శ్రీపురుషోత్తమ మాహాత్మ్యము

వసువు పలికెను: ఇట్లు ఇంద్రద్యుమ్నునిచే స్తుతించబడిన శ్రీహరి ప్రసన్నుడై అతను కోరిన దానినంతటినీ అనుగ్రహించెను. ప్రతిదినము శ్రీహరిని పూజించి ఈ స్తోత్రముచే స్తుతించినచో తప్పక మోక్షము లభించును. ప్రతిదినము ఈ స్తోత్రమును మూడు మార్లు జపించువారికి ధర్మార్థ కామమోక్షములు లభించును. సావధానముచే ఈ స్తోత్రమును చదివిననూ, వినిననూ, వినిపించిననూ పాపరహితుడై శాశ్వత విష్ణులోకమును పొందును. ఈ స్తోత్రము ధన్యము, పాపహరము, భుక్తి ముక్తి ప్రదము, శుభకరము, గుహ్యము, సుదుర్లభము, పుణ్యము. దీనిని ప్రతివారికి ఉపదేశించరాదు. నాస్తికునకు, మూర్ఖునకు, కృతఘ్నునికి, అహంకారికి, దుర్బుద్ధికి, భక్తి రహితునకు ఈయరాదు. భక్తి యుక్తునకు, గుణశీల వంతునకు, విష్ణు భక్తునకు, శాంతునకు, శ్రద్ధానుష్ఠానశీలికి ఉపదేశించవలయును. ఈ స్తోత్రమును సకల పాపసంఘవినాశకము. కారుణ్య సంజ్ఞము. సుఖప్రదము, మోక్షప్రదము. సకలాభీష్ట ప్రదము. ఉత్తమము అగు పురుషోత్తమ స్తోత్రమును నేను చెప్పితిని. ఇట్లు అతి సూక్ష్ముడు, విమలాంబర సన్నిభుడు, నిత్యుడు పురాణపురుషుడు అగు శ్రీహరిని ధ్యానముచేయువారు అధ్వరాగ్నియందు మంత్రములచే హవిస్సునువలె శ్రీహరిని చేరెదరు. మోక్షమును పొందెదరు. సంసార దుఃఖమును తొలగించువాడు ఒక్క శ్రీహరియే శ్రీహరియే పరులందరికి పరుడు. శ్రీహరికంటే ఇతరుడు లేడు. శ్రీహరియే సృష్టికర్త. రక్షకుడు అంతకర్త. శ్రీహరియే సకలసముడు. అఖిలసారభూతుడు. జగద్గురువు మోక్షానంద ప్రదుడగు కృష్ణునియందు భక్తిలేనివారి విద్య సుగుణములు, యజ్ఞములు, దానములు, ఉగ్రతపములు, వ్యర్థములు, పురుషోత్తముని యందు భక్తి కలవాడే ఈలోకమున ధన్యుడు, పవిత్రుడు, విద్వాంసుడు, వక్త, ధర్మశీలుడు. జ్ఞాత, దాత, సత్యవాక్యుడు అగును. ఇంద్రద్యుమ్నుడిట్లు సనాతనుడగు శ్రీహరిని స్తుతించి ప్రణామములు ఆచరించి సర్వకామ ఫలప్రదుడు జగన్నాథుడగు వాసుదేవుని చింతించుచు, భూతలమున దర్బలను పరిచి, వాటిపై వస్త్రమునుపరిచి పరుండెను. నా చింతను తొలగించు దేవదేవుడు ఎపుడు ఎట్లు ప్రత్యక్షమగును అని అలోచించుచు నిదురించెను. ఇంద్రద్యుమ్నుడు నిద్రించగా స్వప్నములో చక్రధారి జగద్గురువగు వాసుదేవుడు కనిపించెను. ఇంద్రద్యుమ్నుడు స్వప్నములో దేవదేవుని, జగత్పతిని, శంఖచక్రధరుని, శాంతుని, గదాపద్మాగ్ర పాణిని శార్ఞాసి బాణసంయుక్తుని, జ్వలతేజోగ్రమండలుని, యుగాంతాదిత్య వర్ణాభుని, నీలవైడూర్య సన్నిభుని, సువర్ణ పృష్టమున కూర్చొని ఉన్న వానిని అష్టభుజుని, శ్రీహరిని దర్శించెను. శ్రీహరి ఇంద్రద్యుమ్నుని చూచి ఇట్లు పలికెను. ఓ మహారాజా బాగుబాగు. ఈ దివ్యయాగముచే, భక్తిచే, శ్రద్ధచే నేను ప్రీతి చెందితిని. వ్యర్థముగా ఏమాలోచించుచుంటివి? ఓ రాజా? ఇచట పురాతనమగు