నారద మహా పురాణము
యోగ నిరూపణము
నారదమహర్షి పలికెను: పూజ్యుడా! అన్నీ తెలిసిన మీరు నేనడిగిన దానినంతటిని చెప్పితిరి. సంసార పాశబద్ధులైన వారు అనుభవించు పలు దుఃఖములను వివరించితిరి. ఈ సంసారపాశమును ఛేదించునదేది? యే ఉపాయముచే మోక్షము లభించునో అదంతయూ నాకు వివరించుడు. ప్రాణులు ప్రతిదినము తప్పక కర్మలను చేయుచుందురు. అట్లే కర్మఫలములను అనుభవించెదరు కూడా. అ కర్మలెట్లు నశించును? కర్మచేతనే దేహమును పొందును. దేహముగల జీవుడు కామముచే బంధించబడును. కామముచే లోభమును పొందును. లోభముచే కోపము కలుగును. కోపముచే ధర్మము నశించును. ధర్మనాశమునే స్మృతిభ్రంశము కలుగును. స్మృతిభ్రంశము వలన మతిభ్రమ కలుగును. మతిభ్రంశమువలన మానవుడు మళ్ళీ పాపమునుచేయును. కావున దేహమే పాప మూలము. పాపకర్మరతము. కావున దేహముపై భ్రమను వదిలి మోక్షమును పొందు ఉపాయమును తెలుపుడు.
సనకమహర్షి పలికెను: ఓ మహాప్రాజ్ఞా! బాగు బాగు. నీ బుద్ధి నిర్మలమైనది. కావుననే సంసార దుఃఖమునుండి మోక్షమునకు ఉపాయమును తెలియగోరుచున్నావు. శ్రీమన్నారా యణుని ఆజ్ఞచే బ్రహ్మసృజించుచున్నాడు. విష్ణువు పాలించుచున్నాడు. రుద్రుడు నశింపచేయుచున్నాడు. ఆ శ్రీమన్నా రాయణుడే మోక్షము నిచ్చువాడు. అహంకార తత్త్వమునుండి విశేషముల వరకు శ్రీమన్నారా యణుని ప్రభావము వలననే కలుగును. కావున అట్టి నిర్వికారుడగు శ్రీమన్నారాయణుడు మాత్రమే మోక్షము నిచ్చువాడు. ఈ ప్రపంచ మంతయూ శ్రీమన్నారాయణుని కంటే భిన్నముకాదు. ఈ ప్రపంచము తోచును. తోచక పోవును. అట్టి జరాదిరహితుడు ఉగ్రుడగు నారాయణుని ధ్యానించి దుఃఖము నుండి విముక్తుడగును. అవికారుడు, అజుడు, శుద్ధుడు, స్వప్రకాశుడు, నిరంజనుడు, జ్ఞాన రూపుడు, సదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుడే మోక్షసాధనుడు. శ్రీమన్నారాయణుని అవతార రూపములను బ్రహ్మాది దేవతలు పూజింతురు. ఆ శ్రీమన్నారాయణుడే శాశ్వత స్థానప్రదుడు. జితప్రాణులు, జితాహారులు, సదాధ్యానపరాయణులు సత్యస్వరూపునిగా సాక్షాత్కరించుకొను శ్రీమన్నారాయణుడు సుఖావహుడని తెలియుము. గుణరహితుడయ్యును. గుణాధారుడు, లోకాను గ్రహము కొఱకు రూపమును ధరించువాడు, ఆకాశ మధ్యగుడు పూర్ణుడు అగు శ్రీమన్నారాయణుడే ప్రాణులకు మోక్షమును ప్రసాదించువాడు. సర్వకార్యములకు అధ్యక్షుడు. దేహి హృదయములో ఉండువాడు, సాటిలేనివాడు, అఖిలాధారుడగు