ప్రాయశ్చిత్త విధి

సనకమహర్షి పలికెను: ఓ నారదా! ఇపుడు ప్రాయశ్చిత్త విధిని చెప్పెదను వినుము. ప్రాయశ్చిత్తముతో శుద్ధిపొందినవాడు సర్వకర్మఫలములను పొందును. ప్రాయశ్చిత్తమును ఆచరించనివారు చేసిన కర్మలన్నీ నిష్ఫలములై రాక్షసములగును. కామక్రోధములను పరిత్యజించినవారు ధర్మ శాస్త్రవిశారదులు సర్వధర్మఫలమును పొందగోరినవారు బ్రాహ్మణులను ధర్మమును అడిగి తెలుసుకొనవలయును. శ్రీమన్నారాయణునకు పరాఙ్ముఖులై ప్రాయశ్చిత్తము ఆచరించిననూ, సురాభాండమును నదులు పవిత్రములను చేయలేనట్లు పవిత్రులను చేయజాలవు. బ్రాహ్మణుని చంపినవాడు, సురాపానము చేసినవాడు, చౌర్యమును చేయువాడు, గురుతల్పగతుడు ఈ నాలుగు మహాపాతకులు. వీరితో కలిసి ఉండువాడు అయిదవ మహాపాపి. ఈ నలుగురితో కలిసి శయన ఆసన భోజనాదులతో ఒక సంవత్సరము కలి ఉన్నవాడు సర్వకర్మభ్రష్టుడు అగును. తెలియక బ్రాహ్మణుని చంపినవాడు నారబట్టలను, జటలను ధరించి తాను చంపిన బ్రాహ్మణుని కపాలమును చేతిలో ధరించ వలయును. ఆ కపాలము లభించనిచో ఇంకొక కపాలమును ధరించవలయును. ధ్వజాగ్రమున కపాలమును ధరించి వనచరుడు కావలయును. మితముగా వన్యాహారమును భుజిం చుచు వనములో ఒకవారము ఉండవలయును. మూడు వేళలలో స్నానముచేసి సంధ్యావందనము ఆచరించవలయును. గంధమాల్యాది ధారణమును పరిత్యజించి బ్రహ్మచారి కావలయును. పుణ్యతీర్థములను పుణ్యాశ్రమములను సేవించవలయును. వన్యాహారమునచే జీవించలేనియెడల గ్రామమున భిక్షాటన చేయవలయును. ఇట్లు శ్రీహరిని స్మరించుచు, పన్నెండు సంవత్సరములు బ్రహ్మహత్యా వ్రతమును ఆచరించవలయును. ఇట్లు చేసినచో బ్రాహ్మణ ఘాతకుడు శుద్ధిని పొంది సర్మకర్మార్హుడు అగును. వ్రతమధ్యమున మృగములచే కాని రోగములచే గాని మరణించిననూ గోరక్షకై ద్విజరక్షకై ప్రాణత్యాగమును చేసిననూ, బ్రాహ్మణులకు పదివేల గోవులను దానము చేసిననూ బ్రహ్మఘాతకుడు శుద్దిని పొందును. దీక్షితుడగు క్షత్రియుని వధించినను బ్రహ్మహత్యా వ్రతమును ఆచరించవలయును. అగ్నిప్రవేశనము కాని వారు ప్రపాతమును కాని చేయ వలయును. దీక్షితుడగు బ్రాహ్మణుని చంపినచో రెట్టింపు వ్రతము నాచరించవలయును. ఆచార్యాదివధను జరిపినచో నాలుగింతలు వ్రతమును చేయవలయును. సామాన్య బ్రాహ్మణుని వధించినచో సంవత్సరము వ్రతము నాచరించవలయును. ఇది బ్రాహ్మణునకు చెప్పబడిన ప్రాయశ్చిత్త విధి. క్షత్రియునకు రెట్టింపు, వైశ్యునకు మూడింతలు ప్రాయశ్చిత్తము జరుపబడును. బ్రాహ్మణుని వధించిన శూద్రుని ముశల్యుడందురు. అట్టివానికి రాజే శిక్ష విధించవలయునని శాస్త్ర నిర్ణయము. బ్రాహ్మణ స్త్రీని వధించినచో సగము ప్రాయశ్చిత్తమును, బ్రాహ్మణ కన్యను వధించినచో నాలుగవ భాగము ప్రాయ శ్చిత్తము నాచరించవలయును. ఉపనయనము కాని వానిని వధించిననూ పాద ప్రాయశ్చిత్తము నాచరించవలయును. వైశ్యుని చంపినచో మూడు సంవత్సరములు, శూద్రుని వధించినచో ఒక సంవత్స రము కృచ్ఛవ్రతము ఆచరించవలయును. దీక్షితుడు బ్రాహ్మణుని భార్యను వధించినచో ఎనిమిది సంత్సరములు కృచ్చవ్రతము నాచరించివలయును. లేదా బ్రహ్మహత్యా వ్రతమును చేసి నిశ్చయముగా శుద్ధిని పొందును. వృద్ధులకు రోగార్తులకు, స్త్రీలకు, బాలురకు అర్థ ప్రాయశ్చిత్తము విధించబడినది.

