నారద మహా పురాణము
హనుమచ్చరిత్రము
సనత్కుమార మహర్షి పలికెను: ఇక ఇప్పుడు పాపనాశకమగు వాయుపుత్రుని చరితమును చెప్పెదను. ఆనందవనవాసియగు రాముడు చెప్పినది ఈ చరితము. మహా కల్పమున ప్రసిద్ధ బలుడగు హను మంతుడు సద్యోజాతుడాయెను. నాకు శ్రీరామచంద్రునిపై భక్తి ఎల్లప్పుడూ ఉండనిమ్ము. ఈ చరితము వినువారికి చదువువారికి పాపనాశకము. నేనెప్పుడూ వానర రూపుతో ఉన్న హనుమంతునిచే సంగమమును కోరుచున్నాను. ఆనందవనమున ఏకాంతములో రహస్యమగు ఈ వృత్తాంతమును చెప్పెను. ఇచట అంతటా చింతా రహితులగు సఖీజనము స్నేహితుడు ఎల్లప్పుడూ రహస్యముగా ఏకాంతముగా క్రీడించుచుందురు. ఒకానొక నా అవతారమున జరిగిన ఒక రహస్యమును ఇచట నీకు సంతోషముతో ప్రకాశింపచేయుచున్నాను. పూర్వ కాలమున నేను దశరథ మహారాజుగారింటిలో చతుర్వ్యూహాత్మకముగా దశరథుని భార్యాత్రయమున ఆవిర్భవించితిని. తరువాత కొన్ని సంవత్సరము లకు బ్రాహ్మణోత్తముడగు విశ్వామిత్రుడు వచ్చి నా తండ్రిని యక్షరాక్షస సంహారమునకు లక్ష్మణునితో కూడిన నన్ను యాచించెను. నా తండ్రి నన్ను విశ్వామిత్రుని వెంట సిద్ధాశ్రమమునకు పంపెను. నేను విశ్వామిత్ర మహర్షి ఆశ్రమమునకు వెళ్ళి ఆ ఆయాశ్రమమును కలుషితమును చేయుచున్న సుబాహుమారీచుల బాధను తొలగించితిని. అపుడు విశ్వామిత్రమహర్షి ఆశ్రమమునకు వెళ్లి ఆ యాశ్రమమును కలుషితమును చేయుచున్న సుబాహుమారీచుల బాధను తొలగించితిని. అపుడు విశ్వామిత్రమహర్షి నాయెడ ప్రసన్నుడాయెను. నాకు అస్త్రవిద్యను ప్రసాదించెను. ఒకనెల అచటనే ఉంచుకొనెను. తరువాత మహానుభావుడగు విశ్వామిత్రమహర్షి భవిష్యత్తును తెలుసుకొని నన్ను మిథిలానగరమునకు తీసుకొని వెళ్లెను. శివుని ధనువును చూపెను. నేను ఆ సభలో ఆ శివధనువును భగ్నము గావించి సురసుతోపమయగు జనకమహారాజ పుత్రియగు సీతను పణభూతను భార్యగా పొందితిని. తరువాత మార్గమధ్యములో పరశురాముని గర్వమునణచి అయోధ్యకు చేరితిని. అపుడు దశరథమహారాజు నన్ను ప్రజారంజకునిగా తెలుసుకొని యువరాజుగా చేయుటకు సంకల్పించెను. ఆ వార్తను దశరథ మహారాజునకు ప్రియపత్ని యగు కైకయి విని దేవకార్య నిర్వహణకై కలుషితమతియై నాపుత్రుడగు భరతుని యువరాజుగా అభిషేకించుము. రాముని పదునాలుగు వత్సరములు దండకారణ్యమునకు పంపుము అని పలికెను. రాజు చెప్పకున్ననూ కైకమాటలను విన్న నేను భార్యాసోదర సహితుడనై అరణ్యమునకు బయలుదేరితిని. చిత్రకూటమును చేరితిని. అచట నిత్యము వన్య ఫలములచే మాంసములచే పనులు చేయుచుంటిని. అచట నివసించుచూ దశరథ మహారాజు నిధనవార్తను వింటిని. తరువాత నన్ను గౌరవించు భరత శత్రుఘ్నులు మాతృ వర్గముతో ఆచార్యులతో అమాత్య వర్గముతో దీనులై నావద్దకు వచ్చిరి. విజ్ఞాపన చేసిరి. తరువాత నేను భార్యాసోదర సహితుడనై పంచవటికి వెళ్ళితిని. అచట ఆశ్రమమును ఏర్పరచుకుంటిని. మూడు సంవత్సరములుంటిని. అంతట పదమూడవయేట రావణుడను రాక్షసుడు మాయతో నా ప్రియురాలగు సీతను నా చాటుగా అపహరించెను. అపుడు నేను దీనవదనుడనై భార్యను వెదకుచూ ఋష్యమూక పర్వతమును చేరితిని. వానరాధిపతియగు సుగ్రీవునితో చెలిమి చేసితిని. అప్పుడు వాలిని చంపి సుగ్రీవుని అతని స్థానమున రాజును చేసితిని. సుగ్రీవుడు వానరయూధములతో నాకు సాయము చేసెను. రావణునితో విరోధించిన రావణానుజుడగు విభీషణుడు నా వద్దకు వచ్చెను. నేను విభీషణుని లంకాధిపతిగా అచటనే అభిషిక్తుని జేసితిని. సపుత్రా మాత్య బాంధవుని రావణుని చంపి, పరిశుద్దురాలగు సీతాదేవిని తీసుకొని అయోధ్యకు చేరితిని. తరువాత కొంత కాలమునకు పితృ శ్రాద్ధమున సుగ్రీవ విభీషణులను నిమంత్రణ చేసితిని. అట్లే షట్కులులగు బ్రాహ్మణులను కూడా ఆహ్వానించితిని. అట్లు పిలువ బడిన వారందరూ వచ్చిరి. ఒక్క విభీషణుడు మాత్రము రాలేదు. విభీషణుని గురించి నేను ఆలోచించుచుండగా శివుడు బ్రాహ్మణరూపముతో షట్కులులతో కలిసి వచ్చెను. అప్పుడు నేను విభీషణుని గూర్చి శంకరుని అడిగితిని. అప్పుడు నన్ను ద్రావిడ దేశమునకు గొనిపోయి ద్విజ బంధనమునుండి విడిపించెను. శ్రాద్ధమునకు వచ్చిన అగస్త్యాది బ్రాహ్మణోత్తములు చక్కగా భోజనముచేసి తమ తమ ఆశ్రమములకు వెళ్ళిరి.
