నారద మహా పురాణము
గుడధేను విధి కథనము
మోహినీ దేవి పలికెను: ఓ మహానుభావా! నీ ముఖ పద్మమునుండి ఉత్తమమగు గంగా మాహాత్మ్యమును వినిన నేను ధన్యురాలను, కృతకృత్యురాలను, నా జీవితము సఫలము, ఈ భూమండలమున గంగా సుమమగు తీర్థమే లేదు. ఈ గంగా సందర్శనాదులకు అంతటి ఫలము తెలుపబడినది. గుడధ్వేన్వాది ధేనువుల విధానమును కూడా యథా క్రమముగా తెలుపుము. ఓ బ్రాహ్మణోత్తమా? నేను నీకు సర్వదా భక్తురాలను.
వసిష్ట మహర్షి పలికెను: ఆ మోహినీ వాక్యమును వినిన ఆమె పురోహితుడగు వసువు వేద శాస్త్రాగమ తత్త్వజ్ఞుడు కావున చిరునవ్వుతో ఇట్లు పలికెను.
వసువు పలికెను: ఓ మోహినీ! నీవడిగిన గుడధేను విధానము శాస్త్రమున తెలుపబడిన విధముగా చెప్పెదను వినుము. చతుర్హస్తమితమగు కృష్ణాజినమును పూర్వగ్రీవముగా ఉంచవలెను. గోమయముచే అలుకబడిన భూమిపై దర్భలను పరిచి దర్భలపై ఉంచవలెను. అచటనే ధేనువును ప్రాఙ్ముఖముగా ఉదక్పాదముగా సవత్సను కల్పించవలెను. చతుర్భారములచే నున్నది ఉత్తమ గుడధేను వని చెప్పబడినది. ఒక భారము కలది వత్సనుంచ వలయును. రెండు భారములు కల ధేనువు మధ్యమము. వత్స అర్ధ భారము కలది, ఒక భారముకల ధేనువు కనిష్ఠము. గృహవిత్తానుసారముగా వత్స చతుర్థాంశముతో నుండవలెను. ఉత్తమగుడ ధేను దాన సమర్థుడై ఉండి కూడా ఇతర విధానమును అనుసరించినవానికి దుర్మతికి ఫలము కలుగదు. ఇట్లు ఘృత పరికల్పితములగు ధేనువత్సలు శితళ్లు క్లాంబరావృతములు, శుక్తి కర్ణములు, ఇక్షుపాదములు, శుద్ధ ముక్తాఫలనేత్రలు సితసూత్ర శిరాలములు, సిత కంబలములు తామ్ర గండూక పృష్ఠములు, సితచామరలోమకములు విద్రుమ క్రమగోపేతములు, సవనీత స్తనాన్వితములు, కాంస్య దోహములు, ఇంద్రనీలమణి కల్పిత తారకములు, సువర్ణ శృంగార ఆభరణములు, శుద్ధ రౌప్యఖురములు, నానాఫల సమాయుక్తములు, ఘ్రాణగంధకరండకములుగా నిర్మించి ధూప దీపాదులచే అర్చించవలెను. సర్వ భూతములలో సర్వ దేవతలలో ధేనురూపముతో నుండు లక్ష్మీదేవి నాకు శాంతిని ప్రసాదించు గావుత, రుద్రేహస్థిత, శంకర ప్రియ అగు ధేనురూపయగు దేవి నాపాపమును తొలగించు గాత. శ్రీహరి వక్షస్ఘ్సలమున, స్వాహారూపమున అగ్నిలో చంద్రార్క శక్రులలో అంశగా ధేను రూపముగా ఉండు దేవి నాకు సంపదనిచ్చుగాత. చతుర్ముఖ లక్ష్మి, కుబేర లక్ష్మి, లోక పాలుర లక్ష్మియగు ధేనురూప నామ వరప్రదురాలగుగావుత. పితృముఖ్యులకు స్వధా రూపముగా యజ్ఞ భుక్కులకు స్వాహారూప సర్వ పాపహార అగు ధేనువు నాకు శాంతిని ప్రసాదించుగావుత. ఇట్లు ధేనువును ప్రార్థించి బ్రాహ్మణునకు నివేదించవలెను. ఈ విధానము అన్ని ధేనువులకు అనువర్తించును. పాప వినాశినులు అని ప్రసిద్ధిగాంచిన పది విధములగు ధేనువుల స్వరూపమును శాస్త్రోక్త విధానముగా వివరించెదను. సావధానముగా వినుము.