ఆ శ్రీమన్నారాయణుడే మోక్షప్రదుడని తత్త్వదర్శులగు మునులు చెప్పుచుందురు. వేదార్థమును తెలిసినవారు కర్మజ్ఞులు పలు యజ్ఞములచే శ్రీమహావిష్ణువును పూజింతురు. అతనే కర్మఫలప్రదుడు, మోక్షప్రదుడు. శ్రీమహావిష్ణువే హవ్యకవ్యాది దానము లలో దేవపితృ రూపములను ధరించి భుజించును. ఆ ప్రభువే మోక్షప్రదుడు. శ్రీమన్నారాయణుని భక్తితో ధ్యానించిననూ ప్రసాదించును. కావున ఆ దయాళువును అర్చించవలయును. సర్వ భూతము లకు ఆధారభూతుడు ఉత్తమపురుషుడు అగు ఒక్క శ్రీమహావిష్ణువే జరామరణ రహితుడు, అవ్యయుడు. ఆ విష్ణువేమోక్షప్రదుడు. శ్రీమన్నారాయణుని భక్తితో ధ్యానించిననూ ప్రణామము లాచరించిననూ, పూజించిననూ శాశ్వతమగు మోక్షమును ప్రసాదించును. శ్రీమన్నారాయణుని పాదపద్మములను పూజించి ప్రాణులుకూడా అమృతత్వమును పొందుదురు. కావున ఆ శ్రీహరి పురుషోత్తముడు అందురు. శ్రీమహావిష్ణుని పరమపదము ఆనంద స్వరూపము, అజరము, బ్రహ్మస్వరూపము, పరంజ్యోతి, సనాతనము పరములు అన్నిటికంటే పరతమము. శ్రీమన్నారాయ ణుడు అద్వితీయము నిర్గుణము, నిత్యము సాటిలేనిది పరిపూర్ణము జ్ఞానమయము అగు స్వరూపము గలవాడు మోక్షప్రసాదకుడు ఇట్టి పరమోత్కృష్టమైన వస్తువైన శ్రీమన్నారాయణుని ఉపాసించు యోగి మాత్రమే పరమపదమును పొందును. అన్ని సంగములను పరిత్యజించి శమాదిగుణసహితుడై కామాదులను వర్ణించిన యోగియే పరమపదమును పొందును.
నారద మహర్షి పలికెను: “ఓ మహానుభావా! యోగులకు ఏ కర్మను ఆచరించుటచే యోగసిద్ధి లభించునో ఆ ఉపాయమును ఉన్నది ఉన్నట్టుగా నాకు తెలుపుము.”
సనక మహర్షి పలికెను: “జ్ఞానము వలన లభించునది మోక్షము, అని తత్త్వార్థ చింతకులు చెప్పెదరు. ఆ జ్ఞానము భక్తిమూలము. భక్తి కర్మపరులకే సిద్ధించును. కొన్నివేల జన్మల దానములను యజ్ఞములను పలువిధములైన తీర్థయాత్రాదులను చేసినవారికి శ్రీహరియందు భక్తి కలుగును. కొంచెము భక్తిచే అక్షయ మగు పరమధర్మము సిద్ధించును. ఉత్తమమైన శ్రద్ధచే అన్ని పాపములు నశించును. అన్ని పాపములు నశించునచో బుద్ధి నిర్మలమగును. ఆ నిర్మలబుద్ధినే జ్ఞానమని జ్ఞానులు చెప్పిరి. ఆ జ్ఞానమే మోక్షమునిచ్చును. ఆ జ్ఞానము యోగులకు మాత్రమే కలుగును. కర్మయోగము జ్ఞానయోగము అని యోగము రెండు విధములుండును. కర్మయోగము లేనిచో జ్ఞానయోగము సిద్ధించదు. కావున క్రియాయోగరతుడై మానవుడు శ్రద్ధతో శ్రీహరిని అర్చించ వలయును. భూమి, అగ్ని, జలము, సూర్యుడు, ధాతువులు, హృదయము, చిత్రము ఇవి అన్నియు కేశవుని స్వరూపమే. కావున బ్రాహ్మణులు, ఈ ప్రతీకలలో శ్రీహరిని భక్తిచే పూజించవలయును. మనోవాక్కాయములచే పరపీడనము చేయక సర్వగతుడైన శ్రీ మహావిష్ణువును భక్తిచే పూజించ వలయును. అహింస, సత్యము, అక్రోధము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఈర్షలేకపోవుట దయ అనునని కర్మజ్ఞానయోగములలో రెండింటిలో సమానముగా నుండదగినవి. చరాచరాత్మకమగు ఈ విశ్వమంతయు శ్రీహరియే” అని మనసులో నిశ్చయించి కర్మజ్ఞానయోగములను అభ్యసించ వలయును. అన్ని ప్రాణులను తనవలె చూడగలుగువాడే దేవదేవుడగు శ్రీహరియొక్క పరతత్త్వ స్వరూపమును చూడగలరు. క్రోధాదులతో చెడిన మనసుకలవాడు శ్రీహరిని పూజాధ్యానములతో సేవించినను ధర్మప్రభువైన విష్ణువు అతనికి ప్రసన్నుడు కాజాలడు. కామాదులచే చెడిన మనసు కలవాడు దేవపూజాపరుడైనను అదియంతయు దంభాచారమని అతను పాతకులందరితో సముడని తెలియువలయును. తపస్సును పూజాధ్యానములు నిరర్థకములగును. కావున కర్మయోగము ఆచరిం చునరుడు శమాదమాదిగుణములు కలవాడై, సర్వాత్మకుడగు శ్రీమహావిష్ణువును మోక్షముకొఱకు అర్చించవలయును. మనోవాక్కర్మలచే సర్వలోకముల హితమును కోరుచు శ్రీహరిని పూజించుటయే కర్మయోగమనబడును. ఉపవాసాదులచే పురాణ శ్రవణాలచే పుష్పాదులచే శ్రీమహావిష్ణువును అర్చిం చుటయే క్రియాయోగము అనబడును. ఇట్లు భక్తి కలిగి క్రియాయోగపరులైన వారికి పూర్వజన్మలో సంపాదించిన పాపములన్నియు నశించును. పాపములు నశించుటవలన శుద్ధమతి అయి ఉత్తమ జ్ఞానమును అభిలషించును. ఈ జ్ఞానమే మోక్షము నిచ్చును. ఆ జ్ఞానమును సంపాదించు ఉపాయ మును నీకు చెప్పెదను.
చరాచరాత్మకమగు ఈ ప్రపంచమున శాస్త్రార్థకోవిదులగు సజ్జనులతో నిత్యానిత్యముల విషయమున చక్కగా విచారణ చేయవలయును. పదార్థములనిత్యములు. శ్రీహరి ఒక్కడే నిత్యుడు. అనిత్యములను విడిచి నిత్యమునే ఆశ్రయించవలయును. ఇహపరలోకములందలి భోగముల విషయమున విరక్తుడు కావలయును. విరక్తుడు కానివాడు సంసారమున ప్రవర్తించును. అనిత్య పదార్థములందు రాగమును పెంచుకొన్నవానికి ఎపుడూ సంసారవిచ్ఛిత్తి జరుగదు. మోక్షమును కోరువాడు శమాదిగుణసంపన్నుడై, జ్ఞానము అభ్యసించవలయును. శమాదిగుణహీనునకు జ్ఞానము కలగదు. రాగద్వేషవిహీనుడై శమాదిగుణయుతుడై నిత్యము హరిధ్యానపరుడైన వానిని ముముక్షువు