కాష్ఠీలోపాఖ్యానము

వసిష్ఠ మహర్షి పలికెను: ఇట్లు పలికిన తండ్రి మాటలను వినిన ధర్మాంగద మహారాజు త్వరగా పరమ పవిత్రురాలగు తల్లియగు సంధ్యావళీ దేవిని పిలిచెను. ఆ సంధ్యావళీ దేవి పదివేల సూర్యుల కాంతి గలది. రుచిరస్తన, పాద విన్యాసములచే ఈ భూమండలమంతటిని పాలించుచున్నది. పుత్రుని పిలుపుతో వెంటనే రాజు సమీపమునకు వచ్చెను. మోహినీ వాక్యమును, రుక్మాంగద మహారాజు వాక్యమును తల్లికి వినిపించెను. రాజునకు మోహినికి సంధిని చేయుము. మోహినిని ఓదార్చుము. ఏకాదశినాడు భుజించవలయునని పట్టు పట్టుచున్నది. రాజు సత్యభ్రష్టుడు కాకూడదు. ఏకాదశినాడు భుజించకూడదు. మోహిని కోరిక తీరవలెను. ఇట్లు ఇద్దరికి కుశలమగునట్లు చేయుము అని ధర్మాంగదుడు తల్లిని ప్రార్థించెను. అపుడు సంధ్యావళీ దేవి పుత్రుని మాటలను విని బ్రహ్మపుత్రిక అగు మోహినితో మృదువుగా ఇట్లు పలికెను. ఓ సుందరీ! పట్టు పట్టకుము. రుక్మాంగద మహారాజు ఏకాదశినాడు ఎట్టి పరిస్థితులలోనూ పాపాన్నమును భుజించడు కావున రాజును అనుసరించుము. ఇతను సనాతనుడుగు గురువు. భర్త మాటను పాలించు స్త్రీకి సావిత్రీ దేవికివలె పవిత్రములగు పరలోకములు అక్షయములు అగును. పూర్వము కామార్తుడై మోహితుడై ఈ రాజు ఇచ్చిన దక్షిణ హస్తమును గూర్చి ఆలోచించరాదు. ఈయదగిన దానిని ఇతను తప్పక ఇచ్చును. ఈయరాని దానిని కోరకుము. సన్మార్గమున ఉన్న వానికి ఆపదలు కలిగిననూ మేలేకాని సన్మార్గమును వీడరాదు. శిశువుగా ఉన్నపుడు కూడా ఈ రుక్మాంగద మహారాజు ఏకాదశినాడు భుజించలేదు. ఇక ఇపుడెట్లు పుణ్య ప్రదమగు ఏకాదశినాడు భుజించును. కావున నీవు నీకు నచ్చిన పదమ దుర్లభమగు మరొక వరమును కోరుకొనుము. ఆ వరమును రాజు తప్పక ఇచ్చును. కావున ఏకాదశీ భోజనమును కోరకుము. ధర్మాంగదుని తల్లిగా నన్ను తలచినచో మా ప్రాణములతో పాటు ఈ రాజ్యమును కోరుము. సప్త ద్వీప సహితముగా నదీవన పర్వత సమేతముగా భూమండలము నంతటిని కోరుము. పెద్ద దాననగు నేను చిన్నదానవగు నీకు భర్త కొరకు పాదవందనమును చేతును. ప్రసన్నురాలవు కమ్ము. శపథములను చేసి కఠిన వాక్కుచే పతిని నిర్బంధించి ఆ కార్యమునుచేయించిన స్త్రీ నరకమును పొందును. నరకము నుండివచ్చి పన్నెండు జన్మలు సూకరముగా పుట్టును. తరువాత చండాల జన్మను పొందును. ఈ విషయమును తెలిసి నీపై స్నేహముతో నిన్ను పాప కార్యము నుండి వారించుచున్నాను. ఓ పద్మముఖీ! ధర్మమును కోరువారు శత్రువులకైనను సద్బుద్ధిని నేర్పవలయును. ఇక మిత్రురాలవు నీకేల బోధించరాదు. సంధ్యావళి మాటలను వినిన మోహయుక్తయగు మోహినీదేవి భర్తకు ప్రియురాలు పెద్దభార్య కనక సన్నిభయగు సంధ్యావళితో ఇట్లు పలికెను.

