నారద మహా పురాణము
రుక్మాంగద సంలాపము
మోహిని పలికెను: ఓ రాజా! కార్తిక మాసమున ఉపవాసమును గురించి చక్కగా చెప్పితిరి. కాని రాజులకు వ్రతాచరణము విధించబడినట్లు ఎక్కడా నిదర్శనము కానరాదు. వ్రతాచరణము బ్రాహ్మణులకు తప్ప శూద్ర వైశ్యులకు కూడా విధించబడలేదు. రాజులకు దానము, ప్రజాపాలనము, యుద్ధము అను మూడు కర్మలు విధించబడి ఉన్నవి. కావున నా మీద నీకు కోరిక ఉన్నచో నీవు వ్రతమును చేయరాదు. నీవు లేనిదే ఒక ముహూర్త కాలము కూడా నిలువజాలను. ఇక ఒక నెల ఎట్లుండగలను? ఉపవాసమును చేయదలచిన సమయమున బ్రాహ్మణులకు భోజనము నిమ్ము. లేదా నీ పెద్ద భార్యయగు సంధ్యావళీ దేవి ఈ వ్రతమును ఆచరించ నిమ్ము. మోహిని ఇట్లు పలుకగా రుక్మాంగద మహారాజు సంధ్యావళీ దేవిని పిలిచెను. సంధ్యావళీ దేవి భర్త పిలుపు అందుకొని వెంటనే రాజును చేరెను. మోహినీదేవి బాహు పంజరములో ఉండి మోహినీ స్తనాగ్ర ఘర్షణతో సకామయగు మోహినీ శయ్యపై ఉన్న భర్తను తలవంచుకొని చేతులు జోడించి రుక్మాంగద మహారాజుతో నన్నెందుకు పిలిపించితిరి? నేనేమి చేయవలయును? నాథా! నేను సవతిమీద ఈర్ష్యను వదిలియున్నాను. నీ మాటను పాటించెదను. నీవు మోహినీ దేవిచే రమించుచున్న విధానముతో సమముగా నీయందునాకు ప్రీతికలుగుచున్నది. భర్త సుఖించు చున్నపుడు దుఃఖించు భార్య ఎనిమిది సంవత్సరములు డేగగా ఉండును. నన్ను ఆజ్ఞాపించుము. కాముకత్వముతో బిడియపడకుము.
రుక్మాంగద మహారాజు పలికెను: ఓ ప్రియురాలా? నాకు నీ స్వభావము బాగుగా తెలియును. నేను నీ మాటతోనే చాలాకాలము మోహినితో రమించితిని. మోహినితో రమించుచుండగా చాలా కార్తిక మాసములు ప్రియాసౌఖ్యమోహములో గడిచినవి. ఒక్క హరివాసరమును మాత్రము విడువలేదు. ఇపుడు నేను కామ భోగములతో తృప్తిని చెందితిని. సర్వపాప నాశకమగు కార్తీకమాసము వచ్చినదని తెలుసుకొంటిని. పరమ పుణ్యప్రదమగు కార్తిక వ్రతమును ఆచరించదలచితిని. కాని ఈ బ్రహ్మసుతయగు మోహిని వ్రతము నుండి నన్ను వారించుచున్నది. ఎట్టి పరిస్థితులలోను ఈమెను బాధించరాదు. కావున కాయమును శుష్కింపచేయి. నేను చేయదలచిన కృచ్ఛ్రవ్రతమును నీవు ఆచరించుము. కొత్త బంగారు కాంతిగల, పీన పయోధరములుకల సంధ్యావళి భర్త మాటను విని సంతోషముచే పూర్ణ చంద్రముఖియై, నీ సంతోషము కొరకు వ్రతమును ఆచరించెదను. ఇటుల ఆచరించినచో కీర్తి యశములు కలుగును. నీ కీర్తితో నాకు ఆనందము