పితాపుత్ర సంవాదము

వసిష్ఠ మహర్షి పలికెను: రుక్మాంగద మహారాజు చిరునవ్వుతో బల్లిని పాపము నుండి విముక్తురాలను చేసి మోహినితో త్వరగా అశ్వమును అధిరోహించుము అనెను. ఈ అశ్వము శ్రీ కృష్ణుని అశ్వమువలె క్షణములో పదివేల యోజనముల దూరము వెళ్ళును అని చెప్పగా మదలాలసయగు మోహిని రుక్మాంగద మహారాజు మాటలను విని వాయువేగముల అశ్వమును భర్తతో కలిసి అధిరోహించెను. అందమైన చిరునవ్వుగల మోహిని భర్తతో ఇట్లు పలికెను. ఓ రాజా! ఈ అశ్వమును నీ నగరమునకు సాగించుము. నీకు పుత్రుని ముఖమును చూడవలయునను ఉత్కంఠ అధికముగా ఉన్నది. నేను నీ యధీనమున ఉండుదానను. నీకు నచ్చిన ప్రదేశమునకు గొని పొమ్ము! మోహినిమాటలను వినిన రాజు నగరమునకు బయలుదేరెను. సంతోషముచే వృక్షములను, పర్వతములను, నదులను, విచిత్రములగు వనములను, పలువిధములగు మృగములను, గ్రామములను, దుర్గములను, దేశములను, నగరములను, విచిత్రములగు సరస్సులను, మనోహరములగు భూభాగములను, చూచుచు త్వరలో వామదేవ మహర్షి ఆశ్రమమును చూచి, త్వరలోనున్న రాజు ఆకాశము నుండియే వామ దేవునకు నమస్కరించి, మరల వాయు వేగముతో వెడలసాగెను. దారిలో ధనధాన్య సమృద్ధములగు పలు ప్రదేశములను చూచుచు, తన అధీనములో ఉన్న విదిశానగర ప్రాంతమును చేరెను. అంతట చారులచే రుక్మాంగద మహారాజు రాకను తెలిసిన ధర్మాంగదుడు సంతోషముతో తోటి రాజులను చూచి ఇట్లు పలికెను. ఓ రాజవర్యులారా? ఉత్తరదిక్కు నుండి వెలుగు వచ్చుచున్నది. ఆ వెలుగు నా తండ్రిగారి అశ్వమునకు సంబంధించినది. కావున మనమందరము రాజుగారికి అభిముఖముగా వెళ్ళెదము. వచ్చుచున్న తండ్రి ఎదుటకు వెళ్లని పుత్రుడు పదునల్గురు ఇంద్రుల కాలము నరకమున నివసించును. వచ్చుచున్నతండ్రి అభిముఖమునకు వెళ్ళు పుత్రునకు ప్రతిక్షణము యజ్ఞఫలము లభించునని పౌరాణిక ద్విజులు చెప్పి ఉండిరి. కావున రండు. నాపాలిట దేవదేవుడగు పితృదేవునికి నమస్కరించుటకు మీతో కలిసి వెళ్ళెదను అని పలుకగా ఆ రాజులందరూ అట్లేయని లేవగా వారందరితో కలిసి కాలినడకన ఒక కోను దూరము వెళ్ళెను. రాజ సహస్రముతో కూడి ధర్మాంగదుడు రూపుదాల్చిన మన్మథునివలె ప్రకాశించుచు చాలా దూరము నడిచి, దారిలో తండ్రిని చేరుకొనెను. తండ్రిని చేరుకొని రాజులందరితో కలిసి భూమిపై పడి తండ్రికి సాష్టాంగ ప్రణామము ఆచరించెను. ప్రేమతో వచ్చి రాజులతో కలిసి నమస్కరించుచున్న పుత్రుని చూచి, అశ్వము నుండి దిగి, పుత్రుని లేపి దృఢమగు భుజములతో ఆలింగనము చేసుకొని, శిరస్సును మూర్కొని పుత్రునితో ఇట్లు పలికెను. ఓ కుమారా? ప్రజలందరిని చక్కగా పరిపాలించుచున్నావా. శత్రువులను దండన చేయుచున్నావా? న్యాయముగా వచ్చు ధనముతో కోశమును నింపుచున్నావా? బ్రాహ్మణులయందు తరగని భక్తిని చూపుచున్నావా? నీ స్వభావము అందరికి ప్రియముగా ఉన్నదా? పరుషముగా మాటలాడుట లేదు కదా? చండాల గృహమున ఆవులకు పాలు పితుకుటలేదు కదా? రాజ్యమున పుత్రులు తండ్రి మాటను వినుచున్నారా? కోడలు అత్తగారి ఆజ్ఞను, భార్య భర్త ఆజ్ఞను పాటించుచున్నదా? బ్రాహ్మణులతో వివాదమునకు దిగుటలేదు కదా? ఆవులను పలువిధముల తృణములను భక్షించునపుడు