తరువాత కాలాంతరమున బ్రాహ్మణులు, దేవతలు, దైత్యులు, నరేశ్వరులు, గౌతముడు పిలువగా యజ్ఞమునకు వచ్చిరి. వారందరూ త్ర్యంబకాద్రిమీద స్థాపించబడిన స్ఫాటికలింగమును చక్కగా పూజించి నివసించిరి. ఆ విస్తృతమైన సమాజము లింగమును పూజించిన తరువాత మధ్యాహ్న కాలమున గౌతమ మహర్షి శంకరుని పూజించెను. అందరూ శుక్లాంబరధరులై భస్మోద్ధూలిత విగ్రహులై తెల్లని భస్మమును సర్వ శరీరమున త్రిపుండ్రములుగా ధరించి భార్గవునికి నమస్కరించి భూతశుద్ధిని చేసిరి. హృత్పద్మ మధ్యమున నున్న భూత పంచకము, వారి మధ్యే మహాకాశము, ఆకాశమున నిర్మలము, దాని మధ్యన దీప్తిమయుడు శుభకరుడగు మహేశ్వరుని ధ్యానించవలెను. అజ్ఞానసంయుతము భూతము సమలము కర్మసంగతమైన ఆకాశ దీపమున ఉన్న ఆ దేహమును జ్ఞానవహ్నితో దహించవలెను. అజ్ఞాన సంయుతము భూతము సమలము కర్మ సంగతమైన ఆకాశ దీపమున నున్న ఆ దేహమును జ్ఞానవహ్నితో దహించవలెను. అకాశావృతియైన అహంతత్త్వమును దహించి తరువాత ఆకాశమును దహింపచేసి, తరువాత వాయువును దహింప చేయవలెను. తరువాత అగ్ని భూతమును దహించి, జలభూతమును దహించవలెను. తరువాత పృథివీ భూతమును దహించవలయును. తరువాత భూతాశ్రితులైన గుణములను దహించి తరువాత దేహమును దహించ వలెను. ఇట్లు భూతాదిని జీవన జ్ఞానవహ్నిచే దహించి, శిఖా మధ్యగతుడు, ఆనందరస నిర్భరుడగు విష్ణువును నిష్పన్నచంద్ర కిరణ సంకాశ కిరణుడగు శివుని, శివాంగోత్పన్నములు అమృత ద్రవ సంయుతములగు కిరణములచే సుశీతలము చంద్రరశ్మివలె ప్రశాంతముగా ప్రసరించబడిన గొప్పధారలచే సాంద్రముగా చేయబడిన ప్రవాహముచే ప్లావితము చేయ బడిన భూత గ్రామమును చింతించవలయును. ఇట్లు భూత శుద్ధినిచేసి క్రియార్హు డగు మర్త్యుడు వెంటనే పరిశుద్ధుడైనచో పూజించుటకు, జపించుటకు యోగ్యుడగును. ఇట్లు చేసినచో బ్రహ్మహత్యాది పాతకములనుండి విముక్తుడగును. ఇట్లు ధ్యానించి ధ్యానముచే శివలింగమునందు చంద్రదీప్తి ప్రకాశమును ఆరోపించి, దీపమధ్యమున సదాశివుని చింతించి పంచాక్షర మంత్రముచే అవ్యయుని అర్చించవలెను. శంకరునికి ఆవాహన స్నానాద్యుపచారములను పూర్వమువలె నాచరించి మేడి కాని, రాజత స్వర్ణమయములు కాని, వస్త్రాది ఛన్నమగు పీఠమును ఏర్పరిచి, అంతమునందు బుద్భుదములచే సృష్టి జరిపి ప్రతి పీఠమున ఒక్కొక్క నాగమునుంచి, ఊర్ధ్వ పీఠమున నాగయుగ్మమును దేవాభ్యాసమున దక్షిణ వామ భాగములలోనుంచి నాగమధ్యమున జపాపుష్పమునుంచి మధ్యమున వస్త్రము నుంచి, ఆ వస్త్రమధ్యమున పీఠయుక్తుడు లింగాకారుడగు మహేశుని పూజించవలెను. ఆ సాధకులందరు ఇట్లుచేసి పంచగంధములను అష్టగంధములను ఇచ్చి, పుష్పములచే, పత్రములచే, శ్రీతిలలచే, అక్షతలచే, కేవల తిలలచే పూజించి యథావిధిగా ధూపమును ఇచ్చి దీపమును యథోక్తముగా ఉపహారమునిచ్చి, పూజాశేషమును ముగించి నృత్య గీతములను ఆచరించిరి. ఈ సమయమున గౌతమశిష్యుడగు శంకరాత్మ అను పేరుగలవాడు ఉన్మత్తవేషుడు దిగంబరుడు అనేక వృత్తులను అవలంబించినవాడు అచటికి వచ్చెను. ఒకచోట బ్రాహ్మణవేషధారి, ఒకచోట చండాలసముడు, ఒకచోట శూద్రసమునిగా ఒకచోట యోగిగా, ఒకచోట తాపసిగా ఉండుచు గర్జించుచు, గంతులేయును. నృత్యము చేయును. స్తోత్రము చేయును. గానము చేయును. ఏడ్చును వినును. పడును. లేచును. శివజ్ఞానైక సంపన్నుడు పరమానంద నిర్భరుడు భోజన సమయమున వచ్చెను. గౌతముని వద్ద కేగెను. గురువుతో కలిసి భుజించెను. ఒకచోట ఉచ్చిష్టమును తినెను. ఒకచోట పాత్రను నాకును. ఒకచోట ఊరికే వెళ్ళును. గురువు హస్తమును పట్టుకొని స్వయముగా తినును. మరియొక గృహమున మూత్రము చేసెను. మరియొక ఇంట బురదను పూసుకొనెను. అట్లు శంక రాత్మను గురువు చూచి చేయిపట్టుకొని గృహమునకు తీసుకొని వెళ్ళి, తమ పీఠమున అతనిని కూర్చుండబెట్టి భోజనము చేయించెను. గౌతమ మహర్షి కూడా అతని పాత్రలో తినెను.
శంకరాత్మ మనసును తెలుసుకొనుటకు గౌతముని భార్యయగు అహల్య ఒకసారి అతనిని పిలిచి తినుమని పలికెను. గురుపత్ని ఆజ్ఞను విని ఏ భేదము లేకుండగా తినెను. నీరును తాగెను. అట్లే అగ్నిని కూడాత్రాగెను. ముళ్ళను అన్నమువలె తిని ఎప్పటివలెనే ఉండెను. తరువాత మునికన్యలు పిలిచి ప్రతి దినము వారిచ్చు భోజనమును, రాళ్ళను నీటిని, గోమయమును, బురదను, కాష్ఠదండము లను తిని త్రాగి సంతోషముతో చండాల ఆకారము నుండు ముని యతడు. ఇట్లు ఒకమారు జీర్ణములగు పాదరక్షలను చేతిలో పట్టుకొని, అరచుచు నవ్వుచు చండాలవేషము కలవాడై వృషపర్వ రాజు వద్దకు వెళ్ళెను. వృషపర్వుడు ప్రభువు మధ్య దిగంబరుడుగా నిలిచెను. వృషపర్వుడు అతనిని తెలియక పీడించి శిరస్సును ఖండించెను. ఆ బ్రాహ్మణోత్తముడు వధించబడగా చరాచరమగు ఈ ప్రపంచ మంతయు కలుషితమాయెను. అచట మునులు కూడా కలత చెందిరి. మహాత్ముడగు గౌతమునకు మహాశోకము కలిగెను. తమ దుఃఖమును చూపుచున్నట్లు నేత్రముల నుండి నీరు వెడలెను. గౌతమ మహర్షి దైత్యులందరి ముందు ఇట్లు పలికెను. ఇతను చేసిన అపరాధమేమిటి? ఇతని శిరస్సు నేల ఖండించితిరి? నాకు ప్రాణాధిక ప్రియుడు, సర్వ కాలములలో శివయోగి అయిన వానిని చంపితిరి గావున నామరణము కూడా సంభవించును. గురువు శిష్య రూపముతో నుండునుకదా. ధర్మయుక్తులు, శైవులు, సర్వదా శివవర్తులు అయిన వారి మరణమును చూచినచో మా మరణము తప్పదు. ఆ మాటలను విని జ్ఞానులలో శ్రేష్ఠుడు రాక్షసాచార్యుడగు శుక్రుడు ఇట్లు పలికెను. భార్గవుడు శంకర ప్రియుడగు ఇతనిని బ్రతికించెదను. మీరెందుకు మరణించెదరు? నా తపోబలమును చూడుము. శుక్రాచార్యులు ఇట్లు పలుకుచుండగనే గౌతమమహర్షి మరణించెను. గౌతమ మహర్షి మరణించిన వెంటనే శుక్రాచార్యుడు కూడా యోగముచే మరణించెను. శుక్రాచార్యుడు మరణించిన వార్తను వినిన ప్రహ్లాదాది దైత్యేశ్వరులు, దేవతలు, రాజులు, బ్రాహ్మణులు అందరూ మరణించిరి. అహల్య శోకసంతప్తయై మాటిమాటికి పెద్దగా ఏడ్చెను. మహేశుని పూజలో గౌతమునిచే పూజించబడిన వీరభద్రుడు అదంతయూ చూచి కోపించెను. ఇది చాలా కష్టము. చాలా కష్టము. చాలా మంది మరణించిరి. ఇదంతయూ మహేశునికి నివేదించెదను. అతను చెప్పినది చేసెదను. ఇట్లు నిశ్చయించుకొని మందరా చలమునకు వెళ్ళెను. శంకరునికి నమస్కరించి జరిగిన దంతయూ నివేదించెను. అచట నున్న బ్రహ్మను విష్ణువును గూర్చి శివుడిట్లు పలికెను. నేను వరప్రదుడనని తెలిసి నా భక్తులు సాహసమును చేసిరి. ఓ విష్ణూ అచటికి వెళ్ళి వారుచేసిన సాహసమునుచేసెదను అని పలికి వృషభము నారోహించి వాయువు చామరములు వీవగా, సువేషుడగు నందికేశ్వరుడు ఛత్రమును పట్టగా ఇతరులు ధరించరాని శ్వేతహేమదండము ధరించగా మహేశ్వరుని అనుమతిని పొంది శ్రీమహా విష్ణువు గరుడునధిరోహించెను. అరక్త నీలఛత్రములచే కౌస్తుభ శ్రీవత్సములచే శోభించెను. శివానుమతితో బ్రహ్మకూడా హంసారూఢుడు ఆయెను. బ్రహ్మ ఇంద్రగోప ప్రభాకార ఛత్రములచే శోభించెను. ఇంద్రాది దేవతలందరు స్వస్వవాహనా రూఢూ లాయిరి. నానావిధ మంగళ వాద్యములు మ్రోగుచుండగా వారు బయలుదేరిరి. కోటికోటి గణము లతో గౌతమ ఆశ్రమమును చేరిరి.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ పరమాద్భుతమును చూచిరి. అపుడు శంకరుడు తన వామనేత్ర నిరీక్షణచే స్వభక్తుడగు గౌతముని జీవింపచేసి గౌతమునితో నేను నీయెడ ప్రీతి చెందితిని. వరమును కోరుము అని పలికెను. ఆ శంకరుని మాటను వినిన గౌతముడిట్లు పలికెను. నీవు నాయెడ ప్రసన్నుడవైనచో నాకు వరమీయదలచినచో నాకెప్పుడూ నీ లింగార్చనా సామర్ధ్యము ఉండనిమ్ము. ఇది ఒక వరము. ఇంకొక వరమును వినుము. ఇతను నా శిష్యుడు మహానుభావుడు. హేయ అదేయాది వర్ణితుడు అహంకార మమకార రహితుడు. ఇంద్రియములను జయించినవాడు. కావుననే మహాయోగి మహాయశస్వి ఉన్మత్తవికృతాకారముచే శంకరాత్మ అని నామము గలవాడు. ఎవరూ ఇతనిని ద్వేషించరాదు. ఎవరూ హింసించరాదు. అట్లే చనిపోయిన వారికి ప్రాణములను ఇమ్ము. “ఈ వరమును నాకిమ్ము” ఆ మాటలను వినిన శంకరుడు సంతోషించి హరిని చూచి స్వాంశమగు వాయువుచే శంకరాత్ముని దేహము ఆవేశించెను. కావున శంకరాత్ముడు హరిరూపుడు వాయు పుత్రుడుగా కపిశ్రేష్టుడాయెను. అతను సాక్షాద్విష్ణువు శివుడు అని పర్యాయపదములచే పిలువ బడుచుండెను. ఇతను కల్పాంతము వరకు కామ రూపియై ఉండును. నా ఆజ్ఞాకారియై రామభక్తుడై పూజిత విగ్రహునిగా ఉండును. అనంత కల్పములు ప్రీతమానసుడై ఉండగలడు. నీవు చేసిన ఈ గృహము సుప్రతిష్ఠితముగా ఉండును. నిత్యము అన్నిరూపములచే క్షణకాలము ఆదరముతో ఉండగలము. ఆ పూజలనంది మా లోకములకు వెళ్ళగలము” ఆ శంకరుని మాటలను వినిన గౌతముడు ఇట్లు పలికెను. యోగ్యము కాని దానిని ప్రార్ధించుచున్నాను. యాచకుడు దోషమును చూడజాలడు. బ్రహ్మమును లభ్యముకానిదాని నడుగుచున్నాను. నచ్చినచో ఈయుము.
