మోహినికి బ్రహ్మ చెప్పిన మాటలు

యమధర్మరాజు పలికెను: శ్రీహరి పాదపద్మములకు నమస్కరించుటచే నేను కూడా హితమును పొందితిని. కావున నేను మరల యోగాంతమును పొందజాలను. రుక్మాంగదుడు భూమిని పాలించు చున్నాడు. శ్రీహరివాసరమున ఒక్క రుక్మాంగదుని ధైర్యచ్యుతుని చేయగలిగినచో నేను నీ కింకరుడను అగుదును. రుక్మాంగదుడు ఒక్కడే నాకు శత్రువు. అతనే నా రాతను తుడిచి వేసెను. కావున శ్రీహరి వాసరమున ఒక్క రుక్మాంగద మహారాజును భుజింపచేసిన గయాపిండ ప్రదానము చేసిన వానివలె కృతకృత్యుడను అగుదును. ఇప్పటినుండి శ్రీహరిని స్మరించుకొని, స్తుతించువారిని, ఉపవసించువారిని నేను శాసించను. వ్యాజముతో అయినను హరినామమును ఉచ్చరించువారు పునర్జన్మను పొందరు. నారాతలో చోటు చేసుకోరు. దేవతలచేత కూడా నమస్కరించబడుదురు. సౌరి పలికెను: కుశలాంఛనుడగు బ్రహ్మ యమధర్మరాజు ప్రార్థనను అలకించి అతని కార్యమును ఎట్లు చేయవలెనని ఒక క్షణము ఆలోచించి, సర్వభూతసహితుడై సర్వభూత భయంకరమగు రూపమును ధరించెను. ఆ రూపమున లోకమును మోహింపచేయగల ఒక యువతిని సృజించెను. ఆ యువతి సకల యువతులలో శ్రేష్ఠురాలుగా బ్రహ్మమానసపుత్రిగా ప్రకాశించెను. ఆ మోహిని సర్వాలంకార భూషితయై బ్రహ్మముందు నిలిచెను. రూపసంపదతో వెలుగొందుచున్న మోహినినిచూచి బ్రహ్మ పాపభీతిచే కనులను మూసుకొని మోహినిని చూచి కామమోహితులైన తనవారితో ఇట్లు పలికెను. కోరికగల మనసుతోకాని, కోరికకల కనులతో కాని తల్లిని లేదా పుత్రికను ఆలోచించిననూ, చూచిననూ అట్లే కోడలిని, అన్న భార్యను, గురు భార్యను, రాజు భార్యను చింతిచిననూ చూచిననూ చండాల స్త్రీ గురించి చింతించిననూ చూచిననూ అతను ఘోరమగు నరకమును పొందును. ఈ స్త్రీలను చూచి చలించువాడు జన్మ మొత్తము చేయు లేదా చేసిన పుణ్యము వ్యర్థమగును. అట్టి ప్రసంగమున దశసహస్ర జన్మ సముపార్జిత పుణ్యము క్షీణించును. పుణ్య క్షయముతో పాపియై పాషాణముగానో ఎలుకగానో పుట్టును. కావున ఈ స్త్రీలను కోరికతో చింతించరాదు. చూడరాదు. పన్నెండు సంవత్సరముల వయసుకలవారు తల్లి పాదములను కూడా స్పృశించరాదు. యౌవనము వచ్చిన పుత్రులకు తల్లికూడా అభ్యంగనము (తలంటి పోయుట) చేయరాదు. అరువది సంవత్స రములు దాటిన స్త్రీని అభ్యంగమునకు వినియోగించవలెను. వృద్ధుడైననూ యువకుడైననూ స్త్రీ పాదధావనము చేయరాదు. అట్లు చేసినచో వారిద్దరూ నరకమును పొందెదరు. మామకు తన శరీరమును సవివరముగాచూపిన కోడలు కాళ్ళు