కలుగును. నీకు ఆనందమును కలిగించెదను. నీ కొఱకు నిప్పులో కూడా దూకుడును. అందులో ఇది చేయరాని కార్యము కూడా కాదు. నీ అజ్ఞతో కన్నకొడుకును కూడా చంపెదను. ఇక ఇంత చక్కని వ్రతమును ఏల చేయను. తప్పక ఈ సద్ర్వతమును ఆచరించెదను అని ఇట్లు విశాలనేత్రయగు సంధ్యావళీ దేవి యమశత్రువగు రుక్మాంగద మహారాజుతో పలికి సకలపాప వినాశము కొఱకు వ్రతమును ఆచరించెను. ఇట్లు సంధ్యావళీదేవి వ్రతము ఆచరించుటచే రుక్మాంగద మహారాజు సంతోషించెను. అపుడు బ్రహ్మపుత్రిక యగు మోహినితో నీవు చెప్పినట్లే చేసితిని అనెను. కావున నీవు సంతోషముతో నాయందు కలిగిన వాంఛా పూర్తికై చక్కగా రమించుము. నీ సంతోషము కొఱకే నేను అన్ని పనులను వదిలితిని. నా సౌఖ్యమునకు నీవు తప్ప మరొక స్త్రీ లేదు. రుక్మాంగద మహారాజు ఇట్లు పలుకగా సంతోషమును పొంది రాజుతో ఇట్లు పలికెను. నీవు చాలా కామముతో నున్న వాడవని తెలిసి నేను త్రివిష్టపమునుండి ఇటకు వచ్చితిని, దేవతలను, దైత్యులను, గంధర్వ యక్ష రాక్షస నాగులను నాకొరకు చూచు వారి నందరిని విడిచి నీయందు ప్రీతితో మందరాద్రి అందు నిన్ను చేరితిని. లోకమున ప్రేయసీ ప్రియు లిరువురు ఒకే మనసుతో నుండుటే కామఫలము. భేదాభిప్రాయములు గల వారి సంగమము శవముల సంగమము వంటిది. నా శరీరము, నా సౌందర్యము కాముకుడవగు నీచే సఫలమైనది. ఇట్లు మూడు లోకముల లోను లభించదు. ఉన్నతములగు స్తనములతో ఆలింగనము చేసుకొనినపుడు ద్రవించని ప్రియుని హృదయము వజ్రమువలె కఠినమని తలచెదను. స్తనములు హృదయమున హత్తుకొని మదవతి అధరమును పానముచేయుటే ఈ లోకమున అమృతము. అని పలికి ఏకాంతములో నున్న రాజును గాఢముగా ఆలింగనము చేసుకొని, వాత్స్యాయన కామశాస్త్రానుసారముగా రాజును రమింపచేసెను. ఇట్లు రుక్మాంగద మహారాజు మోహినితో రమించుచుండగా రాజు చెవులకు భేరీధ్వని వినిపించెను. ధర్మాంగద మహారాజుగారి ఆజ్ఞతో మత్తగజ కుంభస్థలముపై మ్రోగించుచుండెను. రేపు ఏకాదశి. కావున ఈ దినము ఏకభుక్తముగా ఉండుడు. ఉప్పుకారములను విడిచి, హవిష్యమును భుజించుడు. భూమి మీద పరుండుడు. ప్రియా సంగమమును విడువుడు. పురాణ పురుషోత్తముడగు శ్రీమన్నారాయణుని స్మరించుడు. ఏక భుక్తముతో ఉపవాసము ఆచరించుడు. ఇట్లు చేసినచో శ్రాద్ధమును చేయనివారు, పిండ ప్రదానమును చేయనివారు, గయకు వెళ్ళని పుత్రులు కలవారుకూడా శ్రీహరి లోకమునకు వెళ్ళుడు. ఈ ఏకాదశి