నారద మహా పురాణము
నిట్యపటల కథనము
సనత్కుమార మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! ప్రయోగాది సమన్వితమగు నిత్యాభ్యర్చన దీపకమగు నిత్యా పటలమును చెప్పెదను. లలితాదేవి యొక్క మూడు వర్ణములచే సకలార్థములు చెప్పబడును. మిగిలిన దేవీ రూపముచే చెప్పబడిన దానిచే ఇది చెప్పబడుచున్నది. ఈ సమస్త జగత్తు హృల్లేఖాత్మకముగా చెప్పబడినది. సర్వతంత్రములందు రహస్యముగా ఉంచబడిన అర్ధము చెప్పబడినది. ఆకాశముచే ప్రకాశము, అగ్నిచే గ్రసమానత్వము. ఈ రెంటి విమర్శయే బిందుయుత ఈకారము. దీనినే ఫాలనము అందురు. పిండి కర్తృత్వమునందు మాలానామకరములు బీజాఖ్యము లగు మంత్రములు క్రమముగా ఏకాక్షరములు ద్వ్యక్షరములు, త్ర్యక్షరములు చతురాద్య క్షరములుగా ఉండును. అంకములచే వృత్తి భవార్నములను లిఖించవలెను. వ్యస్త క్రమయోగముతో వ్రాయవలెను. అవర్ణములచే భేదయోజనమును చేయవలయును. అశేష సందర్భములకు ఇదియే క్రమము. సముదయము దేవ్యాత్మకము, విశ్రాంతి వివాత్మకము, ఆత్మ స్వరూపము ఉభయాత్మకముగా భావన చేయవలయును. ఇట్లు చేసినచో కొంత కాలమునకు దుఃఖార్తి నాశము జరుగును. సర్వస్వరూపము పరాహాంతామయము. ఆత్మ విగ్రహము. అరోపోపాధి వర్ణితము స్పురతాఖ్యము సదాత్మకము. ఆత్మత్వమున ప్రకాశరూపమగు వస్తువు భాసించును. కావున లోకమున ఆ మంత్రాత్మకమగు అక్షరము లేదు. ఇదియే అంతటా అన్ని వేళలా విద్య అనబడును. అయా వాసరములందు ఇట్లాచరించిన సర్వాపత్తారకము అగును. ఇపుడు చక్కగా ఆనవకల్పనా విధానమును చెప్పెదను. ఈ ఆసవము గౌడీ, పైస్ట్రీ, మాధ్వీ అని మూడువిధములు. వేడి నీటిలో బెల్లమును పడవేసి చక్కగా కలిపి గాజుకుండలో వేసి దానిలో ఉమ్మెత్త పూవుల పొడి కలిపి, భూమిలో ఉంచవలెను. ప్రతిదినము రెండు పూటలా చేతులచే కలుపు చుండవలెను. ఇట్లు ఒక మాసము చేసినచో పుప్పొడి కలిసిపోవును. అపుడు ఆ యాసవముచే పూజించవలెను. గుడముతో కలిపినది కావున ఈ ఆసవమును గౌడీ యందురు. ఇట్లే మధువును కలిపినచో మాధ్వయగును. ఇక పైష్ఠీ అసనమును చెప్పెదను వినుము. రెండున్నర రెట్లు అధికముగానున్న నీటిలో బియ్యమును నానబెట్టవలెను. అట్లు మూడు దినముల తరువాత ధ్యాత్ర్యంకుర రజమును పడవేయవలెను. ఒక దినము గాలి ఉన్నచోట ఉంచి తరువాత శివాత ప్రదేశమున ఉంచవలెను. నీటితో కలిపిన తరువాత అడుగున జారిపడినది పెషీ అసవ మగును. ఈ మధువు వృక్షజమని, ఫలజమని రెండు విధములు. ఈ రెండు విధముల అసవమును నిర్మించు విధానమును వినుము. ఈ యానవమును సేవించినచో మనోలయమగును. ద్రాక్షఫలమును కాని ఖర్జూర ఫలమును కాని పుష్పమును కాని ఇప్ప పూవు నీటిలో పడవేసి సగములగు నట్లుగా చేసి మొదట వచ్చిన అసవశేషముచే రెండు దినములు కలిపినచో తేలినది రుచికరము పూజార్హమగు అసవము శుభప్రదము మనోలయకరమగును. ఇక వృక్షజాసవము నాళికేరముకాని, హింతాలముకాని, తాలము కాని, వృక్షముకాని వృక్షములయొక్క ఫలకాండముల నుండి స్రవించిన రసము రసావహముగా ఉండును. నాలికేర ఫలాంతర్భాగమున ఉన్న జలము శశియుతమగునపుడు, అర్థపూగ ఫలోతమగు రసమును సంగ్రహించి ఎండలో ఉంచినచో ఏర్పడు ఆసవము దేవతా ప్రీతికరమగును. ఇట్టి ఆసవములచే దేవికి అర్ఘ్యము అర్పించవలెను. సాధకుడు ఆహారనియమము కలవాడై సమాధిలో నుండి ఆసవపానమును కావించవలెను. దేవికి నివేదన చేయక ఆసవపానము చేయరాదు. మనోలయమగు వరకే పానము చేయవలెను. తరువాత కూడా పానము చేసినచో మహాపాతకి అగును. దేవతా గురువులకు నివేదన చేయని అసవమును పానము చేసినవాడు పాతకి రాజదండ్యుడు, రిక్తోపాసకుడు అగును. సాధ్యసాధకములకు కామ్యముగా చెప్పబడినది. సిద్ధ విషయమున ఎప్పుడూ చెప్పబడియే ఉన్నది. కావున సాధకుడు తన్మయుడు కావలయును. ఉక్తరూపుడై ఉక్తరూపులగు దేవతలను క్రమముగా ఉపచారములచే, అసవములచే, మత్స్య మాంసములచే పూజించవలెను.
