ద్వాదశ మాస ప్రతి పద్ర్వ్త నిరూపణము

నారద మహర్షి పలికెను: ఓ మహానుభావా ? పరమేష్టియగు బ్రహ్మ మరీచిమహర్షికి చెప్పిన సకల పురాణ సూత్రమును నీ నుండి వింటిని. ఇక ఇప్పుడు ఆయా తిధులలో క్రమముగా చేయవలసిన వ్రత విధానమును నాకు తెలుపుము. యే మాసములో యే తిధి ఏ విధానముగా ఉపాసించవలెయునో ఆ పూజా విధానము అంతటిని నాకు ఉపదేశింపుము.

సనాతన మహర్షి పలికెను: ఓ నారదా ! ప్రత్యేకముగా తిధుల వ్రతములను చెప్పెదను వినుము. తిధీశాను క్రమముగా చెప్పెదను. ఈ వ్రతములు సర్వసిద్ధి ప్రదములు. చైత్ర మాసమున శుక్ల పక్షమున మొదటి దినమున సూర్యోదయ కాలమున బ్రహ్మ జగత్తును సృజించెను. సంవత్సరాదిలో వసంత ఋతువు ప్రారంభమున బలి రాజ్యమున కూడా పూర్వ విద్దనే అనగా అమావాస్యతో కలిసియున్న ప్రతిపత్తిధినే పండితులాచరింతురు. ఈ తిధిన సర్వపాప వినాశకరమగు మహాశాంతిని చేయవలయును. ఈ శాంతి సర్వోత్పాతములను శమింపచేయును. కలి దుష్కృతములను హరించును. ఆయుఃప్రదము, పుష్టికరము, ధన సౌభాగ్య వర్థకము, పరమ శుభప్రదము. పరమ పవిత్రము. ఇహ పరలోకములందు సుఖదాయకము. ఈ శాంతిలో మొదట అగ్ని రూపధరుడగు బ్రహ్మను పూజించవలెను. పాద్వార్ఘ్య పుష్ప ధూప వస్త్రాలంకార భోజనములు సమర్పించవలెను. హోమమును చేసి బలి ఉపహారములు సమర్పించి, బ్రాహ్మణ తర్పణమును గావించవలెను. తరువాత క్రమముగా దేవతలను పూజించవలయును. కుశాక్షత తిలోదకములచే ఓంకార నమస్కారములను చేసి వస్త్ర హిరణ్య సహితముగా వేదజ్ఞుడగు బ్రాహ్మణునకు వ్రత పూర్తి కొరకు దానమును చేయవలెను. ఇట్టి పూజా విశేషముచే చేయునది సౌరి వ్రతమందురు. ఈ వ్రతము మానవులకు ఆరోగ్యప్రదము. ఈ దినమునే విద్యా వ్రతము కూడా చెప్పబడినది. శ్రీ కృష్ణ భగవానుడు ధర్మరాజునకు తిలకమను వ్రతమును కూడా చెప్పెను. ఇక జ్యేష్ఠ శుద్ధ ప్రతి పద్దినమున సూర్యోదయ కాలమున దేవోద్యానమున పూసిన కరవీరమును పూజించవలెను. రక్తతంతువులను కట్టి గంధ ధూప విలేపనములచే చక్కగా పండి సప్తధాన్యములచే బీజ పూరములగు నారంగములచే పూజించవలెను. అక్షిత జలమును చల్లి మంత్రముచే ఇట్లు క్షమాపణ చెప్పుకొనవలెను. ఓ కరవీరా! వృషావాస ! భానువల్లభా ! వజ్ర శివదుర్గాది దేవతా ప్రియ! నీకు నమస్కారము అని "ఆ కృష్ణేన రజసా" అను మంత్రముచే క్షమాపణ వేడవలెను. ఇట్లు భక్తిచే పూజించి బ్రాహ్మణునకు దక్షిణనిచ్చి ప్రదక్షిణముచేసి స్వగృహమునకు వెళ్ళవలెను. శ్రావణ శుక్ల ప్రతి పద్దినమున లక్ష్మీ ప్రదము. బుద్ధి ప్రదము, ధర్మార్థ కామ మోక్షములకు మూలము అగు పరమ వ్రతమును సోమవారము మొదలు మూడు మాసములు పదిహేను దినములు వ్రతమును ఆచరించవలెను. కార్తీక శుక్ల ప్రతిపత్ నాడు ఉపవాసము ఉండవలయును. కార్తీక పూర్ణిమనాడు శివుని పూజించి సువర్ణ వంశ సహితముగా మహాపుణ్యకరము, దేవతా ప్రీతి వర్థకమగు వాయనమును ధనవృద్ధి కొరకు సంకల్పమును చేసి బ్రాహ్మణునకు దానమును చేయవలయును. భాద్రపద శుక్ల ప్రతి పద్దినమున మహత్తమ వ్రతము నాచరించవలెను. ఈ వ్రతమునే కొందరు మౌనవ్రతము అందురు. ఈ వ్రతమున శివుని పూజించవలెను. మూడు గుణములుకల పదునారు పదార్థములను మౌనముగా నుండవలెను. ఫలములను పిష్ట పక్వములను పదునారింటిని