అంతట శివుడు విష్ణువును చూచి అతని చేతిని తన చేతిలోకి తీసుకొని నవ్వుచు విష్ణువుతో ఇట్లు పలికెను. ఓ గోవిందా! నీవు క్షామోదరముతో ఉంటివి. నీకు భోజనము కావలయునా ? నీవు స్వయముగా ఇంటిలోనికి ప్రవేశించి స్వగృహమున వలె భుజించుము. లేదా పార్వతీ గృహ మునకు వెళ్ళుము. నీ కడుపును నింపును” అని ఇట్లు పలికి అతని చేతిని పట్టుకొని ఏకాంతమునకు వెళ్ళెను. నందిని యథాప్రకారముగా ద్వారాధ్యక్షునిగా నియమించెను. అనంది వెడలి గౌతమునితో విష్ణువు మాటలను తెలిపెను. అన్నమును సిద్ధముచేయుము. దేవేశులు అన్నమును భుజించ గోరుచున్నారు అని ఇట్లు పలికి వాసుదేవునితో శంకరుడు ఏకాంతమున చేరెను. మృదువగు శయ్యను చేరి దేవోత్తములు శయనించిరి. పరస్పరము కొంతసేపు సంభాషించి లేచిరి. తటాకమునకు వెళ్ళి స్నానము చేయుచుండిరి. ఇద్దరు చేతులతో నీరును ఒకరిపై నొకరు చల్లుకొనిరి. మునులు రాక్షసులు కూడా జలక్రీడల తేలిరి. అంత విష్ణువు శంకరుడు కూడా జలపానమును చేసిరి. శంక రుడు పద్మకింజల్క సదృశకరములతో విష్ణువు యొక్క ముఖాంభోజమున చల్లెను. నేత్రములలో కేసరములు పడుటవలన శ్రీహరి నేత్రములను మూసుకొనెను. ఇంతలో శంకరుడు హరి భుజములు నధిరోహించెను. హరి శిరమును చేతులతో పట్టుకొని ముంచెను. ఇట్లు మాటికి మాటికి ముంచుటచే పీడించబడిన శ్రీహరి శంకరుని పడవైచెను. అంతట శంకరుడు విష్ణు పాదములను పట్టుకొని తిప్పి లాగి హరి వక్షమును కొట్టి అచ్యుతుని పడవైచెను. అంతట లేచిన శ్రీహరి లేచి దోసిటితో నీరు తీసుకొని శిరస్సున చల్లెను. శంభువు హరి శిరమున చల్లెను. ఇట్లు ఋషిగణమధ్యమున శివకేశవుల జలక్రీడ సాగెను. జలక్రీడాసమాసక్తులై జటాబంధములు వీడగా ఒకరి జట మరొకరి జటతో ముడిపడెను. ఆ జటాబంధమును విడిపించుటకు శక్తిమంతులు శక్తిహీనులు అగు మునులు లాగుచుండిరి. ఒకరినొకరు పడవేయుచు, పడుచు, ఆక్రోశించుచు రోదించుచుండిరి. ఇట్లు జలక్రీడలో తుములసంరంభము జరుగుచుండగా ఆకాశమున వానరేంద్రుడు నాదముచేసి నృత్యము చేసెను. వీణను లలితముగా మీటుచు పెద్దగా పాడెను. చక్కని గీతములను పది విధములుగా పాడెను. శంకరుడు లోకభావనుడు ఆ మధుర గీతమును వినెను.
తానుకూడా మెల్లమెల్లగా మధురముగా పాడ మొదలిడెను. స్వయముగా శంకరుడు మధు రముగా గొంతెత్తి పాడుచుండగా ధ్రువస్వరమును సర్వలక్షణ సంయుత మును స్వధారామృత సంయుక్తమునుచేసి గానముతో గానమును కలిపెను. వాసుదేవుడు చేతులతో మద్దెలను మ్రోగించెను. తుంబురుడు కూడా మెల్లగా మీటెను. గౌతమాదులు తానమును చేసిరి. వాయుజుడు గాయకుడు ఆయెను. ఇట్లు కపీశ్వరుడగు హనుమంతుడు మధురముగా గానము చేయుచుండగా వాడినవి చిగురించెను. కృశించినవి పుష్పములు ఆయెను. అందరూ తమతమ గానములను ఆపి దేవర్షి దానవగణము స్థిరముగా క్రియా శూన్యులుగా నిలిచిరి. ఒక్క హనుమంతుడు గానము చేయువాడు. మిగిలిన వారందరు శ్రోతలు. మధ్యాహ్న కాలము అగుచుండగా, హనుమంతుడు పాడుచుండగా దేవతలందరూ తమ తమ వాహనములను అధిరోహించి తమ తమ లోకములకు వెళ్ళిరి. గానప్రియుడగు మహేశ్వరుడు వానరేశ్వరుని గ్రహించెను. ఓ ప్లవగేశ్వరా! నీవు నా ఆజ్ఞతో నిస్సందేహముగా వృషభమును అధిరోహించుము. నాకు అభిముఖుడవై అనేక గీతములను పాడుము. అని కపి శార్దూలుడు శివుని గూర్చి ఇట్లు పలికెను. వృషభారోహణ సామర్ధ్యము నీకు తప్ప ఇతరులకు లేదు. నీవాహనమును అధిరోహించినచో నేను పాతకినగుదును. నీవు నన్ను అధిరోహించుము. నేను ఇక అభిముఖుడనై గానముచేసెదను అని ఇట్లు పలుకగా శంకరుడు హనుమంతు నధిరోహించెను. శివుడు అధిరోహించగానే హనుమంతుడు తన శిరస్సును భేదించి తిప్పిపెట్టి పూర్వమువలెనే గానము చేయుచుండెను. హనుమంతుని మధుర గానమును వినుము. శివుడు గౌతముని ఇల్లు చేరెను. దేవర్షి గణదానవులందరూ అచటికి వచ్చిరి. భోజనాపసరమున గౌతముడు వారినందరిని పూజించెను. గౌతముని ఇంటిలోనున్న శుష్కదారుసంభవ గృహోపకరణము లన్నియూ హనుమంతుని గానముతో చిగిర్చెను. హనుమంతుని గానమును అందరూ చిత్తరువులవలె వినుచు చూడసాగిరి. హనుమంతుడు ద్విబాహువు, శివపాదాభివందనమును చేయుచు, సమస్తా భరణ భూషితుడై ప్రసన్నాకారముతో తరుణుడుగా ఉండగా మిగిలిన వారందరు శిరమున చేతులు జోడించి ఉండిరి. శంకరుడు హనుమంతుని శిరమును చేతులతో పట్టుకొని యథాపూర్వముగా చేసెను. పద్మాసనాసీనుడగు హనుమంతుని అంజలిలో ఒకపాదము నుంచి, మరియొక పాదమును ముఖమున నుంచి, పాదాంగుళులచే నాసికను స్నేహముతో పట్టుకొనెను. స్కంధమున ముఖమున, భుజమున కంఠమున వక్షస్థలమున, స్తనమధ్యమున, హృదయమున, కుక్షి యందు, నాభి మండ లమున, పాదము నుంచుచు, రెండవ పాదమును దోసిట నుంచుచు శిరస్సును పట్టుకొని వంచుచు పృష్ఠమును చిబుకముతో స్పృశించెను. అట్లే ముక్తాహార మును హనుమంతుని కంఠమున వేసెను. దానినంతటిని చూచుచున్న విష్ణువు శంకరునితో ఇట్లు పలికెను. ఈ బ్రహ్మాండము అంతటా హనుమత్సముడు మరియొకడు లేడు. శ్రుతులను దేవతలకు గోచరముకాని నీ పాదము హను మంతుని శరీరమున నిలిచినది. సర్వోపనిషత్తులకు అందని నీ పాదము కపీశ్వరుని చేరినది. యమాది సాధనములచే కూడా యోగుల హృదయ పద్మమున నిలువని నీ పాదము హనుమంతుని యందు స్థిరముగా నిలిచినది. వేలకోట్ల సంవత్సరములు పూజించిననూ నీపాద దర్శనము కలుగదు. లోకమున శివుడు నారాయణ ప్రియుడని నారాయణుడు శివప్రియుడని అనుకొందురు. కాని నాకా భాగ్యము కలుగలేదు.”
ఇట్లు పలికిన విష్ణువు మాటలను విని శంకరుడు సంతోషముతో ఇట్లు పలికెను. నీతో సముడగు ప్రియుడు మరియొకడు లేడు. నీతో సమప్రియత్వము ఒక పార్వతిలో ఉన్నది. మీ ఇద్దరి ప్రీతిలో నాకు భేదము లేదు. అంతట గౌతముడు మహాదేవునకు నమస్కరించి ఇట్లు విజ్ఞాపన చేసెను. ఓ కరుణానిధీ! మధ్యాకాలము దాటుచున్నది. అందరికి ఇది భోజనవేల. అంతట మహా దేవుడు ఆచమనముచేసి విష్ణువుతో కలిసి గౌతమ గృహమును ప్రవేశించి భోజనమునకు ఉపక్ర మించెను. రత్నాంగుళీయములచే నూపురములచే, దుకూల బంధముచే, మెరుపువంటి కాంచీ సూత్రము, బహువిధ హారములచే, కంఠనిష్క యజ్ఞోపవీతోత్తరీయములచే మెరయుచు వ్రేలాడుచున్న కుండలములచే సుపుష్పధమ్మిల్ల వరముచే, పంచాంగ గంధవిలేపనముచే, బాహ్వంగదములచే, కంకణాంగుళీయములచే అలంకరించబడిన శివుడు ఉత్తమాసనమున కూర్చొని, తనకు సమ్ముఖ ముగా ఉత్తమాసనమున శ్రీహరిని కూర్చోబెట్టెను. ఇట్లు దేవ శ్రేష్టులగు హారీశులు అన్యోన్యాభి ముఖముగా కూర్చొనిరి. గౌతముడు భక్తితో వారికి సువర్ణ భోజనమును పెట్టెను. ముప్పది విధముల భక్ష్యములను, నాలుగు విధముల పాయసమును, చక్కగా కల్పించబడిన రెండు వందల పాక జాతమును, అపక్వమును మిశ్రమమును ముప్పది రెండు విధములుగా కల్పించబడిన దానిని నూరు నూరు విధముల చక్కని కందములచే శాకములచే కల్పించ బడిన దానిని నేతితో చేయబడిన ఇరువదియైదు విధముల వ్యంజనములను, శర్కరాదికమును, మామిడి అరటి దాడిమ, ద్రాక్ష, చెరుకు, నాగరంగ మొదలగు ఫలములను, మిష్టాన్నమును, పక్వాన్నములను, ప్రియాలక జంబూ వికంతర ఫలములను ఇటువంటి ఇతర ద్రవములను ఈశ్వరునికి సమర్పించి ఔపోశా నకమునిచ్చి భుజించుడని పలికెను. అందరూ భుజించుచుండగా సూక్ష్మ విస్తృతమగు వ్యంజనమును తీసుకొని, స్వయముగా గౌతముడు శివ విష్ణువులకు వీచెను. అంతటా పరమేశ్వరుడు పరిహాసమును చేయ కోరెను. ఓ విష్ణూ హనుమంతుడెట్లు తినుచున్నాడో చూడుము అని పలికెను. అట్లు విష్ణువు హను మంతుని చూచుచుండగా మహేశ్వరుడు మునులందరూ చూచుచుండగనే ఒక మండకమును విష్ణు భోజన పాత్రలో పడవేసెను. స్వోచ్చిష్టమగు పాయసాదికమును హనుమంతునికిచ్చెను. అంతట హనుమంతుడు ఓ ప్రభూ నీ మాటలవలననే నీ ఉచ్ఛిష్టమును భుజించరాదు. నా నైవేద్యమగు పత్ర పుష్ప ఫలాదికము అభోజ్యము. నాకు నివేదన చేసినదంతయూ బావిలో పడవేయవలెను. తిననిచో నీ మాట సత్యమగును. తినినచో నీ అనుగ్రహము కలుగును. స్వయంభూతుడగు బాణ లింగుడు చంద్రకాంతుడు హృదయమున ఉండగా శంభు నైవేద్య భక్షణము చాంద్రాయణసమమని తెలియుము అని పలుకగా శంకరుడు, ఇప్పుడిది భోజన సమయము. ఇపుడు వేరే మాటలు వైరస్యమును కలిగించును. భోజనము చేసిన తరువాత చెప్పెదను. నిశ్శంకగా భోజనము చేయుము. అనిపలికెను. అంతట గౌతముడు జల సంస్కారమును చేసెను. ఆ రక్తసుస్నిగ్ధను సూక్ష్మ గాత్రములను పలుమార్లు పరిశుద్ధములుగా చేయబడుటచే బాగుగా శోభించుచున్న అంగములను, కత బీజములచే కలచిన తటాక తోయములచే విశోధితములుగా చేయబడిన వాటిచే కరకములను నింపెను. క్రొత్తనదీ సైకత వేదికను శుద్ధమైన సూక్ష్మాంబురములచే కప్పి, తోయపూర్ణములైన ఘటములను ప్రతిష్ఠించి నాలకజాతిని అస్తపుటకమును వ్రాసి, కీలకంకారికాచూర్ణమును పూసి చందన చంద్రరశ్మి విశదమైనమాలను పుటాంతముగా ఉంచవలయును. యామ భాగమున కూడా నీటితో వస్త్ర ముచే శోధించి, కుంభమును ప్రతిష్ఠించి, చంద్ర గ్రంథిని క్రింది భాగమున ఉంచి, పాటలవకుళము నుంచి, శేఫాలీస్త బకమునుంచి, నీటిని పోసి, మొదటే జలమును శుద్ధిపరిచి, మృదుతరము సూక్ష్మ వస్త్రమును అవేష్టనముచేసి, ఆ తపములేని ప్రదేశమున కరకములనుంచి, మంచి మారుతముగల సూక్ష్మ వ్యజనముచే వీచబడిన దానిని సువాసనగల శీతజలములను చల్లవలయును. మనోనిగ్రహము గలవారుసు సంస్కృతులగు సరులు, నారీజనము, రాజులు, వారి కన్యలుకాని, క్షాలితాంగులు, ధౌతపాదులై మంచి వస్త్రములను ధరించి, బాహమూలమునందు కంటమునందు సువాసన చంద నాగురులను పూసుకొని, మస్తకమున జపాపుష్పమును ధరించి, పంచగంధ విలేపనము గావించి, కేశములందు పుష్పబంధములను దాల్చి నిర్మలులై కుంకుమాది ద్రవ్యములను దాల్చినవారై పూజించ బడిన నరులు, సౌందర్యవతులగు యువతులు భూషణములచే భూషితులైన స్త్రీలచేకాని పురుషులచే కాని నీటిని ఇప్పించవలెను. వీరు కూడా జలప్రధాన సమయమున సూక్ష్మవస్త్ర పరివేష్టితులై వామకరమున కరకము నుంచి అచట దోరికాన్యస్తమును వదిలి నీటినీయవలెను. గౌతముడిట్లు అంతటిని చేయించెను. మహాత్ములగు మహేశాదులు భుజించి హస్తపాదప్రక్షాళనము చేసుకొని, గంధాదులు లేపనము కావించుకొని దేవేశ్వరుడగు మహేశ్వరుడు ఉచ్చాసీనుడు కాగా నీచాసనమున మిగిలినవారు ఆసీనులైరి. మణిఖచిత పాత్రలందు కోణములు లేనివి, గుండ్రనివి, స్థూలములు, సూక్ష్మములు కానివి, కృశములు కానివి, సూధూపితములగు పూగఖండముల నుంచి, శ్వేత పత్రములను శుద్ధిపరిచి కర్పూరఖండముల నుంచి చూర్ణమునుంచి శంకరునికి గౌతముడు సమర్పించి ఓ దేవా తాంబూలమును స్వీకరించు మని గౌతముడు పలుకుచుండగా శంకరుడు ఓ కపీశ్వరా! ఈ తాంబూలమును నీవు స్వీకరించి నాకు పూగఖండముల నిమ్ము అని పలికెను. ఓ మహేశ్వరా నాకు పరిశుద్ధి లేదు. బహు విధములగు