ఓ నారదా! ఇక ఇపుడు కామ్యార్చనను ప్రయోగములను చెప్పెదను. వీటిని ఆచరించినచో సాధకుడు సిద్ధిని పొందును. చైత్రమాసమున దమనకములతో పూజించవలయును. పూర్ణిమనాడు మదనోత్సవమును జరుపవలెను. వైశాఖ పూర్ణిమనాడు బంగారు పుష్పములచే పూజించవలెను. జ్యేష్ఠ పూర్ణిమ నాడు కదలీ పనసామ్ర ఫలములచే పూజించవలెను. ఆషాఢ పూర్ణిమనాడు చందన ములచే ఏలా జాతీ కంకోల కుంకుమలచే దేవిని పూజించవలెను. శ్రావణ పూర్ణినాడు ఆగమోక్త విధిచే పవిత్రములచే కాని మొగలుపూవులచే కాని పూజించవలెను. ఆశ్వయుజ పూర్ణిమనాడు భూషావస్త్ర ధనాదులచే కన్యను అర్చించవలెను. కార్తీక పూర్ణిమనాడు రాత్రి యందు దీపములచే, పగలు కుంకుమలచే అర్చించవలెను. మార్గ శీర్ష పూర్ణిమన చంద్ర సహితములగు నాలికేరములచే అపూపములచే పూజించవలెను. పుష్య పూర్ణిమనాడు శర్కరచే గుడములచే పాలచే ఆర్చించవలెను. మాఘపూర్ణి మన స్వర్ణ రూప్యములచే, పంకజములచే సౌగంధికాదులచే పూజించవలెను. ఫాల్గుణ పూర్ణిమనాడు వివిధ ద్రవ్యములచే, ఫలములచే సుగంధ పుష్పములచే పూజించవలెను. రాత్రిపూట పర్వతాగ్రమునందు మోదుగు పూవులచే పూజించవలెను. ఇట్లు సిద్ధ ద్రవ్యములచే పూజించినచో ఏడు దినములలో ఖేచరీ మేలనము జరుగును. అరణ్యమున కాని, వటమూలమున కాని చెట్ల పొదలలోకాని కదంబ జాతి పుష్పములచే సిద్ద ద్రవ్యములచే శివను పూజించవలెను. ఇట్లు ఒక మాసము చేసినచో సిద్ధులు యోఇణులు ప్రత్యక్షమై అభీష్టములను ఇత్తురు. సముద్ర తీరమున మొగలి పూవులచే పూజించినచో భేటకులు సిద్ధించెదరు. అభీష్టమగు ఆజ్ఞను పాలించెదరు. యుద్ధ మున ఆశ్చర్యకరమగు మాయను చేయుదురు. సాధకుని ఇష్టమును అనుసరించి ధనమును మాలలను భూషణములను ఇత్తురు. ఋక్షద్రుమములచే పీఠము నేర్పరచి ఆ పీఠముపై దేవిని పూజించవలెను. శాల్మలీ కుసుమములచే సిద్ధ ద్రవ్యములచే ఒక మాసము నిర్భయముతో శ్మశాన దేశమున పూజించినచో పిశాచములు సిద్ధించును. శత్రువుల పాషాణ వర్షాదుల నుండి కూడా జీవించును. నిర్జనారణ్యమున రాత్రి యందు ఒక మాసము నిర్భయుడై సిద్ధ ద్రవ్య సమన్విత చక్రగతయగు దేవిని మాలతీ జాత పున్నాగ కేతకీ మరు పుష్పములచే పూజించవలెను. ఇట్లు పూజించినచో వేతాలులు సిద్ధించెదరు. వేతాలులనధిరోహించి స్వేచ్ఛగా సంచరించవచ్చును. శ్మశానమున కాని, చండికాలయమున కాని, నిర్జనారణ్యమున కాని మధ్యరాత్రమున కృష్ణ చక్రమున అతికృష్ణయగు దేవిని కృష్ణ వస్త్ర విభూషణములచే కోపావిష్ణుడై పూజించవలెను. ఆదేవి ముందు సాధ్యయోనిని బలిగా ఛేదించి నివేదన చేయవలెను. సిద్ధ ద్రవ్య సమేతముగా చేయవలెను. ఇట్లు ఒక మాసము చేయవలెను. ఒక మాసము ఆ దేవీ ఫాలలోచనము నుండి భయంకరులగు కృత్యలు పుట్టెదరు. వారికి సిద్ధిని నివేదించవలెను. విశ్వసంహార సంతుష్టులై మరల నిజేచ్చచే వచ్చి దేవీలలాట నేత్రమున ఉందురు. ప్రార్థించినచో తిరోహితులు అగుదురు. రక్త భూషాంబరా లేపమాలా భూషిత విగ్రహలై ఉందురు. నిర్జనోధ్యానమున చక్రమున దేవిని ధ్యానించి పూజించవలెను. కహ్లార చంపకాశోక పాటల శతపత్రముల చేసి ద్రవ్యసముపేతములచే పూజించినచో ఒక మాసములో మాయలు సిద్ధించును. ఈ మాయా ప్రసాదము వలన నరుడు కామరూపి అగును. విశ్వ విజయీ, విశ్వచారీ, విశ్వ వినోదములు కలవాడగును. షడాధారాఙ్ఞ మధ్యమున చక్రమును ధ్యానించి పూజించ వలెను. చన్ద చన్దన కస్తూరీ మృగనాభి మహా దయములచే పూజించవలెను. ఇట్లుచేసిన త్రికాలజ్ఞు డగును. త్రికాలములందు దేవిని చక్కగా ధ్యానించవలెను. పూర్ణ ప్రతీతిలో భవ్యము, వికలమున అభవ్యము చెప్పబడినది. చక్ర సహిత దేవిని భక్తియుతుడై స్మరించవలెను. వివేకా, విభవా, విశ్వా, వితతా, కామినీ, ఖేచరీ, గర్వా, పురాణా, పరమేశ్వరీ, గౌరీ, శివా, అమేయా, విమలా, విజయా, పరా, పవిత్రా, పీడనీ, విద్యా, విశ్వేశీ, శివ వల్లభా, అశేష రూపా, స్వానందా, అంబుజాక్షీ, అనిం దితా, వరదా, వాక్యదా, వాణీ, వివిధా, వేద విగ్రహా, విద్యా, వాగేశ్వరీ, సత్యా, సంయుతా, సర