గంగోత్పత్తి - గంగా మాహాత్మ్యము

నారదమహర్షి పలికెను: “ఓ భ్రాతా! చాల ఆశ్చర్యకరమైన విషయమును చెప్పితిరి. ఆ అగ్ని అదితిని వదిలి రాక్షసులను ఎట్లు క్షణములో దహించివేసెను? మిక్కిలి ఆశ్చర్యమును కలిగించు అదితి మాహాత్మ్యమును తెలుపుము. సజ్జనులైన మునీశ్వరులు పరులకు ఉపదేశించుట యందే ఆసక్తి కలిగి ఉందురు కదా!”

సనకమహర్షి పలికెను: “ఓ నారదా! హరిభక్తియందు ఆసక్తి గల మనసు కలవారి మాహాత్మ్యమును వినుము. శ్రీహరి ధ్యానమునందు మనసును ఉంచిన సాధువులను ఎవరు బాధించగలరు? హరి భక్తిపరుడున్న ప్రదేశమున బ్రహ్మ, శివుడు, శ్రీహరి, దేవతలు, సిద్ధులు మునీశ్వరులు ఎల్లపుడు నివసింతురు. శాంత చిత్తులైన వారి హృదయమున శ్రీహరి నివసించును. హరి నామ కీర్తనము చేయువారికి ధ్యానమునందు ఆసక్తి కలవారి విషయమును ఏమి చెప్పవలయును. శివపూజ చేయువాడు కాని, శ్రీమహావిష్ణువును పూజించువాడు కాని ఉన్న ప్రదేశముననే లక్ష్మి మిగిలిన దేవతలు అందరు నివసించెదరు. విష్ణుపూజా పరుడున్న ప్రదేశమున అగ్ని బాధించదు. రాజుకాని, చోరులుకాని, వ్యాధులు కాని బాధించవు. ప్రేతములు, పిశాచములు, కూష్మాండ గ్రహములు, బాలగ్రహములు, ఢాకినులు, రాక్షసులు అచ్యుతుని పూజించువానిని బాధించజాలవు. పరులను పీడించు స్వభావము కల భూతభేతాళాలు లక్ష్మీనారాయణులను పూజించు సద్భక్తులున్నచోట నశించుపోవును, ఇంద్రియజయము కలవారు. అందరి హితమును కోరువారు, ధర్మబద్ధమైన కర్మలను ఆచరించువారు ఉన్న ప్రదేశముననే అన్ని తీర్థములు, దేవతలు ఉందురు. ఒక నిమిషము గాని నిమిషార్థము కాని యోగులున్న ప్రదేశముననే అన్ని శ్రేయస్సులు కలుగును. ఆ ప్రదేశమే పుణ్య తీర్థము. అదియే తపోవనము. శ్రీహరి నామమును కీర్తించినంతనే అన్ని ఉపద్రవములు నశించును. స్తోత్రములచే పూజలచే నశించును. ధ్యానము చేసినచో నశించునని విడిగా చెప్పవలయునా? ఇట్లు రాక్షసులు సృష్టించిన అగ్నిచే రాక్షసులతో కూడియున్న అరణ్యమంతయూ కాలిపోయెను. విష్ణుచక్రముచే రక్షించబడిన అదితి మాత్రమే దగ్ధము కాలేదు.”

తరువాత ప్రస్నమైన ముఖము కలవాడు, పద్మదళమువలె విశాలమైన నేత్రములు కలవాడు, శంఖ చక్ర గదాద్యాయయుధములను ధరించినవాడు, చిరునవ్వుతో వెలుగుచున్న దంతముల కాంతితో దిక్కులను ప్రకాశింపచేయువాడు అయిన శ్రీమన్నారాయణుడు అదితి సమీపములో ప్రత్యక్ష మాయెను ఆ నారాయణుడు పరమ పవిత్రమైన తన చేతితో అదితిని తాకుచు ఇట్లు పలికెను.

శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను: “ఓ దేవమాతా! నీవు తపస్సుచే నన్ను ఆరాధించితివి. నేను నీకు ప్రసన్నుడనైతిని. చాలకాలము అలసిఉంటివి. నీకు శుభము కలుగును. సంశయించవలసిన పనిలేదు. నీకు నచ్చిన వరమును కోరుకొనుము. ఈయగలను. ఓ మహానుభావురాలా! భయపడకుము. తప్పక మేలు జరుగును. “ ఇట్లు శ్రీహరి పలుకగా శ్రీహరికి నమస్కరించి అన్ని లోకములకు ఆనందమును కలిగించు శ్రీహరిని స్తోత్రము చేసెను.

