నారద మహా పురాణము
దీక్షావిధి
సనత్కుమార మహర్షి పలికెను: ఇపుడు జీవుని పాశబంధనచ్ఛేదనమును చేయు, ఇష్టసిద్ధిని కలిగించు, మంత్రసామర్ధ్యదాయకమగు దీక్షావిధిని చెప్పెదను. దివ్యభావమును ఇచ్చునది, దురితములను క్షయింపచేయునది కావున సర్వాగమ విశారదులు దీక్ష అనుచున్నారు. మననమనగా సర్వార్ధవేదిత్వము, త్రాణమనగా సంసారులను అనుగ్రహించుట. మననము చేయుట రక్షాధర్మము కలిగి యుండుట వలన మంత్రము అనబడుచున్నది. ఈ మంత్రములు స్త్రీ పుంనపుంసక రూపములుగా మూడు విధములు ఉండును. రెండు అకారములు అంతమందుగల మంత్రములు మంత్రములు. హుంఫట్ అనునది అంతమందు కలవి ‘పుం’ మంత్రములు. ‘నమః’ అను పదము అంతమందు కలవి క్లీబ మంత్రములు. ‘పుం’ దైవతములు మంత్రములని, స్త్రీ దైవతములు విద్యలని అనబడుచున్నవి. ఈ రెండు షట్కర్మలలో ప్రశస్తములు. ఈ మంత్రములు మరల మూడు విధములు. ‘లూణాంత్య’రేఫలు గలవి. స్వాహాకారములు కలవి ఆగ్నేయములుగా చెప్పబడుచున్నవి. భగుషీయూష బీజమంత్రములు సౌమ్యములు అనబడుచున్నవి. అనగా సోమదేవతాత్మక మంత్రములు. ఇట్లు మంత్రములు అగ్నిష్టోమాత్మకములని పండితులు తెలియుదురు. వాయువు పింగళనాడిని ఆశ్రయించినపుడు ఆగ్నేయమంత్రములు జాగృతములగును. సోమదేవతాక మంత్రములు వాయువు వామభాగనాడులను ఆశ్రయించు నపుడు మేల్కొనును. వాయువు నాడిద్వయమును ఆశ్రయించినపుడు అన్ని మంత్రములు ప్రబుద్ధములగును. మంత్రము నిద్రించియున్నపుడు జపించుటవలన అనర్ధ ఫలమును కలిగించును. ప్రత్యేక మంత్రమును ఉచ్చరించి సవ్యములను ఉచ్చరించవలయును. అనులోమమున బిందుయుక్తములనుగా, విలోమమున విసర్గ యుక్తముగా జపించినచో ఆ మంత్రము ప్రబుద్ధమై శీఘ్రసిద్ధి ప్రదమగును. ఇట్లు ఈ మాలచే జపించినచో దుష్టమంత్రముకూడా సిద్ది నొసంగును. క్రూర కర్మలయందు అగ్ని మంత్రములను, సౌమ్య కర్మలయందు సోమ మంత్రములను జపించవలెను. శాంతములు రౌద్రములు అని మంత్రములు రెండు విధములు. శాంత మంత్రమైనను, హుంఫట్ అనుదానిని చేర్చినచో రౌద్రత్వమును పొందును. భిన్నాది దోషయుక్తములైన మంత్రములు సాధకుని రక్షించజాలవు. భిన్నము, రుద్ధము, శక్తిహీనము, పరాఙ్ముఖము, కర్ణహీనము, నేత్రహీనము, కీలితము, స్తంభితము, దగ్ధము, ప్రస్తము, బీతము, మలినము, తిరస్కృతము, భేదితము, సుషుప్తము, మదోన్మత్తము, మూర్ఛితము, హతవీర్యము, భ్రాంత సంజ్ఞము, ప్రధ్వస్తము, బాలకము, కుమారము, యువా, ప్రౌఢము, వృద్ధము, నిస్త్రింశకము, నిర్భీజము, సిద్దిహీనము, మందము, కూటము, నిరంశకము, సత్త్వహీనము, కేకరము, బీజహీనము, ధూమితము, ఆలింగితము, మోహితము, క్షుధార్తము, అతిదీప్తకము, అంగహీనము, అతిక్రుద్ధము, అతిక్రూరము, వ్రీడితము, ప్రశాంత మానసము, స్ధానభ్రష్టము, వికలము, అతివృద్ధము, అతినిస్స్నేహము, పీడితము అని ఇవి నలుబది తొమ్మిది దోషములు. ఇపుడు ఈ దోషముల లక్షణములను చెప్పెదను. సంయుక్తము కాని వియుక్తము కాని మూడు విధముల స్వరములచే సంయుతమైనది మంత్రము యొక్క ఆదిమధ్యాంతములలో వహ్ని బీజము చెప్పబడినచో, ఈ బీజము కూడా నాలుగు విధములుగా కాని అయిదు విధములుగా కాని చెప్పినచో ఆ మంత్రము భిన్నమనబడును. మంత్రము యొక్క ఆదిమధ్యాంతములలో రెండు భూబీజములు చెప్పబడినచో