విష్ణు మాహాత్మ్యము

సనక మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా శ్రీపతి మాహాత్మ్యమును ఇంకనూ చెప్పెదను వినుము. హరి కథామృతమును సేవించుటకు ప్రీతికలగనిదెవరికి? మమకారముచే, ఆకులమైన మనస్సున కలవారు విషయాంధులైన మానవులకు సర్వపాపప్రణాశము చేయునది ఒక్క హరినామమే. మానవుల పాపములను నశింపచేయు శ్రీహరిని ఒక్కసారి కూడా నమస్కరించని వానిని చండాలునిగా తెలియుము. అతనితో ఎప్పుడూ సంభాషించరాదు. హరిపూజా హీనమైన గృహము స్మశానము వంటిది. అట్టి గృహమున ప్రవేశించరాదు. హరి పూజా విహీనులు వేదవిద్వేషులు గోబ్రాహ్మణ ద్వేషులు రాక్షసులుగా పరిగణింపబడుదురు. బ్రాహ్మణులను ద్వేషించువాడు శ్రీహరిని పూజించిననూ ఆ పూజ నిష్పలమే అగును. ఇతరుల శ్రేయస్సును నశింపచేయుటకు చేయు హరిపూజ చేయువారినే నశింపచేయును. శ్రీహరిని పూజించువారు పాపమును ఆచరించినచో అతనిని విష్ణుద్వేషి అని తత్త్వార్ధకోవిదులు చెప్పెదరు. విష్ణునిరతులు లోకానుగ్రహ తత్పరులు ధర్మకార్యనిరతులుగా ఉన్నవారు. విష్ణురూపులని ప్రాజ్ఞులు ప్రవచించిరి. కోటిజన్మలలో చేసిన పుణ్యములచే విష్ణుభక్తి కలుగును. శ్రీమహావిష్ణువుయందు ధృడమైన భక్తిగలవారికి పాపబుద్ధి ఎట్లు కలుగును? విష్ణుపూజాపరులకు కోటిజన్మలలో చేసిన పాపము క్షణకాలమున నశించుచున్నట్టివారికి పాపబుద్ధి ఎట్లు కలుగును? విష్ణుభక్తి పరులైనచో శ్రేష్ఠులుగా పరిగణించబడుదురు. విషయాంధులగు నరులకు సర్వదుఃఖవినాశనమగు హరిసేవభక్తి ముక్తులను ప్రసాదించును. సంగము వలన కాని, స్నేహము వలనకాని, భయము వనలకాని, లోభము వలనకాని అజ్ఞానవశమున కాని విష్ణువును ఉపాసించిన నరులు తరగని సుఖమును పొందెదరు. హరిపదజలమును ఒక కణమును పానము చేసినను సర్వతీర్థ స్నానఫలమును పొంది, శ్రీమహావిష్ణువునకు ప్రీతిపాత్రుడగును. శ్రీహరిపాదతీర్ధము అకాల మృత్యుశమనము సర్వవ్యాధి వినాశనము సర్వదుఃఖోపశనము. పరంధాముడు, జ్యోతిస్స్వరూపుడగు శ్రీమన్నారాయణుని శరణువేడినవారు శాశ్వతముక్తిని పొందెదరు. ఈ విషయమున ఒక ఇతిహాసమును చెప్పెదరు. ఇది చదువువారికి వినువారికి అన్ని పాపములను నశించును.

పూర్వకాలమున కృతయుగమున గులికుడను పేరుగల వేటగాడుండెను. అతడు ఎల్లకాలము పరదారలను పరద్రవ్యములను హరించుచుండెడివాడు. పరనిందాపరుడు. నిత్యము జంతువులను హింసించువాడు. వేలకొలది బ్రాహ్మణులను గోవులను వధించెడివాడు. వేటగాళ్ళకు రాజైన గులికుడు నిత్యము దేవధనమును పరుల ధనమును హరించుటయందు ఆసక్తిని చూపెడివాడు. గులికుడు చేసిన పాపములు కోటి సంవత్సరములలో కూడా లెక్కించజాలము. ఒకపుడు గులికుడు జంతువుల పాలిటి యముడుగా ఉండెను. ఒకానొక సమయమున సర్వైశ్వర్యసమన్వితము, ఆభరణములు ధరించిన స్త్రీలతో కూడి యున్నది, స్వచ్ఛ జలములు కల సరస్సులచే శోభించబడునది, చక్కని ఆపణములతో అలంకరించబడి అమరావతినిబోలు సౌవీరరాజ నగరమునకు వెళ్ళెను. ఆ నగరమునకు సమీపమున ఉన్న ఉద్యానవనమధ్యమున ఉన్న సుందరమగు శ్రీహరి మందిరమును బంగారు కలశములచే కూడియునన్నదానిని చూచి గులికుడు సంతోషించెను. ఇచట చాలా బంగారము లభించగలదు అని నిశ్చయించుకొని చౌర్యమునందు వ్యామోహమున్న ఆ వేటగాడు దేవాలయము లోపలికి వెళ్ళెను. అచట తత్త్వార్థ కోవిదుడు శాంతుడు, శ్రీహరిపరిచర్యాపరుడు తపోనిధి ఉత్తంకుడును బ్రాహ్మణోత్తముని చూచెను. ఉత్తంకుడు ఏకాకి, దయాళువు నిస్పృహుడు ధ్యానంతుడుగా ఉండెను. దైవద్రవ్యమునందు మిక్కిలి ఆశగలవాడు కావున ఉత్తంకుని తన కార్యమనకు అడ్డుగా తలిచి అతిసాహసముతో ఉత్తంకుని వధించ నిశ్చయించి మదోద్ధతుడై ఖడ్గమును చేత పట్టుకొని వక్షస్థలమును తన పాదముతో అదిమి పట్టి మరొక చేతితో జటలను పట్టుకొని చంపబోవు గులికుని చూచి ఉత్తంకుడిట్లు పలికెను.

