మంత్రదీక్ష

సనత్కుమార మహర్షి పలికెను: గురువు శిష్యుని పరీక్షించి మంత్రశోధనమును చేయవలయును. తూర్పు పడమర దక్షిణము ఉత్తరము నాలుగు దిక్కులలో అయిదు సూత్రములను ఉంచవలెను. నాలుగు మూలలలో నాలుగు ఉంచవలెను. మొదటి దిక్కులోని మొదటి సూత్రములో మొదటి దానిని, రెండవ మొదటి దానిలో రెండవ దానిని, మూడవ మొదటి దానిలో మూడవ దానిని నాలుగవ మొదటి దానిలో నాలుగవ దానిని ఉంచవలెను. ప్రతి సూత్రములోని ఆగ్నేయ కోష్ఠమున ఆయా అయిదవ అక్షరమును ఉంచవలెను. ఇట్లు లిఖించి క్రమముగా ధీమంతుడై శోధించవలెను. నామాద్యక్షరము మొదలుకొని మంత్రాద్యక్షరము వరకు వ్రాయవలెను. చతుష్కములో నామాక్షర ముండు ప్రదేశము సిద్ధి చతుష్కకము అగును. ప్రదక్షిణ క్రమమున రెండవది సాధ్య చతుష్కకము అగును, మూడవది సిద్ధము, నాలుగవది అరియగును. రెండింటి ఒకే కోష్ఠమున రెండు వర్ణములున్నచో సిద్ధ సిద్ధము అనబడును. ఆ రెండవ మంత్రాక్షరమున సిద్ధ సాధ్యము, మూడవ దానిలో సుసిద్ధము, నాలుగవ దానిలో సిద్ధారి అగును. నామాక్షరములతో ఉండు మరియొక చతుష్కములు ఉండు రెండవ మంత్రవర్ణములో చతుష్కమున అయినచో మొదట నామాక్షరము ఉన్నచోట ఆయా కోష్ఠమును ఆరంభించి మొదటి వలెనే క్రమముగా లెక్కించవలయును. సాధ్యసిద్ధము, సాధ్యసాధ్యము, సాధ్యనుసిద్దము, సాధ్యరిపువు అని లెక్కించవలయును. మూడవ నామాక్షరములోని చతుష్మమున మంత్ర వర్ణమున్నచో మొదటి వలెనే క్రమమును అనుసరించి లెక్కించవలయును. సుసిద్ధ సిద్ధము, సుసిద్ధ సాధ్యము, తత్సుసిద్ధము, తదృష్టి అని తెలియవలయును. నాలుగవ నామాక్షరములోని చతుష్కమునన మంత్రాక్షరము ఉన్నచో ఇట్లే లెక్కించవలెను. అరి సిద్దము, అరిసాధ్యము, తత్సుసిద్ధము, తద్రిపువు అని తెలియవలయును. మొదట చెప్పిన విధముగా ద్విగుణము కంటే సిద్ధ సిద్ధము సిద్ధసాధకము అగును. సిద్ధము, సుసిద్ధము, అర్ధముగా సిద్ధారి ఉన్నచో వంశీయులను చంపును. ద్విగుణముకంటే సాధ్యము సుసిద్ధమగుచో, సాధ్యారి బాంధవులను చంపును. సుసిద్ధ, సిద్ధము, అర్ధముగా ద్విగుణము కంటే తత్సాధ్యము, తత్సుసిద్ధ ప్రాప్తి మాత్రమున సుసీద్దారి కుటుంబమును హరించును. తత్సుసిద్ధము కళత్రమును చంపును. అరి సాధకుని హరించునని శాస్త్రము, ఈ విషయము ఇతర విధానములు కూడా చాలాకలవు. అన్నిటిలో ముఖ్యమగు కథహమను పద్ధతిని నీకు వివరించితిని. ఇట్లు గురువు తగిన దేశమున, తగిన కాలమున మంత్రమును శుద్ధపరిచి, శిష్యుని దీక్షాయుతుని చేయవలయును. ఆ విధానమును చెప్పెదను వినుము.