ఫలములను భుజించు వానరులకు పరిశుద్ధి ఎక్కడిది అని పలికెను. ఆ మాటను వినిన శంకరుడు కపీశ్వరునితో ఇట్లు పలికెను. నామాట వలన అంతయు శుద్ధి పొందును. నా మాటవలన అమృతము కూడా విషమగును. నామాట వలననే వేదములు దేవతాదులు, నామాటవలననే ధర్మజ్ఞానము కలుగును. నామాట వలననే మోక్షము లభించును. పురాణములు, ఆగమములు స్మృతులుకూడా నామాట వలననే ఏర్పడును. కావున తాంబూలమును గ్రహించుము. పూగఖండములను ఇమ్ము అని పలికెను. అంతట కపీంద్రుడు వామకరముచే తాంబూలమును గ్రహించెను. పత్రములను సంగ్రహించి శంకరునికి పూగ ఖండ ములను ఇచ్చెను. మొదట ఇచ్చిన కర్పూరమును శంకరుడు భక్షించెను. ఇట్లు శంకరుడు తాంబూల భక్షణము చేయగనే మందరాచలము నుండి పార్వతీదేవి జయవిజయల హస్తములను పట్టుకొని గౌతముని గృహమునకొచ్చి దేవపాదములకు నమస్కరించి ముఖము వంచి నిలబడెను. అంతట శంకరుడు పార్వతీదేవి ముఖమును పైకెత్తి ఇట్లు పలికెను. నీ విషయమున నేను అపరాధమును చేసితిని. నిన్ను విడిచి భోజనము చేసితిని. అట్లే నిన్ను స్వమందిరమున విడిచి నేను గొప్ప తప్పును చేసితిని. నన్ను క్షమించి కోపమును విడిచి చూడుము” ఇట్లు పలికిననూ పార్వతి మాట లాడక అరుంధతితో కలిసి బయలువెడలెను. అట్లు పార్వతి వెడలుట చూచి గౌతమ మహర్షి దండవత్ప్రణామమును ఆచరించెను. అపుడు పార్వతి గౌతముని గూర్చి నీవేమి కోరుచుంటివని అడిగెను. అపుడు చిరునవ్వుతో ఉన్న పార్వతి గౌతమి మహర్షి, నీవు నా ఇంటిలో భుజించినచో కృతకృత్యుడను అగుదును అని పలికెను. అపుడు అంజలి బద్ధుడగు గౌతమునిచూచి శంకరుడు అనుమతించినచో భుజించెదనని పలికెను. అంతట గౌతముడు శివునినుండి అనుమతి పొంది త్వరగా వచ్చెను. పార్వతిని అరుంధతిని భోజనము చేయించెను. అట్లు భుజించిన పార్వతి సర్వగంధ పుష్పాలంకృతయై సహస్ర అనుచర కన్యలచే శివుని చేరెను. అంతట శంకరుడు ఓదేవా నీవు గౌతమమందిరమునకు వెళ్ళుము. నేను సంధ్యోపాసన గావించి నీ వద్దకు వచ్చెదను అని పలికెను. ఆ మాటతో పార్వతీదేవి గౌతమ మందిరమునకు వెళ్ళెను. సంధ్యావందనము చేయగోరి అందరూ బయలుదేరిరి. మహేశాదులు తటాకమునందు సంధ్యవార్చిరి. శంకరుడు ఉత్తరముఖుడై వ్యాసమును గావించి జపించెను. అంతట మహాతేజస్వి అగు విష్ణువు మహేశునితో ఇట్లు పలికెను. అందరిచే నమస్కరించబడు నీవు, అందరిచే పూజించబడు నీవు, యజ్ఞములు ఎవరి కొరకు చేయబడునో అట్టి నీవు, దేనిని జపించుచుంటివి? చేతులు జోడించుచుంటివి ? చేతులు జోడించి అందరూ నిన్నే ఉపాసించెదరు. అట్టి దేవదేవేశుడవగు నీవు ఎవరికి చేతులు జోడించుచుంటివి ? నమస్కారాది పుణ్యములకు ఫలమునిచ్చునది నీవు. నీకు ఫలమునిచ్చు వాడెవడు? నీకు నమస్కరించదగిన వాడెవడు? నీకంటే అధికుడెవరు ? నాకు చెప్పుము. ఆ మాటలను వినిన శంకరుడు విష్ణువుతో ఇట్లు పలికెను.
ఓ గోవిందా! నేనెవరినీ ధ్యానించుటలేదు. ఎవరికీ నమస్కరించుట లేదు. కాని నాస్తికుల ప్రవృత్తి కొఱకు ఇట్లాచరించి చూపవలెను లేనిచో లోకులు పాపాచారులు అగుదురు. కావున లోకోపకారము కొఱకు నేను ఇట్లు ఆచరించుచున్నాను. అంత విష్ణువు అట్లే అని నమస్కరించి నిలిచెను. అంత వారు దేవర్షులు గౌతమ గృహమును చేరిరి. వారందరు దేవదేవుడగు శంకరునికి పూజలు జరిపిరి. శివుడు హనుమంతునితో కలిసి గానము చేయుచుండెను. వారందరూ పంచాక్షరీ మంత్రమును జపించిరి. హనుమంతుని హస్తమును పట్టుకొని శివుడు దేవతలతో కలిసియుండెను. అంత శివపార్వతులు ఏకశయ్యా సమాసీనులైరి. హనుమంతుడు తుంబురు ప్రముఖులు గానము చేయుచుండిరి. పరమేశ్వరుడు నానావిధి విలాసములను చేయుచుండెను. పార్వతిని పిలిచి ఇట్లు పలికెను. ఓ శుభురాలా! నీకు కొప్పు ముడిచెదను. నా ముందుకు రమ్ము. అంత పార్వతి స్త్రీని పతి సేవించుట యుక్తముకాదు. కేశ ప్రసాధనముతో పాటు అర్థాంతరము కూడా సంభవించును. కేశ ప్రసాధనముననే ఈప్సితమంతయూ నెరవేరదు. కేశబంధము తరువాత భుజప్రాంతమున ప్రమార్జనమును చేయవలెను. తరువాత కేశమును చివర తగిలియున్న పుష్పాది మార్జనము. ఇట్లు జరుగుచుండగా మహానుభావులు వచ్చినచో దేవవందితుడవు అగు నీవు ఏమి సమాధానమును చెప్పెదవు? ఎవ్వరూ రానిచో భయము తొలగిపోవును అని పలికెను. ఇట్లు మాట లాడుచున్న పార్వతిని శంకరుడు చేతితో లాగి తన ఊరువుల మీద కూర్చోబెట్టుకొని కచబంధమునువిప్పి, చేతులతో చక్కగా విడమరచి, గోళ్ళతో చిక్కుతీసి, విష్ణువు ఇచ్చిన పారిజాతమాలను కేశములలో ముడిచెను. అట్లు ముడిచి కొప్పువేసెను. చేతిలో నున్న మల్లెలమాలను కొప్పునకట్టెను. బ్రహ్మ ఇచ్చిన కల్ప పుష్పమాలను సుగంధభరితమగు పార్వతీ వస్త్రమున కట్టెను. అట్లు చేయుచున్నపుడు అంటుకున్నది, అంటియున్న పుష్పమార్జనమును గావించెను. అంత నడుము భాగమున వస్త్ర వేష్టనము లోపల జారుచున్న నీవీ బంధమును చూచి ఇది యేమిటని నీవీ బంధమును కావించెను. తరువాత ఇది నీకు నాసా భూషణము. నిజము చెప్పుచున్నాను అనెను. నిజము చెప్పుచున్నాను అనెను. అంత పార్వతి చిరునవ్వుతో శంకరునితో ఇట్లు పలికెను. ఓ శంభూ? నీ మందిరమున సర్వ వస్తువులు సమృద్ధిగా కలవు. నేను మొదటనే ఈ విషయమును తెలిసియుంటిని. సర్వ ద్రవ్య సంపత్తి భూషణములచే తెలియబడును. స్వామి