స్వతీ, నిర్మలా, ఆనందరూపా, అమృతా, మానదా, పూషా, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశినీ, చంద్రికా, కాంతి, జ్యోత్స్నా, శ్రీ, ప్రీతి, అంగదా, ఈ దేవీ నామములను చులుకసలిలమున స్మరించుచు మాతృకా సహిత, విగ్న, త్రికావృత్తిచే అమృతాత్మిక సారస్వలు జిహ్వను దీపాకారముగా స్మరించుచు తాడిని పానము చేయవలెను. ఒక సంవత్సరములో చతుర్విధ పాండిత్యము కలుగును. ఇట్లు పరి శుద్ధ మనస్కుడై ప్రతినిత్యము చేయువాడు యోగి, బ్రహ్మవిత్తు, జ్ఞానీ, శివయోగి, ఆత్మవిత్ యగును. పైన చెప్పియున్న చక్రముననున్న దేవిని మాతృకా సహితను స్మరించవలెను. ఒక మాసము చంపక ములచే నిందీవరములచే పూజించిన ఆరోగ్యము కలుగును. అట్లే జ్వర భూత గ్రహోన్మాద శీతకా కామలాక్షులను హరించును. దంత కర్ణ జ్వర శిరశ్మూల గుల్మాది కుక్షి రోగములు, వ్రణప్రమేహ ఛర్ది ఆర్శ గ్రహిణి అమ త్రిదోషజములు అన్నియూ పరమేశ్వరీ పూజచే శాంతించును. చక్ర నిర్మాణమును కాశ్మీరముచే చేయవలెను. లేదా సిందూరము, గైరికము, లక్షా, దరదము, చందన ద్వయము వీటిచే కూడా నిర్మించవచ్చును. బిలద్వారమున షోడ శత్యస్త్ర సంయుతమగు త్రసమును లిఖించవలెను. ఈ మధ్యన నున్న పరమేశ్వరిని దరదముచే పూజించవలెను. వారితో వారి శక్తులతో కూడియున్న పరమేశ్వరుని సుగంధము కల సిద్ధ ద్రవ్యములచే పూవులచే ఒక మాసము పూజించినచో పాతాలాది లోకములందు నాగ కన్యాసంయుతుడై చాలా కాలము ఆనందించును. యధావిధిగా యథోదిత కాలమున పూజించుటచే యక్షరాక్షన గంధర్వ సిద్ధ విద్యాధరాంగనలు, పిశాచములు గుహ్యములు, కిన్నరులు, భుజగులు సిద్ధించెదరు. మోదుగు పూవులచే పూజించిన భూషణములు, పాటలములచే పూజించిన గజములు, ఎర్ర కలువల పూజచే అశ్వములు, కుముద పూజచే వామన ములు, ఉత్పల పూజచే ఒంటెలు, తగర పూజచే పశువులు, జంబీరపూజచే మహిషములు, లకుచము లచే మేకలు, దాడిమ పూజచే నిధులు, ఇప్పపూల పూజచే గానము, పొగడ పూల పూజచే అంగనలు, కహ్లార పూజచే పుత్రులు, శత పత్ర పూజచే జయము, కేతక పూజచే వామనములు, సుగంధి పుష్పపూజచే నిత్య సౌభాగ్యము కలుగును. ఒక మాసము కాని రెండు మూడు మాసములు కాని లేదా ఫలావాప్తి వరకు కాని శర్కరా మృత పాయసములచే సచక్రపరివార సలిల మధ్యగయగు దేవిని పూజించవలెను. సర్వోపద్రవ శాంతి కొరకు అర్ఘ్యములచే పుష్పములచే తర్పణము గావించ వలెను. సంపూర్ణాయుష్యముకొరకు నేతితో, సౌభాగ్యసిద్ధికి తేనెతో, ఆరోగ్యము కొరకు పాలతో ఐశ్వర్యము కొరకు మూడింటిచే, ప్రీతి కొరకు నాళికేరోదకముచే, నృపాప్తికి చల్లని నీటితో, సర్వార్థ సిద్ధికి జలముచే అభిషేకము గావించవలెను. పగలు రాత్రి పూగోద్యానమున సిద్ధ ద్రవ్యములచే పూజించవలెను. ఆ ఉద్యానమున నివసించి పుష్పములచే పూజించినచో మన్మథుని వంటి సౌందర్యము కలవాడగును. పూర్ణిమల యందు నియతముగా కన్యకయందు దేవిని అర్చించవలెను. ఇట్లు చేసినచో పరప్రయుక్త కృత్యలు విముఖములై ప్రయోగించిన వారినే సంహరించును. లింగత్రయమయి అగు దేవిని చక్రస్థ శక్తులతో పూజించినచో ఈ లోకమున పరలోకమున సర్వాభీష్టములను పొందును. సుగంధములగు నూరు బంగారు పుష్పములచే ఒక మాసము పూజించినచో సర్వపాపములు నశించి దేవిని కనులారా చూడగలడు. ఒక మాసము సుగంధముగల అంశుకములచే పూజించినచో సకల పాపకృత్యముల నుండి ఇతర దుఃఖ రాశుల నుండి విముక్తి పొందును. తనను తాను దేవీ రూపముగా చక్రమును చుట్టూ శక్తులను భావించుచు, సుగంధ పుష్పములచే పూజించుచు తన్మయుడు కావలెను. షోడశాన్విత దేవతాపూజకు ప్రత్యేక క్రమముగా తిధులు నిర్దేశించబడి ఉన్నవి. ఆయా తిధులలో ఆయాదేవతలకు పూజాజపహోమాదులు ఆచరించ వలెను. ఘృతము, శర్కర, పాలు, అపూపము, కదలీ ఫలము, తేనె, గుడము, నాలికేర ఫలము, పేలాలు, నువ్వులు, దధి, అటుకులు, శనగలు, పెసలు, పాయసములను నివేదన చేయవలెను. ఈ నివేదన కామేశ్వర్యాది సమస్త శక్తులకు చెప్పబడినది. ఆద్యాలలితను ఇవి