ఆ మంత్రము రుద్ధమనబడును. అతి కష్టముచే సిద్ధి నొసంగును. తారవర్మ త్రయము, లక్ష్మి లేని మంత్రము శక్తి హీనమనబడును. చాలా కాలమునకు ఫలము నొసంగును. ముఖమున కామబీజము, అంతమున మాయ అంకుశమున్నచో పరాఙ్ముఖ మనబడును. ఈ మంత్రము భజించువారికి చాలా కాలమునకు సిద్ధినిచ్చును. ఆది మధ్యాంత భాగములయందు సకారము కనపడినచో ఆ మంత్రము బధిరము అనబడును. చాలా కష్టముచే అల్ప ఫలమును ఇచ్చును. అయిదు అక్షరములు కలిగి, రేఫార్క బిందువులు లేని విగ్రహము కలదైనచో నేత్రహీనము అనబడును. కష్టపడినను సిద్ధి నొసంగదు. ఆది మధ్యాంతములలో హంసము ప్రాసాదవాగ్భవములు, హునేందువుకాని నకారముకాని, ఫకారము కాని వర్మకాని మాప్రా, నమామి అను పదములు లేని మంత్రము కేలితము అనబడును. మధ్యభాగమున ద్వయము, మూర్ధస్థానమున అస్త్రలకారములులేని మంత్రము స్తంభితమనబడును. సిద్ధిని అరికట్టును, మంత్రము యొక్క మూర్ధ భాగమున పవనసంయుక్తమగు అగ్ని వర్ణములుండి, సార్ణముగా ఉన్నచో దగ్ధము అనబడును. అస్త్రము, రెండు, మూడు, ఆరు, ఎనిమిది అక్షరములు కలదిగా ఉండినచో ఆ మంత్రము తంత్రము అనబడును. ఈ మంత్రము యొక్క ముఖము తారవర్ణితముగా ఉండును. హకారము శక్తిగా ఉన్న మంత్రము భీతము అనబడును. ఆదిమధ్యాంత భాగమున నాలుగు మకారములు ఉన్నచో మలినము అనబడును. అతిక్లేశమున సిద్ధి కలుగును. మంత్రమధ్యము దార్ణముగా నుండి, మూర్ధభాగమున క్రోధయుగము, అస్త్రము ఉన్నచో తిరస్కృతము అనబడును. ద్వయము హృదయము, శీర్షమున, మధ్యభాగమున వషట్ ఔషట్ కలది భేదితము అనబడును. అతిక్లేశముచే ఫలమును ఇచ్చును. కావున భేదితమును విడువవలెను. మూడు అక్షరములు కలిగి హంస హీనమైది సుషుప్తము అనబడును. విద్యకాని మంత్రము కాని పదిహేడక్షరములు కలదిగా నుండవలెను. పట్కారపంచకము ఆది యందు కలది మదోన్మత్తము అనబడును. మధ్యభాగమున అస్త్రము కల మంత్రము మూర్చితము అనబడును. విరామస్ధానమున అస్త్రమున్నచో హతవీర్యము అనబడును. మంత్రము యొక్క ఆదిమధ్య భాగములలో మూర్దభాగమున నాలుగస్త్రములుండి పదునెనిమిది అక్షరములు కల దానిని భ్రాంతము అందురు. ఇరువది వర్ణములు కలిగి స్వరసంయుతమై హృత్ ల్లేఖ అంకుశ బీజాఢ్యముగా ఉన్నచో దానిని ప్రధ్వస్తము అందురు. ఏడక్షరములుగలది బాలమంత్రము. ఎనిమిది అక్షరములు కలది కుమార మంత్రము. పదునారక్షరములు కలది యువమంత్రము. నలుబది యక్షరములు కలది ప్రౌఢ మంత్రము. ముప్పది, అరువది నాలుగు, నూరు, నాలుగువందలు అక్షరములుకల మంత్రము వద్ద మంత్రము. తొమ్మిది అక్షరములు కలిగి తారయుక్తమైనచో నిస్త్రింశము అనబడును. అంతమున హృదయము, మధ్యన శోరోమంత్రము, అంతమున శిఖా, వర్మము, నేత్రము, అస్త్రము కలిగి, శివశక్తి కాని అర్జముకాని లేని మంత్రము నిర్చీజము అనబడును. అద్యంతమధ్య భాగములలో ఫట్కారము ఆరు విధములుగా కనబడినచో సిద్ది హీనము అనబడును. పంక్త్యక్షరములు కలమంత్రము మందము అనబడును. ఏకాక్షర మంత్రము కూటము అనబడును. దానినే నిరంకుశమందురు. రెండు అక్షరములు కలది సత్త్వహీనము అనబడును. నాలుగు అక్షరములు కలది కేకరము. ఆరక్షరములు కలది బీజహీనము. ఏడున్నర అక్షరములు కలది కూడా బీజహీనమే. పన్నెండున్నర అక్షరములు కలది ధూమితము అనబడును. ఇది