వ్యాకరణ నిరూపణము

సనందన మహర్షి పలికెను: “ఓ నారదా! ఇపుడు నీకు సంక్షేపముగా వ్యాకరణమును చెప్పెదను. ఈ వ్యాకరణము సిద్ధరూపప్రబంధముగా వేదమునకు ముఖముగా నిర్ణయించబడినది. సుబన్తము తిఙన్తము పదమనబడును. సువులలో ఏడు విభక్తులున్నవి. సు, ఔ, జస్ అనునవి ప్రథమావిభక్తి ప్రత్యయములు. ఈ ప్రత్యయములకు ముందున్న ప్రకృతి ప్రాతిపదికము అనబడును. ఎదుటివారిని ఉద్దేశించి మాట్లాడదలచినపుడు చేయు సంబోధనలో, స్త్రీ, పుం, నపుంసక లింగములలో కర్మ కర్త చెప్పబడినపుడు ధాతువు ప్రత్యయము కాక అర్థవంతమగు శబ్దస్వరూపము ప్రాతిపదికము అనబడును. అమ్, ఔట్, శస్ అనునవి ద్వితీయావిభక్తి ప్రత్యయములు చేయబడుదానిని కర్మ అందురు. కర్మ విషయమున ద్వితీయావిభక్తిని చెప్పుకొనవలయును. అంతరా, అంతరేణ అను శబ్దములు ప్రక్కనున్నపుడు కూడా ద్వితీయా విభక్తిని చెప్పుకొనవలయును. టా, ఖ్యాం, భిస్ అనునవి తృతీయా విభక్తి ప్రత్యయములు, కరణార్ధమున కర్త్రర్ధమున తృతీయా విభక్తిని చెప్పుకొన వలయును. దేనిచే చేయబడునో అది కరణ మనబడును. చేయునది కర్త అగును. జే, బ్యాం, భ్యస్ అనునవి చతుర్థీ విభక్తి ప్రత్యయములు. సంప్రదాన కారకమున చతుర్థీ విభక్తిని చెప్పుకొనవలయును. ఎవరి విషయమున దానము చేయవలయునను కోరిన కలుగునో వాడు, ఎవరి విషయమున, లేదా ఏ వస్తువు విషయమున రుచి ఉండునో వాడు. అది సంప్రదానము అనబడును. ఙసి, భ్యాం, భ్యస్ అనునవి పంచమీ విభక్తి ప్రత్యయములు. అపాదాన కారక వివక్షలో పంచమీ విభక్తిని చెప్పుకొన వలయును. దేని నుండి విడివడునో, దేని నుండి స్వీకరించునో, దేని నుండి తొలగిపోవునో అది అపాదానమన బడును. ఙస్, ఓస్, ఆమ్ అనునవి షష్ఠీ విభక్తి ప్రత్యయములు. స్వస్వామి భావసంబంధ మున షష్ఠీ విభక్తిని చెప్పుకొనవలయును. ఙి, ఓస్, సుప్ అనునవి సప్తమీ విభక్తి ప్రత్యయములు.

అధికరణ కారకమున సప్తమీ విభక్తిని చెప్పుకొనవలయును. ఆధారమును అధికరణము అందురు. రక్షార్థ ప్రయోగములలో, ఈప్సితమున, అనీప్సితమున (ఇష్టాఇష్టములలో) నుండు దానిని కూడా అపాదానము అందురు. పరి, అప, ఆఙ్ అను ఉపసర్గలతో సంబంధము ఉన్నపుడు పంచమీ విభక్తి వచ్చును. ఇతర ‘ఋతో, ‘అన్య’, ‘దిఙ్ముఖ’ శబ్దములతో కర్మప్రవచ నీయకములచే యోగ మున్నపుడు ద్వితీయా విభక్తి వచ్చును. లక్షణ ‘ఇత్థం’ భూతార్ధములలో ‘అభి’ అను ఉపసర్గను