మీ శిరస్సు బ్రహ్మశిరోమాలచే అలంకరించబడు చున్నది. నర కపాలమాలచే వక్షస్థలము విభూషణమైనది. విషయుక్తములైన శేషవాసుకులు నీకు కంకణములు. నీ వస్త్రములు దిక్కులు. జటలు కేశములు. భస్మము అంగరాగము. మహావృషభము వాహనము. గోత్రము కులము తెలియదు. తల్లిదండ్రులు తెలియదు. నీ శరీరము విరూపాక్షము. ఇట్లు పార్వతి పలుకుచుండగా విష్ణువు చాలా కోపముతో ఇట్లు పలికెను. ఓ దేవా! దేవదేవుడు జగత్పతి అగు శివుని ఏల నిందించుచున్నావు? నీ నియమాభావముచే ప్రాణములు ప్రియములు కావనిపించుచున్నది. ఈశ్వరుని నింద జరిగినచో మరణించుట మా వ్రతము. ఇట్లు పలికి శ్రీహరి నఖములచే తన శిరస్సును ఛేదించుకొనుటకు ఉద్యుక్తుడాయెను. అంతట శంకరుడు విష్ణువు హస్తమును పట్టుకొని సాహసము చేయకుము. పార్వతీ వచనములు అన్నియూ నాకు ప్రియములే. అప్రియములు కావు. ఇపుడు నీవే నాకు అప్రియమును చేయ ప్రయత్నించుచున్నావు అని పలికెను. అంతట శ్రీహరి అట్లే అని ఊరక ఉండెను. అంతట హనుమంతుడు శంకరునితో ఇట్లు విజ్ఞాపన చేసెను. స్వామి నిష్కామమగు నీ పూజా వ్రతమును చేయుటకు అర్థించుచున్నాను. పూజ చేయుటకు వెళ్ళవలయును. నాకు అనుజ్ఞ నిమ్ము. ఆ మాట వినిన శంకరుడు చిరునవ్వుతో ఇట్లు పలికెను. నీవు ఎవరిని పూజించెదవు? ఎచట పూజించెదవు ? ఏ పుష్పము? ఏ దళమో చెప్పుము. గురువు ఎవ్వరు ? మంత్రమేది ? ఎట్లు పూజింతువు అని ఇట్లు శంకరుడు పలుకగా నీతి యుతుడగు హనుమంతుడు శరీరమంతయూ వణకుచుండగా స్తోత్రము చేయ ఆనారంభించెను. మహాదేవుడు అమితాత్ముడగు శంకరునికి నమస్కారము. యోగికి యోగధాతకు యోగి గురువునకు నమస్కారము. యోగగమ్యుడగు దేవునికి, జ్ఞాని నమస్కారము. వేదపతికి దేవపతికి నమస్కారము. ధ్యానమునకు, ధ్యానగమ్యునకు, ధ్యాతృ గురువునకు నమస్కారము. అష్టమూర్తికి పశుపతికి నమస్కారము. అంజకునికి, త్రినేత్రునకు, సోమ సూర్యాగ్ని నేత్రునకు నమస్కారము. సుభృంగరాజ ధత్తూరు దక్షిణ ప్రియునకు, బృహతీ పూగపున్నాగ చంపక ప్రియునకు నమస్కారము. నమస్కారము మరల మరల నమస్కారము. ఇట్లు స్తోత్రము చేయగా శివుడు కపీంద్రునితో భయపడకుము. నాకంతయూ చెప్పుము అనిపలికెను. అంతట వాక్యకోవిదుడగు హనుమంతుడు భయమును విడిచి ఇట్లు పలికెను. భస్మోద్ధూళిత దేహియై శివలింగార్చనమును పగలు సంపాదించిన జలముచే, పుష్పాదులచే చేయ వలెను. ఓ దేవా ? శుభప్రదమగు శివపూజావిధిని విజ్ఞాపనచేతును. సాయంకాలమున అశిర స్స్నానమును ఆచరించవలెను. చక్కగా శుద్ధిచేయబడిన, ఆరిన వస్త్రమును ధరించి, మూడు మార్లు ఏకాగ్రచిత్తముతో ఆచమనమును ఆచరించవలెను. చక్కగా శుద్ధి చేయబడిన, ఆరిన వస్త్రమును ధరించి, మూడు మార్లు ఏకాగ్ర చిత్తముతో ఆచమనము గావించి, భస్మమును తీసుకొని ఆగ్నేయ స్నానము నాచరించవలెను. ప్రణవముతో అష్టవారము మంత్రించి కాని, పంచాక్షర మంత్రముతో కాని, ఏదో ఒక నామముతో ఏడుమార్లు మంత్రించిన భస్మమును దర్భపాణియై “ఈశానః సర్వవిద్యానాం” అని శిరమున వేసుకొనవలయును. సద్యోజాతం ప్రపద్యామి”అనుమంత్రముచే పాదములపై చల్లుకొనవలెను. ప్రణవముచే సమస్తాంగములపై చల్లుకొనవలెను. ఇది త్రైవర్ణికులకు స్నానవిధి చెప్పబడినది. గురువు చెప్పిన శూద్రస్నాన విధిని చెప్పెదను. శివ అను పదమును పలికి భస్మమును మంత్రించవలెను. ఏడుమార్లు శివనామముతో మంత్రించి శిరస్సున చల్లుకొనవలెను. ‘శంకరాయ’ అని ముఖమున, ‘సర్వజ్ఞాయ’ అని హృదయమున, ‘స్థాణవే నమః’ అని ముఖమున, ‘స్వయంభువే’ అని పాదములపై చల్లి, శుద్ధమగు భస్మమును తీసుకొని ‘నమశ్శివాయ’ అని సర్వాంగములందు చల్లుకొనవలెను. హస్త ప్రక్షాళనము గావించుకొని, ఆచమనముచేసి దర్భపాణియై సావధానముగా ఉండవలెను. దర్భలేనిచో సువర్ణము, సువర్ణము లేనిచో గవాలుకలు, అవి లేనిచో దూర్వలు, అవికూడా లేనిచో రజతమును ధరించవలెను. సంధ్య పాసనను, దేవీ జపమునుచేసి దేవ గృహమునకు వెళ్ళవలయును. లేదా దేవవేదికను కాని, కల్పించిన స్థండిలమును కాని చేరవలెను. కల్పించబడిన మృణ్మయరచితమైనది పరిశుద్ధమైనది నాలుగు వర్ణములతో రంగములతో కూడినది పద్మాదిరచనా యుతము లేదా ఒక శ్వేతముతో కూడి ఉన్నది, అట్లే విచిత్రములైన పద్మములు, స్వస్తికాదులు, ఉత్పలాదులు గదాశంఖ త్రిశూలడమరులు, శరోక్త పంచ ప్రాసాదములు కలదిగా నేర్పరిచి, అచట శివలింగము నుంచి, సర్వకామ ఫలవృక్షము కుల కము కోలకము, షట్కోణము, త్రికోణము లేదా నవకోణము, ద్వాదశ కోణమునందు ఆందోళపాదుకా వ్యజనములు చామర ఛత్ర యుగళము, విష్ణు బ్రహ్మాదులు వీటినన్నిటిని చూర్ణాదులచే వేదికయందు రచించ వలయును. లేదా దేవాలయమునందు కాని చేయవలెను. దేవపూజ చేయు ప్రదేశమున ఇట్లు కల్పించవలెను. స్వహస్త రచితమైనది ఉత్తమము. క్రీతము మధ్యమము. యాచితము కనిష్ఠము. బలాత్కార లభ్యము అధమము. అర్హములలో ఆనర్హములలో బలాత్కార అభ్యము నిష్ఫలమగును. రక్తశాలి జపాశాణకలము అనితరక్తకములచె వ్రీహిమాత్రోత్థ తండులములచే కణములచే యథాక్రమముగా ఉత్తమ మధ్యమ కనిష్ఠములచే పద్మాదిస్థాపనములచే చక్కగా యాగము ఆచరించ వలెను. ప్రాగుత్తర ముఖముగాకాని ప్రాఙ్ముఖముగాకాని కూర్చొనవలెను. ఇకఇపుడు చూచినట్లు వినినట్లు ఆసనవిధిని కూడా చెప్పెదను.
