నారద మహా పురాణము
మోక్షధర్మ నిరూపణము
సనందన మహర్షి పలికెను: మహామునియగు శుకుడు శాస్త్రవిధానముతో ఆత్మను పాదముల నుండి శరీరమంతట అన్ని అవయవములలో క్రమముగా క్రమము తెలిసిన వాడు కావున ధరించెను. తరువాత ప్రాఙ్ముఖుడై విజ్ఞాని సూర్యునిచే శోభించుచున్నటుల హస్త పాదములను సవరించుకొని వినయశీలివలె ఆసీనుడాయెను. అచట పోని సమూహముకాని ధ్వనికాని చూపుకాని కనిపించుట లేదు. శుకమహర్షి పరంధామమున ఆత్మను చేర్చుటకు ప్రయత్నించు ప్రదేశమున ఇతరములేవీ లేవు. సర్వసంగవినిర్ముక్తుడై ఆత్మ సాక్షాత్కారమును పొందెను. శుకమహర్షి సూర్యుని చూచి పెద్దగా నవ్వెను. అంతలోనే మోక్ష మార్గమును పొందుటకు యోగము అవలంబించి, మహాయోగీశ్వరుడై ఆకాశము నతిక్రమించెను. వ్యాసపుత్రుడు నిశ్చయబుద్ధితో అంతరిక్షచరుడాయెను. గరుడునివలె ప్రకాశించుచు ఉదయించుచున్న శుకమహర్షిని అన్ని ప్రాణులు వాయువేగ మనోవేగములు కలవానిగా దర్శించిరి. యథావిధిగా యథా శక్తి పూజించిరి. దేవతలు పుష్ప వర్షమును కురిపించిరి. శుకమహర్షిని చూచిన గంధర్వులు అప్సరోగణములు, ఋషులు సిద్ధులు ఎవరు ఇతడు కొత్తగా సిద్ధిని పొందినవాడని ఆశ్చర్యచకితులైరి. అపుడు శుకమహర్షి వారికి తన పేరును చెప్పెను. అట్లే సంతోషముచే మహాతేజోవంతులగు ఆ ఋషులతో ఇట్లు పలికెను. మా తండ్రి! శుకా! అని పిలుచుచు నా వెంట వచ్చినచో మీరు సావధానులై వారికి సమాధానమును చెప్పవలయును. వారు అట్లే అని సమాధానము చెప్పగా శుకమహర్షి చతుర్విధ లోకములను, అష్టవిధమగు తమస్సును, పంచవిధమగు రజస్సును విడిచెను. తరువాత జ్ఞానియగు శుకమహర్షి సత్త్వమును కూడా వీడెను. అది అత్యద్భుతమాయెను. తరువాత నిర్గుణము లింగరహితము అయిన ఆ పదమున, హిమవత్పర్వతము మేరుపర్వతముల వంటి ఆ పర్వతశృంగమున, శ్వేత పీత వర్ణ సమ్మిశ్రమున, స్వర్ణరజతమయము శుభకరము అయిన నిలువుగా, అడ్డముగా శతయోజన విస్తారముగా ఉన్న దానిపై నిర్విశంకమనస్కుడై నిలిచెను. శుకమహర్షి నిలువగానే మిక్కిలి సంక్లిష్టముగా ఉన్న ఆ శృంగము రెండుగా చీలి కనపడెను. ఆ దృశ్యము మిగుల ఆశ్చర్యమును కొలిపెను. అంతట ఆ పర్వత శిఖర భాగముల నుండి వేగముగా బయలు వెడలెను. ఆ పర్వతము శుకమహర్షి గమనమును అడ్డగించలేక పోయెను. అపుడు దివ్యమగు ఆకాశ గంగను ఉపరిభాగమున వెళ్ళుచు పూచిన చెట్లుగల వనమును శుకమహర్షి చూచెను. ఆ నదిలో క్రీడించుచు అప్సరో గణములు వివస్త్రలుగా స్నానము చేయుచు సాకారులై నిరాకారుని చూడసాగిరి. అట్లు శుకమహర్షి వ్యోమగతిన సాగుచుండుట తెలిసి తండ్రియగు వ్యాస మహర్షి అతని యందలి ప్రేమచే ఉత్తమగతిని స్వీకరించి శుకుని వెంట సాగెను. శుక్రమహర్షి మాత్రము వాయువునకు పైభాగమున గమనమును అవలంబించి తన ప్రభావమును చూపుచు సర్వభూతాత్మకుడాయెను.
