బృందావన మాహాత్మ్యము

మోహిని పలికెను: గురువర్యా! మధురా మాహాత్మ్యమును వనముల మాహాత్మ్యమును చక్కగా వింటిని. బృందావన రహస్యమునుకూడా కొంచెము చెప్పుము. భూమియొక్క కీర్తి రహస్యభూతము బృందావనము. దానిని వినుటకు నాకు కోరిక గలదు. కావున విస్తరముగా వర్ణింపుము.

వసువు పలికెను: మోహినీ! బృందారణ్య రహస్యమును చెప్పెదను వినుము. నేను గురువు వలన పొంది ఇంతవరకు ఎవ్వరికీ తెలుపలేదు. నారద మహర్షి నా గురువునకు తెలిపెను. నారద మహర్షికి గోపికాపతి రహస్యమును బృంద చెప్పెను. అట్టి జగదుద్ధారకారణమగు బృందా మాహాత్మ్యమును ఇపుడు నీకు చెప్పెదను. భగవత్ర్పియుడగు నారద మహర్షి లోకములను పర్యటించుచు ఒకప్పుడు బృందావనమును చేరి పుష్పసరస్తీరమున నిలిచెను. ఈ సరస్సు మధురా మండలమున నైఋతిదిశగా నున్నది బృందావనము మధురామండలమున నాలుగవస్థానము. గోపికాపతి రహస్య ప్రదేశము. ఇచటికి సమీపముననే గోవర్ధన పర్వతము కలదు. యమునానదీ తీరమున నందిగ్రామ సమీపమున బృందాదేవి తపః ప్రదేశము. యమునా నదీ తీరమున సుందరమగు బృందావనము కలదు. అచట పరమ పావనమగునది పుష్పసరస్సు. యమునానదీ తీరమున బృందావన ఆశ్రమము అతి సుఖప్రదము. ఇచటనే చెలులతో శ్రీహరి విశ్రమించును. నారద మహర్షి దట్టమగు చెట్టునీడలో ముహూర్తకాలము విశ్రమించి, పుష్ప సరోవరపు శీతల జలమును ఆచమనము గావించి, మాధ్యాహ్నిక కర్మను ఆచరించి ససస్తీరమున నిలిచెను. సున్దరమగు ఆ బృన్దాశ్రమమున గోపాలకులు, గోపికలు నారదమహర్షి చూచుచుండగా బృందములుగా వచ్చుచుండిరి. ఇట్లు అచట ఒక ఝాము నిలిచి ఒకటిన్నర ఝాము పగలు ఉండగా అద్భుతమగు బృందాశ్రమమున ప్రవేశించెను. ఇచటనే కృష్ణ భక్తి పరాయణురాలగు బృందాదేవి ఉండును. అచటికి వచ్చినవారికి ఫలాదులతో సత్కారములను చేయుచుండును. సాధుసమ్మతుడగు నారద మహర్షిని బృందాదేవిని ధ్యాన యోగాంతమున కనులు తెరిచి అతిథియగు నారదునకు ఆసనమును అర్పించెను. బృందాదేవిచే సత్కరించబడిన నారదుడు ఆసనముపై కూర్చుండెను. గోపికాపతి రహస్యమును, అతిరహస్యమును ఆదరముతో తెలియగోరెను. బృందాసత్కారమును స్వీకరించి బృందప్రసన్నురాలని తెలిసి హృదయ భావమును తెలిపెను. బృందాదేవి ధ్యానయోగముతో నారదుని అభిమతమును తెలుసుకొని తన సఖియగు మాధవిని అచటికి పిలిచి ఇట్లు పలికెను. మహాత్ముడగు నారద మహర్షికి ప్రియమును చేకూర్చుము. ఈ ఆశ్రమమునకు పావనత్వమును చేకూర్చి నాకు ప్రీతిని కలిగించుము. తన ఆశ్రమమునకు వచ్చినవారికి ప్రీతిని కలిగించని ఆశ్రమము నక్కల ఇల్లువలె నిష్పలమగును. అని పలుకగా, అంతట ఆ మాధవీదేవి బృందాదేవి అజ్ఞచే నారదుని తీసుకొని సరస్తీరమునకువెళ్ళి వాయవ్య భాగమున స్నానముచేయుమని చెప్పెను. మాధవీదేవి ఆజ్ఞచే దేవర్షియగు నారదుడు శ్రీకృష్ణ సంగమమును ధ్యానించుచు జలమున మునిగెను. నారద మహర్షి నీట మునుగుచుండగా మాధవీదేవి బృందేప్సితమును నెరవేర్చి బృందాదేవి సమీపమునకు వెళ్ళెను. అంతట నారద మహర్షి మునిగి లేచి తనను వనితా రూపముగా చూచి ఆశ్చర్యమును చెందెను. అంతట శుచిస్మితయగు నారదీదేవి ఈశాన్యకోణమున ఉన్న ఉత్తమ భూషణాలంకృతమై చేసన్నచే తనను పిలుచుచున్న సౌందర్యవతియగు వనితను చూచెను.