ఉత్తంక మహర్షి పలికెను: “ఓ సాధూ! నిరపరాధినగు నన్ను వ్యర్థముగా చంపుచున్నావు. ఓ. బుద్ధిమంతుడా! నేను నీ యెడ చేసిన అపరాధమేమిటో చెప్పుము. అపరాధము చేసిన వారిని సమర్థులు శిక్షింతురు. కాని నిరపరాధులను సజ్జనులు పాపులు ఎవరైనను వధింపరు, సజ్జనులు శాంతచిత్తులు శత్రువులగు మూర్ఖులలో అవగుణములను చూచియు ద్వేషించారు. ఎంతగా బాధించననూ క్షమించువాడు ఉత్తమనరుడు. వాడే విష్ణువునకు ప్రీతిపాత్రుడు. పరుల హితమును ఆచరించవలయునని కోరు సజ్జనుడు వినాశకాలమున కూడా ద్వేషమును చూపడు. చందన వృక్షము తనను నరుకుచున్న గొడ్డలికి కూడా సుగంధమును ఇచ్చును. జనులను బహువిధములుగా బాధించు విధి ఎంత బలీయము! సర్వసంగపరిత్యాగులు కూడా దురాత్ములచే బాధించబడుచున్నారు. లోకమున నిష్కారణముగా దురాత్ములచే బాధించబడుచున్నారు. దుర్జనులు కూడా సాధువులనే బాధించుచున్నారు కాని తమతో సమానులను బాధించుటలేదు. లేళ్ళు, చేపలు, సజ్జనులు క్రమముగా గడ్డితో, నోటితో, సంతోషముతో బ్రతుకుచుందురు. వేటగాళ్ళు, బెస్తవారు, లోభులు వీరిని నిష్కారణముగా ద్వేషించి హింసించెదరు. ఈ జగత్తునంతటిని మోహింపచేయు మాయ ఎంత బలీయము. పుత్రమిత్ర కళత్రము కొఱకు అందరిని దుఃఖింపచేయుదురు. నీవు పరులద్రవ్యము అపహరించి కళత్రమును పోషించితివి. అవసానకాలమున అన్నింటిని, అందరిని విడిచి ఒంటరిగా వెళ్ళెదవు. నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా పుత్రులు, ఇది అంతయూ నాది అని మమకారము ప్రాణులను ఎంతగా బాధించుచున్నది? ద్రవ్యమును ఆర్జించు వరకే బంధువుల వెంట ఉందురు. ఇహపరములలో వెంట తోడుగా ఉండునవి ధర్మాధర్మములు మాత్రమే. ధర్మాధర్మములచే సంపాదించిన ద్రవ్యమును ఆర్జించువరకే బంధువులు వెంట ఉందురు. ధర్మాధర్మములచే సంపాదించిన ద్రవ్యముతో పోషించబడిన బంధువులు సంపాదించినవాడు మరణించగా అతనిని అగ్నికి ఆహుతి చేసి తాము నేతి భోజనము చేతురు. పరలోకమునకు వెళ్ళువారి వెంటవచ్చునవి ధర్మాధర్మమలే కాని పుత్రులు బంధువులు సంపదలు కావు. పాపకర్మలను చేయువారికి కోరికలు పెరుగుచుండును. పుణ్యకార్యములను చేయువారికి కోరికలు నశించుచుండును. లోకులు ధనమును సంపాదించుటకు వ్యర్థముగా అకులపడుదురు. జరుగవలసినది జరిగియే తీరును. జరుగరానిది జరుగనే జరగదు. ఇది నిశ్చయముగా కలవారిని చింత బాధించదు. స్థావరజంగమాత్మకమగు ఈ జగత్తంతయూ దైవాధీనమే. కావున పుట్టుకను మరణము దైవమే తెలియును. ఇతరులు తెలియుజాలరు. ఎక్కడ ఉన్ననూ జరుగవలసినది జరిగియే తీరను. ఆ విషయము తెలిసికొనక లోకము వ్యర్థముగా బాధపడును. మమకారముచే ఆకులమైన మనసుకల వారికెంత దుఃఖము ప్రయత్నముచే మహా పాపములను చేసి ఇతరులను పోషింతురు. తాను సంపాదించిన ధనమునంతటిని బాంధవులు అనుభవించెదరు. తాను మాత్రము మూఢుడై ఒంటరిగా పాపఫలమును అనుభవించును ఇట్లు పలుకుచున్న ఉత్తంక మహర్షి మాటలను విని భయముచే వణుకుచు విడిచి చేతులు జోడించి గులికుడు మాటి మాటికి “క్షమించుము” “క్షమించుము” అని ప్రార్థించెను. సజ్జనసాంగత్య ప్రభావముచే హరి సాన్నిధ్యమువలన పాపములు తొలగగా గులికుడు పశ్చాత్తాపముతోనిట్లు పలికెను.

