నారద మహా పురాణము
మధురా మాహాత్మ్యము
మోహిని పలికెను: ఓ వసూ! నరుల పాపములను హరించు అవంతీ మాహాత్మ్యమును వింటిని. ఇపుడు మధురా మాహాత్మ్యమును వినగోరుచున్నాను.
వసువు పలికెను: మోహినీ! శుభావహమగు మధురా మాహాత్మ్యమును చెప్పెదను వినుము. ఈ మధురలో బ్రహ్మ ప్రార్ధనచే శ్రీహరి జన్మించెను. మధురలో ఆవిర్భవించి నంద గోకులమును చేరెను. నంద గోకులమున నివసించి గోపకులతో నానా క్రీడలను ఆచరించెను. కంసుడు పంపిన పూతనాది రాక్షసులను సంహరించి ద్వాదశ వనములలో గోపికలతో విహరించెను. ద్వాదశవనముల లోకల తీర్ధములను, మధురలో గల తీర్ధములను ఇప్పుడు నీకు చెప్పెదను వినుము. మొదటిది మధువనము. ఇచట స్నానమాడి పితరులకు దేవతలకు తర్పణమును ఆచరించినవారు విష్ణు లోకమున విరాజిల్లెదరు. ఇక రెండవది తాళవనము. ఇచట స్నానమాడినవారు కృతకృత్యులయ్యెదరు. మూడవది కుముదవనము. ఇచట స్నానమాడినవారు వాంఛితార్ధములను పొంది, ఇహపరములందు ఆనందింతురు. నాలుగవది కామ్యవనము. ఇచటికి వెళ్లిన వారు విష్ణు లోకమును పొందెదరు. ఇచట చాలా తీర్ధములు కలవు. వాటిలో విమలకుండము సర్వతీర్ధోత్తమోత్తమము. ఇచట స్నానమాడినవారు విష్ణు పదమును చేరెదరు. అయిదవది బహుళావనము. ఇచట స్నానమాడినవారు సర్వాభీష్టములను పొందెదరు. ఆరవది భద్రవనము. ఇచట స్నానమాడినవారు శ్రీకృష్ణానుగ్రహముతో సర్వ భద్రములను బడయగలరు. ఏడవది ఖాదిరవనము. ఇచట స్నాన మాత్రము ననే పరమ పదమును పొందెదరు. ఎనిమిది శ్రీహరికి ప్రియమగు మహావనము. భక్తితో ఈ వనమును చూచినవారు ఇంద్రలోకమున విరాజిల్లెదరు. తొమ్మిదవది లోహజంఘ వనమున. ఇచట స్నానమాడిన వారు మహావిష్ణు ప్రసాదమున భుక్తిముక్తులను పొందును. పదియవది బిల్వారణ్యము. ఇచట స్నానమాడినవారు నిజేచ్ఛానుసారముగా శివలోకమును కాని విష్ణులోకమును కాని పొందగలరు. పదకొండవది యోగి దుర్లభమగు ఖాండీ రవనము. ఇచట స్నానమాడినవారు సర్వపాప వినిర్ముక్తులగుదురు. ఇక పన్నెండవది సర్వపాప హరమగు బృందావనము. బృందావన సమమగు మరియొక వనము ఈ భూ మండలముననే లేదు. ఇచట స్నానమాడి దేవర్షి పితృ తర్పణము గావించినవారు ఋణ త్రయముక్తులై విష్ణు లోకమున విరాజిల్లెదరు. మధురా మండలము వింశతి యోజన పరివ్యాప్తముగా ఉన్నది. ఈ మండలమున ఎచట స్నానమాడిననూ విష్ణు భక్తిని పొందగలరు. ఈ మండల మధ్య భాగమును మధురా నగరము సర్వోత్తమోత్తమము. ఈ నగరమును దర్శించినంతనే మాధవ భక్తి కలుగును. ఇచటనే విశ్రాంతి తీర్థము కలదు. ఇచట భక్తిచే స్నానమాడిన వారు వైష్ణవపదమును పొందెదరు. విశ్రాంతి సమీపమున దక్షిణ భాగమున విముక్తమను ఉత్తమ తీర్ధము కలదు. ఇచట స్నానమాడినవారు నిశ్చయముగా ముక్తినిపొందగలరు. ఇచటికి దక్షిణ భాగమున రామతీర్ధము కలదు. ఇచట స్నానమాడిన వారు అజ్ఞాన బంధమునుండి విముక్తులు అగుదురు. ఇచటికి దక్షిణమున సంసారమోక్షణ తీర్ధముకలదు. ఇచట స్నానమాడిన వారు విష్ణు లోకమున విరాజిల్లెదరు. ఇచటికి దక్షిణ భాగమున దేవదుర్లభమగు ప్రయాగ తీర్థముకలదు. ఇచట స్నానమాడినవారు అగ్నిష్టోమ ఫలమును పొందెదరు. తరువాత కనకల తీర్ధము కలదు. ఇచట స్నానమాడిన వారు దేహాంతమున స్వర్గమును పొంది నందనాదులలో విహరించెదరు. ఇచటికి దక్షిణమున తిందు తీర్ధము కలదు. ఇచట స్నానమాడినవారు రాజసూయ ఫలమునుపొంది స్వర్గమున ఆనందింతురు. దాని తరువాత సటుస్వామి తీర్ధము కలదు. ఇది భాస్కర ప్రియము. ఇచట స్నానమాడి సూర్య సందర్శనమును కావించి భోగములను అనుభవించి స్వర్గమును పొందెదరు. ఇచటికి దక్షిణ భాగమున ధ్రువ తీర్ధముకలదు. ఇచట స్నానమాడి ధ్రువుని దర్శించినవారు విష్ణుపదమును పొందెదరు. ధ్రువతీర్ధమునకు దక్షిణభాగమున సప్తర్షిసేవిత తీర్ధము కలదు. అచట స్నానమాడి సప్తర్షులను దర్శించి ఋషిలోకమున ఆనందించును. ఋషి తీర్థమునకు దక్షిణమున ఉత్తమమగు మోక్షతీర్ధము కలదు. ఇచట స్నానమాత్రమున సర్వపాతక వినిర్ముక్తుడగును. ఇచటికి దక్షిణభాగమున బోధినీ తీర్ధము ఇచట స్నానమును చేసి పితరులకు పిండ ప్రదానముచేసి వారిని స్వర్గమును చేర్చగలడు ఇచటికి దక్షిణ భాగమును కోటి తీర్ధముకలదు. ఇచట స్నానమాడిన సర్వపాపవినిర్ముక్తుడై విష్ణు లోకమును పొందును. విశ్రాంతి తీర్థమునకు ఉత్తర భాగమున అసికుండ తీర్ధము కలదు. ఇచట స్నానమాడిన విష్ణుపదమును చేరును.