కార్తిక శుక్ల ఏకాదశి. శ్రీహరిని నిద్ర నుండి మేల్కొల్పునది. ప్రాతః కాలమున ఏకాదశి వచ్చుచున్నది. భోజనమును చేయకుడు. ఈ ప్రబోధిని ఉపవసించినచో బ్రహ్మ హత్యాది పాపములు, కామ వశముచే చేసిన పాపములు అన్నియూ నశించును. ఈ ఏకాదశి ధర్మపరులను, న్యాయాచార యుక్తులను ప్రబోధింప చేయును. సాక్షాత్తుగా శ్రీహరినే ప్రబోధింపచేయును. కావుననే ఈ ఏకాదశి ధర్మపరులను, న్యాయా చార యుక్తులను ప్రబోధింప చేయును. సాక్షాత్తుగా శ్రీహరినే ప్రబోధింపచేయును. కావుననే ఈ ఏకాదశి ప్రబోధిని అనబడును. శ్రీహరి నిద్రను తొలగించు ఈ ఏకాదశిన ఒకసారి ఉపవసించిననూ మరల గర్భవాస దుఃఖమును అనుభవించడు. తమ తమ విభవాను సారముగా శ్రీహరిని పూజించుడు. వస్త్ర పుష్ప ధూప దీప చందన పుష్పములను, మధుర ఫలములను సమర్పించుడు. ఈ దినమున ధర్మకరము శ్రీ విష్ణులోక ప్రదమగు నా ఆజ్ఞను పాలించనివాడు దండించబడును. వధించబడును. ఈ దేశమునుండి బహిష్కరించబడును. ఇట్లు మేఘ గంభీరధ్వనిచే పటహము ధ్వనించుట వినిన రుక్మాంగద మహారాజు చేతినుండి కర్పూరముతో నున్న తాంబూలము జారిపడెను. మోహినీ దేవి స్తనములకు తగిలియున్న హృదయమును దూరముగా జరిపి రతివర్ధనుడగు మహారాజు శయ్యనుండి లేచెను. మోహకా మార్తయగు మోహినీ దేవిని మధురమగు మాటలచే ఓదార్చుచు ఇట్లు పలికెను. ఓ దేవీ! ఉదయము ఏకాదశి వచ్చుచున్నది. అది సర్వపాప నాశకము. నేను నియమ బద్ధుడనగుదురు. క్షమింపుము. క్షమింపుము. నీ యాజ్ఞతో నేను కృచ్ఛ్ర వ్రతమును సంధ్యావలికి అప్పగించితిని. కాని ప్రబోధ కరణియగు ఏకాదశీ వ్రతమును నేనే ఆచరించవలెను. ఈ ఏకాదశి సమస్త సంసారబంధములను ఛేదించును. ఉత్తమగతిని ప్రసాదించును. కావున నియమపరుడనై నేను హవిష్యమును భుజించెదను. నాతోపాటు నీవు కూడా ఉపవాసమును ఆచరించి అధోక్షజుడు హృషీకేశుడగు శ్రీమన్నారాయణుని ఆరాధించుము. ఇట్లు ఆచరించినచో దాహ ప్రళయ రహితమగు నిర్వాణమును పొందెదవు.
మోహినీ దేవి పలికెను: ఓ రాజా? జన్మమృత్యు జరాఛేదియగు చక్రపాణి పూజను చక్కగా బోధించితివి. నీ ఆజ్ఞచే నేను ఆచరించెదను. కాని పూర్వము నీవు మందర పర్వత శిఖరమున దక్షిణకర ప్రదాన పూర్వకముగా నీ సుకృతముపై శపథముతో ప్రతిజ్ఞచేసి ఉంటివి. ఇపుడు ఆ సమయ మొచ్చినది. ఇప్పుడు నేను అడిగిన దానినిమ్ము. నేను అడిగిన దానిని ఈయనిచో నీవు నాటి నుండి సంపాదించిన సమస్త పుణ్యము వెంటనే నశించును.