ఓ బ్రాహ్మణోత్తమా! నేను చాల గొప్పపాపములను చేసితిని. మీ దర్శనముచే అవి అన్నియు నశించినవి. నేను పాప బుద్ధినై మహాపాతకములను ఆచరించితిని. నాకు నిష్కృతి ఎట్లు లభించును? ఎవరిని శరణు వేడెదను? పూర్వజన్మములో చేసిన పాపములచే ఈ వ్యాధజన్మము వచ్చినది. ఈ జన్మములో కూడా పాపములను చేసితిని. మరల నాకేగతి పట్టునో! నా ఆయుష్యము వేగముగా తరిగి పోవుచున్నది. చాలా పాపములను మూట కట్టుకొంటిని. ప్రాయశ్చిత్తములను ఆచరించలేక పోతిని. చివరికి నాకు ప్రతిఫలమేది రాబోవుచున్నది? ఏ జన్మకలుగునో? అనేక పాపములచే అమలుడనైన నన్ను విధి ఏల పాపరతునిగా సృష్టించినది. నేనీ పాపఫలములను ఎన్ని జన్మములలో అనుభవించవలయునో! ఇట్లు తనలో తాను తనను నిందించుకొనిన వ్యాధుడు అంతస్తాపాగ్నిచే వెంటనే మృతి చెందెను. పడిన వ్యాధుని చూచి దయాళువైన ఉత్తంకుడు విష్ణుపాదోదకము పైన చల్లెను. హరిపాదోదక స్పర్శచే పాపములు నశించిన వ్యాధుడు దివ్యవిమానమును అధిరోహించి ఉత్తంకమహర్షిని గూర్చి ఇట్లు పలికెను.

గులికడు పలికెను: “ఓ మునిశ్రేష్టా! ఉత్తంకా! మీరు నాకు గురువర్యులు. మీ అనుగ్రహముచే మహాపాతక సంచయమునుండి విముక్తుడనైతిని. మీ ఉపదేశము వలస సంతాపము తొలగినది. సర్వపాపములు నశించినవి. మీరు నా పై హరిపాదోదక సేచనము చేసితిరి. కావున మీచే ఆ విష్ణుపదమునకు చేర్పించబడితిని. మీ అనుగ్రహముచే నేను పాపములనుండి, శరీరమునుండి విముక్తుడనైతిని. కావున నీకు నమస్కరించుచున్నాను. నేను చేసిన దానిని క్షమింపుము” అని ఇట్లు పలికి ఉత్తంకునిపై పుష్ప వర్షమును కురిపించెను. ప్రదక్షిణత్రయమును చేసి నమస్కారములు ఆచరించెను. తరువాత సర్వకామసమన్వితమగు విమానమును అధిరోహించి అప్సరోగణములచే కూడి హరి మందిరమును చేరెను. తపోనిధియగు ఉత్తంకుడు ఈ దృశ్యమును చూచి ఆశ్చర్యమును పొంది చేతులు జోడించి శ్రీమన్నారాయణుని స్తుతించెను. ఇట్లు స్తుతించబడిన శ్రీమహావిష్ణువు ఉత్తంకునకు ఉత్తమ వరములను ఇచ్చెను. ఆ వరముచే ఉత్తంకుడు కూడా మోక్షమును పొందెను. (1/37)