అట్లు ఆమెచే పిలువబడిన నారది ఆమెను సమీపించినది. ఆ వనిత నారదీదేవికి నమ్మకము కలిగించి ఓదార్చి మరొక ప్రదేశమునకు తీసుకొని వెళ్ళెను. అచట రత్నప్రాకార ఖచితము వనితా కులమగు భవనమున చేర్చి వనిత మరలిపోయెను. నారదీదేవి కూడా అచటి వనితలచే సత్కరించబడినది. విశాఖా మొదలగు సఖీబృందముచే ఓదార్చబడినది. వారిలో ఒక చెలి నారదీదేవిని అంతఃపురమునకు గొనిపోయినది. అచట నారది గోపికాపతిని దర్శించెను. దూతి వెడలిపోగానే ప్రియుడగు గోషికానాథుడు పిలువగా నారదీదేవి నమస్కరించి లజ్జచే తలవంచి సమీపించెను. రసికుడగు గోపికాపతి చక్కగా ఆలింగనము చేసుకొని రమింపచేసి విడిచిపుచ్చెను. నారదీదేవి క్రమముగా మరల పుష్పసరస్సును చేరినది. అచట ఉన్న మాధవీదేవి నైఋృతి కోణమున స్నానము చేయించెను. స్నానముచేసిన వెంటనే పుంభావమును పొందిన నారదుడు ఆశ్చర్యమును చెందెను. తరువాత బృందాదేవి ఆజ్ఞచే నారద మహర్షి సరస్సునను ఆగ్నేయ కోణమున తపము నాచరించుచు శ్రీకృష్ణదర్శనమును కోరుచుండెను. ఇట్లు తపమును ఆచరించుచు బృందాదేవి పంపిన ఫలములచే జీవనమును గడుపుచుండెను. ఒకప్పుడు నారద మహర్షి ఆశ్రమమున తిరుగాడుచు ఒక యువతి పలికిన మధుర శబ్దమును వినెను. అధ్యాత్మ జ్ఞానముగల నారద మహర్షి ఆ శబ్దమును విని కుతూహలముతో వెతుకుచు వనమును చేరి ఆమె స్థానమును చూడజాలకపోయెను. అంతట ఆశ్చర్యమును చెందిన నారద మహర్షి ఆదరముతో బృందాదేవిని అడిగెను. బృందాదేవి నారద మహర్షికి మొదటినుండి కుబ్జా వృత్తాంతమును తెలిపెను. భూమ్యంతరగు హస్తితయగు కుబ్జాదేవి. నేను తప్ప ఎవరూ తెలియజాలరు. నీవు ఎవరిని చూడగోరి తపమును ఆచరించుచుచుంటివో ఆ కుబ్జా వృత్తాంతమును సంక్షేపముగా తెలిపెదను. శ్రీకృష్ణ భగవానుడు ప్రాతః కాలమున తల్లి లేపగా లేచి స్నానమాడి భుజించి అనుచరులతో కలిసి గోవులను మేపుటకు అరణ్యమునకు చేరి బృందావనమున విశ్రమించెను. స్నేహితులగు గోపాలకులతో క్రీడించుచు ఆవులను త్రిప్పుచు ఇద్దరు మువ్వురు ప్రియ మిత్రులతో ఆ ఆశ్రమమునకు వచ్చెను. సర్వారామప్రదమగు