అడ్డగించుట లేదుకదా? అన్నాదులను సిద్ధముచేయు పదార్థములను తూచు పరికరములు కొలచుపరికరములు సక్రమముగా ఉన్నవో లేవో చూచుచున్నావా? బహుసంతాన వతులను పన్నులతో బాధించుట లేదుకదా? నీ రాజ్యమున ద్యూతపానాది దుర్వ్యసనములు లేవుకదా? నీపురమున మతిభేదముతో, రుచిభేదముతో, వాక్యభేదములతో, దాన లబ్ధ పదార్థములతో, జీర్ణవస్త్రములతో ప్రజలు జీవించుటలేదు కదా? నీవు స్వయముగా పర్యవేక్షించుచు హయాశ్వములను కాపాడుచున్నావా? నీ తల్లులు అందరిని సమానముగా చూచుచున్నావా? శ్రీహరి వాసరమున మానవులు భుజించుటలేదుకదా? రాత్రి కాలమున ఎవరూ శ్రాద్ధమును ఆచరించుట లేదుకదా? అపర రాత్రియందు నిద్రించుట లేదు కదా? నిద్ర అధర్మమునకు మూలము. నిద్రయే పాపమును పెంచును. నిద్ర దారిద్ర్యమును కలిగించును. నిద్రయే అన్ని శ్రేయస్సులను నశింప చేయును. నిద్రను ఎక్కువగా పొందురాజు చాలా కాలము ప్రజలను పాలించజాలడు. పుంశ్చలివలె నిద్ర రాజునకు ఇహపరములను నశింపచేయును అని ఇట్లు పలుకుచున్న తండ్రిని గూర్చి పుత్రుడగు ధర్మాంగదుడు పలుమార్లు నమస్కరించుచు ఇట్లు పలికెను. ఓ తండ్రీ! మీరు చెప్పినవన్నీ చేసితిని. ఇక ముందు కూడా చేయగలను. ఈ జగత్త్రయమున తండ్రి మాటలను పాటించు పుత్రులు ధన్యులు. తండ్రి మాటలను అతిక్రమించుట కంటే గొప్ప పాతకము మరొకటి లేదు. తండ్రి మాటను అతిక్రమించి గంగానదీ స్నానము ఆచరించిననూ, గంగాస్నాన ఫలము లభించదు. నా శరీరము, నా జీవితము, నా ధర్మమూ మీ అధీనము. మీరే నాకు పర దైవము. మూడు లోకము లను దానము గావించిననూ తండ్రి ఋణము తీరదు. అయినపుడు దేహముతో, ధనముతో, క్లేశ దానములతో ఎట్లు తీరును? అని ఇట్లు చాలామంది రాజులతో కూడి పలుకుచున్న పుత్రుని రుక్మాంగద మహారాజు మరల అలింగనము చేసుకొని, ఇట్లు పలికెను: ధర్మమును తెలిసిన నీవు సత్యమునే పలికితివి. పుత్రునకు తండ్రిని మించిన దైవములేదు. తండ్రిని అవమానించు పుత్రునకు దేవతలు పరాఙ్ముఖులు అగుదురు. కావున ఇప్పుడు నీవు సప్తద్వీపవతియగు భూమిని గెలిచితివి. ఈ భూ మండలమున తండ్రిని మించిన తనయు ఉండుటయే అధికసౌఖ్యము. ఇదియే మానవులకు స్వర్గ ప్రదము. కావున ఈనాడు సద్గుణముల రాశివై సద్ధర్మపాలకుడవై నీవు రాజులను గెలిచి, హరివాసరమును చక్కగా పాలింప చేయుటచే నేను ధన్యుడనైతివి. ఇట్లు తండ్రి పలికిన మాటలను విని ధర్మాంగదుడు ఇట్లు పలికెను. ఓతండ్రీ! నా యందు రాజ్యసంపదల నుంచి మీరు ఎటు వెళ్ళితిరి. పదివేల సూర్యుల ప్రకాశముగల ఈ యువతి ఎచట లభించినది? ఈ యువతిని సృష్టించి బ్రహ్మ సంతృప్తి పొంది ఉండును అనుకొందును. ఈ మూడు లోకములలో ఇటువంటి రూపముకల యువతి లేదు. ఈమె పార్వతి వంటిది. లేదా లక్ష్మీదేవి వంటిది అనుకొనుచున్నాను. లేక మయుని మాయయే రూపు దాల్చివచ్చియుండును. ఇంతటి రూపసిని నిర్మించిన బ్రహ్మ చక్కని నిపుణుడు. ఈమెలో నూరవ అంశమును నిర్మించినవాడు కూడా చతురుడే యగును. ఇతరులు చేయలేరు. ఈ స్వర్ణ కాంతులను విరజిమ్ముసుందరి మీ ఇంటిలో ఉండదగినది. ఈ సుందరి నాకు తల్లి అగుచో నాకంటే ధన్యుడగు పుత్రుడు ఈ ముజ్జగములలో మరియొకడు ఉండడు. (II/15)