ఒక ప్రతిమ కలదు. ఆ ప్రతిమను నీవు పొందు ఉపాయమును నేను చెప్పెదను. ఈ రాత్రి గడిచిన తరువాత నిర్మలమైన ప్రభాత కాలమున సాగరతీరమున నానాద్రుమ విభూషితమగు లవణార్ణవ సమభిప్లుతమగు తీరలంబియగు మహావృక్షము స్థలజలాలంబిగా ఉన్నది. తీర భవతరంగములచే కొట్టబడుచున్ననూ ఈ వృక్షము కంపించుట లేదు. చేతిలో ఒక గొడ్డలిని ధరించి జలములోనికి వెళ్ళుము. నీవు ఒంటరిగా అచట విహరించుచుండగా కనపడిన వృక్షమును నిస్సందేహముగా గొడ్డలిచే ఛేదించుము. అలా ఛేదించుచుండగా ఉన్నతమైన శాఖను చూతువు. ఆ శాఖచే నిస్సంశయముగా ఒక ప్రతిమను నిర్మించుము. మోహింపచేయు చింతను విడువుము. ఇట్లు పలికి శ్రీహరి అంతర్థానము నొందెను. ఇంద్రద్యుమ్న మహారాజు కూడా ఆ స్వప్నమును వీక్షించి మిక్కిలి ఆశ్చర్యమును చెందెను. స్వప్నగత విషయమునే ఆలోచించుచు వైదిక మంత్రములను జపించుచు ఆ రాత్రిని గడిపెను. ప్రభాత కాలమున యధావిధిగా సాగర స్నానమాచరించి గ్రామ నగర వాసులగు బ్రాహ్మణులకు దానముల నొసంగి పూర్వాహిక కర్మలనాచరించి బయలుదేరెను. అతని వెంట రథము కాని సైన్యము కాని గజముకాని సారధి కాని లేడు. ఒంటరిగా సముద్రమున ప్రవేశించెను. అచట తేజోవంతమగు మహావృక్షమును చూచెను. ఆ వృక్షము మహాంతకము, మహాలోహము పవిత్రము ఫలరహితము, మహోత్సవము, మహాకాయము జలాంతర్భాగమున ప్రసుప్తము, సాంద్ర మాంజిష్ఠ వర్ణము, నామ జాతివివర్జితముగా నుండెను. శ్రీహరి చెప్పిన ఆ వృక్షమును చూచి సంతుష్ఠుడై దృఢము తీక్ష్ణము అగు కుఠారముచే ఖండించెను. అంతట ఇంద్రద్యుమ్నుని సమీపించి ఓ మహారాజా నీవిక్కడేమి చేయబోవుచున్నావు? ఈ మహా వృక్షము నేల ఖండించితివి? మహాదుర్గము నిర్జనము గహనమగు ఈ వనమున ఒంటరిగా ఏల వచ్చితివి? మహాసముద్రతీరమున ఈ మహావృక్షమునేల ఖండించితివి? అని అడిగిరి. ఇంద్రద్యుమ్న మహారాజు వారి మాటలను విని సంతోషించి వారితో మృదుమధురముగా ఇట్లు పలికెను.

చంద్ర సూర్యులవలె అచటకి వచ్చిన ఆ బ్రాహ్మణులను చూచి వినయముతో నమస్కరించి తలవంచుకొని నిలిచెను. ఆద్యంత రహితుడు దేవదేవుడు, అప్రమేయుడు, జగన్నాధుడగు శ్రీహరిని ఆరాధించుటకు ప్రతిమను నిర్మించవలయునని నా సంకల్పము. మహానుభావుడగు దేవ దేవునిచే స్వప్నములో ఆదేశించబడిన విషయమును మీకు తెలిపితిని. అంతట ఇంద్రద్యుమ్నుని మాటలను వినిన యజ్ఞుడు (విష్ణువు) విశ్వేశుడు సంతోషించి ఇట్లు పలికెను. ఓ మహారాజా. నీ ఈ సంకల్పము చాలా బాగు. కదళీదల సన్నిభము మహాఘోరము, నిస్సారము. దుఃఖ బహుళము, కామక్రోధ సమాకులము, ఇంద్రియావర్తకలితము, దుస్తరము లోమహర్షణము, నానావ్యాధి శతావర్తము, చలబుద్భుద సన్నిభము అగు సంసార సాగరమున నున్న నీకు విష్ణువును ఆరాధించవలయునను సంకల్పము కలుగుట చాలా ఉత్తమము. ఇన్ని సద్గుణములుకల నీవు ధన్యుడవు. ఈ ప్రజలు ఈ భూమి శైలవన పత్తనములు, పురగ్రామ నగరములు, చాతుర్వర్ణ్యములు నీవు రాజుగా ఉన్నందున దివ్యములు. ఓ మహారాజా సుఖశీతలమగు ఈ వృక్షమున కూర్చుండుము. మాతో కలిసి ఉండుము. ధర్మకథలను వినుము. ఇతను శిల్పశ్రేష్ఠుడు నీ సహాయము కొరకు వచ్చెను. ఇతను విశ్వకర్మంతటివాడు. సర్వకర్మ నిపుణుడు. నా సంకల్పానుసారముగా ఇతను ప్రతిమనుచేయును. నీవు ఈ తీరమును వదులుము. ఆ బ్రాహ్మణుని మాటలను వినిన ఇంద్రద్యుమ్నుడు సాగరతీరమును విడిచి బ్రాహ్మణుని సమీపించి శీతల వృక్షచ్ఛాయ ఆశ్రయించి కూర్చునెను. అంతట శ్రీమహావిష్ణువు విశ్వకర్మను శిల్ప ముఖ్యాకారమును చేయుమని చెప్పెను. కృష్ణ రూపమును వరము, శాంతము, పద్మ పత్రాయతేక్షణము, శ్రీవత్స కౌస్తుభధరము, శంఖచక్రగదాధరము గౌరము, గోక్షీర వర్ణాభముగా ద్వితీయమును స్వస్తికాంకితము లాంగలాస్త్రధరము, మహాబలమగు అనంతాఖ్యమును, దేవదానవ గంధర్వ యక్ష విద్యాధరోరగములచే అతని అంతము తెలియబడనందున అనంతనామము కలిగినది. ఇట్లు రెండవ ప్రతిమను, ఇక వాసుదేవ భగిని రుక్మవర్ణ సుశోభనగా సుభద్రను సర్వలక్షణ లక్షితగా నిర్మించుము అని చెప్పెను. ఇట్లు విష్ణు వాక్యమును విని సుకర్మకారియగు విశ్వకర్మ ఆక్షణముననే శుభ లక్షణములుగల ప్రతిమలను సిద్ధము చేసెను. మండలములచే శోభించు కర్ణములు కలిగి, చక్రలాంగ విన్యాసములచే తేజోవంతములుగా చేసెను. మొదట శుక్ల వర్ణములలో శారదేందు సమప్రభము, సురక్తాక్షము, మహాకాయము, ఘటావికట మస్తకము, నీలాంబరధరము, ఉగ్రము, బలరాముని అద్భుత కుండలములు కలది, మహాహలధరము, దివ్య మహాముసలధారిగా నిర్మించెను. ఇక రెండవది పుండరీకాక్షము, నీలజీమూత సన్నిభము, అతసీపుష్ప సంకాసము, పద్మపత్రాయ తేక్షణము, శ్రీవత్స వక్షసము, భ్రాజత్పీతవాసము, అచ్యుత రూపమును చక్రశంఖకరము దివ్యము, సర్వపాపహరము అగు హరిరూపమును, ఇక మూడవది స్వర్ణ వర్ణ సన్నిభము, పద్మపత్రాయ తేక్షణము, విచిత్ర వస్త్ర సంఛన్నము, హారకేయూర భూషితము, పద్మపత్రాయతేక్షణము, విచిత్ర వస్త్రసంఛన్నము, విచిత్రా భరణోపేతము, రత్నమాలావలంబితము, పీనోన్నతకుచము, రమ్యముగా సుభద్రా రూపమును నిర్మించెను. ఇంద్రద్యుమ్న మహారాజు ఒక క్షణకాలమున నిర్మించుటను అత్యాశ్చర్యమును చూచెను. దివ్య వస్త్రయుగధారులుగా నానారత్నాలం కృతులు, సర్వలక్షణ సంపన్నులు అతి మనోహరములగు ప్రతిమలను చూచి అత్యాశ్చర్యముగా చూచి ఇట్లు పలికెను. మహాను భావులారా? మీరు దేవతలే బ్రాహ్మణ రూపమును ధరించి వచ్చితిరా? మీరిద్దరూ అద్భుత కర్మములను చేయువారు, దేవవృత్తులు, మానుషాతీతులు. మీరు దేవతలా? మానువులా? యక్షులా? విద్యాధరులా? లేదా బ్రహ్మహృషీ కేశులా? వసురుద్రులా లేక అశ్వినీ దేవతలా? మీ నిజ స్వరూపమును తెలియ జాలకున్నాను. మీరు మాయా రూపముతోనుంటిరి. మిమ్ములనే శరణు వేడుచున్నాను. దయచేసి మీ నిజ స్వరూపమును తెలుపుడు.

