మోహినీ భ్రమణము

వసిష్ఠ మహర్షి పలికెను: మోహిని మోహమును విడిచి స్వర్గమునకు వెళ్ళెను. అచట దేవదూత ఓ పాపాత్ము రాలా! నీవు ఇచటికి రాదగదు. పాపశీలురాలా! దుర్బుద్ధీ! భర్తృనిందా పరాయణురాలా. హరివాసరమును లోపింపచేయు నీకు స్వర్గమున స్థానము లేదు. ధర్మ విముఖులకు నరకములో నివాసము ఉండును. ఇట్లు వాయువు మోహినితో పలికి దండముచే దండించి నరకమునకు పంపివేసెను. ఇట్లు దేవదూతచే దండించబడిన మోహిని బ్రహ్మదండ పరాభూతురాలై నరకమును చేరెను. అచట యమధర్మరాజు ఆజ్ఞచే దేవతలు మోహినిని చాలాకాలము దండించిరి. అన్ని రకముల నరకములలోనికి వెళ్ళి పడిపోయెను. ఓ పాపాత్మురాలా పుత్రుడగు ధర్మాంగదుని భర్త చేతితో చంపించితివి. కావున నీవు స్వయముగా నాచరించిన కర్మఫలమును అనుభవించుము. ప్రజాహితమును ఆచరించువానిని, స్థిరప్రజ్ఞుని, మహేంద్ర వరుణోపముని, సప్త ద్వీపాధిపతియగు పుత్రుని వధించి ఈ ఫలమును అనుభవించు చున్నావు. సామాన్య పుత్రుని చంపిననే బ్రహ్మహత్యా పాతకము సంప్రాప్తించును. ఇక ధర్మయుక్తుడగు ధర్మాంగదుని చంపిన ఏమి చెప్పవలయును? ఇట్లు దూతలచే నిందించబడుచు, యముడు విధించిన యాతనలనన్నింటిని క్రమముగా అనుభ వించెను. బ్రాహ్మణ శాపముపాలైన మోహినీ దేహమును స్పృశించుటచే ఆయాతనలన్ని తమ శరీరములు కాలుచుండగా సహించజాలక నరకములన్నియూ యమధర్మరాజును చేరినవి. మోహినీ శరీరస్పర్శచే పీడితలై చేతులు జోడించి ఇట్లు పలికినవి. దేవ దేవా! జగన్నాధా! ధర్మరాజా దయను చూపుము. ఈ మోహినిని త్వరగా యాతనలనుండి దూరముగా పంపుము. ఈమెను స్పృశించినంతనే క్షణములో మేము భస్మమైతిమి. కావున ఈమెను నరకములనుండి పారద్రోలుము. అట్లు పలికిన నరకముల మాటలను విని యమధర్మ రాజు ఆశ్చర్యమును చెందెను. తన దూతలతో ఈమెను బయటికి పంపుము. బ్రహ్మదండ నిర్ధగ్ధుడగు స్త్రీకాని, పురుషుడుకాని, చోరుడుకాని, అతని స్పర్శను నా యాతనలు సహించ జాలవు. కావున మహాపాపురాలు భర్తృవచనలోపిని, పుత్రఘ్ని, ధర్మ హంతకురాలు, బ్రహ్మదండ హతురాలగు మోహినిని దూరముగా తరలించుడు. ఈమెను చూచుటచే నా శరీరము మండుచున్నది. ఇట్లు ధర్మరాజు పలుకగా అతని దూతలు శస్త్రాస్త్రములచే మోహినిని కొట్టుచు యమలోకమునుండి బహిష్కరించిరి. అంతట మోహయుతు రాలగు మోహిని దుఃఖితురాలై పాతాలలోకమునకు వెళ్ళెను. అచట పాతాలవాసులు వారించిరి. అంతట బ్రహ్మపుత్రి మిక్కిలి సిగ్గుపడి తండ్రివద్దకు వెళ్ళి తన దుఃఖమును తెలిపెను. ఓ తండ్రీ! చరాచరాత్మకమగు ఈ మూడు లోకములలో నాకు స్థానములేదు. నేనెచటికి