నారద మహా పురాణము
విష్ణుమాహాత్మ్యము
సనకమహర్షి పలికెను: ఓ మునీ! ఇపుడు శ్రీమహావిష్ణు వైభవమును చెప్పెదను. ఆ వైభవమును చెప్పువారికి, వినువారికి అన్నిపాపములు నశించును. పూర్వము వైవస్వత మన్వంతరమున ఇంద్రునకు, బృహస్పతికి గొప్ప సంవాదము జరిగియున్నది. దానిని చెప్పెదను వినుము. ఒకానొకప్పుడు సర్వభోగ సమన్వితుడు సర్వదేవ పరివృతుడు, అప్సరో గణ సమేతుడగు ఇంద్రుడు బృహస్పతితో ఇట్లు పలికెను.
ఇంద్రుడు పలికెను: మహానుభావా! సర్వతత్త్వార్ధకోవిదా! బృహస్పతీ! గడిచిన బ్రహ్మ కల్పమున సృష్టి ఎట్లుండెను? ఇంద్రుడెట్టి వాడుగానుండెను? దేవతలెట్టివారు? ఎట్టి పనులను చేసియున్నారు? దీనిని అంతటిని ఉన్నది ఉన్నట్టుగా తెలుపుము.
బృహస్పతి పలికెను: పూర్వ కల్పమున జరిగిన చరితము నాకు తెలియదు. ఇపుడు జరుగుచున్నది కూడా తెలియ శక్యముకాదు. గడిచిన మనువుల గూర్చి కూడా చెప్పజాలను, నీవు అడిగిన విషయమును అంతటిని తెలిసిన వానిని చెప్పెదను వినుము. నీ పురములోనే సుధర్ముడను పేరుగలవాడు సుప్రసిద్ధుడున్నాడు. అతను బ్రహ్మ లోకమునుండి ఇచటికి వచ్చి దివ్య భోగములను అనుభవించుచున్నాడు. ఆ సుధర్మునికి వీటిని అన్నిటిని గూర్చి తెలియును. బృహస్పతి ఇట్లు పలుకగా ఇంద్రుడు బృహస్పతితో దేవతాగణములతో కలిసి సుధర్ముని గృహమునకు వెళ్ళెను. బృహస్పతితో కలిసివచ్చిన ఇంద్రుని చూచి, సుధర్ముడు తగిన విధముగా పూజించెను. ఇట్లు ఆదరముతో సుధర్ముడు చేసిన పూజనుస్వీకరించిన ఇంద్రుడు సుధర్ముని వైభవమును చూచి విస్మయము పొంది వినయముతో నిట్లు పలికెను.
ఇంద్రుడు పలికెను: “జరిగిన బ్రహ్మకల్ప వృత్తాంతమును తెలిసినచో చెప్పుము. ఈ విషయమును అడుగుటకే బృహస్పతితో కలిసి వచ్చితిని. గతించిన ఇంద్రుని దేవతలను ఎట్లు తెలియుదువు? స్వర్గములో నివసించియు మాకంటే అధికుడవెట్లైతివో చెప్పుము. తేజస్సుచే ఇతర సాధనములచే ఎట్లు ఇట్టివాడవైతివో తెలుపుము. ఇంద్రుడిట్లడుగగా సుధర్ముడు నవ్వుచు వినయముతో పూర్వమున జరిగినదానిని యథావిధిగా వివరించెను.