రుక్మాంగద మహారాజు పలికెను: ఓ సుందరాంగీ! రమ్ము. నీ మనసులోని మాటను చేయుదును. నా ప్రాణమును కూడా నీకిత్తును. నీకు ఈయరానిదేదీ లేదు. ఇక గ్రామ ధన రాజ్యాదులు ఎంతమాట!
మోహినీ దేవి పలికెను: ఓ నాథా! ప్రియా? ప్రభో! రాజా? ప్రాణనాథా! రతిప్రియా! నన్ను అనుభవించదలచినచో నీవు ఏకాదశినాడు ఉపవసించరాదు. ఉపవసించినచో నేను నీకు ప్రియురాలను కాను. నేను నీ సంయోగము లేనిదే ఒక ముహూర్తము కూడా ఉండలేను. కావున నన్ను అనుభవించు కోరిక కలదేని ఏకాదశీ ఉపవాసమును త్యజించుము. ఏకాదశినాడు భుజించుము. నాకు ఈయవలసిన వరమిదియే. దీనినే నేను పూర్వము కోరితిని. నీవు అసత్య పరుడవై నాకీ వరమును ఈయనిచో ప్రళయకాలము వరకు ఘోరమగు నరకమున ఉందువు.
రాజు పలికెను: ఓ కళ్యాణీ! నీవిట్లు పలుకకుము. ఇది నీకు తగదు. బ్రహ్మ పుత్రికవై ధర్మ విఘ్నమును చేతువా? నా పుట్టుకనుండి నేను ఏకాదశినాడు భుజించలేదు. ఇక ఇప్పుడు పండిన తల కలవాడనై ఎట్లు భుజింతును? యౌవనము తిరిగి ఇంద్రియ బలము క్షీణించినవాడు గంగను సేవించుట, శ్రీహరిని పూజించుట ఉచితము. నేను బాల్యమున యౌవనమున చేయని హీనకర్మను వార్ధక్యమున ఎట్లు చేతును. ఓ చపలాంగీ! వరవర్ణినీ! ప్రసన్నురాలవు కమ్ము. వ్రతమును భంగపరచకుము. నీకు నా రాజ్యమును సంపదలను ఇత్తును. ఇది వలదన్నచో మరొకటి ఇచ్చెదను. విమాన సమము శుభకరము అగు పల్లకిలో నిన్ను కూర్చుండబెట్టి నీవు చెప్పిన చోటికి భార్యాయుక్తుడనై కొనిపోదును. ఇది కూడా వద్దన్నచో పగడములు పొదగిన బంగారు స్తంభములతో ఒక విమానమును నిర్మించియుంటిని. ఆ విమానమున ఫలమయమగు ఊయల నేర్పరచి రాత్రింబవళ్ళు చాలా నెలలు ఆ ఊయలలో నిన్ను ఊపెదను. కావున నాకు ప్రియురాలవు కదా. వ్రత భంగమును చేయకుము. చండాల మాంసముకాని, శునక మాంసముకాని, తన మాంసముకాని ఏకాదశీ భోజనము కంటే మేలు. మూడు లోకములను సంహరించిన పాపము, అమావాస్యనాడు స్త్రీ సంగమ పాపము, షష్ఠీదినమున క్షురకర్మ పాపము ఏకాదశీ భోజనము వలన కలుగును. షష్ఠినాడు తైల భోజనము, తృతీయనాడు లవణ భోజనము సప్తమినాడు మాంస భోజనము, పూర్ణిమనాడు ఘృత భోజనము సూర్య సంక్రమణమున సురాపానము, గోచార లోపము, కపట సాక్ష్యము వలన కలుగు పాపము, నిక్షేపమును హరించుట వలన కలుగు పాపము, కన్యాత్వమును భంగపరచిన పాపము, విశ్వాస ఘాతకునికి కలుగు పాపము, దూడచనిపోయిన పశువునకు పాలుపితుకువాని పాపము, బ్రాహ్మణునకు ఇచ్చెదనని ప్రతినచేసి ఈయని వాని పాపము, మణికూట పాపము, తులాకోటి పాపము, కన్యానృతము వలన కలుగు పాపము, గో అనృతము వలన కలుగు పాపము ఏకాదశీ భోజనము వలన కలుగును. కావున ఇవి అన్నియూ తెలిసిన నేను ఏకాదశినాడు ఎట్లు భుజించగలను?