చేతులు లేనిదై క్రిములచే భక్షింపబడును. కోడలిచే కాళ్ళు కడిగించు కొనువాడు, స్నానమాడువాడు, అభ్యంగనమును చేయించుకొనువాడు కూడా క్రిమిభక్తి అగును. ఒక కల్పకాలము సూచీముఖములుగల కృష్ణవక్త్రములచే భక్షింపబడును. కావున కూతురును కోడలును కోరికతో చూడరాదు. కోరికతో ఆలోచించిన ఆ క్షణముననే పతితుడగును. ఇట్లు పలికి తనలో తాను చాలా సూక్ష్మ దృష్టితో ఆలోచించసాగెను. మన కనులకు గుండ్రముగా ఉన్నతముగా సుందరముగా కనపడు ఈ ముఖము చర్మముతో మాంసముతో కప్పబడిన అస్థి పంజరము మాత్రమే. స్త్రీలలోనున్న ప్రకాశవంతములైన కనులు వసామేద (కొవ్వు, చీము) భూయి ష్ఠములు, స్త్రీలకు ఉన్నతములుగా పీనములుగా కనపడు స్తనములు మాంసపు ముద్దలు. కడుపుమీద నుండు ముడతలు నిమ్న స్థితిని చూపును. పిరుదుల రూపములో ఉన్నవి మాంసము అధికముగా ఉన్న భాగములే. మూడులోకములు మోహముచెందు గుహ్యము వాస్తవముగా చూచిన మూత్ర ద్వారమే కదా? ఇక పాయ్వింద్రియము అపాన వాయు సంమిశ్రితము. రెండుగా కనబడు ఈ పిక్కలు ఒక కాష్ఠమును రెండుగా చీల్చినపుడు ఏర్పడు రెండు భాగములవంటివి. రక్తము, ఎముకల మాంసములతో ఏర్పడిన శరీరము సుందరము ఎట్లగును?   మాంసము, కొవ్వు, చీముతో నిండిన శరీరమున సారము ఏమి ఉండును?   క్రిములు, మలము, మూత్రములతో పుష్టి చెందిన శరీరము నందు ఎవనికి ప్రీతికలుగును?   ఇట్లు బ్రహ్మ జ్ఞాన చక్షువుతో పలు విధములుగా ఆలోచించి ధైర్య మును కూర్చుకొని గజగామినియగు మోహినితో ఇట్లు పలికెను. ఓ వరవర్ణినీ!  నీవు నా మనసుచే సృష్టించబడినదానవు. నేను సంకల్పించిన విధముగా నీవు మనసునకు ఉన్మాదమును కలిగింతువు. అపుడు మోహిని బ్రహ్మకు నమస్కరించి ఇట్లు పలికెను. ఓ ప్రభూ? నా రూపముతో మోహింపబడిన ఈ స్థావరజంగ మాత్మకమగు ప్రపంచము అంతయూ మూర్ఛనందినది. ఒక యోగి మాత్రమే స్వచ్ఛముగా ఉండును. ఓ పద్మజా?   ఈ మూడు లోకములలో నన్ను చూచి వికారము చెందని మగవాడు నీనుండి ఎవరూలేరు. శుభమును కోరువారెవ్వరూ ఆత్మస్తుతిని చేసుకోరాదు. పరిశుద్ధుడగు మానవుడు కూడా ఆత్మస్తుతిచే నరకమును పొందును. అయిననూ కార్యమును అనుసరించి ఆత్మస్తుతి చేయవలసి వచ్చినది. నేను ఎవరినో ఒకరిని చలింపచేయుటకే మీచేత సృజించబడితిని. అతని వివరములను తెలిపినచో చలింపచేతును. నన్ను చూసిన పర్వతము కూడా మూర్చను పొందును. ఇక చైతన్యము కలిగి ఊపిరిని పీల్చు నరుని విషయము చెప్పవలెనా?   