మోహినీ వచనము

పుత్రుడు పలికెను: కావున ఓ తల్లీ! ఈర్ష్యను వదిలి మోహినిని భుజింపచేయుము. ఇటువంటి ధర్మము మూడు లోకములలో లభించదు. భర్తకు ప్రియురాలగు తన సవతిని ఏ భార్య భుజింప చేయునో, లేదా కొంచెము అన్నమిచ్చుచో అది అనంతఫలమును ఇచ్చునని బ్రహ్మ చెప్పియున్నాడు. కావున మహారాణీ! నీవు నా మాటను అనుసరించుము. మనము ఇద్దరము తండ్రి సుఖమునే చూడవలయును. ఇట్లు చేసిన పాపములు నశించి స్వర్గము లభించును. ఇట్లు ధర్మాంగదుని మాటలను వినిన సంధ్యావళీ దేవి పుత్రుని అభినందించి పలుమార్లు ఆలింగనము చేసుకొని శిరస్సుని మూర్కొని ఇట్లు పలికెను. ఓ కుమారా! ధర్మబద్ధమగు నీ మాటను తప్పక ఆచరించెదను. ఈర్షను అభిమానమును వదిలి మోహినిని భుజింపచేసెదను. నీవంటి ఒక్క పుత్రుని చేతేనే నేను నూర్గురు పుత్రులు కలదాననైతిని.

దేహమునకు కష్టమును కలిగించు ఎన్నో నియమములను ఆచరించుటచే నీవు పుట్టితివి. వ్రతరాజములను ఎన్నింటినో చేసిన వెంటనే నీవు లభించితివి. లోకమున ఇంతటి ఫలమును ఈయగల ఇటువంటి వ్రతము మరియొకటి లేదు. ఈ వ్రతము వెంటనే విశ్వాసమును కలిగించునది. ఫలమును ప్రసాదించునదిగా చూడబడినది. శోకమును సంతాపమును కలిగించు పదిమంది పుత్రులకంటే కులమునకు ఆధారభూతుడగు ఒక పుత్రుడు చాలును. నిన్ను గర్భమున ధరించిన నేను మూడు లోకములకంటే ఉన్నత స్థితిని పొందితిని. నీకు పుట్టుకను ఇచ్చిన నా నొప్పులు, ధన్యములు. సప్తద్వీపాధిపతి, శూరుడు, పితృవాక్యపాలకుడు, తల్లి దండ్రులను ఆనందింప చేయువాడు మాత్రమే నిజమగు పుత్రుడని ఇతరులు కేవలము పుత్ర నామమును మాత్రమే పొందుదురని పండితులు చెప్పియున్నారు అని సంధ్యావళీదేవి ఇట్లు పలికి, భాండములను షడ్రస పదార్థముల కొఱకు చూచెను. సంధ్యావళి చూపు పడిన వెంటనే ఆ భాండములు షడ్రస యుక్తములుగా సుఖోష్టకములుగా మోహినిని భుజింపచేయవలయునని పరిపూర్ణములుగా మారెను. అమృతమువలె రుచికరములుగా ఉండెను. అంతట సంధ్యావళీ దేవి రత్న ఖచితమగు బంగారు గరిటను తీసుకొని మోహినీ దేవికి చిరునవ్వుతో వడ్డించెను. మృదుస్పర్శమగు బంగారు పాత్రలో వడ్డించిన పదార్ధములను ఇష్టము సుసంస్కృతమగు అన్నమును మోహినీ దేవి మెల్లమెల్లగా భుజించెను. మోహినీదేవి శుభకరము స్వర్ణమయమగు ఆసనమున కూర్చొని, ధర్మాంగదుడు స్వయముగా నెమిలి పింఛములతో వీవన వీచుచుండగా అమృతము వంటి ఆ అన్నమును భుజించినది. తరువాత నాలుగు విధముల శీత జలములచే శౌచమును ఆచరించి ధర్మాంగదుడు ఇచ్చిన సుగంధి అగు తాంబూలమును శ్రేష్ఠమగు చందనమును అలదిన హస్తముచే స్వీకరించెను. అపుడు ఒక చిరునవ్వు నవ్వి సంధ్యావళితో ఇట్లు పలికెను.