చెప్పవలయును. విభాగములేనపుడు ‘అను’, ‘పరి’, ‘ప్రతి’ అను ఉపసర్గలను చెప్పవలయును. అంతరార్ధమున, సహార్ధమున, హీనార్ధమున ఉప అను ఉపసర్గను చెప్పవలయును. చేష్టార్ధములో ‘గతి’ కర్మలో ద్వితీయా చతుర్థీ విభక్తులను చెప్పవలయును. ప్రాణి భిన్న వాచకములలో రెండు విభక్తులుండును. ‘మన్మ’ధాతువునకు కర్మ విషయమున, అనాదరార్ధమున కూడా ఈ రెండు విభక్తులను చెప్పవలయును. ‘నమః’, ‘స్వస్తి’, ‘స్వాహా’, ‘స్వధా’, ‘అలం’, ‘వషట్’ అను పదములతో సంబంధమున్నపుడు తాదర్ధ్యమున, భావవాచకమగు తుమున్నర్ధమున కూడా చతుర్ధీ విభక్తిని ప్రయోగించవలయును. సహ అనుపదముతో యోగమున్నపుడు కుత్సితాంగ విశేషణముగ తృతీయా విభక్తిని ప్రయోగించ వలెను. కాలార్థమున భావార్థమున, సప్తమీ విభక్తిని ప్రయోగించవలయును. ‘కాల’ భావవాచకములతో సంబంధ మున్నపుడు షష్ఠీ విభక్తిని కూడా ప్రయోగించవచ్చును. స్వామి, ఈశ్వర, అధిపతి, ‘సాక్షి’ ‘దాయాద’ ‘సూతక’ శబ్దార్ధముల విషయమున, నిర్ధారణార్థమున సప్తమీ షష్ఠీ విభక్తులను ప్రయోగించవచ్చును. హేతు శబ్ద విషయమున షష్ఠీ విభక్తిని ప్రయోగించవలయును. స్మృత్యర్ధ కర్మలో, ‘కరోతి’ ధాతువునకు యత్నార్థమును చెప్పునపుడు, హింసార్ధక శబ్దములను ప్రయోగించినపుడు, కృతి కర్మలో, కృతికర్తలో పైన చెప్పిన రెండు విభక్తులను ప్రయోగించవలయును. నిష్ఠాదులను తెలియచేయు షష్ఠీ విభక్తి కర్తృ కర్మల విషయమున ప్రయోగించరాదు. ఇట్లు సుబాది విభక్తులలో ఇవి రెండు విధములుగా ఉండును. భూ, వా మొదలగు తిఙన్తములందు పది లకార ములు ఉండును. తిప్, తప్, అంతి అనునవి ప్రథమ పురుష ప్రత్యయములు. సిప్, థన్, థ అను నవి మధ్యమ పురుష ప్రత్యయములు. మిప్, వస్, మస్ అనునవి ఉత్తమ పురుష ప్రత్యయములు. ఈ తొమ్మిది ప్రత్యయములు పరస్మై పదమున చెప్పబడినవి. ఇక ఆత్మనే పదమున త, ఆతే, అంతే అనునవి ప్రథమ పురుష ప్రత్యయములు. సే, ఆధే, ధ్వే అనునవి మధ్యమ పురుష ప్రత్యయములు, ఏ, వహే, మహే అనునవి ఉత్తమ పురుష ప్రత్యయములు. ఈ పద్దెనిమిది అకారములకు ఆదేశము లుగా వచ్చును. నామవాచక శబ్దమును ప్రయోగించునపుడు ప్రథమ పురుషను చెప్పవలయును. యుష్మఛ్ఛబ్ద ప్రయోగ సమయమున మధ్యమ పురుషను, అస్మచ్ఛబ్ద ప్రయోగమున ఉత్తమ పురుషను చెప్పవలయును. భూ, వా మొదలు వాటిని ధాతువులందురు. తరువాత సనాది ప్రత్యయాంతములు ఉండును. వర్తమాన కాలమున ‘లట్’ అను అకారమును చెప్పవలయును. అనద్యతన భూతకాల మున, ‘మా’, ‘స్మ’ అనువాటితో యోగమున్నపుడు ధాతువునకంటే పరముగా ‘లఙ్’ లకారమును చెప్పవలయును. ఆశీర్వాదార్ధములో ధాతువున కంటే పరముగా ‘లోట్’ ఆకారమును చెప్పుకొన వలయును. విద్యాద్యార్ధములలో ఆశీర్వాదార్థములో ‘లిఙ్’ లకారము ఉండును. అనద్యతన భూతమున పరోక్షార్థమున ‘లిట్’ లకారమును చెప్పుకొన వలయును. అధ్యతన భవిష్యత్కాలమున లుట్ లకారము ఉండును. అనద్యతన భవిష్యత్కాలమున ‘లృట్’ లకారము ఉండును. భూతకాలమున లుఙ్ లకార ముండును. క్రియార్ధమున ‘లృఙ్’ లకారము ఉండును. అన్నిసంధులు వచ్చి పరిపూర్ణ రూపము ఏర్పడిన దానిని సిద్ధోదాహరణముగా తెలియుము. ‘దండాగ్రం’, ‘దధీదం’, ‘మధూదకం’, ‘హోతౄకారః’ అనునవి సవర్ణదీర్ఘసంధికి సిద్ధోదాహరణములు. ‘పిత్రర్షభః’, ‘సేయం’, ‘గంగోదకం’, ‘తవల్కారః’ అనునవి గుణసంధికి ఉదాహరణములు. ఇట్లే ఆయా సంధులు ఏర్పడిన సిద్ధోదా హరణములను కొన్నింటిని చూపెదను. ‘ఋణార్ణం’, ‘శీతార్తః’, ‘సేన్ద్రః’, ‘సౌకారః’, ‘వధ్వాసనం’, ‘పిత్రర్థః’, ‘నాయకః’, ‘లవణం’, ‘త ఆద్యా’, ‘విష్ణవే’, ‘తస్మా అర్ఘః’, ‘గురా అఘః, ‘హరేఽవ’, ‘విష్ణోఽవ’, ‘శౌరీ ఏతౌ’, ‘విష్ణూ ఇమౌ’, ‘దుర్గే అమూ నో అర్జునః’ అను నాలుగు రూపములు ‘ఆ ఏవం’ అనునది కూడా ఏ సంధీరాక ప్రకృతి భావముతో నుండునని తెలియుము. ‘షడత్ర’, ‘షణ్మాతరః’, ‘వాక్ఛూరః’, ‘వాగ్ఘరిః’, ‘హరిశ్శేతే’, ‘విభుశ్చిన్త్యః’, ‘తచ్ఛేషః’, ‘యచ్ఛరః’, ‘ప్రశ్నః’, ‘హరిష్షష్ఠః’, ‘కృష్ణష్టీకతే’, ‘భవాన్ షష్ఠః’, ‘షత్సన్త’, ‘షట్తే’, ‘తల్లేపః’ ‘చక్రింశ్చిన్ధి’, ‘భవాళ్ఛారిః’, ‘భవాఞ్ఛూరి’, భవాన్ శౌరి ‘సమ్యఙ్ ఙనక్తః’, ‘అంగచ్ఛాయా’, ‘కృష్ణం వన్దే’, ‘తేజాంని’, ‘మంస్యతే’, ‘హరిశ్ఛేత్తా’, ‘అమరశ్శివః’ ‘రామ కామ్యః’, ‘కృష్ణ పూజ్యః’, ‘హరిః పూజ్యః’, ‘రామో దృష్టః’, ‘అబలా అత్ర’, ‘సుప్తా ఇష్టా’, ‘విష్ణుర్నమ్యః’, ‘ర విరయం’, ‘గీగఫలం’, ‘ప్రాతరచ్యుతః’, భక్తైర్వంద్యః వంద్యోంఽత రాత్మా, భోభో ఏషః, ఏష మరిః, ఏష శార్ఙీ, సైష రామః, ఈ రూపములందున్న సంధులను సంహితా యందురు. ఇపుడు విభక్తి ప్రయోగములకు ఉదాహరణములను చూపుచున్నారు. రామేణాభిహితం కరోమి (తృతీయా) రామం భజే (ద్వితీయా) ‘రామేణా పహృతం’ (తృతీయా, సంహిత) ‘రామాయ తుభ్యం నమః’ (చతుర్ధీ) ‘రామే రంజతే’ (సప్తమీ) ‘రామాన్ముక్తిః’ (పంచమీ) ‘రామస్య దాసోఽస్మి’ (షష్ఠీ విభక్తి) ‘హేరామ’ (సంబోధన) ఇక ఇపుడు సంధిలేని కేవల శబ్దములను కొన్నింటిని చెప్పుచున్నాను. ‘సర్వాది శబ్దములు’, ‘గోషా’, ‘సఖా’, ‘పతి’, ‘హరి’, ‘సుశ్రా’, ‘భానుః’ ‘స్వయంభూః’, ‘కర్తా’, ‘రౌ’, ‘గౌః’, ‘అనడ్వాన్’, ‘గోధుక్’, ‘లిట్’, ‘ద్వే’, ‘త్రయః’, ‘చత్వారః’, ‘రాజా’, ‘పంథాః’, ‘దండీ’, ‘బ్రహ్మహా’, ‘పంచ’, ‘అష్ట’, ‘అష్టౌ’, ‘అయం’, ‘సమ్రాట్’, ‘చిభృత్’, ‘ద్విటా’, ‘వపుః’, ‘మనః’, ‘ప్రత్యఙ్’, ‘పుమాన్’, ‘మహాన్’, ‘ధీమాన్’, ‘విద్వాన్’, ‘షట్’, ‘పిపఠీః’, ‘దోః’, ‘ఉశనా’, ‘అసౌ’ ఈ శబ్దములు పుంలింగములో ఉండును. ‘రాధా’, ‘సర్వా’, ‘గతిః’, ‘గోపీ’, ‘స్త్రీ’, ‘శ్రీః’, ‘ధేనుః’, ‘వధూః’, ‘స్వసా’, ‘గౌః’, ‘నౌః’ ‘ఉపానత్’, ‘ద్యౌః’, ‘గోః’, ‘క్షుత్’, ‘కకుత్’, ‘సంవిత్’, ‘రుక్’, ‘విట్’, ‘భాః’ అనునవి స్త్రీలింగ శబ్దములు ‘తపః’, ‘కులం’, ‘సోమపం’, ‘అక్షి, ‘గ్రామణీ’, ‘ఖలపు’, ‘కర్తృ’, ‘తను’, ‘స్వనడుత్’, ‘విమలం’, ‘ద్యు’, ‘వాః’, ‘చత్వారి’, ‘ఇదం’, ‘ఏతత్’, ‘బ్రహ్మ’, ‘దండి’, ‘అన్యత్’, ‘కించిత్’, ‘త్యదాది శబ్దములు’ ‘ఏతత్’, ‘ద్వే’, ‘చిత్’, ‘గవాక్’, ‘గవాజ్’, ‘గో’ ‘అక్’, ‘గోజ్’, ‘గోక్’, ‘తిర్యక్’, ‘యకృత్’, ‘శకృత్’, ‘దదత్’, ‘భవత్’, ‘పచత్’, ‘తుదత్’, ‘దీవ్యత్’, ‘ధనుః’ అనునవి నపుంసక లింగరూపములు. పిపఠీః పయోదః అనునవి పుం లింగములో కూడా ఉండును. గుణ ద్రవ్య క్రియాయోగముచే శబ్దములు మూడు లింగములలో ఉండునని కొందరందురు. ‘శుక్ల’ ‘కీలాలప’, ‘శుచి’, ‘గ్రామణీ’, ‘సుధీ’, ‘పటు’, ‘స్వయం భూ’, ‘కర్తా’, ‘మాతా’, ‘పితా’, ‘నా’, ‘సత్య’ ఈ శబ్దములు పుంలింగమున ఉండును. ‘మత’, ‘భ్రమర’, ‘దీర్ఘపాత్’, ‘ఘన’, ‘సోమ’, ‘గర్హ’, ‘అవి’, ‘గ్రంద’, ‘స్వర్ణ’, ‘బహు’, శబ్దములు రెండు లింగములలో నుండును. ‘సర్వ’, ‘విశ్వ’, ‘ఉభయ’, ‘ఉభ’, ‘అన్య’, ‘అంతర’, ‘ఇతర’, ‘ఉత్తర’, ‘ఉత్తమ’, ‘నేమ’, ‘సర్వార్థకమ’ ‘సమశబ్దము’, ‘ఇష’, ‘పూర్వ’, ‘ఉత్తర’, ‘దక్షిణ’ ‘ఉత్తర’, ‘అధర’, ‘అపర’, ‘చతుర’, ‘ఏతత్’, ‘యావత్’, ‘తత్’, ‘కిం’, ‘అసౌ’, ‘ద్వి’, ‘యుష్మత్’, ‘అస్మత్’, ‘ప్రథమ’, ‘చరమ’, ‘అల్ప’, ‘నోర’, ‘కతిపయ’, ‘ద్వి’, ‘త్రి’, ‘శుద్ధాది’ శబ్దములు, మూడు లింగములలో నుండును. ‘స్వ’, ‘ఇక’, ‘అభు’, ‘రోధ’, ‘పరి’, ‘విపర్యయ’ శబ్దములు అవ్యయములు.

