కాష్ఠీలోపాఖ్యానము

కాష్టీల పలికెను: కాలాంతక యమునివలె ఉన్న రాక్షసుడు పరుగెత్తుతూ వచ్చుటను చూచిన రాక్షసి అనుమానంతో భర్తతో ఇట్లు పలికెను: ఓ దిగంబరరిపుప్రియా హేమవిభూషిత అనల సన్నిభ అగు శక్తిని రాక్షసునిపై ప్రయోగించుము. నా భర్త మరణించవలయును. ఆ రాక్షసి మాటలను వినిన నా భర్త పౌరుషముతో రాక్షసుని వక్షస్థలమున శక్తిని ప్రయోగించెను. ఆ శక్తి అగ్నిహోత్రమువలె జ్వలించుచు పది దిక్కులు ప్రకాశింపచేయుచు దివ్యాంకుశ తీవ్ర వక్త్రంతయై కింకిణీశత నాదితయై రక్తచందన లిప్తాంగి, రక్త వస్త్రోప శోభిత అగు శక్తి బ్రాహ్మణుని చేతి నుండి విడివడి రాక్షసుని హృదయమున పడెను. రాక్షసుని భస్మముచేసి ఆకాశమునకెగరెను. ఇట్లు బ్రాహ్మణునిచే భర్తను చంపించి సంతోషముతో పులకించి తనను కృతకృత్యురాలిగా భావించెను. అంత రాక్షసి సంతోషించినదై శుభలోచనుడుగు బ్రాహ్మణుని గూర్చి ఇట్లు పలికెను. ఓ ప్రియా! రమ్ము సుందరమగు గుహను యధేచ్ఛగా ప్రవేశించుము. నాతో కలిసి దివ్యమానుష భోగములను అనుభవించుము. అంతట నాభర్త సంతోషముతో పులకించినవాడై అట్లేయని పలికెను. అపుడు ఆ రాక్షసి నా భర్తను తీసుకొని తనగుహలో ప్రవేశించెను. తన భర్త దేహపు బూడిదరాశిని చూడకనే వెళ్ళెను. ఉన్నతమగు తన స్తనములతో నా భర్తను హత్తుకొనెను. గుహలో శయ్యపై నున్న ఆ రాజకుమారిని చూపెను. ఈ నల్లని క్రీగంటి చూపులు కలది, బింబోష్ఠి, కాంచనప్రభయగు రాకుమారిని నా భర్త తనకు భార్యగా చేసుకొనుటకు, పాపములు చొరరాని కాశీపట్టణమునుండి అపహరించుకొని వచ్చెను. ఆ కాశి శక్తి క్షేత్రము, పుణ్యప్రదము, పాపక్షయకరము, శంకరుని గృహము, ఇచ్చటికి పది కోసుల దూరమున ఉన్నది. ఈ కాశీనగరమున మరణించినవారు మరల పుట్టరు. కావున నీవు మరల ఈమె తండ్రిగారి గృహమున చేర్చుము. ఇచట ఉన్న రత్నములు, శయనములు, ఆసనములు నాతోపాటు సమస్త సంపదను నీ ఇష్ట ప్రకారము అనుభవించుము. నేను నీ కొరకే ఘోరుడగు రాక్షసుని చంపించితిని. నీ రూపము మోహించి నా భర్తను యమపురికి పంపితిని. కావున నా పైన నమ్మకము ఉంచి కామరూపిణిని భక్తురాలిని అగు నన్ను అనుభవించుము అని పలికెను. నా భర్త ఈ మాటలను విని రాజకుమారి సమీపమున కామతప్తయగు రాక్షసితో ఇట్లు అనుమానముతో మధురముగా పలికెను.

