శాపప్రాప్తి

యమధర్మరాజు పలికెను: దేవేశా! జగన్నాధా! చరాచర విభో! గొడ్రాలు సంతానమును పొంద జాలనట్లుగా మోహినీదేవి నిష్పలు రాలాయెను. ఓ కుశలాంఛనా రుక్మాంగదుడు ఏర్పరచిన దారిలో లోకములన్నియూ వైకుంఠమునకు వెళ్ళుచున్నవి. నా వద్దకు ఒక్కడు కూడా వచ్చుట లేదు. రుక్మాంగద మహారాజు శ్రీహరి దేహమును చేరిననూ సర్వ భూతముల బుద్ధి మాత్రము మారుటలేదు. రాజ కుమారుని వలన మానవులు అందరు విష్ణు వాసరమున ఉపవసించి పాపములను నశింపచేసుకొని పరమ పదమునకు వెళ్ళుచున్నారు. నీ పుత్రికయగు మోహిని సిగ్గుపడి మూర్ఛనందినది. నీ సమీపమునకు రాలేకపోవుచున్నది. లోకముచే నిందించబడి భుజించుటలేదు. నేను క్రియా శూన్యుడ నైతిని. ఏమి చేయవలెనో ఆజ్ఞాపించుము. అని చెప్పగా యమధర్మరాజు మాటలను వినిన బ్రహ్మ ఇట్లు పలికెను. మనము అందరము మోహినిని లేపుటకు వెళ్ళెదము. మోహినికి స్పృహ వచ్చిన తరువాత నీ పని చేయుదము. సందేహించవలదు. ఈ తత్తరపాటును విడువుము. అంతట ఇంద్రుడు మొదలగు దేవగణములన్నియూ బ్రహ్మతో కలిసి సూర్య సన్నిభములగు విమానములచే మోహినిని లేపుటకు భూమండలమునకు వచ్చిరి. వారందరూ విమానములతో శుభానన, తేజోహీన, నిరానంద, శుష్కతోయ అగు నదివలె, చంద్రుడులేని రాత్రివలె, ఋత్విజులు లేని యజ్ఞమువలె, పీతమండయగు సురవలె, జలములేని సరస్సువలె, తెల్లని పగడమువలె, ధాన్యములేని పైరువలె, పీతమండయగు సురవలె, జలములేని సరస్సువలె, వెన్న తీసిన కవ్వమువలె, సంస్కార హీనమగు వాక్కువలె, పీడించబడిన సైన్యమువలె, భర్తమరణించిన యువతివలె, ధాన్యహీమగు ప్రజవలె, మంత్రహీనమగు విధివలె, ఆలోచనలేని యుద్ధమువలె, దయలేని ధర్మమువలె, రాజులేని రాజ్యము వలె, ధనధాన్య విహీనమగు గృహమువలె, బలహీనమగు కుంభమువలె, బురదలో చిక్కుకొనిన వృషభమువలె, భార్యాహీనుడగు గృహస్థునివలె, రాజ్యభ్రష్టుడగు రాజువలె, భగ్నక్రియయగు చికిత్సవలె, భగ్నశాఖమగు వృక్షమువలె, తేజోహీనమగు గృహమువలె, నిర్జలమగు ధనమువలె, పొగలేని నిప్పువలె, కిరణములులేని సూర్యునివలె, మతి భ్రష్టుడగు మనిషివలె, పర్వసంగియగు మానవునివలె, ప్రియురాలిచే తృప్తిని పొందని ప్రియునివలె, విషమును విడిచిన పామువలె, రెక్కలు తెగిన పక్షివలె, వృత్తిహీనుడగు బ్రాహ్మణునివలె, తలనుండి జారినమాలవలె, ధాతువర్జితమగు పర్వతమువలె, లిపిచెరిగిన శాస్త్రమువలె, విస్వరమగు ఋగ్యజుస్సులవలె, స్వరహీనమగు సామము