గుడముచే చేయబడినది, పిష్టముచే చేయబడినది, ఇప్పపూవుచే చేయబడినది అను సుర మూడు విధములు. ఇట్టి సురను చాతుర్వర్ణ్యముల వారు, స్త్రీలు ఎవ్వరూ పానము చేయరాదు. ఒకవేళ పానము చేసినచో స్నానముచేసి తడి బట్టలను ధరించి నియమముతో నారాయణ నామమును స్మరించి పాలను కాని, నేతిని కాని గోమూత్రమును కాని ఉక్కువలె కాచి త్రాగి తరువాత నీరు త్రాగవలయును. లోహపాత్రతో కాని ఇనుపపాత్రతో కాని రాగి పాత్రతో కాని త్రాగవలయును. అట్లు త్రాగనచో మరణించును. సురాపానము చేసినవాడు మరణముతో శుద్ధి పొందును. మరియొక మార్గము లేదు. తెలియక కాని తెలిసికాని ద్విజుడు సురాపానముచేసినచో ప్రాయశ్చిత్తము ఆచరించవలయును. చిహ్నము లను మాత్రమే ధరించక బ్రహ్మహత్యా వ్రతమును ఆచరించవలయును, రోగ నివృత్తికి ఔషధముగా నురాపానము చేసినచో అతనికి మరల ఉపనయనము చేయవలయును. అట్లే రెండు చాంద్రాయణ వ్రతములు ఆచరించవలయును. సుర త్రాగిన పాత్రను తాకిననూ, సురాభాండముతో జలము సేవించిననూ సురాపానముతో సమానమే, తాలము, పానసము, ద్రాక్ష, ఖర్జూరము, మాధూకము, శైలమారిష్టము, మైరేయము, నాలికేరజము, గౌడి, మాధ్వీ, సురఅని మద్యము పదకొండు విధములు. వీటిలో దేనినీ విప్రుడు సేవించ రాదు. ఒకవేళ సేవించినచో మరల ఉపనయనము చేసి తప్తకృచ్ఛ వ్రతమును ఆచరించవలయును.