బ్రాహ్మణునకు దానము చేయవలెను. మరొక పదునారు దేవునికి నైవేద్యమును చేయవలెను. సువర్ణ శివుని పూజించి యధావిధిగా కలశముపై నుంచి దానిని గోసహితముగా ఆచార్యునికి సమర్పించవలెను. ఇట్లు దేవదేవుడగు శివుని వ్రతమును పదునాలుగు సంవత్సరములు ఆచరించిన తరువాత ఇహలోకమున అన్ని భోగములను అనుభవించి అంతమున శివలోకమును చేరును. అశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు అశోక వ్రతమును ఆచరించి ధనధాన్య సమృద్ధికలిగి శోకరహితుడగును. నియమ తత్పరుడై అశోక పూజనమును చేయవలెను. పన్నెండు సంవత్సరముల తరువాత వ్రతాంతమున అశోక వృక్ష మూర్తిని గురువునకు సమర్పించి శివ లోకమున ఆనందించును. ఈ ప్రతిపత్తుననే నవరాత్రము ఆరంభించవలెను. ప్రాతః కాలమున కలశ స్థాపన పూర్వకముగా దేవిని పూజించవలెను. గోధుమలతో కలిపిన యవలచే అంకురారోపమును చేసి ప్రతిదినము అయాచితముగా ఏక భుక్తము ఆచరించుచు శక్తిని అనుసరించి పూజాపాఠ జాపాది కమును చేయుచు, మార్కండేయ పురాణోక్త ప్రకారముగా చరిత్ర త్రయమును తొమ్మిది దినములు చదువవలయును. భక్ష్య భోజనాదులలో కుమారిని పూజించుట అత్యుత్తమము. ఇట్లు వ్రతమును ఆచరించిన మానవుడు సర్వ సిద్ధులకు మూలమగును. దుర్గాను గ్రహపాత్రుడు అగును. ఇక కార్తిక శుద్ధ ప్రతిపత్తునాడు నవరాత్రమున చెప్పబడిన దానిని ఆచరించవలెను. విశేషించి అన్న కూటము శ్రీ మహివిష్ణువునకు ప్రీతిని పెంచును. సర్వపాకములచే, సర్వదేహములచే అందరిచే సర్వార్థ సిద్ధి కొరకు గోవర్థనుని పూజించుటకు అన్న కూటమును చేయవలెను. సాయంకాలము గోవులతో గోవర్థన పర్వతమును అర్చించి ప్రదక్షిణము గావించి భక్తి ముక్తులను పొందును. ఇక మార్గ శిర శుద్ధ పాడ్యమిన సాటిలేని ధన వ్రతమును చేసి, రాత్రిపూట విష్ణ్వర్చనమును గావించి, హోమముచేసి సువర్ణాగ్ని హోత్రుని రక్త వస్త్రములను రెండింటిని కప్పి బ్రాహ్మణునకు దానము కావించవలెను. ఇట్లు చేసినచో ధన ధాన్యములచే సమృద్ధుడగును. అగ్ని హోత్రునిచే పాపములు దహించబడినవాడై విష్ణు లోకమున ఆనందించును. పుష్య శుక్ల ప్రతిపత్తున భక్తితో సూర్యుని పూజించి సూర్య లోకమును పొందును. మాఘ శుక్ల ప్రతిపత్తున మహేశ్వర స్వరూపుడగు అగ్నిహోత్రుని యధావిధిగా పూజించి సంవత్సమృద్ధుడగును. ఇక ఫాల్గుణ శుద్ధ ప్రతిపత్తున దేవదేవుడు, దిగంబరుడు, ధూళి ధూసరిత సర్వాంగుడు అగుశంకరుని జలముచే ప్రోక్షణ గావించినచో లౌకిక కర్మచే కూడా ప్రీతి చెందిన మహేశుడు భక్తిచే చక్కగా పూజించబడి స్వసాయుజ్యమునిచ్చును. ఇక వైశాఖ శుద్ధ ప్రతి పత్తున విశ్వవిహారి అగు విష్ణువును యధావిధిగా పూజించి ఒక్క విప్రునికి చక్కగా భోజనము పెట్టవలెను. అట్లే ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు జగద్గురువగు బ్రహ్మను పూజించినచో విష్ణువుతో కూడియున్న బ్రహ్మ సర్వ లోకేశ్వరేశ్వరుడు స్వసాయుజ్యమును ప్రసాదించును. ఇహమున సర్వసిద్ధులను అనుగ్రహించును. ఇట్లు ఈ పన్నెండు నెలల పాడ్యములలో చేయవలసిన వ్రతములను నీకు చెప్పితిని. ఇవి అన్నియు భక్తి ముక్తి ప్రదములు. ఈ అన్ని వ్రతములలో బ్రహ్మ చర్యమును పాటించవలెను. హోమ శిష్టాన్నమునే భుజించవలెను. (4/110)