నారద మహా పురాణము
యమదూతకృత్య నిరూపణము
నారదుడు పలికెను: ఓ మునిశ్రేష్ఠా! మీరు చక్కగా వర్ణాశ్రమవిధిని వివరించితిరి. ఇపుడు దుర్గమమైన యమమార్గమును వినగోరుచున్నాను.
సనక మహర్షి పలికెను: పుణ్యశీలురకు సుఖమునిచ్చునది, పాపులకు భయమును కలిగించునది అగు దుర్గమమైన యమమార్గమును చెప్పెదను వినుము. ఓ మునీశ్వరా! యమలోకమార్గము ఎనుబది యారు వేల యోజన విస్తారము అని జ్ఞానులు చెప్పియున్నారు. దానశీలురైన మానవులు సుఖముగా వెళ్ళెదరు. ధర్మ శూన్యులగు నరులు దుఃఖములచే పీడించబడుచు వెళ్ళెదరు. యమ మార్గమున పాపులు మిక్కిలి భయముచే వివస్త్రులై తడారిన గొంతు పెదవులు కలవారై వికృతముగా అరచుచు దీనులై వెళ్ళెదరు. యమభటులచే కొరడాలతో అంకుశములచే కొట్టబడుచు, ఇటునటు పరుగెత్తుచు దుఃఖముచే ఆ మార్గమున నడిచెదరు. ఒకచోట బురద, ఒకచోట అగ్ని, ఒకచోట బాగుగా కాగియున్న ఇసుక, ఒకచోట దావాగ్ని, నిశిత ధారలు గల శిలలు ఒకచోట, ఒకచోట ముళ్ళచెట్లు, దుఃఖముచే ఎక్కదగని రాళ్ళుగల పర్వతములు, కటిక చీకటిగల గుహలు, మార్గ మంతయు కంటకావృతము, కోటబురుజులు ఎక్కుట, లోయలలో చొరబడుట, గులకరాళ్ళు, పాషాణఖండములు, సూదులవంటి కంటకములు, కొన్నిచోట్ల నాచు, కొన్నిచోట్ల వెదురు బొంగులు, కొన్నిచోట్ల గర్జించు పెద్దపులులు, కొన్నిచోట్ల జ్వరములు పెరుగుచుండును. ఇట్లు పలువిధములైన కష్ఠములతో పాపులు వెళ్ళెదరు. పాపులు అక్రోశించుచు, ఏడ్చుచు, వాగుచు పాశములచే కట్టబడుచు, అంకుశముచే కట్టబడుచు వెనుకకు వెళ్ళుచుందురు. ముక్కు చివర పాశముచే కట్టబడి, కొందరు తాళ్ళచే బాధించబడుచు, శిశ్నాగ్రముచే అయోభారమును మోయుచు వెళ్ళెదరు. కొందరు నాసాగ్రముచే అయోభార ధ్వయమును మోయుచు, కొందరు చెవులచే మోయుచు, కొందరు జారిపడుచు, కొందరు కొట్టబడుచు, మిక్కిలి నిట్టూర్చు కన్నులు మూసుకొని కొందరు నీడ, నీరు లేని దారిలో దుఃఖించుచు వెళ్ళెదరు. తెలిసి తెలియక చేసిన తన పనులను గూర్చి ఆలోచించుచు వెళ్ళెదరు.
ఓ నారద! ధర్మిష్ఠులు, దానశీలురు సుబుద్ధులు మిక్కిలి సుఖముతో ధర్మ మందిరమునకు వెళ్ళెదరు. అన్నదానము చేసినవారు రుచికరమైన పదార్థములను భుజించుచు వెళ్ళెదరు. జలదాన మును చేసినవారు రుచికరమైన పాలను త్రాగుచు వెళ్ళెదరు. తక్ర(మజ్జిగ)దానమును చేసినవారు దధి దానమును చేసినవారు ఆయా భోగములను అనుభవించుచు వెళ్ళెదరు. మృత దానమును మధు దానమును, క్షీరదానమును చేసినవారు తేనెత్రాగుచు ధర్మమందిరమునకు వెళ్ళెదరు. శాకదానము చేసినవారు పాయసమును త్రాగుచు, దీపదానమును చేసినవారు దిక్కులు ప్రకాశింపచేయుచు, వస్త్రదానమును చేసినవారు దివ్యాంబరధారులై వెళ్ళెదరు. చేయూత నిచ్చువారు దారిలో దేవతలచే స్తుతించబడుచు వెళ్ళెదరు. గోదానమును చేసినవారు సర్వసౌఖ్యములతో వెళ్ళెదరు. భూదానమును, గృహదానమును చేసినవారు అప్సరో గణములతో సర్వ సంపదచే కూడియున్న విమానమున విలాసముగా వెళ్లెదరు. హయదానమును, వాహన దానమును, గజదానమును చేసినవారు భోగా న్వితములైన విమానములలో