శిష్యుడు నిత్యకృత్యములను పూర్తి చేసుకొని గురుపాదములకు నమస్కరించి ఆదరముతో గురువును మంత్రమును ప్రసాదించమని ప్రార్థించవలెను. గురువును వస్త్రాలంకారాలతో సువర్ణాదులతో పూజించవలెను. గురుస్వస్తి వాచనమును చేసి మండలాదుల నేర్పించి, సంతోషముచే శిష్యునితో కలిసి గురువు పరిశుద్ధుడై యాగశాలను ప్రవేశించవలెను. ద్వారమును అస్త్రముతో సామాన్యార్ఘ్యోదకముతో సంప్రోక్షించి దివ్యములైన విఘ్నములను పారదోలి, నభస్ధ విఘ్నములను జలముతో పాలదోలి, పార్ష్ణిఘాతములతో భూసంబంధ విఘ్నములను పారదోలి, తరువాత కర్మను ఆరంభించవలెను. శాస్త్ర విధానముతో ఆయా వర్ణములతో సర్వభద్ర మండలమును కల్పించి ఆ మండలమున వహ్ని మండలమును వహ్నికళలను పూజించి, శక్తిననుసరించి నిర్మించిన కుంభమును జలముచే నింపి అస్త్రముచే ప్రక్షాళనమున చేసి, ఆ కుంభమున చంద్రకళలను విధానముచే పూజించవలెను. ధూమ్రార్చి, ఊష్మ, జ్వలిని, జ్వాలినీ, విస్ఫులింగినీ, సుశ్రీ, సురూపా, కపిలా, హవ్యవహా, కవ్యవహా అని పది వహ్నికళలు చెప్పబడినవి. ఇక సూర్య కళలను చెప్పెదను వినుము. తపినీ, తాపిని, ధూమ్రా, మరీచి జ్వాలినీ, రుచి, సుషుమ్ణా, భోగదా, విశ్వా, బోధినీ, ధారిణీ, క్షమా, అనునవి సూర్య కళలు. ఇట్లే అమృతా, మానదా, పూషా, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశినీ, చంద్రికా, కాంతి, జ్యోత్స్నా, శ్రీ, ప్రీతి, అంగదా, పూర్ణా, పూర్ణామృతా, అనునవి చంద్రకళలు. కుంభమును వస్త్ర యుగ్మముతో చుట్టి కుంభమున అన్ని ఓషధులను వేయవలెను. నవరత్నముల నుంచి, పంచ పల్లవములను ఉంచవలెను. పనస, ఆమ్ర, వట, అశ్వత్థ వకుళ పల్లవములు పంచ పల్లవములు, ముత్యము, మాణిక్యము, వైడూర్యము, గోమేధము, వజ్రము, పగడము, పద్మరాగము, మరకతము, నీలము అను నవరత్నములను ఉంచి, కుంభమున ఇష్టదేవతను ఆవాహించి విధానముతో పూజించి, చక్కగా అలంకరించుకొనిన శిష్యుని వేదికపై కూర్చుండ బెట్టి ప్రోక్షణీ జలముచే ప్రోక్షించి, శిష్యుని శరీరమున భూత శుద్ధ్యాదికమును ఆచరించి న్యాలజాలముచే శోధించి, శిరస్సున పల్లవములను ఉంచి నూట ఎనిమిది మార్లు మాలమంత్రముచే మంత్రించిన జలముచే హృదయమున జపించుచు, ప్రియశిష్యుని అభిషేకము చేయవలెను. అంతట శిష్యుడు శిష్టోదకముచే ఆచమనమును చేసి, వస్త్రధారణ చేసి, విధిననుసరించి గురువునకు నమస్కరించి, పరిశుద్ధుడై గురువుముందు కూర్చొన వలయును. అంతట గురువు శిష్యుని శిరమున హస్తమునుంచి ఉపదేశించ వలసిన మంత్రమును అష్టోత్తర శతమును జపించవలెను. తరువాత శిష్యునికి “సమ్వోస్తు” అను అక్షరమునీయవలెను.

అపుడు శిష్యుడు గురువును అర్చించవలయును. అంతట గురువు చందన సహిత హస్తమును శిష్యుని శిరసున ఉంచి, శిష్యుని చెవిలో మంత్రమును ఎనిమిది మారులు చెప్పవలయును. అట్లు మంత్రమును పొందిన శిష్యుడు గురువుల పాదములపై బడవలయును. అంతట గురువు వత్సా! లెమ్ము! ముక్తుడవైతివి. సదాచారపరుడవు కమ్ము. కీర్తి శ్రీకాంతిపుత్ర ఆయుష్యబలారోగ్యములు నీకెప్పుడు ఉండనిమ్ము అని పలుకవలయును. అపుడు శిష్యుడు లేచి గంధాదులచే గురువుని అర్చించవలెను. దక్షిణను సమర్పించవలయును. ధన విషయమున లోభిత్వమును ప్రదర్శించరాదు. ఇట్లు గురువునుండి మంత్రమును పొంది, అప్పటి నుండి ధనదేహపుత్ర కళత్రాదులచే గురుసేవా పరుడు కావలెను. తరువాత పుష్పాంజలిని సమర్పించి మధ్యన తన ఇష్టదేవతను పూజించవలెను. అగ్నిని నైఋతిని, బ్రహ్మను క్రమముగా పూజించవలెను. మధ్యన విష్ణువును పూజించవలెను. మధ్యన విష్ణువును పూజించినచో బాహ్యాది స్థానములలో వినాయకుని, సూర్యుని పార్వతీ పరమేశ్వరులను పూజించవలెను. మధ్యన శంకరుని పూజించినచో బాహ్యాది స్థానములలో సూర్యుని, గణేశుని, పార్వతిని, విష్ణువును పూజించవలెను. మధ్యన పార్వతిని పూజించినచో బాహ్యాది స్థానములలో శంకరుని, విఘ్నేశుని, సూర్యుని, విష్ణువును పూజించవలెను. మధ్యలో వినాయకుని పూజించినచో బాహ్య స్ధానములలో పార్వతీ పరమేశ్వరులను, సూర్యుని విష్ణువును పూజించవలెను. సూర్యుని మధ్యన పూజించినచో బాహ్య ప్రదేశములలో గణేశుని, విష్ణువును, పార్వతిని, శివుని యథాక్రమముగా పూజించవలెను. ఇట్లు ప్రతినిత్యము దైవపంచకమును పూజించవలెను. బ్రాహ్మీ ముహూర్తమున లేచి నిత్యకృత్యములను ముగించుకొని, సందేహములు లేనివాడై, శయ్యమీదనైనను తన శిరస్సులో సహస్ర దళములు కలిగిన తెల్లని పద్మము యొక్క వర్ణకలో నున్న ఇందుమండలమున, కధాదికాని త్రికోణమున నున్న వరాభయంకరుడగు గురువునకు నమస్కరించవలెను. రెండు నేత్రములు, రెండు భుజములు కలవానిని శుక్రగంధమాల్యాను లేపుని, వామభాగమున శక్తిచే కూడియున్న వానిని మానసోపచారములచే ధ్యానించి, పూజించి పాదుకా మంత్రమును పదిమార్లు జపించవలెను.

“వాం మాయా శ్రీ భగేంద్వాఢ్యా వియద్ధంసఖకాగ్నయః

హసక్షమలవార్యగ్ని వామకర్ణేన్దుయుగ్మరుత్

తతో భృగ్వాకాశ ఖాగ్నీభగేంద్వాఢ్యాః పరంతిమః

సహక్షమలతో యాగ్ని చంద్రశాంతియుతో మరుత్

తతశ్రీశ్చాముకాంతే తు నన్దతాధాముకీ పునః

దేవ్యంబాంతే శ్రీపాదుకాం పూజయామి హృదంతిమే”

