ద్వాదశీమాహాత్మ్య వర్ణనము

మేఘమువలె నల్లనివి శార్జధనువు అల్లిత్రాడు తాకుడుతో గట్టిబారిన లోకత్రయ మండప స్తంభములైన శ్రీహరి నాలుగు బాహువులు మిమ్ములను కాపాడుగాక. దేవదానవ శిరోరత్నములతో ప్రకాశించు శ్రీహరి పాదపద్మములు మా అభీష్టముల నెరవేర్చుగాక.

మాంధాత పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా?   ఘోరమగు శుష్కార్ధమగు పాసేందనమును ఏ అగ్ని దహించునో మీరు చెప్పుడు. ఓ బ్రహ్మపుత్రా! మూడు లోకములలో ఉన్న మూడు విధములగు జ్ఞానములలో నీకు తెలియనిది లేదు. తెలియని పాతకమును శుష్కమని తెలిసిన దానిని అర్ధ్రమని చెప్పెదరు. జరుగబోవునది, జరిగినది, జరుగుచున్నది అనుమూడు విధములగు పాపములు ఏ అగ్నితో నశించునో నాకు తెలుపుము.

వసిష్ట మహర్షి పలికెను: ఓ రాజోత్తమా! అర్ద్రపాపము, శుష్కపాపము సమస్తము ఏ అగ్నితో దహించబడునో వినుము. విష్ణు వాసరమగు ఏకాదశినాడు ఇంద్రియ నిగ్రహముకలిగి ఉపవసించి మధుసూదనుని పూజించవలెను. స్నానమును ఆచరించి ఉపవసించి, రాత్రి జాగరణ చేసినచో తస్కరుడు ధనమును హరించునట్లు సకలపాపములను హరించును. ఏకాదశి అను అగ్ని నూరు జన్మల పాపరాశిని భస్మము చేయును. పద్మనాభవాసర మంతటి పాప నాశకమగు పరమ పవిత్ర మైనది మానవులకు మరొకటి లేదు. ఏకాదశీ ఉపవాసము వరకే మానవుని దేహములో పాపములు ఉండును. వేయి అశ్వమేధయాగములు, నూరు రాజసూయయాగములు, ఏకాదశీ ఉపవాసములోని ఒక అంశతో సాటిరావు. మానవుడు ఏకాదశేంద్రియములతో చేసిన పాపములన్నియూ ఏకాదశ్యుపవాసముతో నశించును. ఏకాదశితో సాటివచ్చు పాపనాశకము మరియొకటి లేదు. మిషతో ఆచరించిననూ యమదర్శనముకాదు. ఈ ఏకాదశి సర్వమును మోక్షమును ప్రసాదిం చును.రాజ్యమును పుత్రులను ఇచ్చును. మంచి భార్యను ఇచ్చును. శరీరారోగ్యమును ప్రసాదించును. గంగానది, గయా క్షేత్రము, కాశీ, పుష్కరము, కురుక్షేత్రము, రేవానది, దేవిక, యమునా, చంద్రభాగా, ఇవన్నియూ హరిదినమంత పవిత్రము కాజాలవు. ఆయాసము లేకుండా హరి మందిరమును చేర్చును. ఏకాదశినాడు ఉపవసించి, రాత్రి జాగరణముచేసి సర్వపాప విముక్తుడై విష్ణు లోకమును చేరును. ఏకాదశ్యుపవాసము మాతృ పక్షమున పదితరములను, పితృ పక్షమున పదితరములను, భార్యా పక్షమున పది తరములను ఉద్ధరించును. ఉపవసించిన వానిని కూడా విష్ణుపురమును చేర్చును. ఏకాదశి చింతామణితో నిధితో సమానము. సంకల్పమను కల్పవృక్షము వేదవాక్యము వంటివి అగు ద్వాదశిని ఆశ్రయించిన నరులు నాలుగు భుజములు కలిగి గరుడవాహనులు, మాల్యధారులు, పీతాంబరధారులుగా హరి మందిరమును చేరుదురు. ఇది అంతయు ద్వాదశీ ప్రభావము. నీకు చెప్పితిని. ఇది ఘోరమగు పాపరాశికి అగ్నిహోత్రము. ఏకాదశి ఎపుడు ఉపవసించ దగినదే. పుత్ర పౌత్రాది విపుల భోగములను అనుభవించగోరు మానవులు ఈ వ్రతమును ఆచరించ వలెను. ఈ లోకమున ఆదరముతో హరిదినమున ఇష్టముతో కాని అయిష్టముతోకాని ఆచరించువారు ఎన్ని పాపములు కలవారైనను శ్రీ మహావిష్ణు లోకమును పొందెదరు. (II/1)