నారద మహా పురాణము
గారుడాను క్రమణ వర్ణనము
బ్రహ్మ పలికెను: ఓ మరీచి మహర్షి ! ఇపుడు శుభకరమగు గరుడ పురాణమును చెప్పెదను వినుము. భగవంతుడగు శ్రీమన్నారాయణుడు గరుత్మంతునికి అతడడుగగా చెప్పెను. ఈ పురాణమున పందొమ్మిది వేల శ్లోకములు కలవు. ఇందులో గరుడకల్ప కథ కలదు. మొదట పురాణోపక్రమ ప్రశ్న. తరువాత సంక్షేపముగా సృష్టి, సూర్యాది పూజనవిధి, దీక్షావిధి, శ్రాద్ధ పూజా, నవ వ్యూహార్చనము, పూజా విధానము, విష్ణు పంజరము, యోగాధ్యాయము, విష్ణుసహస్ర నామకీర్తనము, విష్ణు ధ్యానము, సూర్య పూజా మృత్యుంజయ అర్చనము, మాలామంత్రము, శివపూజా, గణపూజా, గోపాల పూజా, త్రైలోక్య మోహన శ్రీధరార్చనము, విష్ణుపూజా, పంచతత్త్వపూజా, చక్రపూజా, దేవపూజా, న్యాసాది సంధ్యోపాసన, దుర్గార్చన, సూర్యార్చన, మహేశ్వరీ పూజ, పవిత్రారోపణము, మూర్తి ధ్యానము, వాస్తుమానము, ప్రాసాద లక్షణము, సర్వదేవ ప్రతిష్ఠ, యథావిధిగా పృధక్పూజా, అష్టాంగ యోగము, దానధర్మములు, ప్రాయశ్చిత్త విధిక్రియా, ద్వీపేశ నరకాఖ్యానము సూర్య వ్యూహము, జ్యోతిషము, సాముద్రికము, స్వరజ్ఞానము, నవరత్న పరీక్షణము, తీర్థ మాహాత్మ్యము, గయా మాహాత్మ్యము, మన్వంతర కథ, పిత్రాఖ్యానము, వర్ణ ధర్మములు, ద్రవ్యశుద్ధి, సమర్పణము, శ్రాద్ధము, వినాయకపూజ, గ్రహయజ్ఞము, ఆశ్రమములు, జనన మనుప్రేత శౌచము, నీతి శాస్త్రము, వ్రతకథనము, సూర్యవంశము, సోమవంశము, శ్రీహరి అవతార కథనము, రామాయణము, హరివంశము, భారతము, ఆయుర్వేద నిదానము, చికిత్సా, ద్రవ్యగుణములు, రోగనాశకమగు శ్రీ విష్ణు కవచము, గరుడ మంత్రము, త్రిపురామంత్రము, ప్రశ్న చూడామణి, హయాయుర్వేద కీర్తనము, ఓషధీ నామ కథనము, వ్యాకరణ శాస్త్రము, ఛందఃశాస్త్రము, సదాచారము, స్నానవిధి, వైశ్య దేవతర్పణము, సంధ్యా, పార్వణ కర్మ, సపిండమను నిత్యశ్రాద్ధము, ధర్మసారము, అఘనిష్కృతి, ప్రతి సంక్రమణము, యుగ ధర్మములు కృతి ఫలము, యోగ శాస్త్రము, విష్ణుభక్తి, శ్రీహరి నమస్కార ఫలము, వైష్ణవ మాహాత్మ్యము, నారసింహ స్తోత్ర రత్నము, జ్ఞానామృతము, గుహాష్టకము, విష్ణ్వర్చనా స్తోత్రము, వేదాంత సిద్ధాంతము, సాంఖ్య సిద్ధాంతము, బ్రహ్మ జ్ఞానము, ఆత్మ జ్ఞానము, గీతా సారము, ఫలశ్రుతి, ఇవి పూర్వ ఖండమున చెప్పబడినవి. ఇక ఉత్తర ఖండమున మొదట ప్రేత కల్పము చెప్పబడినది. గరుడుడు అడుగగా శ్రీహరి చెప్పెను. మొదట ధర్మ ప్రకటనము, యోగుల గతి, దానాదులు, తత్ఫలములు, ఊర్థ్వ దైహిక మంత్రములు, యమలోక మార్గ వర్ణనము, షోడశ శ్రాద్ధ ఫలవర్ణనము, యమ మార్గ నిష్కృతి, ధర్మరాజ వైభవం, ప్రేత పీడాకథనము, ప్రేత చిహ్న నిరూపణము, ప్రేత చరిత్ర కథనము, ప్రేతత్వ కారణము, ప్రేత కృత్వా విచారము, సపిండీకరణ కథనము, ప్రేతత్వ మోక్ష కథనము, ప్రేతత్వ విముక్తికి దానములు, అవశ్యక దానములు, ఉత్తమ దానము, ప్రేతసౌఖ్యకర విధి, శారీరక కథనము, యమలోక వర్ణనము, ప్రతత్వోద్ధార కథనము, కర్మ కర్తృ నిర్ణయము, మృత్యు పూర్వక్రియా కథనము, మృత్యువు తరువాత చేయు కర్మ నిరూపణము, మధ్య షోడశక శ్రాద్ధము, స్వర్గ ప్రాప్తి క్రియా నిర్ణయము, సూతక కథనము, నారాయణ బలక్రియా, వృషోత్సర్గ మాహాత్మ్యము, నిషిద్ధ వర్జనము, అపమృత్యు క్రియోక్తి, మానవ కర్మ విపాకము, కృత్యాకృత్య విచారము, విముక్తికి విష్ణు ధ్యానము, స్వర్గప్రాప్తికి విహిత వర్మ కథనము, స్వర్గ సౌఖ్య నిరూపణము. భూలోక వర్ణనము సప్తాధోలోక వర్ణనము, పంచోర్థ్వలోక కథనము, బ్రహ్మాండ స్థితి కీర్తనము, అనేక బ్రహ్మాండ చరితము, బ్రహ్మ జీవ నిరూపణము, అత్యంతిక ప్రళయ కీర్తనము, ఫలస్తుతి నిరూపణము, అను ఇవి చెప్పబడినవి. ఇది భుక్తిముక్తి ప్రదమగు గరుడ పురాణము. పఠించు వారికి వినువారికి పాపనాశనము. ఈ పురాణమును వ్రాసి బంగారు హంసల జంటతో బ్రాహ్మణునకు దానము చేసినచో ఉత్తమగతిని చేరును. (4/108)