అదితి పలికెను: “దేవతలకు దేవుడవు, ప్రభువువు, అంతటా వ్యాపించియుండు వాడవు. సత్త్వరజస్తమో గుణభేదములచే లోకవ్యాపారములకు కారణభూతుడవు అయిన ఓ జనార్దనా! నీకు నమస్కారము. అనేక రూపములు గలవాడవు, రూపములేనివాడవు, మహానుభావుడవు అన్నిటిలో ఒకే రూపముతో ఉండువాడవు, గుణరహితుడవు, అనంత కళ్యాణగుణస్వరూపుడవు అయిన నీకు నమస్కారము. అన్ని లోకములకు నాధుడవు, పరమజ్ఞానస్వరూపుడవు, సజ్జనులగు భక్తులను వాత్సల్యముతో చూచు స్వభావము కలవాడవు, మంగళస్వరూపుడవు అయిన నీకు నమస్కారము. మునీశ్వరులు పూజించిన అవతార రూపములుగల ఆదిపురుషుని నా కోరిక సిద్ధించుటకు నమస్కరించుచున్నాను. శ్రుతులకు, జ్ఞానులకు తెలియశక్యముకానివాడు జగత్కారణభూతుడు, మాయతో కూడి ఉండువాడు, మాయకు వశము కానివాడు అయిన పరమాత్మకు నమస్కరించుచున్నాను. ఆశ్యర్యమును కలిగించు నీ దర్శనము మాయను పారద్రోలుటకు కారణము. జగత్స్వరూపుడు, జగత్కారణ భూతుడు అయిన అందరిచే నమస్కరించబడు వానికి నమస్కరించుచున్నాను. నీ పాదపద్మముల పరాగములను సేవించుటచే తమ మస్తకములను కాపాడుకొనుచు పరమసిద్ధిని పొందుచున్నారు. కమలాపతివైన నీకు నమస్కారము. బ్రహ్మాదులకు కూడా తెలియ శక్యముకాని మహిమ కలవాడు, భక్తులకు సన్నిహితముగా ఉండువాడు, భక్తులతో కలిసి ఉండువాడు అయిన స్వామికి నమస్కరించుచున్నాను. అన్ని సంగములను వదిలి శాంతచిత్తులయిన వారికి ఆత్మ సంగతిని కలిగించు కరుణాసముద్రుడు, సంగరహితుడు, యజ్ఞములకు ప్రభువు యజ్ఞకర్మస్వరూపుడు, యజ్ఞకర్మలయందు ఉండువాడు, యజ్ఞఫలములను ఇచ్చువాడు యజ్ఞకర్మలను బోధించువాడు అయిన ఆదిదేవునికి నమస్కరించుచున్నాను. కేవలము నామసంకీర్తనముచే అజామీళునికి పరమపదమును ప్రసాదించిన లోకసాక్షికి నమస్కరించుచున్నాను. హరిరూపముతో ఉన్న మహాదేవుడుగా, శివరూపముతో ఉన్న జనార్దనుడుగా, లోకాధిపతిగా ఉన్న జగద్గురువునకు నమస్కరించుచున్నాను. నీ మాయాపాశముతో బంధించబడి బ్రహ్మాదిదేవాధిపతులు కూడా పరస్వరూపమును తెలియలేకున్నాము అట్టి సర్వనాయకుడవగు నీకు నమస్కారము. అయోగ్యులకు హృదయపద్మములో ఉన్ననూ దూరమున ఉన్నవానివలె తోచుచున్నావు. ప్రమాణములకు అందని సత్త (ఉనికి) గల జ్ఞాన సాక్షికి నమస్కారము. నీ ముఖమునుండి బ్రాహ్మణులు పుట్టిరి. బాహువుల నుండి క్షత్రియులు పుట్టిరి. ఊరువులనుండి వైశ్యులు పుట్టిరి. పాదములనుండి శూద్రులు పుట్టిరి. మనసు నుండి చంద్రుడు, నేత్రము నుండి సూర్యుడు, ముఖమునుండి అగ్ని, ఇంద్రుడు, ప్రాణమునుండి వాయువుపుట్టెను. ఋగ్యజుస్సామ స్వరూపునకు, సత్యవాక్స్వరూపునకు, షడంగ రూపునకు, మాటిమాటికి నమస్కారము. నీవే ఇంద్రుడవు; వాయువు; చంద్రుడవు; శంకరుడవు; యముడవు; అగ్నివి; నిర్ ఋతివి; వరుణుడవు; సూర్యుడవు, దేవతలు, స్థావరములు, పిశాచములు, రాక్షసులు, పర్వతములు సిద్ధులు, గంధర్వులు, నదులు, భూమి, సముద్రములు అన్నియు నీవే. జగత్తునకు ఈశ్వరుడవు నీవే. పరములన్నిటికి పరుడవు నీవే. ఈ ప్రంచమంతయూ నీరూపమే. కావున నీకు సర్వకాలములందు నమస్కారము. దిక్కులేని వారికి నీవే దిక్కు, సర్వజ్ఞుడవు. భూతముల, దేవతల, అధిపతుల స్వరూపుడవు నీవే. ఓ జనార్దనా! రాక్షసులచే బాధించబడు నా పుత్రులను కాపాడుము.” ఇట్లు దేవమాతయగు అదితి జనార్దనుని స్తుతించి, మాటిమాటికి నమస్కరించి చేతులు జోడించి ఆనందాశ్రువులతో తడిసిన స్తనములు కలదై మరల ఇట్లు పలికెను.

“అన్నిటికి ఆదికారణభూతుడవైన ఓ దేవేశా! నీ అనుగ్రహమునకు పాత్రురాలగుదునేని. స్వర్గవాసులగు నా పుత్రులకు అడ్డులేని ఐశ్వర్యమును ప్రసాదించుము. ఓ అంతర్యామీ! జగత్స్వరూపా! సర్వజ్ఞుడా! పరమేశ్వరా! నీకు తెలియనిది ఏమున్నది? నన్ను పరీక్షించుచుంటివా? అయిననూ నా మనసునకు నచ్చిన దానిని నీకు చెప్పెదను. నా పుత్రులు వ్యర్థులై ఉన్నారు. దైత్యుల చేత పీడింపబడుచున్నారు. అయిననూ నేను దితిపుత్రులను హింసించదలచలేదు. వారు కూడా నా పుత్రులే. వారికి హాని కలుగకుండా నా పుత్రులకు ఐశ్వర్యమును ప్రసాదింపుము.” అని అదితి పలుకగా దేవదేవేశుడగు శ్రీమన్నారాయణుడు మరల ప్రీతిచెంది అదితిని సంతోషింపచేయుచు ఆదరముతో దేవమాతను గూర్చి ఇట్లు పలికెను.

శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను: “ఓ దేవమాతా! నేను సంతోషించితిని. నీకు శుభమగు గాక. నేను నీకు పుత్రుడను అగుదును. సవతి కొడుకుల యందు దుర్లభమగు వాత్సల్యమును నీవు చూపితివి. నీవు చేసిన స్తోత్రమును చదివిన మానవులకు ఐశ్వర్యముతో కూడిన పుత్రులు తరుగకుండా ఉందురు. తన పుత్రునియందు ఇతరుల పుత్రుని యందు సమభావముతో ఉండు వారికి పుత్రశోకము కలుగదు. ఇది సనాతన ధర్మము.”

అదితి పలికెను: “ఆదిపురుషుడవు పరమపురుషుడవు అయిన నిన్ను నేను మోయలేను. నీకు లెక్కలేనన్ని బ్రహ్మాండములు రోమకూపములుగా ఉన్నవాడవు. సర్వేశ్వరుడవు సర్వకారణుడవు. దేవతలందరూ, శ్రుతులన్నియూ నీ ప్రభావమును తెలియజాలవు. అట్టి దేవదేవేశుడవైన నిన్ను నేనెట్లు ధరించగలను? అణువుకంటె అణువు, పుట్టుకలేనివాడవు, పరము కంటే పరుడవు, ప్రభువువు, పురుషోత్తముడవైన నిన్ను నేనెట్లు ధరించగలను? నీ నామస్మరణ మాత్రముననే మహాపాతకములతో కూడి యున్నవాడుకూడా పాతకముల నుండి విడివడును. అట్టి దేవదేవుడవైన నీవు గ్రామ్యులమైన (అజ్ఞానులు) మాయందెట్లు పుట్టెదవు? మత్స్యవరాహాద్యవతారములవలె ఇది కూడా ఒక అవతారమే. నీ విశేష చేష్టలను ఎవరు తెలియగలరు? నీ పాదపద్మములకు వందనములు ఆచరించుచు, నీ నామమును స్మరించుచు నిన్నే ధ్యానించుచుందును. నీ సంకల్పము ప్రకారము చేయుము.

సనకమహర్షి పలికెను: దేవదేవుడగు జనార్దనుడు అదితి పలికిన మాటలను విని దేవమాతకు అభయమిచ్చి ఇట్లు పలికెను.

శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను: “ఓ మహానుభావురాలా! నీవు నిజమునే చెప్పితివి. ఈ విషయమున సంశయమే లేదు. అయిననూ రహస్యములన్నింటికంటే పరమ రహస్యమును నేను చెప్పుచున్నాను, వినుము. రాగద్వేషములు లేనివారు, అసూయను పోగొట్టినవారు, డాంబికము లేనివారు, నా భక్తులు నాయందే మనసును నిలిపినవారు. నన్ను ధరించగలరు (మోయగలరు). ఇతరులను బాధించుటలో వైముఖ్యము కలవారు. శివభక్తి పరాయణలు, నా కథను వినుటలో ఆసక్తి కలవారు నన్ను మోయగలరు. పతివ్రతలు, పతియందు ప్రేమ గలవారు. పతిభక్తి పరాయణులు మాత్సర్యమను విడిచిన స్త్రీలు కూడా నన్ను మోయగలరు. తల్లిదండ్రులను సేవించువారు, గురుభక్తి కలవారు, అతిథియందు ప్రీతిని చూపువారు, బ్రాహ్మణులకు హితమును చేయువారు నన్ను మోయగలరు. పుణ్యతీర్థములను సేవించటయందాసక్తి కలవారు, సత్సంగమునందు కోరిక గలవారు, లోకులను అనుగ్రహించు స్వభావము కలవారు నన్ను మోయగలరు. ఇతరులకు ఉపకారము చేయువారు, ఇతరుల ద్రవ్యమును ఆశించనివారు, ఇతరుల స్త్రీల విషయమున నపుంసకులవలె నుండువారు నన్ను మోయగలరు. తులసిని ఉపాసించువారు. నామ సంకీర్తనము చేయువారు, గోవులను రక్షించువారు నన్ను మోయగలరు. ఇతరుల నుండి దానమును గ్రహించనివారు, ఇతరుల అన్నమును భుజించనివారు, ఇతరులకు అన్నమును జలమును ఇచ్చువారు నన్ను మోయగలరు. ఓ దేవీ! నీవు భర్తయందు అనురాగము కలదానవు. సాధ్వివి. ప్రాణుల హితమును కోరుదానవు. కావున నీకు పుత్రునిగా జన్మించి నీ కోరికను తీర్చగలను.” దేవదేవేశుడగు శ్రీమన్నారాయణుడు ఇట్లు పలికి దేవమాతయగు అదితికి తన మెడలోని పుష్పమాలను, అభయమునిచ్చి అంతర్ధానమును చెందెను. దక్షప్రజాపతి పుత్రిక దేవమాతయగు అదితి సంతోషముతో నిండిన మనసుగలదై శ్రీమన్నారాయణునికి నమస్కరించి తన ఇంటికి వెళ్ళెను.

మహానుభావురాలు, సంతోషయుక్తురాలు, లోకములచే నమస్కరించదగినది అయిన అదితి కొంతకాలమునకు సరిఅయిన సమయమున అన్ని లోకములచే నమస్కరించబడు శ్రీమన్నారాయణుని పుత్రునిగా ప్రసవించెను. శంఖచక్రములను ధరించినవాడు, శాంతుడు, చంద్రమండల మధ్యమున గోచరించువాడు, అమృతకలశమును, పెరుగన్నమును చేత ధరించినవాడు, వామనుడను పేరుగలవాడు, వేయి సూర్యుల ప్రకాశము కలవాడు, వికసించిన కమలములవలె విశాలములైన నేత్రములు కలవాడు, అన్ని ఆభరణములు కలవాడు, పచ్చని వస్త్రమును ధరించినవాడు, స్తోత్రము చేయదగినవాడు, మునిగణములతో కూడియుండువాడు, అన్ని లోకములకు ఒకడే నాయకుడు అయిన శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించుట చూచిన కశ్యపమహర్షి ఆనందముతో తడబడుచు నమస్కరించి చేతులు జోడించి స్తోత్రము చేయుటకు ఉపక్రమించెను.

