సమయ కరణము

వసిష్ఠ మహర్షి పలికెను: ఇట్లు మోహిని హృద్యముగా మాటలాడగా పద్మముల వంటి నేత్రములను తెరిచి, మోహినిని చూచుటచే ముగ్ధుడై గద్గద స్వరముతో ఇట్లు పలికెను. ఓ బాలా నేను చాలా మంది సౌందర్యవంతులను చూచియుంటిని. అనుభవించి యుంటిని. కాని ఇంతటి సుందర దేహమును చూచి ఉండలేదు. నీవు ధరించిన రూపము లోక మోహనము. ఇట్టి నీ రూపమును చూచినంతనే మన్మథ బాణములచే కొట్టబడి భూమిపై పడితిని. నీ తేజస్సుచే మోహింపబడి మాటలు వచ్చుటలేదు. కావున ఓకరభోరూ! నాయెడ ప్రసన్నురాలవు కమ్ము! నీ మనసులో ఉన్న దంతయూ ఇచ్చెదను. నీ అనురాగముచే బద్ధచిత్తుడగు వానికి ఈయరానిదేదియు ఉండదు. భూధర భూషితాంగి, సముద్ర వస్త్ర, శశిసూర్యనేత్ర, ఘనస్తని, వ్యోమ సుబద్ధదేహ, నిష్కానన, వామశీల, పాతాళగుహ్య, బహువృక్ష రోమ, సప్తాధర, సకోశబద్ధ, గజవాజిపూర్ణ, సమంత్రి హృద్య, నగర సమేతయగు ఈ భూమిని ఈయగలను. నీ సంగమముకొరకు నన్ను కూడా ఇచ్చుకోగలను. ఇక ధనరత్నముల గూర్చి చెప్పనేల? కావున నా యెడ ప్రసన్నురాలవు కమ్ము. అనగా రాజును లేపి, మధురమగు మాటలతో ఇట్లు పలికెను “ఓ రాజా? పర్వతములతో కూడియున్న భూమిని నేనడుగుట లేదు. సమయము వచ్చినపుడు నేను చెప్పిన పనిని శంకించక చేయవలయును. అపుడు సందేహము లేకనే నిన్ను సేవించెదను. అట్లు శపథమును చేయుము.”

రాజు పలికెను: “ఓ దేవీ! నీ వే శపథముచే తృప్తి చెందెదవో ఆ శపథమును చేసెదను. నీ సంగమము లేనిచో నా శరీరము దశావస్థలను పొందుచున్నది.”

మోహిని పలికెను: “ఓ రాజా? అనేక ధర్మములను ఆచరించియున్న నీ దక్షిణ హస్తమును నా చేతిలో ఉంచుము. అపుడు నీ మాటపై నాకు విశ్వాసము కలుగును. ఈ మూడు జగములలో నీవు ధర్మశీలుడవగు రాజువు. సత్యకీర్తివి. అవసరము ఉన్నపుడు కూడా అసత్యమును మాటలాడవు. ఇది లౌకిక మార్గము” ఇట్లు మోహిని పలుకుచుండగా కామముచే పీడించబడు రాజు ప్రసన్నమగు మనసుతో ఇట్లు పలికెను. ఓ వామోరూ? నేను పుట్టిన నాటినుండి యధేచ్ఛా విహారములలో కూడా ఎపుడూ అబద్ధమును మాటలాడ లేదు. అయినను ఈ నమ్మకమును కలిగించునట్టి మాటలేల? ధర్మమునకు చిహ్నమగు నా ఈ దక్షిణ హస్తమును ఇచ్చుచున్నాను. నేను నీ మాటను చేయనిచో పుట్టిననాటి నుండి నేను చేసిన పుణ్యకర్మల ఫలమంతయూ నీకు చేరును. ఇదిగో నా హస్తమును ఇచ్చుచున్నాను. ధర్మబద్ధముగా నాకు భార్యవు కమ్ము. నీ రూపముచే నాకు తాపము కలుగుచున్నది. నేను ఋతధ్వజుని పుత్రుడను. నా పేరు రుక్మాంగదుడు. ఇక్ష్వాకువంశ సంభూతుడను. నా పుత్రుడు ధర్మాంగదుడు. నేను వేట అను మిషచే అరణ్యమునకు వచ్చితిని. ఆ యరణ్యమున సుందరమగు వామ దేవమహర్షి యాశ్రమమును చూచితిని. అచట వామదేవ మహర్షి నీకు అన్నియు సమకూరునని చెప్పెను. అటనుండి అశ్వమును అధిరోహించి మంధర పర్వతమున తిరుగుచుండగా నీ గానము నాచెవిన బడినది. ఆ గానముచే ఆకర్షింపబడి నీ సమీపమునకు చేరితిని. నీవు నా చూపున పడితివి. అంతట నేను స్పృహను కోల్పోయి మూర్ఛిల్లితిని. నీ వాక్యామృతముచే ఇపుడే స్పృహ వచ్చినది. ఓ లోకమోహినీ నాకు మరల జన్మ లభించినదని తలంచుచున్నాను. నామాటలకు బదులు పలికి నన్ను అనుగ్రహించుము. రాజిట్లు పలుకగా మోహినీ దేవి ఈ విధముగా బదులు పలికెను. “నేను బ్రహ్మ మానస పుత్రిని. నీ కొరకే ఇటకు వచ్చితిని. నీ కీర్తిని విని మదన పీడితనై మందర పర్వతమునకు వచ్చితిని. బ్రహ్మ మొదలగు దేవ తలనందరిని విడిచి వచ్చితిని. ఇచట సావధానమగు మనసుతో తపస్సును చేయుచున్నాను. శంకరుని గీత దానముచే పూజించుచున్నాను. గీతదానము దేవతలకు అతిప్రియమని తలచుచున్నాను. ఈ గీతదానము అన్ని దానములలో ఉత్తమ దానము అనంతమగు మోక్షమును ఇచ్చునది. ఈ గీతదానముచే శంకరుడు ప్రీతి చెంది వెంటనే ఉపకారమును చేయును. నేను కోరిన రాజువగు నీవు నన్ను చేరితివి. నన్ను మెచ్చితివి. నేనుకూడా నిన్ను వరించుచున్నాను. ఇంద్రుని యష్టివలె ఉన్న ఆ మోహిని రాజుతో ఇట్లు పలికి భూమిమీద పరుండి ఉన్న రాజును చేయి పట్టుకొని పైకి లేపెను. (II/12)