మహాతపస్కుడైన వ్యాసమహర్షి యోగగతిని అవలంబించి నిమేషమాత్రమున శుకాభిపతనమును గూర్చివెళ్ళెను. పర్వతమును రెండుగా చీల్చి శుకుడు వెళ్ళుటను చూచెను. మునులు సిద్ధులు శుకుని గతిని వ్యాసమహర్షికి తెలిపిరి. అపుడు వ్యాసమహర్షి శుకా! అని పెద్దగా పిలిచెను. ఆ పిలుపు మూడు లోకములలో ప్రతిధ్వనించెను. శుకమహర్షి సర్వాత్ముడు సర్వతోముఖుడు సర్వగతి అయి తండ్రి పిలుపును విని ధర్మాత్ముడు కావున భోః అని బదులు పలికెను. అంతట భోః అను ఒక అక్షరముగల మాట స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతట ప్రతిధ్వనించెను. అప్పటి నుండి ఇప్పటివరకు పర్వత గుహలలో పలికిన మాటలు శుకుని గూర్చి ప్రతిధ్వనిగా వినిపించుచున్నవి. ఇట్లు శుకుడు సర్వభూతాంతర్గతునిగా తన ప్రభావమును చూపి సత్త్యాదిగుణములను వదిలి పరమ పదమును చేరెను. మిక్కిలి తేజోవంతుడగు పుత్రుని ప్రభావమును చూచి పుత్రుని కొరకు పరితపించుచున్న వ్యాసమహర్షిని భగవంతుడగు రుద్రుడు ఓదార్చెను. ఓ మహామునీ! నీవు పుత్రుని గూర్చి ఏల పరితపించుచున్నావు? నీ పుత్రుడు బ్రహ్మరూపుడై నీవద్దకు వచ్చుటను చూడలేకున్నావా? అని ఓదార్చగా, వ్యాసమహర్షి తన ఆశ్రమమునకు వెడలెను. శుకమహర్షి బ్రహ్మ స్వరూపుడై సర్వ లోకములలో సంచరించెను. తరువాత కొంత కాలమునకు వ్యాసమహర్షి నరనారాయణులను చూచుటకు బదరికాశ్రమమునకు వెళ్ళెను. బదరికాశ్రమమున గొప్ప తపమును చేయుచున్న నరనారాయణులను చూచిన వ్యాసమహర్షి శుకమహర్షిని తలచుచు తాను కూడా తపస్సును చేయసాగెను. వ్యాసమహర్షి బదరికాశ్రమమున ఉన్నసమయమున పరమయోగజ్ఞుడగు శుకయోగీంద్రుడు నీవు మొదట వెళ్ళిన శ్వేత ద్వీపమునకు వెళ్ళెను. ఆ శ్వేత ద్వీపమున దేవదేవుడు, శ్రుతులచే అన్వేషించబడు జనార్దనుని చూచెను. వెంటనే శుక యోగీంద్రుడు శ్రీహరిని స్తుతించెను. అపుడు శ్రీహరి శుకయోగిని గూర్చి ఇట్లు పలికెను.