ఓ సుందరీ! నీవు నాకు గౌరవించదగినదానవు, నీ మాటను పాటింతును. పండితులు నారదాదిమునులు చెప్పిననూ రుక్మాంగద మహారాజు ఏకాదశినాడు భోజనము చేయనిచో నీకు మరణముకంటె ఎక్కువ దుఃఖమును కలిగించు మరియొక దానినిచేయు మనుము, ఇది నాకు కూడా దుఃఖప్రదమే. కాని నేను దైవవశమున పలుకుచున్నాను. ఆత్మహత్య ఎవరికి ఇష్టము ఉండును. విషభక్షణము గిరిశిఖరము నుండి పడుట సర్పములతో క్రీడించుట, వ్యాఘ్ర సింహములకు ఎదురుగా వెళ్ళుట, సముద్రమును దాటుట, దురుక్తములను, అసత్యములను పలుకుట, పరదారాభిమర్శనము, అపధ్య  అభక్ష్య భక్షణము, వేట, ద్యూతము, సాహసము, తృణకాష్ఠచ్ఛేదనము, లోష్ట మర్దనము, సూక్ష్మజీవుల హింస, జలాగ్నిక్రీడ, ఎవరికి ఇష్టముండును. దైవవశమున మానవుడు వీటిని చేయును. త్రివర్గచ్యుతములు ఘోరములు యశోహరములు, దేహహరములు అగువాటిని దైవ వశమున చేయును. నరకార్హుడై అశుభ కర్మలనుచేయును. కావున నేను పాపురాలను 'దురాచార పరురాలను' నిర్దయగా చెప్పదలచుచున్నాను. ఏ భావముతో యోనియందు శుక్రమును విడుచునో ఆ భావముతోనే సంతానము కలుగును కావున నేను రుక్మాంగద మహారాజుతో కలహించుటకే బ్రహ్మచే స్త్రీ రూపముగా సృజించబడితిని. దుష్ట భావముచే పుట్టితిని. రాజునకు అపకారములే చేయుచున్నాను. లగ్నము, గ్రహములు, హోర ఇవేవియు పనికిరావు. సమాగమ కాలమున ఉండు భావననే గ్రహించవలయును. ఆ భావముతోనే నరుడు పుట్టును. అట్టి భావముతో పుట్టిన వారికి దయ ఉండదు. బిడియము, స్నేహము, ధర్మము ఉండవు, అయుక్తమని తెలిసి కూడా ఆ భావమునే అనుసరించును. కావున ఇపుడు నేను నీవు ప్రాణహరము, నీతోటి స్త్రీలకు, నీభర్తకు, ప్రజలకు దుఃఖప్రదము, మనసులో కూడా అలోచించలేనిది నాకు కూడా చెప్పరానిది అగు మాటను చెప్పుచున్నాను. నా మాటను నీవు చేసినచో నీకు ఈ లోకమున గొప్ప కీర్తి కలుగును. నీ భర్తకు యశస్సు వచ్చును. నీకు స్వర్గగమనము లభించును. నీ పుత్రునికి ప్రశంస కలుగును. నాకు నింద వచ్చును.