ద్విజుడు పలికెను: నేను దేవుడను, యక్షుడను, దైత్యుడను, ఇంద్రుడను, బ్రహ్మము, రుద్రుడను కాను. నన్ను పురుషోత్తమునిగా తెలియును. సర్వ లోకార్తిహరుడను, అనంత బలపౌరుష వంతుడను, అంతర హితుడను, సర్వభూతపూజ్యుడను. సర్వ శాస్త్రములందు వేదాంతములందు చెప్పబడువాడను. యోగులు ధ్యానగమ్యుడను వాసుదేవుడనని చెప్పెదరు. నేనే బ్రహ్మను శివుడను, విష్ణువును, ఇంద్రుడను యముడను పృధివ్యాది భూతములు నేనే. అగ్నిహోత్రుడను వరుణుడను, పర్వతములు నేను. సమస్త వాఙ్మయమును, స్థావర జంగమాత్మక లోకమును నేనే. నేనే విశ్వరూపుడను. నాకంటె భిన్నము లేదు. నేను నిన్ను మెచ్చితిని. వరము నడుగుము. నీ మనసులోనిది. ఇష్టమైన దిత్తును. పాపులకు కలలోకూడా నా దర్శనముకాదు. నీవు దృఢ భక్తికలవాడవు కావున ప్రత్యక్షముగా చూడగలిగితివి. అని తెలుపగా ఇట్లు వాసుదేవుని మాటలను వినిన రాజు పులకింతలు కలవాడై ఇట్లు స్తుతించెను.

రాజు పలికెను: శ్రీపతీ! నీకు నమస్కారము. పీతాంబరధరా? శ్రీప్రదా? శ్రీశా! శ్రీనివాసా! శ్రీనికేతనా! నీకు నమస్కారము. ఆది పురుషుని, ఈశానుని, సర్వేశుని, సర్వతోముఖుని, నిష్కలుని, పరమదేవుని, సనాతనుని నమస్కరించుచున్నాను. శబ్దాతీతుని, గుణాతీతుని భావాభావ వివర్జితుని, నిర్లేపుని, నిర్గుణుని, సూక్ష్ముని, సర్వజ్ఞుని, సర్వ భావనుని, శంఖ చక్రధరదేవుని, గదాముసలధారిని, వరదుని, నీలోత్పలదళకాంతిగల వాడికి నమస్కరించుచున్నాను. నాగ పర్యంకశయనుని, క్షీరసాగరవాసుని, హృషీకేశ్వరుని, విష్ణువును, మోక్ష కారణుని, అవ్యయుని నమస్కరించుచున్నాను. ఇట్లు శ్రీహరిని స్తుతించి, నమస్కరించి అంజలి బద్ధుడై వినయముతో వంగి భూమి మీద పడి ఇట్లు పలికెను. నా యెడ ప్రీతి చెందినచో ఉత్తమ వరమును కోరుచున్నాను. దేవతలు, సురులు, గంధర్వులు, యక్షరాక్షస ఉరగులు సిద్ధులు, విద్యాధరులు, సాధ్యులు, కిన్నరులు, గుహ్యకులు, మహానుభావులగుఋషులు, నానాశాస్త్ర విశారదులు, సన్యాసులు, యోగ యుక్తులు, వేదతత్వాను చింతకులు, మోక్షమార్గవిదులు ధ్యానించు పరమ పదమును, నిర్మల నిర్గుణ శాంతముగా మనుషులచే చూడబడు ఆ పరమ పదమును నీయనుగ్రహముతో పొందగోరుచున్నాను.