ఓ సుందరీ! నీతి శాస్త్రములందు స్త్రీలను నమ్మరాదని చెప్పియున్నారు. యువకుడగు భర్తను చంపిన స్త్రీ నన్ను మాత్రము ఏల చంపదు. నాకంటే సౌందర్యవంతుడగు మరో పురుషుని చూచి అతనియందు మోహముతో నన్ను కూడా చంపవచ్చును. కాని నేనుమాత్రము నమ్మవలయును కావున నిన్ను నమ్మెదను. ఈనాడుకాని, రేపు కాని, పక్షమునకుకాని, మానమునకుకాని, సంవత్సరమునకుకాని, లేదా నీకు ఇష్టము వచ్చినపుడు యధేచ్ఛముగా చంపుము. నేను మాత్రము నిన్ను ఆశ్రయించియున్నాను. నీవిట్లే చేయుము. ఇప్పుడు నీకు ఉపకారమును చేయవలయును. ప్రత్యుపకారమునకై నీకు నన్ను నేను అర్పించుకొనవలెను. నీవు నా కొరకు నిస్సందేహముగా నీ భర్తను చంపితివి. కావున నేను నీకు బదులు పలుకను, అంతట ఆ రాక్షసి నా భర్త మాటలను  విని ఇట్లు పలికెను. నమ్మినవారిని చంపుట బ్రహ్మహత్యతో సమానము. అయిననూ భర్తను చంపించిన నన్ను క్రూర రాక్షసిగా తలచిననూ నేను నమ్మినవానిని ఎట్లు చంపెదను. ధర్మ స్వరూపము పరమసూక్ష్మము. సామాన్యముగా తెలియరాదు. దైత్యరాక్షసులు దేవతలు మొదలగు వారికి కూడా తెలియరాదు. ధర్మసూక్ష్మమును తెలియుటలో కొందరు మానవులు సమర్ధులు అగుదురు. అనిత్యమగు శరీరముచే మోక్షమును సాధించెదరు. ఈ విషయమున పురాణములలోని కొన్ని విషయములను ఇచట చెప్పుచున్నాను. ధర్మమును కాపాడుటకు సర్వశక్తివంతుడు శ్రీ మహావిష్ణువు దశావతారములను స్వీకరించి బహుకష్టములను పొందెను. శ్రీనివాసుడగు రామచంద్రుడు సీత కొరకు లక్ష్మణునితో కలిసి నానా కష్టముల పాలై నాగపాశ బంధాదులచే విలపించెను. దేవదేవుడు, విజ్ఞాన స్వరూపుడు, నిఖిల ప్రపంచ రూపుడగు శ్రీహరి వసుదేవ పుత్రుడై బాల్యమున కన్నీటితో అల్లరి పనులతో, ఉగ్రసేనునికి, అర్జునునికి పెత్తనమును ఇచ్చి భృత్యుడుగా కష్టమును అనుభవించెను. ధర్మానుకూలముగా ఉండు పరమేశ్వరుని కర్మలు మన ఊహలకందనివి. వేద విభాగమును చేసినవాడు. తత్త్వదర్శి యజ్ఞరూపుడు, పరాశర పుత్రుడగు వ్యాసుడు స్వయముగా కన్యాత్వమును ధ్వంసము చేయుచు పుట్టి కానీనుడనిపించుకొనెను. తమ్ముడగు విచిత్ర వీర్యుని భార్యలను సంగమించినవాడు. గంగానదికీ భర్తయగు శంతనుడు పరివేత్త దిధిషు అనబడెను. అక్కకు వివాహము కాకమునుపు చెల్లెలుకు వివాహమైనచో అక్కను దిధిషు అందురు. అన్నకు వివాహము కాకమునుపు తమ్మునికి వివాహమైనచో అన్నను పరివేత్త అయందురు. సాక్షాత్తు వసువు దిధిషు పుత్రుడుగా