అపత్యార్థమున తద్ధిత ప్రత్యయములు అణాదులొచ్చినపుడు, పాండవాః, శ్రైధరః గార్గ్యః, నాడాయనః, ఆత్రేయః, గాంగేయః, పైతృష్వస్రీయః, అనురూపములు ఏర్పడును. దేవత అను అర్ధమున, ఇదమను అర్ధమున ఇన్ద్రం (హవిః) బ్రాహ్మం (హవిః) అనురూప ములు ఏర్పడును. కర్మ కర్తలకు క్రియా యోగార్ధమున ధౌరేయః, ‘కౌంకుమం’ అనురూపములు ఏర్పడును. ‘భవ’ (పుట్టుట) మొదలగు అర్ధములలో ‘కానీనః’ (కన్యకు పుట్టినవాడు) క్షత్త్రియః, వైదికః స్వకః అను రూపములు ఏర్పడును. స్వార్ధమున చౌరః అని, తుల్యార్ధమున ‘చంద్రవత్ ముఖమ్’ అని రూపము ఏర్పడును. భావార్ధమున ‘బ్రాహ్మణత్తం’, ‘బ్రాహ్మణతా’, ‘బ్రాహ్మణ్యం’ అను రూపములు ఏర్పడును. ‘అస్తి’ అను అర్ధమున ‘గోమాన్ ధనీ ధనవాన్’ అను రూపములు సిద్ధించును. ప్రమిత్యర్ధమున (కొలత) కియాన్ అని ఏర్పడును. అస్తి అను అర్ధమున గోమాన్ ధనీ ధనవాన్ అనురూపములు సిద్దించును. ప్రమిత్యర్ధమున ‘(కొలత) కియాన్’ అని ఏర్పడును. జాతార్ధమున ‘తుందిలః’, ‘శ్రద్ధాలు: అని ఔన్నత్యార్ధమున (ఎత్తు) దంతురః అని ఏర్పడును. అస్త్యర్ధమున ణిని ప్రత్యయము రాగా ‘స్రగ్వీ’, ‘తపస్వీ’, ‘మేధావీ’, ‘మాయావీ’ ఇత్యాది రూపములు సిద్ధించును. బహుభాషణము కుత్సిత భాషణము అను అర్ధమున వాచాలః, వాచాటః అను రూపములు ఏర్పడును.

అపమాప్త్యర్ధమున, ‘ఈషత్’ అర్ధమున ‘కల్పప్’ దేశీయ ప్రత్యయములు వచ్చును. ‘కవికల్పః’’, ‘కవిదేశ్యః’ అను రూపములు, ప్రకారము అను అర్ధమున పటజాతీయః అని, నిందార్ధమున ‘వైద్యపాశః’ అని, ప్రశంసార్ధమున ‘వైద్యరూపః’ అని, భూతపూర్వార్ధమున ‘దృష్టచరః’ అని సిద్ధించును. ప్రాచుర్యాద్యర్ధములలో ‘అన్నమయః, మృణ్మయః స్త్రీమయః అను రూపములు ఏర్పడును. జాతార్ధ మున ‘లజ్జితః’ అని, అత్యర్ధమున ‘శ్రేయాన్’, ‘శ్రేష్ఠః’ అను రూపములు సిద్ధించును. ‘కృష్ణతరః’, ‘శుక్లతమః’ ‘కిమ’ అనునవి ఏర్పడును. ‘కింతరాం’, ‘అతితరం’, ‘అభి’, ‘హె’, ‘ఉచ్చైస్తరాం’ అనునవి అవ్యయములు. పరిమాణార్ధమున ‘జానుదఘ్నం’, ‘జానుద్వయసం’ అని రూపములు ఏర్పడును. నిర్ధారణార్ధమున ‘జానుమాత్రం’ అనురూపము నేర్పడును. చాలామందిలో, ఇద్దరిలో ఒకనిని చెప్పునపుడు వరుసగా ‘కతమః’, ‘కతరః’ అను రూపములు ఉండును. లెక్క పెట్టదగిన వస్తువును చెప్పునపుడు ‘ద్వితీయః’ ‘తృతీయః’, ‘చతుర్ధః’, ‘పంచమః’, ‘షష్ఠః’, ‘ఏకాదశః’, ‘కతిపయః’, ‘కతిధః’, ‘కతి’ అను రూపములు ఏర్పడును. ఇట్లే ‘వింశః’, ‘వింతితమః’, ‘శతతమః’ మొదలగు రూపములు ఉండును. సంఖ్యా ప్రకారమును చెప్పునప్పుడు ‘ద్విధా’, ‘ద్వేధా’, ‘ద్వైధా’ అను రూపములుండును. ఒకే పనిని ఎక్కువమార్లు చేయునపుడు, ‘పంచకృత్వం’, ‘ద్విః’, ‘త్రిః’, ‘బహుశః’, ‘ద్వితీయం’, ‘త్రితయం’ అను రూపములు ఏర్పడును. సంఖ్యార్ధమున ‘ద్వయం’, ‘త్రయం’ అను రూపములు సిద్ధించును. అల్పార్ధమున కుటీరః (చిన్నఇల్లు, గుడిసె) శమీరః, శుండారః అను రూపములు నిద్దించును. అట్లే ‘స్త్రైణం’ ‘పౌంస్నః’, ‘తుండిభః’, ‘వృందారకః’, ‘కృషీవలః’, ‘మలినః’, ‘వికటః’, ‘గోమీ’, ‘భౌరీకీ’ అనురూపములు సిద్ధించును. ‘అవటీటః’, ‘అవనాటః’ అనునవి నిబిడార్ధములో నుండును. ‘నిబిరీ’, ‘సమేషు కరీ’ అను రూపములు సిద్ధించును. ‘విత్తః’, ‘చణః’ అను రూపములు సామర్ధ్యార్ధమున నుండును. ‘బహుతిధం’, ‘చంచు’’ అనునవి సిద్దించును. ‘శృంగిణః’, ‘పర్వతః’ అను రూపములు పర్వతార్ధమున నుండును. పర్వత శిఖరములను చెప్పుటలో ‘ఉపత్యకా’, ‘అధిక్యకా’ అను రూపములు ఏర్పడును. ‘చిల్లః’, ‘చిపిటం’, ‘చిక్యం’, ‘కాతూలః’, ‘కుతపః’ ‘వల్లః’, ‘హిమోలు:’, ‘కహోడః’, ‘ఉపడః’, ‘ఊర్ణాయుః’, ‘మరూతః’, ‘ఏకాకీ’, ‘చర్మణ్వతీ’ ‘జ్యోత్స్నా’, ‘తమిస్రా’ ‘కక్షీవత్’, ‘యర్మణ్వతీ’, ‘ఆసందీవత్’, ‘చక్రీవత్’, ‘తూష్ణీకా’, ‘జల్పతకీ’ ఇవి అన్నియు విశేష రూపములు. ఇట్లే, కంభః, కంయుః, కంబః, కేతిః, కంతుః, కంతః, కంపః, శంవః, శంతః, శంతిః, శంయః, శంతః, శంతిః, శంయః, శంతః అను రూపములు విశేషార్ధములలో ఉండును. ‘హ్వయు’ శబ్దము ‘శంభు’ శబ్దమువలె చెప్పవలయును. ఇక ధాతు రూపములను చెప్పుచున్నారు.