వలె, పద్మహీనమగు సరస్సువలె, తృణములచే నిండిన దారివలె, రేకులులేని పద్మమువలె, మమతతో నిండిన జ్ఞానమువలె, ప్రకృతిలేని పురుషుని వలె, తత్త్వహీనమగు సాంఖ్యమువలె, దంభాన్వితమగు ధర్మమువలె నున్న తేజోహీనురాలగు మోహినిని దేవతలు అందరూ చూచిరి. ఆనందశూన్యముగా ధ్యానించుచు జనులచే చూడబడుచు పుత్రహత్య కావించిన క్రూరురాలని క్రూర వచనములచే దూషించబడుచున్న, దుష్టశీల, ధర్మమును విడిచినది, వారి వాక్యములచే మోహిత, స్వవాక్యపాలన చేయునది, చండియగు మోహినిని గూర్చి వచ్చిన దేవతలిట్లు పలికిరి. ఓ సుందరీ! దుఃఖించకుము. నీవు నీ ప్రయత్నమును చేసితివి. మాధవ భక్తులకు అవమానము కలుగదు. హరిణాక్షివగు నీవు దేవకార్యము కొరకు వచ్చితివి. ఆ కార్యము సిద్ధించలేదు. ఇప్పుడతను వెళ్ళిపోయెను. పూర్వమే రుక్మాంగద మహారాజు విఘ్ననాశకము, మహాపుణ్య ప్రదమగు ఏకాదశి వ్రతమును ఆచరించి ఉండెను. ఒక సంవత్సరము కృచ్ఛ్రవ్రతమును ఆచరించెను. ఆ వ్రత ప్రభావము వలననే రుక్మాంగదుడు సత్యమును తప్పలేదు. లోకమున నారి విఘ్నరాజ్ఞిగా చెప్పబడును. కాని సంధ్యావలీ దేవి మనోవాక్కాయము లచే పుత్రసంహారమును సంకల్పించి, స్నేహమును విడిచి, స్వయముగా ఖడ్గమును అందించెను. అంతటి దృఢ దీక్షను చూచిన భగవంతుడగు మధుసూదనుడు సంతోషిం చెను. ప్రియుడగు పుత్రుని చంపును కాని ఏకాదశినాడు భుజించడు. పుత్రుని, భార్యయొక్క, రాజు యొక్క అభిప్రాయమును చూచి సంతోషించిన శ్రీ మహావిష్ణువు తన లోకమునకు గొనిపోయెను. క్షీణకర్ములై అంగార సహితముగా నుండు ఆహితాగ్నివలె దేహముతో పాటు వెళ్ళిరి. పని ప్రారంభించిన తరువాత ఫలము సిద్దించనిచో చేసిన ప్రయత్నములన్నియూ విఫలములైనచో నీ దోషమేమి కలదు. కావుననే వరములనిచ్చు దేవతలందరూ నీ వద్దకు వచ్చి ఉన్నారు. సిద్ధించిననూ సిద్ధించక పోయిననూ పనిచేసినవాడు వ్యర్థుడు కారాదు. ధర్మమును గోరు రాజు భృత్యవర్గమును పోషించవలయును. కర్మ సిద్ధించకపోయినను సద్భావమున్నచో వేతనమును మాత్రమీయవలెను. బహు మానములు లభించవు. భృత్యుడు బతుకుటకు వేతనము నీయని వాడు గోహత్యా పాతకమును పొందును. కావున సద్భావముచే పని చేసిన వానికి ఫలమునీయవలెను. దేవతలు నీకన్ని విధములా సహకరించి ఏ పని చేయలేదు. విఘ్ననాశిని అగు ద్వాదశీ తేజస్సుచే భగ్నులైరి. ఇట్లు దేవతలు పలుకగా పతిహీనురాలై అతి దుఃఖముతో, ఆనంద శూన్యయగు మోహిని ఇట్లు పలికెను.

