ద్వితీయావ్రత కథనము

సనాతన మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా ! ఇప్పుడు నీకు ద్వితీయావ్రతములను చెప్పెదను. ఈ వ్రతములను ఆచరించినచో మానవుడు బ్రహ్మలోకమున ఆనందించును. చైత్రశుద్ధ విదియనాడు శక్తి యుక్తుడగు బ్రహ్మను హవిష్యాన్నముచే, గంధాదులచే సర్వయజ్ఞసముద్భూతిని స్తుతించి పూజించి ఇహలోకమున సర్వకామములను అనుభవించి అంతమున బ్రహ్మలోకమును పొందును. ఈ దినమున అశ్వినీ దేవతలను భక్తిచే పూజించి, బ్రాహ్మణునకు బంగారు వెండి నేత్రములను దానము చేయవలయును. ఈ పూర్ణయాత్రా వ్రతమున పెరుగుతో కాని నేయిచే కాని పన్నెండు సంవత్సరములు నేత్ర వ్రతమును ఆచరించినచో భూపతి కాగలడు. చక్కని రూపసి, శత్రు సంహారకుడు, ధర్మాభిరాముడు, రాజముఖ్యుడు కాగలడు. వైశాఖ శుద్ధ ద్వితీయనాడు విష్ణు రూపియగు బ్రహ్మను సప్తధాన్యములలో నుంచిన కలశముపై యధావిధిగా పూజించి ఇహలోకమున మనసుకు నచ్చిన భక్ష్య భోగములను అనుభవించి అంతమున విష్ణు లోకమును పొందును. జ్యేష్ఠ శుద్ధ ద్వితీయనాడు భువనాధిపతియగు సూర్య భగవానుని చతుర్వక్త్ర స్వరూపుని యధావిధిగా పూజించి భక్తిచే బ్రాహ్మణులకు భోజనము పెట్టిన సూర్య లోకమును పొందును. ఆషాఢశుద్ధ ద్వితీయ పుణ్య సహిత. ఆ దినమున రథమును సిద్ధముచేసి సుభద్రాసహితుడగు బలరాముని బ్రాహ్మణులచే కలిసి నగరమున తిప్పి జలాశయ సమీపమునకు వెళ్ళి మహోత్సవమును చేయించవలెను. తరువాత దేవుని ఆలయమున యథావిధిగా ఉంచి బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. శ్రావణ శుక్ల ద్వితీయనాడు ప్రజాపతియగు విశ్వకర్మ నిదురించునని ఆ తిధికి అశోకశయన అని పేరు. శయ్యపైనున్న శక్తి సహితుని చతుర్ముఖుని పూజించి జగత్పతికి నమస్కరించి ఈ మంత్రమును పఠించవలెను. శ్రీ వత్సధారీ ! శ్రీకాంత ! శ్రీనివాసా ! శ్రీపతీ ! ప్రభూ ! ధర్మార్థ కామద ! నాకు సంసార నివృత్తి కలిగించుము. ఇచట సర్వసిద్ధి ప్రదాయకమగు చంద్రార్థ దానము చెప్పబడినది. భాద్రపద శుద్ధ విదియనాడు ఇంద్ర రూపియగు జగత్ప్రభువును యధావిధిగా పూజించి సర్వయజ్ఞ ఫలమును పొందవచ్చును. ఆశ్వయుజ శుక్ల ద్వితీయ పరమ పవిత్రమైనది. ఈ దినమున చేసిన దానము అనంత ఫలమునిచ్చును. కార్తీక శుద్ధ విదియనాడు యమునికి చెల్లెలగు యమున తన ఇంటిలో భోజనము పెట్టెను. కావున ఈ ద్వితీయకు యమ ద్వితీయా అనిపేరు. ఈ దినమున చెల్లెలు ఇంటిలో భోజనము చేసినచో పుష్టి కలుగును. భోజనము చేసిన తరువాత సోదరికి వస్త్రాభరణములను ఈయవలెను. యమున యమ ధర్మరాజునకు సోదర ప్రేమతో స్వహస్తముతో భోజనము చేయించిన ఈ ద్వితీయనాడు సోదరి ఇంటిలో భోజనమును చేసినవాడు ధన ధాన్య సంపత్సమృద్ధిని పొందును. మార్గశీర్ష శుద్ధ ద్వితీయనాడు శ్రద్ధతో పితృ దేవతలను పూజించవలెను. ఇట్లు చేసినచో పుత్ర పౌత్రులతో ఆరోగ్యముతో విలసిల్లును. పుష్యశుక్ల ద్వితీయనాడు గోశృంగోదకముతో మార్జనము చేసికొని బాలేందు దర్శనమును చేయవలెను. ఈ దినమున బాలచంద్రుని ఇంద్రియ నిగ్రహముకలవాడై హవిష్యమును మాత్రమే భుజించుచు అర్ఘ్యమునిచ్చి పూజించినచో ధర్మకామార్థములు సిద్ధించును. మాఘశుక్ల ద్వితీయనాడు భానురూపుడగు ప్రజాపతిని యధావిధిగా పూజించి ఎఱ్ఱని పూవులచే పూజించవలెను. అట్లే రక్త చందనముతో, శక్తిని అనుసరించి స్వర్ణమూర్తిని చేసి పరిపూర్ణమగు తామ్ర పత్రమును గోధుమలతోకాని తండులములచేకాని భక్తిచే దేవునికి సమర్పించి ఆ దేవతా మూర్తిని బ్రాహ్మణునకు దానము చేయవలెను. ఇట్లు వ్రతమును ఆచరించినచో సాక్షాత్తుగా ఉదయించిన సూర్యునివలె. చూడ శక్యముకాని తేజము కలవాడై ప్రకాశించును. ఇహలోకమున అభీష్ఠ భోగములను అనుభవించి అంతమున బ్రహ్మలోకమును పొందును. ఇక ఫాల్గుణ శుద్ధ ద్వితీయనాడు సువాసనగల తెల్లని పూవులచే శివుని పూజించి, శుభములగు శ్వేత పుష్పములతో శయ్య మర్చి ధూప దీప నైవేద్యములతో నీరాజనాదులతో చక్కగా పూజించి ప్రసన్నుని చేసి సాష్టాంగ ప్రణామమును చేయవలెను. ఇట్లు శివుని పూజించిన మానవుడు రోగవర్జితుడై ధనధాన్య సమృద్ధికలవాడై నూరు సంవత్సరములు జీవించును. ఇట్లు శుక్ల ద్వితీయలలో చెప్పిన విధానముచే కృష్ణద్వితీయల యందు కూడా ఆచరించవలెను. అగ్నిహోత్రుడే ఆయా నెలలో వేరువేరు రూపములను ధరించి ద్వితీయా తిధులందు పూజించబడుచుండును. ఈ వ్రతములలో బ్రహ్మచర్యాది నియమములను పూర్వమువలెనే ఆచరించవలెను. (4/111)