ఇది శ్రీపాదుకా మంత్రము. ఈ మంత్రము సర్వసిద్ధి ప్రదము. ఇట్లు మంత్రముచే గురువునకు నమస్కరించి ఈ మంత్రములచే గురువును ధ్యానించవలయును. చరాచర జగత్తును వ్యాపించి అఖండ మండలాకారముగా నున్న పరమాత్మ పదమును చూపిన శ్రీ గురువునకు నమస్కారము. జ్ఞానాంజన శలాకచే అజ్ఞాన తిమిరాంధత్వమును తొలగించి కనులు తెరిపించిన గురువునకు నమస్కారము, ఇష్టదేవ స్వరూపుడగు గురువునకు నమస్కారము. సంసారమను విషయమును హరించగల వాగామృతమును అందించిన గురువునకు నమస్కారము. ఇట్లు నమస్కరించి స్తోత్రమును చదవవలెను. తరువాత ఓ భగవన్ నాథా! గురురూపుడగు శివునకు నమస్కారము. విద్యావతార సంసిద్ధి కొరకు అనేకాకారములను ధరించినవాడా నవాయతనరూపా పరమార్ధైకరూపా సర్వజ్ఞాన తమమును భేదించు సూర్యుడా? చిద్ఘన స్వరూపా స్వతంత్రా! దయాక్లుప్తవిగ్రహా! శివస్వరూపా! భక్తపరతంత్రా! భవ్యులకు భావరూపీ! వివేకులకు వివేకరూపా విమర్శకులకు విమర్శరూపా ప్రకాశములకు ప్రకాశమా జ్ఞానులకు జ్ఞానరూపమా నీకు ముందు ప్రక్కన, పృష్టభాగమున పైభాగమున, క్రింది భాగమున నమస్కారము. ఎపుడూ సచ్చిత్స్య రూపముతో ఆసనమును విధించుము. ఓ దేవీ నీ అనుగ్రహముచే నేను అంతటా కృతకృత్యుడనైతిని అని స్తోత్రముచేసి అంతటిని గురువునకు నివేదించవలెను. ప్రాతః కాలమునుండి సాయంకాలము వరకు, సాయంకాలమునుండి ప్రాతః కాలము వరకు నేను చేయునదంతయూ నీ పూజయగుగాక! తరువాత గురుపాదాబ్జముల నుండి స్రవించు అమృతధారచే తనను ప్రక్షాళన చేయబడి నిర్మలుడైనట్లుగా భావించవలయును. మూలము నుండి బ్రహ్మరంధ్రము వరకు మూలవిద్యను భావించవలయును. మూలాధార చక్రము నుండి అధోభాగమున వర్తులాకారముగా వాయుమండలము ఉండును. అచటనున్న వాయుబీజము నుండి ఉద్భవించిన వాయువుచే దాని పైభాగమున త్రికోణాకారముగా వహ్నిమండలము ఉండును. ఆ వహ్నిమండలమున నున్న వహ్నిబీజమునుండి పుట్టిన అగ్నిచే మూలాధారమున విగ్రహ స్వరూపముచే పడుకొనియున్న పామువంటి ఆకారము కలిగి స్వయముగా భూలింగవేష్టిని యగు, బిసతంతువు వంటి వర్ణము కలిగి కోటి విద్యుత్తుల కాంతిగల, సూక్ష్మముగానున్న కులకుండలినిని ధ్యానము చేసి కూర్చచే ఉత్ధాపనము చేయవలయును. సుషుమ్నామార్గమున షట్చక్ర క్రమమును భేదించు మండలిని గురూపదిష్ట విధానముచే బ్రహ్మరంధ్రమునకు గొనిపోవలెను. బ్రహ్మరంధ్రమున ఉన్న అమృతముచే మునిగిపోయిన వానినిగా తనను భావించుకొనవలెను. బ్రహ్మరంధ్రములోని ప్రకాశ జాలముచే వ్యాపించబడిన పరిశుద్ధుడగు చిత్స్వరూపుడగు పరుని దర్శించవలెను. మరల కుండలిని స్వస్థానమున చేర్చి హృదయమున ఆదిదేవుని చింతించుచు, దర్శించి మానస ద్రవ్యములచే ఈ మంత్రముతో ప్రార్ధించవలెను. “త్రైలోక్య చైతన్య మయాదిదేవ శ్రీనాథ విష్ణో భవదాజ్ఞయైన, ప్రాతస్సముత్ధాయ తన ప్రియార్ధం సంసార యాత్రాం త్వనువర్తయ్యిష్యే” అని అనగా మూడు లోకములను చైతన్యమును కలిగించు ఓ ఆదిదేవా శ్రీనాథ! విష్ణూ! నీ ఆజ్ఞచేతనే ప్రాతఃకాలమున లేచి, నీ ప్రీతి కొఱకు సంసారయాత్రను అనువర్తించుచున్నాను. “అని అర్ధము ఈ మంత్రమున ‘విష్ణో’ అని ఉన్నచోట తన ఇష్ట దైవమును ఎవరినైనా చెప్పుకొన వచ్చును. తరువాత సర్వసిద్ధి కొఱకు అజపానివేదనమును చేయవలెను.

