మోహినీ చరితము

వసిష్ఠ మహర్షి పలికెను: మోహిని పలికిన మాటలను వినిన బ్రాహ్మణులు నీవు చెప్పినది నిజమే అనిరి. తరువాత రాజుతో ఇట్లు పలికిరి.

బ్రాహ్మణులు పలికిరి: ఓ రాజా? రెండు పక్షములలోని ఏకాదశులలో భుజించరాదని నీవు చేసిన శపథము శాస్త్ర దృష్టిచే చేసినదికాదు. నీ బుద్ధిచే కల్పించుకొనినదే. అగ్నిహోత్రులకు రెండు పూటలా భోజనము విధించబడినది. హోమ శేషమును భుజించువారు మూడు వర్ణములవారని చెప్పబడినది. విశేషించి రాజులకు ఉపవాసము ఉచితమైనది కాదు. క్షత్రియులు ఎపుడూ దుష్టులను శాసించుటకు శస్త్రమును ధరించి ఉండవలెను. శాస్త్ర విధిగాకాని అశాస్త్ర విధిగాకాని నీవు చేసిన శపథము ఈనాడు బ్రాహ్మణ వాక్యమువలన పరిపూర్ణమగును. నీకిచట వ్రత భంగము జరుగదు. బ్రాహ్మణులతో కలిసి భుజించుము. నీవు విచారించవలదు. బ్రాహ్మణ వాక్యము అన్నిటిలో ఉత్తమము. బ్రాహ్మణ వాక్యమును వేరుగా భావించువాడు పదిహేను జన్మలు రాక్షసునిగా పుట్టును. ఇట్లు బ్రాహ్మణులు పలికిన రౌద్ర వాక్యములను వినిన రాజు కోపము కలవాడై పెదవులు అదురుచుండగా వినయముగా బ్రాహ్మణులతో ఇట్లు పలికెను. ప్రాణులందరికి మీరు మార్గదర్శకులు. యతులకు విధవలకు ఈ శ్లోకముచెప్పబడినది. మీరు చెప్పినది చెడుదారిన నడుచు వారిది కాని సాత్త్వికులదికాడు. రాజులకు ఉపోషణము ఉచితము కాదని మీరు చెప్పిన దానికి వైష్ణవాచార లక్షణమున ఇట్లు చెప్పబడినది. వినుడు. శంఖముతో నీరు త్రాగరాదు. కూర్మమును, సూకరమును చంపరాదు. రెండు పక్షములలోని ఏకాదశులలో భుజించరాదు. మద్యపానము చేయరాదు. బ్రాహ్మణుని చంపరాదు. ధర్మజ్ఞులు పాచికలాడ రాదు. ఏకాదశినాడు భుజించరాదు. తినరాని దానిని తినుట పాపము. పరదారాభి మర్శనము పాపము. ఏకాదశీ భోజనము పతనమునకే కారణము. చేయరాని పనులను చేయుచు నూరు సంవత్సరములు బ్రతుకనేల? చేతనుడగు మానవుడు ఎవడు ఏకాదశి నాడు భుజించును? ఏకాదశినాడు చతుష్వాద జంతువులకు కూడా జనులు ఆహారము నీయరాదు. ఉత్తర దిక్కున నుండు బ్రాహ్మణులు విష్ణు ధర్మపరాయణులు జంతువులకు కూడా ఏకాదశినాడు ఆహారము నీయరు. కావున నేనీ నాడు తినరానిదానినెట్లు తిందును? నా శరీరము క్షీణించలేదు. నాకు ఏ రోగము లేదు. అట్టి నేను బ్రాహ్మణుల మాటలతో విమార్గమున సంచరించి వ్రతమునెట్లు విడుతును? ఈ రాజ్యమును ధర్మాంగదుడు రక్షించుచున్నాడు. నేను రక్షణలేని వాడనుకాను. నాకు శత్రువెవ్వరూలేరు. కావున ఇట్లు తెలిసి విష్ణు