భీష్ముడై జన్మించి అంబ అను కాశీ రాజపుత్రిక నిందచే మరణించెను. భర్త జీవించి యుండగా పరమ పురుషునిచే పుట్టినవారు పాండవులు ఒకే తల్లి పిల్లలు. మొదట భర్త మరణించగా రెండవ భర్తతో పుట్టినవారు కౌరవులు. ఈ కౌరవ, పాండవ సంకీర్తనము పావనము, పుణ్యప్రదము, పాపనాశకము, యోగమూర్తి, సనాతనుడు, ప్రహ్లాదాదులకు ఉపదేశమును చేసిన వాడగు శ్రీ మహావిష్ణువు అగు శ్రీనరసింహస్వామి వేశ్యాసమాసక్తుడు. దేవదేవుడు, అధిదేవత, రాక్షసనాశకుడు, సంసార వాసనానాశకుడు, స్వర్ణాక్షభవన వాసి, ఇక జగమదగ్ని పుత్రుడగు పరశురాముడు స్వయముగా సిద్ధుడు, తపస్సుచే పాపములను నశింపచేసుకొనినవాడు. క్షత్రియులను సంహరించిన ఈశ్వరుడు కూడా భ్రూణహత్యాది పాపములను ఆచరించెను. స్వయముగా తాను యోగియగు ఋషభుడు లోకమునకు ఉపదేశించు బ్రాహ్మణుడై కూడా ధర్మానురోధమును చేయుచు లోకమునకు పీడాకరుడు అయ్యెను. నారదుడు ఎన్నిసార్లు పలికిననూ నారదుడే. నారాయణపరుడగు నరుడు. నరహితుడగు అమరుడు. గోపచేష్టా పరాయణుడగు గౌతముడు గౌతముడే, వేద బాహ్యార్థములను బోధించినవాడు. శాస్త్రకారకుడు. వేదములకు ఉపకారమును చేసినవాడు. ఇక వసిష్ఠ మహర్షి ఊర్వశీ పుత్రుడు. అగస్త్యుడు కూడా. ఇట్లే వీరిద్దరూ స్వయముగా సర్వసమర్ధులు. ఈ వసిష్ట మహర్షి లోకోపకారము కొరకు ఉత్తమమగు వాసిష్ట శాస్త్రమును రచించెను. ఈ శాస్త్రము పురాణవేదనమము అయ్యెను. ఇతనే సాక్షాత్తు శ్రీరామచంద్రునకు గురువు. ఇతనే విశ్వామిత్రుని శాపముచే తిర్యగ్యోనిగా జన్మించెను. ఇక అగస్త్య మహర్షి వింధ్యపర్వతమును వంచెను. వాతాపిని సంహరించెను. సముద్రజలమును నిశ్శేషముగా త్రాగెను. అట్టి అగస్త్యుడే మృతకుని స్వీకరించెను. దుష్కరమగు తపమును చేయుచుండెను. సూర్యాది వందితుడగు వాడు సాక్షాత్తు సృష్టి కర్తయగు బ్రహ్మయే తన పుత్రికా రూపమును చూచి మోహించి తన దేహమునే విడిచెను. శుభమును ప్రసాదించువాడు, ప్రకృతి నాధుడగు సాక్షాత్తు శివుడు కూడా దేవపత్నులను సంగమించినవాడు శ్మశానమున నివసించువాడు. కావున ఓ బ్రాహ్మణోత్తమా, యధావిధిగా సదాచారమునే అనుసరించ వలెను. భావనలో ధర్మమే యుండవలెను. హోమములను ఆలోచించరాదు. ఆపవర్గ్యము ధర్మముగా చెప్పబడినది. ధర్మమునకు ముఖ్యసాధనము ధనము. అట్టి ధర్మమును ధర్మ సాధనమగు ధనమును కూడా నేను సంపాదించితిని. ఓ బ్రాహ్మణోత్తమా? ఇచట ధర్మము యొక్క సూక్ష్మ స్వరూపమును చెప్పెదను వినుము.