భగవంతుడు శ్రీహరి పలికెను: ఓ యోగీంద్రుడా! దేవతలందరికి కనపడకుండా రహస్యముగా నున్న నన్ను నీవు చూడగలిగితివి. నీవు సనత్కుమారుడు ఉపదేశించిన యోగముచే సిద్ధిని పొందగలిగితివి. ఈ యోగముచే నీవు నీ ఇచ్ఛానుకూలముగా వాయుమార్గమున అన్ని లోకములను చూడుము” అని ఇట్లు వాసుదేవుడు పలుకగా శుకమహర్షి నసమ్కరించి సర్వ లోకములచే నమస్కరించబడు వైకుంఠమునకు వెళ్ళెను. ఆ వైకుంఠ లోకము విమానముగల దేవతలచే కూడియున్నది. విరజానదీ పరివేష్ఠితము. వైకుంఠ లోకపు ప్రకాశముతోనే ఇతర లోకములు ప్రకాశించుచుండును. ఆ వైకుంఠమున పగడపు మెట్లు బంగారముతో రత్నములచే పొదగబడియున్నవి. అచటి కొలనులు కలువలచే దేవతా స్త్రీల క్రీడలతో కూడియున్నవి. దివ్యములైన హంసలు కలది. స్వచ్ఛమైన జలములు కలవి. నానాభరణ భూషితులు చతుర్హస్తులు విష్వక్సేనానుచరులగు కుముదాది ద్వారపాలకులు శుక మహర్షిని వారించజాలకపోయిరి. శుకమహర్షి అభ్యంతరమున ప్రవేశించి అచట చతుర్భుజుడు, శాంతమూర్తి, ప్రసన్నవదనుడు, పీతాంబరధారి, అకారమును ధరించిన శంఖ చక్ర గదా పద్మములచే ఉపాసించబడువాడు, లక్ష్మీదేవిచే కౌస్తుభమణిచే ప్రకాశించు వక్షస్థలము కలవాడు కటిసూత్ర, యజ్ఞోపవీత, కటకాంగదములచే విభూషితుడు, కిరీట వలయాదులచే విరాజిల్లువాడు, మణి నూపురాది భూషణములచే సుశోభితుడు, రాత్రింబవళ్ళు సిద్ధులచే సేవించబడు దేవదేవుడగు శ్రీమన్నారాయణుని దర్శించెను. అట్లు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తిభావముచే స్తోత్రము చేసెను.
శుకమహర్షి పలికెను: “సర్వలోక సాక్షివగు వాసుదేవునకు నమస్కారము. జగత్తునకు కారణ స్వరూపము, పరిపూర్ణుడు, నిభృతాత్ముడయిన నీకు నమస్కారము. వాసుకిపై నివసించు వానికి శ్వేతద్వీపవాసి యగు శ్రీహరికి నమస్కారము. హంసరూపధారికి, మత్స్యరూపధారికి వరాహ రూపధారికి నమస్కారము, నృసింహరూపునకు, ధ్రువునిచే పూజించబడినవానికి సాంఖ్య యోగీశ్వరునకు నమస్కారము. పృథుస్వరూపునకు కూర్మరూపధారికి పరమానంద స్వరూపునకు నమస్కా రము. పొందశక్యముకానివానికి, జగత్తును ధరించువానికి, విధాతృ స్వరూపునకు, జగదంతమును చేయువానికి నమస్కారము. పరశురామస్వరూపునకు, రఘురామస్వరూపునకు, బలరామ స్వరూపునకు నమస్కారము. కృష్ణ రూపునకు, వేదకర్తకు, బుద్ధరూపునకు, కల్కి రూపునకు నమస్కారము. వాసుదేవ ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ నామములతో చతుర్వ్యూహ రూపునకు వేద్యునకు, ధ్యానగమ్యునకు, పరమాత్మకు నమస్కారము. నరనారాయణనామునకు, శిపివిష్ట స్వరూపు నకు, విష్ణువునకు, సత్యనివాసమునకు విధాతకు, సుపర్ణునకు, స్వయంప్రకాశకునకు నమస్కారము. ఋభునామధారికి, సువ్రతాఖ్యునకు, సుధామునకు, జయింపశక్యముకానివానికి నమస్కారము. విశ్వరూపునకు, విశ్వభూతునకు సృష్టి స్థితి లయకారకునకు, యజ్ఞ స్వరూపునకు యజ్ఞ భోక్తకు, స్థవిష్ఠునకు, అణు స్వరూపునకు, అర్థి రూపునకు నమస్కారము. సూర్యేంద్ర నేత్రునకు ఓజో సహ బల స్వరూపునకు, పూజ్యునకు, సర్వసాక్షికి, జన్మరహితునకు బహు