మోహిని పలికెను: ఓ రాజేంద్ర! ఏక భుక్తవ్రతము కలవారు. అయాచిత వ్రతము కలవారు ఉపవాసముచే ద్వాదశిని లంఘించరాదు. గర్భవతులు, గృహస్థులు, బలహీనులు, రోగగ్రస్తులు, శిశువులు, వృద్ధులు ఉపవసించరాదు అని ధర్మశాస్త్రము చెప్పుచున్నది. యజ్ఞములను ఆచరించువారు, యుద్ధము చేయువారు, పతివ్రతలు ఉపవసించరాదు. ఈ విషయమును నేను మందర పర్వతముపై ఉన్నపుడే నాకు గౌతమ మహర్షి చెప్పెను. ఇతరులు విష్ణు వాసరమున వ్రతము ఆచరించవలెను. అగ్ని పరిగ్రహమున్న ద్విజులను గృహస్థులని, ప్రజా పరిపాలనమును చేయువారిని రాజులని, ఎనిమిది నెలలు నిండిన వారిని గర్భవతులని, ఎనిమిది సంవత్సరముల వరకు శిశువులని, ఎక్కువ లంఘణమును చేయు వారు క్షీణగాత్రులని, ముడుతలు పడిన శరీరము కలవారు వృద్ధులని, వివాహాది మంగళ కర్మలలో, మహోత్సవములలో, ప్రవృత్తుల నుండి నివృత్తులగువారు యజ్ఞోద్యుతులని, కాయిక వాచిక మానసికములతో భర్త హితమును కోరుచు యోని సంరక్షణపరురాలు పతివ్రత యని శాస్త్రకోవిదులు చెప్పియున్నారు. వీరందరు ఉపవసించరాదని ధర్మ శాస్త్రము చెప్పుచున్నది. ఇవన్నియు ఎందుకు. నీవు ఏకాదశినాడు భుజించిననే నాకు నీయందు ప్రీతి నిలుచును. నీ శిరమును నీవే స్వయముగా ఖండించి ఇచ్చిననూ నాకు ప్రీతికరము కాదు. నీవు ఏకాదశినాడు భుజించినచో అబద్ధవాక్కువగు నీ శరమును నేనుతాకను. వర్ణాశ్రమాచారములన్నింటిలో సత్యమొక్కటే పూజించబడును. విశేషించి నీ వంటి రాజులకు సత్యము పాటించదగినది. సత్యముచే సూర్యుడు తపించును, చంద్రుడు ప్రకాశించును. సత్యము చేతనే భూమి నిలుచుచున్నది. జగత్తు సత్యము చేతనే ధరించబడుచున్నది. సత్యముచేతనే గాలి వీచుచున్నది. అగ్ని మండుచున్నది. ఈ స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయూ సత్యాధారముగనే నిలిచియున్నది. సత్యము వలననే సముద్రము హద్దు దాటుట లేదు. సత్యము వలననే వింధ్య పర్వతము పెరుగుట లేదు. యువతి గర్భధారణ చేయుట లేదు (వివాహము కాకుండా) కాలము నియమమును అతిక్రమించుట లేదు. సత్యమున నిలిచియే వృక్షములు పుష్పములను, ఫలములను చూపుచున్నవి. మానవులకు దివ్యాది భోగములన్నియూ సత్యమును ఆధారము చేసుకొనియే లభించుచున్నవి. వేయి అశ్వమేధ యాగములకంటే సత్యమే విశిష్టము. అసత్య వాక్యము వలన మద్యపానము వలన కలుగు పాపము సంభవించును. (II/23)