మొదట బ్యాదిగణమున ‘భూ’ ‘సత్తాయాం’ అను ధాతువునకు పది లకారములలో ‘భవతి’, ‘బభూవ’, ‘భవతా’, ‘భవిష్యతి’, ‘భవతు’, ‘అభవత్’, ‘భవత్’, ‘భయాత్’, ‘అభూత్’, ‘అభవత్’, ‘అభవిష్యత్’ అను రూపములు సిద్ధించును. ఇట్లే భ్వాదిగణములలోని ఇతర ధాతురూపములను ఊహించుకొనవలయును. అదాదిగణమున ‘అద’ ‘భక్షణే’ అను ధాతువునకు పది ఆకారములలో ‘అత్తి’, ‘జఘాస’, ‘అత్తా’, ‘అత్స్యతి’, ‘అత్తు’, ‘ఆదత్’, ‘అద్యాత్’, ‘అఘసత్’, ‘ఆత్స్యత్’ అను రూపములు ఏర్పడును. జుహోత్యాది గణమున ‘జుహోతి’, ‘జుహావ జుహవాంచకార’, ‘హోతా’, ‘హోష్యతి’, ‘జుహోతు’, ‘అజుహోత్’, ‘జుహుయాత్’, ‘హూయత్’, ‘అహౌషీత్’, ‘అహోష్యత్’ అను రూపములు సిద్ధించును. దివాది గణమున ‘దీవ్యతి’, ‘దిదేవ’, ‘దేవితా’, ‘దేవిష్యతి’, ‘అదీవ్యత్’, ‘దీవ్యేత్’, ‘దీవ్యాత్’, ‘అదేవీత్’, ‘అదేవిష్యత్’ అను రూపములు ఏర్పడును. స్వాదిగణమున ‘సునోతి’, ‘సుషావ’, ‘సోతా’, ‘సోష్యతి’, ‘సునోతు’, ‘అనునోత్’, ‘సునుయాత్’, ‘సూ యాత్’, ‘అసావీత్’, ‘అసోష్యత్’ అను రూపములు ఏర్పడును. తుదాదిగణమున ‘తుదతి’, ‘తుతోదో’, ‘తోత్తా’, ‘తోత్స్యతి’, ‘తుదతు’, ‘అతుదత్’, ‘తుదేత్’, ‘తుద్యాత్’, ‘అతౌత్సీత్’, ‘అతోత్స్యత్’ అను రూపములు ఏర్పడును. రుధాది గణమున ‘రుణద్ధి’, ‘రురోద’, ‘రోద్ధా’, ‘రోత్స్యతి’, ‘రుణద్ధు’, ‘అరుణత్’, ‘రుధ్యాత్’, ‘అరౌత్సీత్’, ‘అరోత్స్యత్’ అను రూపములు ఏర్పడును. ‘తనాది’ గణమున ‘తనోతి’, ‘తతాన’, ‘తనితా’, ‘తనిష్యతి’, ‘తనోతు’, ‘అతనోత్’, ‘తనుయాత్’, ‘అతనీత్’, ‘అతానీత్’, ‘అతనిష్యత్’ అనురూపములు సిద్దించును. క్ర్యాది గణమున ‘క్రీణాతి’, ‘చిక్రాయ’, ‘క్రేతా’, ‘క్రేష్యతి’, ‘క్రీణాతు’, ‘అక్రీణాత్’, ‘క్రీణీయాత్’, ‘క్రీయాత్’, ‘అక్రైషీత్’, ‘అక్రేష్యత్’ అనురూపములు సిద్ధించును. చురాది గణమున ‘చోరయతి’, ‘చోరయామాస’, ‘చోరయితా’, ‘చోరయిష్యతి’, ‘చోరయతు’, ‘అచోరయత్’, ‘చోరయేత్’, ‘చోర్యాత్’, ‘అచూచురత్’, ‘అచోరిష్యత్’ అనురూపములు సిద్ధించును. ఇవి పది గణములలోని మొదటి ధాతువులోని ప్రథమ పురుష ఏకవచనములోని రూపములు. ద్వివచనాది రూపములు ఇతర ధాతురూపములు వ్యాకరణ శాస్త్ర గ్రంథములలో చూడవలయును.

ప్రయోజనార్ధమున ధాతువున కంటే పరముగా ణిచ్ ప్రత్యయము వచ్చినచో భూధాతువులో లట్ రూపము భావయతి అని అగును. ఇచ్ఛార్ధమున సన్ ప్రత్యయము వచ్చినపుడు బభూషతి అనియగును. క్రియాసమభిహారార్ధమున యఙ్ ప్రత్యయము వచ్చినపుడు బోభూయతే అని యగును. యఙ్ లుక్ ప్రకరణమున బోభవీతి అనియగును. తనలో ఇచ్చ అని అర్థమున (“పుత్రం ఆత్మన ఇచ్ఛతి”) (పుత్ర ఇవ ఆచరతి) ఆచారార్ధమున పుత్రీయతి (క్యచ్ ప్రత్యయాన్తము) అను రూపము ఏర్పడును. అనుదాత్తము ఇత్తుగాగల ధాతువుకంటే పరముగా ఙిత్తునకంటే పరముగా, క్రియా వినిమయాద్యర్థమున, నివిశాదులకు ఆత్మనే పదమొచ్చును. ఇతర