కశ్యపమహర్షి పలికెను: “సమస్తజగత్తునకు కారణభూతునకు నమస్కారము. సమస్తలోకములను రక్షించు వానికి నమస్కారము. దేవతల నాయకునికి నమస్కారము. దైత్యులను నశింపచేయువానికి నమస్కారము. భక్తజన ప్రియునికి సజ్జనరంజకునికి, దుర్జననాశకునికి, జగదీశ్వరునికి నమస్కారము. కారణార్థము వామనుడైన వానికి, అమిత పరాక్రమము కలవానికి శార్ఙము, చక్రము, ఖడ్గము, గదను ధరించిన పురుష్తోముడైన శ్రీమన్నారాయణునకు నమస్కారము. సముద్రమున నివసించువానికి, సజ్జనహృదయ కమలములయందు నివసించువానికి, సూర్యాది తేజోరాశులను మించిన తేజస్సు కలవానికి, పుణ్యకథలలో నివసించువానికి నమస్కారము. సూర్యచంద్రులు నేత్రములుగా గలవానికి, యజ్ఞఫలమును ఇచ్చువానికి, యజ్ఞాంగములతో ప్రకాశించువానికి, సజ్జన ప్రియునికి నమస్కారము. జగత్కారణములకు కారణమైన వానికి, శబ్దాదిగుణములు అంటనివానికి, దివ్యానందము నిచ్చువానికి, భక్తుల మనసులో ఉండువానికి నమస్కారము. చీకటిని తొలగించువానికి, మందరపర్వతమును మోసిన వానికి, యజ్ఞవరాహమను పేరుగల వానికి, హిరణ్యాక్షుని చీల్చిన వానికి నమస్కారము. వామన రూపమును ధరించిన వానికి, క్షత్రియ కులాంతకునికి, రావణాసురుని మర్దించినవానికి, నందసుతునికి నమస్కారము. కమలాకాంతునకు, ఆనందము నిచ్చువానికి, తల చిన వారి ఆర్తిని తొలగించువానికి, మాటిమాటికి నమస్కారము. యజ్ఞేశునకు, యజ్ఞవిన్యాసునకు, యజ్ఞ వినాశునకు, యజ్ఞరూపునకు, పూజారూపునకు, యజ్ఞాంగునకు నమస్కారము. నిన్ను పూజింతును. లోకపావనుడైన వామనుడు ఇట్లు స్తుతించబడి చిరునవ్వుతో కశ్యపునికి ఆనందమును పెంచుచు ఇట్లు పలికెను.

శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను: “ఓ తండ్రీ! దేవతలచే పూజించబడువాడా! నీ విషయమున సంతోషించితిని. నీకు శుభము కలుగును త్వరలోనే నీ కోరికను సాధించగలను నేను ఇదివరకు రెండు జన్మలలో మీకు పుత్రుడినైతిని. అట్లే ఈ జన్మలో కూడా మీకు ఉత్తమ ఆనందమును అందించగలను.”

ఇంతలో బలిచక్రవర్తి తన గురువైన శుక్రాచార్యులతో, ఇతర మునీశ్వరులతో కలిసి దీర్ఘపత్రమను గొప్పయజ్ఞము నారంభించెను. ఆ యజ్ఞమున హవిస్సును స్వీకరించుటకు లక్ష్మీనారాయణుని ఋషులు ఆహ్వానించిరి. వృద్ధిచెందిన ఐశ్వర్యముకల బలిచక్రవర్తి చేయుచున్న యజ్ఞములో పాల్గొనుటకు తల్లిదండ్రుల ఆజ్ఞను పొంది బ్రహ్మచారి అయిన వామనుడు భక్తవత్సలుడు కావున చిరునవ్వుతో లోకమును మోహింప చేయుచు శ్రీహరి ప్రత్యక్షముగా హవిస్సును స్వీకరించుటకు వచ్చెనా అనునట్లు అచటికి వచ్చెను. చెడునడత గలవాడుకాని, మంచి నడత గలవాడుకాని, జడుడు కాని హితుడు కాని భక్తి కలవానిలో హరి వేంచేసి ఉండును. జ్ఞాననేత్రము గల ఋషులు వచ్చుచున్న వామనుని చూచి శ్రీమన్నారాయణ దేవునిగా తెలిసి సభ్యులతో కలిసి లేచిరి. దైత్యగురువైన శుక్రాచార్యులు ఈ విషయమును తెలుసుకొని ఏకాంతమున బలిచక్రవర్తితో ఇట్లు పలికెను. మూర్ఖులు తన బలమును తెలియకనే కార్యములను చేతురు కదా.

శుక్రాచార్యులు పలికెను: “ఓ దైత్యరాజా! సౌమ్యుడా! శ్రీమహావిష్ణువు వామన రూపముతో అదితి పుత్రుడై నీ సంపదను హరించబోవుచున్నాడు. ఇపుడు నీ యజ్ఞమునకు వచ్చుచున్నాడు. కావున నీవు అతనికి ఏ కొద్దిగా అయినను ఈయకుము. ఓ పండితుడా! నా అభిప్రాయమును వినుము. తన బుద్ధి సుఖమునిచ్చును. గురుబుద్ధి విశేషముగా సుఖము నిచ్చును. పరబుద్ధి వినాశనము కలిగించును. స్త్రీబుద్ధి ప్రళయమునే కలిగించును. శత్రువులకు హితమును చేయువానిని చంపియే తీరవలయును.”