వ్రతము ఆచరించు నాతో వ్రతభంగమును చేయు మాటలు మాట్లాడరాదు. చక్కగా పరిశీలించక బ్రాహ్మణులు ప్రాయశ్చిత్తమును బోధించినచో స్మృతిని అతిక్రమించిన పాపము బోధించిన బ్రాహ్మణులదే అగును. దేవతలు కాని, దానవులు కాని, గంధర్వులు, రాక్షసులు, సిద్ధులు, బ్రాహ్మణులు, స్వయముగా నా తండ్రి చెప్పిననూ, హరిహర బ్రహ్మలు, సూర్యుడు, లోకపాలకులు చెప్పిననూ ఏకాదశినాడు భుజించను. ఓ బ్రాహ్మణోత్తములారా? ప్రఖ్యాతి గాంచిన రుక్మాంగద మహారాజు ఎన్నడూ సత్యప్రతిజ్ఞను విఫలముగావించజాలడు. సూర్యుని తేజస్సు తరుగవచ్చును. హిమవంతుడు మారవచ్చును. సముద్రము ఇంకి పోవచ్చును. అగ్ని వేడిని విడుచును గాక. నేను మాత్రము ఏకాదశీ వ్రతమును వీడజాలను. ఈ మూడు లోకములలో ఇది ప్రసిద్ధము. నా రాజ్యమున పటహముతో గ్రామములలో, పట్టణములలో, ఇతరుల దేశములందు కూడా రుక్మాంగదుని రాజ్యమున ఏకాదశినాడు భుజించువారు సపుత్రులుగా దండించబడుదురు. వధించబడుదురు. దేశ బహిష్కృతులగుదురు. సర్వయజ్ఞ ప్రధానము, పాపనాశకము, ధర్మవర్ధకము, మోక్షప్రదము, అధర్మచ్ఛే దకము, తేజోనిధి, సర్వజన ప్రసిద్ధమగు శ్రీహరి వాసరమున భుజించరాదని ప్రకటించుచుండగా నేను భుజించినచో పాపకారినగుదును. నా పటహమునకు కూడా పాపము అంటును. నల్లని వస్త్రముతో కప్పబడును. ప్రాణి తాను సంపాదించుకొనిన కీర్తిని ప్రాణ భయముతోకాని పాపబుద్ధితో కాని స్వయముగా నశింపచేయువాడు క్రిమీదంశమను నరకమున అరువది యుగములు నివసించును. నా తల్లి నన్ను వ్యర్ధముగా ప్రసవించినది అగును. బ్రాహ్మణులు పితృదేవతలు నిరాశచెందెదరు. యమధర్మరాజు కూడా సంతోషించును. నా వ్రతభంగమును చిత్రగుప్తుడు వ్రాయును. శత్రుస్త్రీలకు ఆనందమును కలిగించువాడు పుట్టుక వ్యర్ధమే. చెడు కర్మచేయువాడు పాపమునందు ఆసక్తి కలవాడు, కుజాతి అందరిని నశింపచేయువాడు, అపవిత్రుడుగా నుండువాడు పరమ మూర్కుడు. వేద పురాణశాస్త్రములను గౌరవించనివాడు అంతకాలమున యమపురికి వెళ్ళును. వ్రతమును భంగపరచుకొనువాడు వాంతి చేసుకొనినదానినే మరల భుజించువానితో సమానము. పరమ పవిత్రమగు ఏకాదశినాడు భోజనము చేయమని చెప్పువారు వేదములను, శాస్త్రములను పురాణమును సత్పురుషులను స్మృతులను గౌరవించనివారు. అట్టివారు చేయు శ్రాద్ధముతో తృప్తిచెందరు. విష్ణుపదమును ప్రసాదించు ఏకాదశీ వ్రతమును ఆచరించవలదని మూర్ఖులు మాత్రమే చెప్పెదరు. అని ఇట్లు పలికిన రాజు మాటలను వినిన మోహిని మనసుమండగా, కోపముతో ఎఱ్ఱబారిన కనులుగలదై భర్తతో ఇట్లు పలికెను. నా మాటను పాటించనిచో ధర్మ బాహ్యుడవగుదువు. ధర్మ బాహ్యుడగు పురుషుడు ధూళి కణముతో సముడగును. ఇంకా చెప్పవలయునన్నచో ధూళికణము కన్న హీనమగును. ధూళికణములతో గర్తము పూరించబడును. కాని ధర్మ బాహ్యుడు గర్తమును త్రవ్వు వాడగును. నాకు వరమునిచ్చుటకు నాకిచ్చిన చేతిని కాదని నీ ప్రతిజ్ఞను నీవే పాలించనిచో నీ ధర్మమును పొందిన నేను కృతకృత్యురాలనై వెళ్ళిపోదును. ఇక నేను నీకు ప్రియమగు భార్యను కాను. నీవు నాకు భర్తవు కావు. ఇక నేను నా బాహువును నీకు ఉపధానముగా చేయజాలను. స్వ వాక్యమును లోపింపచేసి ధర్మ క్షయము చేయు నీకు నింద. నీ వంటి ధర్మలోపకారకుడు మ్లేచ్ఛులలో కూడా ఉండడు. సత్యమును తప్పి పాతకుడవగు నిన్ను ఈనాడు వదులుచున్నాను. మోహిని ఇట్లు పలికి త్వరతో లేచెను. హరుని విడిచి వెళ్ళు సతీ దేవివలె మోహినీ దేవి బ్రాహ్మణులతో కలిసి బయలుదేరెను. మద్యమును స్పృశించుట మేలుకాని ఇతని సంగము యుక్తము కాదు. నీలాంబరమును స్పృశించవచ్చును కాని ధర్మచ్యుతుడగు ఈ రాజుతో ఉండరాదు. ఇట్లుకోపించిన మోహిని పలుకుచు గౌతమాదులతో కలిసి ఇంటి నుండి బయటికి వెడలెను. ఓ తండ్రీ! ఓ జగన్నాథా! ఓ సృష్టి స్థితి లయములను చేయువాడా? అని బ్రహ్మ పుత్రిక ఆక్రోశించు చుండెను. ఇదే సమయమున ఉత్తమాశ్వము అధిరోహించి భూమండలము అంతయూ పర్యటించి ధర్మాంగద మహారాజు వచ్చెను. మాత్సర్యము లేనివాడై త్వరగా వినయముతో తల్లి ఎదుటపడెను. పితృవత్సలుడగు ధర్మాంగదుడు మోహిని మాటలను చెవులారా వినెను. మోహిని మాటలకు బ్రాహ్మణ వాక్యములు వంతపాడినవి. రుక్మాంగద పుత్రుడు ధర్మమూర్తి ఈగు రుక్మాంగద మహారాజు అశ్వమును దిగి తండ్రి పాదముల చెంతకు వెళ్ళి లేచి చేతులు జోడించి నమస్కరించెను. అంతలోనే కోపముతోనున్న మోహినిని చూచి త్వరగా చేతులు జోడించి ఇట్లు పలికెను. ఓ తండ్రి! ప్రియురాలా? నిన్నెవరు అవమానించిరి? ఏల కోపించితివి? ఈ బ్రాహ్మణులతో కలిసి ఎటకు బయలుదేరుచున్నావు? ధర్మాంగదుని మాటలను విని మోహిని ఇట్లు పలికెను. నీ తండ్రి అసత్య వాక్యుడు. వ్యర్థముగా నాకు చేయిచ్చెను. ఎంతో సుకృతమును చేసిన నీ తండ్రి రక్తాశ్లోకాకారముతో కదలక నిలిచెను. మీ తండ్రియగు రుక్మాంగదునితో నేను కలిసి ఉండదలచుకోలేదు.

ధర్మాంగద మహారాజు పలికెను: నీవు చెప్పిన దానిని నేను చేతును. ఓ తల్లీ! నీవు కోపించకుము. మరలిరమ్ము.