మొదటిది గుడ ధేనువు. రెండవది మృతధేనువు. మూడవది తిలధేనువు. జలధేనువు నాలుగవది. క్షీరధేనువు అయిదవది. మధుధేనువు ఆరవది. ఏడవది శర్కరాధేనువు. దధిధేనువు ఎనిమిదవది. రత్నధేనువు తొమ్మిదవది. పదవది స్వరూపముగా ధేనువు. ద్రవధేనువులు కుంభరూపములుగా ఉండును. ఇతర ధేనువులకు రాశులుండును. ఇచట కొందరు సువర్ణ ధేనువును కూడా చెప్పెదరు. నవనీత ధేనువును, తైలధేనువును కూడా కొందరు మహర్షులు చెప్పెదరు. విధానము అర్చన మాత్రము ఇదేవిధముగా నుండును. ప్రతి పర్వకాలమందు మంత్ర ఆవాహన గావించి యథావిధిగా శ్రద్ధతో దానము గావించవలెను. ఇట్లు చేసిన భుక్తిముక్తులను ప్రసాదించును. ఈ ధేనువులు అనేక యజ్ఞఫల ప్రదములు సర్వ పాపహరములు, శుభప్రదములు. అయన కాలమున విషువమున, యుగాదియందు, మన్వాదులందు, గ్రహణ కాలములందు భక్తి శ్రద్ధా సమన్వితులై గుఢధేన్వాదులను దానమును గావించవలెను. తీర్థములందు కాని, స్వ గృహమునందు కాని, విశేషించి గంగా తీరమున కాని దానమును చేయవలెను. ఇట్లు యధావిధిగా బ్రాహ్మణునకు గోదానమును కావించి విప్రునికి ప్రదక్షిణము ఆచరించి, దక్షిణలచే సంతోషపరిచి ప్రీతియుక్తుడై ఋత్విజులకు నమస్కరించి పంపవలెను. తరువాత యథావిధిగా అష్టమూర్తి ధర దివ్యరూపగా గంగాదేవిని చూచి పూజించవలెను. శాలితండ్రుల ప్రస్థముచే, ద్వి ప్రస్థ క్షీరములచే పాయసమును చేయించి తేనెను నేయిని ఒక పలమాత్రమువేసి భక్తి భావముచే కూడినవాడై, ఆ పాయసమును, అపూపములను, మోదక మండలములను గుంజార్థ సువర్ణమును రజతమును చందనాగురు కర్పూర కుంకుమలను గుగ్గులమును బిల్వపత్రములను, దూర్వలను, గోరోచనమును, శ్వేత చందనమును, నీలోత్పలములను, ఇతర సుగంధ పుష్పములను శక్తికొలది గంగయందు పడవేయవలెను. ఈ మంత్రముచే పురాణోక్తముగా ఆచరించవలెను. “ఓం గంగాయై నారాయణ్యై శివాయై చ నమో నమః” అని మంత్రము. అనగా గంగారూపు ధరించిన నారాయణికి శివకు నమస్కారము అని యర్థము. ప్రతి మాసమున ఇదే విధానమును ఆచరించవలెను. పూర్ణిమయందు, అమావాస్య యందు ప్రాతఃకాలమున సావధానముగా చేయవలెను. ఇట్లు ఒక సంవత్సరము భక్తితో శక్తి కొలది హవిష్యమును భుజించుచు మితాహారియై, బ్రహ్మచర్య వ్రతమును అవలంబించి పగలుకాని రాత్రికాని నియమముచే పూజించినచో సంవత్సరాంతమున అతనికి గంగాదేవి దివ్యవపుర్థారిణియై, దివ్యమాల్యాంబరధారిణియై, దివ్యరత్న విభూషితురాలై ప్రత్యక్ష రూపమున వరప్రదురాలై నిలుచును. ఇట్లు దివ్యవపుర్థారిణియై ప్రత్యక్ష రూపముగా నిలిచిన గంగా దేవిని చూచి కృతకృత్యుడగును. తాను కోరిన కోరికలను అన్నింటిని పొందును. నిష్కాముడైనచో ఆ జన్మలోనే మోక్షమును పొందును. ఇట్లు నీవు అడిగిన గుడధేను విధానమును గంగార్చనమును, ముక్తిప్రదమగు వ్రతమును ఒక సంవత్సరము చేయవలసినదానిని, చేసిన శ్రీహరిని ప్రీతుని చేయు వ్రతమును చెప్పితిని. (II/42)