వసిష్ఠ మహర్షి పలికెను: మోహినీ దేవి మాటలను వినిన సంధ్యావళీ దేవి ధైర్యమును వహించి ఆమెను చెప్పుము చెప్పుము! అని ప్రేరేపించెను. నాకు దుఃఖమును కలిగించు మాటను ఏమి చెప్పెదవు? నా భర్తను అసత్యమునుండి కాపాడుటలో నాకు దుఃఖము కలుగదు. నా మరణమున నా పుత్రమరణమున కూడా, భర్త కొరకు చేయునపుడు రాజ్యనాశమున కూడా నాకు బాధ కలుగదు. సర్వ సంపదలున్ననూ పాపాత్మురాలగు స్త్రీవలన భర్త దుఃఖించినచో ఆస్త్రీకి అధోగతియే లభించును. అట్టి స్త్రీ డెబ్బది యుగములు వూయము అను నరకమును చేరును. తరువాత ఏడు జన్మలు ఛండాలురాలుగా జన్మించును. తరువాత కాకిగా, ఎలుకగా, బల్లిగా పుట్టి చివరికి గోజన్మతో శుద్ధి పొందును. భర్త కొరకు తనవద్ద ఉన్న ధనమును ఈయని స్త్రీ ప్రాణములను అర్పించని మలమున క్రిమిగా పుట్టును. క్రిమిజన్మనుండి కట్టెలో పుట్టు పురుగుగా పుట్టును. నా చిన్నతనమున నా తండ్రి వద్ద కట్టెలను కొట్టువాడు అగ్నిని చేయుటకు కట్టెను చీల్చుచుండెను. నేను చెలికత్తెలతో ఆడుచు కట్టెలను కొట్టుచున్న అతని దగ్గరకు చేరితిని. అచట నేను అతను చీల్చిన కట్టెనుండి బయటకు వచ్చిన కాష్ఠీలా అను పురుగును చూచితిని. వెన్నవలె మెత్తనిది, కాటుకవలె నల్లని దేహమును ధరించినదిగా ఉండెను. కనిష్ఠమంత (చిటికెన వ్రేలి) పొడుగు, బొటనవేలు లావుగా ఉన్నది. అట్లు పడిన ఆ పురుగును చూచి చంపుటకు ఒక కాకి వచ్చెను. ఆకలిగొన్న ఆకాకి పురుగును గ్రహించుటకు రాగానే నేను రాయి విసిరి కాకిని పారద్రోలితిని. ఇట్లు కాకినుండి విడువబడినది. కాని కాకి ముక్కు దెబ్బతిని గాయపడినందున పరుగెత్త జాలకపోయెను. వణుకుచు ప్రాణములు విడుచు స్థితికి చేరెను. అపుడు నేను కొన్ని చల్లని నీటిని చల్లగా ఆ పురుగు స్వాస్థ్యమునుపొందెను. అంతట ఆకాష్ఠీలా చెలికత్తెల మధ్యనున్న నన్ను మనుష్యవాక్కుచే సంధ్యావళీ అని పిలచి ఇట్లు పలికెను. నేను పూర్వ జన్మలో సర్వజ్ఞుడగు సుమంతుడను మహర్షికి పుత్రికగా ఉంటిని. కౌండిన్యుడను బ్రాహ్మణోత్తమునకు భార్యనైతిని. కాన్యకుబ్జ నగరమున సర్వ సంపత్సమృద్దురాలనై దర్పముతో జీవించుచుంటిని. తల్లికి బంధు వర్గమునకు తండ్రికి అత్యంతము