ధర్మాంగద దిగ్విజయము

వసిష్ఠ మహర్షి పలికెను: ఇట్లు సురతమునందు మోహితుడగు రుక్మాంగద మహారాజునకు ఎని మీది సంవత్సరాలు సుఖముగా గడిచినవి. తొమ్మిదవ సంవత్సరమున బలవంతుడగు ధర్మాంగదుడు అయిదుగురు విద్యాధరులను మలయ పర్వతమున గెలిచి సర్వకామ ప్రదములు, శుభకరములగు అయిదు మణులను తెచ్చెను. ఆ అయిదింటిలో ఒక మణి కోటి గుణమగు బంగారమును ఇచ్చునది. రెండవది లక్షకోట్ల వస్త్రములను ఇచ్చునది. మూడవది మరల యౌవనమును ప్రసాదించు అమృత మును స్రవించునది. నాలుగవది అన్నసాధకము, సభాగృహప్రకర్త. అయిదవది మూడు లోకములను సంచరించు ఆకాశగమన మును ప్రసాదించునది. ధర్మాంగద మహారాజు ఆ మణులను విద్యా ధరులను తీసుకొని కన్నీటితో విలపించుచున్న విద్యాధర స్త్రీలచే వెంబడించబడుచు వచ్చి, తండ్రియగు రుక్మాంగదునకు తల్లియగు మోహినికి ప్రణమిల్లి, అయిదు మణులను సమర్పించి, పాదిభివందనము ఆనాచరించి ఇట్లు పలికెను. ఓ తండ్రీ నేను యుద్ధమున మలయ పర్వతమునందు వైష్ణ వాస్త్రముచే ఈ అయిదుగురు విద్యాధరులను గెలిచితిని. స్త్రీ జన పరివృతులగు ఈ విద్యాధరులు నీకు సేవకులైరి. ఈ అయిదు మణులను మోహినీ దేవికి భుజాలంకారములుగా సమర్పించుము. ఈ మణులు సర్వాభీష్టప్రదములు. పునర్యౌవన కారకములు. జీర్ణ దంతులు మరల బాలులగుదురు. ఈ మణులు వస్త్ర హర్మ్య సువర్ణ స్వర్ణ అమృత ప్రదములు. ఒక మాసము యుద్ధము గావించి నీ పరాక్రమముచే నేను సంపాదించితిని. నీ అనుగ్రహమువలన నేను చాలాకష్టించి ఏడు ద్వీపములను సాధించితిని. అన్ని ద్వీపములు నీకు పన్ను చెల్లించునట్లు చేసితిని. నేను సముద్రమున ప్రవేశించి ఒక సంవత్సర కాలము యుద్ధముచేసి నాగసమావృతయగు భోగవతీ పురిని గెలిచితిని. పదివేల మంది నాగకన్యలను హరించితిని. అచట నుండి చాలా హారములను రత్నములను కొని తెచ్చితిని. అటనుండి దానవ పురమునకు వెళ్ళితిని. అచట దానవులను జయించి రూపవతులు కాంతిమతులు అగు ఎనిమిది వేలమంది దానవ కన్యలను కొని తెచ్చితిని. రాత్రిపూట దీపములుగా పనిచేయు పదికోట్ల రత్నములను కొనివచ్చితిని. అట నుండి నేను రసాతలమున ఉన్న వారుణలోకమునకు వెళ్ళితిని. అచట వరుణదేవునితో నీవు జీవించదలచితివేని నా తండ్రియగు రుక్మాంగద మహారాజు అధీనములో ఉండుము అని అంటిని. ఆ మాటతో వరుణుడు కోపించి యుద్ధమునకు వచ్చెను. రసాతలమున వరుణునితో సంవత్సరకాలము ఘోరయుద్ధము జరిగెను. చివరికి నేను నారాయణాస్త్రముచే జలనాయకుని జయించితిని. స్త్రీల ప్రార్థనచే చంపకుంటిని. అంతట వరుణదేవుడు వాయు వేగముగల పదివేల గుఱ్ఱములను శ్యామ కర్ణములుగల, శుభ్రములు, చంద్రకాంతిగల వాటిని, గడ్డి నీరు లేకనే చాలా సంవత్సరములు బ్రతుకగల వాటిని కానుకగా ఇచ్చెను. ఒక చక్కని కన్యను చక్కగా అలంకరించి నాకు భార్యగా ఉండుటకు బహూకరించెను. ఆమెను కూడా తీసుకొని వచ్చితిని. బహు విత్త సమన్వితముగా కన్యను తీసుకొని వచ్చితిని. ఓ తండ్రీ! నాకు ఈ మూడు లోకములలో వెళ్ళ జాలని స్థానము గెలవ శక్యము కాని ప్రదేశము నీ అనుగ్రహము వలన ఒక్కటి కూడా లేదు. కావున నీ అనుగ్రహము వలన సంపాదించిన సంపదను ఒకసారి లేచి పరీక్షించుము. ఓ రాజా? నేను ఈ సంపదలు నీ వశములు. ఈ సంపదను అంతా నేను సంపాదించితిని అని కాని, బ్రాహ్మణులకు దానము చేయరాదు అని కాని అను పుత్రుడు నరకమునకు వెళ్ళును. పుత్రుడు తనను తాను గౌరవించుకొనరాదు. సంపదను పెంచుటలో పుత్రుడు కుఠారము, దాత్రము వంటి సాధనము వంటివాడే. తండ్రి పరాక్రమముచేతనే పుత్రులు ధనరాశులు పెరుగును. కొడవలిని తీసుకొని గడ్డిని కోయుదురు. గాలి నిండిన వస్త్రము జలమున పడవను దాటించును. నడిపించు వాని ఇష్టము ననుసరించి చెక్కబొమ్మ ఆడును. అట్లే తండ్రి పరాక్రమముచే పుత్రుల తేజో బల సమన్వితులగుదురు. కావున నాచే కొనితేబడిన ఈ సంపదలను ఒకసారి చూడుము. మీ ఇష్టానుసారముగా దానము చేయుడు. లేదా దాచుకొనుడు. అది అంతయూ మీ చిత్తము. (II/20)