కుశలతో ఏర్పరిచినది, చర్మముతో ఏర్పరిచినది. దారువుతో ఏర్పరిచినది. తాటాకులతో చేయబడినది. కంబలముచే ఏర్పరిచినది. కాంచనముచే ఏర్పరిచినది. రాజతము, తామ్రము. గోకరీషార్క జలములచే ఆసనములను కల్పించవలెను. పద్మాసనమునుకాని స్వస్తికాసనమును కాని ఏర్పరచుకొనవలెను, దర్భలయందుకాని, భస్మమునందుకాని సమాసీనుడై వాక్కును నియమించి ప్రాణాయామమును గావించి, దేవతా రూపుడై అంతర్ధ్యానము గావించవలెను. ద్వాదశాంగుళ పరిమితమగు శిఖాంచమున ఉన్న మంగళ ప్రదమగు సూక్ష్మతనువుగా ఉన్న, భూతములలో అంతర్భాగమున గుహయండు చరించుచున్న విశ్వతోముఖుడు, సర్వాభరణ సంయుక్తుడు, అణిమాది గుణాన్వితుడగు మహేశ్వరుని ధ్యానించి, అతనినే చిత్తమున ధరించవలెను. అతని కాంతిచే శరీరమును నింపవలయును. ఆ కాంతిచే శరీరమున ఉన్న పాపమును నశింపచేయవలెను. స్వర్ణపాద సంపర్కము లేనందువలన రక్తము కాని శ్వేతముగా కాని ఉంటున్నటుల ద్వాదశ దళావృతము అష్టకాని పంచకాని మూడుకాని దళములున్న శుద్ధమగు అసనమును కల్పించి అచట లింగమునుంచి గుహలో ఉన్న లింగేశ్వరుని చింతించవలెను. పరిశుద్ధము చేయబడిన కలశమునందు గంధవాసితము శోధితము అగు జలమును గంధపుష్ప సహితముగా నుంచి, ప్రణవముచే అభిమంత్రించవలెను. శూద్రుల విషయమున ప్రాణాయామము, ప్రణవముచే అభిమంత్రించవలెను. శూద్రుల విషయమున ప్రాణాయామము, ప్రణవము విధించబడలేదు. ప్రాణాయామ స్థానమున ఓంకారాభి మంత్రితమగు శివనామముండును. గంధపుష్పాక్ష తాధికమగు పూజాద్రవ్యములను సమీపమున నుంచి సంకల్పమును ఆచరించవలెను. శివుని సంతోషముకొఱకు శివుని పూజకు చేసెదను. ఇట్లు సంకల్పముగావించిన తరువాత ఆవాహనాదికమును గావించి స్నానమును కల్పించవలెను. ‘నమస్తే’ ఇత్యాది మంత్రముచే శత రుద్ర విధానముగా అవిచ్ఛిన్న ధారను ముక్తిధారయందురు. జపించుచు ముక్తిధారచే రుద్రముఖులను ఒకనెల స్నానము చేయిం చినచో ఆ స్నానముకూడా ఒకమారు కాని మూడు అయిదు ఏడు తొమ్మిది పదకొండుమార్లు పద కొండు విధములుగా చేసినచో దీనిని ముక్తి స్నానమందురు. ఇట్లు ఒక మాసము చేసినచో మోక్షమును ప్రసాదించును. శైవవిద్యచే కాని, కేవల ప్రణవముచే కాని, మృణ్మయములచే కాని నారికేళ శకలము లచే కాని, జలధారలచే కాని, కాంస్యములచే కాని, ముత్తెపుచిప్పలచే కానీ, పుష్పాదికేసరములచే యథాశక్తి దేవదేవేశుని స్నానము చేయించవలెను. ఇక ఇపుడు స్నానయోగ్యమగు శృంగవిధిని చెప్పెదను. మొదట అంతర్భాగమును సంశోధించి, బహిరంతరము శోధించవలెను. సున్నిగ్ధముగా లఘువుగా చేసి అంగఛేదన గావించకూడదు. నీచైక దేశవిన్యస్త ద్వాదశ ద్రోణిచే సహృత్తుగా అగ్ని హోత్రయుక్తముగా స్నానమును మహాదేవునికి కల్పించవలెను. ఇట్లే గవయశృంగమునకు జలపూర్తిని ఇపుడు చెప్పెదను. నిషిద్ధలోహార్ధసంధి ద్వారసమన్వితమగు ద్వారమున యోగవక్త్రమును, నాగ దండమగు నాగాకారముగా కల్పించవలెను. ఫలస్థానమున దండముతో సమరంధ్రకమగు చషకము నుంచి అచటనే మూర్ధ యంత్ర ఘటమున నున్న జలము నుంచవలెను. మరియొక దానిచే కాని వామకరముచే కాని ఉంచవలెను. ఇట్లు దానిచే చేయబడిన ముక్తిధార పరమ పవిత్రము పాపనాశకము. ఇట్లు పంచగవ్యములచే పంచామృతముచే మధురత్రితయముచే కాని స్నానము గావించి భూషణములచే చక్కగా అలంకరించి, మరల స్నానము చేయించి శీతలోపచారమును గావించి, ఆచమనాదికమును వస్త్రమును, ఉపవీతమును గంధద్రవ్యమును, కర్పూరమును, అగరును, పాటీరమును కాని, ఉభయ మిశ్రితముగా కాని శివ లింగమును పూజించవలెను. సమస్త పీఠ మును కాని, లేదా విభవానుసారముగా కాని గంధ పూర్ణమునుగావించి, కాలీయపుష్పమును, శ్రీపత్రమ రుచిత్యాజ్యమును యథా శక్తిగా సమస్తమును అనేక ద్రవ్య ధూపమును, కేవల గుగ్గులమును, సర్వ ధూపము కపిలామృత సంయుక్తమైనచో పరమోత్తమముగా పేర్కొనబడినది. యథాశక్తిగా ధూపమును సమర్పించి, కపిలాఘృతములచే దీపములను కాని, పూజామాత్రముచే దీపములనుంచి, ఉపహరము ఇచ్చి ఉపపన్నమగు నైవేద్యమును పుష్పసమన్వితముగా కల్పించి, ముఖశుద్ధిని గావించి, ఆదరముగా తాంబూలము నిచ్చి ప్రదక్షిణ నమస్కారములు గావించినచో పూజ పరిసమాప్తమగును.
ఇక ఇపుడు గీత్యంగ పంచకమును విజ్ఞాపన చేసెదను. గీతము, వాద్యము, పురాణము, హాసోక్తి నృత్యము అనునవి అయిదు గీత్యంగ పంచకము. నీరాజనము, పుష్పాంజలి, అఖిలార్పణము, క్షమాపణము, ఉద్వసనము అనునవి అయిదు ఉపచారములు. భూషణము, ఛత్రము, చామర వ్యజనములు, ఉపవీతము, కైంకర్యము అను షోడశోపచారములను చేయవలయును. ముప్పది రెండు ఉపచారములచే శివుని ఆరాధించినచో ఒకే దినమున సమస్త పాపములు నశించును. ఇట్లు చెప్పిన హనుమంతుని మాటలను విని శంకరుడు ఇట్లు పలికెను. నీవు చెప్పిన నా పూజా విధానమంతయూ సత్యమే. కాని ఇపుడు నేను నీకు సారభూతమగు దానిని ఉపదేశించెదను. లింగమున నీవు చెప్పిన విస్తృతమగు శివారాధనా ఫలమును నా పాదయుగమును అర్చించినచో పొందగలవు. అపుడు కపి శ్రేష్టుడు దేవదేవుడగు ఉమాపతిని గూర్చి ఇట్లు పలికెను. నా గురువు నాకు లింగపూజా నియమమును ఏర్పరిచెను. కావున మొదట లింగపూజను గావించి తరువాత నీ పాదపూజను కావింతును. ఇట్లు పలికి ఈశ్వరునికి నమస్కరించి శివ లింగార్చన కొరకు సరస్తీరమున కొచ్చి సైకత వేదికను కల్పించి తాళపత్ర రచితమగు ఆసనమును ఏర్పరచుకొని హస్తపాద ప్రక్షాళనము గావించి ఆచమనముచేసి సావధానుడై, భస్మస్నానమును గావించి, మరల ఆచమనముచేసి, వాక్కును నియమించి, దేవవేదియందు మనోహరమగు పద్మమును చేసెను. తరువాత తాళపత్రమున పద్మాసనగతుడై, ప్రాణాయామమును గావించి, వ్యాసమునుచేసి శుక్ల ధ్యానసమన్వితుడై గురువును ఈశ్వరుని నమస్కరించి జపించుచుండెను. అంతట కపీంద్రుడు దేవార్చన గావించుటకు ప్రయత్నించెను. మోదుగు ఆకుచే ఏర్పరిచిన రెండు దొప్పలచే తేబడిన పరిశుద్ధజలమును కమండలమున శిరమును ఉంచి అగ్నిని మంత్రితముగా ఆవాహనాదికము స్నానపర్యంతము గావించి స్నానము చేయించుటకు చేతులలోనికి శివలింగమును తీసుకొని చూడగా దేవపీఠము కనిపించదాయెను. చేతులలో కేవలము శివలింగమును చూచి నేనేమి మహాపాతకమును చేసితిని? ఇట్లు పీఠ రహితమగు శివలింగము నా చేతిలో