నారద మహా పురాణము
మాసోపవాస వర్ణనము
సనకమహర్షి పలికెను: అన్ని పాపములను హరించునది పవిత్రమైనది సర్వలోకోప కారకమగు మరియొక వ్రతమును చెప్పెదను. సావధానముగా వినుము. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ మాసములలో ఏదో ఒక మాసమున ఈ వ్రతమును ఆచరించవలయును. ఈ మాసములలో ఏదో ఒక మాసమున శుక్లపక్షమున ఇంద్రియ నిగ్రహము కలవాడై పంచగవ్య ప్రాశనము చేసి శ్రీమహావిష్ణు సమీపమున శయనించవలయును. ప్రాతఃకాలమున లేచి నిత్యకర్మలను ముగించి కోపమును వదిలి ఇంద్రియవశము కలిగి శ్రద్ధతో శ్రీమహావిష్ణువును పూజించవలయును. పండితు లతో కలిసి యథావిధిగా శ్రీహరిని పూజించి స్వస్తివాచన పూర్వకముగా సంకల్పమును చేయ వలయును. “ఓ కేశవా! ఈ దినము నుండి ఒకనెల నిరాహారముగా నుండి, నీ యాజ్ఞచే మాసాం తమున పారణచేసెదను. ఓ తపస్స్వ రూపా! తపః ఫలప్రదాయకా! సర్వ విఘ్నములను నివారించి నా అభీష్టమును ప్రసాదించుము.” ఇట్లు శుభప్రదమైన మాసవ్రతమును శ్రీహరికి సమర్పించి అప్పటినుండి ఒకమాసము హరిమందిరమున నివసించవలయును. ప్రతి దినము పంచామృత విధానముతో శ్రీహరికి అభిషేకమును చేయవలయును. ఈనెలలో హరిమందిరమున అఖండ దీపమును ఉంచవలయును. ప్రతిదినము ఉత్తరేణి కాష్ఠముతో దంతధావనము చేసుకొని, శ్రీమన్నారాయణుని ధ్యానముచేయుచు, యథావిధిగా స్నానము చేయవలయును. భక్తిశ్రద్ధలతో యథావిధిగా శ్రీహరికి అభిషేకము చేసి అర్చన చేయవలయును. భక్తితో బ్రాహ్మణులకు భోజనమును దక్షిణను సమర్పించవలయును. ఇంద్రియ నిగ్రహము కలిగి తాను కూడా బంధువులతో కలిసి భోజనము చేయవలయును. ఇట్లు పదమూడు మాసోప వాసములను చేయవలయును. సంవత్సరము ముగిసిన తరువాత వేదవిదుడైన బ్రాహ్మణునకు గోదానమును చేయవలయును. దక్షిణను ఈయవలయును. పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనము ఈయవలయును. శక్తిననుసరించి దక్షిణలను ఆభరణములను సమర్పించవలయును. ఇట్లు ఇంద్రియ నిగ్రహముతో మూడుమార్లు మాసోపవాసవ్రతము నాచరించిన వారు అష్తోర్యామ యజ్ఞమునకు రెట్టింపు ఫలమును పొందెదరు. నాలుగుమార్లు ఈ వ్రతము నాచరించినవారు ఎనిమిది అగ్నిష్టోమ యాగముల ఫలితమును పొందెదరు. అయిదుమార్లు ఈ వ్రతమును ఆచరించిన వారు అత్యగ్నిష్టోమ యాగమునకు రెట్టింపు ఫలితమును పొందెదరు. ఆరుమార్లు మాసోపవాసవ్రతమును ఆచరించినవారు జ్యోతిష్టోమ యాగమునకు ఎనిమిది రెట్లు ఫలితమును పొదుదురు. ఈ వ్రతమును ఏడుమార్లు ఆచరించినవారు అశ్వమేధ యాగమునకు ఎనిమిదిరెట్ల ఫలమును పొందుదురు. ఎనిమిది మార్లు ఈ వ్రతమును ఆచరించినవారు నరమేధ యాగమునకు అయిదురెట్లు ఫలమును, తొమ్మిది మార్గాచరించినవారు గోమేధమునకు మూడురెట్లు ఫలమును, పదిమార్లాచరించిన వారు మూడు బ్రహ్మమేధముల ఫలమును, పదకొండుమార్లు ఆచరించినవారు సర్వభోగ సమన్వితమైన హరి సారూప్యమును, పదమూడు మార్లు అచరించినవారు, దుఃఖస్పర్శలేని పరమానందమును పొందెదరు. మాసోప వాసవ్రతమును చేయువారు, గంగా స్నానమును చేయువారు ధర్మమార్గప్రవక్తలు, ముక్తులే అగుదురు. సంశయముతోపనిలేదు. పతి పుత్రులులేని స్త్రీలు, యతులు, బ్రహ్మచారులు విశేషించి వానప్రస్థులు ఈ మాసోపవాసవ్రతము నాచరించవలయును. స్త్రీ కాని పురుషుడు కాని దుర్లభమైన ఈ వ్రతమును ఆచరించి యోగులకు కూడా దుర్లభమగు మోక్షమును పొందెదరు. గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, భిక్షుకుడు, మూర్ఖుడు, పండితుడు ఎవరైనను ఈ వ్రత విధానమును వినినచో మోక్షమును పొందును. నారాయణ భక్తుడు పవిత్రమైన ఈ వ్రతమును వినిననూ చెప్పిననూ అన్ని పాపముల నుండి విముక్తుడగును. (1/22)