హనుమత్కవచ నిరూపణము

సనత్కుమార మహర్షి పలికెను: ఓ మునీశ్వరా నీకు కార్తవీర్య కవచమును చెప్పితిని. ఇక ఇపుడు మోహవిధ్వంసకము జయప్రదమగు హనుమత్కవచమును వినుము. ఈ కవచమును ధరించిన వెంటనే అన్ని ఉపద్రవములు నశించును. భూతప్రేత శత్రువుల వలన కలిగిన దుఃఖములు నశిం చును. నేను ఒకప్పుడు ఆనందింపచేయువారిలో ఉత్తముడు, ఆనందవన నివాసి స్వాత్మపదమును ధ్యానించుచున్న రాముని చూచుటకు వెళ్లితిని. అచట రమాకాంతుడు దేవపూజితుడగు రామ చంద్రునికి నమస్కరించి అతను చూపిన ఆసనమున కూర్చుంటిని. అచట రావణవధ వృత్తాంతమును నేను అడుగగా శ్రీరామచంద్రుడు ఆదరముతో చెప్పెను. ఆ వృత్తాంతము చివర శ్రీరాముడు నాకు మారుతి కవచమునిచ్చెను. ఆ కవచమును నేను నీకు చెప్పెదను. ఈ కవచమును అంతటా అంద రికి తెలుపరాదు. ఇది ముందు జరుగబోవునది చెప్పబడెను. భుక్తిముక్తి ప్రదమగు ఈ ఆంజనేయ కవచమును శ్రీరాముడు చెప్పెను. తూర్పు దిక్కున హనుమంతుడు, దక్షిణమున పవనాత్మజుడు, పశ్చిమమున అక్షఘాతకుడు ఉత్తరమున సాగరతారకుడు కాపాడుగావుత. ఊర్ధ్వ భాగమున కపిశ్రేష్ఠుడు, కేసరి ప్రియనందనుడు, అధోభాగమున విష్ణుభక్తుడు, మధ్య భాగమున పావని కాపాడుగావుత. అన్ని వేళలా అన్ని ఆపదలనుండి లంకాదాహకుడు కాపాడుగావుత. మస్తకమును సుగ్రీవసచివుడు, వాయునందనుడు ఫాలమును, మహావీరుడు భ్రూమధ్యమును, నేత్రములను ఛాయాపహర్షి ప్లవగేశ్వరుడు కాపాడుగావుత. కపోలములను, కర్ణమూలమున శ్రీరామకింకరుడు, నాసాగ్రమును అంజనా సూనుడు, వక్త్రమును హరీశ్వరుడు, కంఠమును దైత్యారి, స్కంధమును రాక్షసజిత్, భుజములను మహాతేజుడు, కరములను చరణాయుధుడు నఖములను నఖాయుధుడు, కుక్షిని కపీశ్వరుడు, వక్షస్థలమును ముధాపహారి, పార్శ్వములను భుజాయుధుడు కాపాడు గావుత. పృష్ఠ దేశమును లంకావిభంజకుడు, నాభిని శ్రీరామభక్తుడు, కటిని అనిలాత్మజుడు, గుహ్యమును మహాప్రాజ్ఞుడు, సక్తులను అతిథిప్రియుడు, ఊరువులను, జానువులను లంకాప్రాసాద భంజనుడు, జంఘలను కపిశ్రేష్ఠుడు, గుల్ఫములను మహాబలుడు, పాదములను అచలోద్ధారకుడు, అంగములను భాస్కర సన్నిభుడు, పాదాంగుళులను సత్త్వాద్యుడు కాపాడుగావుత. ముఖాంగములను మహాశూరుడు, రోమములను ఆత్మవంతుడు, దివా రాత్రములలో త్రిలోకములలో సదాగతిసుతుడు కాపాడుగావుత. నిలుచున్నవానిని, నడచుచున్నవానిని, కూర్చొని ఉన్నవానిని, తినుచున్నవానిని కపి కాపాడుగావుత. లోకోత్తర గుణుడు, శ్రీమంతుడు, త్ర్యంబక సంభవుడు, ప్రమత్తుని, అప్రమత్తుని, నిద్రించు వానిని అరణ్యమున, జలమున, స్థలమున, అంతరిక్షమున, అగ్నియందు, పర్వతమున, సాగరమున, వృక్షములలో, సంగ్రామమున, ఘోర సంకటమునందు, విరాడ్రూపధరుడు కాపాడుగావుత. ఢాకినీ శాకినీ మారీ కాళరాత్రి మరీచికలనుండి నిద్రించుచున్న నన్ను పిశాచోరగరాక్షసులనుండి విభువు కాపాడుగావుత. దివ్యదేహధరుడు, ధీమంతుడు, సర్వసత్వభయంకరుడు, సాధకేంద్రావనుడు నన్ను అంతటా కాపాడుగావుత, భయానకసత్త్వములు చూచి భయపడు సర్వ రూపములను ధరించువాడు, సర్వజ్ఞుడు, సృష్టి స్థితికరుడు కాపాడుగావుత. స్వయం