జ్ఞాననిరూపణము

సనక మహర్షి పలికెను: ఓ నారదా! చదువువారికి వినువారికి సర్వపాపములను నశింపచేయు దేవదేవుడైన శ్రీహరి మహాత్మ్యమును ఇంకనూ చెప్పెదను. శాంతులు అరిషడ్వర్గమును జయించిన వారు యోగముచే అహంకారమును త్యాగము చేసినవారు జ్ఞానరూపుడగు శ్రీహరిని జ్ఞానయజ్ఞముచే పూజింతురు. పుణ్యతీర్థస్నానములచే వ్రతదానతపోయములచే విశుద్ధులైన వారు, సర్వధాతయగు అచ్యుతుని కర్మయోగముచే పూజింతురు. లోభులు వసనశీలురు జగన్నాధుని పూజించరు. అజ్ఞులగు నరకీటకములు మూఢులై అజరామరుల వలె భావించుకొనుచుందురు. మెరుపువలె చంచలమైన సంపదచే మదించి, వృథాహంకారదూషితులై సర్వశ్రేయోవిధాయకుడగు జగన్నాధుని పూజించరు. హరిధర్మరతులు శాంతులు హరిపాదపద్మ సేవకులు లోకానుగ్రహతత్పరులు దైవవశమున ఏ కొందరో ఈ భూలోకమును పుట్టెదరు. మనోవాక్కాయములచే భక్తితో శ్రీహరిని సేవించువారు లోకములన్నిటిలో ఉత్తమలోకమగు పరమపదమును పొందెదరు. ఇచటనే ఒక పురాతనమైన ఇతిహాసమును ఉదాహరింతును. ఈ ఇతిహాసమును చదువువారికి వినువారికి సర్వపాప నాశము జరుగును. అట్టి యజ్ఞమాలిసుమాలుల చరితము చెప్పెదను. ఈ చరితమును వినినచో అశ్వమేధ యాగఫలము లభించును.

పూర్వము రైవతప్రాంతమున వేదవేదాంగ పారగుడగు ‘వేదమాలి’ అను ప్రసిద్ధుడగు బ్రాహ్మణుడుండెను. సర్వభూతములయందు దయాపరుడు హరిపూజాపరాయణుడుగా ఉండెను. పుత్రమిత్రకళత్రాది పోషణైక ధనార్జన పరుడాయెను. అమ్మకూడని వస్తువులను, రసములను అమ్మ సాగెను. చండాలాదులచే సంభాషించుట, వారినుండి దానములను స్వీకరించుట, తపస్సును వ్రతములను విక్రయించుట, ఇతరుల కొఱకు తీర్థయాత్రాగమనము మొదలగు వాటిని కళత్ర పోషణకు చేయసాగెను. కొంతకాలమునకు అతనికి ఇద్దరు పుత్రులు కవలలు కలిగిరి వారు అతి సుందరులు. యజ్ఞమాలి సుమాలి అను పేరు కలవారు. అపుడు వేదమాలి తన పుత్రులను మిక్కిలి స్నేహముతో వాత్సల్యముతో బహువిధోపాయములచే పోషించసాగెను. వేదమాలి పలు ఉపాయములచే ధనమును సంపాదించి సంపాదించిన ధనమెంత ఉన్నదో తెలియుటకు లెక్కించ సాగెను. కొన్నివేల కోట్ల నిధులు కోట్లు కోట్లుగా ఉన్న ధనమును లెక్కించి సంతోషమును ఆశ్చర్యమును పొందెను. దుర్జనుల నుండి దానమును స్వీకరించుటచే, అమ్మకూడని వాటిని అమ్ముటచే తపోవ్రతాది విక్రయములచే నేనీ ధనమును సంపాదించితిని. అయిననూ ఇప్పటికి నా ఆశ శాంతించలేదు. మేరు పర్వతప్రమాణము గల బహుసువర్ణ రాశులను కోరుచున్నది. అన్ని కష్టములు తొలగించుకొనుట చాలా కష్టము. అన్ని కోరికలు తీరినను మరల కొన్నిటిని కోరును వార్ధక్యమున శరీరము జీర్ణముకాగా, కేశములు దంతములు నేత్రములు శ్రోత్రములు జీర్ణించును. కాని ఆశ మాత్రము తారుణ్యముతో విలసిల్లు చుండును. వార్థక్యముచే నా ఇంద్రియములన్నియు మందములైనవి. బలము తగ్గినది. కాని ఆశా బలము మాత్రము పెరిగినది. ఆశ కలవాడు పండితుడైనను. విద్వాంసుడైనను కాంతుడైనను బుద్ధిమంతుడైనను కోపిష్ఠి, మూఢుడు అగును. మానవులకు ఆశభంగమును కలిగించును. జయింపశక్యము కానిది శత్రుతుల్యము. కావున శాశ్వతానందమును కోరుప్రాజ్ఞుడు ఆశను పరిత్యజించవలయును. బలమును, తేజస్సును, కీర్తిని, విద్యను, అభిమానమును, వార్థక్యమును సత్కులజాతత్వమును ఆశ చాలా త్వరగా భంగపరచును. ఆశాభిభూతులైన మానవులకు కొంచెమిచ్చువాడు చండాలుడైనను, ఎంతో గొప్పవానిగా కనిపించును. ఎంత అశ్చర్యము! ఆశాభిభూతులగు మానవులు మహామోహముతో మహాగర్వముతో అవమానాదికమును దుఃఖమును పరిగణించరు. “శరీరము జీర్ణమైనది. వార్థక్యముచే బలము తగ్గినది. కావున ఇక నుండి పరలోకము కొఱకు ప్రయత్నించెదను” అని ఇట్లు నిశ్చయించుకొని ధర్మమార్గపరుడాయెను. వెంటనే ఆ ధనమునంతటిని నాలుగు భాగములుగా విభజించెను. తాను రెండు భాగములను స్వీకరించి మిగిలిని రెండు భాగములను ఇద్దరు పుత్రులకిచ్చెను. తాను సంపాదించుకొనిన పాపములను నశింపచేయగోరి చలివేంద్రములను, తటాకములను, ఉద్యానములను, చాలా దేవాలయము లను, గంగాతీరమున అన్నదానములను చేసెను. ఇట్లు హరిభక్తిచే సమస్త ధనమును దానము చేసి తపమును ఆచరించుటకు నరనారాయణాశ్రమమునకు వెళ్ళెను.