భవనమున నాచే కల్పించబడిన ఫలమూలాదులచే తృప్తిచెంది ప్రియురాలితో కలిసి పరుండెను. అత్యంత ప్రియురాలగు రాధచే సేవించబడుచు గోపికాప్రియుడు ఆయాపొదలలో వేరువేరుగా ఒక ఝామున్నర విహరించును. అచట పరుండిన స్వామిని రాధాదులు వింజామరలచే వీచుచుందురు. ఝామున్నరకు స్వయముగా మేల్కాంచి తన ప్రియురాళ్ళను లాలించి గోపాలకులతో గోవులతో సాయంకాలమున సంతోషముతో ఇల్లు చేరును. చెలులందరూ తమ ప్రదేశమున చేరి ప్రియురాలగు రాధాదేవిని వెతకి ఆమెతో కలిసి వారందరూ ప్రతిదినమూ తమతమ గృహములకు వెళ్ళెదరు. ఇట్లు ప్రతి దినము ఈ లీలలనే చేయుచుండును. ఈ లీలలను నేను మాత్రమే చూచుచుందును. బ్రహ్మ రుద్రాదులుకూడా చూడజాలరు. కుబ్జాసంకేత వైభవమును నేను కూడా చూడజాలక పోతిని. ప్రీతి ప్రియుల మాటలచే తెలిసితిని. నీకు అతి రహస్యమును తెలుపుచున్నాను. పవిత్రమగు అంగరాగార్పణము వలన కుబ్జాదేవి ఉత్తమ సంకేతమును పొందగలిగినది. కుబ్జాదేవి ఎప్పుడూ సేవించుటలోనే మునిగి ఉండును. ఒక్కడే అగు గోపికాపతిని పలు విధములుగా సేవించుచుండును. ఇచట ఇట్లు శతకోటి మిథునములు నివసించుచుండును. కుబ్జాకృష్ణాను రూపములు నానా క్రీడాపరములుగా ఉండి ఆద్యమిథునము నుండి పుట్టి, ఇచటి వనమునకు శోభను ఇచ్చుచుండును. ఈ మిథునములు గతాగత రహితములు. నిత్యనూతనములు. తృతీయమునకు అగమ్యమై ద్వితీయ్యమున ఐక్యమును పొందిన విలక్షణరూపము సృష్టి స్థితి లయములకు ఏక మూలస్థానము. ఈవిషయమును నేను ఒక్కదానినే తెలియుదును. ఇప్పుడు నా నుండి విని నీవు కూడా తెలియుదువు. షట్కర్ణగ తమగు దుగ్ధ మంత్రమును చక్కగా ఉపాసించుము. అని ఇట్లు బృందాదేవి తెలుపగా దుర్లభమగు విషయమును తెలిసి దుర్లభమగు ఆ మిథునమును చింతించుచూ అచటనే యుండెను. ఓ బ్రహ్మపుత్రా! ఇది గురు శిష్యుల రహస్యము. ఇతరులు తెలియజాలరు. మన ధర్మము కూడా ఇదియే. మొదట ఒకడే తెలియును. తరువాత వినువాడు తెలియును. ఇదియే ఒకటే తత్త్వము కలదు. ఇచట నానా తత్త్వస్వరూపము లేదు. ఇట్లు నీకు అతి రహస్యమగు గోపికాపతి చరితమును తెలిపితిని.