బలిచక్రవర్తి పలికెను: “ఓ గురువర్యా! ఇట్లు ధర్మమార్గవిరోధముగా చెప్పవద్దు. స్వయముగా శ్రీమహావిష్ణువే స్వీకరించినచో ఇంతకన్నా ఎక్కువ కావలసినదేమున్నది. శ్రీమహావిష్ణువునకు ప్రీతి కలిగించుటకే విద్వాంసులు యజ్ఞమును చేసెదరు. ఆ శ్రీమహావిష్ణువే స్వయముగా హవిస్సును స్వీకరించినచో ఈ భూమండలమున నన్ను మించినవాడు ఎవండును? దరిద్రుడైనను శ్రీమహా విష్ణువునకు ఏ కొంచెము అర్పించిననూ అదియే ఉత్తమమైన, అక్షయమైన దానమనబడును. పురుషోత్తముని పరమభక్తిచే స్మరించిననూ ఏదోవిధముగా ఆర్చించినను ఉత్తమ గతిని ప్రసాదించును. దుష్టచిత్తులు స్మరించినను శ్రీహరి పాపములను హరింపచేయును. అనుకోకుండా తాకిననూ అగ్ని కాల్చును కదా! శ్రీహరి నామము నాలుక చివర ఉంచుకొనినవాడు మళ్ళీ తిరిగి రాని విష్ణు లోకమును పొందగలడు. రాగద్వేషాదులను వదిలి ఎప్పుడూ గోవిందనామస్మరణము చేసినవారు విష్ణు భవనమును చేరును అని పండితులు చెప్పెదరు. శ్రీహరియందు భక్తిచే అగ్నియందు కాని, బ్రాహ్మణునియందు కాని హవిస్సును అర్పించినచో శ్రీహరి ప్రసన్నుడగును. నేను శ్రీహరి సంతోషము కొఱకే ఉత్తమ యాగమును చేయుచున్నాను. ఈ యాగమునకు స్వయముగా శ్రీమహావిష్ణువే వచ్చినచో కృతార్థుడనగుదును. సంశయములేదు.” ఇట్లు బలిచక్రవర్తి చెప్పుచుండగా వామన రూపమును ధరించిన శ్రీమహావిష్ణువు హవిస్సులచే జ్వలించుచున్న అగ్నిచే సుందరమైన యాగ స్థానమునకు వచ్చెను. కోటిసూర్యుల కాంతిగలవాడు తగిన విధముగా అవయవముల పొందికతో అందముగా ఉన్న వామనుని చూచి తొందరతో లేచి చేతులు జోడించి స్వాగతము పలికెను. అననమున నర్పించి నామరూపముతో నున్న శ్రీమహావిష్ణువునకు పాదప్రక్షాళనము చేసి కుటుంబముతోపాటు పాదోదకమును శిరస్సున ధరించి పరమానందమును చెందెను. బలిచక్రవర్తి జగన్నివాసుడగు శ్రీమహావిష్ణువునకు యథావిధిగా అర్ఘ్యమునిచ్చి శరీరమున పులకలు, కన్నుల వెంట ఆనందబాష్పములు రాగా ఇట్లు పలికెను.

బలిచక్రవర్తి పలికెను: “ఈ వేళ నా జన్మ సఫలమైనది. ఈవేళ నా యజ్ఞము సఫలమైనది. నా జీవితము ధన్యమైనది. నేను కృతార్థుడనైతిని. సంశయము లేదు. ఎంత శ్రమించిననూ లభించని సఫలమైన అమృతవర్షము నాకు లభించినది. నీ రాకచే శ్రమలేకనే గొప్ప పండుగ వచ్చినది. ఈ ఋషులందరూ కృతార్థులైరి. సంశయము లేదు. వీరు మొదట చేసిన తపస్సు ఈవేళ సఫలమైనది. నేను ముమ్మాటికీ కృతార్థుడనైతిని. నీకు ముమ్మారు వందనములు. నీ ఆజ్ఞచే ఈ పనిని చేయవలయునని నా సంకల్పము. మిక్కిలి ఉత్సాహముతోచ ఉన్న నన్ను అజ్ఞాపించుము.” ఇట్లు బలి చక్రవర్తి పలుకగా వామనుడు నవ్వుచు పలికెను. తపస్సు చేసుకొనుటకు నాకు మూడడుగుల భూమి నిమ్ము. ఈ మాటలను వినిన బలి “రాజ్యమునో, నగరమునో, గ్రామమునోకోరక, చివరకు ధనము నైన కోరక ఇదియేమి ఇట్లు అడిగితిరి” అని పలికెను. ఆ మాటలను వినిన వామనుడు రాజ్యభ్రష్టుడు కానున్న వానికి వైరాగ్యమును కలిగించునట్లు ఇట్లు పలికెను.

శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను: “అన్ని రహస్యములలో పరమ రహస్యమును చెప్పెదను. ఓ దైత్యరాజా! వినుము. ఏ సంగములు లేనివారికి అర్థములతో ఏమి ప్రయోజనమో చెప్పుము. నేను అన్ని ప్రాణులలో అంతర్యామిగా ఉందునని భావించుము. అట్లే ఈ జగత్తంతయూ నాలోనే ఉన్నది. కావున ఇతరులతో నేను సాధించవలసినది ఏమున్నదో చెప్పుము. రాగ ద్వేషములు లేక శాంతులై కపటమును వదిలి నిత్యానంద స్వరూపులుగా ఉన్నవారు ఇతర ధనములతో ఏమి సాధించగలరు? తన వలె అన్ని ప్రాణులు అని చూచువారికి ఇది అంతయు ఆత్మకంటే భిన్నము కానిదే అయినపుడు ఇచ్చువాడెవడు? ఇచ్చునదేమి? ఈ భూమి క్షత్రియాధీనములో నుండును అని శాస్త్ర నిర్ణయము. రాజాజ్ఞలో ఉండువారికి పరమానందము లభించును. ఓ బలిచక్రవర్తీ! మునులు కూడా తమ తపస్సులో ఆరవ భాగమును రాజునకు ఈయవలయును. అన్ని విధములుగా ప్రయత్నించి ఈ భూమిని బ్రాహ్మణునకు దానమును చేయవలయును. భూదానము యొక్క మాహాత్మ్యము ఇంకొకదానికి లేదు. ఉండబోదు. భూదానమును చేయువారు పరమానందమును పొందుదురు. ఈ విషయమున సంశయములేదు. నిత్యాగ్ని హోత్రుడు, శ్రోత్రియుడు అయిన బ్రాహ్మణునికి ఏ కొంచెము భూమిని దానము చేసిననూ పునరావృత్తి రహితమైన బ్రహ్మలోకమునకు వెళ్ళును. భూమిదానమును చేసినవాడు అన్ని దానములు చేసినవాడగును. భూదానము చేసినవారు మోక్షమును పొందెదరు. భూదానము సర్వశ్రేష్ఠమైన దానము. భూదానము అన్ని పాపములను నశింపచేయును. మహాపాతకములతో కూడియున్ననూ అన్ని పాతకములు ఉన్ననూ పదిమూరలు భూమిని దానము చేసినవారు అన్ని పాపములనుండి విముక్తుడగును. యోగ్యునికి భూదానము చేయువాడు అన్ని దానములు చేసిన ఫలితమును పొందును. భూదానముతో సమానమైనది మరియొకటి ఈ మూడు లోకములలో లేదు. బ్రతుకు తెరువులేని బ్రాహ్మణునికి భూమిని దానము చేసినవానికి కలుగు పుణ్యఫలమును నేను కూడా నూరు సంవత్సరములలో కూడ చెప్ప జాలను. దేవపూజల యందాసక్తుడై బ్రతుకుతెరువులేని బ్రాహ్మణునికి ఏ కొంచెము భూమిని దానము చేసిననూ వాడు విష్ణువే. ఇచట సంశయము లేదు. చెఱకు, గోధుమ, కంది, పోకచెట్టు గల భూమిని దానము చేసినవాడు విష్ణువే. సంశయములేదు. బ్రతుకు తెరువు లేనివాడు దరిద్రుడు, కుటుంబము కలవాడు అయిన బ్రాహ్మణునికి కొంచెము భూమిని దానము చేసిననూ విష్ణుసాయుజ్యమును పొందును. దేవపూజలయందు ఆసక్తుడై ఉన్న బ్రాహ్మణునకు ఒక అడ్డ ధాన్యము (నాలుగు కిలోల) విత్తుటకు యోగ్యమైన భూమిని దానమును చేసినవాడు మూడు రోజులు గంగా స్నానమును చేసిన ఫలమును పొందును. బ్రతుకు తెరువు లేనివాడు సదాచారపరాయణుడు అయిన బ్రాహ్మణునకు నాలుగు బస్తాల ధ్యానమును విత్తుటకు తగిన భూమిని దానము చేసిన వానికి నూరు అశ్వమేధ యాగముల ఫలమును నూరు గంగాస్నానముల ఫలము లభించును. దరిద్రుడైన బ్రాహ్మణునకు పుట్టెడు ధాన్యమును (8 బస్తాలు) విత్తుటకు తగిన భూమిని దానము చేసినవానికి, వేయి అశ్వమేధములను నూరు వాజపేయములను గంగాతీరమున చేసిన ఫలము లభించును. అన్ని దానములలో గొప్ప దానము సాటిలేని దానము భూదానమని చెప్పబడినది. భూదానము అన్ని పాపములను నశింపచేయును. మోక్షమును ప్రసాదించును.