శీర్షములు, బహుపాదములు, బహు బాహువులు కలవానికి నమస్కారము. శ్రీపతికి, శ్రీనివాసునకు, భక్తవశ్యునకు, శార్ఙధనుర్ధారికి, అష్టప్రకృతులకు అధిపతికి, అనంతశక్తికి, బ్రహ్మకు నమస్కారము. బృహదారణ్యవేద్యునకు, హృషీకేశునకు, వేధస్స్వరూపునకు, పుండరీ కాక్షునకు, క్షేత్రజ్ఞునకు, అంతటా భాసించువానికి నమస్కారము. గోవిందునకు, జగత్కర్తకు, జగన్నాధునకు, యోగికి, సత్యస్వరూపునకు, సత్య సంధులకు, వైకుంఠునకు, అచ్యుతునకు నమస్కారము. అధోక్షజునకు, ధర్మ స్వరూపునకు, వామమునకు, త్రిధాతువునకు, ఘృతార్చికి, విష్ణువునకు, అనంతునకు, కపిలునకు నమస్కారము. విరించికి, త్రికకుదునకు, ఋగ్యజుస్సామ రూపునకు, ఏక శృంగునకు, శుచిశ్రవునకు, శాస్త్ర సిద్ధునకు నమస్కారము. వృషాకపునకు, బుద్ధునకు, ప్రభువునకు, విశ్వకర్మకు, భూర్భువస్సువస్స్వరూపునకు, దైత్య సంహర్తకు నిర్గుణునకు నమస్కారము. నిరంజనునకు, నిత్యునకు, అవ్యయునకు, నాశములేని వానికి నమస్కారము. ఓ శరణాగత వత్సలా! లోకనాథా! నీకు నమస్కారము. నన్ను కాపాడుము” అని ఇట్లు శుక మహర్షిచే స్తోత్రము చేయబడిన శంఖచక్రగదాధరుడు ప్రణతవత్సలుడగు శ్రీమన్నారాయణుడు శుకమహర్షిని గూర్చి ఇట్లు పలికెను.
శ్రీమన్నారాయణుడు పలికెను: ఓ సువ్రతా! మహానుభావా! వ్యాసపుత్రా! నీవు నా రూపమును ధరించి విద్యను భక్తిని పొంది జ్ఞానరూపుడవు కమ్ము. నీవు శ్వేతద్వీపమున చూచిన నా రూపము అవతారము కొరకు ధరించినది. ఆ రూపము విశ్వంభరుడనైన నాదే. మోక్ష ధర్మమును చింతించుటచే నీవు సిద్ధుడవైతివి. ఉత్తమలోకములను వాయువు, ఆకాశము, సూర్యుడు సంచరించునట్లు నీవు సంచరించెదవు. నీవు నిత్య ముక్తస్వరూపుడవు కావున నరులచే దేవతలచే పూజించబడుచుందువు. సర్వపరాయణుడనైన నాయందు భక్తి కలుగుట దుర్లభము. భక్తి లభించిన తరువాత ఇక పొందవలసినది ఏమియూ ఉండదు. నరనారాయణ ఋషులు కల్పాంతము వరకు తపస్సు చేయుచుందురు. వారి ఆజ్ఞ వలన సువ్రతుడగు మీ తండ్రియగు వ్యాసమహర్షి భాగవతమును రచించెను. నీవు భూలోకమునకు వెళ్ళి ఆ భాగవతమును అధ్యయనము చేయుము. మీ తండ్రి ఇప్పుడు గంధ మాదన పర్వతముపై తపస్సును ఆచరించుచున్నాడు. నీ ఎడబాటుచే ఖిన్నుడై ఉన్నాడు. అతనిని సంతోషపరచుము. అతను నాకు ప్రీతిపాత్రుడు” అని ఇట్లు శ్రీమన్నారాయణుడు చెప్పగా చతుర్భుజునికి నమస్కరించి శుకమహర్షి వచ్చిన విధముగానే తిరిగి వెళ్ళి తండ్రిని సమీపించెను. తేజశ్శాలియగు వ్యాసమహర్షి తన వద్దకు వచ్చిన శుకుని చూచి సంతోషించి తపస్సును ఆపివేసెను. నర నారాయణ మహర్షులకు నమస్కరించి శుకమహర్షితో కలసి తన యాశ్రమమును చేరెను. నారాయణమహర్షి అజ్ఞచే వ్యాసమహర్షి నీ ముఖముద్వారావిని నానాఖ్యానములుగల దివ్యమగు భాగవత సంహితను నివృత్తి పరుడగు శుకునిచే చదివించెను. వ్యాసపుత్రుడగు శుకయోగీంద్రుడు ఆత్మారాముడైనను విష్ణు భక్తులకు ప్రియమగు భాగవత సంహితము ప్రతి నిత్యము అధ్యయనము చేసెను. చదువువారికి వినువారికి హరిభక్తిని పెంచెడు మోక్షధర్మములను నీకు తెలిపితిని. (2/62)