మోహిని పలికెను: ఓ పుత్రా! ఇట్టి శపథముతోనే ఉరాధిపుడగు శివుని సాక్ష్యముగా మందరా చలమున మీ తండ్రికి భార్యనైతిని. ఇపుడు నీ తండ్రియగు రుక్మాంగదుడు సత్యము నుండి భ్రష్టుడు అయ్యెను. నాకు ఈయవలసిన దానిని ఇచ్చుటలేదు. నేను కూడా అతని అభివృద్ధినే కాంక్షించుచున్నాను. నేను బంగారమును, ధాన్యమును, ఏనుగులను, అశ్వములను, గ్రామములను, వస్త్రములను కోరుటలేదు. నేను కోరిన అతనికి హాని కలిగించు దానిని కోరుటలేదు. కోరిక అతని దేహమునే ప్రీతి యుక్తము కావించును. నేనడిగినది అతని దేహారోగ్యమునే కాని మీ తండ్రి మోహముచే ఇచ్చటలేదు. అతని ఉపకారమునకు, అతని శరీరము కొరకు, అతని సుఖముకొరకు మాత్రమే కోరితిని, కాని మీ తండ్రి ఈనాడు సురాపాన తుల్యము, పరమ ఘోరమగు అసత్యమున నిలిచి ఉన్నాడు. సత్య భ్రష్టుని, నిష్ఠుర వాక్యములను మాటలాడువానిని, ధర్మమును వదిలిన వానిని, అసత్యశీలిని, శఠుని నీ తండ్రిని నేను వదులుచున్నాను. నేనతనితో ఉండజాలను. ఇట్లు మోహిని వాక్యములను వినిన ధర్మాంగదుడు ఓ తల్లీ! నేను బ్రతికి ఉండగా నా తండ్రి అసత్యవాది కాజాలడు, మరలిరమ్ము. నేను నీ కోరికను ఇప్పించెదను. నా తండ్రి ఇదివరకెన్నడూ అసత్యమును మాటాడలేదు. ఇక ఇపుడు నేను పుట్టిన తరువాత ఎట్లు అబద్ధమాడును. అతని సత్యముననే దేవాసుర మానవ లోకములు నిలిచి ఉన్నవి. నా తండ్రే యమలోకమును శూన్యమును చేసెను. నా తండ్రి కీర్తి బ్రహ్మాండ మండలమువరకు వ్యాపించియున్నది. అట్టి రాజు ఎట్లు అబద్ధము ఆడగలడు? నా తండ్రి మాటను వినకనే పరోక్షముగా నేనెట్లు విశ్వసింతును? నా మీద దయ నుంచి తిరిగి రమ్ము. ఇట్లు ధర్మాంగదుని మాటలను వినిన మోహిని ధర్మాంగదుని భుజము పట్టు కొనిమరలెను. సూర్యతేజస్కుడగు రుక్మాంగద మహారాజు మృతకల్పునిగా పరుండియున్న ప్రదేశమునకు వచ్చెను. ఆ బంగారు శయ్యమీద దీపరత్నములతో ప్రకాశించుచుండగా పగడములు పొదిగియున్న ఉత్తమమగు, వజ్రఖచిత పాదములచే శోభించుచున్న, కోమలమగు, దీర్ఘవిస్తారయుక్తమగు, సాటిలేని మనోహరమగు పర్యంకమున మోహినిని కూర్చుండబెట్టి చేతులు జోడించి తండ్రితో ఇట్లు పలికెను. ఓ తండ్రీ! ఈ నా తల్లి నిన్ను అసత్యవాక్యుడవు అనుచున్నది. నీవు ఎందుకు అసత్య వాదివి అగుచున్నావు. కోశరత్న సమన్వితము, గజాశ్వరధ సంయుతము అగు రాజ్యమును పాలించు నీవు ఏడు సముద్రములచే చుట్టబడిన భూమండలమునకు అధిపతివి. నీవు ప్రతిజ్ఞ చేసినదంతయూ ఈమెకు ఇమ్ము. నేను ధనుర్ధారినై ఉండగా నీకు అపకారమును ఎవడు చేయగలడు? ఈమెకు ఇంద్రపదవిని ఇమ్ము. ఇంద్రుని నేను జయించెదను. యోగీ గమ్యము నిరంజనము అగు బ్రహ్మసాయుజ్యమును కూడా నేను తపస్సుచే బ్రహ్మకు ప్రీతిని గావించి ఇచ్చెదను. నా తల్లి భూమిలో కాని రసాతలమునకాని, స్వర్గమునకాని, పరలోకమునకాని దేనిని కోరిననూ, నరదానవులను యుద్దమున గెలిచి ఈయగలవాడను. ఓ రాజా? నేను నీకు దాసుడను. నీవు కోరినచో నన్ను గడ్డిపోచకు అమ్ముము. నన్ను చండాలునకు అమ్ముము. అతని పనిచేయుచు అతని వద్ద ఉండగలను. మూడు లోకములలో దుష్కరమైనదేదియూ లేదు. ఈయరానిదైనను ఈమె కిమ్ము. నా జీవితమును నా తల్లి జీవితమును కాని ఇమ్ము. నీవు ఇదివరకున్న సత్కీర్తిచేతనే విరాజిల్లుము. సూర్యుడు తన కిరణములచే లోకములను ప్రకాశింపచేయును. కీర్తి భంగ మైనచో పాపము వచ్చును. ప్రజానాశము జరుగునని మనువు నిజమునే చెప్పెను. నీ స్వచ్ఛమగు కీర్తిని తుడిచివేసి నేనెట్లు సంతోషముతో ఉండగలుగుదును. (II/25)