చూచుచుండగా కాని, చూడకుండా కాని, బలప్రయోగముతో కాని, చౌర్యముతో కాని ఇతరుల వస్తువులను స్వీకరించుట స్తేయమనబడును. సువర్ణ ప్రమాణము మన్వాదులచే నిశ్చయించబడినది. స్తేయమునకు ప్రాయశ్చిత్త విధానము చెప్పెదను వినుము. గవాక్షమార్గమున ప్రసరించు సూర్య కిరణముల మధ్యన కనపడు సూక్ష్మతమ ఆకారమగు దుమ్ములోని ఒక కణము త్రసరేణు ప్రమాణముగా నిర్ణయించబడినది. ఎనిమిది త్రసరేణువు నిష్కమగును. మూడు నిష్కములు రాజసర్షపు అగును. మూడు రాజసర్షపములు ఒక గౌరసర్షపము అగును. ఆరు గౌరు సర్షములు యవము అగును. మూడు నిష్కములు రాజసర్షపము అగును. ఆరు గౌరసర్షపములు యవమగును. మూడు యవలు కృష్ణలమగును. అయిదు కృష్ణలములు మాషము అనబడును. పదునాఱుమాషములు సువర్ణము అగును. తెలియక బ్రాహ్మణ ధనమును అపహరించినచో పూర్వమువలె పన్నెండు సంవత్సరములు కపాలధ్వజ రహితముగా బ్రహ్మ హత్యా వ్రతము ఆచరించవలయును, గురువుల, యజ్ఞకర్తల. ధర్మిష్ఠుల శ్రోత్రియుల ద్విజులు బంగారమును హరించినచో నేతిని బాగుగా కాచి శరీరమునిండా లేపనమును చేయవలయును. కరీషములో అచ్చాదన చేయబడిదగ్గుడైనచో స్తేయ పాపము నుండి విముక్తుడు అగును. క్షత్రియుడు బ్రాహ్మణ ధనమును హరించినచో పశ్చాత్తాపమును చెంది మరల వారికే ఇచ్చివేసి, పన్నెండు దినములు ఉపవాసముచేసి సాంతాపన వ్రతమును ఆచరించవలయును. అపుడు ముక్తుడగును. అట్లు చేయనిచో పతితుడగును. రత్నాసనము, మనుష్య భూమి, ధేనువులు మొదలగునవి సువర్ణసమములు. వీటిని హరించినచో అర్థప్రాయశ్చిత్తమును ఆచరించవలయును. త్రసరేణు పరిమితమైన బంగారమును అపహరించినచో సావధానమనస్కుడై రెండుమార్లు ప్రాణాయామము ఆచరించవలయును. నిష్కపరిమితమగు బంగారమును హరించిన ప్రాణాయామత్రయమును, రాజసర్షప మాత్రమును హరించిన నాలుగు ప్రాణాయామములను ఆచరించినచో శుద్ధిపొందును. గౌరసర్షపరిమిత బంగారమును హరించినచో స్నానము ఆచరించి యథావిధిగా ఎనిమిదివేలు గాయత్రీ జపము ఆచరించవలయును. యవమాత్ర కావచనము నపహ రించినచో ప్రాతః కాలము నుండి సాయంకాలము వఱకు గాయత్రీజపము ఆచరించి శుద్ధిపొందును. కృష్ణలమాత్ర హేమాపహరణమును కావించినచో సాంతపనవ్రతము ఆచరించవలయును. మాషప్రమాణహేమపహారణము కావించినచో ఒక సంవత్సరము గోమాత్రములో పక్వము కావిం చబడిన యవలను భుజించిన శుద్ధిపొందును. సువర్ణపరిమిత హేమాపహరణము గావించినవారు పన్నెండు సంవత్సరములు సావధానమనస్కులై బ్రహ్మహత్యావ్రతమును ఆచరించవలయును. సువర్ణ పరిమాణము కంటే తక్కువ రజతమును అపహరించినచో సొంతపన వ్రతము ఆచరించవలయును. లేనిచో పతితుడగును. నాలుగు నిష్కముల నుండి పది నిష్కముల వరకు రజతాపహరణమును గావించినచో చాంద్రాయణ వ్రతమును ఆచరించవలయును. పదినుండి నూరు నిష్కముల వరకు రజతమును అపహరించినచో రెండు చాంద్రాయణ వ్రతములను ఆచరించి శుద్ధిపొందును. నూరునుండి వేయి నిష్మముల వరకు రజాత పహరణమునకు మూడు చాంద్రాయణములు ఆచరించ వలయును. వేయి నిషములు కన్నా అధికము రజతమును అపహరించినచో బ్రహ్మహత్యవ్రతము ఆచరించి వలయును. కంచు ఇత్తడి అయస్కాంతము మొదలగువాటిని వేయినిష్కముల నపహరించినచో పరాక వ్రతమును ఆచరించవలయును. రత్నాపహరణమునకు రజతాపహరణము వలెనే ప్రాయ శ్చిత్తములను ఆచరించవలయును.