ఓ దైత్యరాజా! ఈ విషయమున ఒక ఇతిహాసమును చెప్పెదను వినుము. ఈ ఇతిహాసమును శ్రద్ధగావినిన వానికి భూదానఫలము లభించును. పూర్వకాలమున బ్రాహ్మ కల్పమున మహామతి, దరిద్రుడు, వృత్తి హీనుడగు బ్రాహ్మణుడు, భద్రమతి అని పేరుగల వాడుండెను. ఇతను అన్ని శాస్త్రములను, అన్ని వేదములను అన్ని పురాణములను, ధర్మ శాస్త్రములను అభ్యసించెను. భద్రమతికి ఆరుగురు భార్యలుండిరి. శ్రుతి, సింధు, యశోవతి, కామిని, మాలినీ, శోభాఅని వారిపేర్లు. ఈ భార్యలయందు ఇతనికి రెండువందల నలభై మంది పుత్రులు కలిగిరి. ఈ పుత్రులు భార్యలు చివరికి తాను కూడా ఆకలిచే పీడించబడుచు ఆకులమైన మనస్సుతో విలపించెను. భాగ్య రహితమైన జన్మ, ధనములేని జన్మ వ్యర్థము, ధర్మము, ఖ్యాతిలేని జన్మము వ్యర్థము. బహుసంతానము గలవానికి ఐశ్వర్యము లేనిచో వానిజన్మము వ్యర్థము. సౌమ్యత, వైదుష్యము, సత్కులజన్మ మొదలగు సద్గుణములు దారిద్య్ర సాగరములో మునిగినవారికి శోభించవు. ఐశ్వర్యములేని వానిని ప్రియులు, పుత్రులు, పౌత్రులు, బాంధవులు, సోదరులు, శిష్యులు అందరూ విడిచెదరు. చండాలుడైనను, బ్రాహ్మణుడైనను భాగ్యవంతుడే పూజింపబడును. దరిద్రుడైన పురుషుడు శవము వలె లోకముచే నిందించబడును. సంపద కలవాడు కఠినుడైనను మృదు స్వభావము కలవాడే. గుణహీనుడైననూ గుణవంతుడే. మూర్ఖుడైననూ పండితుడే. ఐశ్వర్యగుణముతో కూడిన వాడు పూజించదగినవాడే. సంశయము లేదు. దారిద్య్రము దుఃఖప్రదము. అందులో ఆశ పరమ దుఃఖప్రదము. ఆశతో కూడినవారు అంతులేని దుఃఖమును పొందెదరు. ఆశకు దాసులైనవారు లోకమంతటికి దాసులగుదురు. ఆశను దాసిగా చేసుకొన్నవారికి లోకమే దాస్యము చేయును. మహాత్ములకు అభిమానమే తిరుగులేని ధనము. ఆశచే అభిమానము నశించినచో దారిద్య్రము ప్రాప్తించును. సర్వశాస్త్రార్థములు తెలిసిన వాడైనను దరిద్రుడైనచో మూర్ఖుని వలె అనిపించును. దారిద్య్రమను గొప్ప మొసలి పట్టినవానికి మోక్షము లేదు. దరిద్రత చాలా దుఃఖమును కలిగించును. ఆ దారిద్ర్యములో బహుపుత్రత, బహుభార్యాత్వము మరీ దుఃఖప్రదము. ఇట్లు సర్వశాస్త్రములు తెలిసిన భద్రమతి విలపించి ఐశ్వర్యము నిచ్చు మరియొక ధర్మమును గూర్చి ఆలోచించెను.

అన్ని దానములలో ఉత్తమ దానము భూదానమని నిశ్చయించి, దానము నిచ్చువాడెవడో అతడే వసిష్ఠుడు అని, పరమ ధర్మమును పొందించునది అన్ని కోరికలను నెరవేర్చునది దానములలో ఉత్తమదానము భూదానమని ప్రశంసించబడినది. భూదానము చేసి కావలసిన దానినంతటిని పొందవచ్చును అని నిశ్చయించి బుద్ధిమంతుడు ధైర్యము గలవాడయిన భద్రమతి భార్యాపుత్రులతో కౌశాంబి అను నగరమునకు వెళ్ళెను. సఘోషుడు అను పేరుగల ఐశ్వర్యవంతుడు అయిన బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి అయిదు మూరల భూమిని యాచించెను. సుఘోషుడు ధర్మము యందాసక్తి కలవాడు కావున కుటుంబి అయిని భద్రమతిని చూచి ప్రీతిగల మనసుతో చక్కగా పూజించి ఇట్లు పలికెను. “ఓ భద్రమతీ! నేను కృతార్థుడనైతిని. నా జన్మ సఫలమైనది. నీ యనుగ్రహముతో నా కులము పావనమైనది.” అని పలికి భద్రమతిని బాగుగా పూజించి ధర్మతత్పరుడైన సఘోషుడు అతనికి అయిదు మూరల భూమిని దానము చేసెను. విష్ణువునకు సంబంధించిన పృథివి, విష్ణువుచే పాలించబడు పృథివి. అట్టి పృథ్విని దానము చేయుటచే నాకు జనార్దనుడు ప్రసన్నడగు గాక అను మంత్రముచే సఘోషుడు ఆ బ్రాహ్మణోత్తముని విష్ణుభావనచే పూజించి అతడు అడిగినంత భూమిని దానము చేసెను. అట్లు భూదానమును స్వీకరించిన భద్రమతి హరిభక్తుడు శ్రోత్రియుడు కుటుంబి జ్ఞాని అయిన బ్రాహ్మణోత్తముడు యాచించగా దానము చేసెను. ఇట్లు భూదానము చేసిన సఘోషుడు కోటి వంశములతో కూడిన వాడై వెళ్ళిన తరువాత దుఃఖించని విష్ణుభవనమును చేరెను. సుఘోషుని నుండి భూమిని స్వీకరించిన భద్రమతి కూడా కుటుంబముతో పదివేల యుగములు విష్ణు భవనమున నివసించి, కోటియుగములు బ్రహ్మ భవనమున నివసించి, అయిదు కల్పములు ఇంద్రపదవిని అధిష్టించి తరువాత భూలోకమునకు చేరి అన్ని ఐశ్వర్యములతో మహానుభావుడై ఉత్తమ భోగములను అనుభవించెను. అయినను భద్రమతి కామ రహితుడై విష్ణువు. నందు భక్తిగలవాడై బ్రతుకుతెరువు లేని బ్రాహ్మణులకు భూమిని దానము చేసెను. భద్రమతికి శ్రీమహావిష్ణువు ప్రసన్నుడై సాటిలేని తత్త్వసంపదను ప్రసాదించి కోటి వంశములతోకూడిన వానికి సాటిలేని మోక్షము నిచ్చెను. కావున సర్వధర్మ పరాయణుడవైన ఓ దైత్యపతీ! మోక్షము కొఱకు తపస్సు చేయుటకు మూడడుగుల భూమిని ఇమ్ము. అప్పుడు బలి చక్రవర్తి సంతోషించినవాడై జల పూర్ణమైన కలశమును తీసుకొని బ్రహ్మచారియైన వామనునకు భూదానమును చేయుటకు సిద్ధపడెను.