కార్యమును సాధించలేని నా ఈ జీవితము వ్యర్థము, యమ మార్గమున జనసమూహములను నిలుపలేకపోతిని. హరి దినమును లోపింపచేయలేకపోతిని. హరి వాసరమున భుజింప చేయలేకపోతిని. ఆ రుక్మాంగద మహారాజు సంతోషముతో పుత్ర వధ గావించెను. నా శిరమును పాదమునుంచి రుక్మాంగద మహారాజు శ్రీహరిని చేరెను. అప్రమేయగుణుడు, నిర్మలుడు, నిర్మలా శ్రయుడు, హంస భూతుడు శుచిపదుడు, ప్రణవ రూపుడు, బీజ భూతుడు, అవ్యయుడు, నిరాకారుడు, నిరాభాసుడు, నిష్ప్రపంచుడు, నిరంజనుడు, శూన్యరూపుడు, ఆకాశ స్వరూపుడు, ధ్యేయము, ధ్యాన వర్జితుడు, ఉన్నాడు లేడు అనబడువాడు, దూరమున దగ్గరలో ఉన్నవాడు, లేనివాడు, పరంధాముడు, మనసుచే గ్రహించబడని వాడు, పురుషాభిధుడు, జగన్మయుడు, హృత్పంకజ సమాసీనుడు, తేజోరూపుడు, సనాతనుడు అగు శ్రీహరియందు నా భర్త లీనమయినపుడు నా జీవితమున ఫలమేమున్నది. కార్యమును సాధించకనే యజమానిని విడిచి వేతనమును తీసుకొను భృత్యుడు నరకమును చేరును. స్వామి కార్యమును సాధించకనే వేతనమును అనుభవించు భృత్యులు భూలోకమున అశ్వములుగా పుట్టెదరు. ఇపుడు నేను కూడా కార్యమును సాధించ జాలకపోతిని. భర్తను పుత్రుని నశింపచేసితిని. అట్టి నేను దేవతల నుండి వరమునెట్లు గ్రహించగలను.

దేవతలు పలికిరి: ఓ మోహినీ! నీ హృదయమున ఉన్న దేమిటో చెప్పుము ఇచ్చెదను. నీకు ఉప కారమునుచేసి ఋణ విముక్తులము అగుదుము. రాజప్రయోజన విషయమున నీవు పరిశ్రమించితివి. కావున నీ పరిశ్రమకు తగిన ఫలమును పొందుటకు యోగ్యురాలవు. ఇట్లు దేవతలు పలుకుచుండగా అగ్ని సమతేజోవంతుడగు రాజపురోహితుడు వచ్చెను. ఈ పురోహితుడు పన్నెండు సంవత్సరములు జలమధ్యమున ప్రాణాయామపరుడై ఉండి జలమధ్యమునుండి బయలువెడలి మోహినీ చేష్టితమును విని క్రోధముతో దేవబృందమును సమీపించెను. మోహినీ దేవికి వరమునీయ సంకల్పించిన దేవతలతో ఇట్లు పలికెను. ఈ మోహిని వ్యర్థురాలు. ఈ దేవ సంఘము వ్యర్ధము. ఈమె చేసిన పాపపు కర్మ నిత్యము. మీ భావనాశము కొరకే పురుషార్ధ ప్రరోహణము చేయ సంకల్పించిరి. మీరు మోహినికి వరమునీయ సంకల్పించితిరి. హత్య చేసినది. భర్తను పుత్రుని చంపినది. వృత్తిని విడిచినది. రాక్షసి రూపమును ధరించినది. ఈ మోహిని బాగుగా జ్వలించు అగ్నిలో పడినను శుద్ధురాలు కాజాలదు. హత్య చేసినది. వ్యర్ధముగా భర్తవధను గావించినది. ఈమె మండు అగ్నిలో పడిననూ శుద్ధినొందజాలదు. రుక్మాంగద మహారాజును, ధర్మాంగదుని అమృతోపములగు వచనములచే మోహింపచేసి, ప్రియురాలితో పాటు మోక్షమునకు పంపి రాజులేని రాజ్యమును చేసెను. ఈ అల్పబుద్ధికి నరకమునకూడా నివాసము లభించదు. ఇక స్వర్గమున ఎట్లుండును? రాజు సమీపమున ఉండజాలదు. అవ్యయమగు విష్ణుపదమునకు అర్హురాలుకాదు. లోకవాద దూషితయగు స్త్రీకి ఏలోకమున కూడా వసతి ఉండదు. ఎప్పుడూ పాపరతురాలు నింద్యకర్మచేయు స్త్రీ జీవితము వ్యర్ధము. భర్తను చంపి, పుత్రుని చంపి, తల్లివంటి సవతిని చంపి భూమిని శూన్యము చేసిన ఈమె ఏ లోకమునకు వెళ్లును. ఈ మోహిని పాపరతురాలు. శ్రీహరి ధర్మమును ధ్వంసము చేసినది. ఈమె ఎపుడూ హరివాసరమున భుజించమని పలికినది. ప్రాణములను కాపాడుకొనుటకు కూడా హరివాసరమున భుజించుము అని, గోవును బ్రాహ్మణుని వధించమని పలికినవారికి అధోగతియే ప్రాప్తించును. పానము చేయరానిదానిని త్రాగమనిననూ స్వర్గమున వాసము లభించదు. ఇది తెలియక పలికినవారిగతి. ఇక తెలిసి పలికిన వారేమగుదురో నిర్ణయించబడలేదు. తెలియక హరివాసరమున భుజించమని పలికిన వారికి శత ప్రాణాయామములతో శుద్ధి చెప్పబడినది. లేదా ఏకాదశ ఉపవాసములతో శుద్ధి లభించును. జ్యేష్ఠా నక్షత్ర యుతైకాదశ్యుప వాసమున కాని, కుండ ప్లవముచే కాని, శౌకర స్పర్శచే కాని, దేవార్చనముతో కాని శుద్ధి లభించును. కాని ఈమె పరమ నికృ ష్ఠురాలు. విష్ణుదినమున భోజనమును చేయమని నిరోధించెను. భర్తమాటను కాదని, ప్రియపుత్రుని చంపించెను. ఆ పుత్రుడు కూడా వాక్యకోవిదుడు, వాక్య నిరతుడు, మాతృహితరతుడు. విష్ణు ధర్మ లోపకారిణి. బహుపాపసమన్విత, అసలు ఈమెను స్పృశించరాదు. ఇక వరముల నెట్లిత్తురు. మీరు న్యాయ ధర్మతత్పరులు. దేవతలు పాపులను రక్షించరు. దేవతల కాధారము ధర్మము. ధర్మమునకు ఆధారము వేదము. ఆ వేదమున స్త్రీల ధర్మము పతిని సేవించుట అని చెప్పబడినది. భర్త పలికిన దానిని నందేహించక నాచరించవలయును. తెలుపు అన్న తెలుపు అని నలుపు అనిన నలుపు అని చెప్పు టయే శుశ్రూష అనబడును. సేవించుట శుశ్రూషకాదు. తన ఆజ్ఞను స్థాపించు కోరికచే భర్త ఆజ్ఞను తిరస్కరించబడినది. కావున స్త్రీలందరిలో మోహిని పరమ పాపాత్మురాలు. సత్యమును పాలించమని శపధముచే రాజును నిర్బంధించినది. ఎన్ని మాటలు చెప్పిననూ ఈమె అంగీకరించలేదు. పుత్రఘాతిని అయినది. కావున రాజు ఈమె యందు పాపమునుంచి మోక్షమును చేరెను. కావున ఈ మోహిని రెండు హత్యలను గావించి పాపశరీరు రాలైనది.

సర్వదానములు చేయువాడు, బ్రాహ్మణప్రియుడు, శ్రీహరి భక్తుడు, ప్రజారంజన శీలుడు, హరివాసరసేవకుడు, పరదారలందు ప్రీతిలేనివాడు, విషయ స్పృహలేనివాడు, పరార్ధమునకు కామనలను వదిలినవాడు, సర్వకాలము లందు యజ్ఞసేవకుడు, భూమండలమున ఎల్లప్పుడు దుష్టదమనము చేయువాడు, సప్తఘోర వ్యసన దూరుడు అగు మహారాజును నిరసించిన దురాచార పరురాలు వరయోగ్యురా లెట్లగును.

ఈమె పక్షమున ఉన్న దేవతలు కాని, దానవులుకాని, క్షణకాలమున భస్మము చేతును. మోహినిని రక్షించు టకు ప్రయత్నించు వానికికూడా మోహినీ పాపము ప్రాప్తించును. పురోహితుడిట్లు పలికి చేతిలో తీర్థజలమును స్వీకరించి మోహినిని కోపముతో చూచి ఆమె శిరస్సున అగ్నితేజముకల జలమును చల్లెను. జలమును చల్లినంతనే మోహినీ శరీరము మండసాగెను. దేవతలందరూ చూచుచుండగనే ఈ మంటలు అంటిన గడ్డిపోచవలె మోహిని ఆయెను. ఆకాశమున మరుత్తులు కోపమును ఉపసంహరించుకొనుము, ఉపసంహరించుకొనుము అని అనుచుండగనే బ్రాహ్మణవాక్య సృష్ట అగు అగ్ని మోహినిని భస్మము గావించెను. (II/35)