గురుతల్పగతులకు ప్రాయశ్చిత్తమును వివరించెదను. తెలియక తల్లినిగాని, తల్లి సవతిని గాని సంగమించినచో తాను చేసిన పాపమును చెప్పుచు తానే తన వృషణమును ఛేదించు కొన వలయును. చేతిలో వృషణమును పట్టుకొని నైరుతీ దిశకు వెళ్ళుచు మార్గమధ్యమున సంభవించు సుఖదుఃఖములను విచారించక ప్రాణము వదలువరకు చూడకనే వెళ్ళవలయును. అపుడు శుద్ధి పొందును. చేసిన పాపమును చాటుకొనుచు సుడిగాలిలో పడవలయును. విచారించక తన వర్ణము కంటే ఉత్తమవర్ణ స్త్రీని సంగమించినచో పన్నెండు సంవత్సరములు బ్రహ్మహత్యావ్రతమును ఆచరించ వలయును. విచారించక అభ్యాసముచే సువర్ణస్త్రీనికాని ఉత్తమ స్త్రీనికాని సంగమించినచో పిడక నిప్పుతో దగ్ధమైన శుద్ధిని పొందును. మాతృసంగమున రేతస్సేకము కంటే ముందే నివృత్తుడైనచో బ్రహ్మహత్యావ్రతము ఆచరించవలయును. సవర్ణస్త్రీ విషయమున ఉత్తమవర్ణస్త్రీ విషయమున రేతస్సేకము గావించకనే నివృత్తుడైనచో విష్ణుతత్పరుడై తొమ్మిదివత్సరములు బ్రహ్మహత్యా వ్రతమును ఆచరించవలయును. తండ్రి భార్యయగు వైశ్యస్త్రీ సంగమును గావించినచో ఆరు సంవత్సరములు బ్రహ్మహత్యా వ్రతమును ఆచరించవలయును. తండ్రి భార్యయగు శూద్ర స్త్రీని సంగమించినచో మూడు సంవత్సరములు వ్రతమును ఆచరించవలెను. పినతల్లిని, మేనత్తను, ఆచార్య భార్యను, మామ భార్యను, పినతండ్రి భార్యను, మేనమామ భార్యను, పుత్రికను కామమోహితుడై దినద్వయము సంగ మించినచో యథా విధిగా బ్రహ్మహత్య వ్రతమును ఆచరించవలయును. ఒకేదినమున పలు మార్లు సంగమించినచో మూడు వర్షములు బ్రహ్మహత్య వ్రతము ఆచరించవలయును. ఒకమారు సంగ మించినచో ఒక సంవత్సరము వ్రతము నాచరించవలయును. మూడు దినముల సంగమించినచో వహ్నిదగ్ధుడైననే శుద్ధిపొందును. చండాల స్త్రీని, పుషస స్త్రీని, కోడలును, సోదరిని, మిత్రుని భార్యను, శిష్యుని భార్యను కామముతో సంగమించినచో అరుసంవత్సరములు బ్రహ్మహత్యా వ్రతమును ఆచరించ వలయును. కామము లేకనే సంగమించినచో ఒక సంత్సరము కృచ్ఛ వ్రతము ఆచరించవలయును.

మహాపాతకులతో కలిసియున్నపుడు ఆచరించవలసిన ప్రాయశ్చిత్తమును చెప్పెదను. ప్రాయశ్చిత్తముచే పరిశుద్ధుడగువాడు సర్వకర్మఫలములను అందగలడు. బ్రహ్మహత్యాదిపాతక చతుష్టయములలో ఏ పాపమును చేసిన వానితో కలిసి ఉన్నవాడు ఆయా పాతకముకు నిర్దేశించబడిన ప్రాయశ్చిత్తములను ఆచరించి పరిశుద్ధుడగును. ఈ పాతకులలో తెలియక అయిదు దినములు కలిసి ఉన్నచో కాయకృచ్ఛవ్రతమును ఆచరించవలయును. లేనిచో పతితుడగును. పన్నెండు రోజులు కలిసి ఉన్నచో మహాసాంతపన వ్రతము నాచరించ వలయును. పదిహేను దినములు సంసర్గము చేసినచో పన్నెండు రోజులు పవసించవలయును. ఒకమాసము కలిసి ఉన్నచో పరాకవ్రతమును ఆచరించవలయును. మూడు మాసములు ఉన్నచో చాంద్రాయణ వ్రతము ఆచరించవలయును. ఆరునెలలు కలిసి ఉన్నచో రెండు చాంద్రాయణములు ఆచరించవలయును. కొంచెము తక్కువగా సంవత్సరమున్నచో ఆరుమాసములు వ్రతము ఆచరించవలయును. ఇదియే సంసర్గము. తెలిసి చేసినచో పైన చెప్పబడిన ప్రాయశ్చిత్తములకు మూడురెట్లు అధికముగా ఆచరించవలయును.