ఓ దేవీ! నీవు ధర్మాంగదుని తల్లివా? శ్రమచే చెమటపట్టి ఉండుటచే నేను తెలియజాలక పోయితిని అని ఇట్లు బ్రహ్మ సుతయగు మోహిని పలుకుచుండగా ధర్మాంగదుడు మోహినీ దేవికి నమస్కరించి ఇట్లు పలికెను. ఓ తల్లీ! ఈ దేవి నన్ను తన కడుపులో మూడు సంవత్సరములు మోసినది. నీ భర్త అనుగ్రహముచే నేను పెరిగితిని. నాకు కొన్ని వందల మంది తల్లులు కలరు. కాని నేను ప్రేమతో పెల్లుబికి వచ్చిన ఈమె చనుబాలనే త్రాగితిని. ఈ దేవియే నన్ను ప్రసవించునపుడు తీవ్రమగు ప్రసవవేదనను అనుభవించినది. దానితో ఈమెకు బంధములుడిగి వార్ధక్యము సంక్రమించినది. ఈమె ఋణమును తీర్చుటకు ఈయగలదేదియు ఈ మూడు లోకములలో కనపడుట లేదు. మాతాపుత్రులకు ఋణవిమోచనము అనునది లేదు. ఇది ముమ్మాటికీ నిజము. కావున నేను అందరికంటే ధన్యుడను. ఈ లోకమున నాకంటే అధిక పుణ్యశాలి లేడు. నేను చాలా మంది తల్లుల వడులలో ఆడుకొన్నాను. తల్లివడిలో చేరని తనయుడు, కన్య భర్తృ సౌఖ్యమును తెలియనట్లు మాతృసౌఖ్యమును తెలియజాలడు. తల్లి వడిని చేరిన తనయుడు దర్పముతో విలసిల్లును. తల్లి కంఠ సీమలో ఉండు హారమును చేతులతో హరింప జూచును. పితృహీనుడైననూ తల్లిచే పోషించబడువాడు దర్పముతోనే ఉండును. ఈ జగమును జయించు నాబలమంతయూ ఈ తల్లి చనుబాలచలువే. ఈమె కడుపులో పుట్టివాడు. ఈమె వడిలో శంకలేకనే ఆడును. ఈమెకు ఇతర మాతలకు నేను భేదమును చూడలేను. కావున మా తండ్రి నూరు సంవత్సరములు జీవించనిమ్ము. ధర్మాంగదుడు ఇట్లు పలుకగా విస్మయమును చెందిన మోహిని తన మనసులో నేను దయను వీడి, వినయ సంపన్నుడు పరమ పుణ్యుడు, పితృసేవాపరాయణుడు, సర్వగుణాధికుడు అగు పుత్రునికి తల్లినై ఎట్లు జుగుప్సితమగు శిరః ఖండనము చేయించగలను అని ఇట్లు పలువిధములుగా తనలో తాను పరిశీలించుకొని మోహినీ దేవి పుత్రుడగు ధర్మాంగదునితో! నా భర్తను త్వరగా తోడ్కొనిరమ్ము. భర్త లేనిదే ఒక ముహూర్తకాలము కూడా నేను నిలువజాలను అని పలికెను. అంతట ధర్మాంగదుడు త్వరగా తండ్రి వద్దకువెళ్ళి, తండ్రికి నమస్కరించి, మా చిన్నతల్లి మిమ్ములను చూడగోచుచున్నది. ఆమెను అనుగ్రహించుడు. బ్రహ్మపుత్రికను ఆదరించుడు అని పలికెను. పుత్రుని మాటను విని వెంటనే సంతోషముచే బయలుదేరి సంధ్యావళీ గృహమున ప్రవేశించి తప్తకాంచన సన్నిభ మోహయుక్తయగు మోహిని శయ్యపై నుండగా చూచెను. సంధ్యావలిచే సేవించబడు