అన్నియు అన్నివేళలలో నివేదన చేయవలెను. అగ్నిలో హోమమును కావించవలెను. నరులకు దానము చేయవలెను. ఆయా విద్యాక్షరములచే చెప్పబడిన ఔషధమును ఆయా ప్రమాణానుసారముగా మర్దనచేసి గుటికలుగా చేసుకొని, వాటిని అన్నిటిని సాధించవలెను. ఆదివారమున అరుణాంభోజములచే, సోమవారమున కుముదములచే, మంగళవారమున రక్తోత్పలములచే, బుధవారమున తగరములచే గురువారమున కహ్లారములచే, శుక్రవారమున తెల్లని పద్మములచే, శనివారమున నీలోత్పలముచే స్వేష్ట దేవతను పూజించవలెను. అట్లు పూజించి ఆదివారము మొదలగు వారములలో క్రమముగా పాయసమును, పాలను, కదలీ ఫలములను, నవనీతమును, శర్కరను, నేతిని నివేదన చేయవలెను. ఇట్లు ఇష్టదేవిని చక్కగా పూజించి గంధాదులను అర్పించవలెను. ఇట్లు చేసినచో గ్రహపీడ తొలగి సర్వసుఖములను అందగలడు. అర్థరాత్రి యందు మదనాగ్నిచే తపించు, హరించబడిన హృదయము గల, చేతులు జోడించి శిరస్సున ధరించియున్న, జుట్టు విరబోసుకొని, బెదురుచూపులు గలదై, ఎఱ్ఱని కన్నులు గలదై, గాలిచే ఎగురుగొట్టబడు వస్త్రము గలదై, పద్మసుందరి, వివేకము నశించినదై, మదము గలిగి, మాన లజ్ఞా భయములను విడిచియున్న ఇష్టురాలగు స్త్రీని చింతించుచు చక్రమును అర్చించి, చక్రమధ్యమున దిగంబర దేవిని జపాదాడిమ బంధూక కింశుకాది పుష్పములచే పూజించ వలెయును. అట్లే సుగంధభరితములగు శేషాలీ పుష్పములచే పూజించవలెను. ఇట్లు ఇరువది యొక్క దినములు చేసినచో ఇష్టసుందరి చింతించిన రూపముతో మదముకలదై వచ్చి తీరును. శరీరపాతము వరకు అతనితోనే యుండును. పాలు పెరుగు తేనె కలిపి రక్త పద్మములచే పూజిం చినచో సంపదలు కలుగును. ఎఱ్ఱ కలువలచే పూజించిన యువతులు వశమగుదురు. సమాన రూపముగల దూడయున్న ఆవుపాలు కలిపిన మల్లికామాలతీ జాతి శతపత్రములచే పూజించినచో కీర్తి, విద్యా, ధనారోగ్య, సౌభాగ్య సంపదలు కలుగును. తేనె కలిపిన అశోక పుష్పములచే పూజిం చినచో స్వర్ణాదిస్తంభనము, యుద్ధమున కోపించియున్న శత్రు స్తంభనము జరుగును. నేయి కలిసిన ఎఱ్ఱని గన్నేరు పూలచే పూజించినచో రక్తవస్త్రములు, వనితలు, రాజులు మంత్రులు స్వవశమున ఉందురు. ఇతను కోరిన ఆభరణ వాహన వాణిజ్య సిద్ధులుచేకూరును. అర్థరాత్రమున నూనె కలిపిన ఎఱ్ఱని అవాలచే కాని, లవణములచే కాని, హోమమును గావించిన కోరిన యువతి వచ్చును. రాత్రి మధ్యలో నూనె కలిపిన నల్లని పుష్పములచే పూజించినచో శత్రువునకు జ్వరపీడ కలుగును. నేయి కలిపిన ఆరుపుష్కరములచే కాని ఉద్బీజములచే కాని రాత్రి హోమము గావించినచో శత్రువులకు వైద్యులు తొలగించలేని దాహవ్రణాదులు సంభవించును. అట్లే ఆ నూనె కలిపిన బీజములచే కాని అంకోలములచే కాని ఆవాలు నేయి కలిపిన మిరియాలచే రాత్రి హోమము చేసినచో తాను కోరిన స్త్రీ కామాతురయై సమీపించును. నేయి కలిపిన బియ్యముచే హోమమును కావించినచో తండుల సమృద్ధి కలుగును. పెసలచే హోమము గావించిన పెసలు, నేతితో కావించిన నేయి లభించును. సాధించవలసిన వానినక్షత్ర సంబంధము గల చెట్టు నుండి తీసిన పిండిని పాదరజముతో కలిపి రాజీ మరిచీ లోణోత్థమగు బొమ్మను రాత్రి యందు హోమమును కావించవలెను. పాదములతో, పిక్కలతో, మోకాళ్ళతో, తొడలతో, నాభి క్రింది నుండి, హృదయము నుండి కంఠము వరకు శిరస్సుతో నిశిత శస్త్రముచే ఛేదించి క్రమముగా పన్నెండు విధములుగా హోమము గావించిన నరనారీ నరాధిపులు ఏడు దినములలో వశులగుదురు. సాధకుడు కోరినచో జ్వరము, ఆర్తి కలుగును. బెల్లము కలిపిన పిండిచే, జీలకర్రతో కలిసిన మిరియాలచే బొమ్మనుచేసి బొమ్మ హృదయమున సాధ్యనామమును వ్రాసి నామోచ్చారణచే నేతిచో హోమమును చేసి, ఆ బొమ్మను తన కరాగ్రముచే స్పృశించుచు మన్త్రమును వేయిమార్లు జపించవలెను. ఆ బొమ్మను నేతితో తడిపి చక్కగా పూజించి అదే ధ్యానముచే జపించుచు భక్షించవలెను. ఇట్లు చేసినచో నరనారీ నృపాదులు జీవితాంతము వశులై ఉందురు. శక్త్యష్ట గంధమును చల్లని