అపుడు అంతటా వ్యాపించియున్న శ్రీమహావిష్ణువు జలధారను అడ్డుచున్న శుక్రాచార్యుని తెలుసుకొని తన చేతిలోనున్న దర్భాగ్రమున బ్రహ్మాస్త్రమును అనుసంధించెను. అపుడు ధర్భాగ్రమున కోటి సూర్యకాంతి గల అమోఘమైన అత్యుగ్రమైన బ్రహ్మాస్త్రమును శుక్రా చార్యులు కన్నను మ్రింగవలయునని ఆసక్తి కలదాయెను. ఒంటి కన్నుగల శుక్రాచార్యుడు శూరులైన ఆ అసురులను శపించెను. ‘చూడుము’ అని శస్త్రమువంటి ఆ దర్భాగ్రమును చూపెను. తరువాత బలి చక్రవర్తి శ్రీమహావిష్ణువునకు మూడడుగల భూమిని ధారపోసెను. విశ్వాత్మకుడైన శ్రీమహావిష్ణువు బ్రహ్మ లోకము వరకు పెరిగెను. విశ్వశరీరుడైన శ్రీహరి ఈ భూమిని రెండు అడుగులతో కొలిచెను. చివరవరకు శ్రీహరి పాదము కాంతివంతమై సాగగా కాలి బొటనవ్రేలు గోరుచివరతో బ్రహ్మాండము రెండుగా చీలిపోయెను. ఆ బ్రహ్మాండము నుండి జలము బహుధారలుగా బయటకు వచ్చెను. అట్లు వచ్చి విష్ణు పాదమును కడిగి నిర్మలము లోకములను పావనము చేయునది ఆయెను. బ్రహ్మాండము వెలుపలనున్న జలము ధారా రూపముగానుండెను. అట్లు పావనమైన ఆజలము బ్రహ్మాది దేవతలను పావనము చేసెను. సప్తర్షులతో సేవించబడి మేరుపర్వత శిఖరముపై పడెను. ఇట్లు అత్యాశ్చర్యకరమైన ఈ కార్యమును చూచిన బ్రహ్మాది దేవతలు, ఋషులు, మనువులు ఆనందముతో పరవశులైన స్తోత్రమును చేసిరి.

దేవతలు పలికిరి: పరేశునికి, పరాత్మరూపునికి, పరాత్పరునికి, అపర రూపధారికి, బ్రహ్మ స్వరూపునికి, బ్రహ్మయందు ఆసక్తుడైన వాని బుద్ధిలో ఉండువానికి నమస్కారము. అడ్డులేని కర్మలు చేయు స్వభావము కలవానికి నమస్కారము. ఓ పరేశా! పరమానంద స్వరూపా! పరమాత్మా! పరాత్పరా! సర్వాత్మా! జగత్స్వరూపా! ప్రమాణములకు అందనివాడా! నీకు నమస్కారము. అనేక నేత్రములు గల వానికి, అనేక బాహువులు గల వానికి, అనేక శిరస్సులు గల వానికి, అనేక గతులు గల వానికి సమస్కారములు. ఇట్లు బ్రహ్మాదులచే స్తుతించబడిన శ్రీమహావిష్ణువు సనాతనుడైన దేవదేవుడు స్వర్గవాసులైన దేవతలకు అభయమునిచ్చి ఆనందించెను. విరోచనుని పుత్రుడైన బలి చక్రవర్తిని మిగిలిన ఒక అడుగు భూమికొఱకు బంధించెను. తరువాత బలి చక్రవర్తి శరణు వేడినవాడని తెలుసుకొని బలి చక్రవర్తికి రసాతల రాజ్యమును ప్రసాదించి, భక్తవత్సలుడైన శ్రీహరి ఇతనికి ద్వారపాలకునిగా ఉండెను.

నారదమహర్షి పలికెను: భయంకరము సర్పముల భయముతో ఆకులము అయిన రసాతలమున శ్రీమహావిష్ణువు బలి చక్రవర్తికి ఆహారముగా ఏ పదార్థమును ఏర్పరచెను?

సనక మహర్షి పలికెను: అగ్నిహోత్రములో మంత్ర పఠనము లేకనే హోమము చేయబడిన హవిస్సు, అయోగ్యునికిచ్చిన దానము, అపవిత్రునిచే అర్పించబడిన హవిస్సు, చేయబడిన దానము, సుకృతము ఇది అంతయు అధఃపతనఫలప్రదమై రసాతలమున బలి చక్రవర్తికి భోగసాధనము. ఇట్లు శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి రసాతలము నిచ్చి, దేవతలకు అభయమును స్వర్గము నిచ్చెను. దేవతలు పూజించుచుండగా, మహర్షులు స్తోత్రము చేయుచుండగా, గంధర్వులు గానము చేయుచుండగా మరల వామనత్వమును పొందెను. ఆశ్చర్యకరమైన ఈ పనిని చూచి బ్రహ్మవాదులగు మునులు ఒకరినొకరు చిరునవ్వుతో చూచుచు పురుషోత్తమునికి నమస్కరించిరి. సర్వప్రాణి స్వరూపుడైన శ్రీమహావిష్ణువు వామనత్వమునుపొంది సమస్త లోకమును మోహింపచేయుచు తపస్సునకు అరణ్యమునకు వెళ్ళెను. విష్ణుపాదమునుండి పుట్టిన గంగ ఇంతటి ప్రభావము కలది. గంగను స్మరించుటవలన అన్ని పాపములు నశించును. ఈ గంగా మాహాత్మ్యమును దేవాలయమున, నదీ తీరమున చదివిన వారికి, వినిన వారికి అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును. (1/11)