రాత్రి పగలు ఆరువందలు, ఇరువది యొక వేలు అజపాయను పేరుగల గాయత్రిని జీవుడు సర్వదా జపించును. ఈ మంత్రమునకు ఋషి హంస, అవ్యక్తము, గాయత్రీ ఛందస్సుగా చెప్పబడినది. పరమహంస దేవత అద్యంతమున బీజశక్తి కలది. తరువాత ఆరు అంగములుగా చేయవలెను. సూర్యుడు, చంద్రుడు, నిరంజనుడు, నిరాభాసుడు, ధర్ముడు, జ్ఞానము అని ఆరుగా చెప్పవలెను. వీరందరిని హంస పూర్వులుగా, ఆత్మనే పద పశ్చిమములుగా జాతీయుక్తులను సాధకేంత్ర షడంగములందు నియోగించవలెను. వీటిలో ‘హ’ కారము సూర్యునితో సమానమగు తేజస్సుకలది బయట సంగమించును. సకారముకూడా అటువంటిదే కావున ప్రవేశసమయమున ధ్యానము చెప్పబడినది. ఇట్లు ధ్యానించి అగ్ని సూర్యులలో విభాగముగా అర్పింపవలెను. వకారము నుండి సకారము వరకు బీజములచే యుక్తమగు చతుర్ధళములుగల దానియందు, బంధూక (మంకెన) పుష్పకాంతిగల దానియందు, స్వశక్తిసహితమగు దానికి, పాశాంకుశ ధూపాది క్రమోదకములచే ప్రకాశించు హస్తకములుగల గణేశునకు, వాగధీశునకు ఆరునూర్లు అర్పించవలెను. పగడపుకాంతిగల స్వాధిష్ఠానమున వాదిలాంత వర్ణయుక్తమున వామాంగశక్తియుతునకు విద్యాధిపతికి, స్రువ, అక్షమాలలచే ప్రకాశించు చేతులుగల పద్మజమ్మడగు హంసారూఢుడగు బ్రహ్మకు ఆరువేలు అర్పించవలయును. విద్యుత్తో కూడిన మేఘకాంతి గల, ‘డాది’ ‘ఫాం’తవర్ణములు గల పత్రముగల, మణిపూరముగల, శంఖచక్ర గదా పంకజధారి, శ్రీ సహితుడగు విష్ణువునకు ఆరువేలు నివేదించవలెను. కొట్టబడని అర్కపత్రమునకాది టాంతవర్ణ సంయుతమగు, శుక్ల వర్ణముగల, శులాభయ వరసుధాకలశ ధారియగు, హవాంగశక్తి యుక్తుడు, విద్యాధిపతి, వృషారూఢుడు అగు రుద్రునకు ఆరువేలు నివేదించవలయును. విశుద్ధము షోడశదలయుతము, స్వర సంయుతము, శుక్లవర్ణయుతము, మహాజ్యోతి ప్రకాశముగల ఇంద్రియాధిపతికి ప్రాణశక్తిచే కూడియున్న ఈశ్వరునికి సహస్రమును అర్పించవలయును. హక్షయుక్తమగు అజ్ఞాచక్రమున ద్విదళములుగల అబ్బమున సహస్రము అర్పించవలయును. హక్షయుక్తమగు అజ్ఞా చక్రమున ద్విదళములు గల అబ్బమున సహస్రము అర్పించవలెను. పరాశక్తి యుతుడు గురువు అగు సదాశివునకు, సహస్రారమగు మహాపద్మమున నాద బిందు ద్వయాన్వితమున మాతృకావర్ణ విలసినమున వరాభయ కరుడగు పరమాద్యుడగు గురువునకు సహస్రము నర్పించవలయును. చుళుకమున జలమునుధరించి స్వభావసిద్ధమగు ఇరువదియొకవేల ఆరునూర్లుగల జపమును విభాగము చేయక అజపాదేవికి అర్పించవలెను. సంకల్పము చేతనే మోక్షము నిచ్చు విష్ణువు నా యెడ ప్రీతుడగుగాక ఇతని సంకల్ప మాత్రముననే మహాపాపములు తొలగిపోవును. నేను బ్రహ్మనే. సంసారినికాను. నిత్యముక్తుడనే. దుఃఖినిగాను. నేను సచ్చిదానన్ద స్వరూపుడను అని తనను తాను భావించ వలయును. తరువాత దేహకృత్యములను ఆచరించి దేవార్చనను చేయవలయును. దేవార్చనా విధానమును సదాచార లక్షణమును ఇపుడు చెప్పెదను. (3/65)