వెళ్ళెదరు. వృషభదానమును, తాంబూల దానమును చేసినవారు సంతోషముతో వెళ్ళెదరు. మాతాపితృశుశ్రూష చేసినవారు దేవతలచే స్తుతించబడుచు సంతోష మనస్కులై వెళ్ళెదరు. యతులను వ్రతచారిణులను బ్రాహ్మణోత్తములను సేవించువారు మిక్కిలి సుఖముగా వెళ్ళెదరు. సర్వభూతదయాపరుడు దేవతలచే పూజించబడుచు, సర్వభోగాన్వి తమైన విమానముపై వెళ్లును. విద్యాదానమును చేసినవారు బ్రాహ్మణులచే స్తుతించబడుచు పురాణ పాఠకుడు మునీశ్వరులచే స్తోత్రము చేయబడుచు వెళ్లెదరు. ఇట్లు ధర్మపరులు ధర్మమందిరమునకు సుఖముగా వెళ్లెదరు. యమధర్మరాజు చతుర్ముఖుడై శంఖచక్రగదాఖడ్గములను ధరించి పుణ్యకర్మలను చేసినవారిని స్నేహముతో మిత్రునివలె గౌరవించును. ఓ ఉత్తమ బుద్ధిమంతులారా! నరక క్లేశములకు భయ పడుచు మీరుచేసిన సుకృతమును చేయనిచో వాడేపరమపాపి ఆత్మ ఘాతమును చేయువాడు అగును. అనిత్యమైన మానవజన్మను పొందును. అతనికంటే అజ్ఞాని మరొకరుండరు. యాతనా రూపము మలాది పరిదూషితమైన శరీరము నందు విశ్వాసమును చూపువాడు ఆత్మఘాతకుడని తెలియుడు. అన్ని పదార్థములలో ప్రాణులు శ్రేష్ఠులు. ప్రాణులలో బుద్ధిజీవులు, బుద్ధి జీవులలో మానవులు, నరులలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు. బ్రాహ్మణులలో విద్వాంసులు విద్వాంసులలో కృత బుద్ధులు, కృత బుద్ధులలో ఆచార పరులు, ఆచారపరులలో బ్రహవాదులు, బ్రహ్మవాదులలో నిర్మములు శ్రేష్ఠులు. నిర్మములలో ధ్యాన పరాయణులు శ్రేష్ఠులు. కావున సర్వవిధప్రయత్నముచే ధర్మ సంగ్రహ మును చేయవలయును. ధర్మ వంతుడు అంతటా పూజించబడును. కావున మీ ఈపుణ్యములచే సర్వభోగ సమన్వితమైన నా స్థానమునకు వెళ్ళుడు. ఏదేని దుష్కృతము ఉన్నచో, పిదప ఇచట అనుభవించగలరు. ఇట్లు యమధర్మరాజు పుణ్యాత్ముని గౌరవించి సద్గతిని చేర్చును.
యమధర్మరాజు పాపులను పిలిచి కాలదండముచే బెదిరించుచు ప్రళయకాలమేఘమువలె గర్జించుచు కాటుకకొండ కాంతి కలవాడై మెరుపువలె మెరయుచున్న ఆయుధములతో భయంకరుడై ముప్పది రెండు భుజములతో యోజనత్రయ విస్తారుడై రక్తాక్షుడు, దీర్ఘ నాసికుడు, దంష్ట్రా కరాల వదనుడు వాపీతుల్యోగ్రలోచనుడుగా కనిపించును. మృత్యజ్వరాదులతో కూడిన చిత్రగుప్తుడు కూడా అతిభయంకరుడై కనపడును. యమదూతలందరూ యముని వలె భయంకరులై భీషణముగా గర్జింతురు. అపుడు చిత్రగుప్తుడు యమాజ్ఞచే భయముతో వణుకుచున్న ఆ పాపులలో ‘తాముచేసిన దుష్కృత్యములను గూర్చి విచారించుచున్నవారితో నిట్లుపలుకును’. ఓ పాపులారా! మీరు దురాచాం “పరులై అహంకార దూషితులై వివేక శూన్యులై ఎందుకు పాపమును మూటగట్టుకొంటిరి. కామక్రోధా దులు కలిగించిన గర్వము నిండిన మనసుతో మహాపాపములను ఏల ఆచరించితిరి. మీరు మిగుల సంతోషముతో చాల పాపమును చేసితిరి. అట్లే యాతనలను కూడా సంతోషముగా అనుభవించుడు ఏల దుఃఖించెదరు? భృత్య మిత్ర కళత్రముల కొఱకు మీరు దుష్కృతమును ఆచరించితిరి. అట్లే అతిదుఃఖముతో ఇచటికి చేరితిరి. మీరు పోషించిన పుత్రాదులు మరో ప్రదేశము నకు వెళ్ళిరి. ఆ పాపము