నా భర్త రాజకన్యను అపహరించి స్వకర్మలో నున్న నిన్ను చూచుచు వచ్చినపుడు అతని దోషమేమియూ లేదు. ఈ కన్యనేల తెచ్చితివని నేను అడుగగా నీ ఆహారము కొఱకని అసత్యమును పలికెను. ఆ మాటలు విని ఆ కన్య ఇది అబద్ధమని పలికెను. అతని చేష్టల వలన అతని మాట అసత్యమని తెలుసుకొంటిని. భార్యకు అబద్ధము చెప్పినవారు తత్త్వదర్శులుకారు. విరోధమును ప్రకటించునది భార్య కాదు. నరకములో పడవేయు పాపము నుండి భర్తను భార్య ఉద్ధరించవలెను. సంసారమును ప్రదానముచేయు కర్మవల్లీ రూపమగు భార్య మరియొకతె. కావున ఈ విషయమున నా వలన జరిగిన పాపమేమిటో తెలుపుము. ప్రాణములు కంఠగతములుగా ఉన్ననూ సత్యమునే ఆచరించవలెను. సత్యములో సాక్షాత్తుగా ధర్మము నిలిచియున్నది. సత్యముననే బ్రహ్మ ఉండును. సత్యముననే సత్పురుషులు ఉందురు. ఈ ప్రపంచమంతయూ సత్యమునే నిలిచి ఉన్నది. సత్యమునే చెప్పవలయునని వేదాంతములందు చెప్పబడి ఉన్నది. బ్రహ్మ స్వరూపమునే సత్యమని చెప్పు చున్నాము. సత్యము సర్వకాలములందు శుభము, శుభప్రదము, అసత్యము, ఆత్మనాశకరము. అపుడు మాత్రమే నమ్మకమును కలిగించునది. స్త్రీలతో సత్యమును చెప్పరాదు. దానికి కారణమును వినుము. నిధిని గూర్చి స్త్రీకి చెప్పరాదని దోష నివారణము. ఇటువంటి అసత్యము ధర్మ జనకము. ధర్మ సూక్ష్మమును చూపునది. దర్భలు, బ్రాహ్మణులు, నీరు, అగ్ని, వేదములు, భూమి, కాలము, దిక్కులు, దేవతలు, సాక్ష్యముగా ఉన్న దానినే వివాహము అందురు. ఆ వివాహముతో ఏర్పడుదానినే దాంపత్యమందురు. వివాహమున సాంగకర్మ విధించబడినది. స్త్రీ పురుషులకు గురుశిష్యులకు ద్విజసంస్కారము విధించబడినది. కావున వధూవరులు పరస్పరము గురు శిష్యులని తెలియవలెను. జ్ఞానము కలవాడు దంపతులలో అణుమాత్ర భేదమును కూడా చూడజాలడు. అయా కర్మలను అనుసరించి స్త్రీ పురుషులకు ప్రాధాన్యము చెప్పబడినది. కొన్ని చోట్ల వ్యత్యయ దోషమున్నచో దానికి దైవమేకారణము. దేవాసుర మానవ రూపమగు ఈ జగత్తు సర్వము దైవాధీనమే. పూర్వ జన్మలో సంచితమగు కర్మ వాసనలను అనుసరించి దైవము మన కామనలను సమకూర్చును. అది శుభము కావచ్చును. అశుభము కావచ్చును. దానిని శాంతమని పండితులు తెలియుదురు. సత్యసమాచారము శమింపచేయు ప్రాణి లోకమును వంచించువాడగును. దీనినంతటిని చక్కగా నెరిగి ఇతను భర్తకాదని తలచి చంపించితిని. నేను చేసిన ఉపకారము వలననే కన్యాత్వమును ధ్వంసము చేయు మహాపాపము నుండి తప్పించబడెను. నీ చేతితో మరణించి పుణ్యాత్ముల