వెళ్ళిననూ బహిష్కరిం చుచున్నారు. నన్ను ఆయుధములచే బాగా కొట్టి బహిష్కరించుచున్నారు. నీ ఆజ్ఞను స్వీకరించి నేను రుక్మాంగదుని సమీపించితిని. అన్ని లోకములు నిందించు పనిని చేసితిని. భర్తను బాధించి శ్రేష్ఠమగు ఖడ్గముతో పుత్రుని చంపించి సంధ్యావళీ దేవిని క్షోభింపచేసి ఈదశను పొందితిని. పాపురాలనుగు నాకు ఇపుడు ఏ గతిలేదు. విశేషించి బ్రాహ్మణ శాపముచే దుఃఖభాగిని అయితిని. బ్రాహ్మణ వాక్యహతులకు, అగ్నిదగ్ధులకు, దివాకీర్తి హతులకు, మృగాదులచే భక్షించబడిన వారికి, మెరుపుచే పీడించ బడువారికి దేవనది ముక్తినిచ్చును కావున నీవు నాకు శాపమునిచ్చిన బ్రాహ్మణుని దేవతలచే కలిసి ప్రసన్నుని చేసినచో నాకు గతి లభించును. ఇట్లు మోహిని పలుకగా వినిన లోక పితామహుడగు బ్రహ్మ శివ ఇంద్ర యమ సూర్యాగ్ని దేవేశులతో కలిసి, మోహినిని ముందిడుకొని బ్రాహ్మణుని వద్దకువెళ్ళెను. దేవాది సహితుడగు బ్రహ్మ అచటికి వెళ్ళి తాను స్వయముగా గొప్ప గౌరముతో బ్రాహ్మణునికి నమస్కరించెను. రుద్రాది దేవతలచే పూజించబడు పితామహుడు మోహినికి సంతోషమును కలిగించవలయునని ముగ్ధుడై స్వయముగా తానే నమస్కరించెను. మూడు లోకముల లోను సాధింప శక్యముకాని గొప్ప కార్యము సంప్రాప్తించినపుడు చిన్నవానికి నమస్కరించుట దోషముకాదు. వేదవేదాంగ పారగుడు తపస్సులో ఉన్న ఆ బ్రాహ్మణుడు దేవతలతో కలిసి వచ్చిన లోకకర్తను చూచి లేచి బ్రహ్మకు, మునులకు, దేవతలకు నమస్కరించెను. ఆసనమును సమర్పించి కూర్చుండ జేసి భక్తిచే బ్రహ్మను స్తుతించెను. అపుడు ప్రసన్నుడగు లోకకర్త అయిన బ్రహ్మ ఆ దేవతలు మోహిని కొఱకు ఆ బ్రాహ్మణుని ప్రార్ధించసాగిరి.

నాయనా! బ్రాహ్మణోత్తమా సదాచారపరా! పరలోకోపకారక! కృపాసింధో దయతలచి మోహినికి సద్గతిని ప్రసాదించుము. రుక్మాంగదుని మోహింప చేయుటకు మోహినిని నేనే పంపి యుంటిని. యమలోకము శూన్యమగుట, వైకుంఠము పూర్ణముగా నుండుటను చూచి, లోకులందరూ బాధలు లేనివారుగా నుండుటచే, దేవతలకు హితమును చేయు మోహినిని మసుచే సృజించితిని. ఓ బ్రాహ్మణోత్తమా నేను చెప్పుదానిని సావధానముగా వినుము. లోక కళ్యాణ కారిణియగు ధర్మ సూక్ష్మమును ధర్మ స్వరూపమును తెలియుము. ఈ స్వర్ణ సన్నిభయగు రూపముకల మోహినిచే రుక్మాంగదుని పరీక్షించి భార్యా పుత్రులతో శ్రీహరి మందిరమున చేర్చితిమి. రాజు ఎదురులేని భక్తిచే హరివాసరమును సేవించెను. కావున యమలోకము శూన్యము చేయబడినది. యమ లిపిని తుడిచి వేసెను. ఓ బ్రహ్మర్షీ! ఎన్ని జన్మలలోనైననూ దేవాపకారము