భవిష్య పురాణాను క్రమణీ నిరూపణము

శ్రీ బ్రహ్మ పలికెను: ఇపుడు నీకు అందరికి అన్ని అభీష్టములను ప్రదానముచేయు, సర్వసిద్ధి ప్రదమగు భవిష్య పురాణమును చెప్పెదను. ఈ పురాణమును సర్వదేవతలను మొదట సృష్టించిన నా జన్మలోక సృష్టి కొరకు స్వాయంభువ మనుజన్మ చెప్పబడినది. స్వాయంభువ మనువు నమస్కరించి నన్ను సర్వార్థ సాధకమగు ధర్మమును అడిగెను. అపుడు నేను ప్రీతి చెంది అతనికి ధర్మ సంహితను చెప్పితిని. మహామతియగు వ్యాస మహర్షి పురాణ విభాగమును చేసినపుడు అయిదు విధములుగా చేసెను. నానాశ్చర్య కథాయుతమగు అఘోర కల్పవృత్తాంతముకలది మొదటి పర్వము. ఇచటనే ప్రారంభ పురాణమగు బ్రహ్మ పురాణము కలదు. సూత శౌనక సంవాదమున పురాణ ప్రశ్న సంక్రమము, సర్వాఖ్యాన సమన్వితమగు ఆదిత్య చరితము సృష్ట్యాది లక్షణోపేతము, శాస్త్ర సర్వస్వ నిరూపకము, పుస్తకలేఖక లేఖన లక్షణములు, సర్వ సంస్కార లక్షణములు, పక్షతిథ్యాది సప్త కల్ప స్వరూపము, అష్టమ కల్పము నుండి మిగిలిన కల్పము అన్నియూ విష్ణు పర్వంలో చెప్పబడినవి. శైవ పర్వమున కాయమాత్ర భిన్నములు, సౌర పర్వమున అంత్య కథాన్వయము, నానాఖ్యాన సహితమగు ప్రతిసర్గవిధానము, పురాణోపసంహార సహితముగా అయిదవ పర్వమున చెప్పబడినది. ఈ అయిదు పర్వములలో మొదటి పర్వములో అధికముగా బ్రహ్మ మహిమ చెప్పబడినది. రెండు మూడు నాలుగు వర్గములలో ధర్మ కామ మోక్ష విషయమున విష్ణు శివుల మహిమ అధికముగా చెప్పబడినది. చివరి వర్గంలో సర్వ కథాన్వితమగు ప్రతిసర్గ విధానము చెప్పబడినది. గుణ తారతమ్యముచే బ్రహ్మసమమని శ్రుతి. ఈ పురాణమును వ్రాసి గుడధేను యుతముగా హోమ వస్త్ర విభూషణములతో వాచకముగా పుస్తకముగా కాని గంధాదులతో భక్ష భోజ్యాదులతో పూజించి నీరాజనాదికమును ఇచ్చి, జితేంద్రియుడై ఉపవసించి, సావధానుడై, బ్రాహ్మణునకు ఈయవలెను, ఒకపూట భుజించి చదువవలెను. లేదా వినవలెను. అతడు పాప విముక్తుడై బ్రహ్మ లోకమును పొందును. ఈ భవిష్య పురాణాను క్రమణిని చదివినవారు వినినవారు భుక్తి ముక్తులను పొందురు. (4/100)