నీటితో చక్కగా కన్యచే మర్దింపచేసి దానితో ఫాల భాగమున తిలకమును ధరించినచో జగత్తు వశమగును. ప్రస్థ మాత్ర పరిమాణముగల బియ్యమును తీసుకొని కొత్త కుండలో వేసి సమానమగు వర్ణముగల దూడయున్న ఆవుపాలను రెండింతలు ఆ కుండలో నుంచి సంస్కరించిన అగ్నిలో ఉడుకబెట్ట వలయును. నేతితో తడిపిన ఆ ముద్దను శర్కర కలిపి చేతిలోనికి తీసుకొని నూటయెనిమిది మార్లు మంత్రమును జపించి హోమము కావించవలెను. ఇట్లు ప్రతిపత్తున చేసిన హోమము మహాలక్ష్మిని ప్రసాదించును. ఇట్లు ప్రతి శుక్రవారము గావించిన రాజతుల్యుడగును. విశేషించి పంచమినాడు పైన చెప్పిన విధముగా హోమమును గావించవలెను. పంచమినాడు పాలు పెరుగు తేనె కలిపిన మల్లికాదులచే హోమమును చేయవలెను. అన్నముచే నేయిచే హోమమును చేసిన అన్నాఢ్యుడగును. కోరిన వస్తువులన్నియూ లభించును. నేతిచే హోమము గావించిననూ, నువ్వులచే తండులములచే గాని హోమమును గావించినచో అభీష్ట వస్తుసిద్ధి కలుగును. పాలు పెరుగు తేనె కలిపిన ఎఱ్ఱని పద్మములచే హోమమును నలుబది రోజులు గావించినచో మహాలక్ష్మిని పొందును. తేనె కలిపిన చంపకములచే వేయి హోమము ఒకమాసము చేసినచో నూరు బంగారు నాణెములు లభించును. నేయి కలిపిన పాటల పుష్పములచే మూడువేలు హోమము గావించినచో అమావాస్య నుండి నెల దినములలో చిత్ర వస్త్రములను పొందును. కర్పూర చందనాది సుగంధి వస్తువులు లభించును. ఇతర భోగోపయోగులగు వస్తువులు కూడా లభించును. ప్రతి సప్తమీ తిధి అందు పాలు కలిపిన బియ్యముచే ఆరు నెలలు నూరు హోమమును గావించిన శాలి సమృద్ధి కలుగును. నువ్వులతో ఒక సంవత్సరము హోమమును కావించినచో ఆరోగ్యమును పొందును. నిజ నక్షత్రమున మూడు మార్లు దూర్వా హోమము కావించినచో రోగాదులు నశించి మహాభోగములచే నూరు వర్షములు జీవించును. మూడు జన్మ నక్షత్రములందు గూడూచీతిల దూర్వలచే హోమమును కావించవలెను. ఇట్లు చేసినచో ఆయుశ్శ్రీ యశోభోగ పుణ్య విధ్యాదులు లభించును. ఇట్లు మూడు జన్మ నక్షత్రములలో ఘృత పాయసదుగ్ధములతో హోమము గావించినచో ఆయురారోగ్య వైభవములచే రాజమంత్రి తుల్యులగును. ప్రతి సప్తమిన కదలీ హోమము చేసినచో సౌభాగ్యము లభించును. ప్రాదేశ సూత్రములగు మూడు దూర్వలచే పాలు పెరుగు తేనెలు కలిపి నిత్యము సన్నిపాత జ్వరమున్నపుడు హోమమును గావించవలెను. ఆ దినములలో జలమును స్పృశించుచు మంత్రమును జపించవలెను. ఆ జలముచే వేయిమార్లు స్నానము, పానమును ఆచరించవలెను. పాకాదులను కూడా ఆ జలముతోనే చేసినచో రోగ విముక్తుడగును. సాధ్యనక్షత్ర వృక్ష చూర్ణమును పాలుపెరుగు తేనెలతో కలిపి, ఆవాలు, నువ్వులు పడి, సాధ్య పాదరజస్సుతో కూడియున్న దానిచే బొమ్మను చేసి హృదయమున సాధ్య నామమున వ్రాసి నిశితాయుధములచే పైన చెప్పినట్లు ఖండించి హోమమును కావించవలెను. ఇట్లు ఏడు దినములు చేసిన సాద్యుడు వశ్యుడగును. అటువంటి బొమ్మను కుండ మధ్యమున పాతిపెట్టి, పైన అగ్ని నుంచి మంత్రములో ప్రతినిత్యము హోమమును చేయవలెను. రాత్రిపూట మూడువేలు ఆవాలచే రసముతో కలిపి హోమమును గావించినచో నూరు యోజన దూరముల నుండి కూడా వనితను తీసుకొని వచ్చును. మధు మిశ్రిత కౌశికములచే హోమమును గావించిన స్త్రీని వశము చేయును. నాలికేర ఫలములతో కూడియున్న గుడముచే హోమమును గావించిన లక్ష్మి లభించును. అట్లే నేయి కలిపిన కలువలచే, పాలు కలిపిన ఎర్రకలువలచే, పాలు పెరుగుతేనె కలిపిన చంపకములచే, పొగడ పూవులచే, ఇప్ప పూవులచే హోమము గావించినచో కన్య లభించును. పున్నాగ పుష్పములచే హోమముచేసిన వస్త్రములు, నేతి హోమమున ఇష్టములు మహిష క్షీరహోమమున మహిషములు, అజక్షీర హోమమున అజములు, గవ్యహోమముచే గోవులు రత్నహోమముచే రత్నములు లభించును. వరిపిండితో బొమ్మను చేసి శర్కర కలిపి, హృదయమున నామాక్షరములను వ్రాసి రాత్రిపూట నూనెలో నేతిలో ఉడికించవలెను. దానియందే మనసు నుంచి మంత్రమును జపించుచు