క్షమించరానిది. బ్రాహ్మణాప కారము విశేషించి క్షమించరానిది. కావున మోహినికి సహాయముగా బ్రాహ్మణులు వెడలిరి. సాంఖ్యవిదులకు పొందరానిది, అష్టాంగయోగముచే పొందజాలని, భక్తి మాత్రముచే పొందదగిన శ్రీహరి లోకమునకు రాజును రాజపుత్రుని, రాజపత్నిని చేర్చితిమి, పుణ్య శీలుడగు రాజశ్రేష్ఠునకు జరిపిన కార్యమునకు పాపవేగమునకు నీ శాపముచే దగ్ధురాలై మోహిని భస్మముగా మిగిలిపోయెను. ఈ మోహిని దేవతల కొఱకు, సంసారమును పెంచుటకు, రాజునకు ఉపకరించుటకు మాత్రమే ప్రవర్తించినది. అంతేకాని స్వార్ధమును కోరి ఆచరించలేదు. అయినపుడు ఈమె అవమానమును పొందుట తగదు. కావున ఓ బ్రాహ్మణోత్తమా ఈ అపకారమును క్షమించుము. దయచూడుము. శాంతిని పొందుము. పిండిని విసురుట నీతి సమ్మతముకాదు. శాపమునిచ్చి పతితురాలను చేసితివి. అనుగ్రహించి గతి ప్రదానము చేయుము. నీవిట్లు చేసినచో ఈ మోహిని తన క్రూర బుద్ధిని విడుచును. ఇట్లు బ్రహ్మ పలుకగా విచారించి కోపమును విడిచెను. త్రిదశాధినాథుని ఇట్లు పలికెను. నీ పుత్రికయగు మోహిని బహుపాపముల ఆచరించినది. కావున సకల ప్రాణులలో సకల లోకములలో ఉనికిని గోల్పోయినది. కావున నేను చాలాసేపు విచారించి మోహిని కొరకు నిర్ణయించితిని. నీ ప్రీతికొరకు ఆ గతిని ఇచ్చెదను. నీవు నాకు పూజ్య తరుడవు కదా! నీ మాట నామాట నిజము కావలయును. దేవకార్యము మోహినీ కార్యము నెరవేరవలెను. భూతసంఘములు ఆక్రమించని ప్రదేశమున మోహినియుండును. సప్తద్వీపవతియగు భూమి జంగమా జంగమములచే వ్యాపించబడి ఉన్నది. తలాది లోకములు దైత్యాదులచే, ఆకాశము పక్ష్యాదులచే, స్వర్గము సుకృతులచే, నరకము పాపులచే, మత్స్యాదులచే సాగరము వ్యాప్తమైయున్నది. కావున వీటియందు మోహినికి ఉనికి లేదు అని అంతట బ్రహ్మదేవతలతో అలోచించి మోహినితో నీకెక్కడా స్థానములేదని పలికెను. అపుడు మోహిని ఆ మాటను విని, తండ్రి ఆజ్ఞను ఆచరించునదై హరివాసర న్మాశినియగు మోహిని పురోహితునితో పాటు అందరికి నమస్కరించి ఇట్లు పలికెను.

ఓ దేవోత్తములారా మీకు చేతులు జోడించుచుంటిని. ఇట్లు నమస్కారశతముచే దేవతలగు మీరు ప్రసన్నహృదయముతో సర్వప్రీతికరముగా నా యాచన నీయదగును. ఏకాదశి ప్రభావముచే పాపులందరికి సద్గతి లభించును. ఆ గతిని పెంచుటయే నాకు ప్రయోజనము కావలయును. భర్త సవతి, పుత్రుడు ఈ ముగ్గురిని నేను వైకుంఠమునకు పంపితిని. భూలోకమున ఇపుడు నేను మీకొరకు పతిహీననై ఉన్నాను. హరిదినము దుష్టమెట్లగునో తెలుపుడు. నా స్వార్ధమునకు ఇట్లు యాచించు చున్నాను. (II/36)