లోకమును చేరెను. ధర్మ సూక్ష్మమును తెలిసిన నేను భర్తకు ఉపకారమును చేసితిని. అట్లే నీ ప్రాణరక్షణమును చేసిన నాకు విశేషధర్మము కలిగెను. ఆ ధర్మముచే నేమి లభించినదో చక్కగా తెలియుము. రాక్షస జాతిలో పుట్టిన నేను రాక్షసునకు భార్యగా ఉండి కూడా కామరూప ధారిణినైన నేను ఈ ధర్మ కారణము వలననే బ్రాహ్మణినైతిని (బ్రాహ్మణ భార్య) ధర్మమును, కామమును వర్షించునది ధేనువు, సంతోషమును ప్రసాదించునది నందనవనము. మోక్షమునిచ్చునది విద్య. తృష్ణ వైతరణినది. ఆ వైతరణిలో పడుచున్న భర్తను నేను ఉద్ధరించితిని. ఉత్తమ వర్ణమును చేర్చుటచే ఈ రాజకుమారికి కూడా ఉపకరించితిని. ఈమె తండ్రి ఇంటిలో చేరును. నేను నీకు ఈమెకు సర్వ కాలములందు రక్షకురాలనుగా నుందును. నాతో కలియుటకు ముందుగా నీకున్న భార్యకూడా తిర్యగ్జన్మను పొంది నాఅనుగ్రహమున మోక్షమును పొందును. నేను కూడా పూర్వ జన్మమున జౌర్వముని కూతురుగా కందలి అను పేరుతో ఉంటిని. లోకోత్తర సౌందర్యవతిని తపః ప్రభావమును ఆశ్రయించితి. నా తండ్రియగు జౌర్వముని నన్ను దుర్వాసునకు ఇచ్చెను. అతనిని భర్తగా పొందిన నేను పూర్వజన్మ కర్మ వశమున భర్తతో ఎపుడూ కలహించు చుంటిని. నా భర్త కోపించి శపించగా భస్మమైతిని. కొంచెము పాప శేషముచే రాక్షసిగా పుట్టితిని. అపుడు ఈ రాక్షసుని భర్తగా పొందితిని. ఇతని పేరు గోభిలుడు. మహా పరాక్రమశాలి. ఇతనిని నీవు సంహరించితివి. ఈ రాక్షసునికి యౌవనమున ఒక రాజకన్యాకారణమున నీకు మరణము సంభవించునని శాపము కలిగెను. నేను పూర్వజన్మ కర్మ వశమున రాక్షసీ భావము లేని దాననుగా ఉండి శుభకరమగు బుద్ధిచే నీకు సహాయముచేసితిని. నా భర్త పాపియై రాజకుమారిని అపహరించుటచే దుఃఖించి నీచే సంహరింప చేసితిని. నీవు నన్ను సర్వ భావములచే నమ్మియుంటివి. నాచే భర్తగా వరించబడితివి కావున నిన్ను సర్వ కాలములందు రక్షించుచుందును. నేను పంచభూతముల సాక్షిగా చేయు ఈ శపథము సత్యము. పరిపూర్ణ పురుషుని సన్నిధిలో నేను చెప్పుచుంటిని. నాతో ఎప్పుడు వాదమును ఆరంభించ కుండుము. అన్ని విషయములలోను నీవు నా మాట యందు నిలువవలెను. ఇట్లు పలికిన రాక్షసి మాటలను వినిన నా భర్త ఆమె చేసిన దానిని చెప్పిన దానిని నిజమని విశ్వసించి అంగీకరించెను. అంతట ఆ రాక్షసి ఆడయేనుగు రూపమును ధరించి, గుహలోని సంపదను, నా భర్తను తన వీపుపై కూర్చోబెట్టుకొని ఆ రాజకుమారిని కూడా తీసుకొని ఆకాశమార్గమున కాశీ నగరమునకు బయలు దేరెను. (II/28)