నారద మహా పురాణము
గౌతమాశ్రమ మాహాత్మ్యము
మోహిని ఇట్లు పలికెను: వసూ! పాపప్రణాశనమగు పుష్కర మాహాత్మ్యమును వింటిని. ఇపుడు గౌతమా శ్రమ మాహాత్మ్యమును తెలుపుము.
వసువు పలికెను: ఓ మోహినీ దేవీ! గౌతమాశ్రమ మాహాత్మ్యమును చెప్పెదను వినుము. ఇచటికి వెళ్ళినవాడు మరల యాతనలను పొందడు. గౌతమాశ్రమము పరమ పావనము. దేవర్షి గణ సేవితము. సర్వపాప ప్రశమనము. సర్వోపద్రవ శాంతికరము. ఈ ఆశ్రమమున భక్తి భావముతో పన్నెండు సంవత్సరములు సేవించినచో మరల దుఃఖము కలగని శివలోకమును చేరును. ఇచటనే మాయాదేవీ సుతుడు ఉగ్రతపమును ఆచరించెను. ఇచటనే సర్వపాతకనాశినియగు గోదావరి గంగ కలదు. అఋషి తపమాచరించుచుండగా పన్నెండు సంవత్సరములు వర్షము కురియలేదు. ఇట్లు ఘోరమగు క్షామము సర్వ ప్రాణి భయంకర మాయెను. భయంకరమగు దుర్భిక్షమున సకలమునీశ్వరులు నానాదేశముల నుండి గౌతమ ఆశ్రమమునకువచ్చి తపమును ఆచరించుచున్న గౌతమునితో ఇట్లు పలికిరి. మా ప్రాణములు నిలుచుటకు మాకు భోజనము నిమ్ము అని. ఇట్లు పలుకగా గౌతమ మహర్షి దయకలవాడై తనను నమ్మిన వారిని తపోబలముతో ఇట్లు పలికెను.
గౌతమ మహర్షి పలికెను: మీరుఅందరు నా ఆశ్రమ సమీపమున నివసించుడు. కరువు ఉన్నంత వరకు మీకు భోజనము నిత్తును. ఇట్లు మునులందరిని ఓదార్చి గౌతమ మహర్షి తపో బలముచే ప్రసన్నమగు మనసుతో సర్వార్ధసాధనియగు గంగను ధ్యానించెను. తలచినంతనే గంగాదేవి అచట భూమినుండి ఉద్భవించెను. భూమిని తడిపిన గంగను చూచి గౌతమ మహర్షి ప్రాతః కాలమున బీజములునాటి మాధ్యాహ్నమున కోసిన ఆ వరియన్నముతో ఋషులను భుజింపచేసెను. ఆ యన్నమును భుజించి మునులు తృప్తిని పొందిరి. ఆ గౌతమాశ్రమముననే నివసించిరి. ఇట్లు ప్రతి దినము పండిన వరి ధాన్యముచే భక్తి భావముచే వారికి ఆతిధ్యము నిచ్చెను. ఇట్లు గౌతమ మహర్షి వారిని భుజింప చేయుచుండగా పన్నెండు సంవత్సరముల తరువాత దుర్భిక్షము తొలగి పోయెను. తరువాత ఆ ఋషులు అందరూ సుభిక్షము రాగానే గౌతమ మహర్షికి చెప్పి తమ తమ ప్రదేశములకు వెళ్ళిరి.
ఆ గౌతమ మహర్షి ఇంతటి ప్రభావము కలవాడు. చాలా కాలము ఇంద్రియ నిగ్రహముతో తపమును ఆచరించెను. తపస్సునకు సంతోషించిన శంకరుడు గణములతో ప్రత్యక్షమై వరమును కోరుమని పలికెను. అంతట గౌతమ మహర్షి దేవదేవుడగు ఉమాపతినిచూచి భూమి మీదపడి నమస్కరించెను. వెంటనే లేచి చేతులు జోడించి నాకు నిత్యము నీ పాదభక్తిని ప్రసాదించుము అని పలికెను. నా ఆశ్రమ సమీపమున ఈ పర్వతము మీద ఉన్న నిన్ను ఎప్పుడూ చూచుచుండ వలెను. ఇదియే నాకు వరము. ఇట్లు పలుకగా భక్త వాంఛితప్రదుడగు పార్వతీనాధుడు అచట నిలిచి గౌతముని సంతోషింపచేసెను. అప్పటి నుండి ఆ పర్వతమునకు త్యంబకాచలమని పేరు కలిగెను. గోదావరి గంగనుచేరి భక్తితో స్నానమాడు వారు సంసార సాగరము నుండి విముక్తు లగుదురు. గోదావరీ జలమున స్నానమాడి పర్వతమున ఉన్న శంకరుని ఉపచారములచే పూజించు వారు సాక్షాత్తు మహేశ్వరులు అగుదురు. ఇట్లు నేను త్ర్యంబక మాహాత్మ్యమును సంక్షేపముగా తెలిపితిని. విస్తరముగా మీ తండ్రియగు బ్రహ్మకూడా వివరించజాలడు. అచట గోదావరి కనుపడు వరము పవిత్రములగు ఆశ్రమములు అనేకములు కలవు. ఆ ఆశ్రమములలో స్నానమాడి పితృ దేవతలకు తర్పణము గావించిన వారు వాంఛితార్థములను తప్పక పొందెదరు.
పవిత్రమగు గోదావరీ నది కొన్నిచోట్ల ప్రకాశముగా కొన్ని చోట్ల గుప్తముగా ఈ భూమిపై ప్రవహించుచు భూమిని తడిపెను. గోదావరి ప్రకాశముగా ఉన్న ప్రాంతము పరమపావనము. అచట స్నాన మాత్రముననే సర్వపాపహరము. అచట నుండి పంచవటిని చేరి గోదావరి ప్రకాశ రూపమును పొందెను. పంచవటి లోని గోదావరియందు స్నానమాడు వారు సకలాభీష్టములను పొందును. త్రేతాయుగమున శ్రీరామ చంద్రుడు భార్యతో అనుజునితో పంచవటిని చేరి అచటి గోదావరిని పావనతమమును చేసెను. ఇట్లునీకు గౌతమాశ్రమ మాహాత్మ్యము అంతయూ వివరిం చితిని. ఈ మాహాత్మ్యము చదువువారికి వినువారికి సకలాభీష్టములను ప్రసాదించును. (II/72)