అసికుండమున ఉత్తర నవ తీర్థము కలదు. ఇచట స్నానమాడిన స్వర్గమును పొందును. ఇచటికి ఉత్తరమున సంయమనతీర్థము కలదు. ఇచట యమలోక దర్శనము కాదు. ఇచటికి ఉత్తరమున ధారాయతన తీర్థము కలదు. ఇచట స్నాన మాడినవారు పితరులతో కలిసి ఆనందింతురు. ఇచటికి ఉత్తరమున ఉన్న నాగ తీర్థమున స్నానమాడినవారు సర్పముల నుండి అభయమును పొందగలరు. ఇచటికి ఉత్తరమునగల ఘంటాభరణమను బ్రహ్మతీర్థమున స్నానమాడినవారు పాప విముక్తులై బ్రహ్మ లోకమును పొందెదరు. ఇచటికి ఉత్తరమునగల సోమ తీర్థమున స్నానమాడిన వారు సోమ లోకమును పొందెదరు. ఇచటికి ఉత్తరమునగల ప్రాచీన సరస్వతలో స్నానమాడినవారు వాగీశ్వరులయ్యెద. ఇచటికి ఉత్తరమునగల చక్రతీర్థమున స్నానమాడిన మానవులు శత్రువర్గమును జయించి స్వర్గమున ఏడు యుగములు ఆనందింతురు. ఇచటికి ఉత్తరమునగల దశాశ్వమేధిక తీర్థమున స్నానమాడిన అశ్వమేధ ఫలము లభించును. ఇచటనున్న గోకర్ణ శివుని యధావిధిగా పూజించినవారు ఇహమున సకలాభీష్టములను పొంది అంతమున శివ లోకమును పొందెదరు. ఇచటికి ఉత్తరమున గల విఘ్నరాజ తీర్థమున స్నానమాడినవారు నిర్విఘ్నముగా సర్వ కర్మఫలమును పొందెదరు. ఇచటికి ఉత్తరమున గల అనన్త తీర్థమున స్నాన మాడినవారు చతుర్వింశతి తీర్థముల ఫలమును పొందెదరు. మధురాగనరమున సాక్షాత్తుగా శ్రీహరియే ఉన్నాడు. చతుర్వ్యూహ రూపముతో ఇచటినుండి మధురవాసులకు ముక్తి ప్రదుడగుచున్నాడు. వారాహమూర్తి, నారాయణ మూర్తి, వామనమూర్తి, హలధరమూర్తి అని నాలుగు వ్యూహరూపములు. ఇట్లు చతుర్వ్యూహధరుని దర్శించి యధావిధిగా పూజించిన వారు ముక్తిని పొందెదరు. రంగేశుని, భూతేశుని, మహావిద్యను, భైరవుని దర్శించి యధావిధిగా పూజించి తీర్థయాత్రాఫలమును పొందెదరు. చతుస్సాముద్రిక కూపమున కుబ్బాకూపమున, గణేశకూపమున, కృష్ణగంగయందు స్నానమాడిన వారు పాప విముక్తులగుదురు. సమగ్ర మధురా మండల ఆధిపత్యమున క్లేశ నాశకుడగు మాధవుడు కలడు. మధురామండలమున కేశవుని దర్శించనివారి జన్మ వ్యర్థము. వారు సంసారముననే పరిభ్రమించెదరు. ఇంకా ఇతర తీర్థములు అసంఖ్యాకములు కలవు. మధురా మండలమున కేశవుని దర్శించని వారి జన్మ వ్యర్థము. వారు సంసారముననే పరిభ్రమించెదరు. ఇంకా ఇతర తీర్థములు అసంఖ్యా కములు కలవు. వాటియందు స్నానమాడి దానము ఆచరించినవారు దుర్గతిని పొందజాలరు. ఈ మధురామాహాత్మ్యమును వినినవారు వినిపించినవారు హరిభక్తిని పొంది సర్వాభీష్టములను బడయుదురు. (II/79)