శ్రీహరి పలికెను: నీవు కోరినదంతయూ జరుగును. నీ ఇష్టమును పొందుము. నా అనుగ్రహము వలన నీవు కోరికలను పొందగలవు. పదివేల తొమ్మిది వందల సంవత్సరములు అవిచ్ఛిన్న మహారాజ్యమును నీవు పరిపాలించుము. దేవ దానవులకు దుర్లభమగు, దివ్యము, పరమము, పూర్ణము, మనోరథము, శాంతము, గుహ్యము, అవ్యక్తము, అవ్యయము, పరాత్పర తరము, సూక్ష్మము, నిర్లేపము, నిర్గుణము, ధ్రువము, చింతాశోక వినిర్ముక్తము, క్రియాకారణ వర్ణితము అగు విజ్ఞేయాఖ్యమగు పరమపదమును నీకు చూపెదను. పరమానందమును పొంది పరమగతిని పొందగలవు. ఈ భూమండలమున నీకు గొప్పకీర్తి కలుగును. ఈ భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రములు, సప్తసముద్రములు, మేర్వాది పర్వతములు స్వర్గమున దేవతలు ఉండునంతవరకు యజ్ఞసంభవమగు ఇంద్రద్యుమ్నసరస్సు అను పేరుతో ఈ తీర్థము ప్రసిద్ధిచెందును. ఈ తీర్థమున స్నానము చేసిన నరుడు ఇంద్రలోకమును పొందగలడు. పదునలుగురు ఇంద్రుల కాలము ఇంద్ర లోకమున అప్సరసలు, గంధర్వులు నృత్యగీతములచే పూజింపబడుచు విమానాలలో సంచరించగలడు. తీర్థమున పితరులకు పిండప్రదానమును గావించిన వారు ఇరువది యొకటి తీరములను ఉద్ధరించి ఇంద్రలోకమును పొందును. ఈ సరస్సునకు దక్షిణ భాగమున నైరుతి దిశలో ఒక వట వృక్షము కలదు. ఈ వృక్షము సమీపమున ఒక మండపము కలదు. ఈ మండపము కేతకీవన సంఛన్నము, నానా వృక్ష సమాకులము, ఆషాఢశుక్ల పంచమీ మఘా నక్షత్రమున ఇచటికి వెళ్ళి ఏడు దినములు గడిపి సుభోగులగు వేశ్యలచే ఈ మండపమున బహుక్రీడా విశేషములచే మనోహర నృత్యగీతములచే చామరలచే స్వర్ణదండములచే, వ్యజనములచే రత్న భూషణములచే మాకు వీచుచు పరమాంగనలు నిలుచుందురు. బ్రహ్మచారి, యతి, స్నాతకులగు బ్రాహ్మణోత్తములు, వానప్రస్థులు, గృహస్థులు, ఇతర సిద్ధులు, బ్రాహ్మణులు నానావర్ణ పదములు గల స్తోత్రములచే ఋగ్యజుస్సామ నాదములతో రామకృష్ణుల స్తోత్రములను చేతురు. తరువాత స్తుతించి దర్శించి మరల నమస్కరించినచో పదివేల సంవత్సరములు శ్రీహరిలోకమున నివసించును. అప్సరసలు గంధర్వులు గీత నాదములతో పూజించబడుచు హరికి అనుచరుడై శ్రీహరితో విహరించును. రత్నహారములుగల విమానములలో సంచరించును. అతని భవన మున సర్వకామనలు నిలుచును. తపస్సు క్షీణించిన తరువాత ఈ భూమండలమున మనుష్యునిగా బ్రాహ్మణునిగా పుట్టును. కోటీశ్వరుడు ధనాధ్యక్షుడు, సర్వసంపదలు కలవాడు చతుర్వేదజ్ఞుడగును. ఇట్లు ఇంద్రద్యుమ్నునకు వరమునిచ్చి నియమము నేర్పరిచి విశ్వకర్మతో అంతర్థానము నందెను. అంతట ఇంద్రద్యుమ్న మహారాజు సంతోషముతో పులకించి శ్రీహరి దర్శనమువలన తనను కృతకృత్యునిగా తలచెను. అంతట కృష్ణుని బలరాముని వరప్రదయగు సుభద్రను మణికాంచన చిత్రితములగు విమానముల వంటి రథములలో నుంచి జయమంగళ నాదములతో సామాత్యుడు పురోహితుడై నానా వాదిత్ర నిర్ఘోషములచే, నానావేద నాదములతో తీసుకొని వచ్చిన పవిత్రము, మనోహరము శుభకరమగు ప్రదేశమున స్థాపించి, శుభలక్షణ కాలమున సునక్షత్రయుత తిథియందు సుముహూర్తమున ప్రతిష్టించెను. బ్రాహ్మణులచే యధావిధిగా ఆచార్యానుమతితో అంతయూ నిర్వహించి ఆచార్యునకు దక్షిణలనిచ్చి ఋత్విజులకు ఇతర ద్విజులకు దక్షిణల నిచ్చి భవనోత్తమమున ప్రతిష్ఠించెను. తరువాత యధావిధిగా సుగంధి పుష్పములచే సువర్ణ మణి మన్త్రాదులచే శోభనములగు నానావస్త్రములచే పూజించి ద్విజులకు పురములను నగరములను దానము చేసెను. ఇట్లు చాలా యజ్ఞములలో బహుదానముల నిచ్చి కృత్యుడై సర్వస్వమును విడిచి శ్రీహరి పరమపదమును చేరెను. (II/54)