మండూకమును (కప్ప) ముంగిసను, కాకిని, వరాహమును, మూషకమును, మార్జాలమును, మేకను, గొట్టెను, కుక్కను, కోడిని చంపినచో అర్థకృచ్చ వ్రతమును ఆచరించ వలయును. అశ్వమును వధించినవారు అతికృచ్ఛ వ్రతమును ఆచరించవలయును. ఏనుగును వధించినచో తప్త కృచ్ఛ వ్రతమును గోవధను చేసినవారు పరాకమును ఆచరించవలయును. తెలిసి కోరి గోవధను చేసిన వారికి నిష్కృతి విధించబడలేదు.

పానశయ్య అసనాదులను, పుష్పమూలఫలాదులను, భక్ష్య భోజ్యాదులను హరించినచో పంచ గవ్యసేవనముచే శుద్ధికలుగును. శుష్కకాష్ఠలములను, తృణమును, వృక్షములను, గుడమును, చర్మమును, వస్త్రములను, మాంసమును అపహరించినచో మూడు దినములు ఉపవసించవలయును. చకోరమును, చక్రవాకమును, హంసను, కారండమును, గుడ్లగూబను, సారసమును, పావురమును, జలపాదకమును చిలుకను, పిట్టను బలాకమును, తోడేలును, తాబేలును, వీటిలో దేనిని చంపిననూ పన్నెండు దినములు ఉపవసించవలయును. రేతస్సును, మలమూత్రములను ఆహారముగా తీసు కొనినచో ప్రాజాపత్య వ్రతము ఆచరించవలయును. శూద్రోచ్చిష్టభోజనము చేసినచో మూడు చాంద్రాయణ వ్రతములను ఆచరించవలయును. రజస్వలయగు స్త్రీని, చండాలుని, మహాపాతకుని, ప్రసవించిన స్త్రీని, పతితుని, ఉచ్ఛిష్టమును, రజకాదులను స్పృశించినచో సచేలముగా స్నానము చేయవలయును, ఘృతప్రాశనము చేయవలయును. స్నానము చేసి పరిశుద్ధుడై ఎనిమిదినూర్లు గాయత్రీ జపమును చేయవలయును. భోజనముచేయు చున్నప్పుడు తెలియక వీరిలో ఒకరిని స్పృశించినచో మూడుదినములు ఉపవాసమును ఆచరించి పంచగవ్య ప్రాశనము చేయవలయును. స్నానదానజపభోజనాదులలో పైన చెప్పబడిన వారితో ఒకరి శబ్దమును వినిననూ వారితో మాటలాడినను, భుజించినదానిని వాంతి చేసుకొనవలయును. స్నానము చేసి ఉపవసించవలయును. రెండవదినము నేతిని భుజించిన శుద్ధిని పొందును. వ్రతాదుల మధ్యన వీరి మాటలను వినినచో ఒక వెయ్యి ఎనిమిది గాయత్రీ జపమును ఆచరించి శుద్ధిపొందును. అన్ని పాపములలో అధిక పాపము ద్విజదైవత నిందనము. ఈ పాపమునకు ఏ శాస్త్రములోను నిష్కృతి చెప్పబడలేదు.