ఆ నరనారాయణస్థానమున పుష్పఫలసంచయములచే కూడిన వృక్షరాసులచే శోభితము, బహుమునిసేవితము, పరబ్రహ్మను ధ్యానించువారు, శాస్థ్రార్థ చింతనము చేయువారు, పరిచర్యాపరులు, వృద్ధులు అగు మునులతో కూడియున్నది అయిన ఆశ్రమమును చూచెను. ఆ ఆశ్రమమున శిష్యులచే పరివృతుడు, పరబ్రహ్మోపాసకుడు, తేజోరాశి అగు ‘జానంతి’ అను పేరు గల మహర్షిని చూచెను. జానంతి మహర్షిశమాది గుణయుతుడు, రాగద్వేషరహితుడు రాలిపడిన ఆకులను భుజించువాడు. అట్లున్న జానన్తి మహర్షిని చూచిన వేదమాలి నమస్కరించెను. జానంతి మహర్షి ఆగంతకుడు వేదమాలికి అతిథి మర్యాద చేసెను. నారాయణ బుద్ధిచే కందమూలఫలాదులను అర్పించి పూజించెను. ఇట్లు మహర్షిచే అతిథి మర్యాదను పొందిన వేదమాలి చేతులు జోడించి వినయముతో నమ్రుడై ఇట్లు పలికెను. ‘శమాది గుణరాశీ! మహానుభావా! నా కల్మషములన్నియూ మీ దర్శనముచే నశించినవి. ఓ పండితుడా జ్ఞానమును ప్రసాదించి నన్ను ఉద్ధరించుము.’ వేదమాలి ఇట్లు పలుకగా వాగ్మి అగు జానంతి మహర్షి చిరునవ్వుతో గుణవంతుడగు వేదమాలిని చూచి ఇట్లు పలికెను.

జానంతి మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! సాధన చేయనివారికి దుర్లభము సంసారచ్ఛేద కారణము అగు జ్ఞానమును సంగ్రహముగా చెప్పెదను వినుము. పరుడు నిత్యడు అగు శ్రీమహా విష్ణువును సేవించుము. ప్రభువగు నారాయణుని స్మరించుము. పరాపవాదమును, కొండెములు చెప్పుటను ఎప్పుడూ చేయకుము. ఎప్పుడూ పరోపకార నిరతుడవు కమ్ము. మూర్ఖ సమాగమును వదిలి హరి పూజాపరుడవు కమ్ము. కామక్రోధలోభ మోహమదమాత్సర్యములను విడిచి లోకమును ఆత్మసమముగా చూచి శాంతిని పొందుము. అసూయను పరనిందను ఎప్పుడూ చేయకుము. దంభాచారమును అహంకారమును కాఠిన్యమును విడిచిపెట్టుము. ప్రాణులయందు దయను చూపుము. సత్పురుషులను సేవించుము. అడుగువారికి నీవు చేసిన ధర్మములను తెలుపకుము. అనాచారపరులను చూచి శక్తి మేరకు ఉపేక్షించకుము. నీ కుటుంబమునకు విరోధము కాని విధముగా అతిథిపూజను సలుపుము. పత్రపుష్పఫలములతో, దూర్వాంకురములచే పల్లవములచే నిష్కామముగా జగన్నాథుడగు నారాయణుని పూజించుము. యథావిధిగా దేవర్షి పితృగణములను తృప్తిపరచుము. విధిని అనుసరించి అగ్ని పరిచర్యను చేయుము. ప్రతి నిత్యము దేవాలయమున సమ్మార్జనమును చేయుము. సావధానముచే దేవాలయమును అలుకుము. దేవాలయమున శీర్ణమైన వాటిని శిధిలమైన వాటిని సంధానము చేయుము. విష్ణ్వాలయమున మార్గమును అలంకరించుము. దీపములను వెలిగించుము. కందమూల ఫలములతో నిత్యమూ మాధవుని పూజింపుము. ప్రదక్షిణ నమస్కారములతో స్తోత్రపాఠములచే శ్రీహరిని ఆరాధించుము. శక్తి ననుసరించి ప్రతినిత్యము పురాణ శ్రవణమును పురాణ పఠనమును వేదాంత పఠనమును చేయుము. ఇట్లు చేసినచో నీకు ఉత్తమోత్తమజ్ఞానము సిద్ధించును. జ్ఞానము వలన సమస్త పాపనాశము జరుగును. ఇట్లు జానంతి మహర్షిచే బోధించబడిన వేదమాలి ఆ మార్గమును అనుసరించి కొంత జ్ఞానమును పొందెను.