ధాతువులకంటే పరముగా  కర్ర్త్ర ర్ధమున పరస్మైపదము వచ్చును. ఇకారణము ఇత్తుగాకల ధాతువున కంటే పరముగా, స్వరితము ఇత్తుగాగల ధాతువునకంటే పరముగా, స్వరితము ఇత్తుగాగల ధాతువునకంటే పరముగా పరస్మై పదము. ఆత్మనే పదము రెండువచ్చును. భావకర్మ రూపార్ధమున యక్ ప్రత్యయ మొచ్చును. సౌకర్యాతిశయమును తెలియచేయుటకు కర్తృవ్యాపారమును చెప్పదలచినపుడు కర్మయే కర్తయగును. అపుడు “పచ్యతే ఓదన స్స్వయమ్” (అన్నము స్వయముగా ఉడుకు చున్నది) అనిశ్ఛినత్తి (కత్తియే ఛేదించుచున్నది) స్ధాలీ పచతి (స్ధాలియే వండుచున్నది) ఇత్యాది ప్రయోగములుండును. సకర్మకమైన ధాతువునకంటే పరముగా భావార్ధములో, కర్మార్ధములో కూడా లకారములు వచ్చును. అకర్మకమైన ధాతువుకంటే పరముగా భావార్ధమున కర్ర్త్ ర్ధమున లకారములు వచ్చును. ఫలము వ్యాపారము ఒకేదానిలో ఉన్నపుడు ధాతువు అకర్మకమగును. ఆ ఫలవ్యాపారములకు ధర్మిభేదమున్నపుడు సకర్మకధాతువగును. కర్మగౌణమైనపుడు, ద్రుహ్యాది ధాతువులు, ప్రధానమైనపుడు నీ హృకృ మొదలగు ధాతువులు బుద్ధి భక్షణార్ధములలో, శబ్దకర్మక ధాతువులు వివక్షను అనుసరించి సకర్మకములు అకర్మకములుగా మారును. ప్రయోజ్యకర్మ విషయమున ఇతర ణ్యంతములకు పరముగా లకారాదులు రావచ్చును. ధాతువు ఫలవ్యాపారార్ధములను చెప్పును. ‘తిఙ్ ఫలాశ్రయమగు కర్మను, వ్యాపారాశ్రయ మగు కర్తను చెప్పును. ఫలవ్యాపారములలో వ్యాపారము ప్రధానము. తిఙర్ధము విశేషణము అగును. కృత్య ప్రత్యయములు వచ్చినపుడు ‘ఏధితవ్యం’, ‘ఏధనీయం’ అను రూపములు ఏర్పడును. కృత్య ప్రత్యయములు భావార్ధమున కర్మార్ధమున వచ్చును. కృత్ప్రత్యయములు కర్ర్త్ ర్ధమున వచ్చును. కర్తా, కారక అనునవి దృష్టాంతములు, భూత కాలమున భూతపదము వాడబడును. గమ్యాదులలో గమ్యాదులే నిర్దేశించబడును. మిగిలినది అంతయూ అద్యతనమగును. అధిస్త్రీ యథాశక్తి మొదలగు రూపములు అవ్యయీ భావ సమాసములో ఉండును. తత్పురుష సమాసమున ‘రామాశ్రితః’, ‘ధాన్యార్ధః’, ‘యూప దారు’, ‘వ్యాఘ్రభీః’, ‘రాజపురుషః’, ‘అక్షశౌండః’ అను రూపములు ఉండును.

‘పంచగవం’, ‘దశగ్రామీ’, ‘త్రిఫలా’ అనునవి ద్విగు సమాసమున ఉండును. తుల్యార్ధ మును చెప్పు కర్మధారయ సమాసమున నీలోత్పలం మొదలగు రూపములు ఉండును. “అబ్రాహ్మణః” అనునది నఞ్ తత్పురుష సమాసము. కుంభకారః మొదలగు రూపములు ఉండును. సమాసములో ఉన్న పదార్ధములుకాక అన్యపదార్ధ ప్రధానమగు బహువ్రీహి సమాసమున “ప్రాప్తోదకో గ్రామః” పంచగుః, రూపవద్భార్యః, ససుతః మొదలగు రూపములు ఏర్పడును. సముచ్చయార్ధమున గురుం చ ఈశం చ భజ అను ప్రయోగము, అన్వాచ అర్ధమున “భిక్షామట, గాం చానయ” అను ప్రయోగములు ఉండును. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసమున రామకృష్ణౌ ఇత్యాది ప్రయోగములు ఉండును. రామకృష్ణులు అనగా ఇద్దరు, బ్రహ్మ అనగా ఏకరూపముగా ఉపాసించబడుదురు. (2/52)