అందురు. ఈ నాలుగు సాధనములచే విశుద్ధమతి అగును. సర్వభూతదయాపరుడై విష్ణువును సర్వగతునిగా భావించవలయును. క్షరాక్షరాత్మకమగు ఈ ప్రపంచమునంతటిని నారాయణుడు వ్యాపించియుండును. అని తెలిసిన విప్రునికి కలుగు జ్ఞానము యోగము వలన కలుగును అని తెలియును. కావున ఇపుడు సంసార నివర్తకమగు యోగోపాయమును చెప్పెదను. యోగజ్ఞానము విశుద్ధము అగును. ఆ జ్ఞానమే మోక్షమును ప్రసాదించును. పరము అపరము అను భేదముచే ఆత్మ రెండు విధములు అందురు. రెండును బ్రహ్మలే అని అధర్వశ్రుతి. పరుడు నిర్గుణుడు, అపరుడు అమంకారయుతుడు. ఈ రెండు అభిన్నములని తెలియుటే యోగమని చెప్పబడినది. పంచభూతాత్మకమగు దేహమున సాక్షిగా హృదయమున ఉన్నవాడు అపరుడనబడును. పరమాత్మ పరుడనబడును. శరీరము క్షేత్రము అనబడును. శరీరమున ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు అనబడును. అవ్యక్తుడు, పరముడు, శుద్ధుడు పరిపూర్ణుడు అనబడును. జీవాత్మ పరమాత్మలకు అభేదవిజ్ఞానము కలుగునపుడు జీవాత్మకు సంసార పాశచ్ఛేదమగును. పరమాత్మ ఒక్కడు, శుద్ధుడు, అక్షరుడు, నిత్యుడు, జగన్మయుడు. నరుల జ్ఞాన భేదముచే భేదముగలవానివలె తోచును. సనాతనుడగు పరబ్రహ్మ ఏకము అద్వితీయము. వేదాంతములు పరమాత్మకంటే పరములేదని గానము చేయుచున్నవి. అ పరమాత్మకు కర్మ, కార్యము, రూపము, వర్ణము కర్తృత్వము భోక్తృత్వము లేవు. అన్ని తేజస్సులు కంటే పరమైన తేజము అన్ని హేతువులకు నిదానము. దానికంటే మరొకటిలేదని ముక్తిని కోరువారు తెలియవలయును. మహావాక్యాదికము సర్వము శబ్దబ్రహ్మముగా తెలియుము. ఆ శబ్ద బ్రహ్మమును విచారించుటచే కలిగిన జ్ఞానమే మోక్షసాధనము. సమ్యక్ జ్ఞానము లేనివారికి జగత్తు పలువిధములుగా కనిపించును. పరమజ్ఞానులకిదియే జగత్తు పరబ్రహ్మాత్మకముగా కనిపించును. పరబ్రహ్మ ఒక్కడే పరములకంటే పరుడు నిర్గుణుడు పరామానందుడు. విజ్ఞానభేదముచే అవ్యయుడు బహురూప ధరుడుగా తోచును. మాయచే పరమాత్మలో భేదమును చూచెదరు. కావున ముముక్షువు మాయను త్యజించవలయును. మాయద్రూపముగాదు అసద్రూపమూ కాదు. ఉభయాత్మకము కాదు. కావున మాయ నిర్వచించవీలులేనిది. భేదబుద్ధిప్రదాయని అని వ్యవహరించబడును. మాయయే అజ్ఞాన శబ్దముచే తెలియబడుచున్నది. మాయను జయించువారికి అజ్ఞానవిచ్ఛేదము కలుగును. సనాతన మగు పరబ్రహ్మ జ్ఞానశబ్దముచే చెప్పబడును. పరమాత్మ జ్ఞానులహృదయమున నిరంతరము భాసించును.