సుధర్ముడు పలికెను: నాలుగువేల యుగములు బ్రహ్మకు ఒకదినమని చెప్పబడినది. ఆ ఒక దినమున పదునాలుగు మంది మనువులు, పదునాలుగు మంది ఇండ్రులు ఉందురు. దేవతలు చాలా విధములుగానుందురు. ఇంద్రులు, మనువులు తేజో బల ప్రభావ సంపదలతో సమముగా ఉందురు. వారి పేర్లను చెప్పెదను. సావధానముగా వినుము. మొదటి మనువు స్వాయంభువమనువు. తరువాత స్వారోచిషుడు. ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వత మనువు ఏడవవాడు. సూర్యసావర్ణి ఎనిమిదవవాడు. దక్షసావర్ణి తొమ్మిదవవాడు. బ్రహ్మ సావర్ణి పదియవమనువు. తరువాత ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రోచమానుడు, పదునాలుగవవాడు భౌత్యుడు. ఈ పదునలుగురు మనువులు. ఇక ఇప్పుడు దేవతలను ఇంద్రులను చెప్పెదను వినుము. స్వాయంభువ మన్వంతరమున యాములను వారు దేవతలు. వారికి ఇంద్రుడు శచీపతి. స్వారోచిష మన్వంతరమున పారావతులు దేవతలు. వారికి సర్వసంపత్సమన్వితుడు అగు విపశ్చిత్తు ఇంద్రుడు. ఉత్తమ మన్వంతరమున సుధాములు సత్యులు శివులు ప్రతర్దనులు అనువారు దేవతలు. వారికి ఇంద్రుడు సుశాంతి. తామస మన్వంతరమున సుతులు పారాహరులు సుత్యలు దేవతలు. వారికి ఇంద్రుడు శుభకరుడగు శక్రుడు, రైవతమన్వంతరమున అమితాభాదులు దేవతలు. వారికి ఇంద్రుడు విభువు. ఆరవ మన్వంతరమున ఆర్యాదులు దేవతలు. వారికి ఇంద్రుడు మనోజవుడు. వైవస్వత మన్వంతరమున ఆదిత్య వసురుద్రాదులు దేవతలు. సర్వకామ సమన్వితుడగు పురందరుడు ఇంద్రుడు. సూర్యసావర్ణి మన్వంతరమున అప్రమేయులగు సుతపాదులు దేవతలు. విష్ణు పూజా ప్రభావముచే బలిచక్రవర్తి వారికి ఇంద్రుడు. దక్షసావర్ణి మన్వంతరమున పారాదులు దేవతలు. అద్భుతుడు ఇంద్రుడు. బ్రహ్మసావర్ణి మన్వంతరమున సువాసనాదులు దేవతలు. సర్వభోగసమన్వితుడగు శాంతినామకుడు ఇంద్రుడు. రుద్రసావర్ణి మన్వంతరమున విహంగమాదులు దేవతలు. వృషుడు ఇంద్రుడు. ధర్మసావర్ణిమన్వంతరమున విహంగమాదులు దేవతలు. ఋభుడనువాడు ఇంద్రుడు. రోచమాన మన్వంతరమున సుత్రామాదులు దేవతలు, దివస్పతి ఇంద్రుడు. భౌత్యమన్వంతరమున చాక్షుషాదులు దేవతలు. శుచి ఇంద్రుడు. ఇట్లు పదునాలుగు మంది మనువులను ఇంద్రులను చెప్పితివి. దేవతలను కూడా తెలిపితివి. వీరందరు బ్రహ్మయొక్క ఒకదినమున తమ అధికారమును అనుభవింతురు. లోకములో అన్ని సృష్టులలో సృష్టి ఒకే విధముగా ఉండును. సృష్టి కర్తలు చాలమంది ఉందురు. వారి సంఖ్యను జ్ఞానులు మాత్రమే తెలియుదురు. నేను బ్రహ్మ లోకమున నుండగా చాలామంది బ్రహ్మలు గతించిరి. వారిని ఇప్పుడు లెక్కించజాలను. స్వర్గలోకమునకు వచ్చిన తరువాత నలువురు మనవులు గతించిరి. నా సంపద అతి విస్తరము. ఇంకను నేను ఇచ్చట నూరు కోట్ల యుగములు ఉండవలయును. అపుడుమరల కర్మ భూమికి వెళ్ళెదను. నేను పూర్వము చేసిన సుకృతమును చెప్పెదను వినుము. దీనిని చెప్పు వారికి వినువారికి సర్వపాపములు తొలగును.