బ్రహ్మ, స్వయం విష్ణువు, స్వయం సాక్షాత్తుగా మహేశ్వరుడు సూర్యమండలగతుడు, శ్రీప్రదుడు నన్ను కాలత్రయమున కాపాడుగావుత, హను మంతుని ధ్వనిని విని దైత్యదానవ రాక్షసులు దేవతలు మనుష్యులు తిర్యగ్జంతువులు, స్థావర జంగ మములు భయముకలవి, భయము తొలగినవి అగును. ప్రతి కల్పమునందు హనుమంతుని అనేక కథలు పవిత్రములు వినబడుచుండును. అట్టి రామపరాయణుడు సాధకశ్రేష్ఠుని కాపాడు గావుత, వైధాత్రధాతృ ప్రభృతులుగా ఈ ప్రపంచమున కనపడునదంతయు కేశరూపముచే వ్యాపించ బడియున్నది. అ ప్రభువు నేను, ఈ నేను స్వీయుడను, స్వయముగా అణువు, బృహత్, ఋగ్యజుస్సామ రూపుడు ప్రణవము, త్రివృత్, అధ్వరము, ఆస్వరూపుడు, సర్వరూపుడగు కపీశ్వరునికి ఆత్మ సమాధిచే నమస్కరించుచున్నాను. అనేకానంత బ్రహ్మాండధారి, బ్రహ్మ స్వరూపి, సమీర స్వరూపి, ఆత్మస్వరూపి అయగువానికి నమస్కారము. హనుమంతునికి, మారుత పుత్రునకు నమస్కారము. శ్రీరామ భక్తునకు శ్యామునకు, మహాత్మునకు నమస్కారము. వానర వీరునకు, సుగ్రీవసఖ్యకారకునకు, లంకావిదా హకునకు, మహాసాగర తారకునకు, సీతాశోక వినాశకునకు, రామముద్రాధరునకు రావణాంత నిదానమునకు సర్వోత్తరాత్మకు నమస్కారము. మేఖ నామద ఖధ్వంసకారణునకు, అశోకవన విధ్వంస కారికి, జయదాయికి, వాయుపుత్రునకు, వీరునకు, ఆకాశోదరగామికి, వనపాల శిరశ్ఛేత్తకు, లంకాప్రాసాద భంజకునకు నమస్కారము. జ్వలత్కాంచన వర్ణునకు, దీర్ఘలాంగూలధారికి, సౌమిత్ర జయదాతకు, రామదూతకు నమస్కారము. అక్షవధికారికి, బ్రహ్మస్త్ర నివారకునకు, లక్ష్మణాంగ మహాశక్తి జాత క్షత వినాశికి, రక్షోఘ్ననకు, రిపుఘ్నునకు, భూతఘ్నునకు నమస్కారము. ఋక్షవానం “వీరౌఘ ప్రాసాదునకు పరసైన్యబలఘ్ననకు, శస్త్రాస్త్రఘ్నునకు, విషఘ్నునకు, ద్విషఘ్నునకు, భయ ఘ్నునకు నమస్కారము, మహారిపుభయఘ్నునకు, భక్తాత్రాణైకకారికి, పరప్రేరితమంత్ర యంత్రస్తంభ కారికి, పయఃపాషాణ తరణకారణునకు, బాలార్కమండల గ్రాసకారికి, దుఃఖహారికి నమస్కారము. నఖాయుధునకు, భీమునకు, దంతాయుధునకు, విహంగమునకు, శైవునకు, వజ్రదేహునకు, ప్రతి గ్రామ స్థితునకు, భూత ప్రేత వధార్ధికి, కరస్థశైలశస్త్రునకు రామశస్త్రునకు నమస్కారము. కౌపీన వాసునకు, రామభక్తిరతునకు, దక్షిణాభాస్కరునకు, సజ్జనులకు చంద్రోదయ స్వరూపునకు, కృత్యాక్షత వ్యధఘ్ను నకు, సర్వక్లేశ హరునకు, స్వామ్యాజ్ఞాపార్ధ సంగ్రామ సఖ్యసంజయకారికి, నమస్కారము. దివ్య వాదములందు, సంగ్రమములందు భక్తులకు జయమును కలిగించువానికి, కిల్కిలారావకరునికి, ఘోరశబ్దకరునకు, సర్వాగ్ని వ్యాధి సంస్తంభకారికి, భయహారికి, సదావన ఫలాహార సంతృప్తునకు, మహార్ణవశిలా బద్ధసేతు బంధువుడవగు నీకు నమస్కారము. ఇట్లు శుభకరమగు హనుమత్కవచమును నీకు చెప్పితిని. ప్రతివారికీయరాదు. ప్రయత్నముచే రక్షించవలెను. అష్టగంధములచే వ్రాసి కంఠమున కాని, దక్షిణ బాహువునకాని ధరించినవానికి ప్రతిక్షణమున జయమే కలుగుచుండును. ఇంకా ఏమి చెప్ప వలెను. ఆదరముచే ఈ కవచమును లక్ష జపించిన వానికి అసాధ్యమంటూ ఉండదు. ప్రతిదానిని సాధించగలడు. (3/78)