పురాణములలో స్త్రీ చూపులను పురుషులకు ఉన్మాదమును కలిగించునవి, కష్టసాధ్య వ్రతములను భంగపరుచునవి అని వర్ణించబడి ఉన్నవి. కనుబొమలను ధనువున సంధించబడి కర్ణమార్గమును అనుసరించి నల్లని కనురెప్పలుగల విలాసవతుల చూపులను తూపులు ధైర్యమును దొంగలించుచు పురుషుల హృదయమును తాకునంతవరకే పురుషులు సన్మార్గమును అనుసరించగలరు. ఇంద్రియములను అరికట్టగలరు. సిగ్గుపడగలరు. విషయమును అనుసరించగలరు. మరియు స్త్రీ ముఖమును చంద్రు నితో పోల్చు మూఢ మనస్సుకల కుకవిత్వము వ్యర్థము. కనుబొమల ముడిపాటు, రెప్పలతడబాటు, దరహాస విస్మయములతో ఉండు చూపులు, చిరుకోపము, మెప్పుకోలును సూచించు చిరునవ్వులుగల చూపులు చంద్రునిలో కలవా? ఎంత వివేకము కలవాడైనను మద్యమును పానము చేసినచో మోహమును కలిగించును. కాని యువతి చూడబడిననూ తలచబడిననూ మోహింపచేయును. కావున పురుషులను మోహింపచేయుటకు మీరు నన్ను సృష్టించితిరి. ఎవరిని మోహింప చేయ వలెనో తెలుపుము. అజ్ఞాపిం చుము. నేను మూడు లోకములను నీ ఆజ్ఞచే మోహింపచేయగలను.

బ్రహ్మ పలికెను: ఓ నాగనాసోరు!  సౌందర్యవతి!  మత్త మాతంగ గామినీ!  నీవు నిజమును పలి కితివి. నీవు నా మనసును కూడా కలత పరిచితివి. కాని నేను జ్ఞానాంకుశముచే నిగ్రహమును కూర్చుకుంటిని. నీకు ఈ మూడు జగములలో అసాధ్యము లేదు. కావున నీవు లోకుల మనసులను ఎట్లు హరించజాలవు?   నీ రూపము మోహమును కలిగించును అనునది ముమ్మాటికి నిజము. దేవతలతో పాటు ఈ జగత్తంతయూ చేష్టాశూన్యమాయెను. నేను సృష్టించిన కార్యమును సాధిం చుము. భూమండలమున విదిశానగరమున రుక్మాంగ దుడను మహారాజు కలడు. అతనికి రూప మున నీసాటియగు సంధ్యావళి అను భార్య కలదు. వారికి ధర్మాంగదుడను పుత్రుడు కలడు. తండ్రికి మిక్కిలి ప్రీతిపాత్రుడు. ఒక లక్షయేనుగుల బలము కలవాడు. ప్రతాపమున సూర్యుని వంటివాడు. క్షమలో భూమి వంటివాడు. గాంభీర్యమున సముద్రమునకు సాటి. తేజస్సులో అగ్ని వంటివాడు. క్రోధమున యమునకు సాటి. త్యాగమున బలిచక్రవర్తి వంటివాడు. గమనమున వాయుసముడు. సౌమ్యతలో చంద్రునకు సాటి. సౌందర్యమున మన్మథునితో సరితూగును. నీతి యందు గురు శుక్రసముడు. రుక్మాంగద మహారాజు ఒక జంబూద్వీపమునే అనుభవించెను. కాని ధర్మాంగదుడు సప్త ద్వీపములను తన వశమున ఉంచుకొనెను. తండ్రిమీది గౌరవముతో స్త్రీ సుఖమును ఎరుగడు. తమకు తాముగా వలచి వచ్చిన వేలది కొలది కన్యలను విడిచెను. అతనెప్పుడూ తండ్రిమాటను జవదాటడు. ధర్మాంగదుడు మూడు వందల మంది