ఓ మునిసత్తమా! యోగి యోగముతో అజ్ఞానమును నశింపచేయవలయును. యోగము అష్టాంగములతో సిద్ధించును. ఆ అష్టాంగములను యథార్థముగా చెప్పెదను. యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అను ఎనిమిది యోగాంగములు. ఇక ఇపుడు ఈ ఎనిమిది లక్షణములను సంక్షేపముగా చెప్పదను. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, అక్రోధము, అనసూయ అను ఏడు యమములు. ఏ ప్రాణికీ క్లేశము కలిగించ కుండుట అహింస అనబడును. ఈ అహింస యోగసిద్ధిని కలిగించును. ధర్మాధర్మ వివేకముతో యథార్థమును సత్యమందురు. చౌర్యముచేత కాని, బలముచేత కాని, పరద్రవ్యాపహరణమును స్తేయమందురు. దానికి విపరీతము అస్తేయమని సజ్జనులు చెప్పుచున్నారు. అంతటా మైధునమును పరిత్యజించుట బ్రహ్మచర్యమందురు. బ్రహ్మచర్యమును పరిత్యజించినచో జ్ఞాని కూడా పాతకి అగును. సర్వసంగపరిత్యాగియైనను స్త్రీ సంగతితో ప్రవర్తించినచో అతను సర్వవర్ణబహిష్కృతుడగు చండాలసముడగును. యోగరతుడైన విప్రుడు విషయస్పృహ కలిగియున్నచో అతనితో సంభాషించి నంతనే బ్రహ్మహత్యాపాతకము కలుగును. సర్వసంగపరిత్యాగి మరల సంగి అయినచో అతనితో కలిసి ఉన్నవారితో కలిసిన వారికి మహాపాతకదోషము సంభవించును. ఆపదలో కూడా ద్రవ్యములను స్వీకరించకుండుట యోగసిద్ధిని కలిగించు అపరిగ్రహమందురు. తన అధిక్యముచే అతికఠినముగా మాటలాడుటను ధర్మవిదులు క్రోధమందురు. దానికి విపరీతము అక్రోధమనబడును. ఎదుటివాడు ధనాదులతో అధికముగా ఉండుటను చూచి మనసున పరితపించుట అసూయ అనబడును. అమాయను వదలుట అనసూయ అని సజ్జనులు చెప్పెదరు. ఇట్లు సంక్షేపముగా యమములను చెప్పితిని. ఇపుడు నియమములను చెప్పెదను. వినుము.
తపస్సు, స్వాధ్యాయము, సంతోషము, శౌచము, హరిపూజనము, సంధ్యోపాసన, మొదలగునవి నియములని చెప్పబడినవి. చాంద్రాయణాది వ్రతములచే శరీర శోషణమే ఉత్తమయోగసాధనమగు తపమని సజ్జనులు చెప్పిఉన్నారు. ప్రణవమును ఉపనిషత్తులను ద్వాదశాక్షర మంత్రమును. అష్టాక్షర మంత్రమును, మహావాక్యచయమును జపించుటయే స్వాధ్యాయమనబడును. ఇది ఉత్తమమగు యోగసాధనము. స్వాధ్యాయమును వదిలిన మూడునకు యోగము సిద్ధించదు. యోగము లేకున్నను, స్వాధ్యాయముచే మానవులకు పాపము నశించును. స్వాధ్యాయములచే స్తుతించినచో దేవతలు ప్రసన్నులగుదురు. వాచికము, ఉపాంశు, మానసము అను భేదములచే జపము మూడు విధములు. ఈ మూడు విధములలో మొదటి దానికంటే తరువాతిది శ్రేష్టము అని చెప్పబడినది. అక్షరములు పదములు స్ఫుటముగా ఉండునట్లు మంత్రమును ఉచ్చరించుట వాచిక జపమందురు. ఈ వాచిక జపము సర్వయజ్ఞఫలప్రదము. మంత్రమును ఉచ్చరించునపుడు కొంచెము ఒక పదమునుండి మరియొకపదమును విడిగా తెలియునట్లు పలుకుట ఉపాంశుజపమందురు. ఉపాంశుజపము వాచికజపము కంటే రెట్టింపు ఫలమునిచ్చును. అక్షరముల క్రమమును నిర్ణయించి అర్థమును విచారించుట మానసజపమందురు. మానస జపము యోగసిద్ధిప్రదాయకము. జపముచే స్తుతించినచో, దేవతలు ప్రసన్నలగుదురు. కావున స్వాధ్యాయసంపన్నుడు సర్వమనోరథములను పొందును. దైవవశమున లభించినదానిచే తృప్తిని పొందుట సంతోషము అనబడును. సంతోషములేక మానవుడు ఎచటను సుఖమును పొందలేడు. కామములు అనుభవముచే ఎప్పుడూ తృప్తిని కలి గించవు. ఇక మరి కొంచెమును పొందవలయునని కామము పెరుగుచునేయుండును. దేహమును తపింపచేయు కామమును విడిచి దైవవశమున లభించినదానిచే సంతోషించి ధర్మపరాయణుడు కావలయును.