నున్నది. పీఠము రానిచో ఈ దినము నా మరణము తప్పదు. కావున రుద్రుని జపించెను. అపుడు మహేశ్వరుడు వచ్చును అని నిశ్చయించి మనస్సుచే శత రుద్రీయమును జపించెను. అయిననూ మహేశ్వరుడు రాకపోగా కపీశ్వరుడు రుద్రుని భూమిపై పడవేసెను. అంతట వీరభద్రుడు వచ్చెను. ఓ శుభప్రదుడా? ఎందుకు రోదించు చుంటివి? రోదన కారణమును చెప్పుము అని అడిగెను. అంతట కపీంద్రుడు వీరభద్రునితో తన మనసులోని మాటను పీఠహీనమగు శివలింగమున్నది. నా పాప సంచయమును చూడుము అని పలికెను. అంతట వీరభద్రుడు ఆ మాటను విని పీఠము రానిచో శివలింగమున సాహసమును చేయకుము. నాకు శివలింగమును చూపుము. పీఠము వచ్చినదా లేదా? అని అడిగెను. అయిననూ లింగము రాకుండుటను చూచి ప్రతాపవంతుడగు వీరభద్రుడు అగ్నిని భూమిపై పడవేసెను. అదే క్షణములో భూమి దగ్ధమాయెను. అయిదు ఊర్ధ్వలోకములను దహించెను. లలాటనేత్ర సంభూతమగు అగ్నిని నఖముతో తీసుకొని చేతిలో ఉంచుకొని తపోలోకమును సత్యలోకమును దహించుటకు సిద్ధపడెను. అంతట తపోలోకనివాసులగు మునిజనులు దహించ సంకల్పించిన వీరభద్రుని చూచి గౌతమ ఆశ్రమమునకు వచ్చిరి. అచట శంకరుని చూడక తనలో నున్న శంకరుని భక్తితో వేద సముద్భూతములగు స్తోత్రములచే స్తుతించిరి. వేదవేద్యుడగు దేవునకు, శుద్ధ ప్రభాచిన్త్య రూపునకు, బ్రహ్మద్యధీశునకు సృష్ట్యాదికర్తకు, విష్ణుప్రియునకు, ఆర్తిహంతకు అంతకర్తకు నమస్కారము. అఖిలాధీశ్వరునకు, అంబర స్వరూపునకు, చరస్థావరవ్యాపకునకు, వేదగుహ్యునకు, భక్తి ప్రియునకు, పాకభోక్తకు, మఖేశునకు నమస్కారము. శివునకు, అదిదేవునకు, వ్యాళయజ్ఞోపవీత ధారికి, సురాబిందు వర్షాపసునకు, త్రయీమూర్తికి కాలకాలునకు నమస్కారము. ధరీత్రీమరుత్ వ్యోమతోయ ఇందు వహ్నిప్రభా మండలాత్మునకు అష్టమూర్తిధారికి, శివునకు అశివనాశికి, వీరునకు నమస్కారము. జగన్నాధులచే పూజించబడువాడు మాయెడ ఎల్లప్పుడు ప్రసన్నుడగు గావుత, కాలనాధపాలునకు నమస్కారము. ఆత్మ స్వరూపుడు, మహాత్ముడు, మనోరూపుడు, అగ్ర గణ్యుడు, వేదములచే నిరూపింప శక్యము కానివాడు, జగజ్జాడ్యమును ధ్వంసము చేయువాడు, భుక్తిముక్తి ప్రదుడు, శుద్ధకీర్తి ఎల్లప్పుడూ ప్రసన్నుడుగా ఉండనిమ్ము. ఈ ప్రపంచమును సృష్టించినవాడు, రక్షించువాడు, నశింపచేయువాడు, వాగ్విదూరుడు, కాలత్రయ స్వరూపుడు మాకు ప్రసన్నుడు కావలయును. స్వానుమానము కలవాడు, సర్వస్వరూపుడు మా విభూతి కొఱకు ఎల్లప్పుడు మాకు ప్రసన్నుడగు గావుత. మా కృత్యమును విజ్ఞాపనమును విన్నవించెదము. భగనేత్రప్రదుడగు శివుడు మునులు చేసిన స్తోత్రమును విని, ఈ మునులను నావద్దకు తీసుకొని రమ్మని విష్ణువునకు చెప్పెను. అంతట విష్ణువు తపోలోక వాసులను సమీపించి ఓదార్చి వారిని శివుని వద్దకు తీసుకొని వచ్చెను.
వారిని చూచిన శంకరుడు ఇట్లు పలికెను: ఓ పాపరహితులైన మునులారా? మీరు తపోలోకము నుండి భూలోకమునకు ఏల వచ్చితిరి? ఆ మాటలను వినిన మునులు ఇట్లు పలికిరి. ఓ దేవా! పన్నెండు లోకములు బూడిద కుప్పలుగా కనపడుచున్నవి. ఈ వనమొక్కటి మిగిలినది. ఆ లోక సంక్షయమును చూడుము. వారి మాటలను వినిన శంకరుడు జితేంద్రియులగు మునులను గూర్చి ఇట్లు పలికెను. భూలోకము పాతాళ లోకములు దగ్ధమగుటలో సందేహము లేదు. ఊర్ధ్వ పంచలోకముల దాహము విషయము లోనే సందేహము కలదు. ఊర్ధ్వలోకములపై అంగార వృష్టి ఎట్లు సంభవించినది? ఈ మహాధ్వని ఎట్లు వచ్చినది? అను ఈ శంకరుని ప్రశ్నను వినిన మునులు బద్ధాంజలులై శంకరునితో ఇట్లనిరి. ఇపుడు మాకు వీరభద్రుని వలన భయమేర్పడినది. అతనే అంగార వృష్టిని ఏర్పరచెను అనగా అంతట శంకరుడు వీరభద్రుని పిలిచి ఏమిటిది? అని అడిగెను. అంతట వీరభద్రుడు కపిశ్రేష్టుని శివలింగమున పీఠము లేనందువలన ఇట్లు పలికెను. ఆ మాటను విన్న శంకరుడు భయవిహ్వలులగు మునులనుచూచి ఇట్లు పలికెను. కవిశ్రేష్టుని మనసును తెలియగోరి నే నిట్లు చేసితిని. మీరు భయపడకుడు. మీకు క్షేమమును నేను కూర్చెదను అని ఇట్లు పలికి కృపానిధియైన దేవదేవుడు దగ్ధములైన లోకములను యథా పూర్వముగా మొదట కంటే శోభాయుతములుగా చేసెను. అపుడు వీరభద్రునితో ఇట్లు పలికెను. ఓ వత్సా! బాగు! నీవు భక్తులకు భద్రమును కల్పించుచున్నావు. కావున నీకు శాశ్వతమైన కీర్తి లోకమున వ్యాపించగలదు. ఇట్లు పలికి ఆలింగనము చేసుకొని శిరస్సును మూర్కొని ప్రీతితో వీరభద్రునకు తాంబూలమును ఇచ్చెను. అంతట హనుమంతుడు శివలింగపూజను యథావిధిగా పూర్తిచేసెను. పూజ ముగిసిన వెంటనే సంతోషము నిండిన కపిశ్రేష్టుడు వీణను నాకు ఇమ్మని అడిగెను. గంధర్వుడు కూడా ఈ వీణ నాకు చాలా ప్రియమైనది. కావున వీడలేననెను. నాకు కూడా చాలా ఇష్టమైనదీ వీణ అని హనుమంతుడు అనెను. అయిననూ గంధర్వుడు ఈయనందున హనుమంతుడు ముష్టి ప్రహారముతో గంధర్వుని నేలపైపడవేసెను. అంతట స్వరతంతు సమన్వితమైన వీణను తీసుకొని మీటుచు శివుని వద్దకు వెళ్ళెను. అంతట గానముచే జగదీశ్వరుని ప్రసన్నము చేసుకొని శుద్ధమగు బృహతీపుష్పములతో శివపాదములను పూజించెను. అంతట ప్రసన్నుడైన శివుడు మునులు, దేవతలు, దైత్యుల, రాజుల సమీపమున హనుమంతునికి కల్పాంత జీవనమును, సముద్ర లంఘన శక్తిని, సకల శాస్త్ర జ్ఞానమును, ఉన్నత బలమును వరముగా నిచ్చెను. ఇట్లు మహేశ్వరునిచే వరమును పొంది నా కనుల ముందే మహాసంతోషమును పొందెను. సమస్థాభరణ భూషితాంగుడై తన కాంతిచే దేవకాంతిని క్రిందుగాచేసి, ప్రసన్నమూర్తి, తరుణుడు, శివాంశ సంభూతుడు దేవతలను అందరిని సంభావించెను. అంతట నా సేవలో ఆజ్ఞాపింపబడినవాడై ఉండెను. నేను కూడా ఇతనిని శంకరునిగానే తలతును. ఇంకనూ ఏమనిచెప్పవలెను. బుద్ధిలో, న్యాయములో, ధైర్యములో హనుమంతునితో సమానుడు మరియొకడు లేడు. ఇట్లు వినువారలకు చదువువారలకు పాపములను నశింపచేయు హనుమచ్చరితమును నీకు చెప్పితిని. కావున నీ కనుకూలమైన ప్రదేశమునకు వెళ్ళుము. అట్లు రామభద్రుని వాక్యమునువిని నమస్కరించి అటనుండి వచ్చితిని. ఇట్లు నీకు సుఖమును మోక్షమునిచ్చు హనుమంతుని చరితమును చెప్పితిని. ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? (3/79)