మహాపాతకతుల్యములుగా జ్ఞానులు పేర్కొన్నవాటికి యథావిధిగా ప్రాయశ్చిత్తములను ఆచరించియే తీరవలయును. నారాయణపరాయణుడై ప్రాయశ్చిత్తములను ఆచరించినచో శుద్ధుడు అగును. లేనియెడల పతితుడగును. రాగాదినిర్ముక్తుడై పశ్చాత్తాప సమన్వితుడై సర్వ భూతములయందు దయావంతుడుగుచు విష్ణుస్మరణ తత్పరుడైనచో మహాపాతకములచే కాని సర్వవిధి పాతకములచే కాని కూడియున్ననూ విష్ణుపరుడగుట వలన విముక్తుడు అగును. అనాకారుడు అనామయుడు అనాద్యంతుడు అగుటవలన నారాయణుని స్మరించు మానవుడు పాపకోటులనుండి విముక్తుడగును. శ్రీమన్నారాయణుని స్మరించినను, పూజించినను, ధ్యానించినను, ప్రణామములు ఆచరించినను శ్రీమహావిష్ణువు హృదయము నుండి పాపకోటులను నశింపచేయును. సంసర్గము వలన కాని మోహము వలన కాని శ్రీహరిని పూజించినచో సర్వపాప వినిర్ముక్తుడై శ్రీహరి పదమును చేరును. శ్రీమహావిష్ణువును ఒకసారి స్మరించినచో క్లేశరాశులు నశించును. స్వర్గాది భోగప్రాప్తి సుకరము అగును. ఓ మునీశ్వరా! మానవజన్మయే దుర్లభము. అందులోనూ హరిభక్తి పరమ దుర్లభము. కావున మెరుపువలె చంచలమైన దుర్లభమైన మానవజన్మను పొంది సర్వపాశవిమోచనకమగు హరిని పూజించిన అన్ని విఘ్నములునశించును. మనశ్శుద్ధికలుగును. ఉత్తమమైన మోక్షము లభించును. ధర్మార్థకామ మోక్షములగు సనాతన పురుషార్ధములు హరిపూజాపరులకు సిద్ధించును. పుత్ర దారగృహ క్షేత్ర ధనధాన్యముల వెంట పరుగెత్తి మానవజన్మనెత్తి గర్వించకుడు. కామక్రోధలోభ మోహమున మాత్సర్యములను, పరాపవాదమును నిందను వదిలి భక్తితో శ్రీహరిని సేవించుడు. అన్ని వ్యాపారములను వదిలిపెట్టి జనార్దనుని పూజించుడు. యమనగర వృక్షరాజములు సమీపములోనే యున్నవి. జరామరణములు ఇంద్రియ వైకల్యము సంభవించక మునుపే శ్రీహరిని అర్చించుడు. నశ్వరమైన ఈ శరీరముపై బుద్ధిమంతుడు విశ్వాసముంచడు. మృత్యువు ఎల్లపుడూ సమీపించియే ఉండును. సంపదలు మిగుల చంచలములు. దేహమెప్పుడూ మృత్యువునకు దగ్గరలోనే ఉన్నది. కావున గర్వమును విడువుడు. ప్రతి కలయిక విడిపోవుట కొఱకే. ప్రతిదీ క్షణభంగురమే. ఈ విషయమును తెలిసి జనార్దనుని పూజించుము. ప్రాణి ఆశచే బాధలను తెచ్చుకొనును. మోక్షము అత్యంత దుర్లభము. మహాపాపియైనను భక్తిచే శ్రీ మహావిష్ణువును పూజించినచో తిరిగిరాని పరమపదమును చేరును. సర్వతీర్ధములు యజ్ఞములు సాంగములైన వేదములు నారాయణార్చనలో పదునారవ అంశతోసరిపోవు. విష్ణుభక్తిలేనివారుచేసిన వేదాధ్యయనము, యాగములు, శాస్త్రములు, తీర్ధసేవనము, తపము, వ్రతములు అన్నియూ నిష్పలములే అగును. వేదాంతవేద్యుడు భవరోగవైద్యుడు అనంతమూర్తి ఆకారమును దాల్చినవాడు సర్వశ్రేష్ఠుడు అగు శ్రీమహావిష్ణువును ధ్యానించువారు అచ్యుత పదమును చేరెదరు. అనాదియైన ఆత్మ, అనంతశక్తి జగత్తునకు ఆధార భూతుడు, దేవతలచే స్తుతించబడువాడు, అట్టి జ్యోతిస్స్వరూపిని అన్నిటికంటే పరుడైన అచ్యుతుని స్మరించిన ఉత్తమసఖుని పొందును. (1/30)