ఇక ఇప్పుడు ప్రకాశమగు చరితమును చెప్పెదను చక్కగా వినుము. ఈ తత్త్వమును నీ తండ్రికి చూపెను. చూపిన ప్రదేశమీ బ్రహ్మకుండమే. బృందావనమున ఈ కుండము పరమ పావనము. ఇచట స్వామిమూలరూపమును ధ్యానించుచు స్నానమాడినవారు నిత్య విహారియగు గోపికాపతి వైభవమును చూడగలడు. ఇచటనే తత్త్వము నెరిగి ఇంద్రుడు గోవిందుని ధ్యానించెను. ఇట్లు ధ్యానించిన ప్రదేశమే గోవిన్ద కుండము. ఇచట స్నానమాడిన వారు కూడా గోవింద వైభవమును దర్శించగలరు. ఏకరూపములో, బహురూపములతో గోపికలతో పొదరిండ్లలలో క్రీడించిన రాసక్రీడ కూడా అత్యద్భుతము. పరమపావనము. ఇచటనే నందాది గోపాలకులు శ్రీహరి వైభవమును దర్శించిరి. ఇదియే తత్త్వ ప్రకాశ తీర్థము. శ్రీయమునా జలమున కలదు. గోపాలకులకు కాలియమర్దనము చూపిన ప్రదేశము సర్వ పాపాహర తీర్థము. గోపగోపీ జనమును దావాగ్నినుండి కాపాడిన ప్రదేశముకూడా పరమపావనము. స్నానమాత్రమున సర్వపాపహరము. శ్రీకృష్ణ భగవానుడు విలాసముగా హయాకారమున ఉన్న కేశియను రాక్షసుని సంహరించిన ప్రదేశమున స్నానమాడినవారు శ్రీహరిలోకమును చేరెదరు. దుష్టుడగు వృషాసురుని సంహరించిన ప్రదేశము అరిష్టకుండము. స్నానమాత్రమున ముక్తిప్రదము, ధేనుకాసురుడు, అఘాసురుడు, బకాసురుడు, వత్సాసురుడు, వ్యోమాసురుడు, లంబాసురుడు శ్రీకృష్ణభగవానునిచే లీలగా చంపబడిన ప్రదేశములు అన్నియూ పవిత్ర తీర్థములే. వీటిలో స్నానమాడి పితృ దేవతలకు తర్పణము లిడినవారు శ్రీకృష్ణానుగ్రహమువలన సకలా భీష్టములను పొందగలరు. శ్రీకృష్ణభగవానుడు నిదురించిన, భుజించిన, సంచరించిన, వినిన, చూచిన ప్రదేశములన్నియూ విలక్షణ క్షేత్రములే. వీటిలో స్నానమాడినవారికి స్వర్గము లభించును. పుణ్యాత్ములగు గోపాలకులు స్వామి చరితమును వివిధ ప్రదేశము, ధ్యానించిన, దర్శించిన, నమస్కరించిన, ఆలింగనము చేసుకోబడిన, స్తుతించబడిన, యాచించబడిన ప్రదేశములు అన్నియూ పరమపావనములు. ఉత్తమగతి ప్రదములు. శ్రీ రాధాదేవి తపమును ఆచరించిన ప్రదేశము శ్రీకుండము అనబడును. ఇది పరమ పావనము. ఇచట స్నానదాన జపాదికములు అక్షయగతి ప్రదములు. వత్సతీర్థము, చంద్ర సరస్సు, అప్సర సరస్సు, రుద్ర కుండము, కామకుండము, శ్రీహరి మందిరము, అలకనంద పొదలోనున్న విశాల, మనోహరమగు నీపఖండము, ధర్మకుండము, భోజనస్థలము, బలస్థానము, బృహత్సానువు, శ్రీహరి సంకేతస్థానము, నందిగ్రామము, కిశోర మండము, కోకిలకాసనము, శేషశాయిపయోబ్ధి, క్రీడాదేశము, అక్షయవటము, రామ కుండము, చీర చౌర్యము, భద్రభాండీర బిల్వకము, మానసరస్సు, వ్రలినము, భక్త భోజనము, అక్రూరము, తార్ క్ష్య గోవిందము బహుళారణ్యకము, ఇవన్నియూ కలిసి బృందావన కమండలము అనబడును. ఇదియంతయూ పంచయోజన విస్తీర్ణము. పరమపావనము. పవిత్ర జనసేవితము, దర్శన మాత్రమున ముక్తిప్రదము. సుదుర్లభమగు బృందావనమును దేవతలు కూడా చూడగోరెదరు. శ్రీహరి రహస్యలీలలను చూడగోరి తపస్సును ఆచరించియు చూడజాలక పోయిరి అని సంగములను విడిచి బృందావనమును ఆశ్రయించినవారికి మూడు లోకములలో దుర్లభమగున దేదియును లేదు. బృందావన నామమును పలికిన వారికి కూడా నందనందనుయందు భక్తి కలుగును. బృందావనమునందు నరులు, నారీజనము, వానరులు, కృమికీటపతంగాదులు, పక్షులు, వృక్షములు, పర్వతములు, మృగములు, ఎప్పుడూ రాధాకృష్ణ నామమును జపించుచుందురు. కృష్ణ మాయాభిభూతులు, కామకశ్మల చిత్తులు అగువారికి స్వప్నములలో కూడా బృందావన దర్శనము లభించదు. బృందావనమును దర్శించినవారు సఫలమగు జన్మను పొందెదరు. శ్రీహరి కృపా పాత్రులయ్యెదరు. ఇంకనూ ఏమి చెప్పవలెను. ముక్తిని కోరువారు శుభ ప్రదము, పుణ్య ప్రదమగు బృందావనమును సేవించవలెను. దర్శించవలెను. ధ్యానించవలయును. దీనిలో నరూపమగు కీర్థివర్ధకమగు మరియొక క్షేత్రము ఈ భూ మండలముననే లేదు.