బాహ్యము అభ్యంతరము అని శౌచము రెండు విధములు. నీరుచే మట్టిచే బహిశ్శుద్ధి జరు గును. భావశుద్ధి అంతరశుద్ధి అనబడును. అంతశుద్ధిలేనివారు ఎన్ని యజ్ఞములను ఆచరించిననూ బూడిదలో విడిచిన హవ్యములవలె ఫలించజాలవు. భావశుద్ధి లేనివారు చేయు కర్మలన్నియు నిష్ఫలములే అగును. కావున రాగాదికములను విడిచి సుఖవంతుడు కావలయును. ఎన్ని మట్టి రాశులచే కాని కోటి కలశముల జలముచే కాని శుద్ది పొందినను భావదుష్టుడైనచో చండాల సదృశుడగును. అంతశ్శుద్ధిలేనివారు తీర్థయాత్రలను చేసినచో సురాభాండమును నదిపానము చేయజాలనట్లు పావనము చేయజాలవు. వాక్కుచే ధర్మములను చెప్పుచు మనసులో పాపమును కోరినవాడు మహాపాతకులలో శ్రేష్ఠుడు అగును. మనశ్శుద్ధికలవారు ఉత్తమధర్మాచరణ కావించినచో అక్షయఫలము లభించును. ఉత్తమ సుఖమును పొందును. మనోవాక్కాయములచే దృఢమైన హరిభక్తియే హరిపూజ అనబడును. ఇట్లు యమములను నియమములను సంక్షేపముగా వివరిం చితిని. ఈ యమనియమములచే మనశ్శుద్ధిగలవారికి మోక్షము హస్తగతమని తెలియుము.
ఇట్లు యమ నియములతో స్థిరబుద్ధి జితేంద్రియుడై ఉత్తమము యోగసాధనము అయిన ఆసనమును చక్కగా అభ్యసించవలయును పద్మకము, స్వస్తికము, పీటము, సైంహము, కౌక్కుటము, కౌంజరము, కౌర్మము, వజ్రాసనము, వారాహము, మృగచౌలికము, నాలికము, సర్వతోభద్రము, వార్షభము, నాగము, మాత్స్యము, వైయాఘము, అర్థచంద్రకము, దండము, వాతాసనం, శైలము, స్వభ్రము, మౌద్గరము, మాకరము, త్రైపథము, కాష్ఠము, స్థాణువు వైకర్ణికము, భౌమము, వీస రాసనము అని ముప్పది ఆసనములు యోగసాధన కారణములని మునీంద్రులు చెప్పుచున్నారు. వీటిలో ఏదేని ఒక దానిని తెలుసుకొని గురుభక్తి పరాయణుడై ద్వంద్వాతీతుడు మాత్సర్యరహితునిగా ఉండి ఉపాసకుడు ప్రాణములను జయించవలయును. తూర్పు ఉత్తరము పశ్చిమములలో ఏదేని ఒక దిక్కునకు ముఖము నుంచి కూర్చుని నిశ్శబ్దము నిర్జనము అయిన ప్రాంతమున అభ్యాసముతో ప్రాణములను జయించవలయును. శరీరములో ఉండు వాయువు ప్రాణమనబడును. ఆయామ మనగా నిగ్రహము. ప్రాణవాయువుని నిగ్రహమును ప్రాణాయామమందురు. ప్రాణాయామము రెండు విధములు. అగర్భము సగర్భము అని ఈ రెంటిలో సగర్భము శ్రేష్ఠమైనది. జపము ధ్యానము లేక చేయునది అగర్భము. జపధ్యానములతో చేయునది సగర్భము. రేచకము, పూరకము, కుంభకము, శూన్యకము అని ప్రాణాయామము చతుర్విధము. ప్రాణులకు దక్షిణభాగమున నుండు వాడి పింగల అనబడును. పింగలానాటికి సూర్యుడు అధిదేవత. పితృయోని అని మరియొక పేరు. వామ భాగమున నుండు నాడిని ‘ఇడ’ అందురు. ఈ సుషుమ్న అతిసూక్ష్మమైనది. పరమ రహస్యమైనది. బ్రహ్మదేవ తాకము. వామమార్గము ద్వారా వాయువును బయటకు రేచకము (విడుచుట) చేయవలయును. రేచనము చేయుటచే ‘రేచకమ’ని పేరు. దక్షిణ మార్గముచే వాయువును పూరించవలయును. పూరిం చుటచే ‘పూరకమ’ని పేరు. ఇట్లు నింపిన వాయువును విడువక నిగ్రహించుటయే కుంభకమనబడును. నిండుకుండవలె ఉండుట వలన కుంభకమందురు. బయట వాయువును తీసుకొనక, లోపలి వాయు వును విడువక ఉండుటను శూన్యకమందురు. మదించిన ఏనుగును వశపరచు కొనునట్లు ప్రాణ మును మెల్లిమెల్లగా వశము చేసుకొనవలయును. ప్రాణాయామమును అట్లు (మెల్లమెల్లగా) చేయనిచో భయంకరములైన మహరోగములు కలుగును. కల్మషము లేనివాడై యోగి క్రమముగా వాయువును నియోగించవలయును. అట్లు చేసినచో అన్నిపాపములనుండి విముక్తుడై బ్రహ్మపదమును చేరును.