తల్లులను కన్నతల్లివలె చూచును. ఇంతటి ఉత్తమ పుత్రుడుకల, ధర్మ ప్రధానుడగు రుక్మాంగద మహారాజు వద్దకు మందరపర్వతమునకు వెళ్ళుము. రుక్మాంగద మహారాజు వేగముగల గుఱ్ఱముచే అచటికి తీసుకొని రాబడును. నీ మధుర గానమునకు మోహమును చెంది అశ్వమును విడిచి నీతో కలియును. నీవు అపుడు రాజుతో కలిసి ఇట్లు చెప్పవలయును. ఓ రాజా?   నేను నీకు భార్యను అగుదును. కాని నేనేది చెప్పిననూ నీవు కాదనరాదు అని నీ రూపమునకు మోహించిన రాజు అంగీకరించును. అపుడు రాజు దక్షిణ కరముతో శపథమును గొని వివాహమాడుము. కొన్ని దినములు గడిచిన తరువాత నీ సంగమమున మైమరిచిన రాజుతో నవ్వుచూ అతనిచ్చిన మాటను గుర్తుచేయుము. నా మాటను పాటించెదనని చేసిన శపధమును పాటింపుము. ఇపుడు సమయ మాసన్నమైనది అని తెలుపుము. అపుడు రుక్మాంగద మహారాజు నీ మీది మోహముతో సత్యము మీది గౌరవముతో తప్పక పాటించెదను అనును. సందేహము వలదు. నీకు ఏమి ఈయవలెనో చెప్పుము అనును. అపుడు నీవు రుక్మాంగద మహారాజుతో హరివాసరమున నీవు ఉపవసించరాదు. ఆ ఉపవాసము మన సమాగమమునకు అంతరాయమును కలిగించుచున్నది. అనురాగముగల, యౌవనవతియగు భార్యను సేవించనివాడు, లేదా పర్వసమయము కొఱకు ఎదురుచూచువాడు దురాచారపరుడు తప్పక నరకమును పొందును. నీవు చేయు ఉపవాసము వలన మూడు రాత్రులు వియోగమును అనుభవించుచున్నాను. నీవు లేనిదే నేనొక నిమిషముకూడా నిలువ జాలను. శ్రాద్ధకాలము సమీపించిననూ బ్రాహ్మణులముందు కోరినచో దేనిని విచారించక అపుడే ఆమెను అనుభవించవలయునని శాస్త్రములు ఘోషించుచున్నవి. అనుము. ఇట్లు చెప్పిననూ రాజు నీమాటను అంగీకరించనిచో అపుడు ఈ మాటలను చెప్పుము. ఓరాజా!  హరివాసరమున ఉపవాసమును వీడజాలనిచో నీ పుత్రుడగు ధర్మాంగదుని శిరస్సును నీవే స్వయముగా నీ చేతులతో ఖడ్గముచే ఖండించి నా ఒడిలో వేయుము. ఇట్లు నా ప్రియమును ఆచరించజాలనిచో నీవు ధర్మభ్రష్టుడవై నరకమును పొందెదవు. ఈ విషయమున సంశయమేలేదు. అని నీవు పలికిన ఈ మాటలను వినిన రుక్మాంగద మహారాజు ప్రాణతుల్యుడగు పుత్రుని హింసించ జాలడు. కావున బ్రాహ్మణుల ఆజ్ఞనుపొంది హరివాసరమున భుజించును. అపుడు ప్రజలు ఎప్పటివలె యమలోకమునకు వెళ్ళెదరు. చిత్రగుప్తుని లిపిని తుడుచు వారుండరు. నీవు నీపనిని చక్కగా నెరవేర్చినదానవు కాగలవు. అట్లుకాక రుక్మాంగద మహారాజు సత్యబద్దుడై తనయుని శిరమును ఖండించినచో సకల దేవతలచే పూజించబడు పద్మనాభుని లోకమును చేరును. (II/7)