పురాతన కల్పమున గోవర్ధనుడను ద్విజుడు సర్వ సంసారమునుండి విరక్తుడై ఉత్తమ తపమును ఆచరించెను. అవ్యయుడగు శ్రీహరి భగవానుడు తన క్రీడాస్థానమగు భూమండలమునకు వచ్చి బ్రాహ్మణునకు వరమును ఈయసంకల్పించెను. దేవదేవేశుడు, శంఖ చక్ర గదాధరుడు, విలసత్కాస్తుభోరస్కుడు, మకరకుండలధారి, సుకిరీటుడు, సుకటకుడు, కలనూపుర భూషితుడు, వనమాలానిరీతాంగుడు, శ్రీవత్సాంకిత వక్షసుడు, పీతకౌశేయ వస్త్రుడు, నవాంబుద సమప్రభుడు, సునాభి, సుందర గ్రీవుడు, సుకపోలుడు, సునాసికుడు, సుదంతుడు, సుస్మితుడు, సుజాను వక్షస్థ్సలుడు, కృపాసాగరుడు, పృష్ఠుడు, సుప్రసన్న ముఖాంబుజుడు అగు శ్రీహరిని చూచి సంభ్రమముతో లేచి భూమిపై దండవత్ప్రణామములు ఆచరించెను. వరమును కోరుమని స్వామి అడుగగా గోవర్ధనుడు ఇట్లు పలికెను. పాదములనుండి నామూపున నుండుము. ఇదియే నాకువరము. ఆ మాటలను విని గోవిందుడు మాటిమాటి ఆలోచించి గోవర్ధనుని పృష్టము నాక్రమించి నిలిచెను. అపుడు మరల గోవర్ధనుడిట్లు పలికెను. ఓ దేవా! నేను నిన్ను నా పృష్ఠమునుండి దించుటకు ఉత్సహించను. కావున ఇచట ఇట్లే స్థిరముగా నుండుము. అప్పటినుండి శ్రీహరి గోవర్ధన ద్విజునివిడిచి గిరిరూప ధరుడగు గోవర్ధనమునకు వెళ్ళి నిలిచెను. శ్రీకృష్ణావ తారమున శ్రీహరి గోవర్ధన పర్వతమును ద్విజునిగా తన సారూప్యమును పొందినవానిగా తెలిసి నందాదులచే భజింపచేసెను. ఇట్లు అన్నకూటముచే క్షీరానిదోహనముచే పర్వత రూపుడగు ద్విజునకు తృప్తి కలిగించి దాహము గొనినాడని తెలిసి నవమేఘములచే వర్షింపచేసి నీరు త్రాగించెను. అప్పటినుండి గోవర్ధనుడు వాసుదేవునకు మిత్రుడాయెను. గోవర్ధన పర్వతమును భక్తి కలిగి ఉపచారములచే పూజించినవారు, ప్రదక్షిణముల నాచరించినవారు మరల పుట్టరు. గోవర్ధన పర్వతము శ్రీహరి నివాసము వలన పుణ్యప్రద మాయెను. గోవర్ధన పర్వతమును దర్శించిన, ఇతర పుణ్య పర్వతములను దర్శించపనిలేదు. యమునా తీరము సుందరము కృష్ణ క్రీడావిభూషితము. భూ మండలమున ఇంత పవిత్రమైనది ఎచట కలదో నీవే చెప్పుము. కావున ఇతర వననదీ పర్వతములను విడిచి సర్వప్రయత్నముతో బృందావనమును సేవించవలెను. ఇచట పవిత్రమగు యమునానది, పావనమగు గోవర్ధన పర్వతము కలదు. కావున బృందావనముకంటే పవిత్రము అగునది ఈ భూమండలమున ఏది కలదు? కలికల్మషభీతులకు విషయాసక్తచిత్తులకు బృందావనము కంటే సేవించదగినది ఈ మూడు లోకములలో మరియొకటి లేదు. ఈ బందావనమున నందగోప పుత్రుడు, నెమలి