మీకే చేరినది. అదియే దుఃఖ కారణమైనది. మీ పాపమును మీ పుత్రాదులు పంచుకొని అనుభవించరు. మీరెట్లు పాపములను ఆచరించితిరో అట్లే యాతనలనుభవింతురు. ఇక దుఃఖమేల? మీరు పూర్వము చేసిన పాపకృత్యములను ఆలోచించుచు. యముడు దండించునని అపుడు ఎందుకు ఆలోచించలేదు? దరిద్రుని, మూర్ఖుని, పండితుని, శ్రీమంతుని, కాందిశీకుని, వీరుని యముడు సమముగా చూచును. ఇట్లు చిత్రగుప్తుడు పలికిన మాటలను వినిన ఆ పాపులు తాము చేసిన పాపమును తలుచుకొని భయపడుచుందురు. యమాజ్ఞను ఆచరించు భయంకరులగు యమదూతలు, చండాలాదులు, బలాత్కారముగా వారిని నరకమున పడద్రోతురు. తాము చేసిన దుష్కృతమును అనుభవించి పాపశేషముచే మరల భూలోకమున స్థావరాదులుగా జన్మింతురు. నారద మహర్షి పలికెను: పూజ్యుడా! దయానిధీ! నా మనసున ఒక సంశయము కలిగినది. నీవు నాకు అగ్రజుడవు కావున ఆ సంశయమును ఛేదించగల సమర్థుడవు. నీవు చాలా ధర్మములను చాల పాపములను చెప్పితివి. ఆ పాపుణ్యముల చిరకాల ఫలానుభవమును చెప్పితివి. బ్రహ్మకు దినాంతరము ప్రాప్తించినపుడు మూడు లోకములు నశించును. రెండు పరార్దముల కాలము తరువాత బ్రహ్మాండము కూడ క్షయమగునని చెప్పితివి. ఓ బ్రహ్మపుత్రా! గ్రామదానాది పుణ్యములకు కల్పకోటి సహస్రకాలము ఫలానుభవముండునని చెప్పితివి. ప్రాకృతలయమున సర్వలోకనాశము జరుగును, ఒక జనార్దనుడు మాత్రమే మిగులునని చెప్పితిరి. సర్వలోక నాశమునందు వీని (కర్తకు) పుణ్యపాప భోగసమాప్తి జరుగదు కదా? ఆ ఫలభోగమెట్లు ఎచట జరుగును? ఈ సంశయము నాలో కలిగినది. దానిని తొలగించుము.
సనకమహర్షి పలికెను: ఓ మహాప్రాజ్ఞా! నీవు పరమ రహస్యమును బాగుగా ప్రశ్నించితివి. నీవడిగిన దానిని చెప్పుచున్నాను. సావధానముగా వినుము. నారాయణుడు, అక్షరుడు, అనంతుడు, పరంజ్యోతి, సనాతనుడు, విశుద్ధుడు, నిర్గుణుడు, నిత్యుడు, మాయామోహవివర్జితుడు నిర్గుణుడైనను పరమానంద స్వరూపుడు కావున గుణవంతునివలె భాసించును. బ్రహ్మ విష్ణు శివాది నామ రూపములతో భేదము కలవానివలె భాసించును. సనాతనుడగు నారాయణుడు మూడు గుణోపాధి భేదములచే భేదము కలవానివలె తోచును. మాయను చేర్చి అఖిలజగత్కార్యము ఆచరించును. బ్రహ్మ రూపముతో సృష్టించును. విష్ణు రూపముతోపాలించును. రుద్రరూపముతో అంత్యకాలమున సర్వమును నశింపచేయును. మరల ప్రళయాంతమున జనార్దనుడు లేచి చరాచరాత్మకమగు ఈ విశ్వమును యథాపూర్వకముగా సృష్ఠిచేయును. స్థావరాదులు ఏయే ప్రదేశములలో ఎట్లుండెనో అట్లే సృష్టి చేయును. కావున చేసిన పాపపుణ్యముల అక్షయఫలమును తప్పక అనుభవించెయే తీరవలయును. కల్పకోటి శతములు గడిచిననూ అనుభవించక కర్మ క్షీణించదు. చేయబడిన శుభాశుభకర్మలను తప్పక అనుభవించవలయును. జగత్స్వరూ పుడు సర్వలోకాంతర్యామి పరిపూర్ణుడు సనాతనుడగు శ్రీమన్నారాయణుడు సర్వకర్మ ఫలమును అనుభవించుచుండును. ఈ విశ్వంభరుడు గుణభేదముల ఉపాధిచే రూపభేదము లను స్వీకరించి సర్వమును ఉపభోగించు పరమాత్మ సర్వజగత్తును సృష్టించి కాపాడి లయమును చెందింపచేయును. (1/31)