అతినిందితము. మూడున్నర బీజములుకలిగి ఇరువది, ఇరువది యొకటి, ముప్పది వర్ణములుకల మంత్రము ఆలింగితము అనబడును. దంతవర్ణములుకల మంత్రము మోహితము అనబడును. ఇరువది నాలుగు, ఇరువదియేడు వర్ణములు కల మంత్రము క్షుధార్తము అనబడును. ఈ మంత్రము సిద్ధికారకము కాదు. పదకొందు, ఇరువది యైదు, ఇరువది మూడు వర్ణములు కల మంత్రము దృప్తము అనబడును. ఇరువది ఆరు అక్షరములు కలది కాని ముప్పది ఆరు వర్ణములు కలదికాని, ఇరువది తొమ్మిది వర్ణములుగల మంత్రము హీనాంగకము అనబడును. ఇరువది యెనిమిది, ముప్పది యొకటి వర్ణములుకల మంత్రము అతి క్రూరము అనబడును. ఇది అన్ని కర్మలలో నిందితము. నలుబది నుండి ఆరువది మూడు వర్ణములుగల మంత్రము వ్రీడితమనబడును. ఈ మంత్రము అన్ని కర్మలలోను ఉపయుక్తము కాదు. అరువది ఐదు అక్షరములుకల మంత్రములు శాంత మానసములు అనబడును. అరువదియైదు నుండి తొమ్మిది అక్షరముల వరకు గల మంత్రములు వికలములు అనబడును. నూరు, నూట యాబది, రెండు నూర్లు, తొంబది రెండు, తొంబది యొకటి, మూడు నూర్లు వర్ణములు గల మంత్రములు నిస్స్నేహములు అనబడును. నాలుగు నూర్లనుండి వేయి వర్ణముల వరకుగల మంత్రములు అతివృద్ధములు అనబడును. ఈ మంత్రములు ప్రయోగదశయందు శిథిలములగునని చెప్పబడినది. వేయి కంటే ఎక్కువ వర్ణములుగల మంత్రములు పీడితములు అనబడును. ఇంకా అధిక వర్ణములుగల మంత్రములు స్తోత్ర రూపములు. ఇట్లు మంత్రములు దోషయుక్తములని చెప్పబడినవి. ఈ దోషములను తెలియక మంత్రములను జపించువారలు కల్పకోటి శతములలో కూడ సిద్ధిని పొందజాలరు. భిన్నాది దోషములుగల మంత్రములను సాధించు విధానమును చెప్పెదను.
యోని ముద్రాసనమున కూర్చొని సావధానమనస్కుడై యే మంత్రమును జపించిననూ అన్ని సిద్ధులు కలుగును, ఎడమమడిమను గుదమున ఉంచి, కుడిమడిమను ధ్వజముపై ఉంచి కూర్చొనుట యోనిముద్రాబంధమనబడును. ఇది ఉత్తమ ఆసనము. ఈ యోనిముద్రాబంధమున మరియొక విధానము కూడా కలదు. ఆ విషయమును రహస్యములతో ముందు చెప్పగలను. పారంపర్య క్రమముగా పొందినవాడు, నిత్యానుష్ఠాన తత్పరుడు, గుర్వనుజ్ఞను పొందినవాడు, సంపద్యుక్తుడు, అభిషేకము చేయువాడు, సుందరుడు, సుముఖుడు, శాంతుడు, సత్కులజుడు, సులభుడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, మంత్రతంత్రార్ధ తత్త్వములు తెలిసినవాడు, నిగ్రహానుగ్రహ సమర్ధుడు అశలేని వాడు, ముని, అంతరింద్రియ నిగ్రహము కలవాడు, హితమును పలుకువాడు, వివేకము కలవాడు, తత్త్వమును తేల్చి చెప్పుటలో సమర్ధుడు, వినయముగలవాడు, సజ్జనులను సేవించువాడు, ఆశ్రమవాసి, ధ్యాననిరతుడు, సంశయములను ఛేధించగలవాడు, మంచి బుద్ధికలవాడు, నిత్యానుష్ఠానము కలవాడు, ఆచార్యుడుగా చెప్పబడును. శాంతుడు, వినయము కలవాడు, పరిశుద్ధాత్ముడు, సర్వలక్షణ సంయుతుడు, శమాది సాధనములు గలవాడు, శ్రద్ధకలవాడు, స్థిరమైన సంకల్పము కలవాడు, శుద్దమైన దేహము కలవాడు, శుద్ధమైన అన్నపానములు కలవాడు, ధార్మికుడు, పరిశుద్ధ మనస్కుడు, ధృఢవ్రతము గలవాడు, కృతజ్ఞుడు పాపభీతి కలవాడు, గురుధ్యానమునందు, స్తోత్రమునందు కథా సేవనమునందు ఆసక్తి కలవాడు శిష్యుడు కావలయును. అట్లు కానివాడు గురువునకు దుఃఖమును కలిగించువాడు అగును. (3/64)