ఓ ఇంద్రా! నేను పూర్వము విశేషించి పాపాత్మకమగు గద్దనై ఉంటిని. అపవిత్రమైన అయోగ్యమగు మాంసమును భుజించుచు భూమిపై సంచరించుచుంటిని. ఒకపుడు నేను విష్ణుమందిర ప్రాకారమున నిలచి ఉంటిని. అంతలో వేటగాడు బాణముచే కొట్టగా మందిర ప్రాంగణమున పడితిని. నేను కొన ఊపిరితో నుండగా మాంసముపై ఆశగల శునకము తన నోటితో కరచుకొని మరికొన్ని శునకములు వెంటరాగా పరుగెత్తినది. ఇతర శునకముల భయముతో ఆ శునకము నన్ను నోటితో పట్టుకొని మందిరము చుట్టు ప్రదక్షిణ పద్ధతిలో తిరిగెను. జగన్మయుడు అంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడు ఆ మాత్రమునకే సంతోషించి నాకు అ శునకమునకు పరమ పదమునిచ్చెను. అసంకల్పితముగా ప్రదక్షిణా రూపమున తిరిగిన దానికే ఇంత ఫలమున్నచో చక్కగా అర్చించినచో ఇకనేమి చెప్పవలయును? ఇట్లు సుధర్ముడు చెప్పగా వినిన ఇంద్రుడు సంతోషించి హరిపూజాపరుడు అయ్యెను. అందువలననే దేవతలందరు భారత భూమిలో జన్మించ గోరి అనామయుడగు నారాయణుని పూజింతురు. నారాయణ పూజాపరులను బ్రహ్మాది దేవతలు పూజింతురు. దానమును గ్రహించనివారు మహానుభావులు నారాయణస్మరణ చేయువారికి సంసారబంధము కలుగదు. వారి సంగతిని కోరువారు కూడా ముక్తిని పొందెదరు. ముక్త సంగులై గరుడ వాహనుడగు నారాయణుని ప్రతిదినము అర్చించువారు సర్వపాప వినిర్ముక్తులై పరమ పదమును పొందెదరు. రాగమును పరనిందను పరిత్యజించి శ్రీమన్నారాయణుని అర్చించువారు పునర్జన్మను పొందరు. హరికథాశ్రవణముచే పాపములను తొలగించుకొని కృష్ణ పాదపద్మములను పూజించుటయందు ఆసక్తిగలవారై జగత్తును పావనము చేతురు. వారి స్పర్శతో సంభాషణతో పావనములగుదురు. కావున శ్రీహరిని పూజించవలయును. నిర్మలబుద్ధులు మహానుభావులు అగు హరిపూజా పరాయణులు ఉండుచోటనే పల్లపు ప్రాంతమున నీరుండునట్లు అన్ని శుభములు ఉండును. శ్రీహరియే ఉత్తమ బంధువు. శ్రీహరియే ఉత్తమగతి. చైతన్యకారణమగు శ్రీహరియే పూజ్యుడు. స్వర్గపవర్గ ఫలములనిచ్చు సదానందస్వరూపుడు, నిరామయుడు అగు నారాయణుని పూజించుము. ఉత్తమశ్రేయస్సు లభించును. నిష్కాములై శుద్ధమానసులై శ్రీహరిని పూజించినవారికి శ్రీహరి ప్రసన్నుడై అన్ని కోరికలను తీర్చును. ఈ వృతాంతమును వినినవారు, చదివినవారు అశ్వమేథయాగ ఫలమును పొందెదరు. ఓ మునీంద్రా! ఇట్లు నీకు సంగ్రహముగా విస్తరముగా హరిపూజాఫలమును చెప్పితిని. ఇంకను ఏమి చెప్పమందువో తెలుపుము. (1/40)