ఓ మునీశ్వరా! విషయములందు ప్రసక్తములైన ఇంద్రియములను వెనకకు తీసుకొని నిగ్రహిం చుటే ప్రత్యాహారము అనబడును. ధ్యానములేని వారైనను ఇంద్రియ జయము కలిగిన మహాను భావులు పునరావృత్తిరహిత పరమపదమును చేరెదరు. ఇంద్రియ సమూహమును జయించక ధ్యానము చేయువాడు మూఢుడు అనబడును. అతనికి ధ్యానము కూడా సిద్ధించదు. తాను చూచున దంతయు తనవలె, తనలోని దానివలె చూచుచు ప్రత్యాహృతములైన ఇంద్రియములను ధరించినచో ధారణ అనబడును. యోగముచే ఇంద్రియగ్రామమును జయించి, జయించిన ఇంద్రియములను హృదయమున దృఢముగా బంధించి సర్వధారకుడు అచ్యుతుడు అగు పరమాత్మను ధ్యానము చేయవలయును. సర్వవిశ్వాత్మకుడు సర్వలోకైకకారణుడు వికసత్పద్మపత్రాక్షుడు, చారుకుండల భూషితుడు, దీర్ఘబాహువు, ఉదారాంగుడు, సురాసురనమస్కృతుడు అగు శ్రీమన్నారాయణుని అష్టారమగు ద్వాదశాంగుల విస్తృతమగు హృదిన నిలుపవలెను పరాత్పరతరుడు విభుడు అవ్యక్తుడు అగు ఆత్మను ధ్యానించవలయును. ప్రత్యయము ఏకాధారముగా నుండుటను ధ్యానమందురు. ఒక ముహూర్తము ధ్యానము చేసిననూ మోక్షము లభించును. ధ్యానము వలన పాపములు నశించును. ధ్యానమువలన మోక్షము లభించును. ధ్యానమువలన శ్రీహరి ప్రసన్నుడగును. ధ్యానము వలన సర్వార్థములు సాధించబడును. శ్రీమహావిష్ణువు ధరించిన అన్ని రూపములను సావధానముగా ధ్యానించవలయును. ఆ ధ్యానముచే శ్రీహరి ప్రసన్నుడై మోక్షమును ప్రసాదించును. ధ్యేయమగు వస్తువునందు మనస్సును నిశ్చలయముగా ఉంచవలయును. అపుడు ధ్యానము ధ్యేయము ధ్యానము చేయువాడు అనుభేదములు నశించవలయును. అపుడు జ్ఞానామృతసేవనము వలన అమృతత్వము లభించును. నిరంతరధ్యానముచే అభేదప్రతిపత్తి కలుగును.