భక్షించవలెను. ఇట్లు ఏడు రాత్రులు చేసినచో నరుడు నారి నృపాదులు దాసులవలె వశులై మనసును ప్రాణాదులను అర్పించెదరు. తెల్లని లేదా ఎఱ్ఱని గన్నేరు పూవులచే ఇరువది ఒక దినములు హోమమును గావించిన మహా సంపదలను పొందును. పాలు పెరుగు తేనె కలిపి ఛాగ మాంసముతో హోమమును గావించిన బంగారమును పొందును. పాలు కలిపి హోమము గావించి సస్యశ్యామలమగు భూమిని పొందును. మూడు దినములు పద్మాక్షములచే హోమము గావించిన లక్ష్మిని పొందును. మారేడుచే దశాంశ హోమమును చేయవలెను. ఇట్లు మంత్ర సిద్ధిని పొందినవాడు మంత్రించిన చులుకోదకములచే పాము కరిచి, మరణించిన వారి ముఖముపై చల్లి బ్రతికించవచ్చును. పాము కరిచి మరణించినవారి చెవిలో మంత్రమును చదివికాని, జపసిద్దమగు దండముచే శిరస్సున కొట్టి లేపవచ్చును. కుండమధ్యమున యోనిని లిఖించి అగ్నిని స్థాపించి యధావిధిగా హోమమును చేయవలెను. నువ్వులు, ఆవాలు, గోధుమలు, బియ్యము, యవలు మొదలగు వాటిచే హోమమును చేయవలెను. పాలు పెరుగు తేనెలు కలిపి ఒక్కొక్క ధాన్యముతో కాని, అన్ని కలిపి కాని సమృద్ది కొరకు హోమమును చేయవలెను. పొగడ సంపెంగ, పద్మములు, కహ్లారములు, ఎర్రకలువలు, నల్లకలువలు, మల్లికా కుంద మధూకాదులచే హోమము చేసిన లక్ష్మిని పొందును. అశోక పాటల బిల్వజాతి కంకత నవనీలోత్పల కరవీర కర్ణికారపుష్పములచే హోమమును చేసిన లక్ష్మిని సౌభాగ్యమును, నిధిని, ఆయుష్యమును, కీర్తిని పొందును. దూర్వను, గుడూచిని, అశ్వత్తమును, వటమును, ఆరగ్వధమును సితార్క ప్లక్షములచే హోమమును గావించిన రోగ విముక్తుడగును. ఇక్షు, జంబూ నాలికేర మోచా గుడసిత మిశ్రములచే హోమమును గావించిన స్థిరమగు లక్ష్మిని పొంది సమస్త భోగములను అనుభవించును. నేయి ఆవాలతో హోమమును కావించిన మృత్యువు, కాష్ఠాగ్నియందు శత్రుమృత్యువు కలుగును. చతురంగుళ పరిమాణములగల సమిధలచే హోమమును కావించిన శత్రువు యొక్క చతురంగ బలము ఏడు దినములలో రోగ దుఃఖార్తులు కలిగి నశించును. ప్రతి నిత్యము నిత్యార్చనకావించి ఘృతముచే హోమమును కావించవలెను. విద్యాభిమంత్రిత జలమును ప్రాతః కాలమున త్రాగవలెను. చందనోశీర కర్పూర కస్తూరీ రోచనాయుతములగు కాశీకాలాగురు కస్తూరీ మిశ్రిత గంధములతో సర్వార్థ సిద్ధికొరకు పూజించవలెను. ప్రాతః కాలమున మాతృకతో సర్వనిత్యా మంత్రములను మూడుసార్లు జపించి జలపానము గావించిన వాక్సిద్ధి కలుగును. పయోవ్రతము స్వీకరించి పూర్వమువలె వర్ణలక్ష జపము గావించవలెను. పాలు పెరుగు తేనె కలిసిన పద్మములచే దశాంశము హోమము గావించవలెను. జప తర్పణ హోమార్చనాభిషేకాదులతో మంత్ర సిద్ధిని పొంది పైన చెప్పబడిన ప్రయోగములను చేయవలెను. అట్లు చేయనిచో ఆ మంత్ర దేవతలు కోపించి ఆ క్షణముననే సాధకుని ప్రాణములను హరింతురు. ఈ విద్యచే సాధ్యము కానిదేదీ ఈ జగత్తున లేదు.
అరణ్యమున మఱ్ఱిచెట్టు మూలమున, పర్వతాగ్రమున గుహలలో ఉద్యాన మధ్యభాగమున, కాంతారమున, మాతృపాదప మూలమున, నదీతీరమున, వనమున, ఈ యక్షిణీ విద్యలను సాధించవలెను. కమలములచే, ఎఱ్ఱకలువలచే, తెల్లని సౌగంధికా పుష్పములచే, కలువలచే, సుగంధిశేషాలికా పుష్పములచే పాలు పెరుగుతేనె కలిపి యథావిధిగా ఏడు వారములుకాని, నలుబది రోజులు కాని హోమమును చేసినచో యుద్ధమున విజయమును పొందును. మల్లయుద్ధమున, ద్వంద్వ యుద్ధమున, వాదమున, ద్యూతమున, సర్వ వ్యవహారములలో విజయమును పొంది తీరును, చతురంగుళ పుష్పములచే హోమమును గావించి శత్రుస్తంభనము చేయగలడు. అట్లే కర్ణికార పున్నాగమేరు చంపకకైతక రాజవృక్ష మాధవ పుష్ప సప్తకముచే ద్వారములందు యథా పూర్వకముగా హోమము చేసినచో శత్రు స్తంభనముకాని శత్రు భంగముకాని జరుగును. శత్రు నక్షత్ర వృక్షాగ్ని అందే అ సమిధలచే ఆవాలు నెయ్యి కలిపి హోమమును గావించినచో శత్రువు పాదాక్రాంతుడు అగును. మృత్యుకాష్ఠాగ్ని అందు మృత్యుపత్ర పుష్పములచే, సమిధలచే ద్వారే శార్చన