ఇష్టురాలనైతిని. తండ్రి నన్ను కౌండిన్యునకు భార్యగా ఇచ్చెను. ఆ కౌండిన్యుడు మహానుభావుడు, కులీనుడు, రూపవంతుడు, స్త్రీ సంగరహితుడు కూడా. నా తండ్రి అల్లునికి కానుకగా శయ్యాదులను ఇచ్చెను. నా మామగారు కూడా నాకు పదివేలబంగారు నాణెములను ఇచ్చెను. అపుడు నేను తండ్రి మామలు ఇచ్చన ధనముతో పరిపూర్ణురాలనైతిని. గోమషిష్యాదులతో ధన ధాన్యములతో సమృద్ధిగా ఉంటిని. అత్తమామలకు ఇష్టురాలనుగా ఉంటిని. సౌశీల్యముతో జనులకు ఇష్టురాలనైతిని. కొంత కాలమునకు వేద తత్వజ్ఞుడగు మా మామగారు మృతి చెందిరి. మరణించిన భర్తను తీసుకొని అత్తగారుకూడా అగ్నిలో ప్రవేశించెను. తరువాత నా భర్త తిల జలమును తర్పణమును చేసి శ్రాద్ధమును చేసెను. రెండునెలల తరువాత నా భర్త కామపీడితుడై కుతూహలముతో రాజమందిరమునకు వెళ్లెను. అచట యౌవనవతులు రూపవతులు అగు వేశ్యలను రాజగృహమున ప్రవేశించువారిని చూచెను. వారిలో ఇద్దరిని డబ్బిచ్చి తీసుకొని క్రీడించుటకు తన ఇంట్లో ఉంచు కొనెను. ఆ ఇద్దరి వేశ్యలు ధనమును అంతటిని వ్యయముచేసిరి. మూడు సంవత్సరములలో నా భర్త ధనహీనుడాయెను. అంతట నా భర్త నన్ను ఆభరణములను ఈయమని అడిగెను. కాని నేను వ్యసన పరుడైన నా భర్తకు ఆభరణములను ఈయలేదు. నా సంపదనంతా తీసుకొని తల్లిగారిల్లు చేరితిని. తరువాత నా భర్త తండ్రి సంపదనంతా అమ్మి ఆవేశ్యల కిచ్చెను. అది కూడా వ్యయమాయెను. భూమిని ధాన్యమును పాత్రలను వస్త్రములను చాలా తక్కువ వెలకు అమ్మి సముద్రమునకు వెళ్ళెను. సముద్రమున అద్భుతములను చూచుచు చాలాదూరము వెళ్ళెను. సముద్రములో పుట్టిన ప్రాణుల చేష్టలను చూచుచుండెను. వాయు వేగమున ఆనౌక నూరుయోజనముల దూరము పయనించెను. గాలి వేగమునకు నౌక పగిలి అందులోని వారందరూ చనిపోయిరి. నా భర్తమాత్రము దైవవశమున ఒకపెద్ద కాష్ఠమును ఆశ్రయించెను. అతని పూర్వ జన్మ కర్మ వశమున గాని పోబడుచు రత్నశిఖర విభూషితమగు చాలా కొండవాగులు కలది, బహుపక్షి సమన్వితము, బహువృక్ష సమాకీర్ణము, నానాపుష్ప ఫలసంయుతము, తమ శిఖరములచే ఆకాశమును అంటుచున్న పర్వతమును చేరెను. ఆ పర్వతమును చూచి నౌకాష్ఠమును విడిచి సంతోషముతో ధనకాంక్షియై పర్వతమును అధిరోహించెను.

