించు స్త్రీ సౌకరస్త్రీ కాగలదు. కావున నేను ఈ దోషములను తెలిసనదానను అయినపుడు మందరమున ఎట్లుండగలను. నీవెంటనే వత్తును. నా సుఖ దుఃఖములకు నీవే ప్రభువు. ఇట్లు మోహిని మాటలు వినిన రాజు సంతుష్ట చిత్తుడాయెను. మోహినిని కౌగిలించుకొని ఇట్లు పలికెను. ఓ మోహినీ నీవు నా భార్యలు అందరిలో ఉన్నత స్థానమున ఉందువు. నీకు దుఃఖము కలుగునని శంకించవలదు. నా ఇంటిలో నా ప్రాణముకంటే నీవు మిన్న అగుదువు. కావున ఓ తన్వంగీ! మన ఆనందము కొఱకు నగరమునకు వెళ్ళుదుము. నగరమున నుండి స్వేచ్ఛగా నాతో భోగములను అనుభవింపుము' ' ఇట్లు రుక్మాంగద మహారాజు ఆత్మ వినాశనము కొఱకు పలుకగా ఆ మోహిని పార్వతి శోభను ఆకర్షించుచు, నూపుర నాదముతో బయలుదేరెను. (II/13)