పూర్వకముగా హోమమును గావించిన శత్రువులు చతురంగ బలము రోగ పీడితమగును. దానిచే సాధకునికి జయము లభించును. లేదా శత్రు సంహారముచే కూడా విజయము లభించును. ఆదివారమున జిల్లేడు కట్టెలతో బాగుగా మండుచున్న అగ్నియందు జిల్లేడు సమిధలచే పత్రపుష్ప ఫలకాండములతో సమాన వర్ణములుగల దూడ ఉన్న ఆవు నెయ్యిచే తడిపి నలుబది రోజులు త్ర్యస మండలమున యధావిధిగా శత్రుదిక్కున ముఖముచేసి హోమము గావించినచో రోగార్తుడై పలాయనము కావించును. భయార్తుడై పాదాక్రాంతుడగును. సోమవారమున మోదుగు కాష్ఠముచే చక్కగా మండుచున్న అగ్నిలో మోదుగు సమిధలచే పత్ర పుష్ప ఫలకాండములచే నేతితో తడిపి హోమము గావించినచో పైన చెప్పిన ఫలము సంభవించును. మంగళవారమున చంద్రకాష్ఠములలో మండించిన అగ్నిలో నేయికలిపిన చండ్ర సమిధలచే పత్రపుష్ప ఫలకాండములచే హోమమును గావించిన పూర్వోక్త ఫలము లభించును. బుధవారమున అపామార్గ కాష్ఠాగ్నిలో, గురువారమున రాగికట్టెల అగ్నిలో, శుక్రవారము మేడి కట్టెల అగ్నిలో, శనివారము జమ్మి కట్టెల అగ్నిలో నేయి కలిపిన శుభప్రీత సిత శ్యామ వర్ణములుకల ఆయా సమిత్ పత్ర పుష్ప ఫలకాండములచే హోమమును గావించినచో పూర్వోక్త ఫలము లభించును. ఆ తరువాత అయిదు తిధులలో పైన చెప్పబడిన ద్రవ్యములచే తిలద్వయముచే, సితాన్నములచే, పాయసములచే మేక నేతితో హోమమును కావించిననూ పూర్వోక్త ఫలము పొందును. ఇట్లే నక్షత్ర వృక్షముల నుండి పుట్టిన అగ్నిలో నేయితో కలిపిన ద్రవ్యములచే హోమమును కావించిననూ పూర్వోక్త ఫలము లభించును. మొదట విద్యను సాధించి తరువాత మంగళానుగ్రహముతో సమస్త ప్రయోగములను సాధించవలెను. దేవతను కాని బ్రాహ్మణ కుమారిని కాని, కన్యకను కాని శుభావయవములు కలిగి యుగ్ధయై స్నాత దౌతాంబర శుభకరియగు దానిని కాని ఇట్టి కుమారుని కాని స్థాపించి విద్యచే పూజించి, శిరస్సును స్పృశించుచు మంత్రమును నూరుమార్లు జపించి పూజించవలెను. ఎఱ్ఱని తెల్లని గంధముగల పూవులతో పూజించవలెను. కర్మపూర్తి యగువరకు గుగ్గులు ధూపమును వేయవలెను. అపుడు దేవి అవేశించియున్న కుమారుని లేదా కుమారిని భక్తితో చక్కగా పూజించి పూర్వోక్త షోడశోపచారములచే సేవించి మంత్ర జపమును చేయుచు తన అభీష్టమును అడుగవలెను. ఆమె అభీష్టములను భూత భవిష్యద్వర్తమానములను మనసులోనున్న సమస్త విషయములను జన్మాంతర విషయములను కూడా చెప్పును. తరువాత మరల ఆ దేవిని పూర్వోక్తముగా పూజించి తనలో ఉద్వాసన చేసి మంత్రమును జపించవలెను. ఇట్లు వేయిమార్లు జయించి స్థిరబుద్ధి కలవాడై పూర్ణాత్ముడై సుఖము కలవాడై విహరించవలెను. పాలు, పెరుగు, తేనె కలిపిన ఎఱ్ఱని పద్మములచే నలుబది రోజులు హోమము గావించిన సంపదను, తెల్లని పద్మములచే చేసిన కీర్తిని పొందును. తేనె కలిపిన ఎఱ్ఱని కలువలచే హోమమును గావించినచో బంగారమును కాని నిధిని కాని భూమిని కాని పొందును. పాలు కలిపిన కలువలచే హోమమును చతుర్విధ పాండిత్యమును పొందును. పాలు, పెరుగు, తేనె కలిపిన పేలాల హోమముచే సమస్త గుణ సంపూర్ణయగు కన్యను భార్యగా పొందును. బెల్లముకాని శర్కరకాని కలిపిన నాళికేర ఫలక్షోదముచే హోమమును గావించినచో యత్నరహితముగనే కుబేరుడంతటి ధనవంతుడగును. నేయి కలిపిన అన్నముతో, బియ్యము కలిపిన నువ్వులతో, ఎర్రని పూవులచే, ఎర్రగన్నేరు పూవులచే, తెల్లగన్నేరు పూవులచే హోమము చేసినచో వాక్సిద్ధి కలుగును. తెల్లని ఎర్రని పూవులను కలిపి హోమము చేసినచో ఆయురారోగ్యములు లభించును. పాలు పెరుగు తేనె కలిపిన దూర్వాత్రయముచే హోమము చేసిన శత్రుజయము లభించును. గుడూచీ హోమముచే పాయసముచే, తిలలచే, శ్రీఖండ పంక కర్పూర మిలితములైన శతపత్రములచే హోమమును చేసిన సంపదను పొందును. వంశపారంపర్యముగా స్థిరముగా ఉండును. కర్పూర సంయుతమగు కుంకుమను హిమతోయముచే మర్దించి ఆ పంకముచే, వికసించిన కలువలచే హోమము చేసినచో రాజంతటి వాడగును. సంపదలతో