ఆకలి దప్పులతో ముహుర్తకాలము విశ్రమించెను. తరువాత ఆకలిని తీర్చు కొనుటకు లేచి అచటి వృక్షములను చూచెను. ఆ చెట్లకు చక్కగా పండిన ద్రాక్షపండ్లను చూచి చక్కగా ఆరగించి సంతోషముతో శాంతిని పొంది ఒక నిర్మలమగు సాలవృక్షమును చూచెను. దట్టమైన నీడ గలది. మేఘసన్నిభము, యాభైమంది పురుష ప్రమాణము కలదిగా ఉండెను. ఆ చెట్టు క్రింద తన ఉత్తరీయమును పరుచుకొని నిదురించెను. మోహమును కలిగించు నిదురతో మూసుకొనిపోయిన కనులుగలవాడై బాగా అలసినందున సూర్యాస్తమయము వరకు నిదురించెను. సూర్యుడస్తమించి రాత్రి రాగా మేఘమువలె గర్జించుచు ఒక రాక్షసుడు వచ్చెను. రావణాసురుడు సీతను తెచ్చునట్లుగా ఒక యువతిని తీసుకొని వచ్చెను. ఆ యువతి కాశీరాజు పుత్రిక రత్నావళి కాళ్ళు కడుగకనే ఉత్తర దిక్కున తలచేసి పడుకొని ఉన్న దానను తెచ్చెను. ఆ కన్య పతిని కోరుచుండెను. కాని అనురూపుడగు పతి లభించ లేదు. స్త్రీలందరిలో ఉత్తమురాలు నిద్రచే ఆకులురాలై ఏడ్చుచుండెను. కాశీరాజు తన పుత్రికా వివాహమునుగూర్చి రాత్రింబవళ్ళు చింతించుచుండెను. దీపపు నీడను ఆశ్రయించి ఉన్న శయ్యపై పరుండి ఉండెను. అంతటా తిరుగుచున్న పాపియగు ఒక రాక్షసుడు ఆమెను చూచెను. దీపరత్నములు పొదిగిన కంకణములను ధరించి ఉండెను. ఆ రెండు కంకణములను పది రత్నములు పదిహేను నిష్కములు కలది. సీమంతమున ఏడు రత్నములు, కేయూరమున పదమూడు రత్నములు కలవు. ఇట్లు రత్నములచే పొదగబడిన ఆభరణములను దాల్చిన కాంచన సమాన ప్రతిభగల చారుహాసినియగు బాలను రాజభవనము నుండి అపహరించెను. ఆకాశమార్గమును అనుసరించి క్షణ కాలమున తన గృహమును చేరెను. నా భర్త పడుకొనియున్న సాలవృక్షముగల పర్వతమును చేరెను. ఆ పర్వతమున అతని గుహ సువర్ణ సదృశకాంతి కలదిగా నుండెను. ఆ రాక్షసుని భయమును సహించజాలక నా భర్త చూచుచుండగనే గుహలో ప్రవేశించెను. ఆ గుహలో చాలా మణుల రాశులు కలవు. చిత్ర మందిరములు కలవు. నానా ద్రవ్య సమాకీర్ణము, శయనాసన సంయుతము, భోజనములచే పాన పాత్రలచే బహువిధ భక్ష్య భోజ్యములచే కూడియున్నది. ఇట్లు గుహలో ప్రవేశించి ఆయువతిని శయ్యపై విడిచెను. ఆ యువతి మిక్కిలి భయముచే రోదించు చుండెను. బలసిన పిరుదులు, బలిసిన చన్నులు కలది ఆ యువతి రోదనమును విని రాక్షసుని భార్య త్వరగా రాక్షసుడున్న ప్రదేశమున కొచ్చెను. తప్త కాంచన సన్నిభ, చారుసర్వాంగి అగు యువతిని చూచి, కోపముచే భర్తను బెదిరించుచు, నేను బ్రతికి ఉండగా ఈ యువతిని ఎందుకు కొనివచ్చితివి? నేను నీకు భార్యను కానా ఇంకొక భార్యను కోరుచున్నావా? అని అడిగెను. ఇట్లు పలుకుచున్న తన భార్యను చూచి సంతోషముతో ఇట్లు