చుండెను. సంధ్యావళి కూడా పుత్రుని మాటలతో సవతియను భావమును విడిచి ఉండెను. వచ్చిన రుక్మాంగద మహారాజును చూచి శయ్యపై ఒక ప్రక్కకు తిరిగి సంతోషము నిండిన మోహముతో రాజుతో ఇట్లు పలికెను. ప్రియా! మెత్తని ఈ పర్యంకమున కూర్చొనుడు. రాజా! రాజకార్యములను చాలాసేపు పరిశీలించితిరి. ఇప్పటికీ మీకు రాజ్యముపై కోరిక ఉడుగలేదు. సమర్ధుడగు పుత్రుడు ఉండిననూ రాజకార్యములను మీరు స్వయముగా చూచుట వలన ఈ భూ మండలమున మీరొక్కరే దుష్కృతి అని భావించుచున్నాను. కావున ఈ లోకమున మిమ్ములను మించిన దుఃఖి వేరొకడు లేడు. మంచి పుత్రుడుగల తండ్రికి జీవనము సుఖముగా సాగును. పాపమును దుఃఖరూపముగా అనుభవించువారైనను, విషయాసక్త చిత్తులైనను సత్పుత్రులుగల వారికి ఆనందమే మిగులును. పరిపూర్ణ పుణ్యముచే పుట్టిన ప్రజలందరూ నీకు ఇష్టులుగా ఉన్నారు. ధర్మాంగదుడు పరిపాలించుచుండగా మరల మీరెందుకు చూచుచున్నారు? ప్రియా సౌఖ్యమును దుర్బలుడగు కీనాశునివలె ఏల వదులు కొనుచున్నారు? ఒకవేల మీరు రాజ్యపాలన చేయుచున్నచో నాతో మీకేమి ప్రయోజనము. మందర పర్వతము నుండి నన్ను నిష్ప్రయోజనముగా తోడ్కొని వచ్చితిరి. పక్షులకు మాంసమువలే నేను క్రిములకు ఆహారము కాగలను. యౌవనవతియగు భార్యను కార్యవ్యగ్రుడై సేవించని దుర్మతికి భార్య ఎట్లుండును? సేవించనిచో భార్య వెళ్ళి పోవును. దానము చేయని ధనము నశించును. రక్షించబడని రాజ్యము తొలగును. అభ్యాసముచేయని శాస్త్రము నశించును. సోమరులకు చదువురాదు. వ్రతములను ఆచరించువారికి భార్య ఉండదు. అనుష్ఠానము లేనిదే లక్ష్మిరాదు. భక్తులు కాని వారికి కీర్తిరాదు. ప్రయత్నమును చేయనివాడు. సుఖమును పొందజాలడు. భార్యలేనివాడు సంతానమును పొందజాలడు. అపవిత్రుడు ధర్మమును పొందజాలడు. అప్రియమును మాటలాడు బ్రాహ్మణుడు ధనమును పొందజాలడు. అడగనివాడు తెలియజాలడు. నడవనివాడు వెళ్ళజాలడు. శిష్యుడు కానివాడు చేయవలసిన పనిని తెలియజాలడు. మేలుకొని ఉండు వానికి భయము కలుగదు. కావున ఓ రాజా! నన్ను ధర్మాంగదుని ఇంటిలో విడిచి, సమర్థుడగు తనయుడుండి కూడా నీవెందుకు రాజ్యతంత్రమును చూచుచున్నావు? అని ఇట్లు ప్రశ్నించుచున్న బ్రహ్మ పుత్రిక, రతియందు ప్రీతికలది, చక్కని విశాలమగు నేత్రములు కలదియగు మోహినిని చూచి పుత్రుడు దగ్గరలో ఉన్నందున సిగ్గు పడుచు మోహినితో ఇట్లు పలికెను: (II/17)