తులతూగును. నూరు సంవత్సరములు జీవించును. శత్రు రహితముగా, ఆపద రహితముగా, సాటిలేనివాడై, పరిశుద్ధమనస్కుడై ఉండును. ఇక్షుకాండ శకల హోమముచే వస్త్రములను పొందును. అట్లే ఎర్రని తెల్లని గన్నేరు పూలచేకాని, తేనెతో కలిపిన పాటల పుష్పములచే హోమమును గావించిన స్త్రీలు వశ్యులగుదురు. అట్లే పద్మ హోమముచే వేశ్యలు వశ్యులగుదురు. సమాన రూపముగల దూడ ఉన్న నల్లని ఆవుపాలలో శర్కర కలిపి హోమమును చేసినచో పాపస్వభావము కలవాడైనను సాటిలేని సంపదను పొందును. సౌవీరముచే కలిపిన పత్తి గింజలచే హోమముగావించిన శత్రువులు వశ్యులగుదురు. అరిష్ట పత్రములచే కాని, బీజములచే కాని అరిష్టాగ్నిలో మృత్యుబీజములచే నింబతైలసిక్తముగా హోమమును గావించిన శత్రునాశము జరిగి తీరును. పంచ గవ్య హోమముచే రోగార్త తురగములు ఆరోగ్యమును పొందును. నూనె కలిపిన అక్షబీజములచే హోమమును గావించిన సర్వవినాశము జరుగును. చక్కగా తడిపిన కరంజ బీజములచే హోమమును గావించిన శత్రువు పిశాచగ్రస్తుడగును. అక్షతరుజన్యము లను పత్రపుష్ప ఫలకాండ సమిధలచే హోమము గావించిననూ పూర్వోక్త ఫలము లభించును. నింబతైలము కలిపిన అక్షద్రుమబీజములచే హోమము గావించిన శత్రువు అదే దినమున అపస్మారమును పొందును. శత్రు జన్మ నక్షత్ర వృక్ష సమిధలచే ప్రజ్వరిల్లిన అగ్నిలో అదే వృక్షముయొక్క పంచాంగములచే హోమము గావించిన శత్రువు మరణించును. ఆవాల నూనె కలిపిన తామర పూసలచే హోమమును గావించినచో శత్రువులు కుష్ఠరోగగ్రస్తులై దేహలోపముగల వారగుదురు. మిరియాలచే ఆవాలచే నూనెలో కలిపి హోమము గావించినచో అదే దినమున శత్రువు దాహ జ్వరగ్రస్తుడగును. ఇట్లు శత్రు నిగ్రహము కొరకు చేయు హోమము లందు, తన రక్షణ కొరకు ప్రతి దినము భక్తియుతుడై సద్విద్యలచే జప హోమాదులను ఆచరించవలెను. మృత్యుంజయ మంత్రముచే కాని ఆయా ప్రయోగములందుండు విద్యలచే ఇతని అన్యధా సిద్ధమంత్రమును వెంటనే నశింపచేయును. కృతయుగమున మూడు లక్షల జపము గావించిన మంత్రసిద్ధి లభించును. త్రేతాయుగమున రెట్టింపు చేయవలెను. ద్వాపరయుగమున మూడురెట్లు, కలియుగమున నాలుగురెట్లు చేయవలెను. దశాంశము హోమము, తద్దశాంశము బ్రాహ్మణ భోజనము గావించవలెను. ఈ క్రమముచే అన్ని విద్యలకు చెప్పబడిన సంఖ్యానుసారముగా జపమునుచేసి మంత్రసిద్ధిని పొంది తరువాత ప్రయోగాదులను చేయవలెను. కామేశ్వరీ జపము రెండింతలు చేయవలెను. మంత్రసిద్ధి జరిగిన తరువాత ప్రయోగాదులను చేయవలెను. భగమాలా మంత్రమును లక్ష జపించి దశాంశము హోమమును చేయవలెను. నిత్యక్లిన్నా జపము లక్ష దశాంశము హోమము చేయవలెను. తరువాత ప్రయోగములను చేయవలెను. భేరుండ మంత్రమును మౌనముతో క్షీర పానము మాత్రము చేయుంచు తొమ్మిది లక్షలు జపమును చేయవలెను. తరువాత మిగిలిన వాటిని చేయవలెను. వహ్ని వాసినికి మూడు లక్షలు జపము చేయవలెను. మిగిలిన దంతయు యధా పూర్వముగా చేయవలెను. మహావజ్రేశ్వరీ విద్యాజపమును మూడు లక్షలు చేయవలెను. యధోక్త క్రమముగా దశాంశమును హోమము చేయవలెను. దూతీ మంత్రమును లక్ష జపించవలెను. దశాంశ క్రమముగా హోమాదులు చేయవలెను. త్వరితా మంత్రమును లక్ష జపించవలెను. విద్యా సిద్ధికి హోమాదికమును చేయవలెను. కులసుందరీ మంత్రమునకు లక్ష జపము దశాంశము హోమాదులను చేయవలెను. నిత్యానిత్యా జపము మూడు లక్షలు దశాంశము హోమాదులు చెప్పబడినవి. నిత్యపతాకా మంత్రజపము యాబది మూడు లక్షలు జపము దశాంశము హోమాదులు గావించవలెను. విజయా జపము మూడు లక్షలు, సర్వమంగలకా జపము ముప్పది రెండు లక్షలు, జ్వాలామాలినికా మంత్రమునకు ఎనిమిది లక్షల జపము యధోక్త ద్రవ్యములచే దశాంశ హోమమును గావించవలెను. చిత్రా మంత్రమునకు పదునారు లక్షల జపము దశాంశ హోమాదులు చేయవలెను. ఇట్లు నిత్యాపటంమును మొదటి నుండి చివరి వరకు సంక్షేపముగా చెప్పితిని. ఇచట అంతయూ యంత్ర సాధన పూర్వకముగా చేయవలెను అని తెలియవలెను. (3/90)