పింఛమును ధరించిన వాడు, నటవర వేషధారి, కర్ణికారభూషణుడు, వేణునాదముతో హంసీరవమును గెలిచినవాడు, వైజయంతీ మాలావృతాంగుడు అహం పదార్థ భూతుడు హంస స్వరూపుడగు శ్రీ కృష్ణ భగవాడును గోపాలులతో గోపికలతో ప్రతి నిత్యము విహరించుచుండును. పార్వతీ సహితుడగు పరమేశ్వరుడు అర్ధనారీ స్వరూపుడు భక్తి పరవశుడై రహస్యముగా శ్రీకృష్ణ భగవానుని ధ్యానించుచుండును. బ్రహ్మ గాయత్రీ స్వరూపముతో ఉన్న స్త్రీ మూర్తిని హృదయకుహరమున నిలుపుకొనును. ఇంద్రుడు వేయి కనులతో నిత్యము శశీ రూపమున దర్శించుచుండును.

ఆదిశేషుడు రసజ్ఞుడు కావున తన ప్రియురాలిని వేణు నాద శ్రవణము నుండి రహస్యముగా కాపాడుచుండును. అనగా ఇతరుల విషయమేమి చెప్పవలయును? భేదమును, శోషణమును, తాపమును, భేదమును పొంది గోపిక శ్రీ గోపినాధాధరసుధను సాదరముగా పానము చేయుచుండెను. శ్రీకృష్ణభగవానుడు బృందావనమును చేరి రాత్రులందు చంద్రుని వెన్నెలలచే కాంతి వంతమగు పొదలలో గోపికలతో క్రీడించెను. ఆ గోపికల అదృష్టమును ఏమని చెప్పవలయును. వీరి చరణ పరాగము బ్రహ్మాదులకు కూడా దుర్లభమే. బృందావనమునగల తృణమృగఖగ కృమిప్రాణి బృందములు బ్రహ్మ రుద్రేంద్రాదులచే పూజింపదగినవి అగును. అట్టి బృందావనమును చేరి బ్రహ్మభూతుడగు శ్రీహరి సుభాంభోది కల్లోల మగ్నుడై ప్రేమస్నిగ్ధుడై విహరించుచుండును. ఈ బృందావనమున క్రూరప్రాణులు సైతము సహజమగు క్రౌర్యమును వైరమును విడిచి యధేచ్ఛగా మైత్రితో సుఖముగా నుందురు. కావున మానవులు శ్రీకృష్ణుని కంటే ఇతరుల నాశ్రయించి ఎక్కడ ఆనందించగలరు? ఇట్లు సకల భూమండల పుణ్య రూపముగానున్న బృన్దావనమును చేరినా మనస్సు అంధకారమును, ఈ జగత్తును తృణీకరించి ఎప్పుడూ అనందించుచున్నది. ఇచట గోపీనాథుడు ప్రతి పదమున ప్రేమార్ద్ర హృదయుడై ఎక్కువ తక్కువలను లెక్కించక భక్తులను ఉద్ధరించు ఉండును. గోపాలకులను, గోపికలను, ఇచటి ఖగమృగ నగములను, గోప గో భూ రజమును తలచి దర్శించి ప్రేమ పాశబద్ధుడై నమస్కరించుచుందురు. భక్తియందు మనస్సు లగ్నము అగును. కావున గోపికాపతి కంటె సేవించదగిన వారెవరో నాకు మాత్రము తెలియదు. ఇట్లు బృందావన మాహాత్మ్యమును సంక్షేపముగా చెప్పితిని. ఇక చెప్పవలసిన దేమియు లేదు. సంసార భూతులకు మనుజులు ఈ బృందావన మాహాత్మ్యమునే వినవలయును. అనవలయును. స్మరించవలయును. ధ్యానించవలయును. ఈ బృందావన మాహాత్మ్యమును శుచియై వినిననూ చదివిననూ వారు విష్ణుతుల్యులు అగుదురు. (II/80)