ఇంద్రియ వ్యాపారములు విరమించబడి పరమానందయుక్తుడై గాలిలేని చోటి దీపమువలె, సుషుప్తిలో వలె ఉండుట సమాధి అనబడును. యోగి సమాధ్యవస్థలో వినజాలడు చూడజాలడు వాసన చూడజాలడు స్పృశింపజాలదు. ఏమియు చెప్పజాలడు. ఆత్మనిర్మలము, శుద్ధము, సచ్చినానన్ద స్వరూపము, సర్వోపాధివినిర్ముక్తుముగా యోగులకు నిశ్చలముగా భాసించును. పరమాత్మ నిర్గుణు డైనను అజ్ఞానమువలన గుణసహితుని వలె భాసించును. అజ్ఞానము నశించినచో పూర్వమున్నటుల భాసించును. అమేయాత్మ పరిజ్యోతి మాయ కలవారికి మాయకలదానిగా, మాయ నశించినచో నిర్మల బ్రహ్మస్వరూపము ప్రకాశించును. ఒకటే రెండవది లేనిది, పరంజ్యోతి, నిరంజనము సర్వ భూతాంతర్యామిగా ఉండును. అణువులలో అణువు, మహత్తులలో మహత్తు సనాతనమగు ఆత్మ, అఖిల ప్రపంచకారణము అగు పరమాత్మను పరాత్పరునిగా పరమ పవిత్రునిగా జ్ఞానులలో ఉత్తములు చూచెదరు. ఆకారము మొదలు క్షకారమువరకుగల వర్ణ భేదముతో ఉండువాడు అనాదియగు పురాణ పురుషుడు శబ్దబ్రహ్మ అని కీర్తించబడును. విశుద్ధము అక్షరము, నిత్యము, పూర్ణము ఆకాశమధ్యస్థము, ఆనందము, నిర్మలము, శాంతము పరబ్రహ్మ అని గానము చేయబడును. యోగులు సనాతనుడు అ వికారి అజుడు శుద్ధుడు పరబ్రహ్మముగా కీర్తించబడు పరమాత్మను హృదయమున దర్శించగలరు. ఇప్పుడు ఇంకొక ధ్యానమును చెప్పెదను. సంసార తాపతప్తులగు నరులకు సుధావృష్టివంటిదీ ఈ ధ్యానము. సావధానముగా వినుము. ప్రణవములో ఉన్న పరానంద స్వరూపడగు నారాయణుని స్మరించవలయును. సాటిలేనిది అర్థమాత్రోపరిభాగముననుండు నారదరూపుని ధ్యానించవలయును. అకారము బ్రహ్మస్వరూపము ఉకారము విష్ణుస్వరూపము. మకారము రుద్రరూపము. అర్థమాత్ర పరమాత్మ స్వరూపము. మూడుమాత్రలు బ్రహ్మవిష్ణు శివాత్మ కములుగా చెప్పబడియున్నవి. ఆ మూడుమాత్రల సముదాయము పరబ్రహ్మ ప్రబోధకము. పరబ్రహ్మ వాచ్యము. ప్రణవము వాచకము, పరబ్రహ్మ ప్రణవములకు వాచ్యవాచక సంబంధము ఉపచారము వలన సిద్ధించును. ప్రణవమును నిత్యము జపించువారలు సర్వపాపముల నుండి విముక్తులగుదురు. ప్రణవజపాభ్యాసము కలవారు మోక్షమును పొందెదరు. బ్రహ్మవిష్ణుశివాత్మకమగు ప్రణవమును జపించుచూ ఆత్మతో నిర్మలము కోటి సూర్యసమప్రకాశమగు పరమాత్మను ధ్యానించవలయును. శాలగ్రామశిలారూపమును కాని ప్రతిమారూపమును కాని పాపహరమగు ఏ వస్తువునైనను హృద యము ధ్యానించవలయును. ఇపుడు నీకు చెప్పిన ఈ వైష్ణవజ్ఞానమును తెలిసిన యోగీంద్రులు ఉత్తమమోక్షములను పొందెదరు. ఈ జ్ఞానబోధకమగు యోగవిధానమును సావధానముతో వినువారు చదువువారు సర్వపాపవినిర్ముక్తులై శ్రీహరిసాలోక్యమును పొందెదరు. (1/33)