పలికెను. ఓశుభాననా, నీ ఆహారముకొరకు కాశీనగరము నుండి కొని వచ్చితిని. దైవము సమకూర్చిన రెండవ ఆహారము నా కొఱకు ద్వారమున సిద్ధముగా నున్నది. ఓ వరాననా ఒక బ్రాహ్మణుడు శాలవృక్షమును ఆశ్రయించి ఉన్నాడు. నీవు త్వరగావెళ్ళి అతనిని కొని రమ్ము, అతనిని నేను భక్షించెదను. రాక్షసుని మాటలు విని ఆ కుమారి ఇట్లు పలికెను. ఓ రాక్షసీ! నీ భయముతో నీభర్త అసత్యమును చెప్పుచున్నాడు. నీవు వృద్ధురాలవని కురూపి వని, కుటిల స్వభావురాలవని తెలిసి రాత్రిపూట తండ్రి గారింట్లో నిదురించి ఉన్న నన్ను కామార్తుడై చేరి, వివాహముకాని దానినని ఏడ్చుచున్న దానిని తన భార్య చేసుకొనుట కొరకు కొని తెచ్చెను అని ఇట్లు రాజకుమారి చెప్పిన మాటలను విని మిక్కిలి కోపముకలదై మాటలు తడబడుచుండగా ఆ రాజకన్య సౌందర్యమును చూచి ఆమె మాటలు నిజమే అని నిశ్చయించుకొనెను. ఈ యువతిని భార్యగా చేసుకొనుటకే తెచ్చుకొనెను. ఇతను తప్పక నా శిరమున కీలను నాటగలడు. ఈ మూడు లోకములలో సవతి దుఃఖముతో పీడించ బడుచు కూడా బ్రతికియుండు కూడదు. అన్ని దుఃఖములలో సపత్నీ దుఃఖము సహించజాలని గొప్ప దుఃఖము. ఈ విషయమున సంశయముతో పనిలేదు. సామాన్య ద్రవ్యములు భోగములు కోరుట లభించకపోవుట వేరు. దుఃఖము కలిగించును అని ఇట్లు చాలా విషయముల నాలోచించి భర్తతో ఇట్లు పలికెను.

ఓ నాథా! నా ఆహారము కొరకు నీవు తెచ్చితివి. నీ ఆహారము కొరకు ఆ బ్రాహ్మణుని నేను తెచ్చెదను అని పలికెను. అంతట ఆ రాక్షసుడు నీవు వెళ్ళుము త్వరగా వెళ్ళుము నా నోరు ఊరుచున్నది అని పలికెను. అపుడు ఆ రాక్షసి భర్త మాటను విని దురాశగలదై బయలుదేరి వెళ్ళి బ్రాహ్మణోత్తముని చేరెను. ఆ బ్రాహ్మణుడు అతిలోకసౌందర్య యుక్తుడు విద్యారత్న విభూషితుడుగా కనిపించెను. ఆ బ్రాహ్మణ యువకుని చూచి మాయచే పదునారు సంవత్సరముల సుందరిగా మారి కామపీడితురాలై బ్రాహ్మణుని సమీపమున చేరెను. ఎంతో ప్రీతితో ఆ సుందరి బ్రాహ్మణునితో ఇట్లు పలికెను. నీవెవరవు? ఎచటినుండి వచ్చితివి? ఇచట ఎందుకు ఉన్నావు? నేను రాక్షసిని పతిని కోరుదానను. కామాతురను. నా భర్త నన్ను విసర్జించెను. నిన్ను భర్తను చేసుకొనగోరుచున్నాను. అపుడు రాక్షసి మాటలను వినిన నా భర్త ఎటులో ధైర్యమును కూడగట్టుకొని ఇట్లు పలికెను. రాక్షసమానవ సంయోగము ఎట్లు సంభవించును? రాక్షసులకు మానవులు భోజనములు. ఆ మాటలను వినిన రాక్షసి ఇట్లు మరల పలికెను. అసంభవములగు కార్యములు దైవయోగము వలన సంభవించును. భారతమున ఇట్లు జరుగునని పురాణమున వినబడుచున్నది. హిడింబ అను రాక్షసి భీమునికి భార్య కాగలదు. ఆ దంపతులకు ఘటోత్కచుడను పుత్రుడు