వేదమాలి ఒకపుడు తనకు కలిగిన జ్ఞానలేశముచే నేను ఎవరిని! నా పని ఏమిటి? అని తనలో తానే ఆలోచించుకొనెను. నాకెట్లు జన్మ కలిగెను? నా స్వరూపము ఎట్టిది? ఇట్లు రేయింబవళ్ళు చింతాపరుడై ఏ నిశ్చయము చేయజాలక బ్రాహ్మణోత్తముడగు వేదమాలి మరల జానంతి మహర్షిని సమీపించి నమస్కరించి ఇట్లు పలికెను.

వేదమాలి పలికెను: బ్రహ్మజ్ఞానశ్రేష్ఠా! గురువర్యా! నా చిత్తము మిక్కిలి భ్రమించుచున్నది. నేనెవరిని? నా పనేమిటి? నాకు జన్మ ఎట్లు కలిగెను. తెలుపుము.

జానంతి మహర్షి పలికెను: “ఓ మహానుభావా! నీ మాటముమ్మాటికి నిజమే. మనసు భ్రమించుట నిశ్చితమే, అవిద్యానిలయమగు చిత్తము సద్భావమును ఎట్లు పొందలేదు. నాది అని చెప్పుట కూడా భ్రాంతియే అగును. ఓ పండితుడా! అహంకారము మనోధర్మము కాని ఆత్మధర్మము కాదు. అయినను నీవు నేనెవరిని అని అడిగితివి. జాత్యాది శూన్యమైన అహమునకు నేనెట్లు నామకరణము చేతును? సాటిలేని స్వభావము కలది గుణరహితము పరాత్మ రూపరహితము, అప్రమేయమైన ఆత్మకు నామకరణమెట్లు చేతును? పరంజ్యోతి స్వరూపము, పరిపూర్ణము, అవ్యయాత్మ, అవిచ్ఛిన్న స్వభావము అయిన ఆత్మక్రియను ఎట్లు చెప్పగలను? స్వప్రకాశ స్వరూపము నిత్యము, అనంతమును అయిన పరమాత్మకు జన్మను క్రియను ఎట్లు చెప్పగలను? జ్ఞానైకవేద్యము, అజరము సనాతనము, పరిపూర్ణము, పరానందము అయిన పరమాత్మకంటే ఈ జగత్తున భిన్నము మరొకటి లేదు. ‘తత్త్వమసి’ మొదలగు వాక్యములను తెలియుటే మోక్షసాధనము. జ్ఞానము కొట్టబడనప్పుడు జగత్తంతయూ బ్రహ్మమయమే యగును.” అని ఇట్లు జానింతి మహర్షి బోధించగా వేదమాలి ఆత్మలో ఆత్మస్వరూపమగు అచ్యుతుని సాక్షాత్కరించుకొని ఆనందించెను. పరబ్రహ్మ ఉపాధిరహితము స్వయంప్రకాశము, నిరంజనము, అయినది నేనే అని నిశ్చయించుకొని పరమశాంతిని పొందెను. తరువాత లోకాచారము కొఱకు వేదమాలి గురువగు జానంతి నమస్కరించి, ధ్యానపరుడు ఆయెను. చాలాకాలము గడిచిన తరువాత వేదమాలి వారణాసీ పురమునకు వెళ్ళి మోక్షమును పొందెను. ఈ అధ్యాయమును ఎవడు సావధానముగా చదివిననూ, వినిననూ, కర్మపాశవిచ్ఛేదమును పొంది పరమానందమునందగలడు. (1/35)