కలుగగలడు. ఏ శస్త్రములచే వధ్యుడు కాడు. శక్తిచే చనిపోవును అని. కావున నీవు విచారించకుము. దైవ యోగమును అంగీకరించుము. నేను నీకు దైవయోగమున భార్యనైతిని దైవము బలవత్తరము, పూర్వము ఇంద్రుడు బలిచక్రవర్తిని చూచుటకు మానవ లోకమునకు వెళ్ళగా ఆ సమయమున ఘోరరాక్షసుడగు నా భర్త ఇంద్రుని ఇంటినుండి జ్వలించు అగ్ని శిఖవలె నున్న శక్తిని అపహరించెను. ఆ శక్తిని ఈ శాలవృక్షమును దాచి ఉంచెను. ఆ శక్తి ఎవరినో ఒకరిని చంపనిదే ఇంద్రుని చేర జాలదు. శక్తి ప్రయోగించినచో అమరుడు కూడా మరణించును. కావున నేను శాలవృక్షము అధిరోహించి ప్రకాశించు శక్తిని తీసి నా భర్తకు మరణమును కోరి నీచేతికందించగలను. ఒకవేళ నీవీ శక్తిచే రాక్షసుని చంపజాలనిచో ఆ శక్తి నిన్ను నన్ను భక్షించగలదు. ఈ రాక్షసుడు నీకు నాకు మహాశత్రువు. నా భర్త భార్యను చేసుకొనుటకు ఒక కన్యను అపహరించి తెచ్చెను. దుర్మార్గుడగు నా భర్త నాకు సవతిపోరును కలిగించెను. అతనిని చంపినచో మనము ఆనందముతో క్రీడించవచ్చును. ఓ రతివర్ధనా? నీవు నా మాటను కాదన్నచో నేను చేసియున్న పుణ్యముల ఫలితములు నాకు చేరవు. నా మాట అబద్ధమైనచో నాకు బ్రహ్మహత్యాపాతకము సంక్రమించును. మద్యపానమును చేయు బ్రాహ్మణునకు కలుగు దుర్గతి నాకు సంక్రమించును. గురుదారరతునకు కలుగు పాపము నాకు సంక్రమించును. దాచి ఉంచిన బంగారమును హరించినచో కలుగు పాపము, భూమిని హరించుటలో కలుగు పాపము, ఆత్మహత్యా పాపము నేను అబద్ధము పలికినచో నాకు సంక్రమించును. పంచమీ, అష్టమీ తిధిన మాంస భక్షణమువలన కలుగు పాపము, అమావాస్యనాడు స్త్రీ సంగమముచేసిన, చెట్టును కొట్టిన కలుగు పాపము, ఉచ్చిష్టఘృత భోజనునకు కలుగు పాపము, దివామైధునము వలన కలుగు పాపము, గృహస్థుడగు బ్రాహ్మణుడు వైశ్వేదేవము చేయనిచో కలుగు పాపము, భిక్షుకులకు భిక్షపెట్టనివారికి కలుగు పాపము, విధవకు రెండు పూటలు భోజనము వలన కలుగు పాపము, సంక్రాంతి, సమయమున తైలభోజికి కలుగు పాపము, గోవులతో తీర్ధమునకు వెళ్లుటలో కలుగు పాపము, ఇతర జలాశయమున మన్ను ఉద్ధరించక స్నానముచేసిన వానికి కలుగు పాపము, నిషేధించబడిన వృక్షము యొక్క దంతకాష్ఠమును ఉపయోగించువానికి కలుగు పాపము, గోవును సేవించనివానికి కలుగు పాపము, పాషండ మార్గమును అనుసరించు వానికి కలుగు పాపము, కాష్ఠమునందు, శిలయందు పితృ దేవత నర్చించు వానికి కలుగు పాపము, గోవులు లేకుండగా మహిషములను పోషించువానికి కలుగు పాపము, నగ్నస్త్రీని వీక్షించిన వారికి కలుగు పాపము, అభక్ష్యభోజికి కలుగు పాపము, శ్రీహరికథకు విఘ్నము చేయువానికి కలుగు పాతకము నేను అబద్ధమును చెప్పినచో నాకు కలుగును. ఇట్లు చెప్పిన పాపములు, చెప్పని పాపములు కూడా అబద్ధమును చెప్పినచో నాకు కలుగును. ఇట్లు పాపురాలగు రాక్షసి బోధించగా నా భర్త దైవముచే మోహితుడై అట్లు చేయుటకు నిశ్చయించెను. ద్రవ్య హీనుడు వ్యసనాసక్తుడు. నా మాటలచే బాధపడినవాడు కావున రాక్షసితో కార్యసిద్ధి ప్రదాయకమగు మాటలను పలికెను. ఆ శక్తిని త్వరగా తెమ్ము. నీ మాటను ఆచరించెదను. నేను రాక్షసుని చంపెదను. కాని నాకు ఈ సంపదనంతా ఈయవలెను. ద్రవ్యమును సంపాదించవలెనను ఆశతోనే నేను సముద్రమున ప్రవేశించితిని. నా భర్త మాటను వినిన రాక్షసి వృక్షముపై నున్న శక్తిని తీసి నా భర్తకు కార్య సిద్ధికొరకిచ్చెను. ఇంతో కామ మోహితుడగు రాక్షసుడు కన్యను పొందుటకు సిద్ధపడెను. అంతట భీతి చెందిన రాజకుమారి ఇట్లు పలికెను. కన్యను పొందినచో మహా పాపము సంక్రమించును. తండ్రి గృహమున నిదురించియున్న నన్ను కాశీనుండి మోసముతో అపహరించితివి. ఇందులో నీ దోషమేమియును లేదు. నాకిట్లు జరుగ వలసి ఉన్నది. గుహమధ్యలో నున్న నన్ను రక్షించువారు ఎవ్వరు? దైవ యోగమువలననే భర్త లభించును. దైవ యోగమువలననే ప్రియురాలు లభించును. విధి ప్రేరణ చేతనే ప్రాణులు అంతటా తిరుగుచుందురు. ఓ రాక్షసా నీవే నాకు భర్తవు కావలసి ఉన్నది. దైవ విహిత విధానమున పండితుడేమి చేయగలడు? కావున శాలవృక్షమును ఆశ్రయించి ఉన్న ఈ బ్రాహ్మణుని తెమ్ము, మృతమును, జలమును, దర్భలను, అగ్నిని తెచ్చి శాస్త్రోక్త విధిచే వివాహమును చేసుకొనుము. దర్భాదులులేకున్ననూ యధోక్త విధిని అనుసరించకున్ననూ బ్రాహ్మణ వాక్యముచే వివాహము సఫలమగును. నీ భార్య ఆ బ్రాహ్మణుని చంపనిచో అతనితో హోమమును జరిపించుము. హోమ సమాప్తి తరువాత అతనిని నీవు భక్షించుము. ఆ రాజకన్య ఇట్లు పలుకగా మనసున విశ్వాసము కలిగి దర్పముతో బయలుదేరెను. కామార్తుడై త్వరగా ఆ బ్రాహ్మణుని తెచ్చుటకు బయట నిలిచెను. అట్లు బయటకు వెడలుచున్న రాక్షసునకు తుమ్మువచ్చెను. ఎడమ కన్ను అదిరెను. వస్త్రము జారెను. ఆ శకునములను లెక్కించకనే గుహనుండి బయలువెడలెను. బయట మానుష స్త్రీ రూపమును ధరించియున్న తన భార్యను చూచెను. ఆ బ్రాహ్మణునితో భార్యా భర్త సంబంధమును కూర్చుట చూచెను. అంతట ఆ రాక్షసి క్రూర కర్ముడవు పాపివి, మనుష్య కన్యాసక్తుడవు. నా శరీరమును దూషింపచేసిన నిన్ను విడుచుచున్నాను అని పలికెను. ఆ కఠిన వాక్యములను విని ఈర్ష్యాకోపములచే వారిని చంపుటకు పరుగు తీసెను. చేతులను చాచి, నోరు తెరిచి, కాలవశముతో వచ్చు వాయు వేగముతో అనర్ధ వాక్యములను పలుకుచు వారిని భక్షించుటకు పరుగుతీసెను. (II/27)